Monday, December 2, 2019

'మరో గొలుసు కట్టు పథకం'- అంబల్ల జనార్దన్ కథానిక పై పరామర్శరచయితలకు రాత కష్టాల కన్నా మోత కష్టాలు జాస్తి.  ఇల్లాలు టీలు కాచి కాచి ఇస్తే.. తెల్లార్లూ నిద్ర కాచి  కళ్ళు వాచేటట్లు మరీ   తాను కన్న కలలన్నింటినీ  తెల్లటి  కాగితాలపైన కమ్మటి కథలుగా కనిపారేసే పని రచయితది. తెలుపును నలుపు చేయడం అంటే అదెంతో ఇష్టమైన వ్యాపకం; కాబట్టి కష్టం అనిపించదు. కానీ ఆ రాసేసిన ఆక్షర రాసులన్నిటి అంతిమ పరమార్థం చిత్తు కాగితాల తక్కెడ అయితేనే అనర్థం!  
ప్రతీ రచయిత బయోపిక్ లో రెండు హాఫ్స్ తప్పనిసరి. ఫస్ట్ హాఫ్ లో కలం అనే అంకుశంతో కాగితమనే రణక్షేత్రం మీద కాల్బంట్ల నుండి అశ్వ గజ పదాతి దళాలను మించి అమోఘమైన పాత్రలతో తోచిన వ్యూహాలు అల్లి మరీ  కదను తొక్కించే యోధుడు అతగాడు! సెకండ్ హాఫ్ నుండి  అంత లావు 'గాడూ' అంతూ పొంతూ లేని కడగండ్ల బారిన పడి కొట్టుకుపోతూ  తేరుకొనే దారి తెలియక భోరుమనే ఆర్థిక బాధితుడు. రాసి పడేసిన రాసులన్నింటినీ ఎట్లాగూ అన్ని పత్రికలు పడేసి ఆదరించవు. అచ్చుపడ్డ కథల మీదా ఇరుగు పొరుగు రచయితల పాపిష్టి దిష్టే తప్ప ఎంత మంది అసలు సిసలు పాఠకుల దృష్టి పడుతుందో తెలియదు! అక్షర రాసులతో లక్షలాది కాసులు  ఆశించే సీను ప్రస్తుతం తెలుగు రచయితకు ఎట్లాగూ సున్నా.  కలాల కరవాలాలతో చేసిన భీకర కవాతులకైనా ఓ గుప్పెడు  చప్పట్లు  రాలవు. వాటి కోసం దేబిరించడం.. ద్యావుడా.. ఎంతటి దైన్యం! వెనకటికి  పుస్తక ప్రచురణలో వాచిపోయిన  వాచీతో సహా సర్వం కోల్పోయిన ఓ రచయిత వాపోయినట్లు కాణీలు, అణాలు ఏరుకునేటందుకు మాత్రమే మిత్రమా రూపాయలు పైకి వెదజల్లే సాహసం రచయిత చేయాల్సిందీ కాలంలో! ఇవాళ్టి పరిస్థితిని బట్టి  చూస్తే పుస్తకాల ప్రచురణ నే యాగం రచయిత కోరి కొనితెచ్చుకొనే ఆగం మాత్రమే సుమా! గతం మాదిరి ఏ ప్రచురణ సంస్థా రచయిత సృజనకు ‘సుస్వాగతం!’ అనే చాదస్తపు రోజులు కావివి. అదృష్టవంతులు ఏ అతి కొద్దిమందికో మాత్రమే ఆ స్వాగతాలు.. సత్కారాలు! చిన్నా చితకా రచయితలంతా సొంత సొమ్ముతో ప్రచురణ క్రతువు ఆరంభించి ఆనక పూరా చితికిపోయినవారే! ఆరంభంలోనే ఈ పిచ్చి పుస్తకాలకు చితి ఎందుకు పేర్చలేదా అని చింతించినవారే! చ్చోసి వదిలేసినా అచ్చొచ్చే అదృష్టం అందరు రచయితలకూ పొసగదు.  