Saturday, January 11, 2020

సంక్రాంతి సౌరభాలు- సూర్య దినపత్రిక- 'సరదాకే’ ఆదివారం శీర్షిక - కర్లపాలెం హనుమంతరావు



                                      పండుగ పేరు చెవిన పడితేనే చాలు మనసులో అదో వింత వెలుగు. రసానుభూతిని పెంచే ప్రతీ సందర్భమూ నిజానికి ఓ పండుగే! సాంప్రదాయకంగా జరుపుకునే పండుగల ఆనందం అందుకు అదనం. దేశమంతటా ఏదో ఓ సందర్భంలో వేరే వేరే పేర్లతో అయినా సరే వైవిధ్యభరితంగా జరుపుకొనే వ్యవసాయ సంబరాలలో సంక్రాంతిది మొదటి స్థానం. తెలుగువారికి అదనంగా ఇది పెద్దల నుంచి పశువుల దాకా అందరినీ  స్మరించుకొనే పెద్దపండుగ కూడా!
పుష్యమాసం ఆరంభంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే  శుభసందర్భాన్ని ధనుర్మాస ప్రారంభంలోనే  'నెల పట్టండహో!' అంటో దండోరా వేసుకుంటూ వచ్చే పెనుపండువు(శ్రీనాథుడి ప్రయోగం) సంక్రాంతి పండుగ.
తొలి జాము చలిని సైతం లెక్కచేయకుండా ముగ్గుబుట్టలతో ముంగిళ్ల ముందు  ముద్దుబొమ్మలు రంగవల్లుల రంగంలోకి దిగిపోయేది ఈ నెలలోనే! ముగ్గంటే ముగ్గు కాదు. చుక్కంటే చుక్కా కాదు. ఖగోళశాస్త్ర గ్రహాల సంచార రహస్యాలను ఇంటి ముంగిళ్ల ముందు ముదిముత్తైదువులకు మల్లే ఈడొచ్చిన ఆడపిల్లలు పరిచి మరీ ప్రదర్శించే బ్లూ-ప్రింట్లు! క్రిమి సంహారక గుణాలు ప్రకృతిపరంగా సిద్ధించిన గోమయం(ఆవుపేడ)తో కలాపులు ల్లి, చీమల్లాంటి చిట్టి పొట్టి జీవాలకు పెట్టే గోరుముద్దలకు మల్లే బియ్యప్పిండితో కళలుట్టి పడేలా కోలాలు  తీర్చిదిద్దుతారు కోమలాంగులు. గుమ్మడి, గన్నేరు, చామంతి వంటి పూబంతులకు తోడు పసుపూ కుంకుమలద్ది అలంకరించిన గొబ్బిదేవతల చుట్టూతా చేతులు తట్టుకుంటూ సాయం సంధ్యల్లో 'సుబ్బీ గొబ్బెమ్మా! శుభమూ నీయవే! మొగలి పూవంటి మొగుడు నీయమే'  అంటూ అరవిరసిన మందారాల వంటి చేతులతో గొబ్బి తట్టే దృశ్యాలు.. అబ్బబ్బ! అబ్బాయిలకే కాదు.. అబ్బాయితనం గడచిపోయిన ముదుసళ్లక్కూడా చూసేందుకు వెయ్యి కళ్లున్నా చాలేవి కావు.
