Monday, January 13, 2020

పత్రికలు- బడుగు జీవుల బతుకు చిత్రికలు -కర్లపాలెం హనుమంతరావు-సూర్య దినపత్రిక పరచురణ


 వార్త- ప్రాధాన్యతః
పదిహేడో శతాబ్దానికి పూర్వం  సామ్రాజ్య వ్యవస్థలు వర్ధిల్లే  కాలంలో  అధికార వర్గాలు   జారీచేసే 'బులెటన్' ల తరువాతి రూపం ఫ్రెంచ్ భాషలో పుట్టిన 'new' పదం. దాని బహువచనం  'news' కు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్- అనే నాలుగు దిక్కుల నుంచి అందే సమాచారం అని చెప్పుకునే నిర్వచనంలో  చమత్కారమే తప్ప వాస్తవం పాలు తక్కువ.   అనేక భారతీయ భాషలలో
న్యూస్ కు సమానార్థకంగా  వినిపించే  'వార్త' విలువ కనకం మాదిరో కరెన్సీ మాదిరో   వెలగట్ట లేనిది. ఎంత నియంతల వ్యవస్థలోనైనా ఈ 'వార్త'కు ఉండే విలువ తిరుగులేనిది. పాలితుల మనోభావాలను పాలకులకు చేరవేసినట్లే, పాలకుల అంతరంగాల వైనం పాలితుల వరకు చేరవేసే చేవ సత్యకాలం బట్టి ఒక్క 'వార్త'కే సొంతం.  ఛాందసుడని మనం  ఈసడించే భారత కవిత్రయంలోని నన్నయకవి కొన్ని వేల ఏళ్ల కిందటే వార్త ప్రాధాన్యతను  ఒక్క చిన్న ముక్కలో తేల్చేసాడు. 'వార్త యందు జగతి వర్థిల్లుచుండు' అన్న  నన్నయగారి ఆ పద్యపాదం ఈ ఇరవై ఒకటో  శతాబ్దపు ఈ-కాలంలో కూడా ప్రముఖ పత్రికల 'హెడర్స్'  దగ్గర తచ్చాడక తప్పడంలేదు.

వార్త-ఆవశ్యకతః
జగతి ప్రగతి మార్గంలో  సాగాలంటే భూతకాల అనుభవాల ఆధారంగా భద్రమైన భవిత కోసం  సర్వే సర్వత్రా సంభవించే వర్తమాన సమాజాల తీరూ తెన్నూ అన్ని  వర్గాలకు అనుక్షణం  అందుబాటులో ఉండక తప్పదు.   ప్రజాతంత్ర పాలనా వ్యవస్థ సాఫల్యానికి పాలకులు- పాలితులు మధ్య సమవ్యయం అవసరం.  ఇరుపక్షాలకు  మధ్యన  బాధ్యతాయుతమైన ఒక  అనుసంధాన ఉపకరణం క్రియాశీలకంగా పనిచేయడం తప్పనిసరి.   సమాచార లోపం వల్లనే చాలా సందర్భాలలో  సంక్షోభాలు తలెత్తినట్లు ప్రపంచ చరిత్ర చెబుతున్నది.  నిక్కచ్చి సమాచారం అధికారికంగా అసలు మూలాల నుంచి సమయానికి సరైన వారికి అందితే అపోహలకు ఆస్కారం ఉండదు.  సంక్షోభాలు తలెత్తవు. మొలక దశ నుంచే ఆవలి వైపు ఆలోచనలను క్రమ పద్ధతిలో  తెలియచేసే చేవ ఉంటుంది కాబట్టే నేటికీ వార్తకు ప్రపంచంలో ఇంతటి ప్రాముఖ్యం. 