ఖర్చు ఒక్కటే కాదు వయస్యా సమస్య ఇక్కడ! విచ్చు రూపాయలు  అచ్చుకొనేందుకు సిద్ధ పడ్డా రచయితలకు ప్రచురణ కర్తల కోడరికం తప్పించుకునే మార్గాలు లేవు.  ఓపినన్ని ప్రతులు వేసి ఏ పంపిణీ సంస్థకో ఓపెన్ గానే చచ్చు రేటుకు ఆఫర్ ఇచ్చినా ప్రతీ వంద రూప్యములకు ఒక పైసా గిట్టుట సందేహము! రచయిత సొంత ప్రచురణ మగవాడి సొంత వంటకు మించి రిస్క్! ఏజెన్సీలని బతిమాలి బామాలి ఒప్పించి తమ పుస్తకాలు షాపు బీరువాలలో సర్దించే సంతృప్తి తప్పించి ..  చిట్టెలుక వంటి రచయిత సింహం వంటి ప్రచురణ సంస్ఠ ముందు చిందులు వేయుట దుస్సాహసంబందురు లోక నైజం కాచి వడబోసిన వడబోసిన అనుభవజ్ఞులు.  రామాయణ భారత మహాభాగవతాల మాదిరి మన గ్రంథాలకూ ఓ ‘మూల’ గ్రంథాల హోదా దక్కిందన్న సంతృప్తి ఒక్కటే   రచయిత సృజనాత్మ పరిశ్రమకు అంతిమంగా దక్కుదల.  చ్చీ చెడి అచ్చేసుకున్న పుస్తకాలు ఇంటి అటక మీద దాచిపెట్టినా  ఆవకాయ జాడీలకు మల్లే అవేవీ  భద్రంగా ఉండేవి కావు! చదువరులకు చేరని అక్షరమంటే చెదపురుగులకు చచ్చే తీపి.  కొంప గుండమవుతోందంటూ  ఇంటామె గుండెలు బాదుకొనే చప్పుళ్లే తప్పించి బేవార్సుగా పుచ్చుకున్నందుకైనా మిత్రుల నుంచి మినిమం  చప్పట్లు వినిపించే రోజులూ కావివి. మొహమాటం కోసమైనా   నవ్వుతో ఒహ మంచి మాట నోట పలకని మొద్దురాచిప్పల కోసమా కాలి చిప్పలు అరిగేలా   ఇన్నేసి అచ్చుపాట్లు పడేది రచయిత?  పరువు  ప్రతిష్ఠల గ్రాఫు ఎటూ పైకి ఎగబాకేది లేదు! బాకీలు చేసి మరీ అచ్చొత్తించిన పుస్తకాల గాడిద బరువు చివరికి తీర్చే బాధ్యత  ‘గాడ్’  వంటి చెత్త కాగితాలు కొనుక్కునే వీధి   బేరగాడిదే! ఓ మై గాడ్! మంచి సాహిత్యం చివరి వినియోగదారుడు కాగితాల చెత్త కొనేవాడు కావడం.. సో సాడ్! పుస్తకాల పురుగులకే  రచయితలయ్యే అవకాశం ఎక్కువంటారు. ఆ రచయిత  పుస్తకాలే పురుగుల పాలవడం.. అంతకు మించిన విషాదం మరేముంటుంది? అందుకే గతంలో మాన్యులు కీ. శే.  శ్రీ పోతుకూచి సాంబశివరావు  రచయితలను ఆదుకునే పంపిణీ   పథకాలేవేవో పద్దస్తమానం ప్రయత్నించేవారు. అదే తరహాలో ఓ పుస్తక రచయితల బృందం తమ తమ పుస్తకాలు అమ్ముకునే గొలుసు కట్టు పథకం గురించి ప్రణాళికలు వేసుకునే అంశం చుట్టూతా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన  చక్కని కథానిక  శ్రీ అంబల్ల జనార్దన్ ‘మరో గొలుసు కట్టు పథకం’.

