గీతాంజలి
చిత్రం గుర్తు ఉందా? త్వరలో చనిపోతానని తెలిసీ నాగార్జున.. చివరి రోజులు
ఉల్లాసంగా గడిపేందుకు తల్లిదండ్రులకు దూరంగా పోయి .. అక్కడి ఆహ్లాదకర వారావరణం
నేపథ్యంగా కథానాయికతో కలసి ప్రేక్షకులను చివరికంటా రొమాంటిక్ గా ఎంటర్ టైన్ చేస్తాడు.
మనిషి
మరణానికి ముందు యమధర్మ రాజు నాలుగు
మృత్యు సూచనలను పంపుతాడని హిందువుల
విశ్వాసం. పురాణ కాలంనాటికి సంబంధించిన ఓ కథ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. యమునానదీ
తీరంలో అమృతుడు అనే వ్యక్తికి ఒకానొక సందర్భంలో మృత్యుభయం పట్టుకుంది. యముడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. యముడు ప్రత్యక్షమై 'ఏం వరం కావాలో కోరుకో!' అని అడగితే గడుగ్గా అమృతుడు
చనిపోయేందుకు చాలా ముందే తనను ఒక్కసారి హెచ్చరించాలని కోరుకొంటాడు . ముందు జాగ్రత్తలతో తన
బరువు బాధ్యతలను సక్రమంగా వారసులకు అప్పగించి పోవాలని అమృతుడి ఆలోచన. 'ఒక్క సారి కాది.. నాలుగు
పర్యాయాలు సూచనలను పంపుతాన' ని మాట ఇచ్చి మాయమైతాడు మృత్యుదేవుడు. కాగా చివరికి ఒక రోజు యముడు వచ్చి
'ఆయువు తీరింది,
ప్రాణాలను తీసుకుపోతాన'ని అమృతుడి
ముందుకొచ్చి నిలబడతాడు. 'చావు సూచనలు ఏవీ ఇవ్వకుండానే
ప్రాణాలను తీసుకుపోతాను' అనడం వాగ్దానభంగం అవుతుందని
ధర్మరాజుతో వాదనకు దిగుతాడు అమృతుడు. 'నా మాట ప్రకారం నీకు నాలుగు
సార్లూ చావు సూచనలను అందించాను.
వెంట్రుకలు తెల్లబడడం, పళ్లు ఊడిపోవడం, చూపు మందగించడం, శరీరం సహకరించక పోవడం..రాబోయే
చావుకు ముందు నేను పంపించే సూచనలే ! గ్రహించక పోవడం నీ గ్రహచారం!' అంటాడు యమధర్మరాజు. ముందుగా
సంభవించే అనారోగ్యాలే మరణాగమనానికి
సూచనలు. వంట్లో మెరుగుపడని రుగ్మత
పెట్టుకుని.. తెలిసి కొంతమంది.. తెలియక కొంతమంది ఆఖరి శ్వాసవరకూ ఆరోగ్యవంతులకు
మల్లేనే ఆడుతూ.. పాడుతూ.. గడిపే ఇటువంటి
ఇతివృత్తాలతో విశ్వసాహిత్యంలో
సినిమాలు.. కథలూ వంటి కళారూపాలు చాలానే వచ్చాయి.
జీవితం
ఏమిటీ?.. వెలుతురూ చీకటీ..' అంటూ కృష్ణ
దేవదాసు వాపోతూ విలపిస్తే.. ' బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్, ఆ ఎరుకే
నిశ్చలనాందమోయ్, బ్రహ్మానందమోయ్' అంటూ
వేదాంతం ఒలికించాడు ఏ ఎన్నార్ దేవదాసు. 'జగమే మాయ.. బతుకే
మాయ ' అంటూ వేదాలు ఎంత సారం పిండి బోధించినా.. 'తన దాకా వస్తే గాని తత్వం' తలకెక్కని పచ్చి నిజం
జీవితం. 'మేక్ ఏ విష్' ఫౌండేషన్
స్థాపనలోని ఉద్దేశం గ్రహించగలిగేవారికి జీవితంలోని నికర సారం తెలిసి వస్తుంది.
కేన్సరు వంటి ప్రాణాంతక వ్యాధులు వంటిని ఆవరించి భావిని శూన్యంగా మార్చబోతున్నాయని ఆ చిన్నారులకు తెలియదు.. తోటి పిల్లలకు మల్లేనే తోటలో అప్పుడే
అరవిరిసే పూల మాదిరి అల్లరి చేయడం మినహా! 'పాపం, పుణ్యం, ప్రపంచమార్గం,
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ..