వార్తామధ్యమాల సమర్థతః
సంక్షోభాలు సృష్టించడం,  నివారించడం   సమాచార మాధ్యమాల ప్రత్యేక సామర్థ్యం. చాటు మాటు మాటల కన్నా సూటిగా  ప్రశ్నించే ప్రెస్ (వార్తా మాధ్యమం) ద్వారా  ప్రెస్ చేసి అడిగినప్పుడే సమస్యలకు  సత్వర పరిష్కారాలు లభ్యమయే అవకాశం ఎక్కువ.  వార్తల ప్రభావం అర్థమయే కొద్దీ అందుకే వార్తామాధ్యమాల ప్రాధాన్యత అన్ని వ్యవస్థలలో క్రమంగా పెరుగుతూ వస్తున్నది. సాంకేతిక నైపుణ్యాల పుణ్యమా అని సమాచార రంగంలో ఈరోజు దృశ్యశ్రవణ విభాగాలు వీరంగం వేస్తున్నాయి!    సర్వే సర్వత్రా సంభవించే సంఘటనలను కంటి రెప్ప పాటులో అవి అరచేతిలో పెట్టేస్తున్నాయి. అయినా సమాచార స్రవంతిని ఓ ధర్మ క్ర్రతువులా  భావించి ఆరంభించిన తొలినాటి యాజుల పాత్ర  ఈ నాటికీ కొంతలో కొంతైనా పోషిస్తున్నవి వార్తాపత్రికలే!

వార్తాపత్రికలు- విశిష్టతః
అక్షర రూపంలో కట్టెదుట కనిపించే వార్తకు ఉండే విశ్వసనీయతపవిత్రత సాటి లేనివి. చదువు సంధ్యలు లేకున్నా పవిత్ర గ్రంథాల  సామాన్యుడికుండే భక్తివిశ్వాసాలే అందుకు ఉదాహరణ. అచ్చు అక్షరం పట్ల  మనిషి చూపించే అపార విశ్వాసమే ఫ్రెంచ్బ్రిటన్ ల వంటి జాతీయ ప్రభుత్వాల చేత తొలినాళ్లల్లో అధికారిక బులెటన్ లుగెజిట్ లు అచ్చులో రావడానికి   కారణమయింది.  కొత్తగా ఎన్ని ప్రసార ప్రకియలకు రోజూ ఆవిష్కరణలు జరుగుతున్నా అచ్చులో కనిపించే వార్తాపత్రికలకు ఉన్న ఆ  ఆదరణ చెక్కుచెదరలేదు.. నిన్న మొన్నటి వరకు.    విషయం కాక వినోదమే ప్రధానమనే కోణంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రెజెంట్ అయే వార్తల్లో సత్యాసత్యాల నిర్ధారణ జగం మిధ్యపలాయనం మిధ్య సామెత! మార్ఫింగులుఎడిటింగులు వంటి  యాప్స్ సామాన్యుడు సైతం సులభంగా వాడే సౌలభ్యాలు  పెచ్చు మీరి ప్రధాన మంత్రిప్రతిపక్ష అదినేత.. ఒకే పబ్బులో కలసి  కేరింతలు కొట్టేస్తున్నట్లు నమ్మించే  వీడియోలు సైతం  సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసేయడం సులువవుతున్న వాతావరణం! అంతర్జాలంలో తాజా  వార్త వంకతో తయారయ్యే సంచలన వార్త వాస్తవానికి ఏ దశాబ్దం కిందటి లైబ్రరీ షాటో.. ఫోరెన్సిక్ లేబ్  తప్ప తేలే వ్యవహారంలా లేదిప్పుడు.  ఎన్నేసి రకాలుగా అన్ని వైపుల నుంచి వార్తా మాధ్యమాలు విచిత్రమైన భంగిమలలో  ప్రసారాలు గుప్పిస్తున్నా   ఇప్పటికీ జనం చివరగా చూసి నిజమని నిర్ధారించుకుంటున్నది మాత్రం   వార్తాపత్రికలో  కనిపించినప్పుడే!  ఎలక్ట్రానిక్ మీడియా ఆవిష్కరణ తొలి దశలో  కొంత తడబడ్డ మాట నిజమే కానీ  తమవైన ప్రత్యేక బలాల పునః సమీకరణ వల్ల  వార్తా పత్రికలు   తిరిగి పుంజుకున్నాయి.  సర్క్యులేషన్ పరంగా కొంత బలిమి  తగ్గినా మేలిమి వార్తకు ఈనాడూ వార్తాపత్రికలే కేరాఫ్ అడ్రస్!

