Monday, January 2, 2017

కుల మతాలు- సతమతాలు- వార్తా వ్యాఖ్య-


కుల మతాలు.. మల మూత్రాలవంటివట.. మొదటిది విడిస్తే దేశానికి, రెండోది విసర్జిస్తే  దేహానికి ఆరోగ్యం అని ఓ మినీ కవి ఉద్భోధ. 'మంచి చెడులు రెండు కులములు.. మంచి అన్నది మాల అయితే నే మాలనే అవుతాను' అని గురజాడవారూ ఓ కవిత చెప్పినట్లు గుర్తు. కులాల పేరుతో కుమ్ములాటలు, మతాల పేరిట మత్సరాలు, వర్గాల వంకతో వైషమ్యాలు, ప్రాంతాల  పేరుతో  పేచీలు, లైంగిక దృష్టితో వేధించడాలు, తరాల అంతరాలతో తగాయిదాలు.. అభివృద్ధికి అడ్డంకిగా మారే  ఏ ప్రతికూల శక్తినైనా నిర్ద్వంద్వంగా తిరస్కరించాల్సిందే. నిన్న సర్వోన్నత న్యాయస్థానం పాత దావామీద అప్పట్లో ఇచ్చిన ఓ తీర్పును తిరగరాస్తూ.. ఎన్నికల్లో  కుల, మత, వర్గ, లైంగికాది  కోణాల్లో ఓట్లను అభ్యర్థించడం  అవినీతి సెక్షన్లకింద శిక్షార్హమవుతుందని కుండబద్దలు కొట్టింది. పదిహేను ఏళ్ల కిందటి  ఎన్నికల్లో ఓ శివసేన అభ్యర్థి విజయం హిందూత్వ కోణంలో ప్రచారం చేసుకోడం వల్ల సాధ్యమయిందని.. పిటీషన్ రావడం.. విచారణ అనంతరం 'హిందూత్వం' ఓ జీవన విధానంగా  భావించి  ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. తదనంరం జరిగిన పరిణామాల్లో మళ్లా ఆ కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో బెంచీలో ఉన్న   ఏడుగురు  న్యాయాధీశుల్లో నలుగురు కులమతాల్లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా సాధించిన గెలుపుకి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువ ఉండరాదన్న సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు. ముగ్గురు న్యాయాధీశులు మాత్రం మునుపటి తీర్పుకే కట్టుబడి ఉన్నారు. కొత్త తీర్పు రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార సరళిలో ఎలాంటి మార్పు తీసుకు రాబోతున్నదనే రాజకీయ విశ్లేషకుల ప్రస్తుత చర్చ.
పేరుకు మనది భారతదేశం. పరిపాలనా వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం కులాతీత మతాతీత సర్వ సత్తాక విధానం. గతంలో ఇదే దేశాన్ని హిందూ దేశమనీ  పిలుస్తండేవాళ్లు. ఇక్కడి పాలనంతా ప్రజాస్వామిక పద్ధతిలో సాగిందేమీ కాదు.  హిందువులు అధికంగా ఉన్న భూఖండం ఇది. చిన్న చిన్న సంస్థానాలుగా ఉండి ఎవరికి తోచిన తీరులో వారు పరిలింపాచుకుని పోయిన వైనం  చరిత్ర స్పష్టం చేస్తుంది. ఎన్నో సంస్కృతులవారు ఈ దేశంమీదకు దండెత్తి వచ్చినా ఇక్కడి సమాజంలోని  కుల, మత వ్యవస్థను ఏ మాత్రం ప్రభావితం చేయలేక పోయారు. సరికదా.. ఇక్కడి నిచ్చెన మెట్ల వ్యవస్థకే తమను తాము సర్దుబాటు చేస్తుకోవాల్సి వచ్చింది మనుగడ కోసం. అంతటి బలమైన ఆధ్యాత్మిక సంస్కృతిని వారసత్వంగా పుణికి పుచ్చుకుంటూ వస్తున్న వ్యవస్థని ఉన్నత న్యాయస్థానం కొత్త తీర్పు ఎంత వరకు ప్రభావితం చేయగలదన్నది ప్రశ్నార్థకమే!

