Friday, December 1, 2017

గ్రంథచోరులు- ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా కాలమ్






ఆన్ లైనులో కెళ్లి  కెలుక్కుంటే చాలు. కాపీ రైట్ చట్టం పట్టింపు లేకుంటే  కామ్ గా కాపీ, పేస్టు చేసుకొని కర్త పేరు మార్చేసుకోడం మహా సులువు.  ఆకాశమంత జ్ఞానానికి ఆవిష్కర్తలం అనిపించుకోడం.. ఇవాళ్టి డిజిటల్ యుగంలో కోక్ తాగినంత సులువు. కేవలం అచ్చు బుక్కులు  మాత్రమే లభ్యమయే దిక్కుమాలిన కాలంలో గ్రంథ చోరుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. పాపం!

వనితా.. విత్తం తస్కరణలక్కూడా సులువు సూత్రాలు చెప్పే శాస్త్రాలున్న  కాలంలో  పుస్తకాలు కొట్టేసే  చిట్కాల గైడ్లు మచ్చుక్కి ఒక్కటైనా దొరక్కపోవడం గ్రంథచోరులకు పెద్ద లోటు!    అరవై నాలుగు కళల్లో చౌర్యమూ ఒక విభాగమే! అయినా.. ఆ శాఖ అభివృధ్ధి ఎందికు పుంజుకోలేదో? చిత్రమే కదా?

పుస్తక చౌర్యం మరీ అంత అకార్యమైన కళేం కాదు. యమధర్మరాజులుగారు గ్రంథచౌర్యం మీదో ఉద్గ్రంథమే రాసారని వినికిడి. ఏ దొంగ వెధవ గుట్టు చప్పుడుగా  నొక్కేసాడో..   ఇప్పుడా తాళపత్రాలు ఏ  గ్రంథాలయంలోనూ కనపడ్డం లేదు!

పుస్తక  చౌర్యానికీ బోలెడంత గ్రంథముంది. ఆశించిన  పుస్తకం అందుబాటుకి రావాలి. కోరుకున్న అందులో తారసబడాలి. ఇప్పుట్లా ఏ సెల్ ఫోనో అరచేతిలో ఉంటే 'ఠప్పు'మని ఓ క్లిక్కుతో  అంశం  మన సొంతమవుతుంది. క్జిరాక్సులకే దిక్కులేని కాలంలో ముత్తెమంత సమాచారం సేకరించాలన్నా పుస్తకం మొత్తం ఎత్తేయడం ఒక్కటే ఉత్తమ మార్గంగా ఉండేది.

అరువులా అడిగి పుచ్చేసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరిగే మరో దారి ఉన్నా..   కొంతమంది పుస్తకదారుల జ్ఞాపకశక్తి మరీ దారుణంగా ఉంటుంది. ఏనుగు మెమరీ కూడా వాళ్ల ధారణా శక్తి ముందు చీమ తలకాయ! ఏళ్లు పూళ్లు గడిచి.. ఎన్ని యోజనాల దూరంలో  స్థిరపడినా ప్రయోజనం శూన్యం. ఆనవాళ్లేవీ  లేకుండా  ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రారబ్దం బాగోలేకుంటే ఫలితం సున్నా. ఏ దుర్ముమూర్తానో నిశ్శబ్దంగా వెనకనుంచి వచ్చి 'ఎంరోయ్! మూర్తీ.. ఎట్లా ఉన్నావ్? అంటూ వీప్మీద ఛర్రుమని విమానం మోత మోగించేయచ్చు. ఆనక  ముసి ముసి నవ్వుల్తో కసిగా నిలదీయడంతో దోష విచారణ కథ మొదలవుతుంది. కోర్టు.. బోను.. సీనొక్కటే తక్కువ.  తలపండిన వకీలుగారు ఏ కీలుకు ఆ కీలు విరిచేసినట్లు సాగే విచారణను ఎదుర్కోవడం ఎంత అబద్ధాలకోర్సు డాక్టరేటుకైనా తలకు మించిన పని.

