Saturday, February 29, 2020

సరదాకేః చిల్లర మల్లర మంచితనం -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక – ఆదివారం,


ఒక్కోసారి ఊహించని వైపునుంచి ఉత్పాతాలు వచ్చి పడుతుంటాయి. దిల్లీ  గొడవలను గురించి కాదీ ప్రస్తావన. చిల్లర మల్లర మంచితనాన్ని  గురించే  చింతంతా.
నగర పాలికల ఎన్నికలకు నగారా మోగేందుకు సిద్ధంగా ఉందా! పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో పై స్థాయి పెద్దలు పనుపున  వచ్చిన  కింద స్థాయి పెద్దలు  మా బుల్లిస్థాయి పెద్దలను  అందరినీ సమావేశపరచి మరీ హెచ్చరించడాలు కూడా అయిపోయాయి. ఈ సారి- 'ఏం చేసైనా సరే'.. పార్టీ అభ్యర్థుల్ని ఆయా ప్రాంతీయ బాధ్యులే  గెలిపించుకు తీరాలి’ అని  తాఖీదు!

ఏం చేయించడానికైనా' మేం సిద్ధంగా ఉంటే సరా? ఏమైనా చేసేందుకు కార్యకర్తలూ  సిద్ధంగా ఉండాలిగదా! అసలు కార్యకర్తలంటూ పార్టీలో మిగిలుంటేనే కదా ఏ కథయినా? ఖర్మ!

పార్టీ అధికారంలో లేనప్పుడు జెండాలు భుజం దించకుండా.. సొంత సొమ్ము తగలేసుకొని మరీ ఊరేగిన తింగరోళ్లను.. అధికారంలోకి వచ్చినాక.. పులుసు ముక్కల తొక్కలకు మల్లే  పార్టీ పక్కన పెట్టేసింది. అలిగి పక్క పార్టీల్లోకి గెంతేసారెప్పుడో దాదాపు అంతా.

చుక్క.. ముక్క’ ఏర్పాట్లా పక్క పార్టీల కన్నా ఇంకాస్త ఎక్కువ మెరుగ్గానే చూద్దాంలే. మాతృపక్షంలోకి మళ్లా  లేచిపోయిరమ్మ’ని   పిలుపిచ్చాం.  పార్టీ తరుఫున గడ్డం పుచ్చుకు బతిమాలాం.

'హామీలు  నమ్ముకొని గోదాట్లోకి దూకే రోజులంటన్నా ఇవి? అవతల పార్టీలు.. పాపం..  పదవుల్లో లేకపోయినా ఆప్పో సప్పో చేసి మరీ మమ్మల్నిప్పటిదాకా మేపుకొచ్చింది ఇదిగో.. ఇట్లాంటి ఎన్నిలక్కర్ల కోసమే కదా!  మళ్లా వాళ్లకీ వెన్నుపోటంటే బావుండదు' అని సుద్దులు చెప్పుకొచ్చారు పిల్లకార్యకర్తలు. ఇహ వాళ్ల వైపునుంచి సభల్లో చెప్పులు, ప్రచారంలో సిరాలు, కేన్వాయీల కడ్డంగా పడుకోడాల్లాంటి అల్లర్లు   కల్లో మాటే మా పార్టీ వరకు.
ఈ మధ్య యోగాగురువులు, స్వాములార్లు, వ్యక్తిత్వ వికాస పాఠాలు గుప్పించే పెద్దోళ్ల సేవలు కూడా మా బాగా ముమ్మరించేయాయి కదా అన్ని పార్టీల్లో! అల్లరి కార్యకర్తలకు ఎక్కళ్లేని కరువొచ్చి పడిందందుకే. చిల్లర పన్లేవీ పెట్టుకోకుండా ఎన్నికల గండాలు గట్టెక్కేందుకు  మనకింకా సంపూర్ణ రామరాజ్యంల్లాంటివి సగమైనా వచ్చిచావలేదే!

మేం దిగువసభలకు నిలబడ్డప్పుడు ఎగువనున్న  ఏ పెద్దమనిషీ దిగొచ్చి మాటవరసకైనా    ఒక్క  మంచిమాట మాటసాయంగా అయినా చేసిందిలేదు. పైవాళ్ల పోస్టర్ల నుంచి.. పక్క పార్టీ అభ్యర్థుల పోస్టర్ల మీద పేడముద్దలు, ఊరేగింపుల మీద వేయించే రాళ్ళు రప్పలు.. సోషల్ నెట్ వర్కుల్లో అక్కసులు వెళ్లబోసుకునే దాకా అన్ని తిప్పలూ మేమే పడింది. ఎన్నికలసంఘం లెక్కలడిగినప్పుడు ఎన్ని యాతనలు పడ్డామో  అధిష్ఠానాలకేం తెలుసును? అప్పుడూ మాకే బిల్లు. ఇప్పుడూ మా మనీర్శులకే చిల్లు. దేశమే అట్లా ఏడ్చింది! దరిద్రం!

గతం గుర్తుచేసుకుని కుళ్ళుతూ కూర్చుంటే  భవిష్యత్తుండని పాపిష్టి ఫీల్డ్ ఈ   రాజకీయం. గోల్డనుకుంటారు కానీ.. బైటికే ఆ మెరుపులు!
  
రిటన్ ఆఫ్  రాహుల్ బాబు’ ఎపిసోడ్ చూసి విరమించుకోడమే తప్పించి నిజానికి ఇంటాళ్లక్కూడా కూడా ఆనవాలు చిక్కకుండా ఆ బాబుకు మల్లేనే సెలవు చీటీ ఓటి పారేసి ఇంచక్కా ఎక్కడికైనా చెక్కేసెయ్యాలనిపిస్తుంది ఒక్కోసారి!

వాళ్లెన్నిక చేసినవి గాడిదలైనా.. సరే గెలిచే తీరాలని రెట్టిస్తే ఎట్లా? డ్యూటీలు బలవంతంగా మెడకు చుట్టేసే ఈ అధిష్ఠానాలు.. టిక్కెట్ల పంపకాలప్పుడు మాత్రం ఎన్ని సార్లు దిల్లీ చుట్టూ  చక్కర్లు కొట్టి.. సిగ్గిడిచి కాళ్ళ మీద పడ్డా  కోరుకున్నవాడి వేపు కన్నెత్తైనా చూడవు!  కోటరీలు కట్టే   సూటూకోటుగాళ్ల  మాటలే ఫైనల్గా వాళ్ల చెవులకు  స్వీటు! 

ఎక్కడెక్కణ్నుంచో గాలించి మరీ  తెచ్చి ఇక్కడ నిలబెట్టేస్తున్నారే కాండిడేట్లను! ఇలాకాలో ముక్కూ మూతీ అయినా సక్రమంగా ఎరగని కుంకలను  చంకనేసుకు ఊరేగడం.. కుక్కల్లా విశ్వాసంగా  పార్టీలో పడున్నందుకు చివరికి దక్కే ఖర్మఫలం! ఎన్ననుకున్నా అన్నం పెట్టిన పార్టీ.. ఆనతి పాటించడం ఆనవాయితీ కనక.. తప్పదు.
కానీ.. 
అతి నిజాయితీ,  నీతికి ప్రాణమిచ్చే త్యాగబుద్ధి.. వంకాయ.. ఏం చేసుకోనూ ఈనాటి రాజకీయాల్లో? ఓటరు పన్లకు ఏ మాత్రం  లింకుల్లేని  కార్యక్షేత్రాల నుంచి వచ్చిపడే  మహామేధావుల్ని  గెలిపించే ‘భారం’ మా నెత్తికి  రుద్దితే.. గట్టెక్కించడం అంత తేలికా?

