Tuesday, December 3, 2019

సరస్వతీ.. నమస్తుభ్యమ్! - ఈనాడు సాహిత్య సంపాదకీయం








'పలు సందియములు దొలుచును/ వెలయించు న గోచరార్థ విజ్ఞానము'అన్నది చదువు మీది చిన్నయసూరి సదభిప్రాయం. అక్షరం లోక చక్షువు. నిరక్షర కుక్షిని గుడ్డి కుక్కతో పోల్చారు పురందరదాసు. 'సంతకు పోయి దుడ్డు పెట్టె కాక దొరికేనా' అని ఆ వాగ్గేయకవి ఎకసెక్కాలాడినట్లే గాలికి తిరిగి తన పుత్రులు ఎక్కడ జనుషాంధువు లవుతారోనని పంచతంత్రంలో పాటలీపుత్ర మహారాజు మహా మధనపడిపోతాడు. అహరహము అరి నామ స్మరణ మరిగిన ముద్దుల పట్టిని తిరిగి దారికి తెచ్చుకుందామంటే హిరణ్యకశిపుడికి ముందుగా తోచింది సద్గురువుల  వద్ద లభించే సదసద్వివేక చతురత కలిగించు విద్యాబుద్ధులే!చదువనివా డజ్ఞుండగునని రాక్షసుడైనా విద్య విలువ చక్కగా గ్రహించాడు. ఇప్పుడంటే  విద్య పరమార్థం అర్థ సంపాదన అయింది కానీ ఏకలవ్యుడు ఆ కాలంలో ఏ కాసుల కోసం ఏకంగా బొటనవేలునే పణంగా పెట్టి విద్యల కోసం వెంపర్లాడాడు? కర్ణుడు  పరశురాముడి దగ్గర పడీ పడీ శుశ్రూషలు చేసుకున్నది ఉబుసుపోక కాదు గదా? మృత సంజీవనీ విద్య ఆర్జన కోసం కచుడు చేసిన సాహసం సామాన్యమైనదా? ఆత్మ పరమాత్మల పరమ రహస్యాలను గురు ముఖతః గ్రహించాలన్న తపనతోనే కదా జాబాలి గౌతముని మున్యాశ్రమంలో అన్నేళ్లు గొడ్డూ గోదా కాచింది!విద్యార్జనకు ఎంత విలువ లేకపోతే గీతాచార్యుడు గోపాలబాలుడుగా సాందీప మహాముని పంచలో కూర్చుని గుంట ఓనామాలు దిద్దుకుంటాడు? అవతార  పురుషుడు తారక రాముడు సైతం తాటకి వధకు పూర్వం వశిష్టులు, విశ్వామిత్రుల వద్ద వేద విద్యా పారాయణాలలో తర్ఫీదు పొందినవాడే! విద్యాసముపార్జన ఒక విధిగా నిర్దేశించిన బ్రహ్మచర్యం చతురాశ్రమాలలో ప్రధమమైనదే కాదు.. ప్రధానమైనది కూడా! భారతీయులకు  చదువు చెప్పే గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. పురందరదాసు ప్రబోధించిన విధంగా 'గురువుకు గులాము అయే దాకా ముక్తి దొరకదు అన్నా' అన్న సూక్తి మనిషికి చదువు మీద ఉందవలసిన శ్రద్ధాభక్తులకు పెద్ద నిదర్శనం.

