ద్రుపదుణ్ని చూస్తే జాలేస్తుంది! కూతురు ఒహటే. అయినా ఐదు దశమ గ్రహాలు! మామల కోణం
కదా! అందుకే మరి అల్లుళ్ల మీదీ వ్యంగ్య బాణాలు!
గిల్లకుండా చల్లకుండలా అత్తారింట ఓ మొత్తన మెత్తంగా పడుంటే అల్లుడెలా ‘అలుగర్ర’ అవుతాడయ్యా? ముల్లుకర్ర ఆచారం తు.. చ తప్పకుండా
పాటింస్తున్నందుకేనా దేవుళ్ళలాంటి అల్లుళ్ల మీదిన్ని 'థూఁ' లు.. ఛాఁ'లు!
అక్షింతలేసే వరకు ఎస్వీఆరంత గాంభీర్యం. అలక పాన్పు
దగ్గర మాత్రం గుండెపోటొచ్చి దగ్గే గుమ్మడి
వ్యవహారం! ఆడపిల్లంటేనే నట్టింటి సిరి మా లచ్చిమి కదా! ఆ సిరికే.. ఇంకొంచెం కొసరుగా ..ఒహటో.. రెండో .. రెండు పంటల భూములు! ఆచారం తప్పలేకేగా అల్లుళ్లలా అదనపు
కట్నాలకు వేధించడం? ఆ మాత్రానికే వరకట్నం వంకతో అల్లుళ్లనలా వేదించేయడవేఁ?
వరుడూ సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడేగా? ఆ హరి హారతి పళ్లెంలో చిల్లర కిందో చెవర్లెస్ కారోటి కానుగ్గా పారేస్తే మాంగారి
సొమ్మేమైనా తరుక్కు పోతుందా? ఆకస్మిక దాడులప్పుడు అల్లుళ్ల మీదకు మల్లే ఐ. టి, ఇ.డి ల మీదలా దుమ్మెత్తి పోసే దమ్ముందా మాంగార్లూ?
సన్-ఇన్-లాస్ అంటే సన్నాసులేం కాదు. అగాధంలాంటి
సంసారంలోకి దూకి ఈదే దుస్సాహసులు.
ఉరికంబం ఎక్కే ముందు నరహంతుకుడైనా సరే..
ఆఖరి కోరిగ్గా సన్నీ లియోస్ ని చూడాలనుకొంటాడా లేదా! ఆ అవుట్-లాస్ కన్నా
సన్-ఇన్-లాస్ ఎందులోనయ్యా లోకానికి లోకువా?
విలువైన స్వేఛ్చా స్వాతంత్ర్యాలను సైతం ఫణంగా
పెట్టాడన్న సింపతీ లేదు.. దాం దుంప తెగ! తృణంగానో ఫణంగానో అల్లుడి టేస్టుకు
తగ్గట్లో లేటెస్టు సెల్లో.. బైకో.. కొనివ్వాలా వద్దా? అడగందే పెట్టంది 'మామ్' మాత్రమే! పిల్లనిచ్చిన మాంగారు
అడక్కుండానే అడుగులకు మడుగులొత్తాలి
నిజానికి! సనిన్లా ఏవఁన్నా సన్నాఫ్ కుబేరుడా స్వామీ? మాంగార్ని కాకుంటే మాల్యాగార్నా
కట్నంకోసం వేధించేది?
పిల్లకు వచ్చే సంబంధమేమో సంపూర్ణేష్ బాబులా ఛస్తే
ఉండకూడదు! బుద్ధిలో బిల్స్ గేట్సు, నడతలో సత్య నాదెళ్ల, ఆస్తుల్లో అంబానీ, జాబుల్లో సుందర్ పిచాయ్! ఊహలకేమీ
‘ఊహూఁ’ ఆకాశం కూడా అడ్డు రాకూడదు కానీ.. ఆ తాహతుకు తగ్గట్లు తూగమంటే మాత్రం కాణీ బోణీ కాని చింతపండు కొట్టోడి
దివాలా పోజు!
కాళ్లు కడిగే ముహూర్తం ఖాయమైన్నాడే కన్నీళ్లు
కార్చే శక్తి కూడగట్టుకోవాలి!
అల్లుడంటే పిల్లతండ్రికి పుస్తె కట్టని
మొగుడండీ! పిలదానికి అప్పగింతలు
పెట్టినప్పుడే మాంగారి కప్పం కథలు మొదలయినట్లు!
కాశీయాత్రకని బైల్దేరిన సన్నాసిని..
