Friday, December 15, 2017

‘కాఫీ’రాగాలు- (ఆంధ్రప్రభ- 16, డిసెంబర్, 2017 నాటి సుత్తి.. మెత్తంగా- కాలమ్ లో ప్రచురితం




దేవతలూ రాక్షసులూ  పాలసముద్రాన్ని తెగ మధించేసారు. ముందుగా కాలకూటం.. ఆనక పీయూషం. రాక్షసులకు కాలకూటం దక్కితే.. లక్కీ దేవతలు అమృతం లంకించుకుంటిరి. ఏమీ దొరకని మన మనుషులమే మన్ను తిన్న పాముల్లా ఓ మూల పడుంటిమి.  బ్రహ్మయ్యకే పాపం.. పాపం అనిపించింది. అందుకే కాలకూటం లోంచి 'కా'.. పీయూషం లోంచి పీ.. బైటికి పీకి కాపీ అనే కొత్త కాక్ టైల్ సృష్టించేసి మన వంతుకని ప్రసాదించింది. ఆ  కాఫీతోనే మనకిప్పుడు ఇన్ని గంతులు!
అందుకే విషంలోని మాదకశక్తి..  అమృతంలో ఉండే అద్భుతమైన  రుచి.. రెండూ కాఫీలో ఉంటాయి కదా! అమృతం హంబక్కేమో కానీ.. కాఫీ కిక్కు మాత్రం హండ్రెడ్ పర్సెంట్  రియాల్టీ! కోక్ నుంచి కొబ్బరి బోండాం దాకా ఎన్ని డ్రింకులు అందుబాటులో ఉంటేనేమి.. కాఫీకుండే ఆ కిక్కే వేరు స్వామీ! ఫిల్టర్ కాఫీ  స్పేసును ఫిల్లప్  చేసే  హాట్  డ్రింకు మనకింకెన్ని  జన్మలెత్తినా దొరకడం కల్ల.. నో డౌట్! రామనవమి బెల్లప్పానకం, ముక్కు దిబ్బడకని వాడే మిరియాల కషాయం, పడ్డ పడ్డప్పుడు మాత్రమే దొరికే గేదె జున్నుపాలు.. ఇవి మినహా మనకి మరేమీ తెలియని   అమాయాకపు రోజుల్లో  కాఫీలు  మప్పే  తెల్లోడు మనల్ని పర్మినెంటుగా సర్వెంట్సు  చేసుకున్నది! కాఫీనా? మజాకానా?  
ఒకానొక్కప్పుడు ఓ కప్పుడు కాఫీ దిలాసాగా ఆరుబయలు కుర్చీల్లో చేరగిలిబడి తీరిగ్గా  తాగే అదృష్టం ఒక్క  తెల్లదొరలకు మాత్రమే సొంతం! ఇప్పుడో? 'కుదిరితే కప్పు కాఫీ.. నాలుగు కబుర్లు' ఈ కాలం కుర్రకారుకి.  కాటికెళ్లే ముసలి డొక్కులక్కూడా చివరి కోరిక చికోరి తగు పాళ్లలో కలిపి మరిగించిన కమ్మని కాఫీ ఓ లోటా నిండుగా లాగించి హరీమనాలని!  ఎంత కాఫిర్ కైనా కాఫీ దగ్గర కాసుల్లెక్క ఉండకూడదు! 'కాఫీలు తాగారా? టిఫినీలు తిన్నారా?' అంటూ వెంటబడి మరీ చంపుకు తింటుంటారు  ఆడపెళ్లివారు పెళ్లిళ్ళలో. అమ్మాయి తండ్రేమన్నా అమీర్ బాబనా? అదో మర్యాద.. కాఫీకి దక్కే గొప్ప గౌరవం!
టర్కీలో పిల్ల చేసిన కాఫీ కమ్మంగా ఉంటేనే పిల్లడు పెళ్లికి  సై. కాఫీ రుచిలో కాస్తింత తేడా వచ్చినా ఆనక పెళ్లాం కాపురానికి  నీళ్లొదులుకోవాల్సిందే! పాడు కాఫీ! ఎన్ని కాపురాలలా కుల్చేస్తోందో ఇక్కడా టర్కీలోలా! అయినా కాఫీకున్న గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు!
కాఫీ అయ్యర్లకు వరల్డువైడుగా పేరొచ్చిందీ ఫిల్టరు కాఫీ వల్లనే సుమా! 'అయ్యరూ! నీవు లేనట్టి తావు-కలదె పరికింప నెందు భూవలయమందు!' అంటూ స్త్రోత్రమాలలందించాడో  కాఫీగత బ్యాచిలరు కవి జీవుడు. 