భర్తృహరి బోధించనే బోధించాడు కదా - విద్య నిగూఢ విత్తమనే గాఢ రహస్యం! అది  పూరుషాళికి రూపం. యశస్సు. భోగకరి. విదేశంలో ఆదుకునే ఆపద్బంధువు. హరించదలచే  వాడి కంటికి కనిపించని నిధి. సుఖపుష్టి తో పాటు సత్కీర్తి సాధించి పెట్టే ఈ దివ్య ధనం అఖిలాండ కోటికి ఎంత ఉదారంగా ధారపోసినా   పెరిగేదే కానీ.. తరిగే ద్రవ్యం కాదు. యుగాంతాన కూడా అంతం కాని ఈ మీరాశి ఎవరి  సొంతమో వారు కుబేరుడిని మించిన సంపన్నులు. నిజానికి మనిషికి భుజకీర్తులు. సూర్య చంద్రహారాలు పెద్ద అలంకారాలే కావు. చందన స్నానాలు, మందారమాలలు ఏమంత అందచందాలను పెంచనూ లేవు. వాగ్భూషణం ఒక్కటే మనిషికి సుభూషణం- అన్న భర్తృహరి సుభాషితాన్ని కాదనలేం! నృపాల పూజితమని అనుభవం మీద ఆ రాచకవే ప్రవచించిన తరువాత  విద్య విలువను గురించి వేరే తర్జన భర్జనలు దండుగ. అల్లసాని పెద్దనామాత్యులు ఎదురైనప్పుడు మదకరీంద్రము నిల్పి కే యూత యొసగి కృష్టదేవరాయలంతటి రారాజు సరదాకి ఎక్కించుకొంటారా? మను చరిత్ర రచనతో చరిత్ర సృష్టించిన ఘనతే కదా మహారాజుల పక్కన పీఠాల దక్కుదలకు ముఖ్య కారణం! వల్మీకజనుడైన వాల్మీకి మహర్షికీ కమలజన్యుడు బ్రహ్మతో సరిసమానంగా గౌరవ మర్యాదలందిన కీలక రహస్యం రామాయణ రచనలోనే ఉందన్న నిజం కాదని ఎలా అనగలం? సుభాషిత రత్నావళి భాషించినట్లు చందమామకు తారాతోరణం, పతీపత్నులకు పరస్పర సాహచర్యం, పృథ్వీమతల్లికి సద్భూపాల పాలన మాత్రమే అలంకారాలవుతాయేమో కానీ విద్య మాత్రం సర్వే సర్వత్రా సకల జనావళికి ఒకే తీరున సద్భూషణాలై శోభను పెంచుతాయి. డొక్కశుద్ధి లేని మనిషి తేనె లేని తేనెపట్టు- అంటారు ఖలీల్ జిబ్రాన్. మానవ జన్మ ఎత్తినందుకైనా నాలుగు మంచి ముక్కలు నాలుక కింద దాచుకోని వాడిని 'విద్యానీతి' అనే సద్గ్రంథం వజ్ర వైఢూర్య ఖచిత ఘటకంలో తెలక పిండి వంట కోసం గంధపు చెక్కలు తగలేసే మూర్జశిఖామణి కింద జమకట్టింది.  చదువును మించిన చక్కదనాల చక్కని ధనం ముల్లోకాలు గాలించినా ఎక్కదా దొరకేది కాదని సర్వశాస్త్రాల మూకుమ్మడి సారం. భాగవతంలో కన్నతండ్రికి పిన్న వయసులోనే ప్రహ్లాదుడు కుండ బద్దలు కొట్టి మరీ విప్పి చెప్పిన చదువుల మర్మం మహా భాగవతమంత!