ఏమీ ఎరుగని ' పసిమొగ్గలు వారు.
కూచిమంచి
రవి అనే కవి ఒక మంచిచెడ్డ జీవిత సత్యాన్ని కవిత రూపంలో వినిపించారు ఒకసందర్భంలో.
శైశవ
గీతం దాని పేరు. చనిపోయిన పసికందు- బతికున్న మూన్నాళ్ళూ అమ్మ నాన్నలతో..
బంధుమిత్రులతో గల సంబంధ బాంధవ్యాలు నిష్క్రమణ వేళ ఎటువంటి భావనాత్మకమైన
రూపాంతరాలకింద మార్పు చెందుతాయో కవితాత్మకంగా చెప్పే 'శిశు జ్ఞానం' అది.
'ఆపైన ఏం జరిగిందో/నాకంతగా గుర్తు లేదు కానీ/నిద్దురలోకి
జారుకునేముందు/నేననుకునే ఉంటాను/మా అమ్మ చెక్కిట కన్నీటిని తుడిచి ముద్దిడిన
వ్యక్తి/మా నాన్నే అయి ఉంటాడని/ఆ రాత్రే/మా ఇంటి ఇరుగు పొరుగు వచ్చి/నేను
నిద్దురలోనే కనుమూస్తానని చెప్పినప్పుడు/నాకు గుర్తు లేదు గానీ/నేను మా అమ్మను
ఊరడించడానికి ప్రయత్నించే ఉంటాను/“నాకేం ఫరవాలేదమ్మా/నువ్వేం ఏడవద్దమ్మా” అని
ప్రయత్నించే ఉంటానూ అంటూ సాగే మృతశిశువు
అమృత స్మృతి గీతిక అది.
చావు
పుట్టుకలకు పసిమితనం.. ముదిమితనం.. అని తేడా ఏమి ఉంటుంది? కన్ను తెరవడం జీవి స్పృహలో లేకపోవచ్చు. కన్ను మూసే వేళా అపస్మారకం
లోతుల్లోకి జారిపోవచ్చు. కానీ ఊహ ముదిరిన పిదప మిట్ట మధ్యాహ్నం పూటే అసుర సంధ్య
చీకట్లు అలుముకుంటున్నాయని తెలిస్తే అలమటించని ప్రాణి అరుదుగానైనా ఉంటుందా లోకంలో?
అలిసెట్టి ప్రభాకర్ ఒక
పొట్టి కవితలో - ఎంతో గట్టిదిగా మనం భావించే ఈ దేహం ప్రాణదీపం నిలిచే ఒక మట్టిప్రమిదకన్నా
ఓటిది సుమా! దీపశిఖ వెండికొండలా
వెలుగడానికి .. కొండెక్కి మలగడామికి
మధ్య ఉండే అంతరం.. కంటిరెప్పపరంగా చెప్పాలంటే.. కేవలం
తెరవడం.. మూయడమంత' సునాయాసం అని చెపుకొచ్చాడు.
'బతుకి ఉండేందుకు .. బతకు ఏటి ఆవలవైపుకు వెళ్ళి పడేటందుకు మధ్య
పట్టేది కేవలం కంటిరెప్ప పాటు కాలం'
అన్న ఆ కవి మాటా కొట్టిపార వేయలేం.
కానీ
అదంతా దంతవేదాంతం. ఒక ప్రాణి కంటిముందు జీవయాత్ర విరమించుకుని.. మహాప్రస్థానానికని
బైలుదేరే వేళ 'ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నమూ' అనే
భావోద్వేగం ముప్పిరిగొనవచ్చు. శ్మశానంలో కపాలభాతి
జరిగే వేళ జనించే వైరాగ్యం నెత్తిమీద పోసుకొన్న చన్నీటితో పాటే
ఆవిరవకపోతే.. క్షణభంగురం అని మునిపుంగవులు
క్షణం క్షణం సెలవిచ్చే ఈ బతుకుని
చివరివరకు హంగు పొంగులతో.. అంగరంగ వైభోగంగా గడిపేందుకు మనిషి అన్నేసి ఆటు పోట్లు ఎందుకు
పడుతున్నట్లు?