వార్తాపత్రికలు- లక్ష్యం..నేపథ్యం
వార్తాపత్రికల ఆరంభ దశలో 'గెజిట్ మీద 'మాది ఒక రాజకీయవ్యాపార పత్రిక. అన్ని రాజకీయ పార్టీలకు స్థానం ఉంటుంది. కాని ఏ రాజకీయ పార్టీకి లోబడి ఉండదుఅన్న అర్థం వచ్చే మోటో ఒకటి కనిపించేది.  ఆ తొలి నాటి  లక్ష్యంలో ఇప్పుడు గణనీయమైన మార్పు కనిపిస్తున్న మాట కాదనలేం.  సమాచార మాధ్యమంగా వార్తాపత్రికలు  అత్యున్నత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించే లక్ష్యంతో  1966 లో 'ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాఆవిర్భవించింది.  నేషనల్‌ ప్రెస్‌ డే (జాతీయ పత్రికా దినోత్సవం) గా స్మరించుకునే  నవంబర్ 16 నాడైనా పత్రికలు తమ పాత్రపై  పునస్సమీక్షలు జరుపుకోడం మేలు. ఏ కొసన ఏం జరిగినా ప్రపంచానికంతటికీ వాస్తవాలు మాత్రమే తెలిసేలా  క్షేత్రస్థాయి పరిస్థితులు యధాతధంగా ప్రచురించడం  చాలా వార్తాపత్రికలకు ప్రధాన ధ్యేయం.  రెండు దశాబ్దాల కిందటి వరకు విభిన్న వర్గాలు నమ్మదగ్గ   అత్యుత్తమ అనుసంధాన పాత్ర   వార్తాపత్రికలదే. జాతి హితం దృష్ట్యా  చేసే సమయానుకూలమైన   మేల్కొల్పులుహెచ్చరికల నుండి,  హక్కులుబాధ్యతల పట్ల  సమూహాలను అప్రమత్తం  చేసే వరకు..   సమ సమ్మాన  సమాజ  నిర్మాణ సౌధానికి  అవసరమయే కార్యకలాపాలన్నింటికి  బహిరంగ వేదికలుగా చొరవ చూపించేవి వార్తాపత్రికలే.   న్యాయంచట్టంశాంతి భద్రతల సంరక్షణ అనే మూడు మూల స్తంభాలతో పాటు ప్రజాస్వామ్య సౌధ పటిష్టత కోసం నాలుగో  స్తంభంగా 'ప్రెస్గుర్తింపు పొందటానికి అదే కారణం.   ఎలక్ట్రానిక్ మీడియా ఆవిష్కరణ తొలి దశలో  ఆ 'ఫోర్త్ ఎస్టేట్ కొంత తడబడ్డప్పటికీ   తమవైన ప్రత్యేక బలాల పునః సమీకరణ వల్ల  పూర్వ ప్రభావంతో   తిరిగి పుంజుకున్నాయి.   సర్క్యులేషన్ పరంగా కొంత బలిమి  తగ్గినా మేలిమి వార్తకు ఇప్పటికీ వార్తాపత్రికలే కేరాఫ్ అడ్రస్!  వట్టి కాగితాల బొత్తే అయితే వార్తాపత్రికలు ఈ దేశంలో  ఇన్ని శతాబ్దాల  పాటు ఎన్నో ఆటుపోటులను తట్టుకుని  నిలబడి ఉండేవే కాదు.   అక్షరాస్యత,  ఇంగ్లీషు జ్ఞానం పరిమితంగా ఉన్న కాలంలోనూ   గొప్ప గుర్తింపు పొందడం వార్తాపత్రిక వ్యవస్థ విశిష్టత. స్వాతంత్ర్య  భావజాల ప్రచారాల నిమిత్తం 1851 లో దాదాభాయ్ నౌరోజి  రాజకీయ పత్రిక  ప్రారంభించినదాది    వార్తాపత్రికల  ప్రచురణ వివిధ లక్ష్య సాధనలార్థం పాశుపతాస్త్రాలకు మించి ఉపయోగిస్తున్నాయీ దేశంలో.
పత్రికల ప్రభావం   గుర్తెరగబట్టే స్వాతంత్ర్య పోరాటపు తొలి నాళ్లల్లో   అటు   ప్రాంతీయ భాషల్లోనూఇటు ఇంగ్లీషు భాషలోనూ వార్తాపత్రికలు పోటెత్తింది.  సంస్కరణల కాలంలోసంక్షోభాల సమయంలోసామాజిక పరంగా మార్పు సంభవించే ఏ సంధి కాలంలో అయినా పత్రికలు పో్షించే పాత్ర నిస్సందేహంగా అమోఘమైనది. సామాజిక సంస్కరణల నిమిత్తం రాజా  రామ్మోహన్  రాయ్ వంటి విద్యావంతులు ఎందరో ప్రజాభిప్రాయం మలిచే  అచ్చుపత్రికలనే ప్రధానంగా నమ్ముకొన్నది. 