అవతల పార్టీల నుంచి కాలు దువ్వేది గాలి బ్రదర్సుకే పాఠం నేర్పే ఘనాపాటీలు.. గుత్తేదార్లు, రామలింగరాజునయినా నంజుకు తినివూసేసే ఇండస్ట్రియల్ ఎలైట్సూ! అన్నీ లైటుగా తీసుకోబట్టే మాడిపోయిన బల్బులాగా కళతప్పుందిప్పుడు మా పార్టీ భవిష్యత్తు!

అధికారులు అందుబాటులో ఉన్నప్పుడు  చేయరానివి, చెప్పకూడనివి ఏవేవో చేసేసి  మీడియా  పుణ్యమా అని ప్రజాసేవకుల జాబితాలోకొచ్చి పడ్డ స్వాములార్లు, అవతారమూర్తులు,   విశ్రాంత  న్యాయమూర్తులు,  చలనచిత్రాలలో అవకాశాలు సన్నగిల్లిన మహానటులూ, మొహం మొత్తిందాకా   టీవీ సోపుల్లో మొహాలు చూపించి వళ్లు పెంచిన   గ్లామరు గాళ్సూ.. పోటీ! నీతివంతుడన్న ముద్ర పడ్డ పెద్దమనిషి ఎవడన్నా ఈ తరహా సెలబ్రటీల పోటీని తట్టుకుని నెట్టుకురావడమే! మహాత్మా ఫూలే కన్నా ఫూలన్ దేవికే ముందు మెడలో  పూలమాలలు పడే ఫూలిష్ సీజన్ స్వామీ ప్రస్తుతం నడిచేదీ! బఫూన్స్ ను పెట్టి గెలిపించుకు రమ్మంటూ మా ప్రజాప్రతినిధులకిప్పుడు ఈ కొత్త రకం ప్యూను జాబులేంటో?  ఖర్మ౦!

ఈ సారి మా ఇలాకా  నగరపాలిక ఎన్నికల్లో ప్రస్తుతానికి మేమున్న  పార్టీ పక్షాన నిలబెట్టబడ్డ పెద్దమనిషి అదేదో విదేశీ నిధుల సాయంతో స్వచ్ఛందంగా సేవా సంస్థలు

రెండు భారీగా నడుపుకొనే బడా హస్తి.  మూడొంతులు  వేలిముద్రగాళ్లతోనే ఓటర్ లిస్టులన్నీ కిక్కిరిసున్న   ఇలాకాలో విదేశీ చదువులు ‘కొన్న  విద్యావేత్తను గట్టెక్కించడమా?   వరద పొంగుకొట్టుకెళ్లే గార్దభాన్ని  నిండుగోదారి కెదురెళ్లి  గట్టుకీడ్చుకు రావడం ఇంత కన్నా ఈజీ.




ఏట్లో దూకినోడు గట్టెక్కాలంటే సొంతంగానే ఈదనక్కర్లేదంట! మోతగాళ్ల రెక్కల కష్టం పుష్కలంగా ఉంటే చాలన్నది  మా పాత పార్టీ బొజ్జపెద్దల నయా సిద్ధాంతం. నిజమే కావచ్చేమో కానీ మోసే చిల్లర గాళ్లకే ఎక్కళ్ళేని కరువొచ్చి పడిందయ్యా స్వాములూ ఇప్పుడు! ఆ ఉత్పాతం పార్టీ పసిగట్టకపోడమే  మా ఉపద్రవాలకు మూలకారణం.

స్వచ్ఛంద సంస్థల పెద్దాయన వ్యక్తిగత జీవితం మరీ శుద్ధమబ్బా!  సర్కారు కొలువులు వెలగబెట్టే రోజుల్లో ఒక్క పైసా కూడా ముట్టని అర్భకుడన్న చెడ్డపేరొకటి పెద్ద మైనస్ గా మారిందిప్పుడు సామాజిక మాధ్యమాలలో  కార్చిచ్చులా అంటుకుని.

రేప్పొద్దున నిజంగానే ఎన్నికయి ఊరి మొత్తానికి ఫస్ట్ పెద్దమనిషి అయిపోతే ఇలాకా అభివృధ్ధి  గతి ఏంటీ? అంటూ రచ్చ. ఎక్స్పార్టీవోడికి ఇదే పెద్ద బ్రహ్మాస్త్రంగా మారిందిప్పుడు!

ఏ ప్రభుత్వ భూమీ  కబ్జాకాస్కారం ఉండదు! ముందే ఆక్రమించిన భూముల్నయినా తిరిగి లాక్కునే ప్రమాదం కద్దు! అసైన్ మెంటనో.. అసెస్ మెంటుల్లో లోపమనో.. ఏదో ఓ సిల్లీపాయింటు పట్టుకుని సెటిల్ మెంట్లన్నీ అంట్లగిన్నెల డబ్బీలో వేసేస్తానని మొండికేస్తేనో? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చి పడే పిసరంత నిధులను కూడా అచ్చంగా ఆయా పథకాలకు మాత్రమే వెచ్చించి తీరాలని ఖచ్చితంగా నిబంధనలు పెట్టేస్తేనో? ‘పట్టించుకోం..  పో.. దిక్కున్న చోట చెప్పుకో!’ అంటూ మునపట్లా చిందులేస్తామే అనుకోండి! అయినా అందర్లా  ‘ఊఁ’ కొట్టి ఊరుకొనే ఘటమైతే తంటానే లేదు. మొండిఘటమని ట్రాక్ రికార్డులు అఘోరిస్తున్నాయే! కోర్టు బోనులకెక్కిస్తేనో మళ్లీ! మన తంటాలేవో మనం పడి గుట్టుగా బెయిళ్లు కొనుక్కు తెచ్చుకున్నా వెంటనే రద్దు  చెయ్యాలని  కోర్ట్ల మీదకు తిరగబడితేనో? గడ్డివాములోని కుక్క సామెతబ్బా  .. వీడిని ఎన్నుకుంటే!  అడ్డమైన గడ్డికీ అలవాటు పడ్డ పశువులం మన నోట్లో మన్నే కదా పడేది చివరికి? అని గోడు.

లోపాయికారీగా మా ఏడుపూ అదే .. నిజం చెప్పద్దూ! ఎన్ని తరాల బట్టో  అనుభవిస్తున్నవీ భోగాలన్నీ! అడిగేనాథుడు రాలేదిప్పటి దాకా. ఇప్పుడీ చాదస్తపు ప్రజాసర్వెంటొకడొచ్చి  విద్యుత్ బిల్లులు.. వాటర్ బిల్లులు, ఆస్తి పన్నులు.. వృత్తి పన్నుల.. ఆ పన్నులు ఈ పన్నులంటూ పాత దస్త్రాలన్నీ కెలికించేసి బకాయిలతో సహా అపరాథ రుసుం, దాని మీది చక్రవడ్డీతో   లెక్కగట్టి అసల్తో కలిపి మొత్తం ఏ వారం రోజుల్లోనో కట్టేసెయ్యాలని గట్టిగా లాయర్ నోటీసుల్తో దాడికొచ్చేస్తేనో!

దాచిపెట్టిన పన్ను ఎగవేత కేసులన్నీ వెతికించి తిరగతోడితే? కూడేసి కూతుళ్ల పెళ్లిళ్లకు, కొడుకుల వ్యాపారాలకు తరలించేసిన సొమ్ములన్నీ తిరిగి తెచ్చిమ్మంటే? ఎక్కణ్నుంచని పీక్కుని తెచ్చిపొయ్యడం! ఏడుకొండలవాడి హుండీలో వేసిన సొమ్మునైతే వెనక్కు లాక్కోలేం కదా!

