అన్నం పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు ఆ అన్నకర్త సాక్షాత్ విష్ణ్వావతారమే అవాలి గదా! భగవద్గీత పురుషోత్తమ
ప్రాప్తి యోగంలో(15-14)సైతం ఆహారవ్యవహారాల్లో భగవంతుడి ప్రమేయం (అహం వైశ్వానరో
భూత్వా..)
తప్పదన్నట్లు
ధృవపడుతుంది.
అర్జునుడు యుద్ధరంగంమధ్య విషాదయోగంలో పడి కొట్టుమిట్టాడే
వేళా కర్తవ్యబోధ చేసేందుకు ఉద్యుక్తుడైన
భగవంతుడు తిండిగోల మర్చిపోలేదు! వాల్మీకులవారి రామాయణంలోకూడా రావణాసురుడు అంతలావు క్రోధంలోసైతం 'ఇచ్చిన గడువులోగా శయ్యాస్వీకారం చెయ్యకపోతే
వంటవాళ్లచేత వండించుకొని తింటాన'ని సీతమ్మవారిని
బెదిరించాడు!
భోజనానికి ముందో శ్లోకం (బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః).. భోజనాల మధ్యలో మరో
శ్లోకం (త్వదీయం వస్తు గోవింద)..
భోజనానంతరం మరో శ్లోకం(అగస్త్యం వైనతేయం) మన ముందు తరాలకి!మన తాతలకి భజనతో సమానమైన
భోజనవ్యవహారం ఓ భోగకళగా మారింది మన హయాంలో!
భూగోళంలో ఒక్కపాలు నేల. మనం భూచరాలుగానే బతుకుతున్నా
తిండికోసం నీళ్లఅడుగునా, ఆకాశంలోకూడా దేవులాడటం మన తిండియావకు నిదర్శనం. చంద్రమండలంమీదకు
వెళ్ళినా బంగాళాదుంపల్ని ఎలా పండించాలనే
కదా మనం ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నదీ!
ఆకలి లేకుంటే జీవికి ఆరాటమే లేదు. ఆ మాటా
నిజమేననుకోండి!
ఆరాటం ఉండి.. అది
తీరేందుకు చేసేపోరాటమే జీవితం. అందులోనే ఉంది
జీవితసారమంతా! పాతరాతియుగంనాటి మనిషికూడా
రాయిని ఆయుధంగా నూరుకున్నది ఆహారం
సంపాదించుకోడంకోసమే! నిప్పురవ్వను రాజేయడం
నేర్చుకున్నది వేటమాసం..
కాయలు, దుంపలు గట్రా కమ్మంగా
వండుకు తినేందుటందుకే!
వంట ఒక కళగా ఆటవికయుగంనాటినుంచే మనిషివెంట మహాప్రస్థానం
చేస్తూ వస్తోందంటారా ఎవరైనా!
‘సమాజస్వభావం సమ్యగ్దర్శనభాగ్యానికి నోచుకోవాలంటే, ఆచార వ్యవహారాదులతోపాటు ఆహారపద్ధతులూ తెలిసి ఉండాలి!’ అని మల్లంపల్లివారు అభిప్రాయపడ్డారు! ఆ సామాజిక బాధ్యత గుర్తెరిగారు కాబట్టే మన
ప్రాచీనకవులు సందర్భశుద్ధి ఉన్నా, లేకున్నా సందుచూసుకుని మరీ పసందైన విందు భోజనాలు
రకరకాలుగా అందించారు.
మన కడుపులు నింపారు.
ఆత్మకు ఇంపైన భోజనం సత్కృతులకందే ప్రేరణగా అల్లసాని పెద్దన భావించాడు. ముంగండ
అగ్రహారీకుడు పండితరాయలు తెలుగువిస్తరి
ఘుమఘుమల్ని డిల్లీదాకా విస్తరింపచేసాడు. ఆవఠేవ(ఆవకాయ)నుంచి..
ఇంగువ హంగులదాకా దేన్నీ ఓ పట్టు పట్టిందాకా వదిలిపెట్టని
తిండిరంధి వేములవాడ భీమన్నకవిది. బమ్మెరవారి భాగవతంలోని 'బూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో' పద్యం గోపబాలకులు లోకపాలకుడుతో
భోజనోత్సవ పూర్ణోత్సాహాన్ని
కళ్లక్కట్టించే కమ్మని నేతిబూరె! భోజనాది లౌకికాలనుకూడా
మన కవులు ఎంత అలౌకికంగా ఆరాధించారో!
