Friday, October 6, 2017

దోమాకలాపం - వ్యంగ్యం- సుత్తి మెత్తంగా- ఆంధ్రప్రభ కాలమ్-

'దేశంలోని దోమలన్నింటినీ వెంటనే నిర్మూలించాలి. ఆ దిశగా  సత్వరం  చర్యలు చేపట్టాలి. అలా అని కేంద్రాన్నిప్పుడే  ఆదేశించాలి!’
‘బాగుందిరా బాబూ నీ దోమాకలాపం! ఈ మధ్యో  పనిలేని  పెద్దమనిషి.. దినేష్ లోష్ ధన్ అనుకుంటా ఆ మహాశయుడి నామధేయం..  సర్వోన్నత న్యాయస్థానాన్నిలాగే ఆశ్రయించాడు.. అదేం మాయ రోగం? రోగ పరీక్షల వంకతో రోజూ  డయాగ్నస్టిక్ సెంటర్లెన్ని డ్రమ్ముల్తో  జనాల  నెత్తుర్లలా తోడిబోస్తున్నాయో! వాటి నడ్డుకునే నోరెవరికీ లేదు గానీ.. పాపం.. నోరూ వాయా లేవని కాబోలు.. ఈ పిచ్చి దోమల మీద మాత్ర మీ  పైత్యకారీ దాడులు! ఒక్క దోమ పీక పిసికినా దేశాని కెంతరిష్టమో.. తెలిసిడిస్తేగా మన తెలివి తక్కువ బుర్రలకీ!'
'దోమలు రకరకాల రోగ కారకాలు బాబాయ్! వాట్ని చంపవతల పారేయక చట్నీలు.. సాంబార్లూ.. చేసుకుని ఇడ్డెన్లు, దోశల్లో  నంచుకు  తినమంటావా ఏందీ..  విడ్డూరంగా!'
'దోమల్లోదీ మన నెత్తురేరా బాబీ! వాట్ని చంపేయటమంటే మనల్ని మనం చంపేసుకోవడమే కదా!’
'ఓహో.. అదా నీ బాధా? దోమలెంత వృధ్ధయితే మనమంత అభివృద్ధయిన్నట్లు  లెక్కా? భలే!'
'ఆ తిక్క కూతలే వద్దనేది! లోపలుంటే మన వంట్లో.. బైటుంటే దోమల వంట్లో!  అలాగుండాలబ్బీ దోమల్తో మన  రక్తబంధాల్లెక్క! నోట్లకట్ట లెన్ని వేలైనా పారేయ్.. వెల కట్టలేనిదిరా మన ఒంటి రక్తబ్బొట్టు!  రక్తాలతో లెటర్లు  రాస్తే తప్ప ఏ లైలా లవ్ రాస్తాలకు లైను క్లియరివ్వడం లేదని లబ్బుమంటున్నార్రా మీ తుంటరి  మజ్నూలు! ఆ బాహుబలి మార్కు  వీర తిలకం సీన్లు తిలకించు! బొటనేలు తెగ్గోసి బొటబొటా కారే  రక్తాల్తో నుదుట బొట్లు దిద్దినప్పుడే కదబ్బీ.. అబలా ప్రేక్షకులలా లబలబలాడేస్తూ కరుణ రసం సీన్లంత భీకరంగా పండించిందీ?   అవన్నీ ఒహెత్తు.. రాజకీయాల్లోని రక్తం చుక్కొహెత్తు! మాటకు ముందు..  'ఆఖరి  బొట్టు వరకూ జనం  కోసవేఁ నా నెత్తురు యావత్తూ   ధారపోసేదం'టూ వత్తి వత్తి మరీ రక్తం సీన్లు   రక్తి కట్టిస్తేనే కదా .. పెద్దాళ్లకో నాలుగోట్లు పక్కోళ్ల కన్నా ఎక్కువ ఓట్ల పెట్టెల్లో రాలిపడేది? మనుషులకంత ప్రియమైన బ్లడ్డు మరి మస్క్విటోలకు మాత్రం లడ్డూ కాకుండా.. గడ్డు జాంకాయవుతుందేవిఁట్రా ఎర్రి నాగన్నా? ప్రాణాంతకాలని తెలిసీ మళ్లా  మళ్లా ఉగ్రవాదులకు మల్లే మన బాడీల మీదన్ని సార్లు దాడులెందుకు  చేస్తాయో.. పాపం.. దోమలు! కొద్దిగానైనా  దయాదాక్షిణ్యాలు చూపించద్దా..  బుద్ధి తక్కువ మనుషులు!'