తెలుగులో వార్తాపత్రికలుః
తెలుగు వరకు.. తొలి పత్రిక  మత భావజాల  విస్తరణ నిమిత్తం క్రైస్తవులు 1835లో బళ్ళారి కేంద్రంగా  వెలువరించిన  సత్యదూత. కాకినాడ నుంచి కెనడియన్ బాప్టిస్టు మిషన్ ప్రచురించిన 'రావిమత పత్రికలో సామాజిక  వార్తలూ  కనిపించడం విశేషం.   భాషా ఉద్యమాలు ఉధృతంగా సాగిన దశలో విశ్వనాధ వంటి ఉద్దండులూ 'జనతాతరహా పత్రికలు నడపక తప్పింది కాదు.  కందుకూరి వీరేశలింగంగారు  'వివేకవర్ధనినడిపితే..   కొక్కండ పంతులుగారు  'ఆంధ్ర భాషా సంజీవిని'  పత్రికతో పోటీ పడ్డ రోజులున్నాయి. జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాల సమర్థన నిమిత్తం ఎ.పి. పార్థసారధి  పత్రిక  ప్రారంబించిన బాటలోనే కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు    1908లో గాంధీజీ మార్క్ జీవన విలువలను ప్రమోట్ చేస్తో ఆంధ్రపత్రిక స్థాపించారు.   'భారతిఅనే సాహిత్య పాత్రికనూ స్థాపించి దశాబ్దాల పాటు  ఆ రెండింటినీ నిర్విఘ్నంగా నిబద్ధతతో నిర్వహించారు. ఆ పత్రికకు దీటైన మరో వార్తాపత్రిక .. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థల ఆధ్వర్యాన ఖాసా సుబ్బారావు నిర్వహణలో నార్లవెంకటేశ్వర్రావు సంపాదకులుగా 1938లో స్థాపించిన 'ఆంధ్రప్రభ'.  

వార్తాపత్రికలు- సామాజిక బాధ్యతః
ప్రత్రికలతో ప్రయోజనం ఎంతో   ప్రమాదమూ అంతకు మించి. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సాగే ప్రభుత్వాలకు  గిట్టని వార్తా పత్రికలపై  ఉక్కుపాదం మోపాలన్నంత కసి సహజం. ఇందిరా గాంధి అత్యయిక పరిస్థితి ఇందుకో ఉదాహరణ. కానీ  ప్రజల పక్షాన మాత్రమే  నిలబడాలని భావించే పత్రికలు ఏనాడూ   నిర్బంధాలకూ తలొగ్గిన దాఖలాలు లేవు!   తెల్లదొరల   సెన్సార్ (1878) నిబంధనల మధ్యనే  ఎఫ్.సి.మెహతా  కైసర్-ఎ-హింద్ (1882)పత్రికను ప్రారంభించిన స్వేచ్ఛాప్రియుల దేశమిది! స్వాతంత్ర్యానికి ముందు  ప్రభావశీలంగా పనిచేసిన బ్రిటిష్ వారి పది పన్నెండు ఆంగ్ల దినపత్రికల మధ్యనా    చెన్నపట్నం -ది హిందూముంబై-ఇండియన్‌ ఎక్ష్ప్ ప్రెస్దిల్లీ- హిందుస్తాన్‌ టైమ్స్కలకత్తా -అమృత బజార్ ఉత్తర భారతం- నేషనల్ హెరాల్డ్మధ్య భారతం- హితవాద  వంటి పత్రికలు కొన్ని గొప్ప జాతీయభావజాలంతో జాతి ఏకీకరణ  కోసం  ఉడుతా భక్తి సేవించినవే.  దాదాపు అవే లక్ష్యాలతో ప్రజాహితం దృష్ట్యా  మారిన కాలానికి అనుగుణంగా నేటికీ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి ఆ పత్రికలన్నీ. కనకనే కాలానికి ఎదురు నిలిచి తమ ఉనికి నిలుపుకుంటున్నాయి! 