'కోడితో మేలుకొని, తానమాడొ, నుదుట/
దిరుమణియు, తిరుచూర్ణము తీర్చిదిద్ది/
యొక్క కేలను దంబఱ నొక్కకేల/
జిఱుతలం బూని వీధు వీధుల దిరిగి/
'రంగ రంగా'యటంచు ' గోవిందనామాలు కొట్టే సాతాని జియ్యరు సాక్షాత్ శ్రీహరి అవతారాన్ని కళ్లకు కట్టిస్తాడు! అతగాని శిరం మీద కొలువైన కూష్మాండ(గుమ్మడి కాయ ఆకారంలో ఉండే) పాత్ర భూమాత సంక్రాంతి పర్వదిన అవతారం! చిన్నారి చిట్టి చిట్టిగుప్పెట నిండా భిక్ష పట్టించి అక్షయపాత్రలోని అన్నపూర్ణాదేవిని సేవించుకోడం ఏ గోవర్థన గిరిధారినీ ఉద్ధరించడంగా అనుకోరాదుట. బువ్వ పెట్టే భూదేవి అవ్వ నోటికి వ్వంత కబళం అందించి  కృతజ్ఞత తెలుపుకునే భారతీయుల సత్సంప్రదాయమదని పెద్దల మాట! పట్టుశాలువతో మహాపండితుడికి మల్లే సన్నాయి బృందాన్ని వెంటేసుకొని గడపగడపా తడుముతూ ఈ అయ్యగారికి ఓ దండం, ఆ అమ్మగారికి ఓ దండం అడగకుండానే తడవతడవకీ తలాడించుకు పెట్టే గంగిరెద్దుదీ ఏ సరదా ఆట కాదుట! సాక్షాత్తూ ఆ గంగాధరుడి పండుగ సంబరాల  పర్యాటనట. పాడిపంటలకు అత్యవసరమైనవి జలధాన్యాలు. ఆ రెండింటినీ తలలపై మోసుకుంటూ శివకేశవులు నేల మీద పండుగ నెలరోజులూ తిరగాడుతున్నారు కాబట్టే తిండిగింజలకు ఏ మాత్రం లోటు లేకుండా లోకమిలా చల్లంగా సాగిపోతోందని పెద్దల కాలం నుంచి వస్తున్న ప్రగాఢ విశ్వాసం.
సకాలంలో నాట్లు పడి, పంట పుష్కలంగా దిగబడి, క్షేమంగా ధాన్య సంపద ఇంటి గాదెల్లోకి చేరిన శుభసందర్భంలోనే పౌష్య సంక్రాంతిలక్ష్మి శుభాగమనం గమనార్హం. ధాన్యాగారంలా కర్షకుడి గుండె కూడా నిండుగా నిర్మలంగా ఉంటుందీ పండుగ నెలరోజులు! ఏడాది పొడుగూతా పడిన సాగుకష్టానికి తగిన ఫలితం దక్కిందన్న సంతృప్తి పదిమందితో కలసి పంచుకుంటే పదింతలవుతుందనుకునే  మంచి బుద్ధి మొదటి నుంచి ఈ భూమినే నమ్ముకున్న అన్నదాతది. ఆ సంతృప్తి సంబరాల రూపమే శుభ సంక్రాంతి!
సంక్రాంతి అంటే  ఆటవిడుపు కూడా. ఏ మూల చూసినా పల్లెపట్టుల వైపు కోడి పందేలు, కోడె దూడల పరుగు పందేలు, చిన్నపిల్లల గాలిపటాల  మధ్య పోటా పోటీలు  సాగు విరామసమయంలో పల్లెలు సేదతీరే విధానాలు మనోహరాలు.
'అంబ పలుకు జగదంబా పలుకు/
కంబుకంఠి  ఓ కాళీ పలుకు/
కంచిలోని ఓ కామాక్షీ పలుకు' అంటూ ముక్కోటి దేవతల మధుర వాక్కులను తన డుబుడుక్క శబ్దంలో వినిపించే బుడబుక్కలవాడి నుండి- విశ్వశంభుడిని తన కాశీచెంబులోనికి కుదించి కాణీ ఆశించకుండానే ఆశీర్వాదాలు అందించే పురోహితుల దాకా ఈ పండుగ నెలరోజులూ ఏ మారుపల్లెలో విన్నా విష్ణ్వాలయ ధ్వజస్తంభం  నుంచి వినిపించే జయ జయ విజయధ్వానాలే! నిజానికి ఇవన్నీ శ్రామిక కృషీజన విజయాలకు వైజయంతీ గానాలని అంటారు కరుణశ్రీ ‘సస్య సంక్రాంతి’లో. ముందు చావిళ్ల నుంచి గొడ్ల చావిళ్ల దాకా  ఒక్క గజమైనా వదలక గోడలకు  వెల్లవేయించిన ఇళ్లు మహేంద్రైరావతాలని మించి మురిపిస్తుంటాయి గదా! కవి భావన ఎంత కమనీయంగా ఉందో!
హాని కలిగించే క్రిమికీటకాదుల సంహారానికని పరగడుపునే రగిలించే చలిమంటలు సంక్రాంతి పండుగ సంబరాల తొలి ఘట్టం. ఏడాది పొడుగునా ఇంటి నలుమూలలా పేరుకున్న చెత్తా చెదారమంతా చలిమంటల పరశురాముడికి పసందైన పండుగ  విందు. కొత్త ఏడు గడపలోకి కుడిపాదం మోపి ముందుగా ప్రవేశించే ముగ్ధ పౌష్య సంక్రాతి. ఆ లక్ష్మికి పట్టే దివ్యమంగళ హారతులు ఇంటి ముంగిటిలో రగిలే చలిమంటలని మరో కవి భావన.