'నిర్దాక్షిణ్యంగా కుట్టి చంపే దోమల మీదనా బాబాయ్ దయా దాక్షిణ్యాలు!'
'కాస్త నిర్మాణాత్మకంగా కూడా ఆలోచించండిరా కంగారు పడకుండా! మశకాలకేమన్నా మనకులాగా మెగా స్టార్ చిరంజీవి టైపు  బ్లడ్డుబ్యాంకు డోనర్లున్నారా? నిర్మూలించేసెయ్యాలన్న యావే తప్ప.. పిచ్చి దోమల మూలకంగా వచ్చి పడే లాభాల సంగతెవరూ ఆలోచించరా? దోమా.. గీమా కుడుతుండబట్టే ఇన్నేసి రోగాలూ రొప్పులు! వాటి నిదానం  కోసం ఆసుపత్రులు! అవి కట్టుకోడం కోసం బ్యాంకప్పుల తిప్పలు. కట్టించినాక   సిబ్బందితో ఇబ్బందులు.. జీతభత్యాలు.. కరువు భత్యాలు చాల్టంలేదు.. పెంచాల్సిందేనంటూ ఆందోళనలు!   అందు కోసంగానూ ఏర్పాటయ్యే పోటా పోటీ  సంఘాలు! గుర్తింపు కోసం వాటి  మధ్య పోట్లాటలు! ప్రభుత్వాలతో నిత్యం కాట్లాటలు! పోలీసులొచ్చి వేసే లాఠీ పోట్లు! చివరాఖర్న కదా  సర్కారు పెద్దలతో భేటీలు! ముఖ్యమంత్రులే మిగతా ముఖ్యమైన పన్లన్నీ పక్కన పారేసి  రంగ ప్రవేశం చేస్తే తప్ప.. '
'ఉండుండు బాబాయ్.. ఊపిరాడ్డంలా ఇక్కడ!  బోడి దోమ కుట్టుళ్ల వెనకాల ఇంత మెగా మూవీ స్క్రీప్టుంటుంటుందా? అయ్య బాబోయ్..'
'దిసీజ్ జస్ట్  ఫ్రం సంక్షోభం సైడ్.. మై బోయ్! అటు సంక్షేమం సైడూ చూడు! దోమలే లేకుంటే డెంగ్యూ లేదు. మలేరియా రాదు, మెదడు వాయదు. చలిజొరం.. నిమ్మోనియా.. ఫ్లూ.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా రోగాల  ఇన్ఫ్లుయన్సులూ  ఉండి చావవు. ఏవీ ఉండనప్పుడు సర్కారు కొలువులూ ఉండవు. ఉన్న    కొలువులకూ  సిక్ లీవుల్లిస్టులు మరీ అంత  పొడుగుండవు. రోగం వంకతో  డుమ్మా కొట్టిసి ఏ క్రికెట్ ఒన్డేకో.. మహేష్ బాబు మ్యాట్నీషోకో.. వెళ్లే వీలసలే ఉండదు. 'ఆరోగ్యశ్రీ.. ఈ భోగశ్రీ' లంటూ  సిరి వచ్చి పడే  పథకాలనేకం ఒక దానెనకాల ఒకటి తరుముకొంటూ వచ్చి పడే అవకాశాలూ ఉండవు! వాటి బిల్లుల కింద రాలిపడే రాబళ్లు   రాబట్టే సౌకర్యా లసలుండవు. సర్కారు దొరలకు  చేతి నిండా పన్లుండవు. చేతుల్లో పడే పైసలుండవు.  పైసల్రాలని కొలువులు కంచి గరుడ సేవలే కదట్రా! మరింకెవరికిరా పిలగాడా ప్రజాసేవమీద ఇప్పటంత    ఇంట్రెస్టు?   కిరికిర్లవీ ఇవీ  చేసేసి కమీషన్లు దండుకునే దళారీ దండ్లు దిండ్లేసుకునలాగే ఆఫీసుల చిడీల మీద  కునికేస్తాయా చాదస్తం కాకపోతే!   తాయిలాలు దక్కే వేరే కార్యాలకు   వలస పోతాయ్! దళారీ దండ్ల దార్లన్నీ మూసుక పోయాక  పైవాళ్ల  పుట్టి నట్టేట   నిండా మునిగి నట్టేగా! సుపరి పాలనా కుదరక.. సుపారీ పాలనా కదలక.. శిలలా  ప్రజాస్వామ్యమలా  స్తభించి పోతే .. దాని బాగోగులు గట్రా చూసే మిగతా మూడు మూల స్తంభాలూ..  మూలుగుతో మూలబడాల్సిందే బాబీ.. ఖాయంగా!'
