Monday, January 29, 2018

బాపూజీ.. నీ చల్లని నవ్వే మా కివ్వు! - ఆంధ్రప్రభ వ్యాసం



మహాత్మా గాంధీ నిర్యాణంపై ఒక వ్యాసాన్ని రాయమని నన్నడిగినప్పుడు నాకుగా నేను వేసుకున్న ప్రశ్న ఇది. రాయడానికి కూర్చున్న ప్పుడు దానికి న్యాయం చేయగలనా అనిపించింది. నేనొక రేడియో వ్యాఖ్యాతని. గుండెలు పగిలిపోయిన ఆఖరు క్షణాల్నీ, బాపూజీ అంతిమ యాత్రనీ ఏమని వర్ణించాలి? ఏ విధంగా నా కలం కదులుతుంది? నాకు మాత్రం ఆ రాత్రి సుదీర్ఘంగా అనిపించింది. కాళరాత్రిని తలపించింది. బాధ, విషాదం పొంగిపొర్లుకొచ్చాయి. మాటలలో వర్ణించలేని భావన మెదులాడింది. కాలం అన్నింటికీ మందు. క్రమేపీ బాధ తగ్గుముఖం పడుతుంది. కొన్ని దృశ్యాలు నా మెదడులో నిక్షిప్తమైపోయాయి. ఆ దృశ్యాల గురించే నేనిప్పుడు రాయబోయేది.





ఆరోజు ఉదయం 6గంటలు. మహాత్ముని పార్థివ దేహాన్ని ఉంచిన బిర్లా హౌస్‌కు వెళ్ళాను. బాపూజీ అంతిమ సంస్కారం నిర్వహించే రోజది. నేను వెళ్ళేసరికే పెద్ద సంఖ్యలో ప్రజలు బరువెక్కిన గుండెలతో వరుసలో నిలబడి ఉన్నారు. గత స్మృతులను నెమరువేసుకుంటూ కనిపిం చారు. నన్ను
ఒక ప్రత్యేక ద్వారం ద్వారా గాంధీ మృతదేహమున్న చోటకు తీసుకెళ్ళారు. విశాలమైన ఆయన ఛాతిని నిర్దయగా గాయపరిచిన తూటాల గుర్తులు కనిపించాయి. అవి ద్వేషానికీ, పిచ్చి పనికీ పరాకాష్టగా కనిపించాయి. బాపూజీ ముఖంలోకి చూశా. ఎంత అద్భుతమైన ముఖమది. మృత్యు పరిష్వంగంలో చేరిపోయింది. ఆయన అభిమానుల వదనాలు దీనంగా మారిపోయాయి. ఎగురుతున్న గులాబీ రేకుల మధ్యలో నుంచి కనిపిస్తున్న మహాత్ముని వదనం నా నోటి నుంచి ధారాళంగా పదాల వెల్లువను సృష్టించింది. బాల్యంలో నేను చదువుకున్న ఏసు క్రీస్తు బోధనలలో ఒక వాక్యం గుర్తుకొచ్చింది. ఓ తండ్రీ వారిని మన్నించు. వారేం చేస్తున్నారో వారికే తెలియదు శాశ్వత నిద్రలో ఉన్న మహాత్ముని పెదవులు కూడా అలాగే అన్నట్లు నాకనిపించింది. బాపూజీ మన్నించడానికి పెట్టింది పేరు. ఇంతవరకూ నేనలాంటి మనీషిని చూడలేదు. అదే సమయంలో నా భుజంపై ఓ చేయి పడింది. వెనక్కి చూస్తే ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ. ఆయన కళ్ళలోనూ అదే రకమైన అనుభూతి కనిపించింది. అది కూడా నేను మరిచిపోలేను.

