Monday, May 9, 2016

కవిత్వం- విమర్శకత్వం


రచనకు ఒక పార్శ్వం రచయిత ఐతే రెండో పార్శ్వం రసాస్వాదన చేసే భావుకుడు.
అపారే కావ్య సంసారే కవిరేకః ప్రజాపతిః।
యథాస్మై రోచతే విశ్వం తథైవ పరివర్తతే- అని శ్లోకం॥
కవి తన ఇఛ్చానుసారం చిత్రించడమే కాదు.. ప్రజాపతి సృష్టించిన జగత్తు
పోకడలను కూడా మార్చగలడు-అని అర్థం.
కవిలోని ఆ సృజనశక్తి సహజమైనది. కొంత మందికి అది గురుకృప  ద్వారా సంక్రమిస్తుంది. కొంతమంది నిరంతర శాస్త్రాధ్యయనంతో మెరుగులు దిద్దుకుంటారు. ఎవరు  విధంగా సాధించినా పండితరాయలు సిద్ధాంతం  ప్రకారం కవికి ‘అనాయాసంగా, అప్రయత్నంగా శబ్దార్థాలు  స్ఫురించే ప్రతిభ పట్టుబడటం’ ప్రధాన
లక్షణం.
రాజశేఖరుడు అనే మరో  ఆలంకారికుడు ఈ ప్రతిభను  రెండు రకాలుగా విభజించాడు.
కారయిత్రిః కావ్యాన్ని సృజించే ప్రతిభ
భావయిత్రిః కావ్యసౌందర్యాన్ని ఆస్వాదించగలిగే సామర్థ్యం

కారయిత్రి అధికంగా ఉంటే కవి.. భావయిత్రి అధికమైతే సద్విమర్శకుడు.
రచన పూర్తయిన తరువాత  రచయితా విమర్శకుడి అవతారం ఎత్తవచ్చు. కాని అది తన రచనకే పరిమితం. సాధారణంగా ఏ కవీ తనకు పనిపడితే తప్ప పరాయివారి రచనల జోలికి పోయే పని పెట్టుకోడు.
రచనలను చదివి తార్కికంగా ఆలోచించి సహృదయంతో విమర్శ చేయగల సత్తా ఉన్నవాడినే అసలైన విమర్శకుల లెక్కలోకి తీసుకోవాలి.
సరే.. కవి గొప్పా? విమర్సకుడు గొప్పా? ని మీమాంస.
కవి సృజన చేస్తేనే కదా.. విమర్శకు భూమిక సిద్ధమయేది! కనుక కవే గొప్ప అని ఒక వాదం. కానీ చాలా సందర్భాల్లో కవికూడా ఉహించని చమత్కారాలను విమర్సకుడు తన విస్తృత పరిశీలనాపాటవం శక్తితో వెలికి తీస్తుంటాడు!.
ఇయం సంధ్యా, దూరాదహముపగతోహన్త! మలయా
దిహైకాన్తే గేహే తరుణి! తవనేష్యామి రజనీమ్,
సమీరేణోక్తైవం నవకుసుమితా చూతలతికా
ధునానా మూర్థానంనహి నహి నహీత్యేవ వదతి”-అని ఒక కవిగారి శ్లోకం.
ఎక్కడో మలయపర్వతంనుంచీ వస్తున్నాను. కనుచీకటి పడుతున్నది. తరుణీ! నీ గృహంలో ఈరాత్రి ఏకాంతంగా గడుపుతాను” అని సమీరం అడిగితే కొత్తగావికసించిన చూతలత  ‘వద్దు వద్దు వద్దు’(బిడియంతో కాబోలు)  అని ముమ్మారు తల డ్డంగా ఊపిందిట!
శ్లోకం రసవత్తరంగానే సాగింది. కానీ చివర్లో ఆ చూతలత మూడుసార్లు అలా వద్దు వద్దు వద్దు అని సాగదీయడం  దేనికీ?’ అని తర్కానికి   విమర్శక శిఖామణి అయినా తర్కానికి దిగితే.. ముక్కు మొహం తెలీని పరాయి పురుషుడు రాత్రంతా ఇంట్లో ఒంటరిగా గడుపుతాను అంటే.. ముగ్ధ యిన పుష్పానికి  మరి కంగారు పుట్టదా! ఆ తొట్రుపాటులో ‘వద్దు.. వద్దు’ అన్నది. తప్పేమున్నది? అని కవిగారి ఓట్రించినా  అది కవిగారి వట్టి బుకాయింపు మాత్రమే అని ఇట్టే తెలిసి పోతుంది.