సాహిత్యంలో అభినివేశం ఉండీ తన తండ్రిగారు స్వంత ఖర్చుపై అచ్చేసుకున్న పుస్తకాలకు పట్టిన దుర్గతి చూసి చలించిపోయిన ఓ గుప్తాజీ  తన ఆధ్వర్యంలో విజయవంతంగా నడిచే సంస్థ తరుఫున  గొలుసు కట్టు పుస్తక ప్రచురణ ప్రణాళిక సిద్ధం చేసే దిశగా సాగుతుందీ కథానిక. తన తండ్రిలా తతిమ్మా రచయితలెవ్వరూ పుస్తకాల ప్రచురణకై అవసరమయే డబ్బు నిమిత్తం తబ్బిబ్బులు కారాదన్న  సదుద్దేశం ఆ పెద్దమనిషిది. అతను తనతో కలసి వచ్చిన మరికొంత మంది రచయితలతో ఏర్పాటుచేసుకొన్న సాహిత్య సంస్థ పేరే 'సాహితీ విశ్వవిపణి'.   శాస్త్రి, మూర్తి, చారి, జంగయ్య, యేసోబు, నదీం, రెడ్డిం సుందర్ వంటి రచయితలు సంస్థ క్రియాశీలక కార్యవర్గ కమిటీ సభ్యులు. ఈనాటి ప్రచురణ రంగంలో తెలుగు రచయిత ఎదుర్కొనే సాధకబాధకాలను గురించి సాధికార సమాచారం ఆధారంగా రచయిత అంబల్ల చర్చకు పెట్టడం తెలుగు కథల వరకు అరుదైన విధానమే. తెలుగు సాహిత్య సౌరభాలు నలుదిశలా  ప్రసరింపచేసే బాధ్యతలో భాగంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతం  కార్యక్రమాలు విస్తరింపచేసి,  సమర్థవంతంగా నిర్వహించడం, ప్రత్యేకంగా తెలుగు రచయితకు సముచిత గౌరవ సమ్మానాలు లభ్యమయే  రీతిలో ప్రణాళికల రూపొందించడం, మందకొండిగా సాగే తెలుగు భాషా వినియోగం  తిరిగి పుంజుకోవాలనే లక్ష్యంతో నిస్వార్థంగా సాహిత్య సేవ చేసే గుప్తాగారిని సంస్థ పంచమ వార్షికోత్సవ సందర్భంగా సన్మానించాలన్న తీర్మానంతో కథ మొదలవుతుంది.  బిరుదులు, పూదండలు. అభినందన పత్రాల మార్క్ సన్మాన సభల ఆర్భాటాన్ని నిర్ద్వందంగా కొట్టిపారేసి,  వ్యక్తిగత గుర్తింపులకు మించి భాషామతల్లికి దక్కవలసిన మన్ననలను గురించి గట్టి ప్రయాసేదైనా చేద్దామన్నది గుప్తాగారి సదాశయం.  భాషాసభల మిషతో అపారంగా నిధులు వెచ్చించి మరీ అంతూ పొంతూ లేని తంతులు సాగించే ఆర్భాటకులకు ఇది  చెంపపెట్టు. సాహిత్య సముద్ధరణ కోసం శక్తికి మించి కష్టాలకోర్చే నిస్వార్థ రచయితలను గుర్తించి ప్రోత్సహించే అవసరం సమావేశం మరోసారి గుర్తుచేసుకుంటుంది. రచయితల మంచి రచనలను  నలు దెసలా శ్రమదమాదులకు ఓర్చి మరీ  చేరవేసే మధ్యవర్తుల పాత్ర్రా తక్కువేమీ కాదు. వారి అనుభవాలను, ఆలోచనలను సైతం పరిగణనలోకి తీసుకునే అవసరం గుప్తాజీ సూచిస్తారు. సాహితీ సమావేశాలు  ఒక పూర్తి రోజు ఏర్పాటు చేయడం ద్వారా  ప్రచురణరంగ సంబంధీకులు అందరి మధ్యా అనుసంధానం సులభతరమవుతుందన్న ఆలోచనా ఆ సందర్భంగా తేటపడుతుంది.  