గమ్మున  కూర్చొనే తిమ్మయ్యయ్యా మన పట్టనానికి ఇప్పుడు అధినేతగా రావాల్సిందీ?  చదూకొన్న వెధవామాయ ఈయన! కోర్టు రూల్సు అన్నీ కొట్టిన పిండంటున్నారు! రాజ్యాంగంలోని రహస్యాలన్నీకంఠతా పట్టేసి సివిల్సులో నెంబర్ ఒన్ గా వచ్చినోడితో పోరే మార్గం ఏది?        కోర్టుల్లో పడి వీడితో పోరుతూ కూర్చుంటే వచ్చే ఎన్నికలకు అయ్యే    ఖర్చులు మళ్లీ  దక్కించుకునే దారులు వెదికే తీరిక ఎదీ?


పార్కులు, పార్కింగు స్థలాలు,  పాదచారులు నడిచే   దారులు పాదచారులకే అంటూ కొత్తరకం చాదస్తాలు దస్తాలకు దస్తాలు సిద్ధం చేసుంచాడని టాకు! ఆ సరికొత్త సకల సౌకర్యాలకూ జనాలు  అలవాటు పడిపోతే మింగటానికింక నేతాగణాలకి  మిగిలే జాగా ఒక్కరంగుళమైనా మిగిలుంటుందా? భూముల  ఆక్రమణల కోసం అడ్డొచ్చిన ప్రతీ చెట్టూ చేమా, పుట్టా గుట్టా కొట్టేసుకుపోతున్నామిప్పుడి దాకా! అడిగే దమ్మెవడికీ లేదు. నేరస్తుల శిక్షాస్మృతిలో వాటికీ శిక్షలు ఇన్నున్నాయని తెలిసిపోతే మన ఇళ్లల్లో  పనిచేసే పనివాళ్లల్లో కనీసం ఒక్కళ్లకైనా బెయిలుకు వీలయ్యే శిక్షలు పడకుండా తప్పే దారుంటుందా?  

ఆటస్థలాల్లేని పాఠశాలలు, రక్షణవ్యవస్థ పటిష్టంగా లేని పర్యాటక ప్రాంతాలు,   నిబంధనల ప్రకారం  వైద్యసేవలందించని వట్టొట్టి వైద్యశాలలు, పరిశుద్ధమైన పదార్థాలు తాజాగా వడ్డించని పాచి భోజనశాలలు, వాహదారుల వాడకానికి తగినంతగా జాగాలు చూపించని టిక్కీ వినోద, వ్యాపార కేంద్రాలు.. గుర్తింపులు రద్ధయేదాకా నిద్ర పోనంత చండశాసనుడని ముందు నుంచే చెప్పుకుంటున్నారు ఈయన గురించి! మన భద్రత కోసం అంకితమై  అహర్నిశలు జనాలను అదుపుచేసే కార్యకర్తలకు రిటర్న్ గిఫ్ట్స్ గా మనమింకేం  కంట్రాక్టులు జనం సొత్తు దోచి  ఇప్పించగలం?

శిరస్త్రాణాలు, సీటు బెల్టులు, పరిమితికి లోబడి మాత్రమే నియమిత వేగంతో అనుమతించిన దారుల్లో వాహనాలు నడపడాలు! ఇదేమైనా అమెరికా దేశం న్యూయార్కు నగరమా! ముచ్చటపడితే నడుపుకోడానికి హోండాలు, బెంజీలు  మునిమనమళ్లకు ఏ బర్త్ డే కానుకులుగా ఇచ్చుకోడమూ నేరమేనా? కాలుష్యం పెరుగుతుందని చెప్పి కాళ్లరిగిపోయేటట్లు ఇంటాడాళ్లు కాళ్లాడించుకుంటా షాపులెంట చీపుజనాలతో వీపులు రుద్దుకుంటా  తిరుగులాడాల్నా? లాకౌట్లు  చేయిస్తా, కటౌట్లు పీకేయిస్తా అంటుండె! పేకాట క్లబ్బులకు  లాకులు వేయిస్తే ఇంటళ్లుళ్లు ఇంకేదో దేశం పోయి  టైం పాస్ చేస్తేనో.. కూతుళ్ల మాటేమిటి?    

చ్చమొచ్చిన చోట మలమూత్ర విసర్జనలు చేస్తే పబ్లిక్కున పెట్టించి పరువు తీస్తా! ధూమపానం చేస్తున్నట్లు పదిమందిలో కనిపించినా, బస్టాండుల్లాంటి చోట్ల ఆడబిడ్డల్ని పట్టుకుని వేధించినా అక్కడికి అక్కడే అరెస్టులు చేయించేస్తా! గుళ్లు, మసీదులు, చర్చీల ముందు చేరి చెవులు దిబ్బెళ్లడేలా డోళ్లూ బూరాలతో హార్మోనీ పెట్టెలతో  శబ్దాలు గాని  చేస్తే న్యూసెన్స్ కేసులు బనాయించేస్తా! ఇంటాడాళ్లను వేధించడం, పసిపిల్లకాయల చేత పనిపాటలు చేయించడం సహించరాని నేరం.. తక్షణమే యాక్షన్ తప్పదనడం.. ఓవరాక్షన్ కాదూ! శాంతి భద్రలు మరీ ఇంత ఘోరంగా అదుపులో ఉంటే ఒక్క పార్టీ కార్యకర్తనయినా ఊచల కివతల ఉంచేసుకోగలమా? కితకితలు కాకపోతే ..  కట్టుకున్న దానిని, కన్న తల్లిదండ్రులను ఇంటైనా బయటైనా అమానుషంగా హింసించినట్లు సమాచారముంటే సహించడమనే మాటే ఉండదంటూ ఇప్పట్నుంచే ఎన్నికల్లో ఉపన్యాసాలు దంచటాలేవిటంట! కూరగాయల బజార్లలో నిలువు దోపిడీలు జరుగుతున్నాయ్! పళ్ళను మగ్గబెట్టేందుకు కృత్రిమ  రసాయనాలు వాడేస్తున్నారు. చట్టం అనుమతించని ఏ ఒక్క అసాంఘిక చర్యకు ఎవరు పాల్పడ్డా, అంతస్తులతో నిమిత్తం లేకుండా చట్టబద్ధంగా ఉంటూనే కఠినంగా వ్యవహరిస్తా!’  అంటూ ఏమేమో    పట్టణ ప్రజాజీవనం  ప్రశాంతంగా సాగిపోవాలని పెద్ద తానొక్కడే  తహతహలాడుతున్నట్లు డే అండ్ నైట్,  పోయిన ప్రతీ చోటా బారెడేసి ప్రసంగాలు.. మా చదువుకొన్న అభ్యర్థిగాడిదవి!  అక్కడికీ ఎన్నోసార్లు చిలక్కి చెప్పినట్లు విపులంగా చెప్పి చూసాం. వింటేనా!  పై వాళ్లకి ఫిర్యాదులు చేసే విఫల ప్రయత్నమూ  చేసాం.  మా వంతు బాధ్యతగా అలవాటైన అల్లర్లతో ప్రచారం ఎప్పట్లానే.. మాకున్న వనరులకు లోబడి నిజాయితీగానే  నిర్వర్తించాం. అదొక్కటే చివరికి నిబద్ధత కలిగిన  పార్టీ ప్రజాప్రతినిధిగా నాకు   మిగిలిన సంతృప్తి.