కాఫీ కాయడం క్రికెట్టాటల్లో బెట్టింగు కాయడమంత సులభం కాదు. పొడి వేసిం తరువాత పాలు పొయ్యాలో..   పాలు  మరిగిం తరువాత పొడి వెయ్యాలో గూగుల్లో చూస్తే గానీ  పాలు పోని జ్ఞాని ప్రతి కొంపకీ కంపల్సరీగా ఒకరుంటారు.  డికాషనుకు ఎంత   ప్రికాషను అవసరమో, పంచదార ఎంత పాళ్లలో పడితే చెక్కర రోగం ముదర పెట్టదో.. అబ్బో., కాఫీ మేకింగుల మీద ‘క్లాసులు పీకింగే’ వృత్తిగా పెట్టుకొని కింగులూ క్వీజులూ అవుతున్న వాళ్లు ఆన్లైన్లలో ఇప్పుడు బోలెడు మంది!     
మా ముసిల్ది మరీ రెచ్చి పోతోంది. కాఫీ కోటా డబుల్ చేసింది. తాను గుండ్రాయిలా తిరుగుతూనే ఉన్నా ఆ పాలూ, పంచదారా, కాఫీ పౌడర్ గట్రా జి ఎస్ టి టాక్సుతో సహా పెరిగిన ధరలకు కొని తట్టుకోలేక పాపం మా డాడీనే తల పట్టుక్కూర్చుంటున్నాడు. అన్నట్లు  తలపోటుక్కూడా డబుల్ స్ట్రాంగు బ్లాక్ కాఫీని మించిన మంచి టానిక్  లేదంటున్నారు డాక్టర్లు! మూలక్కూర్చుని మూలిగే  ముసలాళ్ళ మురిపాలే కాఫీల మిదింతలా పెరిగి పోతుంటే ..  పని పాటలు చేసుకుంటూ బతకి చావాల్సిన  సంసారులం.. ఇహ మన కాఫీ బడ్జెటు కథ స్పెషల్గా  చెప్పేదేవుంది?
 కాఫీల మీద శాస్త్రవేత్తలు కూడా అస్తమానం ఏవో దిక్కుమాలిన ప్రయోగాలు చేస్తుంటారు. ఒక ఇల్లినాయిస్ యూనివర్శిటీ పరిశోధకుడు   కాఫీ తాగితే కేన్సర్ దూరమవుతుందంటాడా? ఆ మర్నాడే.. మరో చికాగో విశ్వవిద్యాలయ బృందం చికోరీ లేని కాఫీ మాత్రమే సేఫని స్టేట్మెంటిచ్చేస్తుంది. అన్ లిమిటెడ్  కాఫీ డ్రింకింగ్   యుట్రిసు మీద స్ట్రెస్సని ఊటా యూనివర్శిటీ వాక్రుచ్చితే.. అదేం లేదు.. పుట్టబోయే కిడ్ ‘విజార్డ్’ అవాలంటే కెఫిన్ కాన్స్టంట్రేడెడ్ కాఫీ కనీసం రోజుకో పది సార్లైనా గొంతులో దిగాల'ని గుయానా యూనివర్శిటీ గగ్గోలు పెదుతుంది.  మగాళ్లకి మెదడులో కణితలు పెరిగి అనుకోని ప్రాణాపాయం జరిగే అవకాశం గత శతాబ్దం కన్నా  అరవై  శాతం అధికమయిందని  అదేందో అర్థం కాని టెర్మినాలజీలో  కాఫీ డ్రింకింగ్ పెరిల్సుని గురించో జర్మనీ విశ్వవిధ్యాలయం బెదిరిస్తే.. తాజా పరిశోధనల్లో- తాజాగా తయారైన కాఫీ తాక్కుండా ముక్కుతో పీల్చినా చాలు మెదడులోని అసిటోన్ ఎంజైమ్స్ ఉద్దీపనం చెంది ఆ రోజంతా ఫీల్ గుడ్ మూడ్ మెయింటైన్ చేసేయచ్చని మన దగ్గరే ఓ హెర్బల్ పరిశోధక సంస్థ  అభయహస్తం ఇచ్చేస్తోంది.    ఆ అర్థం కాని పాడు లెక్కలు అవీ పట్టించుక్కూర్చుంటే ఆ తాగే గుక్కెడు కాఫీ కూడా కాలకూట విషమై రేపు పోయే ప్రాణం ఇవాళే హరీ అనడం ఖాయం. 
ఏడో శతాబ్దం నాటి మత్తు గింజలు ఈ  ఏడు కాఫీ గింజలు! ఎంతలా విశ్వరూపం దాల్చి  ఏడిపిస్తోందీ పాడు లోకాన్ని! ఎక్కడి  ఇథియోపియా.. ఎక్కడి మేరా మహాన్ ఇండియా?  
