Saturday, January 13, 2018

రా.. జా.. కీయాలు- సరదా గల్పిక ఆంధ్రప్రభ -సుత్తి మెత్తంగా-‘ఈ రాజకీయాలు అంటే ఏంటో మూడు ముక్కల్లో  చెప్పన్నా.. అర్జంటు!'
'అంతర్జంటా! అయితే రెండు ముక్కల్లోనే ముగిస్తా! 'రాఁ' అంటే 'వెలకమ్'. 'జాఁ' హిందీ ముక్క. 'వెల్! గెట్ అవుట్'అని రా అర్థం. ఎప్పుడు రమ్మని పిలవాలో.. ఎప్పుడు పొమ్మని మెడ పట్టి బైటిగ్గెంటెయ్యాలో తెలిసుండటమే రాజకీయమంటే. ఎయిటీ ఫోర్ లేక్స్ జీవాలు. సిక్స్టీ ఫోర్  టైప్ ఆర్ట్స్! ఏ జీవీ కదిలించని డొంక..  ఏ ఆర్టుకీ చెందని శాఖ.. ఈ రాజకీయం. ఇదో అబ్రహ్మ పదార్థమనుకోర అబ్బిగా!’  'బ్రహ్మపదార్థం తెలుసు. అబ్రహాం పదానికీ అర్థం తెలుసు. కొత్తగా ఈ 'అ'బ్రహ్మపదార్థం’ ఏంటన్నా?’ 
'బ్రహ్మ తయారు చేయంది  అబ్రహ్మమే కదరా అయేది వెర్రి నాగన్నా! పది దినాల పాటు అలా భూమి దాక వెళ్ళి నాలుగు జీవాలతో కాస్తింత 'మనిషి'గా మెలిగి రమ్మని బ్రహ్మయ్య ఇక్కడికి పంపిస్తే మనమేం చేస్తున్నాం? సింహాలమనుకొని గర్జిస్తున్నాం. నక్కలని వెక్కిరిస్తూనే వాటిని మించి జిత్తులు ప్రదర్శిస్తున్నాం. కుక్కలు కూడా మనలా  తోకలాడించవు. ఇహ కాకిగోలంటావా? కాకులకే మా చెడ్డ చిర్రాకు పుట్టించే కూతలు కూస్తున్నాం అస్తమానం!  కప్పలు కూడా మనంత గొప్పగా తక్కెళ్లలో గెంతటం లేదు! పిల్లులకైనా ఎప్పుడైనా కాస్త సిల్లీ అనిపిస్తుందేమో ఆ గోడదూకుళ్లకూ వాటికీ. వాటం చూసి గోడ దూకడంలో పోటీలు గాని  పెడితే మనమే వాటి రికార్డులన్నీ గ్యారంటీగా బద్దలు కొట్టేస్తాం.  ఛీఁ.. ఛీఁ.. చివరికి గద్దలు, రాబందులకు  మించి  దొరికింది దొరికినట్లే పీక్కుతినేందుక్కూడా  మనం సిద్ధం. కోతీ కొండముచ్చుల్లా కొమ్మలుచ్చుకొని గంతులేసేందు క్కూడా మనలో కొందరు పెద్దలు   సిగ్గు పడ్డం లేదు! పై పెచ్చు పెద్ద ఘనకార్యాలేవో సాధించేస్తున్నట్లు 'పెద్దమనుషులు' ‘గౌరవనీయులు’ ‘ఆత్మబంధువులు’ అంటూ పేద్ద పేద్ద  బిరుదులు బ్యాడ్జీలు గుండెలకు గుచ్చేసుకుంటున్నాం. సరే! రాజకీయాలన్నాక ఇవన్నీ ఓ.కే నేలే గానీ.. నీకే ఇంత పరగడుపునే ఈశ్వరుడికైనా అంతుపట్టని ఈ  రాజకీయాల మీద ఇంత లావు  శ్రద్ధెందుకు పుట్టుకొచ్చినట్లో? ఎవరి పుట్టైనా ముంచడానిగ్గాని ముందస్తు ప్రణాళికలేవన్నా..’
