వర్షాలు దంచి కొడుతున్నాయ్! ఓ రకంగా ఓ.కే నే గానీ తడి బట్టలో పట్టాన ఆరవు. వడియాలెంతకీ ఎండి చావవు. ఒన్ డే
క్రికెట్లు ఓ పట్టాన ‘ఎన్డ్’ అవనే అవవు.
వానాకాలం చదువులని వూరకే వాక్కుంటాం గానీ.. ఈ ఈ-కాలం చదువులకి ఈ ఈడ్చి కొట్టే గాలివానలు చేసే కీడేముందసలు? జరిగే చెరుపంతా యజ్ఞాలకి, యాగాలకి,
రాజకీయ పార్టీల బహిరంగ సభలకి.
అతి సర్వత్ర వర్జయేత్!
నిజమే కానీ.. ఆ రాజనీతి అమిత్ షాకి మల్లే వరుణ దేవుడికీ
వక పట్టాన గుర్తుకు రాదల్లే ఉంది! ఉగ్రవాదుల
దాడులన్నా ముందే పసి గట్టుడవుతుందేమో గానీ.. ఉన్నట్లుండి ఆకాశం నుండి నట్లూడి పడినట్లు ఫెటిల్లు.. ఫెటిల్లు మంటూ విరుచుకు పడే పెద్దోళ్ల ప్రెస్ మీట్ల మాదిరి బాబూ ఈ ఉరుములు, మెరుపులు! ఈ ఫెళఫెళారావాల ఆర్భాటాలను ఏ అర్భక జీవులు తట్టుకోగలవు?
ప్రాణం పోకడ్ని ముందస్తుగా పసిగట్టే పరిజ్ఞానం మంచిగా అభివృద్ధయింది. మంచిదే గానబ్బీ..
వాన రాకడ్ని కూడా ముందే వాసన పట్టే వైనమూ తెలిసుండాలి కదా! ఇష్టం లేని నియోజక వర్గాల పర్యటనలకని
పై నుంచి ఆదేశాకు వస్తుంటాయెప్పుడూ! ఏ వానపూటో
చూసి ఆ ప్రయాణం పెట్టేసుకొంటే.. ఆనకో ‘సారీ’ తో
నిర్భయంగా వాయిదా వేసుకొని మిగతా సొంత పన్లన్నీ నిశ్చింతగా చక్కబెట్టేసుకోవచ్చు!
పిడుగు లెక్కడ ఎప్పుడు పడతాయో ఆ
చప్పుళ్లవీ ముందస్తుగా కనిపెట్టడంలో లేదప్పా
గొప్పతనమంతా! ఎవరు ఎందుకు ఎప్పుడూ అట్లా పిడుగుకుట్రలు పన్నుతున్నారో
పసి గట్టగలిగే సోయి కావాలి ముందు. గాలి వాలును ఎడ్వాన్సుగా
వాసన పట్టే మోతగాడేనయ్యా ఏ ఎదురుగాలి జడివానకైనా
ఎదురొడ్డి గొడుగు పట్టి నిలబడగలిగే మొనగాడూ!
మోదీజీ విదేశీ పర్యటనల్ని మించి, మన ముఖ్యమంత్రుల
వరాల జల్లుల్ని మించి దంచి
కొడుతున్నాయిప్పుడు రెండు రాష్ట్రాల్లో పాడు
జడివానలు! ఈ అర్థాంతర వర్షాల
అంతరార్థమేంటో ముందుగా కనిపెట్టాలి. చంద్రబాబు
వీడియో కాన్ఫరెన్సులన్నా వీకెండ్లలో
కాస్తంత వీకవుతున్నాయేమో కానీ.. ఈ విడ్డూరపు వానలకు మాత్రం ఓ శనివారం లేదు.. ఆదివారం లేదు! శనిలా పట్టుకొని సతాయిస్తున్నాయి ప్రతిపక్షాలోళ్ల పిచ్చారోపణల్లాగా!
వాన దేవుడి కింత హఠాత్తుగా ఓవర్ టైమ్మీదెందుకు గాలి
మళ్లిందో.. ఆ దేవుడికే తెలియాలి! ఎన్నికల జాతర అయిందనిపించాక
మళ్లీ
మొహాలే చూపించని ప్రజాప్రతినిధుల
తంతే కదా వానదేవుడి తంతు కూడా! మధ్యంతరం
ముప్పు ముంచుకొస్తుందని ఉప్పందిన నేతల మాదిరి ఇప్పుడీ వానదేవుడిగారి జడివాన దడదడలేవిఁటీ? ఈ అకాల వరుణ కృపా కారుణ్యాల వెనకాల ఎవరి కక్షా
కార్పణ్యాలు దాగున్నాయో! ఎక్కడో తంతా ఉందే!