సొంత భాషకు చెందిన పుస్తకాలేవీ చదవకుండానే పరాయి భాషాశాస్త్రాల మిడి మిడి జ్ఞానం ఆధారంగా వచ్చే విమర్శలను ఈ కథ వంకతో రచయిత  ప్రశ్నించడం ప్రశంసనీయం. పరాయి భాషా అనువాదాలు తెలుగులోకి రావడమే తప్పించి.. తెలుగు నుంచి అనువాదాలు వేరే భాషలలోకి  పోకపోవడంలోని ఔచిత్యాన్నీ రచయిత ఈ సందర్భంగా ప్రస్తావించడం గమనార్హం. అనువాద రంగంలోని అన్ని రుగ్మతలకూ  విరుగుడు మంత్రంగా ఒక ప్రత్యేక ‘అనువాద విభాగం’ ఆరంభం, అందులో అనుభవజ్ఞులైన రచయితలతో పాటు  సామాన్య పాఠకుల సమ భాగస్వామ్యం .. రచయిత చేసిన చక్కని సూచనలు.   తెలుగు సాహిత్య విస్తృతి సమస్యకు ఆంగ్ల, హిందీ భాషలలోకి అనువాదాలు పెంచడం తిరుగులేని పరిష్కారమే.. అనుమానం లేదు! కన్నడంలో మాదిరి జ్ఞానపీఠలు తెలుగులో రాకపోవడానికి కారణమెవరో, నోబెల్ పురస్కారాలను గూర్చి కలలో అయినా ఊహించలేనంత ఘోరంగా తెలుగు సాహిత్య వాతావరణం కలుషితమవడం ఎవరి పుణ్యమో!’ అంటూ  రచయిత అత్యవసరమైన అంశాలను చర్చకు పెట్టడంతో ఈ కథను చర్చాపరంగా ఒక  ఉన్నత స్థానానికి చేచినట్లయింది! సమకాలీన తెలుగు సాహిత్య రంగ స్థితిగతులను గురించి  నిర్మొహమాటంగా చర్చించే చొరవకు  అంబల్ల జనార్దన్ లా మరెంతో మంది  మేధో జీవులు ముందుకు రావాలసిన  తరుణమిదే.     
సమస్యలను లేవనెత్తడంతో మాత్రమే సరిపుచ్చుకునే నైజం కొన్ని కథలది. మరో అడుగు ముందుకు వేస్తో - ‘సాహితీ విశ్వవిపణి’ సంస్థ  'సాహిత్య విపంచి' అనే భారతి స్థాయి పత్రికను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు పరిష్కారం సైతం ఈ కథలో రచయిత సూచిస్తారు. సామాజిక ప్రయోజనపరంగా కథను  మరో మెట్టు ముందుకు నడిపించినందుకూ అంబల్ల అభినందనీయులు! ఈ కంప్యూటర్ యుగంలో కూడా లక్షలాది యువత ఆ మాదిరి సాహిత్య నిబద్ధ పత్రికలకు చందాలు కట్టడం హుందాతనానికి చిహ్నంగా భావిస్తున్నట్లు రచయిత ఊహించడం కలలో మాత్రమే సాధ్యమేమో!  ఆ మాదిరి అనుమానం ఓ వంక పీడిస్తూనే ఉన్నా మరో వంకన ఒక కమ్మని భావన మనసును ముప్పిరిగొనడం ఈ కథ సాధించిన వస్తుప్రయోజనం. మంచి కథకు అవసరమయిన ప్రసాద గుణానికి రచయిత కథలోని  ఏ పేరాలోనూ  కాస్తింత కూడా లోటు రానీయకపోవడం ఆహ్లాదకరమైన కొత్త దారి.   

అమీర్ ఖాన్ 'లగాన్ ' చిత్రం ఎంతో గొప్పదై ఉండీ ప్రచారలేమి కారణంగా ఆస్కార్ పురస్కారానికి అడుగు దూరంలో ఆగిపోవడం రచయిత సందర్భానికి తగ్గట్లు గుర్తు చేస్తూనే  ఆ తరహా దౌర్బల్యం  తెలుగు అనువాద సాహిత్యానికీ పట్టకుండా ఉండాలంటే ప్రముఖల చేత ప్రత్యేక సమీక్షలు  రాయించి అంతర్జాతీయ సంస్థల సహకారంతో వాటికి విశ్వవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని  సూచిస్తారు.  ఎంపిక చేసిన అనువాద సాహిత్యం ప్రచురణార్థమై ప్రత్యేకంగా ఆంగ్ల, హిందీ భాషలలో క్రమం తప్పకుండా పత్రిక ఒకటి తేవాలన్న ఆలోచన దాకా సమావేశంలోని సభ్యుల ఆవేశం చేరుకుంటుంది.  ముదావహం.