సమాజిక విభజన- వార్తాపత్రికల ఎదురీతః
విశ్వవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ఏదో ఒక రూపంలో సామాజిక విభజన తప్పడంలేదు. ఆఫ్రికాలో తెగల ఆధారంగాయూరప్‌లో జాతుల ఆధారంగా  అయితే భారతీయ సమాజంలో కులాల ఆధారంగా! సమాజం ఖండ ఖండలుగా విడివడే ప్రక్రియలో  సామాజిక స్థిరీకరణ మిషతో ఉన్నత వర్ణాలవారే అన్ని రకాలుగా  ఆధిపత్యాలను గుప్పెట బిగించారు.     ఆధునిక యుగం ప్రసాదించిన స్వేచ్ఛజ్ఞానాల పుణ్యమా అని యుగాల బట్టి అధికార పంపకాలలో సాగుతున్న ఈ అసమన్యాయం అణగారిన  వర్గాలవారి ఇంగితానికి ఇప్పుడిప్పుడే రావడం! బ్రహ్మణాధిపత్యంఅగ్రకులాల  దోపిడికులాలు ప్రాతిపదికగా లేని జనాభా లెక్కలుదోషపూరితమైన కుల చరిత్రల రచనసామాజికఆర్థిక అసమానతలు.. వెరసి 
 వెనుకబడిన కులాల  ఆత్మగౌరవ ఉద్యమాల (Self Respect movement) కు కారణాలవుతున్నాయి.

ఆత్మగౌరవ ఉద్యమాలుః
19వ శతాబ్దం చివరి భాగంలో దక్షిణపశ్చిమ భారతంలో  అగ్రకులాల వ్యతిరేక ఉద్యమాలు అనేకం పురుడుపోసుకున్నాయి. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకం నాటికి శైశవ అవస్థలు దాటి  అవే  కుల సంఘాలుసంస్థలుగా పుంజుకున్నాయి.    పరిణతి గడించే క్రమంలో ఆ  సంఘాలుసంస్థలే నిమ్న,  వెనుకబడిన తరగతుల ఆత్మసమ్మానానికి ప్రతీకలుగా గుర్తింపుపొందింది. బడుగుల  బతుకుల్లో కొంత మేలైన మార్పు సాధించినా    జనాభా దామాషాలో రాజకీయ అధికారం చేజిక్కించుకున్నప్పుడే  సంపూర్ణ న్యాయం జరిగినట్లుగా  అణగారిన వర్గాలిప్పుడు భావించేది. జనాభా దామాషాలో ఎక్కువగా ఉన్న ఎజువా కులం కేరళ హిందూ సవర్ణుల చేత వెలికి గురయింది వ శతాబ్దిలో! అదే కులంలో పుట్టిన నారాయణ గురు  అణగారిన వర్గాల అభ్యున్నతికి ముందుగా  వారి దృక్పథంలో మార్పు రావలసిన అగత్యం గుర్తించి  1903లో శ్రీ నారాయణ ధర్మపరిపాలన సంస్థను (SNDP) సంస్థను స్థాపించారు. అణగారిన వర్గాలకు వేదాలుశాస్ర్తాలు బోధించి  శిక్షణ ఇవ్వడం అపూర్వం. కులమతభాషా భేదాలువంటి అనేక  మానవ కల్పిత  సాంఘిక వ్యత్యాసాల పట్ల సదవగాహన కల్పిస్తూనే
ఏకోపాసన పట్ల నారాయణ గురు  సంస్థ సాగించిన ఉద్యమాలతో కేరళలో వెనుకబడిననిమ్న కులాల సామాజిక జీవనంలో విశేషమైన మార్పులొచ్చాయి.