నగరంలో తొందర్లో అంతర్జాతీయ స్థాయి
వ్యాపార సమ్మిటేదో జరగబోతుట.. టాకు! ట్రంప్ మురిపాల
కూతురు ఇవాంకా ముందుగానీ మన కంపు బైట పెట్టాలన్న కుట్రయితే కాదు కదా!
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు పెట్టుకొన్నాడొక వంక. జనసేనాని పవన్ కళ్యాణూ పర్యాటనలకని బైల్దేరుతున్నాడింకో వంక. తెదేపా శ్రేణులు తెల్లారగట్టనుంచే
కంటబడ్డ ప్రతీ కొంప తలుపు తడుతున్నారు! గిట్టని శక్తులేవఁన్నా
కుట్రలూ కుతంత్రాలకు పాల్పడ్డం లేదు కదా కుండపోతల వంకన?
మన నగరాలెప్పుడూ సీమ దొరలకు ‘చీఁ’ అనిపిస్తాయంట! అమెరికా వాళ్లకంటే ఆ మెరక మీద హావాయి దీవులవీ ఇవీ ఉన్నాయని మహా బడాయి! తెలుగువాడి పరువు నిలువునా పడిపోతుందన్న సింపతీ ఏమో పాపం.. వరుణ దేవుడుగారు ఒకింత ఓవర్ కరుణా కటాక్షాలతో ఏడాదికి సరిపడా నీటి వనర్లను ఒక్క వారం లోపే
దిమ్మరించేస్తున్నాడు నగరం నెత్తి మీదిట్లా కుంభవృష్టిలా! అలా గరంగరమయి పోతే
ఎట్లా! ఇప్పుడు కాస్కోండి! భాగ్యనగరం మొత్తం హుస్సేన్ సాగరం. షేక్ పేట టు అమీర్ పేట.. ఏ పేటకు
టూరేసినా టోటల్గా గండిపేట చెరువే! అమెరికాకున్నది ఆ ఒక్క బోడి హవాయి దీవే. అదే మరి మన దగ్గరో! బోటు షికార్లు కొట్టే సర్దాలుండాలే గానీ బోర్బండా టు గోల్కొండా తక్ అన్నీ దాల్
సరస్సులే దాదా!
బళ్లు ఓడలవడమంటే ఏంటో హైడ్రాబేడుకే వచ్చి చూడాలింక మరి! ఏ
వాడ కెళ్లినా లైవ్ లో ఫ్లోరిడా ఇర్మాను మించి.. ఫుల్ ఎంజాయ్ మెంటు గ్యారంటీనయ్యా దొరబాబులూ!
సంబడమే కానీ.. తెరిపి లేకుండా కురిసే ఈ పాడు వర్షాలు రాబోయే ఏ సంక్షోభానికో సంకేతాలయితే
కాదు గదా? తెర చాటుగా ఏమన్నా కుక్కలకీ నక్కలకీ మధ్య పొత్తుల కుదుర్తున్నాయో ఏమో
కొంపదీసి? ఖర్మ కాలి కప్పల కాళ్ళు కర్ర ముక్కలుక్కట్టేసి ఊళ్లెంట గిట్టనోళ్లెవరూ వూర్కే తిప్పేయడం లేదు గదా? గాడిదలక్కూడా కార్యాలూ
గట్రా జరిపించినా చాలంట.. ఆగకుండా అదే పనిగా కుండపోతలు కురుస్తాయంట! అట్లాంటి అఘాయిత్యాలకే తుంటరి మూకలో పాల్పడ్డం లేదు కదా!
శరవేగంతో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేని వార్గాలేవైనా సిగ్గూ శరం లేకుండా ఏ
రాంగు రూట్నుంచో ఋష్యశృంగుడి వారసుల్ని వారాసిగూడా కూడల్లో దింపి పోయినా చాలు.. దుంప తెంపే వాన తిప్పలు తప్పవు. తక్షణమే కేసొకటి బుక్ చేసేసి ఏ ఏ.సి.బి కో సి.బి.సిఐ.డి
కో అప్పగించేసెయ్యాలి అర్జంటుగా ముందు! కాళ్లకిందకు నీళ్లొచ్చిందాకా ఆగి.. ఆనక కన్నీళ్లు
కార్చుకుంటే మాత్రం ఒరిగేదేముంది? ఎవడొచ్చి తుడిచినా కొట్టుకు పోయిన కుర్చీ మళ్లీ ఎంత
కొట్టుకు చచ్చినా ఛస్తే తిరిగి రాదు.
వాతావరణ శాఖంటూ పేరుకొకటున్నా.. తడి బట్టలెప్పుడు
మేడమీద ఆరేసుకోవాలో చెప్పేందుకు తప్ప దాంతో
ప్రయోజనం సున్నా. బెస్తోళ్ళని సముద్రంలో కెళ్లొద్దని చెప్పేందుకే
అన్నేసి లక్షలు వేతనాలుగా జనం డబ్బు దొబ్బ బెట్టాల్నా! ఎప్పుడు ఎన్నో నెంబరు జెండా ఎక్కడెట్లా ఎగరేయాలో చెప్పేందుక్కూడా దానికున్న
పరిజ్ఞానం సందేహమే సుమా! లాజికల్గా చూస్తే అసలు మెటీరియోలాజికల్ డిపార్టుమెంటుకున్న హక్కే
ప్రశ్నార్థకం!