బాగుందండీ.. మరి మూడోసారి కూడా వద్దుని అనడం ఎందుకో?” అని విమర్శకుడిగారు ఎదురు  సందేహం లేవదీస్తే కవిగారి దగ్గర సబబయిన సమాధానం ఉండాలి గదా!ఛందస్సుకోసం ఏదో అలా అనవలసి వచ్చింది  లేవయ్యా!” అని లోలోన గొణుక్కున్నా.. బైటికి అనలేడు గదా! ఛందస్సుల్లో ఇమడేందుకుటువంటి వ్యర్థప్రయోగాలకు పాల్పడం సాంప్రదాయిక సాహిత్యంలో సాధారణమే. కావచ్చు  కానీ అటువంటి వ్యర్థప్రయోగాలవల్ల రచన ఔన్నత్యం పల్చబడతుంది. కాలంనాటి కవులందరికీ ఈ విషయమై  మనసులో మథన న్నా  బైటికి ఒప్పుకోవడం  మేథోగౌరవానికి భంగకరమని భావించేవారు.
టువంటి సందర్భంలోనే విమర్శకుడి విశిష్టత బైటపడేది. ఇక్కడి శ్లోకం సంగతే చూసుకోండి! కవిగారిని ఇబ్బందినుంచీ విమర్శకుడు ఎంత తెలివిగా తప్పించాడో గమనించండి! ‘శ్లోకంలో కవిగారు సూచించింది వట్టి కుసుమితను కాదు.. నవ కుసుమితను. అంటే అప్పుడే పుష్పించిన కుసుమాన్ని. ఆ పూలబాలకు  పరపురుషుడితో మూడు రాత్రుల ఏకాంత వాసమంటే.. బెదురు  పుట్టదా! అందుకే అసంకల్పితంగా నవకుసుమిత నోటినుంచీ ‘  వద్దు.. వద్దు.. వద్దు’అన్న మాటలు అలా  మూడుసార్లు తన్నుకు వచ్చేసుంటాయి అంటూ విమర్శకుడు   సందర్భ సమన్వయం చేసాడనుకోండి.. కవిగారికి ఎలా ఉంటుంది? ఆనందం ఆపుకోలేక అమాంతం విమర్శకుడిని గాఢాలింగనం  చేసేసుకుని ఉంటాడేమో కూడా! అదీ సాహిత్య పరిశీలనలో విమర్శకుడి దృష్టి సామర్థ్యం. అలాగని కవిపాత్రను ఎంతమాత్రం తక్కువచేయడంగా భావించరాదు.  ఎవరి మేథోక్షేత్రంలో ప్రత్యేకత వారిదే!
గురూపదేశాదధ్యేతుం శాస్త్రం జడధియో౭ఫ్యలమ్
కావ్యంతు జాయతే జాతు కస్య చిత్ప్రతిభావతః’- మందబుద్ధులు సైతం  గురుశుశ్రూష చలవతో కొంత శాస్త్రపాండిత్యం సాధించవచ్చు. కావ్యసృజన  కదాచిత్  కాలం కనికరించినప్పుడు మాత్రమే చేయగలియేది. అదీ వందలాది ప్రతిభావంతులలో ఏ ఒక్కరి వల్లో సాధ్యమయేది- అని  భామహుడి మతం.
కావ్యం ప్రాథమికంగా మేలిమి బంగారమైనప్పుడే .. ఏ విమర్శకుడైనా సానపెట్టగలిగేది! చేమకూర వెంకటకవి ‘విజయవిలాసమే’ దీనికి చక్కని ఉదాహరణ.
సాధారణంగా కావ్యం మొత్తంలో పది పన్నెండు చమత్కారాలు ద్యోతకమైతేనే మనం ‘ఓహో..ఆహో’ అని కవి ప్రతిభను ఆకాశానికి ఎత్తేస్తుంటాం. రాసిన ప్రతి పద్యంలోనూ ఏదో ఒక విశేషాన్ని  చొప్పించిన చేమకూర వేంకటకవి ప్రతిభను మరింకేమని పొగడగలం! తాపీ ధర్మారావుగారు ‘హృదయోల్లాసం’ పేరుతో సవివరమైన వ్యాఖ్యానం వెలువరించిందాకా.. విజయ విలాసం కావ్యంలోని అందాలు  కొన్ని వందల ఏళ్ళవరకు   బయటపడనేలేదు. అందుకే అనేది.. కారయిత్రి ప్రతిభ ఒక్కటే చాలదు.. భావయిత్రి సామర్థ్య సహకారమూ కావాలి కావ్యగౌరరవం పండితలోకంలో పడి పండాలంటే!