సామాజిక విప్లవవాది రామస్వామి నాయకర్ (పెరియార్) అణగారిన వర్గాల  ఆత్మ విశ్వాస పునరుద్ధరణే  లక్ష్యంగా ఆరంభించిన ఆత్మగౌరవ ఉద్యమం..  సంఘ సంస్కరణల దిశగా సాగి ఆఖరుకి రాజకీయా పోరాటాల రూపం తీసుకున్నది. ఆత్మగౌరవ భావజాల ప్రచారం నిమిత్తం కుడి అరసు అనే వారపత్రిక ఆరంభించి ఆ దిశగా ఎందరికో ఆదర్శనీయుడయింది పెరియారే! దేవాలయ ప్రవేశాలుదైవజ్ఞుల ప్రమేయం లేని కళ్యాణాలుపూజా విగ్రహాల నిషేధాలు వంటి వైదిక ప్రాముఖ్యత లేని సంప్రదాయాల ఆచరణకు వ్యతిరేకంగా మనుస్మృతిని తగలబెట్టడం వంటు  నిరసన రూపాలకు శ్రీకారం చుట్టింది ఈ ఆత్మగౌరవ ఉద్యమం.  దైవకార్యాల పౌరోహిత్యంఉమ్మడి నీటి వనరుల వినియోగం వంటి  నిత్య జీవితావసరాలలో బ్రాహ్మణేతరులకూ భాగస్వామ్యం కల్పించడం వంటి ఆత్మగౌరవ సాధన మార్గాలు పెరియార్ తొలినాటి జస్టిస్ పార్టీ నుంచి ప్రేరణ పొందినవి.  జాతీయ అనుసంధాన భాష మిషతో ఆర్య సంస్కృతికి అచ్చమైన ప్రచార మాధ్యమంగా భావించే హిందీని వ్యతిరేకించడం నుంచి  ప్రత్యేక ద్రవిడస్థాన్ కోసం పోరాటం చేసే వరకు తమిళనాట  ద్రవిడ కజగమ్ (డి.కె),  ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డి.ఎం.కె),  అణ్ణా ద్రవిడ మున్నేట్ర కజగమ్ వంటివి ఎన్నో రాజకీయంగా వెనుకబడిన తరగతుల ఉద్యమం సాఫల్యం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్నాయి. తమిళ విల్లాలుముదలియార్లుచెట్టియార్లుతెలుగురెడ్లుకమ్మబలిజ నాయకులు వంటి వెనుకబడిన మధ్య తరగతి కులాలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి.  కల్లుగీత కార్మికులుగాపామరులుగావ్యవసాయ కూలీలుగా జీవించే  అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక అంతస్తు పెంచుకునే నిమిత్తం విద్య,  సాంఘిక సంక్షేమ కార్యకలాపాలలో ఎక్కువ ప్రభుత్వ నిధుల కెటాయింపుల కోసం నాడార్లు  నాడార్ ఉద్యమం  నడిపించారు.   ఉత్తర తమిళనాడు వెనుకబడిన కులం పత్లీ. షవాన్ల మాదిరిగా 1871 నుంచి తమకు తాము వన్నీయ కుల క్షత్రియులని ప్రకటించుకున్న ఆత్మగౌరవ ఉద్యమం పత్లీల ఉద్యమం.
మహారాష్ట్రలో అణగారినవెనుకబడిననిమ్నకులాల అభ్యున్నతి కోసం 18వ శతాబ్దిలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం  ఉధృతంగా కొనసాగింది. శూద్రులకై సలహాలు,  విద్యావ్యాప్తిహక్కుల స్పృహే లక్ష్యంగా మహాత్మ జోతిరావ్‌ గోవిందరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్  సమాజ్‌ కూడా ఆత్మగౌరవ ఉద్యమ చరిత్రలో ప్రధాన ఘట్టమే! కృషీవలులకార్మికుల సమస్యల  నివారణార్థం 1871లో ఫూలే ప్రచురించిన వారపత్రిక ‘దీనబంధు’! సమాజం  నుంచి కోరుకొనే మంచి మార్పు ముందు సొంత ఇంటి నుంచే మొదలుకావాలంటూ..  ఆచరించినిరూపించిన ాఅ ఆదర్శమూర్తి అడుగుజాడల్లో నడిచే అచ్చమైన సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడున్నది ఎంత మంది?! స్త్రీ విద్య పట్ల అనురాగంబాల్య వివాహాల పట్ల వ్యతిరేకత వట్టి మాటలతోనే ప్రకటించుకోడంతో సరిపెట్టుకోక స్వయంగా 'బాలహత్య ప్రధిబంధక్ గృహను స్థాపించిగర్భిణీ వితంతువులకు   అండగా నిలిచిన సంఘసంస్కర్త ఫూలే!   వేదాలనువిగ్రహారాధనను వ్యతిరేకిస్తూ 1869లో ‘పౌరోహిత్యం యొక్క బండారం’  అనే పుస్తకాన్ని ప్రచురించిన కార్యశీలి ఫూలే మహాత్ముడు. మరో నాలుగేళ్లకు బ్రాహ్మణుల వైఖరిని నిరసిస్తూ ‘గులాంగిరి’ అనే పుస్తకం ప్రచురించారు.