‘ఛఁ..ఛఁ!  నాకంత సీనుందా? నీకు తెలవదా వెంకన్నా?  మా తింగరోడు చాలడా కొంప కొల్లేరు చేసెయ్యడానికి!  రాత్రి బట్టీ వాడు నిద్దట్లో కూడా ఒహటే పలవరింతలు! 'ఇదిగో వస్తన్నా! ఇప్పుడే వస్తన్నా!' అంటూ తెగ కలవరించి చంపేస్తున్నాడన్నా! తెల్లారి లేచి పాచి పళ్లైనా తోమకుండా అద్దం ముందు చేరి ఏంటేంటో  కూస్తున్నాడన్నా! అన్నీ అర్థమయి చస్తాయా మా మొద్దు బుర్రలకీ! ఆ దండాలేంటి.. దస్కాలేంటి? వేళ్లు, చేతులూ అట్లా గాల్లో ఊరికే ఊపేసెయ్యడాలు.. ఉండుండి ముద్దుల మీద ముద్దులు అద్దం మీదకు విసిరేయడాలు!  పండగ రోజుల్లో మాకీ పాడు బెడదేంటన్నా కొంపలో?  మా ముత్తాత  జమానా  మురికి  ఖద్దరు జుబ్బా.. పంచె.. పై కండువా బైటికి తీయించి  చలువ చేయించిండు! వంటికి తగిలించుకొని ఏడకో ఉరుకుతా వుంటే నేనే గడప కడ్డం పడ్డా! 'ఏడకిరా?’అని గట్టిగా గదమాయిస్తే 'ఇంకేడకీ? రాజకీయాల్లోకి నాయనా! అదిగో మా అధినేత ‘రా! రా! రమ్మ’ని పిలుస్తున్నాడు’ అంటా నన్నో మూలకు తొక్కేసి పోతున్నాడన్నా! వీడిగ్గానీ ఏ దిల్లీ గాలో ధూళో సోకలేదు కదా! మా ఇంటా వంటా లేవీ రాజకీయాలు. అరక తీసి పొలానికి పోవడమే మాకు తెలుసు! బుడంకాయలకి బుక్కు బండలేసుకొని బళ్లకు పోవడమే తెలుసు. ఆడంగులకట్లా  చెరువు గట్ల  దాకా  పోయి నీళ్లు చేదుకొచ్చుకోవడం తెలుసు,  పనుల్లేనప్పుడు అట్లా  పక్కోళ్ళ ఇళ్లూ.. చావిళ్లూ చుట్టబెట్టి రావడం తెలుసు కానీ..  ఈ రాజకీయాల్లోకి వెళ్లిపోవడమేంటన్నా కొత్తగా వింటన్నా!’ 
'అర్థమయిందబ్బీ! మొన్నటి  గుజరాత్ ఎన్నికల్లో ఆ ముగ్గురు కుర్రాళ్లెవరో గానీ పెద్దాయన్తోనే పేకాటాడేసుకున్నారు కదా! ఆ దుమారం దుమ్మే మీ తింగరోడి కంట్లోనూ పడ్డట్లుంది.  పోతే పోనియ్యరాదే! రాజకీయాల్లోకే కదా ఆ పొయ్యేదీ?  సన్యాసుల్లో కలిసేందుకేమన్నా పోతన్నాడా? ఎవురికైనా నాలుగు రాళ్లు గడించుకోవాలనే కదా ఉంటుందీ వంట్లో ఓపికున్నంతా కాలం?’ 
'గిట్టనోడి మీద  రాళ్లేయడమంత సులువా అన్నా రాజకీయాల్లో దూరి రాళ్లూ  రత్నాలూ గడించడం? చక్కంగా చదువుకొని..'