కల్కి వచ్చి ధర్మరక్షణ చేసే ముందే దుష్ట  భక్షణకు మానవమాత్రుడు గత్తరపడితే ఫలితం ఎలా ఉంటుందో.. అంతకన్నా దారుణంగా వచ్చింది ఎన్నికల రణంలో మా పరాజయం.  

కలియుగంలో కలియుగంలా మాత్రమే పాలన సాగాలన్న ప్రగాడమైన అభిప్రాయమే ఓటర్లకు ఒన్ సైడెడ్ గా ఉన్నట్లు రూఢీ అయింది. మేము ఊహించినదానికన్నా దారుణంగా ఓడిపోయాడు మా పార్టీ నిజాయితీ పెద్దమనిషి!

అందునా ఎదుటి పక్షం నుంచి తొడ చరిచిన ఉస్తాదు..  ఎన్నో తరాల బట్టి ఇక్కడి ఎన్నికల గోదాలో నిలబడి ఎదురు లేకుండా గెలుచుకొస్తున్న వంశం నుంచి వచ్చిన అంకురం.  నియోజకవర్గం ఓటర్లలో అధిక శాతంగా   ఉన్న కులం నుంచే వచ్చిన అభ్యర్థిని ఏ కారణంతో కులం.. మతం.. దేవుడు.. దయ్యం.. లాంటి సెంటిమెంట్లేవీ లేవని పబ్లిగ్గా నిక్కే  అభ్యర్థి కోసం వద్దని నిరాకరిస్తుందీ పబ్లిక్కు ?

ఎన్నికలంటే ఒక నెలరోజులు మించి సాగని సంబరాలు. ఆ తరువాత? మంచికైనా.. చెడ్డకైనా  ఆదుకొనేదైనా.. అడ్డుకొనేదైనా ఎవరని కదా కామన్ మ్యాన్ కామన్ గా చూసుకొనేది! అసాంఘిక శక్తుల ఆరాధ్య దైవాన్ని కాదని ఓ నిజాయితీ పరుడైన విదేశీ మేథస్సుగల స్వచ్ఛంద  సేవా తత్పరుణ్ణి  ఏం భరోసా కల్పించి  గెలిపించడం మా బోటి ఔట్ డేటెడ్ పార్టీలోని అట్టడుగు స్థాయి నాయకత్వం? మా పార్టీ తరుఫున నిలబడ్డ మహా మేధావి ధరావతుకూడా గల్లంతయిందని వేరే చెప్పనవసరం లేదనుకుంటా.

ఓటమికి బాధ్యత వహిస్తూ నన్ను రాజీనామా చెయ్యమని  అధిష్ఠానం ఆదేశం.  ఎన్నో లక్షలు పోసి, ఎంతో  శ్రమదమాదులకోర్చి గెల్చుకున్న ఎమ్మెల్యే సీటిది. వద్దని దులపరించుకు పోవడం అంత సులభమా?  ఎదుటి పార్టీలోకి దూకేస్తే పస్తుతానికి  నా ప్రజా ప్రతినిధి పదవిని  కాపాడుకోవచ్చని అందరిలానే నాకూ ఆలోచన వచ్చింది.
తప్పేముంది?  బిజెపిని గెలిపించినంత మాత్రాన ప్రశాంత్ కిశోర్ అచ్చంగా భాజపాకే ఎన్నికల సలహాదారుడిగా  అంకితమయిపోయాడా? మొన్నటి దిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఛీఫ్ అడ్వయిజర్ గా పనిచేసాడా లేదా? రాజకీయాల్లో ఏదైనా సంభవమే! 

ఎదుటి పార్టీతో రాజీ బేరాలు మొదలయ్యాయి.  చర్చలు చివరి అంచె దగ్గర కొచ్చి స్థభించాయి. నా బేరానికి మరో అభ్యర్థి డ్డురావడమే ఆందుక్కారణం.

ఆ అభ్యర్థి వేరెవరో అయితే ఈ కథే చెప్పక పోదును. ఎవరి మూలకంగా అయితే నేను రాజీనామా చేయవలసి వచ్చిందో.. ఆ స్వచ్ఛంద సేవా సంస్థల అధిపతి! 'మీ  ముసలి పార్టీ నన్ను ఎలాగూ గెలిపించలేక పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  గూండా  పార్టీ ద్వారా నిలబడతాను. నా సంస్థల్ని కాపాడుకోడానికి ఈ 'వాల్ జంప్' తప్పడం లేదు. సారీ' అనేశాడా స్వం. సం. సేవాభావ ప్రజల పెద్దమనిషి! ముందే చెప్పాగా ..  రాజకీయాల్లో ఏదైనా సంభవమే!

కర్లపాలెం హనుమంతరావు
    
(సూర్య దినపత్రిక – ఆదివారం, 29 -02 -2020 నాటి సంపాదకీయ పుట,  ‘సరదాకే’ శీర్షికలో ప్రచురితం)




Tuesday, February 25, 2020

మీర జాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్!





శ్రీస్వర్గానికి వెళ్ళి, వేయికన్నుల దేవరతో పోరు సలిపి మరీ సాధించుకున్న పారిజాతమూ, ప్రతిష్ఠ రెండూ సవతి ముందు వెలతెలపోతే సత్యభామలాంటి స్వాధీనపతిక ఊరకుంటుందా?  అన్నింటికంటే మిన్న, ఏడేడు లోకాల రేడు అయిన తన పతిని ఐశ్వర్యం ధారపోసైనా దక్కించుకుంటుంది. వ్రతవిధానమహిమ వలన తాను గీసిన గీటు దాటని కృష్ణుని ఊహించుకుని మురిసిపోతుంది.

"మీరజాలగలడా నాయానతి.." అని వ్రతఫలితాన్ని ముందే కళ్ళకు కట్టించుకుని ఆనందించే సత్యభామకు ఎన్నో తెలుసు. అన్నీ తెలుసు. నటన సూత్రధారి తన చేతికే కాదు, ఎవరికీ చిక్కడని ఆమెకు తెలుసు. అయినా సరే.. నోము పూని కట్టేసుకుందామని ఆశ! ఎంత ప్రియమైన పూనికో కదా ఆమెది? అన్నీ తెలిసీ దేనికీ అమాయకత్వం? అదే ఆమెకు కృష్ణునిపై గల గాఢానురాగానికి గీటురాయి.