కన్నె నగుమోము తోడం
బున్నమ చందురుని సాటిఁ బోలుప వచ్చున్
నెన్నెదురు తోడ మార్కొని
మున్నందఱు జూడ రేకమోవక యున్నన్- (1-197) అనే పద్యమే చూడండి!
గతంలో(చిత్రాంగద నుదురుతో పోటీపడిన సందర్భంలో) అపజయం పాలై ఉండకపోతే పున్నమి చంద్రుణ్ణి ఈ కన్నె నవ్వుమొహంతో పోలిక పెట్టవచ్చు- అని కవి భావన. పున్నమి చంద్రుడిని మించిన అందమైన నవ్వుమొహం ఆ అమ్మాయిదిఅని కవి ధ్వని. నాలుగో పాదంలోని ఆ ‘రేక మోవక’ అనే పదప్రయోగంతో ఎలా సమన్వయించాలో కొమ్ములు తిరిగిన పండితులకూ, పరిష్కర్తలకూ, వ్యాఖ్యాతలకుకూడా అంతు పట్టలేదు. జూలూరు అప్పయ్య గారు ‘చిన్నదాని నొసటితో పడ్డ పోటీలో ఓడిపోయి చంద్రుడు లేఖలు మోసే పని చేయవలసి వచ్చింది’ అని ఏదో పొసగని అర్థం చెప్పే ప్రయత్నం చేసారు. శబ్దరత్నాకరం ‘రేక అనే పదానికి ‘జాబు’ అని ఒక్కర్థం మాత్రమే చెప్పి ఊరుకోవడంతో  వచ్చిన చిక్కు ఇదంతా. దాదాపు 300ఏళ్ళ పాటు  చాలామంది ఇలాంటివే ఏవో అతకని పోలికలతో అన్వయించేందుకు నానా   హైరానా పడ్డారు. నోరివారి దగ్గర్నుంచీ వేదుల, బులుసువారిదాకా ఎంరో తమకు తోచిన ఏదో ఒక అర్థంతో సమన్వయం చేయబోయారు! కానీ.. కవిగారి అంతరంగంలోని అసలు భావం ఏమిటో  తాపీవారు తేల్చిన దాకా ఎవరికీ అంతుచిక్కనేలేదు.
‘రేక’ అంటే గాయంవల్ల శరీరంమీద మిగిలిపోయిన గీత’ అని చేమకూర వెంకటకవిగారి  భావం అని విజయ విలాసంలోని మరో పద్యం ఉదాహరణగా చూపించి మరీ ఒప్పించారు తాపీవారు. మూడో అధ్యాయంలో అర్జునుడు సుభద్రను ఎత్తుకుపోయే సందర్భంలో బలరాముని సేనలతో తలబడవలసి స్తుంది. సుభద్ర యుద్ధంలో  భర్తకు సాయం చేస్తుంది. కృతజ్ఞ్తతతో భార్యను ఆలింగనం చేసుకునే సమయంలో ఆమె నుదుటనున్న కుంకుమరేఖలు చెమటకు తడిసి అర్జునుడి వక్షస్థలంమీద కత్తిగాట్లులాగా పడతాయి. అర్జునుడు చమత్కారంగా
ఒక్కంచుక రేకమోవని నా యురఃస్థలంబున/ నీ కుచకుంకుమ రేఖ లంటించి మీ వారికి సూడు తీర్చితివంటూ  పరిహాసం చేస్తాడు. ఇక్కడ  రేకమోవని’ అనే పదానికి కత్తిగాయం అని మినహా వేరే అర్థం కుదరదు కదా!
శత్రువు ఒంటిమీద ఒక్క దెబ్బైనా వేయకుండా ఓడిపోవడం యోధులకు అవమానం. తన అన్నగారిమీద ఆ అపనింద పడకుండా తన కుంకుమరేఖలతో అర్జునుడి వక్షస్థలంమీద కత్తిగాయంలా చేసి పుట్టింటివారి గౌరవాన్ని సుభద్ర కాపాడిందని కవిగారి చమత్కారం’. తాపీవారి అన్వయం ఇదే. ఇదే అర్థాన్ని మునుపటి  పద్యానిక్కూడా అన్వయించుకుంటే చేమకూరకవిగారి చమత్కారం చక్కలిగింతలు  పుట్టించదూ! ‘చిత్రాంగదతో జరిగిన స్పర్థలో ఓడి వంటికి మచ్చతెచ్చుకోకుండా ఉండి ఉంటే పున్నమిచంద్రుడుకూడా ఈ కన్నెనగుమోముతో పోల్చుకొనేందుకు అక్కరకొచ్చేవాడు కదా!’ అని కవిగారి భావం. తాపీవారి పుణ్యమా అని చేమకూర వెంకటకవిగారి  పద్యంలోని శ్లేష ఉపమాలంకారంతో సహా వెలుగులోకి వచ్చి  ఎలా  మెరుపులీనిందో గమనించారు గదా! విమర్శకుని విశిష్టత ఇలాంటి సందర్భాలలోనే కొట్టొచ్చినట్లు బైటికొచ్చేది.