వెనుకబడిన కులాలు- ప్రస్తుత పరిస్థితులుః
జనాభాలో అధిక శాతంగా ఉన్నా  వెనుకబడిన కులాలుగా ముద్రబడి భారతీయ హిందూ సామాజిక వ్యవస్థలో నాలుగో స్థానంలోకి నెట్టివేయబడడాన్ని బుద్ధి ఉన్న ఏ సామాజికహితుడైనా ఎట్లా సహించడం ?  ఆర్థిక పరంగా బలంగా ఉండిసమాజం దృష్టిలో  సమ్మాన స్థానంలో ఉన్నా .. వెనుకబడ్డ తరగతులలోకి జొరబడి బలహీన వర్గాల పిసరంత రాజ్యాంగ బద్ధ లాభాలనూ గుంజేసుకోవాలనే దుర్భుద్ధి కొత్తగా కొన్ని అగ్రవర్ణాలలో పుట్టుకొస్తున్నదిప్పుడు.  రాజస్థాన్‌ రాష్ట్ర జాట్లను కేంద్ర వాజపేయి ప్రభుత్వం ఒబిసి జాబితాలో చేర్చడాన్ని ఎట్లా సహించడం?   మహారాష్ట్రలో అన్ని విధాలా బలమైన కులం మరాఠాల కులం.  అదీ ఆందోళన చేసి ఒబిసిల్లోకి చేరిపోతే నిజంగా వెనుకబడ్డ తరగతులవారి వాటా కుచించుకుపోదా?  అన్ని కులాల్లో నిరుపేదలు ఉంటారు. బలహీనులు అందరికీ  ప్రభుత్వ సాయం గత్తర తప్పదు. కాని భారత సమాజాన్ని సహస్రాబ్దాలుగా పట్టిపీడిస్తున్న  కుల వ్యవస్థ  కారణంగా   ఏర్పడ్డ  అణగారిన వర్గాలవారి హక్కుల నేపథ్యం వేరు.  విద్యాఉద్యోగాలకు దూరమయిన ఈ బడుగుల కోసం  బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వాస్తవంగా వెనుకబడిన కులాల ఆధారంగా ఏర్పాటు చేసినది రిజర్వేషన్ వ్యవస్థ. ఈ ప్రత్యేక సదుపాయాలలో కూడా అభివృద్ధి చెందిన జాతులు వాటా కోరడమే అభ్యంతరకరం. గుజరాత్‌లో తాజాగా పటేల్‌ కులస్థులు తమ కులాన్ని ఓబిసి కేటగిరీలో చేర్చాలంటూ సాగించే హింసాత్మక ఆందోళనపట్ల సంయమనం ఎట్లా?   హిందూ మితవాదులు  పటేళ్ల ఆందోళనపై చేసే అనుకూల వ్యాఖ్యలు  రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోగయ్యే ప్రమాదాలను సూచిస్తునాయి.   ఉదారవాద ఆర్ధిక విధానాల అమలు వల్ల ప్రభుత్వ రంగ ఉద్యోగాలుఉపాధులు పెరుగుతాయని బుకాయించాయి బడా వ్యాపార వర్గాలు.  అందుకు విరుద్ధంగా  తగ్గుతున్న ఈ అవకాశాల్లో 'ఎవరికి.. ఎంతఅన్న తంపులు పెట్టి   ప్రజల అసంతృప్తిని ప్రణాళికాబద్ధంగా వెనుకబడిన వర్గాల వైపుకి మళ్లించే  కుట్ర ప్రస్తుతం నడుస్తున్నది. 'అందరికీ విద్య- అందరికీ ఉపాధిఅన్న ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగే రిజర్వేషన్ ప్రక్ర్రియ పైన కొందరికి కొత్తగా  సందేహాలు తలెత్తే పరిస్థితులు నిత్యం జరుగుతున్నాయిప్పుడు. ఈ నేపథ్యంలో ప్రజాహితం ఏకమొత్తంగా అభిలషించే ప్రజాస్వామ్యవర్గాలనూ కలుపుకుపోయే అవసరం ఆత్మగౌరవ ఉద్యమం గుర్తించాలి. 