మనోహరుని చేరుకునేందుకు మమతల వారాశిని ఈదేందుకు తనతో మరెవరూ పోటీ లేరని నొక్కి చెప్తోంది. సత్యభామకు తన ప్యత్యర్థి పేరు పలకడం సైతం ఇచ్చగించ లేదు. "వైదర్భికి.." "అదిగో.. వాళ్ళమ్మాయి ఉందే..!" అని ఈసుగా మాట్లాడినట్టే! సవతిపై ఆ మాత్రం అయిష్టం ఉండాలి మరి! ఉంటేనేగా ఉమ్మడి సొత్తు మీద తనకున్న పట్టుదల, తన ఆభిజాత్యమూ బయటపడేది. ఆఖరికి సత్యాపతి కూడా తనతో వాదులాడి ఆమెను వెనకేసుకురాడని ధీమాగా చెప్తోంది. "సత్యాపతి" అంటూ ఎంత గోటు ఒలకబోస్తోందో!
గీర్వాణమే కానీ ఈ భామ మనసులో ఇంకేం లేదని పొరబడేరు! వ్యయప్రయాసలకోర్చి ఈ నోము దేనికి..? మధుర మధుర మధురాధిపతిని కైవసం చేసుకునేందుకు. కృష్ణుని ప్రణయ సామ్రాజ్యానికి ఆధిపత్యాన్ని కోరుకుని కదూ! ఆ ఊహకే ఆమె మనసు ఎంత మైమరచిపోతోందో.. ఒక్క మధురమైన వాక్యంతో కనులముందు నిలిచే రాసక్రీడ "మధుర మధుర మురళీగాన రసాస్వాదనమున అధరసుధారసమది నే గ్రోలగ.." వేణువల్లే కన్నయ్య పెదవిని చేరి చెంగలించాలనే కాంక్ష!  "నేనంటూ వ్రతమూనాక, నేనంటూ ముద్దుముద్దరలేసాక.. నన్ను వదిలి పోగలడా?" అని అణువణువునా స్థైర్యమే! ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం సత్యభామ.
"స్థానం నరసింహారావు" రచన, సుమసౌకుమార్యమే కాక కాసంత పొగరూ, వగరూ.. అంతకు మించి ప్రియునిపై పట్టలేని ప్రేమా ఉన్న ప్రియురాలి మనసుకు అద్దం! చలనచిత్రం కోసం వ్రాసిన గీతం కాకపోయినప్పటికీ సినీవినీలాకాశంలో అందాల జాబిల్లి.
మీర జాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
నటన సూత్రధారీ మురారీ
ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
సుధాప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోనిక
వాదులాడగలడా సత్యాపతి
మధురమధుర మురళీగాన రసాస్వాదనమున
అధర సుధారసమది నే గ్రోలగ
మీరజాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
(సోర్స్ః కొత్తావకాయ బ్లాగ్)
అయితే ఈ 'మీర జాలగలడా నాయానతి/వ్రతవిధానమహిమన్ సత్యాపతి' పాట పుట్టుకను గురించి ఇదిగో స్థానం నరసింహారావుగారే స్వయంగా తన 'నటస్థానం' లోచెప్పిన ఈ ముక్కలు చదవండి.. ఆసక్తికరంగా ఉంటాయ్!
(సోర్స్ః ఆదివారం ఆంధ్రజ్యోతి- అనుబంధం మొదటి పేజీ- బహుళం -17 ఏప్రిల్ 2011 సంచిక నుంచి)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
25 -02 -2020

Monday, February 24, 2020

చురుక్కులు- కర్లపాలెం హనుమంతరావు


బొగ్గు మంటతో
కాగ్ తోంది
దేశం

***

బొగ్గు ఇనుము బాక్షైట్
రత్న గర్భ నాదేశం
గర్భాదానమే 
అక్రమంగా జరిగిపొయింది
***
2-జీ ఒక ‘వేలం’ వెర్రి
‘బొగ్గు’ 
ఆ వేలం కూడా లేని వెర్రి

***

బొమ్మ న్యాయం
బొరుసు అన్యాయం
రెండూ బొరుసులే ఉన్న నాణెం
-రాజకీయం

***

నల్లధనం-
ఏ కనిపించని నాలుగో సింహం
నోట్లోనో!

***

మంత్రివర్యా… తిన్నంగుండు
తప్పుతుంది
తిరుపతి గుండు!

***

రైతు దేశానికి వెన్నెముక…
సరే!
వెన్నెముక లేని 
పాలనా మనది?

***

నెలలు నిండకమునుపే
బడికడుపు నుండి బయటకొచ్చేస్తున్నాడు
ప్రీమెచ్యూర్ డ్ బుడతడు!

***

ఓబులాపురం గనుల కేసు-
'గాలి'తో చేసే యుద్ధం 

***

జెడి కాల్ లిస్ట్ కేసులో
తత్కాల్ బుక్ చేసుకున్నాడు
వెంకట రెడ్డి!

***

వాన కావాలా!
వరుణయాగం ఎందుకు
ఉప్పల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడించు!

***

విద్యుత్
రిలయన్స్ గాలికి పెట్టిన దీపం!

***

కరువు వల్ల భక్తుల రాక తగ్గింది
వర్షాల కోసం దేవుడూ
ప్రార్థిస్తున్నాడు!

***

తివిరి
ఇసుమునా
'తైలంబు' తీయవచ్చు!

()()()


-కర్లపాలెం హనుమంతరావు
30-08-2012

Saturday, February 22, 2020

సరదాకేః గందరగోళం జమానా -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ప్రచురితం




'మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
 మాతృ భాష యొండు మాన్యము గదా
 మాతృ శబ్దము విన మది పులకింపదా?
 వినుత ధర్మశీల తెనుగు బాల' ఈ పద్యం ప్రత్యేకత రచన చేసిన కవి ఒక ముస్లిమ్ మతానుయాయుడు కావడం. ఇది   'తెనుగుబాల' శతకంలోని ఒక నీతి పద్యం, రాసింది ముహమ్మద్‌ హుస్సేన్‌ .

పేర్లు ప్రత్యేకంగా చెప్పకపోతే  తెలుగు కవుల సృజనే అని మురిపించే సాహిత్యం  తెలుగునాళ్లల్లో ముస్లిం కవులు, రచయితలు  కొంత సృష్టించిన మాట నిజం. 

వినుకొండ వల్లభరాయుడి 'క్రీడాభిరామం' తలలేని రేణుకాదేవి విగ్రహం ముందు నాటి వెలివాడ ఆడపడుచులు నిర్వస్త్రంగా వీరనృత్యాలు చేయడం  అత్యద్భుతంగా వర్ణించింది. అదే పంథాలో అజ్మతుల్లా సయ్యద్ అనే ఓ ముసల్మాన్ కని దేవరకొండలో జరిగే జాతర దృశ్యాలను నాటి సాంఘిక పరిస్థితులు కళ్లకు కట్టేవిధంగా వర్ణించారు. సర్కారు ప్రకటిత జాగాలో జరిగే సంతలో  డబ్బున్న మహిళలు రకరకాల వస్త్రవిశేషాలు సందడిగా కొనుగోలు చేయడం దమ్మిడీ చేత లేని లంబాడీ ఆడంగులకు దుఃఖం కలిగిస్తుంది. ధనికమహిళల నవ్వులకు  ఉడుక్కుంటూ 'మాకీ జూసి నగ్తర్/మీకీ తలిదండ్రి లేవె మీ నే తు/ప్పాకీ తీస్కొని కొడ్తే/మాకీ పాపంబిలేద్రె..'అంటూ  ఆ బీద  లంబాడీ బిడ్డలు పోయే  షష్టాష్టకాలకు నవ్వూ వస్తుంది.   ఆనక  మనసుకు కష్టమూ అనిపిస్తుంది. తమ మతస్తులను అన్యమతానుయాయులు అన్యాయంగా అవహేళన చేసే అవలక్షణానికి అన్యాపదేశంగా కవి ప్రకటించే నిరసన అది. నిజానికి నిత్య వ్యవహారంలో తెలుగు నేలల మీద.. ముఖ్యంగా దక్షిణాదిన ఏ ముస్లిమ్ మతస్తుడూ ఆ తరహా వెకిలి యాసతో మాట్లాడడు. మాటలో కొంత తేడా ఉన్నా అది భాషాభేదం వల్ల కాదు; సంస్కృతుల మధ్య ఉండే సన్నని తారతమ్యపు తెర అడ్డు వల్ల!