దేవదాసు సినిమాలో ’కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్’ అని ఒక పాట ఉంది. రాసినవారు మల్లాదివారే అయినా పలుకారణాలవల్ల రికార్డులమీద  సీనియర్ సముద్రాలవారి పేరు కనిపిస్తుంది. చాలా ప్రసిద్ధం అయింది ఆ రోజుల్లో ఆ పాట. చిత్రవిజయోత్సవం జరిగే  ఒక సందర్భంలో వేదికమీదన ఉన్న గీతకర్తని ఎవరో గట్టిగా నిలదీశారుట ’కుడి  ఎడమ వడమేంటండీ అసలు…అర్థమేమన్నా ఉందా ఆ చరణంలో?’ ఆవటా అంటూ. ‘నిజమే కదా’ అనిపిస్తుంది  మనకు కూడా. రాసిన రచయితకి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యతా ఉంటుంది కదా! కవిగారు  లేచి నిలబడి సముద్రమంత గంభీర స్వరంతో   ఇచ్చిన వివరణకు శ్రోతలు ఆగకుండా కరతాళధ్వనులు చేశారని ఆరుద్ర ఏదో ఒక సందర్భంలో
రాశారు. ‘కుడి ఎడమ వడమంటే right.. left గా తిరగబడటం అని కాదు అర్థం. కుడిభుజంలాంటి వ్యక్తి దూరంగా జరిగిపోవడం(ఎడంగా వెళ్ళిపోవడం)అనిట! ఇలాంటి వివరణలు ఇవ్వాలంటే కవిలో కారయిత్రి.. భావయిత్రి పాళ్ళు రెండూ సమపాళ్లలో కలసి ఉండాలి.
ఊహ, భావన, బుద్ధి కవికి సహజంగా సిద్దించే వరాలు. కవి తోచింది రాసేసి.. పదిమందిలోకి వదిలేసిన  తరువాత.. శల్యపరీక్షకు సిద్ధపడక తప్పదు. కొలిమిలో మండితేనే కదా బంగారానికైనా మెరుగు. విమర్శక సహిష్ణుత అలవాటు చేసుకుంటేనే ఏ కవికైనా రాణింపు. 
బహుగ్రంథపఠనం వల్ల నేపథ్య విజ్ఞానం, పాఠకులతో నిరంతర సంపర్కం చేత సామాజిక ధోరణులు, సహవిమర్శకులతో నిత్యసంపర్కం వల్ల తప్పొప్పులు పసిగట్టగలిగే సామర్థ్యం  వమర్శకుడి శక్తులు.  అన్నింటికీ మించి విశ్లేషణాత్మకమైన పరిశీలనా లక్షణం విమర్శకుడి   ముఖ్య లక్షణం. మెరుగు  పసిగడితే మెచ్చుకునే సుగుణం అవసరం . విమర్శకుడి నోటినుంచి వచ్చే ఒక్క ప్రశంసావాక్యం చాలు  సృజించిన కర్తను ఏనుగెక్కించి ఊరేగించేందుకు. తపు కనిపిస్తే సున్నితంగా విప్పి చెప్పి  కవి ముందు ముందు మరింత మెరుగైన సాహిత్యం సృజించేందుకు   తనవంతు సాయం చేయవలసిన బాధ్యతా  విమర్శకుడిమీద ఉంటుంది.
అసూయాలు, అలకలు, అభాండాలు.. అలౌకికులము అనుకునే తత్వం కవులకు, విమర్శకులు ఇద్దరికీ శోభనివ్వవు.
విమర్శకుల పాత్ర ఎంత విశిష్టమైనదో కవులు, కవుల సృషితత్వం ఎంత కష్టతరమైనదో విమర్శకులు..వగాహన చేసుకుంటారనే ఇంతగా చెప్పుకొచ్చింది.
***
-కర్లపాలెం హనుమంతరావు





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...