ఫలానా పంథొమ్మిదొందల అరవై తొమ్మిది మార్చి మూడో తారీఖు మిట్టమధ్యాహ్నం పూట ఎండన  పడి తమరు మా ఇంటి కొచ్చారూ! ఏదో మిత్రులు కదా అని ఆతిథ్య ధర్మ నిర్వహణార్థం  కాశీ చెంబెడు మజ్జిగ నీళ్ళు నిమ్మరసం పిండి మరీ తమరికి సమర్పించుకున్నాను. అప్పుడు తమరేం ఉద్ధరించారో  గుర్తుందో లేదో ఇప్పుడు?  ఎండ చల్లబడిందాకా  బైటికి వెళ్లలేనంటే పోనీలే.. టైమ్ కిల్లింగుగా ఉంటుందని నా సొంత గ్రంథాలయం నుంచి ఎప్పట్నుంచో సేకరించి దాచుకున్న చలం 'ఊర్వశి'  అరుణాచలంలో ఆయన స్వహస్తాలతో అట్టమీద పొట్టి సంతకం గిలికిచ్చిన  అపురూపమైన పుస్తకం తమరికి ధారాదత్తం  చేసాను. బుద్ధీ,  జ్ఞానం అప్పటికింకా పూర్తిగా వికసించలేదులే నాకు. ఆపుకోలేని అర్జంటు పని మీద నేనటు లోపలికి వెళ్లి తిరిగొచ్చిన ఐదు నిమిషాలలోపే తమరు  జంపు!  ఖరీదైన  వస్తువులింకేమైనా చంకనేసుకొని ఉడాయించారేమోనని అప్పుడు  మా  ఊర్మిళ  గుండెలు బాదుకొన్న చప్పుళ్లు ఇంకా ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మిత్రమా! మా ఆవిడ శోకన్నాలు నాకు నిత్య కర్ణ శ్రవణానందాలే కనక దానికి ఆట్టే ఫీలవలేదు.  కానీ నా ఊర్వశిని  నువు  చెప్పా పెట్టకుండా చంకనేసుకొనలా  చెక్కేయడమే చచ్చే బాధించిందిరా మూర్తీ! నిజమైన స్నేహం కన్నా పుస్తకమే విలువైందని నువ్వా నాడు ప్రాక్టికల్గా నా కళ్లు తెరిపించావు చూడు.. అందుకు   'థేంక్స్' చెప్పుకుందామనుకొన్నా..  ఏదీ నీ అడ్రసు? రామాయణంలో సీత దర్శనం కోసం ఆ శ్రీ రామచంద్రుడయినా  అంతలా తపించాడో లేదో ? నా ఊర్వశి కోసం, తమరి వేరెబౌట్సు కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పటికైనా కనిపించావు. అదే పది వేలు. ఎన్ని వేలు కావాలో అడుగన్నా.. ఇచ్చేస్తా! కానీ.. మళ్లీ నా ఊర్వశిని మాత్రం నాకు తిరిగి ఇచ్చేయ్ రా.. ఇప్పుడే!' అంటూ జబ్బ పట్టుకొని నడిరోడ్డు మీదే  నిలబెట్టి పరువు తీసే  పుస్తకాల పురుగులు ఇప్పటికీ తారస పదుతూనే ఉంటారు. అందుకే తస్కరించే ముందు పుస్తకం వివరాలతోనే కాదు.. పుస్తకం తాలూకు  ఓనరు వివరాలతోనూ అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.

డిజిటల్ గా దేశం ఎంతలా అభివృద్ధి పథం వైపు ముందుకు దూసుకు పోతున్నా.. పోయిన పాతపుస్తకాల కోసం.. పాతకాలంనాటి పద్ధతుల్లోనే పడరాని పాట్లు పడే చాదస్తులు ఎప్పుడూ ఎక్కడో ఓ చోట తారసపడి గ్రంథాల విలువను మర్చిపోనివ్వరు.