చదువు- సంధ్యలు చక్కని జంట పదం. రెండు సంధ్యల మద్యన సాగే జీవితం రాగరంజితం అయే ఉత్తమ సాధనాలలో చదువు అతి చక్కనిది.   మంచి చెడుల మధ్యన అనుక్షణం జరిగే ధర్మయుద్ధమే  జీవితమంటే. ఆ నిత్య కురుక్షేతంలో మనిషిని  కాపాడే విచక్షణ పునాది మంచి విద్య. సర్వ రోగాలకు మూలకారణం మనిషి  తాపత్రయం- అంటారు  బుద్ధ భగవానులు.  దాని అంతిమ దుష్ఫలితం ఆయుక్షీణం- అన్నది రుగ్వేదం సమర్థన. యావ నుంచి మనిషి మనసును ఉత్తమ మార్గానికి మళ్లించేది సద్వాణి - అన్నది కృష్ణారావుగారి గ్రంథాలయ సూక్తిసుధలో ఒకటి. అయితే ఆ వాగ్రాణి  మనం పాణి చాచితే అందేటంత సమీపంలోనే ఉంటుందని వీరేశలింగం పంతులుగారు ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు.  మానసిక వైద్యుల ఉధ్ఘాటన ప్రకారం .. ఆరోగ్య సిద్ధికి, అమరత్వ లబ్దికి సద్గ్రంథ పఠనం ఉత్తమ సోపానం కూడా.   ఒక దశ దాటిన తరువాత వయసుతో పాటు మనసూ వడలిపోవడం సహజంగా జీవచర్యల్లో ఓ భాగమే! బద్దెన  నీతిశాస్త్రంలో కుండ బద్దలు కొట్టినట్లు ధనం, ఉషోదయం, యవ్వనం, వండిన అన్నం, మూర్ఖుడి స్నేహం మాదిరి మనిషి  బతుకూ బుద్భుధప్రాయమే!'ఆయువు నూరు సంవత్సరము లందు సగంబు నశించె నిద్రచే/ నా యరలో సగంబు గతమయ్యెను జరా ప్రసక్తి చే/ బాయక తక్కిన యట్టి సగ బాలు గతించు బ్రాయస వృత్తిచే'!- అన్న నానుడికి కొనసాగింపుగా  ఆ మిగిలిన జీవితకాలంలో కనీసం సగ భాగమైనా పడుచుదనంతో పరవళ్లు తొక్కాలని ఉవ్విళ్లూరకపోతే వాడసలు మనిషే కాదు- అనే నవీన జీవన సూత్రం పైనే పిన్న పెద్దా అందరి ధ్యాసా ప్రస్తుతం.   నిష్కాముకత్వం మనసుకు సేదనిచ్చి ఆయుక్షీణతకు దివ్యౌషధంగా పని చేస్తుందని  వేదాలు చెబుతున్న మాట వాస్తవమే. కానీ    నిత్య జీవిత పోరాటంలో ఏదో ఒక ఆరాటం తప్పదన్నట్లుగా  బతికాల్సిన  సామాన్యుడికి  యోగుల కామనగా భావించే ఆ  ఆధ్యాత్మిక  భావన సాధన  సాధ్యమయే పనేనా? అన్ని పద్దులకూ రద్ధై పోగా  మిగిలిన జీవితంలో కనీసం సగ భాగమైనా పడుచుదనంతో పరవళ్లు తొక్కాలనే మామూలు  మనిషి తపన. పుస్తక పఠనం ఓ  తపస్సుగా  మార్చుకుంటే సరి..  ఆ మాదిరి విలాస జీవితం కోరుకున్న విధంగా కులాసాగా అనుభవించెయ్యచ్చని  కొత్తగా లండన్ తాజా  విశ్వవిద్యాలయ మనస్తత్వవేత్తల బృందం తమ పరిశోధనల్లో తేల్చింది. మానవ జీవకణాలైన క్రోమోజోముల చివర్న జీవిత కాలాన్ని నిర్దేశించే 'టెలోమెల్' లు ఉంటాయని, అవి ఎంత దీర్ఘంగా ఉంటే మనిషి జీవితం అంత సుదీర్ఘంగా సాగుతుందని, పుస్తక ప్రియులలో ఈ ' టెలోమెల్' పొడవు సాధారణ కొలతల కన్న అధికంగా  ఉంటుందని ఆ పరిశోధకుల బృంద నేత ప్రొఫెసర్ స్టీఫెన్ హోల్గేట్ ప్రకటించారు. ఇంకేంటీ! ఏడు పదులు దాటినా చేతికి కర్ర రాకుండా కులాసాగా కాలం గడపాలంటే  వెంటనే పుస్తకాలు పట్టి వరుసబెట్టి వదలకుండా 'పఠనయోగం' ఆరంభిస్తే సరి!
***
కర్లపాలెం హనుమంతరావు
03 -12 -2019,
బోథెల్, యూ.ఎస.యే
(ఈనాడు- సాహిత్య సంపాదకీయం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...