గతంలో ఒక పత్రికలో నవల ప్రచురణ సాగే మధ్యలోనే ప్రముఖ ప్రచురణ  సంస్థలు పోటీలు పడి మరీ  రచయితతో ఒప్పందాలు కుదుర్చుకొనే పరిస్థితి. అందుకు విరుద్ధంగా ప్రతిష్టాత్మకమైన  పత్రికలలో బహుమతులు సాధించిన నవలలూ నేడు పాఠకుల దాకా చేరడం గగన కుసుమంగా ఉంది! అంతర్జాలం ప్రభావాన అచ్చుపుస్తకాల మీద  సొమ్ము వెచ్చించడం వృథా అనే ధోరణి తెలుగు పాఠకలోకంలో నిజంగానే అంతకంతకూ పెరుగుతోందా?  ఏటేటా పుస్తక ప్రదర్శనల పట్ల పెరుగుతున్న ప్రజాదరణ మాటేమిటో మరి? గతంలోని భారతి, ఇప్పటి మిసిమి వంటి పత్రికల దారిలో లాభాలతో నిమిత్తం లేకుండా సత్సాహిత్య ప్రచురణ ఓ ధర్మయజ్ఞంలా భావించి  ఈ కథలోని గుప్తాగారి దారిలో మరింత మంది పెద్దలు ఔదార్య బుద్ధితో ముందుకు వస్తే మినహా  తెలుగు తల్లి పూర్వపు మానమర్యాదలతో  తిరిగి తలెత్తుకు నిలబడే పరిస్థితులు లేవేమో!
మళ్లీ కథ విషయానికి వస్తే..
కేవలం ఓ  వెయ్యి రూపాయల సభ్యత్వం కలిగి ఉంటే చాలు..  రెండు వేల రూపాయల ముఖ విలువ చేసే పుస్తకాలు దొరకడం, ఆనక  తాము చేర్పించిన ప్రతి సభ్యుడు నుంచీ నాలుగో వంతు రుసుము వెనక్కి తీసుకొనే అదనపు సౌకర్యం సాహితీ విశ్వవిపణి ఆలోచించినమరో గొలుసు కట్టు పథకం’ లోని ముఖ్యాకర్షణలు. పెట్టిన సొమ్ము తిరిగి గిట్టుబాటు అవడంతో ఆగక పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చే  లాభమూ ప్లస్!  ఆ ఉత్సాహంతోనే ఒక్కో సభ్యుడు పదేసి మంది కుటుంబ సభ్యులను  చేర్పించి మరీ సంస్థ నుంచి అందిన పుస్తకాలతో చిన్న చిన్న గ్రామాలలో సైతం ప్రయివేట్ గ్రంథాలయాలు  ఏర్పాటుకు ఉత్సాహం చూపించినట్లు సంస్థ ప్రధాన పోషకులు గుప్తాగారు పత్రికా విలేఖరులతో సంస్థ పుట్టుక నేపథ్యం గురించి చెప్పుకొచ్చే సందర్భంలో బైటపెట్టిన ముచ్చట్లు. రచయితలకు అమ్మకాల బెడద తప్పింది. తమ పేరు జనాలలోకి చొచ్చుకు వెళ్లే సులువు దారి దొరికింది. అన్నింటికీ మించి శారదా సంతతికి అంతో ఇంతో లక్ష్మీ ప్రసన్నం కూడా! ఇంకేమి కావాలి రచయితన్న జీవికి సంతృప్తి చెందడానికి!