వెల్లుల్లి,
తిలపిష్ఠం అనడమే దోషంగా
భావించే శుద్ధశాకాహారి కదా శ్రీనాథుడు! అయినా
తిరువెంగనాచనే శివభక్తురాలు సిరియాలును తరిగి
నానావిధ పాకాలుగా వండటం
వైనవైనాలుగా వర్ణించాడు మహానుభావుడు! మిరియాలపొడి
చల్లినవి,
సైంధవలవణం కలిపి చేసినవి, ఆవపెట్టి వండినవి,
ఇంగువతో ఘుమఘుమలాడేవి, చింతపండు..
నిమ్మరసం పిసికి చేసినవి, తాజానేతిలో ముంచి తేల్చినవి, లేతకొత్తిమీర
మిళాయింపులతో పరిమళించేవి, కూరగా వండినా సౌష్ఠవం ఏ మాత్రం
చెడనివి..
శివాలయంలో దొంగలా దూరి దాక్కున్న దుండగీడు గుణనిధి కంటబడ్డ
భక్ష్యాలు,
భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు ఇవన్నీ!
‘’కాశీఖండం’లోని ఈ చిన్నిజాబితా
సైతం తిండిపుష్టి దిట్టంగాగల శ్రీనాథ
కవిసార్వభౌముడి పాకశాలనుంచి తయారైన అనుపాకాలే!
'ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. నిలపరా నీ జాతి నిండు
గౌరవము' అన్నారు కదా మన
రాయప్రోలు సుబ్బారావుగారు కూడా! ఏ జాతికైనా దాని తిండి
తిప్పల్ని మించిన నిండు గౌరవం మరేముంటుందిగనక! తెలుగువాడి ఆత్మగౌరవమైతే మరీ ముఖ్యంగా ఏ ఆవకాయ బద్దతోనో.. గోంగూర తొక్కుతోనో ముడిపడి ఉంటుంది. వేటూరివారికి మాగాయవూరుని 'మహత్తరి' అని పొగిడితేగానీ తనివి తీరలేదు మరి! జిహ్వచాపల్యరంగంలో
తెలుగునోటికి పోటీకొచ్చే జాతి భూమ్మీద
ఎందెందు గాలించినా మీకు దొరకదు గాక దొరకదు సుమండీ! ఓ మహాపండితుడు హిమాలయాలను చూసి తన్మయత్వంతో
'అన్నపు రాశుల్లా' ఉన్నాయని నోరెళ్ళ
పెట్టేసాడు.
బహుశా అతగాడు మన తెలుగువాడే అయివుండనోపు!
కారంతో కారం కలిపి కొత్తరుచి సృష్టించగలడు.తెలుగువాడు. పులుపులో పులుపు కలిపి పులకరింతలు పుట్టించనూ గలడు. ఆరు రుచులతో ఆరొందల అరవైఆరు రుచులు సృష్టించి ' ఆహా!
ఏమి రుచి?' అనిపించి
నోరూరించగల మొనగాడు ఇంకెవడు? మన తెలుగువాడే!
'ఆంధ్ర'
లోని అంధ పదం 'అన్నా’నికి పర్యాయ పదంట!(ఆప్టే సంస్కృత నిఘ౦టువు- పు129). జైన,
బౌధ్ధ సాహిత్యాలలో తెలుగువాళ్ళు అంథ శబ్దంతోనే వ్యవహృతులు. నైలునుండి కృష్ణదాకా సాగిన ద్రావిడుల మహావ్యాప్తికి 'పెసలు' పద వ్యుత్పత్తి సాక్ష్యం పలుకుతోంది
ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు చెపుతోంది. చైనాలాంటి తూర్పు దేశాలతో భారతీయ
బౌధ్ధులు సంబంధాలు పంచదారతో మరింత
మధురమయ్యాయని చరిత్రకారుల పరిశీలన. చెరకు తోటల
నీడల్లో చేరి వరిచేలకు పహరా కాస్తూ ఆంధ్రమహిళలు రఘుమహారాజు జీవితగాథని
పాడుకున్నారు..
ఎక్కడో పక్కమహారాష్ట్రంలో ఉన్న కాళిదాసు రాసిన 'రఘువంశం'లోకూడా!