ఏ మెట్టుగూడా
వార్డు మెంబర్ని చాటుగా గోకినా చాలయ్యా.. చటుక్కున
చెప్పేస్తాడు వాలు చూసి జెండా మార్చేసే
చమత్కారాలను గురించి.. చాట భారతమంత!
వరద వురవడిలో పడి కొట్టుకు పోయే సగటు
జీవుల్లో ఎట్టి గడ్డు పరిస్థితుల్లోనైనా పార్టీని గట్టెక్కించే గట్టి ఓట్లు తట్టెడుంటాయి. ఎన్నికల వరకైనా ఈ వానలు, వరదల నాపుకోలేకపోతే
అన్ని పార్టీలకి ఒకే రకంగా తట్టుకోలేనంత
నష్టం. ఒక్కో శాల్తీకి రెండేసి ఓట్లు రాయించున్న పార్టీలకైతే ఆ ట్రబుల్.. డబుల్!
కాకపోతే గమనించారో లేదో.. ప్రతీ
కారుమబ్బుకీ ఓ మెరిసే వెండి అంచూ తప్పకుండా ఉంటుందంటారు. ఈ అతివృష్టులెంతలా బీభత్సాలు సృష్టించినా .. ఆ ప్రకృతి విపత్తు నుంచీ 'విత్తూ' మొలకెత్తే అదృష్టం కద్దు. నష్టనివారణ నిమిత్తం కేంద్రం విదిల్చే
చిల్లర నిధులు పార్టీ చిల్లరకేడర్ టెంపర్మెంటు జబ్బుకి టెంపరవరీగా మంచి మందు!
కుండపోతలు ఆగకుండా పడే చమత్కారాలు యాగాల నిండా బోలెడున్నాయ్.! సడే గానీ.. పడే పడే ఈ తరహా కుంభవృష్టుల్ని
అలాగే ఆపేసే మంత్రాలు ఏ తాంత్రిక
శాస్త్రాల్లో దాక్కునున్నాయో.. ముందా
తంత్రాలన్నీ తొందరగా
తెమల్చండయ్యా పంతుళ్లూ! అందాకా ఈ జలప్రళయాన్నెలాగో
ఆపద్ధర్మంగానైనా ఆపేయించుకోచాలి ముందు. ఏ కోర్టు గుమ్మం ముందు వేళ్లాట్టానికైనా గవర్నమెంటు ప్లీడర్లు సిద్ద్గంగా ఉండాలి!
నేరుగా ప్రభుత్వాలే వ్యాజ్యాలు
వేస్తుంటే న్యాయస్థానాలకు అదేదో నేరంలా తోస్తోందయ్యా ఈ మధ్య మరీను! పొలం,
పుట్ర.. కొంపా గోడూ
సర్వం కొట్టుకు పోయిన ఏ సన్నాసి అన్నదాత అడ్రసో వెదికి పట్టుకోండి! అలగాగాళ్లని
అడ్డు పెట్టుకొనైనా సరే అడ్డూ ఆపూ లేకుండా అతివృష్టి సృష్టించే ఈ వరుణ దేవుడి మీదో దావా పడేయాలి ముందు! ‘స్టే’ తెచ్చుకుంటే
తప్ప ఎంత గొప్ప సుపరిపాలనైనా స్టేబుల్ గా ఉండలేని దౌర్భాగ్యంరా ద్యావుఁడా ఈ దేశంలో!
మధ్యంతర ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయ్! జమిలి ఎన్నికలూ
అందరి ఆలోచనల్లో తెగ నలుగుతున్నాయ్! నోట్ల రద్దు ఫటింగు,
జి.ఎస్.టి
ఫిటింగు,
సీనియర్ల సపరేట్ మీటింగు, నల్ల డబ్బు దేశాల్దాటింగు, కాలుష్యాల కాటింగు,
అమెరికనుద్యోగాల కటింగు .. కుల మతాల మధ్య ఫైటింగు! కొంప కొల్లేరయిపోక
ముందే ప్రజల ఓట్ల ప్రవాహాన్ని పార్టీలు పంటమళ్లకి మళ్లించుకోవాలి
ముందు.
ఓట్లేసే క్రౌడ్ క్రోధం క్లౌడ్స్ మీదకు అలాగే మళ్లుండాలంటే.. అందుకో పాట!
‘వానా వానా వల్లప్పా!
నీకూ నాకూ చెల్లప్పా!’
-కర్లపాలెం హనుమంతరావు
***
No comments:
Post a Comment