అవును మరి.. ఒక గ్రంథం తయారీకి అది రాసేవాడి శరీర కష్టం విఘ్నేశ్వరుడి బాధను మించి ఉంటుంది! 'భగ్నపృష్టః కటిగ్రీవ స్తబ్ధ దృష్టిః రథో ముఖః.. కష్టేన లిఖితం గ్రంథం, యత్నేన పరిపాలయేత్' అని ఊరికే అనరు కదా ఎవరైనా? అష్టాదశ పర్వాల మహాభారతాన్ని ఆ వ్యాసులవారు ఓ వ్యాసంలా గడగడా వప్పచెప్పుకు పోవచ్చు. అది వట్టి నోటి పని. కానీ.. చెప్పింది చెప్పినట్లు క్షణమైనా గంటం  ఆపకుండా  చెవులతో వింటూ.. బుద్ధితో ఆలోచిస్తూ.. చేత్తో బరా బరా  రాసుకుపోవడం?! రాత సంగతి ఎట్లా ఉన్నా ముందు వెన్నెముక గతి? ముక్కలు చెక్కలై పోదా? మెడ కండరాలైనా పట్టుకు పోవా?కంటి చూపు? చీకటి పడితే  కటిక చీకటే!  ఆపకుండా అంత లావు భారతం ఎట్లా రాసుకు పోయినట్లు! దేవుళ్లు  కాబట్టి ఏ మాయో మర్మమో  చేసి కార్యం ఇతి సమాప్తం అనిపించి ఉండవచ్చు. మానవ మాత్రుల కెట్లా సాధ్యం?'కష్టేన లిఖితం గ్రంథం' అన్నారు అందుకే! పిట్ట ఈకలతో ఎండు తాటాకుల మీద గుండ్రటి లిపి! అక్షరం ఆకారం చెడకుండా రంధ్రాలు పొడుచుకుంటూ  పోతుండాలి.  అంత  కష్టం కాబట్టే పుస్తకాలను భద్రంగా చూసుకోవాలని పెద్దలు సుద్దులు చెప్పింది.

ఏ కష్టమూ లేకుండానే సృష్టించుకొనే వీలుంటే.. వేదాలు నీళ్లలోకి  జారినప్పుడు విధాత ఎందుకంతలా బేజారవుటాడు? గ్రంథాల విలువ తెలుసు కాబట్టే సోమకాసురుడా కవిల కట్టలు కంటబడగానే లటుక్కుమని నోట కరుచుకొని  పారిపోయాడు! 'పోతే పోయాయి లేవయ్యా? మళ్లీ  రాయించుకో.. ఫో!' అని కసురుకొని వదిలేయలేదు  పరమాత్ముడు.  పనిమాలా మత్సాహారమెత్తి మరీ మొరటు రాక్షసుడితో  ప్రాణాలకు తెగించి పోరాడాడు. తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చి 'ఇహ ముందైనా జాగ్రత్తగా ఉండ' మని మందలించాడంటానే తెలియడం లేదా పుస్తకాల విలువ ఏ పాటిదో?.

విలువైన వస్తువులు ఎక్కడుంటాయో దొంగతనాలూ అక్కడ తప్పకుండా జరుగుతుంటాయి. గ్రంథాలయాల దగ్గర అందుకే పగటి దొంగలు తారట్లాడేది.  పుస్తకం చూస్తున్నట్లే చూసి.. కటిక్కున  పుటను పరా పరా చించి జేబులో కుక్కేసుకొని బైటపడే గ్రంథచోరులు గతంలో చాలా మందే  తారసపడుతుండే వాళ్లు. వెసులుబాటుంటే అసలు  ప్రతినే లేపేసేందుకు అన్ని విధాలా ప్రయత్మించే గ్రంథచోరులుండ బట్టే   తంజావూరు సరస్వతీ గ్రంథాలయంలోని మన తెలుగు తాళపత్ర గ్రంథాలు చాలా వాటికి కాళ్లొచ్చినట్లు ఈ మధ్య ఒక తమిళనాడు సాయంకాలం దినపత్రిక వివరాలతో సహా ప్రచురించింది.

ఈ-డిజిటల్ కాలమే కాదు.. ఎన్ని డిజిట్స్  జీతమొచ్చే గొప్ప  ఉద్యోగమైనా  మనిషి గ్రంథచౌర్యబుద్ధిని అడ్డుకోలేక పోతోంది. అందుకే తెలంగాణాలోని ఒక మారుమూల పట్నంలోని గ్రంథాలయంలో పుస్తకాలు దొంగిలిచ్చవద్దని హితవు చెబుతూ
'బుక్కులు తీసుకుపోయిన
మక్కువతో చదివి మీరు మరి ఇవ్వవలెన్
చిక్కెనని యింట దాచిన
మిక్కిలి పాపంబు మీకు మితిమీరియగున్!'
అంటూ పద్యాలు కొన్ని రాయించి మరీ నోటీసు బోర్డులో పెట్టించారు నిర్వాహకులు.
గ్రంథచోరులు దృష్టి ఈ పద్యం రాసున్న బోర్డు మీదా పడబోతుందా? ఏమో.. చూడాలి మరి ముందు ముందు!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా కాలమ్- 02, డిసెంబర్, 2017)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...