తెలుగు భాష వ్యాప్తికై దోహదించే ఈ మాదిరి గొలుసు 'కట్టు' పథకాలు కట్టు కథలు కాబోవు కదా? తెలుగునాళ్లలో నిజంగానే ఇవి  సఫలమయేవేనా? లేక కేవలం కలల వరకేనా ఈ కమ్మని వరాలన్నీ పరిమితం?  చదువరిని అద్బుత రసంలో ముంచెత్తేందుకు కాదు గదా రచయిత పనిగట్టుకుని మరీ ఇన్నేసి  కమ్మని ఊహపోహలను కుమ్మరించే ఎత్తు వేసింది? ఇన్ని సందేహాలన్నీ ఒక వంక నుంచీ వెన్నాడుతూనే ఉంటాయి కథానిక చదువుతున్నంత సేపూ. ఆ అబ్బురం నుంచి పాఠక మహాశయుడు తేరుకునే లోగానే అసలు విషయం బైటపడుతుంది. విద్యార్థులు, యువత కంప్యూటర్లూ సెల్ ఫోనులూ పక్కనో మూలకు గిరాటేసి  అచ్చు పుస్తకాల విస్తరణను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లడం, అస్తమానం టి.వి లు,  టిక్-టాకులతో పొద్దు గడిపే ప్రమదాలోకం సైతం తిరిగి పాతకాలంలోకి మల్లే నవలా పఠనాలల్లో మునిగితేలడాలు, కిళ్లీ బంకుల్లో కూడా డిటెక్టివ్ సాహిత్యానికి పోటీగా తెలుగు కథాసంపుటాలు దర్శనమీయడాలు, తెలుగు భాష పైన పట్టు పెరగడం వల్ల యువతకు తెలుగు టైపింగ్ వంటి మునుపెన్నడూ పట్టించుకోని రంగాలపై ఆసక్తులు పెరిగి మాతృభాష కొత్త జవసత్వాలు పుంజుకోవడాలు, నిరుద్యోగి యువతకు ఆయాచిత వరంగా ఉద్యోగావకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగిపోవడాలు! ఆ కారణంగా    అచ్చక్షర స్వర్ణయుగానికి హఠాత్తుగా ఏ ప్రభుత్వాల ప్రమేయంతో పని పడకుండానే ఆవిష్కరణలు జరిగిపోవడం! కలా? నిజమా?’ అని చదువరి గిల్లిచూసుకొనే లోగానే భార్యామణి వెన్ను చరుపుతో తటాల్మని లేచి కూర్చున్న సన్నకారు రచయిత మునిమాణిక్యం రాత్రంతా పడుకుని తీరిగ్గా తెల్లారుఝాము వరకు వివరంగా కన్న కమ్మని కలలు మాత్రమే సుమా ఇవన్నీ అని తేలిపోతుంది. పావుగంట పాటు మబ్బుల్లో తేలిన పాఠకుడి  మనసు నేలకు వాలిపోతుంది!
కానీ .. కలే కదా అని ఉసూరుమనే ఆశావహజీవికి సర్దిచెపుతూ రచయిత చెప్పిన రెండు మూడు ముచ్చట్లు అచ్చంగా ఇటీవలే మనందరి కళ్ల ముందే జరిగిన పరమాద్భుతాలు! చందమామ’ పత్రికలో చిన్నా పెద్దా ఏళ్ల తరబడి ఆబగా చదువుకొన్న కథలు, సీరియళ్లు రాసిన రచయిత మొన్నీ మధ్య వరకు అజ్ఞాతంలోనే ఉండిపోయిన శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం. ఆ సృజనశీలి ఇతర పత్రికలకని రాసిన మృత్యులోయ, అగ్నిమాల వంటి అద్భుతమైన నవలలు,  సాహితీ ప్రియులైన  'రచన' శాయిగారి పూనిక పుణ్యమా అని తెలుగు హారీ ప్యాట్టరా.. అనిపించే  స్థాయిలో ఒక్కో నవల అరలక్ష ప్రతులు  ఆవురావురామని చెల్లిపోయాయ్! ఆ శ్రీ 'శాయి' చేతి చలవ వల్లనే సామాన్యుడికి ఏ విధంగానూ  అందుబాటుకు వచ్చే అవకాశం లేని చిత్రకారుడు కమ్ చిత్ర దర్శకుడు శ్రీ బాపు శ్రీరామరాజ్యం స్టోరీ బోర్డ్ అచ్చుప్రతుల రూపంలో లక్షకు చేరువై హిస్టరీ సృష్టిస్తోంది.