'అయ్య బాబోయ్! ఒక్క కుయ్యాఁ  దోమను చంపితేనే  ఇన్నిన్ని అనర్థాలా బాబాయ్ మన ప్రజాస్వామ్యానికీ? మంచి ముక్క చెవిలో వేసి మా  కళ్లు మా బాగా తెరిపించావ్! నయ్యం!  ఇంటి దయ్యం పోరు పడలేక ఇంకా ఏ గుడ్నైటో.. హిట్టో.. ఇంట్లో కొట్టాలని .. ఇదిగో.. ఇప్పుడే..    కొట్టుకు బైల్దేర్తున్నా!'
'ఒక దోమను తరిమితే  మరో దోమ రాదుట్రా పిచ్చి సన్నాసీ కుట్టి చంపేయడానికి?!   దోమలనేవే లేకుండా ప్రక్షాళన  చేసేస్తే ఈ హిట్లూ.. కిట్లూ గట్రాలమ్ముకొనే కొట్లన్నీ బజార్న పడిపోవతాయా.. లేదా? అసలే పెద్దనోట్ల రద్దుతో చితికి పోయున్నాయ్ చిన్నా చితకా వ్యాపారాలన్నీ!    నువ్వూ ఇప్పుడీ దోమల ప్రక్షాళనంటూ నూతన  సంస్కరణలగ్గానీ  తెర తీసేస్తే.. లేక్స్ అండ్ క్రోర్స్ పోసి  పెట్టారే పాపం    దోమ్మందుల  కంపెనీలు.. ఓవర్ నైటా సీమ దొరల బ్యాచంతా  దిక్కూ దివాణం లేకుండా కుప్పకూలిపోదుట్రా! దోమల మీదిట్లా  సర్జికల్ దాడులు పక్క పాకిస్తోనోడి కుట్రలేమో.. విచారించుకోండి ముందు!’
'ప్లీజ్.. ప్లీజ్.. ఆపు బాబాయ్! పాడు నిద్ర. రాత్రి కాకపోతే పగలు పోవచ్చు. ఆఫీసులో అయితే అస్సలు ఇస్యూనే కాదు. ఇంటి పట్టునున్నా ఇంటావిడ పోరు ముందు ఈ దోమల సంగీతమే వీనులకు విందు!’
'గుడ్ ఐడియా!  వార్తలు రోజూ చూస్తూనే ఉన్నావుగా?  రాత్రి రాబరీలు ఓ రేంజిలో పెరిగి పోతున్నాయ్!  దోమల్తో సావాసం సహనంతో చేసావా..  ఇంటి కాపలా సమస్యా సామరస్యంగా తీరిపోతుంది. ఈ రోజుల్లో కుక్కల్నీ.. గూర్ఖాల్నీ.. పోలీసోళ్ళ  పెట్రోలింగుల్నీ నమ్మేందుకు లేదబ్బీ! ఎవడి సొత్తుకు వాడే కావలి.  అందుకైనా  దోమల తోడు    కావాలి. పనిలో పని! దేశవాళీ  సంగీతంతో  పరిచయమూ పెరుగుతుంది.  కొన్ని దోమలు కుడితే కేన్సరు కూడా దరి చేరదంటున్నారా.. ఫారిన్  సైంటిస్టులు! ఏ దోమ కొండెలో ఏ మందు దాగుందో! కదలకుండా  బబ్బో..  అదేరా సుబ్బరమైన పని!'
'ఎట్లా బాబాయ్? చెవిలో ఒహటే సొద!'
'ఏడ్చావ్ లే! నీ  టీవీలు, సినిమాలు, రోడ్లమీది రొద బళ్ళూ, సభల్లో మన నేతాజీలు  కూసే  కుళ్ళు కూతల కన్నానా?! దోమల సంగీతంలో ఓ  అందమైన లయుంది నాయనా! వింటూ బబ్బున్నావా.. ఇట్టే తెల్లారుతుంది! అందాకా  ఇంద..  చిడతలు! త్యాగయ్యగారి  కీర్తనల ఆలాపనలందుకో! 'బంటు రీతి కొలువు ఈయవే .. రామా!'
‘రామా కాదు బాబాయ్! దోమా!  బంటు రీతి కొలువు ఈయవే.. దోమా!’
‘బాగుంది.. బాగుంది.. నీ దోమాకలాపం!’
-కర్లపాలెం హనుమంతరావు
***




























































No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...