గులాబి రేకులతో అంతిమ వీడ్కోలు
మహాత్ముని అంత్యక్రియల ఊరేగింపులో రేడియో వాహనం మెల్లిగా నడుస్తోంది. క్వీన్స్‌వే, కింగ్స్‌వే, హర్డింగే అవెన్యూ, బీటా రోడ్‌..మీదుగా రాజ్‌ఘాట్‌కు వాహనం చేరాలి. మా వెనుకే మహాత్ముని పార్థివదేహాన్ని ఉంచిన ట్రాలీ కదులుతోంది. ప్రజలంతా చూసేలా దేహాన్ని ఉంచారు. పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, దేవదాస్‌ గాంధీ, సర్దార్‌ బల్‌దేవ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ నిలబడి ఉన్నారు. లక్షలాదిమంది గాంధీ మహాత్మునికి ఇష్టమైన శ్లోకాలను చదువుతున్నారు. ఆ సమయంలో చెమర్చని కన్ను నాకు కనిపించలేదు. మరణానికి రెండు నెలల ముందు బహిరంగ సభలో ప్రసంగించిన జిల్లా జైలు వద్దకు యాత్ర చేరింది. జైలు శిక్ష అనుభవిస్తున్న వారినుద్దేశించి బాపూజీ అప్పుడు ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని నేనూ విన్నాను. ప్రేమాభిమానాలను వర్ణిస్తూ ఆయన ప్రసంగం సాగింది. సరిగ్గా అదే రోడ్డు మీదుగా యాత్ర సాగడం యాదృచ్ఛికం. గాంధీ భౌతిక కాయంపై స్వర్గం నుంచి పూల రేకులను వర్షించినట్లుగా ఉంది. యాత్రలో పాల్గొన్న ప్రజలు గుప్పెట్లో గులాబీలను తీసుకుని ఆకాశంలోకి విసురుతున్నారు. గాంధీజీ అమర్‌ రహే అంటూ నినదిం చారు. రోడ్డుకిరు వైపులా ఉన్న భవనా లపై నుంచి పూలను జల్లుతూ గాంధీకి జై అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. యాత్ర అక్కడ కొద్ది నిముషాలపాటు నిలిచింది. గాంధీజీని కడసారి చూసుకునేందుకు ప్రజలు ముందుకు తోసుకొచ్చారు. మా రేడియో వ్యాన్‌ను కూడా లాగేశారు. దుఖం తాండవిస్తున్న వదనాలు గాంధీజి మరణాన్ని జీర్ణించుకోలే మంటున్నాయి. ఓ మహిళ.. ఇది నిజం కాదు.. రేపు ప్రార్థనల సమయానికి బాపూజీ తిరిగొస్తారంటకూ భోరుమంది. ఎక్కడో తప్పు జరిగిందని అంటోంది. ఆమెలో ఆమె మాట్లాడుకుంటోందని నాకర్థమైంది. తనను తాను ఆమె అలా సంబాళించుకుంటోంది. ఆమె పక్కనే ఓ భిక్షువున్నాడు. అతడి కళ్ళు ఏడ్చిఏడ్చి ఉబ్బిపోయాయి. ఆ పక్కనే చక్కని దుస్తులు ధరించి ఉన్న మహిళ పరిస్థితి సైతం అదే. ధనిక, పేద లేకుండా దేశం యావత్తూ కుమిలిపోయిన క్షణాలవి. ఒక మరణం పేద, ధనికులను ఒకచోట చేర్చింది.. ఎంత ఆశ్చర్యం. గాంధీజీ భారత దేశమంతటా నిండిపోయారు. ఆయన సాధారణ తత్వం ప్రపంచంలోని అన్ని హృదయాలనూ గెలుచు కుంది. మా వ్యాను ముందుకు కదులుతుంటే ఓ చిన్నారి తన తల్లిని అడిగిన ప్రశ్న నా చెవిన పడింది. అమ్మా! గాంధీజి నిజంగా, శాశ్వతంగా వెళ్ళిపోయారా! అని. అసలు తిరిగి రారా అని కూడా ప్రశ్నించింది. తల్లి చెప్పిన సమాధానం గుర్రపు డెక్కల చప్పుడులో కలిసిపోయింది. బాపూజీ అంత్యక్రియలకు హాజరైన గుర్రాలు సైతం విచారంగా నడుస్తున్నట్లే అనిపించింది.