'.. సతికి సతికీ ఎంత బుర్రలరగ తీసినా ఏమొస్తదిలేరా నాగన్నా? ఎంత  సర్కారు  కొలువుల్లంకించుకున్నా మిగిలేది గుండుసున్నా! ఏ సదువూ సంధ్యల్లేకపోయినా మంత్రులయినోళ్ళు  ఇంత మంది. మంద బుద్ధివి. నీకా మతలబులన్నీ అందేవి కాదు కానీ.. తింగరోడంటున్నావు కదా నీ కొడుకుని? మరి తిన్నగా రాజకీయాల్లోకే దూరి పోనియ్యరాదా! కేజ్రీవాలే దిల్లీకి సియమ్మయిండు.  ఏమో.. జనం తలరాతలు బా లేక పోతే  మీ పిచ్చోడు కూడా  రేప్పొద్దున ఏ ముఖ్యమైన పదవికో ఎక్కి రావచ్చూ!’ 
'ఎక్కిరావడానికి ఇదేవన్నా దొడ్డిగోడకు చేరేసిన చెక్కనిచ్చనా అన్నా? రాజకీయం వైకుంఠపాళి అని నువ్వే ఓ పాలి అనుంటివి. ఎన్ని పాములు కనికరిస్తే ఆ  చివరి గడికి చేరేదీ! ఎవరెవరి వెనకాలో చేరి గోతులు తీస్తుండాలి! ఎకరాలు అమ్మినా నికరంగా టిక్కెట్టు దొరుకునా? సి- ఫారము దక్కినా  సిఫార్సులు గెలిపించునా? గెలుపుకి ఎవ్వరూ  గ్యారంటీ ఇవ్వరు. గెలుచుకు వచ్చినా ఐదేళ్ల  వారంట్రీ అసలే ఉండదు.  ప్రతీ రోజూ ప్రతినిధుల కతలు ఎన్ని  వింటున్నాం? నాలుగేళ్లు దాటినా నిఖార్సుగా గెలిచిండో లేడో,,  చిట్ట చివరి న్యాయస్థానం కూడా చటుక్కని తేల్చని పరిస్థితి! ఈ పాడు పాలిటిక్సులసలు  మా వంటికి పడేవి కాదు గానీ.. మా తిక్కసన్నాసిని నీ దగ్గరకే పంపిస్తా! ఆ పిచ్చోడి ధ్యాస కాస్త పని మీదకు మళ్లించన్నా! సర్కారు పోస్టులకు ..’ 
‘ఆ సర్కారు పోస్టులన్నీ శుధ్ధ వేస్టురా నాగన్నా! ఆ అరవదేశం చూసన్నా తెలివి తెచ్చుకోవేంటన్నా! ముఖ్య కార్యదర్శంటే ఎంతటి ముఖ్యమైన పదవి? అతగాడి మీదకే ఆదాయప్పన్ను పిశాచాల దాడి! అదే  చోట.. మరి   ఆ రాజా.. కనిమొళమ్మల వైభోగం చూడు! లక్షల కోట్లలో జరిగింది కుంభకోణం. అయినా రాజా.. రాణీల్లా   లక్షణంగా తిరుగుతున్నార్రా రాజకీయాలల్ల! పాలిటిక్సు పవరేంటో నీకేరా వంటపట్టటంలా! గొడ్లు తినే గడ్డి బొక్కినా  ఏళ్ల తరబడి ఎవరూ అడగరు రాజకీయాల్లో.  తలరాత తిరగబడి ఎవుడో తిరగదోడినా తప్పుకు పడే  శిక్ష  ముత్తెమంత! మానవీయకోణం అంటూ లా పాయింటు ఒకటెప్పుడూ రాజకీయాలోళ్ల  సాయానికి సిద్ధంగా ఉంటుందన్నా. ఆ లల్లూ ప్రసాదు భాయీని చూడరాదా.. పాలిటిక్సంటే భయం పోద్ది.  ఓపెన్ జైలు.. అటాచ్డ్ బాత్రూం, సింగిల్ వంటిల్లు, పెళ్లాం కూడా వచ్చి పోతుండొచ్చు బుద్ధి పుట్టినప్పుడల్లా! పిల్లాజెల్లాకీ సలహాలవీ ఇస్తుండొచ్చు. పక్కనే కూర్చో బెట్టేసుకొని ఎవురెవరి కుర్చీల కెప్పుడు ఎట్లా ముప్పందం తేవాలో ముచ్చట్లలా చెప్పుకోవచ్చు. చక్రం తిప్పే ఛాన్సు లేక  పెద్దాయనకి పొద్దు పోకపోతే.. సొంత కొష్ఠం నుంచే ఎద్దులు.. ఆవులూ.. దున్నలూ.. పోతులూ నేరుగా జైలుకే డజన్ల కొద్దీ తరలొచ్చాయన్నా! ఆ వైభోగమంతా చూసే మీ పిల్లాడికి పాలటిక్సు మీదకి గాలి మళ్లినట్లుంది. శభాషో!'