తూర్పున తెలతెలవారుతుండగానే అభ్యంగన స్నానమాచరించి, నూత్న వస్త్రాలతో కొత్తకుండలో కొత్తబియ్యం, కొత్తబెల్లం, పాలు, నేయి కలగలిపి వండిన మధురాన్న ప్రసాదం ప్రత్యక్షనారాయణుడికి నివేదించి, ఆనక ఆరగించడంతో పండుగ సంబరాలు పంచుకోడం ఆరంభమయినట్లే! భోగినాటి సాయం సంద్యవేళల్లో బాలభగవంతులకు ఇరుగు పొరుగు పేరంట్రాండ్ల సాక్షిగా రేగుపళ్లతో చేసే అభిషేకోత్సవం  మరో ముచ్చట. ఆంధ్రాప్రాంతాలలో స్త్రీలు తమ సృజనాత్మకనంతా రగంరించి తీర్చి దిద్దే బొమ్మల కొలువులు మరో అద్భుత  కోలాహల ప్రదర్శన. సీతారాముఅ కళ్యాణాన్ని ఆశీర్వదిస్తూ ఎదురుగా రావణబ్రహ్మ, రాధాకృష్ణుల సరాగాలాను ఆస్వాదిస్తూ వెనకనే సత్యభామ! సహజ వైరాలన్నీ పక్కన పెట్టి ఒకే వరుసలో బారులు తీరిన పులీ-మేకా, పామూ-ముంగిసా.. సహజీవన సౌందర్యానుభూతులను చాటి చెపుతుంటాయ్ బొమ్మల కొలవుల్లో. మనుషులూ దేవుడు చేసిన బొమ్మలే కదా! ఆ మర్మం మరుగున పడినందునే మనిషి మనిషికీ మధ్యన ఇన్ని మద మాత్సర్యాల పొరలు! మాకులా కలసి మెలసి ఉంటేనే కలదు సుమా కలకాలం సుఖశాంతులు’ అంటూ నోరులేని బొమ్మలు  సందేశమందిస్తున్నా.. బుద్ధి కలిగిన మనుషలం మనమే ఎందుకో అర్థం చేసుకోం!
దేహం. కుటుంబం, సంస్కారం. సంస్కృతి, ఆస్తీ, అంతస్తూ .. అన్ని సంపదలూ కోరక మునుపే వారసర్వంగా ఇచ్చిపోయిన పెద్దలను స్మరించుకునే అవకాశం పండుగ రెండోరోజు. ఎక్కడెక్కడో రెక్కల కష్టం మీద రోజులు వెళ్లబుచ్చే కుటుంబ సభ్యులందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఒకే చూరు కింద చేరి సరదాలు, సరసాలు, విందులు, వినోదాలు జరుపుకునే సందర్భం చూసి సంబరపడాలని అంబరం నుంచి పితృదేవతలంతా కిందకు దిగివచ్చే శుభఘడియలుట ఇవి.
'లేగడి పాలలో గ్రాగి మాగిన తీయ తీయ కప్పుర భోగి పాయసంబు/
చవులూరు కరివేప చివురాకులో గుమగుమలాడు పైర వంకాయగూర/
అరుణ కూస్తుంబరీ దళ మైత్రిమై నాల్క త్రుప్పుడుల్చెడు నక్కదోస బజ్జి/
కొత్త బెల్లపు దోడికోడలై మరిగిన ముదురు గుమ్మడి పండు ముదురు పులుసు/ జిడ్డు దేరిన వెన్నెల గడ్డపెరుగు/
గరగరిక చాటు ముంగారు చెఱుకు రసము/
సంతరించితి విందు భోజనము సేయ/
రండు రండ'ని ఇంటిల్లిపాదినీ సంక్రమణ లక్ష్మి విందుకుడుపులకై ఆహ్వానమందిస్తుంటే 'కాదు.. రామ'ని మారాములు చేయడం ఎంత నిగ్రహాత్మారాములకైనా  సాధ్యమయే పనేనా? కాకపోతే తృప్తిగా తిని త్రేన్చే ముందు  మనకింత సంపత్తినిచ్చిపోయిన పితృదేవతలకు తృప్తిగా నువ్వులూ నీళ్లూ కలపిన మంత్రపూర్వక తర్పణాలను సంతృప్తిగా అర్పించుకోడం విధాయకానికే కాదు.. విధి నిర్వహణకు కూడా!