తెలుగు మాగాణులల్లో శతాబ్దాల బట్టి తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలలో పాలలో తేనెలా కలగలసిపోయిన ఘనత ముస్లిములది. నల్లగొండ జిల్లా చిత్తలూరు గ్రామానికి చెందిన ఇమామల్లీ సాహెబ్ అని ఒక కవిగారికి కులమతాలనే వివక్ష లేదు. కవి అని తనకు తోచిన ప్రతీ సాహిత్యజీవికి అంతో ఇంతో సాయంచేసే సద్బుద్ధి ఆయనది. సాటి హిందూ కవి ఎవరో  సాహెబుగారి ఔదార్యాన్ని 'అల్లాతుంకు సదా యతుం సె ఖుదచ్ఛచ్ఛాహి ఫాజత్కరే/ఖుల్లాహాతుగరీబు పర్వరినిగా ఖూబస్తునాం మైసునే/అల్లాదేనె మవాఫికస్తుహర్ దూస్రే కోయి నైహై ఇమా/ మల్లీ సాహెబ్ చిత్తలూరి పుర వాహ్వా దోయిలందార్బలా ' అంటూ  ఉర్దూ మిశ్రిత ఆంధ్రంలో ఛందోబద్ధంగా శ్లాఘిస్తాడు.

ఆచార్య తూమాటి దోణప్పగారు ‘జానపదకళాసంపద’ ప్రకారం తెలుగులో తమకు కావలసిన సాహిత్యం తామే సృష్టించుకున్న ఘనత జనపదాల ముస్లిం జాతిది. ఉరుదూమయంగా ఉండే భాషాగీతికలను తెలుగు లిపిలో రాసుకుని కొరాను సమీప భాషలో పాడినట్లు తృప్తిపొందడం ఉండేది ఒకప్పుడు.ఈ ఝంఝాటమంతా ఎందుకని ఏకంగా తెలుగులోనే అల్లాకు ప్రార్థనలు సలిపే సాహిత్యం సృష్టించుకున్నారు ముస్లిం జనపదులు.

బ్రౌను దొర ఎన్నో తెలుగు సాహిత్య గ్రంథాలను మహమ్మదీయల నుంచే సేకరించారు. ‘రసికజనమనోభిరామం’ అనే కావ్యాన్ని శేబు మహమ్మదు సాహెబు ప్రతిని అనుసరించి రాయించుకున్నారు బ్రౌన్ దొర.శృంగార నైషధం ఎనిమిది ఆశ్వాసాలు’ ఆ సాహెబుగారి గ్రంథాలయం నుంచే  దొర సేకరించింది! బనగానపల్లి నవాబులకు హిందూమతమంటే ఆదరం. తెలుగు సాహిత్యాన్ని ఇష్టంగా పోషించారు. 'వాలిన సిద్ధేంద్రస్వామిని కృప/నేలిన వైకుంఠదాముని/ కేలికి రమ్మాని కిటుకపరచి మందు/లాలించి పతికి తాంబూలముతో బెట్టె' అంటూ ఒక భామాకలాపం 'మందులపట్టు' దరువులో సిద్ధేంద్రయోగి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ సిద్ధయోగీంద్రుడి 'సిద్ధయోగీశ్వర విలాసము' ద్విపద కావ్యం రచనకు ప్రోత్సాహం లభించింది ఆ ఇలాకా జాగీర్దారు భ్రాజత్ ఖాన్  నుంచే.

జమీందారి యుగంలో కొందరు తెలుగు ముస్లిములు శిష్టసాహిత్యం సృష్టి చేసారు. ధారాళమైన ధారలో ‘ఉమర్ ఖయ్యాం -ఈశ్వరుడు’ పేరుతో వ్యాసం రాసిన పిఠాపురం  మతగురువులు ఉమర్ ఆలీషా  విస్తృతమైన తెలుగు సాహిత్యం సృష్టించారు. షేక్ మౌలా మున్షీ 'నీతి వాక్య రత్నాకరం'  చింతామణి పత్రికలో  ప్రచురితమయింది. ‘సత్యాన్వేషి’ పత్రిక పెట్టి జుజులుల్లా సాహెబు కొంతకాలం ప్రచురించిన ఖండన వ్యాసాలు 1892 ప్ర్రాంతాలలో తీవ్ర  వివాదాలకు దారితీసాయి. ‘పారశీక వాజ్ఞ్మయమచరిత్ర’ను మూడు భాగాలలో భారతి - 1932 నాటి సంచికలలో ప్రచురించిన మొహమ్మద్ ఖాసిం ఖాన్ గారికి శ్రీ శ్రీ, పురిపండా, అబ్బూరి వంటి తెలుగు ప్రముఖలతో సన్నిహిత  సాహిత్య బంధం కొనసాగింది. ‘ఓరుగల్లు చరిత్ర’ రచయిత సాహెబ్ అహమదల్లీ,  హైదరాబాద్ తెలుగు సాహిత్య అకాడమీ అధ్యక్షపీఠ మెక్కిన అళ్ హజ్ మహమ్మద్ జైనుల్ అబెదీన్,  అరబ్ నివాసులుహిందువులా?’ అంటూ 1938,జూలై నాడే భారతిలో చర్చ చేసిన మౌల్వీ షాజిక్, ‘తౌహిద్ కా రవుషన్’ పేరుతో సర్వమతసార సంగ్రహంలో విస్తారంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ఆచార వ్యవహారాలను, ప్రార్థనాది కర్మకాండలతో సహా వివరించిన షేక్ మీరా జాన్.. ఇలా ఎందరో తెలుగు సాహిత్యానికి సేవలందించిన ముస్లిం మహానుభావులు!



మెహబూబ్ నగర్ జిల్లా మొదటి పేరు పాలమూరు జిల్లా. కరువుకాటకాలకు ఆ జిల్లా మారుపేరు. పనిపాటలు చేసుకుని పొట్టపోసుకునే శ్రామికజీవులు అధికంగా ఉండేదీ అక్కడే! అనావృష్టి పరిస్థితుల కారణంగా కూలీ నాలీ జనం తరచూ వలసబాట పట్టే దుర్భిక్ష స్థితులకు కదలిపోయి 'తూఫాను వానలే తుదికి గతియాయె/ ఋతుపవనాలెల్ల గతిని దప్పె/ చెఱువులు కుంటలు దొరువులు జాలులు/ఇంకి నెఱ్ఱెలు వారె బంకమట్టి/వర్షాలు కురియక కర్షకులెల్లరు/ బ్రదుకుదెరువు బాసి బాధపడుచు/గొడ్డు గోదముల నెల్ల గడ్డి గాదెము లేక/దుడ్డుదమ్మిడికమ్మి దుఃఖపడుచు/లేబరై గుంపుగుంపుగ లేవసాగె/తాళములు వేసి ఇళ్లకు తల్లెచెంబు/కుదువబెట్టుచు కూటికై వదలి రిపుడు/పల్లెలెల్ల లబోమని తల్లడిల్లె' అంటూ పుట్టెడు ధుఃఖంతో పుట్టిన ఊళ్లను తలుచుకుని  జహంగీర్ మహమ్మద్ అనే ముస్లిం కవి భోరుమన్నారు.  ఏ ముస్లిమేతర కవి ప్రతిభ ముందు తక్కువ తూగదు జహంగీర్ సాహెబ్ తెలుగు పలుకుబడి.

ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్య సంపుటాలలో పేర్కొన్నట్లు తెలుగు నాళ్లలో ముస్లిములు సంఖ్యాపరంగా కూడా తక్కువేమీ కాదు. ఇస్లాం, అరబ్బీ, దక్కనీ, పారసీ పదాలతో తెలుగుభాష ఆదానప్రదానాలు సుసంపన్నమయిన తీరు అపూర్వం. కుంపిణీ పాలనకు ముందు తెలుగువారి రాతకోతల్లో  పాలలో నీళ్లలా ఉర్దూ, పారశీక పదాలు ఎన్నో వాడుకభాషలో కలగలసిపోయాయి. ఇంగ్లీషు పాలకులకూ పాలనాపరిభాషగా ఉర్దూ, పారశీ పదాలే అందుబాటులో ఉన్న పరిస్థితి ఒకప్పటిది. దక్కను ప్రాంతంలో తెలుగువారు చాలా దశాబ్దాల దాకా  ఉర్దూ మాద్యమంలోనే విద్యాభ్యాసం చేసిన కాలం కద్దు. విద్యాధికులైన తెలుగువారి కారణంగా కొంత  ఉర్దూ సాహిత్యం వర్ధిల్లింది! కానీ అచ్చంగా ముస్లిముల మూలకంగా తెలుగు సాహిత్యం ఆ  జనాభా దామాషాలో వృద్ధిచెందింది కాదు. పరిశోధకులు మరింత లోతుగా  పరిశీలించవలసిన అంశమిది.

దక్షిణాంధ్రం  చూస్తే  ముస్లిం జనాభాలో అధిక శాతానికి ఉర్దూ పలుకు నోటి వరకే పరిమితం. రాయడం దగ్గరకొచ్చేసరికే ముస్లిముల పాత్ర బహు స్వల్పం! తెలుగు సంస్కృతితో గట్టి అనుబంధం ఉన్నప్పటికీ వాజ్ఞ్మయంలో   ఆ మేరకు బంధం ఎందువల్ల బలపడింది కాదో?

ఈ సాధారణ సూత్రానికి మినహాయింపుగా ముస్లిం కవులు తెలుగులో కొంత సాహిత్య సృజన చేసిన మాట బొత్తిగా కొట్టిపారవేయలేం. రాసిలో కాకపోయినా వాసిలో తెలుగు  సాహిత్యంతో పోటీకి దిగగల సత్తా ఉర్దూ సాహిత్యానికి ఉంది. మరుగున పడ్డ ముస్లిం కవులను గురించి  మరుపూరు కోదండరామరెడ్డిగారు మరువలేని అంశాలు కొన్ని ప్రస్తావించారు.  దావూద్  అనే ఇస్లామిక్ కవి 'దాసీ పన్నా'  ఖండిక దొరకబుచ్చుకుని చదువుకునే దొరబాబులకు ముస్లిం కవులు సాహిత్య సృష్టిలో ఒక్క ఆలోచనాధారలో తప్ప తతిమ్మా అన్నింటా సమవుజ్జీలేనని ఒప్పుకోక తప్పదు.  రాజపుత్రుడి రక్షణ కోసం, పన్నా తన పుత్రుణ్ని బలికానిచ్చింది. ఆమె త్యాగం గొప్పతనాన్ని శ్లాఘిస్తూ దావూద్ హుస్సేస్ సాహెబ్  రాసిన కవిత ఎంతో కరుణరసాత్మకంగా సాగుతుంది. 'సతత వాత్సల్యంబు జాల్వార్చి పోషింప/ తలపు గొన్నట్టి నీ తల్లిలేదు/ అఖిలార్ద్రతను నీకు నర్పించి/ మమతలం/ దలడిల్లునట్టి నీతండ్రిలేడు/ఆత్మరక్తమై తమ్ముడంచు మించిన ప్రేమ/నరసి పాలింప నీ అన్నలేడు/ రాజపుత్రుడితండు రక్షణార్హుడటంచు/ పరికించు పాలిత ప్రజయు లేదు/ దిక్కుదెసగలవాడవై దిక్కుగనక/శోకసంతప్త భావనిస్తులత తోడ/ శత్రువుల మధ్య జిక్కిన సాంగపుత్ర/ నిన్ను పన్నాయె రక్షించు నిక్కమింక!'   అంటారు కవి. బలి అయిపోయిన  ఆ అభాగ్య బాలుడిని అడిగితే ఏమని ఉండేవాడు? అని ఆయనే మానవతా హృదయంతో కంపించిపోతూ ప్రశ్నించుకుంటూ ఆ మృతబాలుడి మనోభావాలనూ కవిగా తానే వెల్లడిస్తాడు'మీ మీ స్వార్థాల కోసరంగా నోరులేని నన్ను బలిచేశార'ని  వాదించడా? అని నిలదీస్తాడేమోనని సందేహిస్తాడు. మానవత్వం సహజ లక్షణంగా లేని వ్యక్తులకు ఈ తరహా విశాల భావనలు మదిలో మెదిలే అవకాశమే ఉండదు.  దావూద్  సాహెబ్ కవి ముస్లిం మతానుయాయుడు అయినంత మాత్రాన మనసులో ఉండవలసిన అనుకంపన లోపించిందా? సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి ఆశ్రయంలో  విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే సమయానికి దావూద్ సాహేబు ఒక  ఆడపిల్ల తండ్రి! ‘సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నందుకు రాళ్ల దెబ్బకు సిద్ధంగా ఉండమ'మని ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనుకంజ వేయని దుర్భావారి నిర్భీతి ఇప్పుడు ఎంత మందికి ఆదర్శం? సంస్కృతాంధ్రాలలో మదరాసు విశ్వవిద్యాలయం  విద్వాన్ పట్టా పుచ్చుకుని  నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరి మొదటి నెల జీతం గురుదక్షిణ కింద మనియార్డరుగా దావూద్ సాహెబు పంపిస్తే 'నా సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దుర్భావారు మురిసిపోయారు.  మానవతా విలువలకు మతాలను అడ్డుపెట్టుకుని వ్యాఖ్యానించడం ఎంత పెద్ద తప్పో ఈ మాదిరి సంఘటనలు ఇంకెన్ని ఈ దేశానికి  పాఠాలై బోధించాలో?



పుట్టింది ముస్లిం సంప్రదాయం అనుసరించే కుటుంబాలలోనే  అయినా.. దావూద్ సాహెబులా ఇస్లాం సంప్రదాయంలో నాని, హిందూ వేదాంతంలో ఊరిన ఎందరో ముసల్మాన్ కవులు చరిత్ర విస్మృతి పొరల్లోకి జారిపోయినట్లు మరుపూరివారు వాపోతారు.



జాతుల పరంగానే భారతీయతకు గుర్తింపు అనడం పెడవాదన అవుతుంది.    ఇప్పుడు దేశమంతటా ఆ తరహా భావజాలమే విచ్చలవిడిగా పులుముడుకు గురవుతున్నది.  ఆ దురాలోచనను ప్రశ్నించే సామాజిక హిత చింతనాపరుల పైనా దేశద్రోహం అభియోగం రుద్దే జుగుప్సాకరమైన ప్రయత్నమూ యధేచ్చగా సాగుతున్నది! అదే ఆందోళనకరం!

ఇస్లాం మతాన్ని విశ్వసించే  సాహిత్య స్రష్టలు సృష్టించినవిగా  చెప్పుకునే తెలుగు శతకాలే సుమారు మూడు పదులు  వికీపీడియాలో కనిపిస్తున్నాయి. ఆ జాబితా ఆసాంతం  పరిశీలించినా హిందూ కవుల ధోరణిలోనే ముసల్మాను కవులూ శతక సాహిత్యంలో తమకు సుపరిచితమైన  భక్తి, తాత్విక విశేషాలనే ప్రబోధాత్మక రీతిలో ప్రకటించినట్లు స్పష్టమవుతుంది.