నిమజ్జన యాత్రలోనూ కన్నీటి ధారలు

యాత్ర రాజ్‌ ఘాట్‌కు చేరడానికి 5 నిముషాల ముందే నేను అక్కడికి చేరుకున్నాను. మా రెండో వాహనం
అంత్యక్రియల వేదికకు 30 అడుగుల దూరంలో నిలిచి ఉంది. అక్కడికి చేరిన ప్రజలంతా నాకు కనిపించేందుకు నేను వాహనంపైకి ఎక్కి నిలబడ్డాను. ప్రజలకు ఎటువంటి ప్రమాదమూ జరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాట్లు నా దృష్టిని ఆకర్షించాయి. రక్షణ సిబ్బంది సాసర్‌ ఆకారంలో భుజంభుజం కలిసి రక్షణగా నిలుచున్న తరుణంలో చందనపు చెక్కలతో రూపొందించిన చితినుంచి తొలి జ్వాల నింగికెగిసిన తరుణంలోనే సూర్యభగవానుడు అస్తమించడం ఆరంభమైంది. అదే సమయంలో ప్రజల నుంచి పెద్ద నిట్టూర్పు కూడా ఆకాశానికెగిసింది. రాజ్‌ఘాట్‌పై ఒక తుపాను విరుచుకుపడిన తీరును తలపించింది. అడ్డుగా కట్టిన బ్యారికేడ్లను, తాళ్ళనూ, తీగలను తెంచుకుంటూ ఆడా, మగ తేడా లేకుండా చితిమంటలను చూసేందుకు బాధాతప్త హృదయాలతో ముందుకు తోసుకొచ్చారు. చందనపు చితి చుట్టూ చేరారు. వారి శోకంతో పాటూ చితిమంటలు ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి. చందనపు పరిమళం ఆ ప్రాంతాన్ని ఆవరించింది. గవర్నర్లు, రాయబారులు, క్యాబినెట్‌ మంత్రులు.. యమునా నదీ జలాలతో పవిత్రమైన, హరితహారంలా ఉన్న ప్రాంతంలో ఈ దృశ్యాలకు సాక్ష్యాలుగా నిలిచారు. ఈ సన్నివేశాలను చూసిన నా పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్న ఆకులా మారిపోయింది. మహాత్ముని పార్థివ దేహాన్ని ఆబగా కబళిస్తున్న చితిమంటల ఎత్తు మరింత పెరుగుతుండగా.. ఒక పక్క నుంచి చీకటి చుట్టుముట్టేసింది. లక్షలాదిమంది ఇళ్ళకు తిరుగు ముఖం పట్టినప్పుడు వారి కాలి నుంచి లేచిన ధూళి ఆ ప్రాంతాన్ని ఆవరించింది. జాతి పిత లేకుండానే ఇక తమ ప్రయాణం కొనసాగించవలసి ఉంటుందని వారికి అప్పటికి అర్థమైంది. ఆయన ప్రేమ లేదనీ అవగతమైంది. చితిమంటల్లో వారు కడసారి బాపూజీ చిరునవ్వుల్ని చూసుకున్నారు. సోదరీ, సోదరుల్లారా అంటూ ఆయన చేసే సంబోధనలను ఆ చిటపటల్లో విన్నారు. తుచ్ఛమైన ఈ ప్రపంచాన్ని వీడిన బాపూజీకి గుడ్‌బై చెప్పారు. అసత్యం, హింసలతో కూడిన ప్రపంచంలో జన్మించిన గాంధీ సత్యం, అహింసలతో కూడిన తనదైన ప్రపంచాన్ని నిర్మించారు. రాజ్‌ఘాట్‌నుంచి హృదయభారంతో వెనుదిరుగుతున్న ప్రజల శిరస్సులపైనుంచి చితిమంటలను గమనించిన నాకు గొంతులో ఏదో అడ్డం పడినట్టనిపించింది. మింగడానికి కష్టమైంది. ఆ రోజంతా అలాగే ఉంది. అలా అడ్డం పడిందేమిటో? లక్షలాదిమంది బరువెక్కిన గుండెలతో తిరుగుముఖం పడుతుండగా, వెండిరంగులో నక్షత్రాలు మెరుస్తూ, ప్రేమ, సత్యం, అహింసలకు ప్రతిరూపమైన బాపూజీకి స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపించింది.
వ్యాఖ్యానం పూర్తయిన తరవాత నేను కొద్దిగంటల పాటు వ్యాన్‌పైనే కూర్చుండిపోయాను. ప్రజలంతా వెళ్ళేవరకూ అలాగే ఉండిపోయాను. మూర్ఛిల్లిన ఓ మహిళను వ్యానుపైకి చేర్చారు. ఒక బాలుడు, బాలికను కూడా అక్కడికి చేర్చారు.