రచయిత కన్నది తెల్లవారుఝాము కలా అని ఉసూరుమనే కన్నా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల మీద వత్తిడి పెంచి కేవలం ఒక్క జీ.వో గానీ జారీ చేయిస్తే చాలదా! మంచి రచనలు పుస్తక రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల గ్రంధాలయాల బీరువాల నిండా కొలువు తీరడానికి! విదేశాలకు భారీగా వలస వెళ్లే యువతకు తెలుగు సాహిత్యం పైన నేడు అపారమైన అభిమానం.  దేశీయంగా రచయితలు చొరవ చూపించడమే తరువాయి.. భారీ పెట్టుబడులతో ప్రచురణ రంగానికి ఇతోధిక సేవలు అందించేందుకు యువత సదా తయారు. రచయిత ప్రయివేట్ పంపిణీదార్ల దయాదాక్షిణ్యాల పైన బతుకీడ్చే రోజులు పోవాలంటే ముందు పాఠకలోకానికి అచ్చు పుస్తకం సాధ్యమైనంత చేరువ కావాలి. అచ్చక్షరం పైన పాఠకలోకం మక్కువ పెరగనంత కాలం ఈ గొలుసు ‘కట్టు’ కథలోని సన్నకారు రచయితకు మల్లేనే నిద్రలో మాత్రమే స్వర్ణయుగం ఊరించేది!
ఏ నాటకీయతపై వ్యామోహం పెంచుకోకుండా.. ఉన్న పరిస్థితులను పాఠకుని ముందు యధాతధంగా ఉంచేటందుకు రచయిత ఎన్నుకున్న (ప్రోటోగనిష్టిక్ ఏటిట్యూడ్) అనుకూల దృక్పథం ఈ కథకు వన్నె తెచ్చింది. ముక్తాయింపుగా రచయిత కల గురించి ప్రస్తావించే వరకు 'అబ్బ! ఈ విధంగా జరిగితే ఎంత బాగుణ్ణు!' అన్న ఫీల్ గుడ్ వాతావరణమే కథంతా పరుచుకుని ఉంటుంది. రచయితగా అది అంబల్లవారు ఎన్నుకుని మరీ మెప్పించిన సాహిత్య సర్కస్ ఫీట్!
వాస్తవానికి ఈ నాడు రచయిత ఎదుర్కొనే అడుగడుగు గండాలు అనేకానేకం.  గడగడా వాటిని ఓ ఛార్జిషీటులా ఏకరువు పెట్టేస్తే మొదటి పేరాలోనే పాఠకుడు గడగడా వణికిపోతాడు.   విసుగు పుట్టి చదవకుండానే పుటలు  తిప్పేస్తాడు! చిన్న రచయిత సొంత సొమ్ము పోసినా పుస్తకాల ప్రచురణలో ఎదుర్కోక తప్పని   ఇబ్బందులు ఎన్నింటినో సాహితీ విశ్వవిపణి,  సాహితీ విశ్వవిపంచి, అనువాదాలకంటూ ఓ ప్రత్యేక విభాగం అంటూ విన ఆకర్షణీయమైన ఎన్నో అనుకూల ప్రణాళికల ముసుగులో రచయిత అంబల్ల జనార్దన్ గడుసుగా పాఠకుడిని ఆలోచనలో పడవేసిన తంత్రం 'మరో గొలుసు కట్టు పథకం' కథను మంచి కథల కోవలోకి మళ్ళించింది. రోగి మందు తీపిగా ఉండాలన్న చికిత్సా చమత్కారం కథాప్రక్రియకూ ప్రతిభావంతంగా అన్వయించినందుకు సీనియర్ రచయిత అంబల్ల జనార్దన్ కు అభినందనలు!
(రచన విహంగ వీక్షణ రజతోత్సవ సంచిక - నాలుగో భాగం(పు.144౫1448 - ఏప్రిల్, 2016 రచన సంచిక లో ఈ కథానిక ప్రచురితం)

-కర్లపాలెం హనుమంతరావు
01 -12 -2019,
బోథెల్, U.S.A

అంబల్ల జనార్దన్ ప్రవాసాంధ్రులు. ప్రసిద్ధి చెందిన రచయిత. 1950, నవంబర్ 9వ తేదీన జననం. ముంబయి తెలుగు రత్న  బిరుదు గ్రహీతలు).No comments:

Post a Comment