పిల్లనిస్తామని బెల్లించి మరీ పిటల
మీద కుదేస్తిరి! పాంకోళ్లో పక్కన
పారేసినందుకైనా ఓ కోళ్ళ ఫారం ఓపెన్
చేయించాలి కదా! గొడుగో మూల గిరాటేసినందుకైతే గిరాకీ తగ్గని రాజధాని
ప్లాటోటి రాసివ్వాలి! నానో బుల్లి
కారడిగినా సరే 'నోఁ.. నోఁ' అంటేనే అల్లుళ్లంతా మాంగార్లమీదంతలా ఫైరయ్యేది!
పెళ్లంటేనే ముద్దూ ముచ్చట్లట! మంచి మాట. అల్లుళ్లది
ముద్దూ.. మామలది ముచ్చెమట్ల ముచ్చట! ఇహ
అల్లుళ్ల 'నాతి చరామి' అంటారా? హామీ నిజమే.. కానీ స్వామీ! మాంగార్లిచ్చే మాగాణీ భూముల మీదొచ్చే రాబడి బట్టే ఆ మాటలకుండే చెల్లుబడి!
కల్లాకపటమేం లేకుండా పిల్ల మాడునింత జీలకర్ర, బెల్లముక్క అద్ది చల్లంగా ఇంటికి
తోలుకెళ్తే.. మామ చేతిలో ఆడే తోలుబొమ్మంటుందయ్యా అల్లుణ్ని పోసుకోలు లోకం. మాంగారి పరువు నిలపడం కోసమే బాబూ..
మాంగారి పరువు తీసే కోరికలు పెద్ద మనసుతో
కోరుకోడం అసలైన పెద్దమనుషులు!
వరకట్న నిషేధమనే మిషన్తో కంగారు పెట్టయకండయ్యా బాబూ పాపం ఆ
పెద్దమనుషుల్ని! భూమి గుండ్రంగా ఉండదన్నా 'ఊఁ' కొట్టేసి ముందర్జంటుగా ఓ సంఘం పెట్టేసే తుగ్లక్కులు తుక్కు తుక్కుగా
ఉన్న భూమి ఈ దేశం! ‘వరకట్న నిషేధ బాధితులు’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఓ ట్వట్టర్ ఎక్కౌంటు గానీ ఓపెన్
చేసేస్తే గంటలో ఆ రాహుల్ బాబు రికార్డు బద్దలయ్యే రీ ట్వీటుల వచ్చి పడిపోతాయ్!
పెట్రోలు ఉత్పత్తులకు మల్లే వరకట్నం సొమ్ముమీదా జి
ఎస్ టీ వద్దు! అదనపు కట్న కానుకల మీద అదనపు సేవా పన్నులు గట్రా తక్షణమే రద్దు. మనీ, ల్యాండు.. గట్రా ఏదైనా మామల నుంచి లాఘవంగా
రాబట్టుకొన్న సొమ్ము.. మనీ ల్యాండరింగు యాక్టు నుంచి మినహాయింపు! చిటికెడు
ఓపికా.. టైమూ తగలడాలే కానీ సర్కార్లను ఇరుకున పెట్టేసే చిటుకులు తట్టలు తట్టలు పుట్టించెయ్యచ్చు! తస్మాత్ జాగ్రత్త
పిల్లనిచ్చిన మాంగార్లూ.. అల్లుళ్లెన్నుకున్న సర్కార్లూ! కొరియా'కిమ్' అయినా తయారు చెయ్యలేని అణుబాంబు బాబూ అల్లుడుబాబు!
ఏ జన్మలో చేసిన పాపమో.. ఈ జన్మలో ఆడపిల్లలకు 'పాపా'లుగా పుట్టడం! మామల ఆజన్మ జరా దుఃఖ పాతకాదులన్నీ పూరా పరిహరించే హరిమూర్తి
అవతారులయ్యా శ్రీ అల్లుళ్ళు! గుళ్లు కట్టించుడు.. మొక్కుడు ఎలాగూ లేదు! నిలువు
దోపిడీలయినా ఇచ్చుకోండయ్యా.. చాలు!
కేవలం లవ్వుల్తోనే పిల్లల కాపురాలు
ఎల్లకాలం నిలవ్వు!