'అత్తవారింట విందులటన్న/ భార్య వాలుజూపు కోవులె గాని. వారు పెట్టు పంచభక్ష్యములనుకొని భ్రాంతి పడవద్ద'ని 'సంక్రాంతి' లో కవితలో పింగళి -కాటూరి వారి సందర్భానుసారంగా సందేశమందిస్తారు. అదనపు కట్న కానుకల కోసం ఇంటి ఇల్లాళ్లను కాల్చుకు తింటున్న ఈ కాలపు కాసు రాకాసి మూకల చెవులకూ కాస్తంత కవుల వాక్కుల్లోని పరమార్థం సోకడం అవసరం. పండగకు వచ్చిన కొత్తదంపతులకు ఉన్నంతలో పెట్టుపోతలు చేసి మనసారా 'వచ్చే సంక్రాంతికి/ గుమ్మడి పండంటి కొడుకును ఎత్తుకోమ'ని అత్తమామలు ఆశీర్వదిస్తే 'కొడుకుపై ప్రేమచే చెడిపోయె కురురాజు/ కొడుకుపై మమతతో కుమిలిపోయెను కైక/ అబ్బాయి వలదండి అమ్మాయి కావలెనండి' అంటూ కరుణశ్రీ  స్వర్ణసంక్రాంతిలోని ఇంటల్లుడు అభిలాషించడం అభినందనీయం. పుట్టింది ఆడబిడ్డనగానే కట్టుకున్న ఇల్లాలిని పుట్టింటనే వదిలెళ్ళిపోయే ప్రబుద్ధులు అందరకూ బుద్ధి చెప్పే సుద్ది కూడా ఇది! దక్షిణాయన కురుక్షేత్ర యుద్ధంలో నేలకొరిగిన భీష్మపితామహుడు సద్గతుల కోసం ఉత్తరాయన పుణ్యతిథులకుగాను  ఎంతో ఓపికగా అంపశయ్య మీద ప్రాణాలు ఉగ్గబట్టుకుని వేచిచూస్తాడు వ్యాస మహాభారత కథనం ప్రకారం. పితృదేవతలనంతా అదే మార్గంలో స్వర్గధామం చేర్చే  తర్పణాలు అర్పించుకునే గొప్ప కౌటుంబిక సంస్కృతి ప్రపంచం మొత్తంలో ఒక్క భారతీయుల పర్వదిన సంస్కృతులకే సొంతం! బతికుండగానే తల్లిదండ్రులను గొడ్లకొష్టాల పాల్చేసే గొడ్డుమోతు సంతుకు సంతర్పణల్లోని వైశిష్ట్యం అంతుపడితే ఎంత బావుణ్నో! పితృ, మాతామహులు నరకయాతనల నుంచి  విముక్తి పొందే ఆనంద సందర్భం కాబట్టే ఆబాలగోపాలం ఎంతో సంతోషంతో   మకర సంక్రాంతికి మూడో రోజున గాలి పతంగులతో మనసారా కృతజ్ఞతలు తెలుపుకోవడం!
మూడో రోజు పశువుల పండుగ, కనుమ. దుక్కి దున్నడం నుంచి ధాన్యం గాదెల కెక్కించడం దాకా అన్నదాతకు అన్నదమ్ములకు మించి అన్నిందాలా సాయమందించేది పశుజాతే! కొట్టినా తిట్టినా పట్టించుకోదు. గడ్డీ గాదం పెట్టినా కిమ్మనకుండా గొడ్డుచాకిరీ చేసే గొడ్డూగోదాకు ఏడాదికి ఓ రోజైనా ఆటవిడుపు అవసరమే కదా! చేసిన సాయానికి ఘనంగా కృతజ్ఞతలు చెప్పుకోవడమే కనుమ వెనుక ఉన్న మర్మం! పశువులను పరిశుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో దేవుళ్లకు మల్లే అలంకరించి, కడుపారా గడ్డి, మనసారా కుడితి నైవేద్యాలుగా అర్పిస్తే బసవరాజుల భుక్తాయాసం, గోమాలక్ష్ముల ఆశీర్వాదం, ముందొచ్చే ఆరుగాల సేద్యానికి మేలుచేస్తుందని రైతన్నల భక్తి, విశ్వాసం.
పితృదేవతల ప్రీత్యర్థం వండే గారెలు కాకులు  కడుపారా సేవిస్తే పైనుండే పెద్దల ఆశీస్సులూ తమకందినట్లేనని ఓ భావ భారతీయులకు. కనుమ నాడు కాకైనా కదలదని సామెత. కడుపు సరిపడా ఆహారం కంటి ముందరే కనపడుతుంటే ఏ కాకైనా ఎక్కడెక్కడికో ఎందుకు ఎగిరిపోతుంది? ముక్క లేనిదే పండుగేమిటని పెదవులు విరిచే ఆహారప్రియుల ఆత్మారాముల శాంతి కోసమే నాలుగో రోజు నాటి ముక్కనుమ సంబరం.
కాలం పెనువేగంగా మారుతోంది. పోటీ వినా జీవితమే లేదనుకునే భావన పెరుగున్న కొద్దీ వ్యక్తిగత విరామ సమయమూ కుదింపుకు లోనవుతోంది. కాలాన్ని కాసులతో తూచే కలికాలంలో తీరుబడిగా నెలరోజుల పాటు సంబరాలు జరుపుకుంటూ నష్టానికి సిద్ధపదేదెవరూ? పండుగ మూణ్నాళ్లే బంధు మిత్రులతో సందడిగా గడపేందుకు సామాన్యుడికి గంపెడన్ని కడగండ్లు! చీకాకులు కాస్తింత సేపు పక్కకు తోసేసి పండుగ వంకనైనా పుట్టి పెరిగిన పల్లె వంకలకు తొంగి చూస్తే  ఎంత తెరిపో పట్నవాసులు  తెలుసుకోవడం ఆరోగ్యానికి అవసరం అంటున్నారు వైద్యులు కూడా! ఇన్స్టాంట్ ముగ్గులు, ప్లాస్టిక్ గొబ్బెమ్మలు, డొక్కలు ఎండిన బసవన్నల పక్కన నిలబడి అపస్వరాలతో  వినిపించే దండాల దండకాలు అపార్టుమెంటు దండకారణ్యంలో అందుకునేదే అయ్యవారు?  కిలో రెండొందలు  దాటి బెల్లం పలికే కరువు రోజులు! ఇంటిల్లిపాది పండుగ  పొంగలి ఎంగిలి పడేందుకు ఇంటి మాలక్ష్మి పడే   యాతనను ఏ బరువు రాళ్లు తూచగలవు? పెంట్ హౌస్ టాపుల పైన చేరి పిల్ల సంచు సందడిగా ఎగరేసే గాలిపటాలు ఏ సెల్ టవర్లకో, కరెంట్ తీగలకో తగలకుండా గడిస్తే అదే సగటు కుటుంబానికి పెద్దపండుగ! బతికున్న తల్లిదండ్రులకే  ఇంట ఏ మూల చోటు చూపించాలో తోచని బడుగు సంసారికి తాతల తాతలకూ తిలోదకాలంటే తలకు మించిన క్రతువే! నిన్న మొన్నటి వరకు అన్నిటికీ తానున్నాననన్న పెద్ద మనసు పొరుగింటి అన్నది! పండుగ చక్కిలాలతో సంబరాలు పంచుకొందుకు ఈ పూట తలుపు తడితే 'సకినాలు' తప్ప  నోటికి మరేదీ హితవనిపించవు' అంటూ సకిలించేస్తుండె!గుండె గుండెకూ మధ్య రోజుకో కొత్త కొండను లేపే పాడుకాలం అంతు చూస్తేనే లోకానికి అసలైన పెద్దపండుగ.
సేద్యమంటే ప్రకృతిశకుని మామతో రైతన్నాడక తప్పని మాయదారి జూదం. ఏరువాక  అంటేనే రాబోయే యుద్ధపు రాక. జవాను మాదిరి అరకోలు పట్టుకుని సాగు పోరుకు కిసాను గడప దాటితే ఇల్లాలు కన్నీటి చెరువు చీరె చెరుగులో దాచుకుని ఎదురెళ్లే దారుణ పరిస్థితులిప్పట్టివి.
జీవనదులు ఎన్నున్నా చేవలేని చౌడుల పైనే   ఇంకెత కాలం నాగలి  పోరు? విత్తనాల నుంచి ఎరువుల వరకు అన్నింటా కల్తీ, కరువు. ముద్ద పెట్టే రైతన్న మద్దతు ధరల సాధనకై ముష్టియుద్ధాలకు దిగడమా! ముఖ్యమంత్రులు, ప్రధానులతో ఎన్నికల బరిలో నిలబడి పోరడమా! చేతులారా పెంచిన పంటకు చేజేతులా నిప్పటించడం.. బురద మళ్లలో పొర్లి పండించిన కాయను ధరలేక నడిరోడ్ల మీద కుమ్మరించడం! పొలాలకు గొళ్లేలు బిగించినా పట్టించుకే నాథుడు కనిపించడే! కళ్లేల  నుండి.. అంగళ్ల దాకా అన్ని యుద్ధక్షేత్ర్రాలలో  అన్నదాతకు కర్ణుడికి  మించిన పరాభవాలే. బ్యాంకు రుణాల నుంచి సరళీకృత విధానాల వరకు  సంక్లిష్టమైన సాలెగూళ్లన్నింటి  మధ్యన  ఓటమి ఖాయమని తెలిసీ పోరాటమాపని  అసలు సిసలు  నిస్వార్థ నిబద్ధ కర్మయోధుడు  దేశం మొత్తాన ఒకే ఒకడు! ఆ ఒక్క  సేద్యగాడూ కాడి కింద పడవేస్తే  పుష్యమాస సంక్రాతి శోభలిక సమ్మేళనాలలో మాత్రమే కవుల గళాలలో  వినిపించే మంగళ గీతాలుగా మిగిలేది!
రూపాయికి కిలో బియ్యం అందించే ప్రభువులు విత్తనాలకు, ఎరువులకు రాయితీలు ఎందుకు కల్పించరో?! అదనుకు జలాలు సమృద్ధిగా  పొలాలకు అందించేందుకు  ప్రభుత్వాలకు ఎందుకు చేదో?! పెరిగే రైతుకూలీ రేట్లకు ప్రత్యామ్నాయ విధానమేది?  యంత్రాల బాడుగ ధరల వరకైనా ప్రభువులు దయచూపిస్తేనే గదా బడుగు రైతు  సాగుబడి సాగిలపడకుండా ముందుకు సాగేది! పటిష్ట మార్కెట్ వ్యవస్థ, పారదర్శక పంటల బీమా, చీడపురుగుల నివారణలకు తోడు అగ్రిక్లినిక్కులు, ఉత్తేజపరిచే సాంకేతిక సమాచారం వంటి ఎన్నెన్నో పథకాలు  ఎప్పటికప్పుడు ఏదో ఓ రూపంలో రైతన్నకు అందేందుకూ రూపాయల లెక్కలా?! 
రాష్ట్రాల అంశమా, కేంద్రం అంశమా అన్నది కాదు.. రైతాంగం సమస్య యావద్దేశానికీ  అత్యంత ప్రధానాంశం! విపత్తులో ఉన్నాయన్న మిషతో లక్షల కోట్ల ప్రజల సొత్తు డీలాపడే డొక్కు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నప్పుడు.. ఏ వైభోగంతో   ప్రాభవంగా వెలుగుతోందని  వ్యవసాయరంగానికి పైసా  సాయమందకపోవడం? ఉత్తుత్తి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతుపవనాలు! ఓటి కమిటీలు, ఓటు కుండలు సామెత! వేదికల పైన జరిగే వాదనలు రైతు వేదనలను ఆర్చవు తీర్చవు. కాడి ఇంకా నేల మీద పడలేదంటే అది అన్నదాతలోని అమాయకత్వం కాదు. అమ్మతనం! కృషీవలుడు కదిలే కన్నీటి మేఘంలా ఉన్నంత కాలం సంక్రాతి లక్ష్మి మొహంలో  సరదాకైనా కళాకాంతులు  కనిపించవు! పాలన  పొలాల వైపుకు పరుగులెత్తినప్పుడే కరుణశ్రీ 'స్వర్ణ సంక్రాంతి'లో ఆశ్వాసించినట్లు 'సస్య సంపదలతో' దేశమంతా సంబరంగా సంక్రాంతులు చేసుకునే వీలు!
-కర్లపాలెం హనుమంతరావు  
(‘సరదాకే’ శీర్షిక - సూర్య దినపత్రిక   ఆదివారం, 12 -01 -2020 )
***





  



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...