బచుగుల కోసమే వార్తాపత్రికలుః
బడుగు బలహీన వర్గాలు తమ ఉనికిని నిలుపుకునేందుకు వివిధ మార్గలను అన్వేషిస్తున్న సందర్భం ఇది. అందులో ఒక ప్రధానమైన కార్యాచరణ   బడుగుల గొంతుక వినిపించే నిమిత్తం  పత్రికల నిర్వహణ. విస్తృతమైన సమాజంలో పరిమిత లక్ష్యాల నిమిత్తం  మితమైన వనరుల సాయంతో  చిన్న పత్రికలు మనుగుడ సాగించడం  కొండకు ఎదురు దేకడం మించి కష్టం. కార్మికపేదమధ్య తరగతులు తమ జీవిక నిలిపే  సంజీవనిగా   బడుగుల కోసం నడిచే పత్రికలు  నిర్వహించబడాలి. ప్రజల భాగస్వామ్యం అభిలషించే ఉద్దేశం ఉంటే బలహీనవర్గాల పత్రికలోనే  అన్ని వర్గాలకు సంబంధించినవి కొన్నైనా విలువలతో కూడిన కథనాలు ప్రచురించడం అవసరం!    

సూర్య దినపత్రిక సామాజిక సాహసం
బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజాశక్తి,  విశాలాంధ్ర,  నవ తెలంగాణా వంటి దినపత్రికలు ఎంతో కాలంగా తెలుగునాట క్రియాశీలకంగా నిస్వార్థమైన సేవలు అందిస్తున్నాయి. మూడు దశాబ్దాలు పై బట్టి  సమాజాన్ని  తమ లక్ష్యాల వైపుకు మళ్లించాలనే మంచి దృక్పధంతో ముందుకు సాగే ఆ తరహా వార్తాపత్రికల సరసన చోటు  కోసం పన్నెండు ఏళ్ల కిందట  2007, అక్టోబర్, 21  బ్రాడ్ షీట్ ఫార్మాట్ లో నూకారపు సూర్యప్రకాష్ రావుగారి సంపాదకత్వంలో 'సూర్యదినపత్రికగా ఉద్యమబాటలో తొలి అడుగువేయడం సాహసమే! కానీ నిస్సందేహంగా అభినందనీయం కూడా!  శ్రీ నారాయణ్ దత్ తివారీ చేతుల మీదుగా ఆరంభమయిన ఈ దినపత్రికకు తెలుగు దినపత్రికలలో మొదటగా ప్రామాణికమైన  యూనీకోడ్ లో    వెలువడ్డ  అంతర్జాల పత్రిక అనే రికార్డ్ ఉంది.  ఈ పత్రికజాలస్థలి సమాచారానికి 2010 సెప్టెంబరు, నుండి శాశ్వత లింకులు ఉండడం మరో అరుదైన విశేషం.   పక్షపాతం లేకుండా సమాచారం అందించే పత్రికల అవసరం ప్రస్తుత వ్యాపార సంస్కృతిలో ఎంతో అవసరం.  బలహీన వర్గాల   గొంతుకకు ఈ తరహా చిన్నపత్రికలే  అండ.  అభివృద్ధి అంతా ఒకే చోటకొన్ని వర్గాల వద్దనే పోగుపడడం మిగిలిన ప్రాంతాలువర్గాలు నిర్లక్ష్యానికి గురయేందుకు కారణం. సమాజం పట్ల నిబద్ధతబడుగు వర్గాల హక్కుల పట్ల  బాధ్యతల ప్రమాణంగా మాత్రమే చిన్నపత్రికలకు ఆదరాభిమానాలు.  పాలక వర్గాలు అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలను నిర్భయంగా ఎప్పటికప్పుడు  వెలుగులోకి తెచ్చే సత్తా ఉన్నప్పుడే చిన్నపత్రికలకు పెద్ద అభిమానవర్గం లభ్యమయేది. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా సిబ్బంది  యాజమాన్యం సహకారంతో   పత్రికను సంరక్షించుకొంటూ దినదిన ప్రవర్థమానవుతున్న సూర్య దినపత్రికకు పదమూడో జన్మదిన సందర్భగా హృదయపూర్వక అభినందనలు! బడుగు జనుల వ్యతిరేఖ విధనాల పట్ల ఆకర్షణ అధికమయే  నేటి కాలంలో అసలైన బలహీన ప్రజల పక్షాన నిలబడి నిర్భీతితో గళమెత్తి నినదించే మరెన్నో పత్రికలకు సూర్య దినదినాభివృద్ధి  ప్రేరణ కావాలని మనసారా ఆకాంక్ష
పత్రికలు- బడుగు జీవుల బతుకు చిత్రికలు
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినోత్సవ  సందర్భంగా రాసిన వ్యాసం)





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...