తెలుగులు ఎక్కడ ఉంటే ఘుమఘుమలు అక్కడ ఉంటాయి కాబోలు!
'కూరదినుసుల విజేతే విశ్వవిజేత' అని యూరోపియన్ల
మధ్యయుగాల్లో కనిపెట్టిన సత్యం మనం సాగు ఆరంభించిన తొలిదినాల్లోనే పసిగట్టేశాం. మనగడ్డమీద మిరియాలు, సుగ౦థ ద్రవ్యాలు చవక. మనదగ్గర కొనుక్కొని
వేరే దేశాలకు అమ్ముకొని వ్యాపార
సంస్కృతిని విస్తరించింది మాత్రం యూరోపియన్లే. కాయగూరలకోసం బుడతకీచులు ఓడలనిండా సరుకులతో మన కోస్తాతీరాలవెంట తెగ
తిరుగుతుండేవాళ్ళు. మిరియాలకోసమే కొలంబస్
ఇండియా ప్రస్థానం ప్రారంభించిందంటారు! పచ్చగా, అమాయకంగా కన్పించే పచ్చిమిర్చి ఘాటుని
పాండురంగడిశక్తితో పోల్చేదశకు
పురందరదాసంతటి వైదాంతికులే వెళ్ళారు కదా! ఇహ మన ఆహార చరిత్రను 'మిరపకాయకు ముందు-
తరువాత' గా
విభజించిస్తేమాత్రం తప్పేముంది!
ఒక్క మిరపకాయనే కాదు పన్నెండో శతాబ్ది 'మానసోల్లాస' గ్ర౦థ౦లో మన లడ్డూల ప్రస్తావనా ప్రశస్తంగా
వినిపిస్తుంది. రామాయణ, భారతాలు, ఆయుర్వేద గ్ర౦థాల్లోని మోదకాలు మన లడ్డూలే! తెలుగుశాతవాహన
చక్రవర్తి కథలో 'మోదక'
శబ్ద౦ సృష్టి౦చిన కలకలం అంతా ఇంతా కాదుగదా! బుడతకీచులతో పెంచుకొన్న
వాణిజ్యబంధాలవల్లే బొప్పాయినుంచి
క్యాబేజీ,
క్యాలీఫ్లవర్, బంగాళాదుంపలదాకా
తెలుగునాలుకలకి కొత్తరుచులు
వంటబట్టాయి. మిరియాన్ని ఏమరచి మిర్చిని
మరిగి ఆ కారాలకి తగ్గట్టుగా ఉప్పులు, పులుపులు,
తీపుల కలగలుపులతో
కొత్తతరహా వంటలకు తెరలేపిన ఘనుడు మన తెలుగువాడేనని మనం సగర్వంగా
చెప్పుకోవచ్చూ!
పగిలిన కుండపెంకుమీదైనా
సరే కమ్మని అట్టు పోసేయగల దిట్టతనమండీ మన
తెలుగు చేతిది!
'మేలింపు చవి గుల్కు తాలింపు వంకాయ యూర్పులు గొనియాడ నేర్పు గలదే..' అంటూ 'రాజవాహన విజయం'
కావ్యంలో కాకుమాని మూర్తికవి నోరూరించాడు! ‘శుకసప్తతి'
కావ్యంలో కదిరీపతి ‘‘ఒఱపు దనరార జేపల యూర్పుగూర యిడిన..'అంటూ చేపలవూర్పు
గురించి బులిపించాడు!
దమయంతీ స్వయంవరానికని విచ్చేసిన అతిథులకోసం వడ్డించిన డెబ్భైరకాల వంటకాలనూ విపులంగా వర్ణించాడు.. శిష్యసమేతంగా విచ్చేసిన వ్యాసమహర్షులవారికి
కాశీవిశాలాక్షి చేతులమీదుగా శబ్దరత్నాకరానికైనా అర్థంకాని పలు పదార్థాలు తినిపించాడు
శ్రీనాథుడు!