మహాభారతంలో
యక్షుడు ధర్మరాజుని అడిగే వంద సందేహాలలో
అత్యంత గహ్యమైనది మృత్యు సంబంధమైనదే! ' మానవ మనస్తత్వంలో
అత్యంత వింత గొలిపే లక్షణం ఏది?' అన్న ప్రశ్నకు ధర్మరాజు
ఇచ్చే జవాబు సబబైనదే. యుధిష్ఠిరుడు
అభిప్రాయ పడ్డట్లు 'రేపు మరణించే మనిషి ఈ రోజు మరణించిన ఆప్తులను చూసి శొకతప్తుడు అవడం' విశదంగా
పరిశీలిస్తే విచిత్రమైన విషయమే !
కానీ.. ఎవరి ప్రాణం
వారికి తీపి. జీవితంమీదున్న మమకారం
మామూలుదా? ఉప్పూ కారాలు తిన్నా తినకున్నా.. సప్లిమెంటరీ
విటమిన్లతో కాలం నెట్టుకొస్తున్నా ..
చప్పగా సాగే బతుకుబండిని కాలుడి నోటికి చటుక్కుమని అందించేందుకు
సిద్ధపడేది ఎవరు?సిద్దులని చెప్పుకొనేవారు సైతం ఏ
రాద్ధాంతాలూ చేయకుండా చెయ్యలేని కార్యం ప్రాణత్యాగం.
పెనురోగాల
ఉనికి వంట్లో ఉందని పెందళాడే పసిగట్టినప్పుడు ఆ చేదునిజం రోగి చెవిలో వేయడం మంచిదా. .కాదా? అన్నచర్చ సీమదేశాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భం ప్రస్తుతానిది. కాబట్టి
చావు బతుకుల ప్రస్తావనలు ఇప్పుడు ఇంత విస్తారంగా చర్చించుకోవలసి వస్తున్నది.
రోగి
శరీరంలో జబ్బు ముదురుతోందని వైద్యులు ముందే
గుర్తించడం.. రోగికి ఆ సమాచారం అందిచడం-- రెండు వైపులా పదునున్న కత్తి
వంటిదని కొందరు మానసిక శాస్త్రవేత్తలు
అభిప్రాయ పడుతున్నారు.
రుగ్మత ముందే పసిగట్టి తెలియచేయడం వైద్యపరంగా రోగికి అన్ని వేళలా మేలు చేసే చర్య
కాకపోవచ్చన్నది ఆ మానసిక శాస్త్రవేత్తల ఆలోచన. ఈ తరహా మృత్యుజ్ఞానం చావు పుట్టుకుల
మధ్య సంఘర్షణను మరింతగా
ప్రేరేపిస్తుందని.. ఆ ఘర్షణ అన్ని వేళలా మనం భావించిన రీతిలోనే రోగికి మేలు కలిగించాలని
లేదన్నదీ వైద్యుల అభిప్రాయంగా కూడా
ఉన్నది. తన శరీర క్షేత్రంలో ప్రాణాంతకమైన రుగ్మతా బీజాలు వెదజల్లబడి
ఉన్నాయని ముందే తెలుసుకొన్న రోగి మిగతా జీవితమంతా తతిమ్మా ఆరోగ్యవంతులంత
సంతోషంగా గడుపుతాడన్న భరోసా లేదు. సరికదా
కొత్తగా బైటపడిన అనారోగ్య సమచారం రోగి మానసిక స్థైర్యంమీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలే
ఎక్కువని మానస్థత్వ శాస్త్ర వేత్తలూ
అభిప్రాయపడుతున్నారు. నార్వే విశ్వవిద్యాలయం - ట్రాన్ ధియమ్ విజ్ఞాన సాంకేంతిక విభాగాల ప్రజా ఆరోగ్య రంగంలో
పరిశోధనలు సాగించే జోర్గెన్సన్ వాదన ప్రకారం- ప్రాణాంతక వ్యాధులకు
సంబంధించిన రుగ్మత శరీరంలో బీజదశలో ఉందని
తేలినప్పటికీ.. ఆ దురదృష్ట సమాచారం రోగిదాకా రాకుండా జాగ్రత్తపడడమే రోగి
జీవితకాలం మరింత కుచించుకుపోకుండా ఉండేందుకు తీసుకొనే మంచి చర్యగా
నిర్ధారిస్తున్నారు.
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment