Thursday, December 12, 2019

జగదానందకారకం- ఈనాడు ఆదివారం సాహిత్య సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు





'నాదాధీనమ్ జగత్ సర్వం' అని సామవేద వాదం. బ్రహ్మ సామవేద గానాసక్తుడు. వాణి వీణాపాణి. శంకరుడిది ఓంకార నాద ప్రీయత్వం. అనంతుదు సంగీత స్వరాధీనుడు.   మతంగ, భరత, శుక, శౌనక, నారద, తుంబుర ఆంజనేయాది రుషిసత్తములందరూ మోక్ష సామ్రాజ్యాన్ని సాధించింది నాదబ్రహ్మోపాసనా మార్గంలోనే అన్నది శ్ర్రుతి స్మృతి పురాణేతిహాసాదుల మాట. సామవేదం ప్రకారం చేతనాచేతనాలైన సమస్త భూతజాలాన్ని ఆకర్షించే ఐహిష్కాముష్కికాలైన చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే శక్తి ఉన్నది ఒక్క సంగీత విద్యకే. 'సరిగమపదని'సలనే సప్త స్వరాల పునాదులపై నిర్మించిన భారతీయ సంగీత మహాహార్మ్యం ఎంతో అనాదిది. ఆరంభంలో ఒకే లక్ష్య లక్షణ సంప్రదాయాలతో విరాజిల్లినా విజాతీయుల పాలనా ప్రభావం ఉత్తర దక్షిణాలనే అంతరాన్ని ఏర్పరిచింది. ఆంధ్ర కవితాపితామహుడుగా పేరుగాంచిన నన్నయ భట్టారకునికి చాలా ముందు నుంచే ఏలపాటలు, తుమ్మెద పాటలు వంటి జానపద గులాబీలు సౌరభాలు గుబాళించేవి. అన్నమాచార్యులు, పురందరదాసు, క్షేత్రయ్య వంటి పదవాగ్గేయకారులూ   ప్రచారం చేసిన జనసాహిత్యమూ అపారమే! 'సంగీతం' అంటే 'తంజావూరు పాట' అన్నంతగా స్థిరపడిన నాయజరాజుల పాలనలో తెలుగు నేలల నుంచి  గుర్తింపు కోసం వలసపోయిన మహానుభావులు ఎందరో! ఆ వలసజాతి కాకర్లవారి వంశంలో సుస్వర జనసంగీత పునరుద్ధరణార్థమై భువికి దిగివచ్చిన అపర పరమేశ్వరుడు 'శ్రీరామ తారక మహా మంత్రోపాసన' మహిమతో అసంఖ్యాకంగా భగవత్ సంకీర్తనా సాహిత్యం సృజించిన కర్ణాటక సంగీత వైతాళికుడు  త్యాగరాజు. పద్దెనిమిదో శతాబ్ది పూర్వార్థంలో తంజావూరు సంగీత సాహిత్య క్షేత్ర వృక్షాల 'అంటు'గా ప్రవర్థిల్లిన 'త్యాగరాజం' అనే కొమ్మ వెదజల్లిన ఫలాలు, పుష్పాలు, బీజాలే నేటికీ మహావృక్షాలుగా ఎదుగుతూ నేల నలు చెరగులా పరిమళాలు ప్రసరిస్తున్నది.
సరిగమలతో పరిచయం ఉండని సామాన్యుడిని సైతం సమ్మోహనపరిచే ఆ సంగీత మాయావినోదం మూలాలు- రాగాలలో అంతర్లీనంగా ఒదిగుండే పదాల పొహళింపులో ఉంటుంది. పండితులు అంత వరకు తమ సొంత సొమ్ముగా భావిస్తూ వచ్చిన సంగీత సాహిత్యాలు రెండింటినీ తనదైన అజరామర సృజన ముద్రతో సామాన్యజన పరంచేసిన రాగ భగీరథుడు త్యాగరాజయ్యర్. 'ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ముగ్గురే కవిబ్రహ్మలు' అంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ; తిక్కన, పోతన, వారిద్దరి తేటతనం, భక్త్యావేశాలను వాగ్గేయరూపంలో తేటపరిచిన  త్యాగరాజు. త్యాగయ్య పల్లవులు, చరణాల నిండా కండ గల కలకండ తెలుగు పలుకులే! నిత్య వ్యవహారం నుంచి పక్కకు తప్పుకున్న అచ్చతెనుగు పలుకుబడులను పునరుజ్జీవింపచేసిన త్యాగరాజుది భాషాశాస్త్రవేత్తల దృష్టిలో సైతం వైతాళిక పాత్ర.  'సానుభూతి' అనే పదానికి సాధారణంగా మనం వాడే అర్థం 'జాలి'. 'త్యాగరాజు 'నగుమోము గనలేని'  అనే కీర్తనలో 'నా 'జాలి' దెలిసి నను బ్రోవగ రాద' చరణంలో ఆ పదం 'నిస్సహాయత' అనే అర్థంలో ధ్వనిస్తుంది. పాటకజనం నిత్యవ్యవహారంలో సన్నిహితులను చనువుతో పిలిచే విధంగా 'రారా మా ఇంటి దాకా' అంటూ మనసారా ఆహ్వానించడంలోని మర్మం; రాముణ్ని ఎప్పుడూ త్యాగయ్య మానవాతీతుడిగా భావించకపోవడమే! తెలుగు వాజ్ఞ్మయంలోని గేయ సంప్రదాయాన్ని స్వీకరించి ఉత్తమోత్తమమైన సంగీత సాహిత్యాలను సమపాళ్లలో ప్రజాబాహుళ్య ప్రయోజనార్థం మేళవించిన జనవాగ్గేయకారుడు త్యాగయ్య. అంతకు మించి  వైదేశిక రాటుపోట్లతో అగ్గలమయిపోయిన తెలుగువాణిని సముద్ధరించిన శుద్ధ భాషాసేవకుడు కూడా!

ఉపనిషత్తుల ప్రకారఁ అన్నం, ప్రాణం, మనసు, విజ్ఞానం, ఆనందం - అనే అయిదు అంచల సోపాన మార్గాన మాత్రమే ఈశ్వర తత్వ సాధన సాధ్యమన్నది భారతీయ ఆధ్యాత్మిక  చింతన. త్యాగరాజస్వామి పంచరత్నమాల అంతస్సూత్రమూ అందుకు అనుగుణంగా సాగుతుంది. పరమేశ్వరాత్మతో తాదాత్మ్యత సాధించే నిమిత్తం సాధించవలసిన బ్రహ్మానందం కోసమై ఆలపించే 'జగదానందకారక' కీర్తన ఆలాపనకు మిగిలిన నాలుగు ఘనరాగరత్నాలను సోపానాలుగా ఆ రాగయోగి మలచిన తీరు నిరుపమానం! ఆనందమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల శుద్ధిని ఉద్దేశించి సృజించినవని ఘనరాగపంచరత్నాలను యోగ శాస్త్రజ్ఞులూ సమర్థిస్తున్నారిప్పుడు. రామకృష్ణుడు ప్రవచించిన సర్వమత సహన సూత్రాన్ని తన సంకీర్తనల ద్వారా లోకానికి ఎలుగెత్తిచాటిన మత సంస్కర్త త్యాగరాజస్వామి. రాగకళకు రాగద్వేవాలతో నిమిత్తం లేదని త్యాగరాజయ్యవారి శిష్యకోటిలోని ఆంధ్రేతరులు చాటిచెప్పే మాట.  'జయదేవుని కడ క్రోధమై రాధ చరణాలు-ముద్దుల మోళిపై మోసి మోసి/ అన్నమాచార్యుల సమక్షమందేడు కొండల- నొంటిగా కాపురముండి  యుండి/ క్షేత్రయ్య రసమయ్య క్షేత్రమున పలు నాయికల బిగి కౌగిళ్ల నలిగి నలిగి/ విసిగిపోయి సుంత విశ్రాంతి కోసమై- సీత తోడ అనుగు భ్రాత తోడ / విశ్వమయుడు ప్రభువు వేంచేసియున్నాడు- రాముండగుచు త్యారరాజు నింట' అంటారు కవి కరుణశ్ర్రీ! నిజానికి ఆ రామచంద్రుడు లౌకికమైన చీకాకులకు అలసి రవ్వంత సాంత్వనకై తపించే మనలోని ఆత్మారాముడికి ప్రతీక. 'ఇంద్రియ జ్ఞానానికి, ఆత్మానందానికి మధ్య స్థానాన్ని సంగీతం ఆక్రమిస్తుంది' అంటారు ప్రముఖ  ఆంగ్లకవి బ్రౌనింగ్. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ  'లోచెవి' కలిగిన సంగీత సాహిత్యశాస్త్రవేత్త కాగలిగేది. త్యాగరాజస్వామి అంతటి అదృష్టవంతుడు. ఆ స్వామి తెలుగువాడు కావడం తెలుగువాడి అదృష్టం. స్వామి 'తన్మయ సమాది' నుంచి తన్నుకువచ్చిన సంగీత ఝరిని దోసిళ్లకు పట్టి శిష్యులు స్వరసాహిత్యంగా పదిలపరచని పక్షంలో జాతికి ఈ మాత్రమైనా 'సుస్వర గంగ' సంప్రాప్తమైవుండేదా? ఎనభై ఐదేళ్లు అఖండంగా వెలిగిన ఆ త్యాగరాగజ్యోతి ఈ బహుళ పంచమి నాటికి 'నచ పునారావర్తి' పదవిని అలంకరించి 173 ఏళ్లు
(2020 నాటికి). ప్రతీ ఏటా జరుపుకునే త్యాగరాజ సంగీత ఉత్సవాలు వాస్తవానికి స్వర,సాహిత్యాలు రెండింటికీ జరిగే మహోత్సవాలు.
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- ఆదివారం సాహిత్య సంపాదకీయం 15 -12 -2012)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...