శ్రీనాథుడి భోజన రాసిక్యతను గూర్చి బోలెడన్ని చాటువులు! రామకృష్ణకవి ‘పాండురంగ మాహాత్మ్యం’లో కపటబ్రహ్మచారిగా వచ్చిన పరంధాముడికి పతివ్రతా శిరోమణి సుశీల ఇచ్చిన
ఆతిథ్యంలోని ఖాద్యవిశేషాలతో అయితే ఏకంగా ఓ
పరిశోధనా గ్రందమే వెలువరించేసెయ్యవచ్చు. అయ్యలరాజు
నారాయణామాత్యుడు తననాటి ప్రజల జీవనస్థితిగతుల వివరాలతో రాసిన ‘హ౦సవి౦శతి’-
వ్యాపారి విష్ణుదాసుడి విదేశీపర్యటనలో వె౦టతీ సుకువెళ్ళిన పూరీలు, కూడుపరిగెలు, తెలుపరిగెల్లాంటి డెబ్భయిరకాల
పిండివంటల జాబితాను ఏకరువు పెడుతుంది.
త్యాగరాజస్వామివారికి పుస్తికాయల ఒరుగుపులుసు
'వర్తకొలంబు'
మహాప్రాణం. వస్త్రంమీద పుస్తికాయలు ఎండబెట్టుకొనేవేళ మనసులో
కృతులు మహా పసందుగా అల్లుకుంటాయిట! ఎందరో
మహానుభావులు!
అందరికీ వందనాలు! అచ్చతెలుగు
అప్పచ్చులరుచి అచ్చంగా అనుభవంలో
మిగిలిపోవాలంటే అన్నమయ్య కీర్తనలొక పుడిసెడు పుక్కిలి పడితే సరిపోదా! ‘మధుర తిరుమలేంద్రుడు-
మంచి బహుమానమొసగి/యెదుట కూర్చుండమని – ఎన్నికలిమ్మనెనే/యిదిగో రెండువేల పదములు - ఇపుడెంచుకొమ్మనగా?/చదురు మీదనే యున్న సామికి - సంతోషమింతింత గాదె?’ అని మన మొవ్వా వరదయ్య(క్షేత్రయ్య)గారి జావళీలు!
జిలేబీలరుచిని
తలపించే మధురరసాలు నోట ఊరటం లేదూ!
'శనగపిండి వంటకం ప్రియురాలి సరసమైతే
అల్పాహారం ఇడ్లీ ఇంటావిడ అనురాగం' అంటారు డాక్టర్ సినారె. ‘జ్ఞానపీఠ’ గ్రహీతయితే మాత్రం తిండిరంధి ఉండకూడదా
ఏంది! శతావధానులు తిరుపతి వేంకటకవులయితే.. పకోడీ
చేసేవిధానాన్ని శతవిధాల వండి చూపెట్టారు పలు అవధానప్రదర్శన పద్యాల్లో. తెలుగింటి విందులో వడ్డించిన విస్తరి మంగళగౌరీ గళసీమ నలంకరించిన నవరత్నఖచితహారంలా రంగులీనుతుంటుందని ఓ సౌందర్యతుంటరి అభివర్ణన!
అరవైనాలుగు రకాల వరిధాన్యాలు తెలుగు రైతు పండించగలడు. అన్నింటినీ వండుకుతిని హాయిగా హరాయించుకోనూ గలడు! తెలుగురుచుల్లోని వైవిధ్యం తెలియాలంటే
తెలుగు సాహిత్యమూ రవ్వంత
వంటబట్టాలన్నారు పెద్దలు మరి! పెద్దలమాట చద్దిమూట!
'ఇప్పుడీ తిండిగోలంతా ఎదుకండీ?' అని కదూ మీ సందేహం.
ఈ ఫిబ్రవరి ఒకటికి కేంద్రం బడ్జెట్ ప్రవేశ బెట్టబోతోంది కదండీ! ఆర్థిక శాఖామాత్ర్యులు అప్పుడే 'హల్వా' వండటం మొదలెట్టేసినట్లు వార్త. బడ్జెట్లో ఎన్ని తీపి..
చేదు కబుర్లుంటాయో ? మన తెలుగు తిండి
మాత్రం నూటికి నూరు పాళ్లు షడ్రసోపేతంగా
ఉండి గ్యారంటీగా నోరూరిస్తుంటుందండోయ్! తమరు కడుపారా తిని తృప్తిగా
త్రేన్చేస్తే వండినందుకు మాకు అదే ఓ పెద్ద 'తుత్తి'.
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- 27-01-2018 నాటి సుత్తి.. మెత్తంగా కాలమ్)
No comments:
Post a Comment