ఆ జనప్రవాహంలో ఒక చేయి వ్యాను పైభాగాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపించింది. చూస్తే.. అది ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ. వెంటనే చేయి అందించి, ఆయనను పైకి లాగాను. గవర్నర్‌ జనరల్‌ని చూశారా అని ఆయన నన్ను ప్రశ్నించారు. ఆయన అరగంట ముందే ఇక్కడినుంచి వెళ్ళిపోయారని బదులిచ్చాను. సర్దార్‌ పటేల్‌??? ఆయన కూడా కొద్ది నిముషాల ముందు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆ ప్రజా సమూహంలో కలిసి వచ్చిన స్నేహితులై వేరైపోయారు. ప్రధానిని చూసిన ప్రజలు వ్యాను చుట్టూ చేరారు. ఆయనేమైనా మాట్లాడతారేమోనని చూశారు. ఆ సమయంలో నా మదిలో ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది. ఒక అత్యద్భుతమైన వ్యక్తి దగ్గరగా ఉన్నానన్నదే ఆ యోచన. ఒక పక్కన జాతిపిత దేహం అగ్నికి ఆహుతవుతుంటే.. భారత మాత పుత్రుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, స్వాతంత్య్రమనే దీపశిఖను సజీవంగా ఉంచడానికి జాతికి తనను తాను అంకితం చేసుకున్నారు. మరుసటి రోజు 2 గంటలకు నేను ఇల్లు చేరాను. తిరిగి రాజ్‌ఘాట్‌కు వెళ్ళేసరికి అక్కడ చితినుంచి పొగలొస్తున్నాయి. ప్రజలు అదృశ్యమయ్యారు. దుమ్మూ, ధూళీ సర్దుకున్నాయి. ఒక గార్డును అక్కడుంచారు. ఒక్కసారి రాజ్‌ఘాట్‌వైపు చూశాను. మొత్తం దృశ్యాలను గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ చీకటిలో తెల్లటి ఖాదీ వస్త్రాన్ని ధరించిన మచ్చలేని మహనీయుడు నా మస్తిష్కంలో ఆవిష్కృతమయ్యాడు. దృఢనిశ్చయంతో కూడిన దృక్కులతో ఆయన కనిపించారు. ప్రజల శిరసుల పైనుంచి ఆయన చూస్తున్నారు.
ఫిబ్రవరి 11వ తేదీసమయం తెల్లవారు జామున నాలుగున్నర గంటలు..నేను గ్రీన్‌ అస్తి స్పెషల్‌ కంపార్ట్‌ మెంట్‌ ఎదురుగా నిలుచున్నాను.ఆ బోగీలో గాంధీజీ అస్తికలు ఉంచారు. అందులో అన్నీ మూడవ తరగతి బోగీలే. గాంధీజీ ఎప్పుడూ మూడవ తరగతిలోనే ప్రయాణం చేసేవారు. మూడవ బోగీ లో ఏం మంట అది ఎర్రగా వెలిగిపోతోంది. బోగీలో దీర్ఘచతురాస్రాకారంలో ఒక టేబిల్‌ ఉంది. దానిపై శవపేటిక లో అస్తికల కలశం ఉంది.ఆ పేటికపై చేతితో నేసిన త్రివర్ణ పతాకం పరిచారు.ఆకుపచ్చ ఆకులతో నేసిన ఒక చాప ఉంది. దానిపై తెల్లని పూలు,కాషాయి రంగు ఆకులుఉన్నాయి. పూర్తిగా త్రివర్ణ పతాకంతో కప్పివేసారు.మధ్య భాగంపై ఫ్లడ్‌ లైట్ల కాంతి విరజిమ్మేట్టు ఏర్పాటు చేశారు.