 ఇస్లామిక్ గావా వైన్- ఈ డెవిల్స్ డ్రింక్!  ఇవాళ అదే  ఇండియా గుడ్ విల్ డ్రింక్! నిషేధించాలనుకున్న క్రైస్తవమే కాఫీ  రుచికి దాసోహమంది! మక్కా యాత్రకని పోయిన బాబూ బుడాన్ సూఫీ  వట్టి చేతుల్తో రావడ మెందుకని ఏ సుమూహూర్తాన ఆ ఏడు గింజలు గిల్లుకొచ్చాడో గానీ.. దాందుంప తెగ.. కన్నడ దత్తాత్రేయ కొండల గాలి తగిలి  నూటేడు  దేశాల నుంచి  ఇప్పుడ అదే మనకు ప్రధాన ఆదాయ వనరైంది!  యూరోపు ‘గుడ్ మార్నింగ్'  మన అరకులోయ  కాఫీతోనే!  ఇండోనేసియా పిల్లి తిని ఆరగించుకొనే  పళ్ళు ఈ కాఫీ గింజలు. ‘చరిత్ర మనకెందుకయ్యా? రుచి ముఖ్యం గానీ!’ అంటూ చిరాకు పడి పోవద్దు. ఓ కప్పు కాఫీ తెప్పించుకోండన్నా! అప్పుడే  చెత్త వాగినా చప్పట్లు కొట్టాలనే అనిపిస్తుంది. దటీజ్  కాఫీస్ మ్యాజిక్!
'జొన్న అన్నమే ఆహారం.. జొన్నలే తప్పన్ సన్నన్నము సున్న సుమీ’ అని  వాపోయాడొకప్పుడు పాపం.. ఆ తిండిపోతు శ్రీనాథుడు. ఇప్పుడతగాడే కనక బతికుండుంటే? 
దేశభక్తి కవిత్వానికి పాలుమాలిన కవులు సైతం పాలు మరగ్గాచిన  కాఫీ ద్రావకం మీద దండకాలు రాయకుండా ఉండలేక పోయారు. అభినవ సరస్వతి పత్రికలో గౌరావఝ్ఝల సీతారామయ్యగారు 'కాఫీతీర్థంతో సమానమైన తీర్థం మరోటి లేనే లేదు పొమ్మం' అంటూ తేల్చేసారు. డెబ్బై ఏళ్ల కిందటే  గృహలక్ష్మిలో పేరు తెలీని తెలివైన కవి ఒకాయన 'అమ్మవార వౌచు నిఖిల జనంబుల/ గృహములందు దాపురించినావు/ నిను భరింపలేము నిను ద్రోయగా లేము' అంటూ  దండకాలు అందుకున్నాడు. 
లీటరు  రేటు వింటుంటే పాలకు బదులుగా వాటరు వాడటం  బెటరు అనిపిస్తోందిప్పుడు. కాఫీ పౌడరు ధర వింటుంటే కాఫీ తాగక ముందే బి. పి పెరిగి పోతోంది. చిటికెడు చక్కర ఇంత గుక్కెడు  నీళ్లల్లో కలుపుకు తాగుదామని ఉన్నా..  ఆ చికోరి రుచి  వలలో చిక్కుకున్న దౌర్భాగ్యానికి కాఫీ చుక్క గొంతులో దిగక పోతే పక్క కూడా దిగ బుధ్ధి కావడం లేదు!   
 తాపీ ధర్మారావుగారోసారి కాఫీపై దండకం చెప్పమంటే పోకూరి కాశీపతిగారు ఆశువుగా  కాఫీ జగన్మోహిని జన్మవృత్తాంతం గూర్చి గురజాడ గిరీశాన్ని మించిన థియరీ కూర్చి వినిపించేసారు. తొల్లి శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి పారిజాతాన్ని తెచ్చి సత్యభామకు ఇచ్చే సందర్భంలో  దారిలో దాని గింజ నేల మీద రాలి  కాఫీ చెట్టుగా మొలిచిందంట! 
'అనుదినమ్మును కాఫియే అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లభించుటె గొప్ప లక్కు' అంటూ లేటెస్టుగా కాఫీ టేస్టును గూర్చి మిథునం  చిత్రం కూడా  జై కొట్టింది.
 ‘కాఫీశ్వరీ! నెస్సుకేఫేశ్వరీ! బ్రూకుబాండేశ్వరీ! గంట గంటా ప్రతీ యింటా ఉప్పొంగవే ఉష్ణ పానీశ్వరీ!’ అంటూ ప్రాథేయ పడ్డం తప్పనిసరి. మరేం చేస్తాం? మనిషిగా పుట్టేం కదా.. గిట్టే దాకా కాఫీలు తాగడం కంపల్సరీ! 

-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- 16, డిసెంబర్, 2017 నాటి  సుత్తి.. మెత్తంగా-  కాలమ్ లో ప్రచురితం)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...