'తెలివి తక్కువ కుంక. నెగ్గుకు రాగలాడా అని శంక!'
'తెలివి బ్రహ్మపదార్థం. రాజకీయం అబ్రహ్మ పదార్థం. రెండింటికీ ముడి పెట్టి కంగారు పెట్టవాక! డొల్లు బుర్ర డొనాల్డే అమరికా దుమ్ము లేపేస్తున్నాడన్నా! కాకపోతే కాస్త మంచీ మర్యాదగా మెలిగే చాదస్తం తగ్గించుకోవాల. అవసరం పడితే కన్నీళ్లు కుండల కొద్దీ కార్చేందుకు సిద్ధపడాల! బోర విరుచుకొని నడిచే దెప్పుడో.. బొక్కబోర్లా పడ్డట్లు నటించాల్సింది ఎప్పుడో ఆ టైమింగు అదీ బాగా ప్రాక్టీసు చేసుకొనుండాల! గుండులాగా ఆరోగ్యం ఉండుగాక.. గుండెనొప్పి, హై బిపి, లో షుగరు, అబ్నార్మల్ లెవెల్లో అల్జీమర్స్, ఫిట్సూ గట్రా  నటించడం బాగా వచ్చుండాలి. ఖర్మకొద్దీ ఏ  సీసీ కెమేరాలకో బుద్ధి గడ్డి తింటూ పట్టు పడిపోవచ్చు. కేసులూ తప్పక పోవచ్చు. ధర్మాసనాలు సులువుగా బెయిళ్లిచ్చే అన్ని అడ్డదారులూ పిండి కొట్టినట్లు  ప్రాక్టీసు చేసుండమను ముందు. ఆ తరువాతే రాజకీయాల్లోకి దూకడం సేఫని నా మాటగా చెప్పన్నా! పిలగాడు  తింగరోడేనని నువ్వే అంటుంటివి.  బంగారమంటి భవిష్యత్తు  గ్యారంటీ! బెంగెట్టుకోవాకా వెర్రి నాగన్నా!  ముందు ఇంటికి లగెత్తుకెళ్లు! బిడాయించిన గది తలుపులు బేగి తీయించు. లేకుంటే మణిపూసలాంటి మరో యువనేతను లోకానికి కాకుండా చేసిన పాపం ముందు నీకే చుట్టుకుంటుందబ్బీ!’
‘!!!’
‘ఆఁ.. అన్నట్లు నీ మనవడిక్కూడా నా అడ్వాన్సు అభినందనలు చెప్పు నాగన్నా! వచ్చే తరానికి వాడేగదా మీ అబ్బాయికి దక్కబోయే కుర్చీకి చచ్చినట్లయ్యే వారసుడు!'
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ దినపత్రిక- సుత్తి మెత్తంగా కాలమ్-13-01-2018 -ప్రచురితం)