వరకట్నం ఆడబిడ్డల్ని కన్న వారికి భగవంతుడిచ్చిన
గొప్ప వరం! పరిశోధనలు చేసి మరీ పాఠ్యాంశాల్లో చేర్చిందయ్యా ఈ మధ్యన మన బెంగుళూరు
సెయింట్ జోసెఫ్ కళాశాల సామాజిక శాస్త్ర విభాగం! నమ్మకుంటే ఆ నోట్సు జిరాక్సు
కాపీ లొకసారి తెప్పించుకొని చదువుకోవాలి
ఆడబిడ్డల్ని కన్న అదృష్టవంతులంతా!
అందంగా లేని ఆడపిల్లకు తొందరగా పెళ్లిళ్లయే గోసాయి
చిటుకు. బిడ్డ భారీగా ఉన్నా లారీడు సొమ్ము డౌరీగా పోస్తే చాలు.. పుస్తె కట్టే వస్తాదులు వరసలో నిలబడతారు మెగాస్టార్ బ్లాక్ బస్టర్ ఫస్టాటాడే హాలు బైటకు మించి! కట్న కానుకలు వంకతో
ఏ అడ్డగాడిద కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా మన ఆడపిల్లకు
అత్తారింట్లో అదానీ కోడలు హోదా ప్లస్ జడ్ ప్లస్
సెక్యూర్టీ! మన బిడ్డకు మనమే స్వయం పోషక శక్తి
ఇంచక్కా కల్పించేసుకొనే యుక్తి.
బ్రీఫ్ కేసుల్తో తప్ప పోలీసు కేసుల్తో ఏ సన్నిన్లా కేసులూ చరిత్రలో సాల్వయింది లేదిప్పటి వరకు. దామాద్ అంటే అత్తారింటి దావూద్
ఇబ్రహీం! అయితేనేం? కోరినంత కట్నం కోరినప్పుడు విసిరి పారేస్తుంటే
అతగాడే అమ్మాయి పాలిట రాం అండ్ రహీం! అన్నీ సుమతీ శతకం నూరి పొయ్యదు!
'డౌరీ.. డౌన్! డౌన్!' ఊబిలో దిగి పోవద్దు. ఏ ఇండియన్ పీనల్ కోడూ పిల్లనిచ్చిన మాంగార్ల
గోడును తీర్చింది లేదు! కట్నమెప్పటికీ భూతం కానే కాదు. అమ్మాయి బంగారు భవిష్యత్తుకు అదే పెద్ద ఊతం. ఉన్నంతలో ఇచ్చుకోడం
పాతకాలం ఉదారం. ఉన్నదంతా ఊడ్చి అచ్చుకోడం
కొత్త వరకట్నపు ఆచారం.
కార్పొరేటు యుగం! ప్రద్దానికీ ఓ రేటుండటం సహజం.
అమూల్యమైన ఓటే ఎన్నికల టైంలో ఎన్నో రెట్లు ధర పెరుగుతుంది కదా!
దేవుళ్ళు కాబట్టి అల్లుళ్ల ఆరళ్లు ముందే తెల్సుట.
హడలి అందుకే ఆ హరి హరులు సైతం అసలు ఆడబిడ్డలకే కన్నతండ్రులు కాలేదుట! సెట్ రైటు చేసుకోడం
రాని బుద్ధూలే.. దేవుళ్లలాంటి అల్లుళ్ల మీద అన్నేసి సెటైర్లు అన్యాయంగా
వేసేది!
పురిట్లోనో.. పుట్టక ముందో ఆడబిడ్డల్ని చంపే ఆ
దురాగతాలు మనకొద్దు. మనిషి మనుగడ ఆడబిడ్డల భ్రూణ హత్యలు
మీన్స్ వరకట్న పరిరక్షణకు దాపురించే తీరని నష్టం!
ఉద్యోగాలు.. ఉపాధులు ఆట్టే దొరకని కరువు కాలం. వరకట్నాలు, అదనపు కట్న కానుకలేగా నిరుద్యోగ యువకులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధరువులు.
అల్లుళ్లంటే వట్టి
'వెధవ'లంటూ తలంటే మాంగార్లనలాగే పెరగనీయి భగవాన్! పెద్దల తిట్టు
దీవెన పెట్టు. 'వె.ధ.వ' అంటే వెయ్యేళ్ళు ధనంతో
వర్ధిల్లమని కదా అంతరార్థం? అంతకు మించిన గొప్ప వరమూ ప్రస్తుతానికి మరేముంటుంది
అస్తమానం మాంగార్లను గిల్లుకుంటూ బతుగ్గడిపే అల్లుళ్లందరికీ!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఆంధ్రప్రభ 28-10-2017 నాటి 'సుత్తి.. మెత్తంగా' కాలమ్ లో ప్రచురితం)