బయట ఫ్లాట్‌ ఫారంపై వేలాది మంది ప్రజలు గాంధీజీ అస్తికల కలశాన్ని దర్శించి నివాళులర్పించేందుకు వేచి ఉన్నారు.ఉదయం ఆరున్నర గంటలకు గార్డు ఈలవేశాడు. గ్రీన్‌ బోగీలు కొత్తఢిల్లిd స్టేషన్‌ బయటకు వచ్చాయి. ఆ రైలు కదలుతుండగా, ప్రజలు కట్టలు తెగే కన్నీరు ధారగా ప్రవహిస్తుండగా, విలపిస్తూ జాతిపితకు కడసారి వీడ్కోలు చెప్పారు. గాంధీజీ అస్తికల కలశంపై గులాబీ రేకులనూ,పూలదండలను మంత్రాలు చదువుతూ విసిరారు. శిరసావహించి భక్తిప్రపత్తులతో ప్రణామం చేశారు. తమ తలలు ఎంత గర్వంగా పైకి ఎత్తాలో నేర్పిన జాతిపితకు శిరసు వంచి ప్రమాణం చేశారు.
మా బోగీ మధ్య బోగీ పక్కన ఉంది.ఆ బోగీలోనే గాంధీజీ అస్తికల కలశం ఉంది. కిటికీల్లోంచి బయటకు చూస్తే, పొలాలన్నీ బంగారు తివాచీల్లా కనిపించాయి. నేలపై పరిచిన బంగారు దుప్పట్ల మాదిరిగా కనిపించింది. మామూలుగా అయితే, ఆ దృశ్యం హృదయాలను పులకింపజేసేదే. పొలాల్లో రైతులకూ,వ్యవసాయ కూలీలకు బోధిస్తూ ఒక వ్యక్తి పెద్ద అడుగులేస్తూ వెళ్తున్న భావన కలిగింది.గ్రామీణులంతా రైలు కట్టకుఇరువైపులా నిలబడి ఉబికివస్తున్న కన్నీరును తుడుచుకుంటూ గాంధీజీకి నివాళులర్పించారు. స్పెషల్‌ రైలు అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఘజియాబాద్‌,ఖుర్జా,ఆలీగఢ్‌, హథ్రాస్‌,తుండ్లా, ఫిరోజాబాద్‌, ఎటావా, ఫాఫుండ్‌,కాన్పూర్‌, ఫతేపూర్‌, రసూల్‌ బాద్‌ స్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు.తుండ్లాలో మా బోగీ వైద్యశాలగామారిపోయింది.అనేక మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. విషాదం నిండి ఉంది. సంపూర్ణమైన ఆశ ఉంది.గీతా శ్లోకాల పఠనం నిరంతరం సాగుతూనే ఉంది.అది చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే, ఆయనకు మరణం లేదనిపించింది.ఎవరో ఇలా అంటున్నట్టు అనిపించింది.
ఎవరనగలరు ఒక వ్యక్తిని హత్య చేశారని
ఎవరు భావించగలరు నేను వధించబడ్డానని
జీవితాన్ని ఎవరూ అంతం చేయలేరు. జీవితం అంతంకాదు.
ఆత్మకు పుట్టుక లేదు. ఆత్మకు చావు లేదు.
ి్లటౌు ్హ్‌ిలిబిె ప్ఘ ్హఁి్లడ;
మీకు నారింజ ఇష్టమేనా? ఇలా ఎవరో అడిగేసరికి నాకు గుర్తొచ్చింది నేనేమీ తినలేదు కదా అని.నా బోగీ కిటికీకి దగ్గరగా వచ్చిన వ్యక్తివైపు చూశాను.మళ్ళీ బోగీలో చూశాను.అక్కడ అంత గాంధీజీని గౌరవించేవారు,భక్తితో ఆరాధించేవారూ ఉన్నారు.