పుట్టుకతో అతుక్కునేది మతం కులం ఈ దేశంలో. పేరు పెట్టడంనుంచి.. బళ్లల్లో చదవడం.. స్నేహితులతో తిరగడం.. పెళ్ళి పేరంటాలు చేసుకోడం.. కన్న పిల్లల్ల్ని మళ్లీ పెంచడం.. చివరకి కాటి ప్రయాణంతో ముగిసే వరకు ఇక్కడి మనిషికి మతం, కులం, వర్గం, జాతి.. అన్నింటిలోనూ మత కులాల ప్రభావమే కొట్టొచ్చినట్లు  కనిపించేది. కొత్త మనిషి ఎదురైనప్పుడు ఏ మాత్రం సంకోచం లేకుండా ' ఏమట్లు?' అనడిగేస్తారు ఇక్కడి పల్లెల్లో. పట్టణ నాగరికత మరీ అంత మొరటుతనాన్ని ఆశ్రయించ లేకున్నా  చాటుగానైనా వ్యక్తి కుల మతాదుల్లాంటి వివరాలు కూపీ తీయందే తోచనీయదు. పెళ్లి పేరంటాల్లాంటి సంబరాల్లోమతం కులం.. వాటికి సంబంధించిన ఆచారాలదే ప్రధాన పాత్ర. పెళ్లిసంబంధాలు వెతుక్కునే వేళ మాది ఫలానా కులం.. మాకు ఫలానా శాఖవాళ్లే కావాలన్న నిబంధన బహిరంగంగానే వినపడుతుంటుంది. ప్రేమ వివాహాలలో సైతం కులం.. మతం వగైరాలు  చూసుకుంటున్నారు యువతరం. ఇళ్లు అద్దెకిచ్చే సమయంలో 'మేం ఫలానా కులపోళ్లకే అద్దెకిస్తాం.. లేకపోతే ఖాళీగానైనా ఉంచుకొంటాం' అనే ధోరణి ఈ నాటికీ ఉన్నది. కుల మతాల ప్రకారం రిజర్వేషన్లే మోతాదులో ఉండాలో  రాజ్యాంగమే నిర్దేశిస్తున్నది. చదువులు, ఉద్యోగాలు,  ఉపాధులు, విద్యార్థి వేతనాల్లాంటి సర్కారు వ్యవహారాల్లోనే  కోటాలున్న దేశం మనది. మమ్మల్ని ఫలనా తరగతిలో చేర్చమని  'ధర్మయుద్ధం' సాగుతుంటే.. ఓట్ల దృష్టితో వాటిని సమర్థించే రాజకీయ పక్షాలకే మనుగడగా ఉందీ దేశ రాజకీయ వాతావరణం కూడా. బైటికి చెప్పరు గానీ.. చాలా ప్రభుత్వ నియామకాల్లో ఈ కుల మతాలు.. శాఖలు ప్రఛ్చన్న పాత్ర పోషిస్తుంటాయని  అందరికీ తెలిసిన రహస్యమే, మైనారిటీ వర్గాల పేరిట కొన్ని మతాల వాళ్లు ప్రత్యేక రాయితీలు డిమాండు చేస్తుంటే.. ఆర్థికంగా వెనకబడ్డామన్న వంకతో కులాలు సంఘాలు కట్టి ప్రత్యేక హోదాలకోసం ప్రభుత్వాలని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి వచ్చేసింది ఇప్పటి సమాజం.
ప్రభుత్వాలు కూడా తక్కువేం తనలేదు. న్యాయంగా కుల మతాల ప్రస్తావన రాజ్యాంగ పరిమితుల మేరకే తీసుకురావాలి. చట్టాలను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు. ఫలానా గీత పనివాళ్లకు ఈ రాయితీలు, ఫలానా కులపోళ్లకి ప్రత్యేక నిధులు, ఫలానా వృత్తికార్మికులకు రెండు పడగ్గదులిళ్లు.. అంటూ జనం మెడలు వంచి వసూలు చేసిన సొమ్మును పప్పు బెల్లాల్లా పంచేస్తున్నాయి ప్రభుత్వాలు. తమిళనాడులో వెనకబడిన వర్గాల వారికి తెగబడి మరీ కోటాకి మించి రిజర్వేషన్లిచ్చి మిగతా ప్రభుత్వాలమీద నిష్కారణమైన వత్తిడిని పెంచిన తీరుని మనం గమనించవచ్చు.