పదహారణాల తెలుగు కవుల ముగ్గురు (బత్తలపల్లి నరసింగరావు, మేడవరము సుబ్రహ్మణ్యశర్మ, ఖాద్రి నరసింహ సోదరులు) చేతుల మీదుగా రూపుదిద్దుకున్న శతకం 'భక్త కల్పద్రుమ శతకము’. అదే పేరుతో హుస్సేన్ కవి రచించిన శతకమూ వాటికి వాసిలో అణుమాత్రం తీసిపోనిది.    దారిలోనే సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌ అనే కవి 'సయ్యదయ్యమాట సత్యమయ్య' మకుటంతో, గంగన్నవల్లి హుస్సేన్‌దాసు 'ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య'  మకుటంతో శతక సాహిత్యం సృష్టించారు. తక్కల్లపల్లి పాపాసాహెబ్‌ కవి మతవిభేదాలను విమర్శిస్తూ 'వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమనియె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట' అంటూ సుద్ది చెప్పారు. షేక్‌ ఖాసిం 'సాధుశీల శతకము'లో  'కులము మతముగాదు గుణము ప్రధానంబు/ దైవచింత లేమి తపముగాదు/, బాలయోగి కులము పంచమ కులమయా,/ సాధులోకపాల సత్యశీల' అంటూ నేటి కాలానికి అవసరమయే మంచి ముక్కలు చెప్పే ప్రయత్నం చేసారు. షేక్‌ అలీ  గురుని మాట యశము గూర్చుబాట' అనే మకుటంతో రాసుకొచ్చిన తీరులో వెలువడ్డ ముసల్మానుల శతకాలు పరిశోధించాలే గాని.. ఇంకెన్ని శతాధికాలు తేలుతాయో?  మతాలతో నిమిత్తం లేకుండానే సమాజ సంస్కరణల పట్ల సాహిత్య ప్రగతిశీలులందరిదీ ఒకే బాట- ఒకే మాట అన్న మాటను మాత్రం ఈ శతక సాహిత్యం ఖాయం చేసిందన్న  మాట వాస్తవం!

తరువాతి కాలంలో  వీరేశలింగంగారి 'వివేకవర్ధని' లో కలసిపోయినా 1891 లో  నరసాపురం నుంచి  మీర్ షుజాయత్ అలీ ఖాన్  గారి ఆధ్వర్యంలో సాగిన   'విద్వన్మనోహారిణి'  తెలుగుసాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. రాజమండ్రి నుండి వెలువడ్డ 1892 నాటి బజులుల్లా సాహెబ్,  'సత్యాన్వేషిణి, 1909 నాటి షేక్ అహ్మద్ సాహెబ్  'ఆరోగ్య ప్రబోధిని'  ముసల్మానుల తెలుగు పాత్రికేయ రంగానికి చేసిన సేవలకు మరి కొన్ని మచ్చుతునకలు. 1944 లో  హైదరాబాదు నుంచి వెలువడ్డ  'మీజాన్‌' దినపత్రికకు తెలుగు ప్రసిద్ధ రచయిత అడవి బాపిరాజు సంపాదకులుగా సహకారం అందించారు. 

ఆధునిక యుగానికి వస్తే..

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారి  'తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి 1991 లో నాగార్జున యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది. సయ్యద్ సలీం నవల "కాలుతున్న పూలతోట"కు 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించింది. వేంపల్లె షరీఫ్ కథల పుస్తకం ‘జుమ్మా’ 2012లో కేంద్రసాహిత్య అకాడెమీ యువ అవార్డు గెల్చుకున్నది. ఇంకా ఎంతో మంది మహమ్మదీయ మత విశ్వాసులు  విశాల భారతీయ లౌకిక తత్వంలో మమేకవుతూ దేశ పురోగతికి తమ వంతు పాత్ర నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉన్నారు.  సయ్యద్ నశీర్ అహ్మద్ 'అక్షర శిల్పులు' పేరుతో వెలువరించిన 333 మంది తెలుగు ముస్లిం కవులు, రచయితల వివరాలతో 2010 లో సమాచార గ్రంథం పుటలు తిరగవేస్తుంతే పటం కట్టి పూజించుకోదగ్గ ఎందరో సాహిత్య ద్రష్టల కృషి కంటబడుతుంది.



'సమస్త ప్రపంచంలో  ఉత్తమైనది  మన హిందూస్థాన్. ఇది మనదే. ఇది మాత్రమే మనది! మనం దీని బుల్ బుల్ పిట్టలం సుమా!ఈ దేశం.. కేవలం  ఈ దేశం మాత్రమే మన ఉద్యానవనం మిత్రమా!’ అని అర్థ వచ్చే 'సారే జహాఁసె అచ్ఛా - హిందూసితాఁ హమారా హమారా/హమ్ బుల్ బులేఁ హైఁ ఇస్‌కీ యే గుల్ సితాఁ హమారా హమారా’ అంటూ సెప్టెంబర్ 23, 1964 నాడు మహమ్మద్ ఇక్బాల్   కల మెత్తి రాసిన జాతీయ గీతంలోని ప్రతి అక్షర భావమూ నేటికీ కోట్లాది మంది భారతీయ ముస్లిం భయ్యా బహెన్ల  మనసుల్లో నుంచి పెల్లుబుకుతున్నదే!  'పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలూ చెలరేగే నేడు' అంటూ మహాకవి శ్రీశ్రీ  వెలుగు నీడలు’  చిత్రంలో తెగ   వాపోయాడా నాడు. కానీ

దెబ్భై ఏళ్ల పాటు ప్రజాస్వామ్య ఫలాలు అనుభవించిన తరువాతా ఎందుకింత సంకుచింతంగ దేశం ఆలోచన సాగుతున్నదనేదే చింత!  

'లుచ్ఛా జమానా ఆయా/అచ్ఛోంకో హాథ్ దేనా హర్ ఏక్ సికా/ అచ్ఛా జమానా ఫిర్ కబ్ / వచ్చేనా  చెప్పవయ్య వల్లీసాబు!' (చెడ్డవాళ్ల కాలం వచ్చింది. చెయ్యివ్వడమే ప్రతివాడు నేర్చేసుకుంటున్నది. మంచిరోజులు ఎప్పుడు వస్తాయో చెప్పవయ్యా వల్లీసాహెబూ?) అని ఓ శాస్త్రులుగారు  అడిగిన ప్రశ్నకు 'బందేనవాజ్ బుజురుగ్ /జిందా హై ఆజ్ తో న జీతే హమ్ ఖుదా/ బందాహి జానె వహాసబ్/గందరగోళం జమానా ఖాజాసాబూ! (దేశసేవకులు, పుణ్యపురుషులు (చేసిన మంచి పనుల వల్ల శాశ్వతంగా ఉన్నారు. మనం అట్లా జీవించలేం. దైవభక్తుడు, సేవకుడు ఆ విషయం తెలుసుకోడం మేలు. ఇప్పడు వచ్చిందంతా గందరగోళంగా ఉండే కాలం కదా ఖాజాసాబూ?) అంటూ వల్లిసాబుగారు బదులిచ్చారని ఓ చాటువు.  అల్లికలో సరదా కనపడుతున్నా ప్రస్తావనకొచ్చిన అంశం ఇప్పటి గందరగోళ పరిస్థితులకి అద్దం పడుతున్నదా లేదా?

-సరదాకేః  గందరగోళం జమానా   -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ప్రచురితం
 ***





మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...