విఎ సుదర్శన్‌ అనే మా మిత్రుడు ముప్పయిరెండేళ్ళ వయస్కుడు. గాంధీజీకి ప్రియ శిష్యుడు. మెెం ఇప్పుడే ఫతేపూర్‌ దాటామని నాకు గుర్తుకు వచ్చింది. పురుషులు, బాలురు రైలుతో పోటీ పడి ఒక కిలోమీటరు దూరం పరిగెత్తారు. గాంధీజీ అస్తికల కలశంపై ఉంచేందుకు తెచ్చిన పువ్వులు వారిచేతుల్లో కనిపించాయి.రైలు వేగాన్ని అందుకోవడంతో వారంతా వెనక్కి వెళ్ళిపోయారు. మహాత్మాగాంధీ వర్ధిల్లాలి అనే వారి నినాదాలు మాత్రం చెవుల్లో చాలా సేపు గింగురు మన్నాయి. మా మిత్రుడు ఎర్రని గులాబీని చూస్తూ ఆలోచనలోపడ్డాడు.ఆతడి కళ్ళంట నీళ్ళు బొటబొటా రాలాయి.ఇలాంటి గులాబీనే బుల్లెట్‌ గాయాలపై ఉంచాను. అని గొణుక్కున్నా డు.మా మధ్య సంభాషణ ఏమీ జరగలేదు. బయట ఆకాశం ఎర్రగా కనిపించింది. స్వర్ణకాంతులీనుతూ సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ గులాబీని చేతిలోకి తీసుకున్నాను.అది గతంలో ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది. సువాసనలను వెదజల్లింది. అక్కడ ఒక సైనికుడు సైనిక దుస్తుల్లో ఉన్నాడు .రైలు ఆ స్టేషన్‌ దాటుతుంటే వంగి నమస్కరించాడు.
దారి పొడవునా లక్ష లాది మంది గాంధీజీకి కన్నీటి ధారలతో నివాళులర్పించారు. మహాత్మా గాంధీకీ జై అనే నినాదాలు మార్మోగాయి.లక్షలాది మంది ప్రార్థనలు చేశారు. అన్ని రంగాలకు చెందిన వారూ వచ్చారు.వారందరిలో గాంధీజీపై పరిపూర్ణమైన భక్తి ఉంది. వారి నోటంట మహాత్మాగాంధీ అమర్‌ రహే అనే నినాదాలు వినిపించాయి. త్రివేణి సంగమం వద్ద అంతిమ యాత్ర ముగిసింది. మహాత్మాగాంధీ పవిత్ర అవశేషాలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు.పవిత్రమైన,యోగి పుంగవుడి అస్తికలను అంతే పవిత్రమైన త్రివేణి సంగమంలో రామదాస్‌ గాంధీ నిమజ్జనం చేశారు. నేను ఒక పడవపై నిలబడి ఉన్నాను. అస్తికల నిమజ్జనం జరిగిన ప్రదేశానికి కొద్దిగజాల దూరంలో ఉన్నాను.వేలాది మంది ప్రజలు ఆ దృశ్యాన్ని అతి దగ్గర నుంచి చూసేందుకు ఎంతో ఆత్రుతను ప్రదర్శించారు. పీపాల కొద్దీ పాలు పోశారు. ఆ పాలతో ఆ నదీ జలాలు శ్వేత జలాలుగా కనిపించాయి.అది ఒక ప్రస్థానపు ముగింపు.ఆయన అనంతలోకాల్లోకి చేరిపోయాడు.ఆ దృశ్యాన్ని వీక్షించిన వారంతా నాలాగే అనుకుని ఉంటారు.మనంకూడా అలా గాలిలో కలపాల్సిందేనని. ఓ భగవంతుడా! ఆలయాల్లో అర్చనలు చేయలేదు. నాది గంభీరమైన జీవితం కాదు, అలా అని క్లిష్టమైనదీ కాదు.కాని నేను కృతజ్ఞతలు తెలిపానునదీ దేవత నిరంతరం ప్రవహిస్తూ, దప్పికగొన్నవారికి దాహంతీరుస్తోంది. ప్రయాగ అంతటా చీకటి అలుముకుంది. అప్పుడప్పుడే దీపాలు వెలిగిస్తున్నారు. మేం వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం.త్రివేణి సంగమం వైపు ఒక్కసారి పరికించి చూశాను.ఇప్పుడు దీపాలు మరిన్ని కాంతివంతంగా వెలుగుతున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆ నక్షత్రాల్లో బాపూజీ ఉన్నారు.ఆయన జ్ఞాపకాలు ఆ దీపాల మాదిరిగానే మెరుస్తున్నాయి. నిజమే దీపం ప్రకాశమానం అవుతుంది.దాని కాంతి నిశీధిలోకి చొచ్చుకునిపోతుంది.ఈ నాగరికత ఉన్నంతకాలం ప్ర కాశిస్తూనే ఉంటుంది.
అనువాదంః శ్రీ కె వి సుబ్రహ్మణ్యం
(ఆంధ్రప్రభ 30-01-2016 సంపాదకీయ వ్యాసం)

                      

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...