సర్కారు తరుఫున జరిగే కార్యక్రమాలలో సైతం ఒక మతం తాలూకు ఆచార వ్యవహరాలకు ప్రాధాన్యమివ్వడాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. ప్రశ్నించిన జయప్రకాష్ లాంటి వాళ్లకు అసలు రాజకీయాల్లోనే ఉండలెని వాతావరణం కల్పిస్తున్నారు. కొత్త రాష్ట్ర సాధన కోసం కోట్లు ముడుపులు కట్టడం.. గద్దెనిక్కింతరువాత సర్కారు సొమ్మును అప్పనంగా మతకార్యక్రామాలకు ధారపోయడం.. లౌకిక వ్యవస్థని చెప్పుకునే పాలనాయంత్రాంగానికి  తగినదేనా? ఉనికిలోలేని జనసంఘం పక్షానికి జవసత్వాలు కల్పించే ఉద్దేశంతో అద్వానీ సాగించిన రథయాత్ర, తదనంతరం సాగించిన రామజన్మభూమి నిర్మాణం ఉద్యమం మనం మర్చిపోలేం. బాబ్రీ మసీదుని కూలగొట్టిన తరువాత భారతీయ జనతా పార్టీ ప్రాభవానికి ఉత్తర భారతంలో తిరుగే లేకుండా పోయింది. హస్తం పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా సాగిన అక్రమ పాలనకు విసిగిన ఓటరు జాతీయంగా మరో ప్రత్యామ్నాయం లేక భాజపాని భుజాన ఎత్తుకొన్నందుకు ఈ రెండున్నరేళ్లుగా చవిచూస్తున్న అతివాద మతోన్మాద అనుభవాలు చాలు.. ఈ దేశంలో మానవ సమాజంమీద మతాలకి.. మరింత లోతుల్లోకి వెళితే కులాలకి.. ఇంకా కిందకి జొరబడితే వర్గాలకి.. శాఖలకి ఎంత అనుచితమైన పట్టుందో తెలియడానికి.  భాజపా పక్షం అనూహ్యమైన విజయం మత్తుని తమ విధానాల ప్రాభవానికి విజయంగా భావిస్తున్న మతోన్మాద శక్తులు అనధికారికంగా అధికార దండం వత్తాసుతో సాగిస్తున్న అమానుష కర్మకాండను అచ్చమైన లౌకిక ప్రజాస్వామ్య ప్రేమికులెవరూ హర్షించ లేనిది. ఇప్పటికీ ఎక్కడ ఏ రూపంలో, ఏ స్థాయిలో ఎన్నికల జాతర మొదలయినా.. మత శక్తులు మూకుమ్మడిగా  వ్యవస్థకు అవసరంలేని సిద్ధాంతాలతో ఓటర్ల భవోద్వేగాలను రెచ్చగొట్టడం అత్యంత విషాదకరమైన అంశం.
ఈ మొత్తం పరిస్థితిని పరిగణనలోకి తీసుకునే ఉన్నత న్యాయస్థానం పాత కేసు పునర్విచారణ మిషతో సమున్నతమైన తీర్పు దయచేసింది. ధన్యవాధాలు.. అభినందనలు చెప్పవలసిందే. కానీ వ్యవస్థలోని వాస్తవ పరిస్థితులు ఈ తీర్పు అమలుకి అనువైన వాతావరణాన్ని ఎంతవరకు సృష్తిస్తాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
-కర్లపాలెం హనుమంతరావు


  

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...