Sunday, February 9, 2020

హేతువాదం -కర్లపాలెం హనుమంతరావు



మనిషి ఆరంభంలో హేతువాదే! తెలిసిన విషయాలతో తెలీని విషయాలను తర్కించుకుంటూ సంతృప్తికరమైన సమాధానాలు దొరికే వరకు అన్వేషణ కొనసాగించడం అతని నైజంగా ఉండేది. చేతనయింది తాను  సృష్టించుకుంటున్నట్లుగానే తనకు చేతగాని వాటిని ఎవరో తన కోసం సృష్టించి పెడుతున్నారని భావించడమూ తర్కం విభాగం కిందకే కదా వచ్చేది? ఆ అదృశ్య శక్తిని అతడు దేవుడుగా భావించాడు. ఆ దేవుడి చుట్టూతా మతం అల్లుకోవడం, అదే ఒక వ్యవస్థగా వేళ్లూనుకోవడం, క్రమంగా దానిలో మౌఢ్యం ప్రవేశించడం, దానిని ఎదుర్కొనేందుకు చైతన్యంతో ప్రతిస్పందించడం.. ఈ మొత్తాన్ని ఒక ముద్దగా చూస్తే అదే మనిషి పురోగతి అనిపిస్తుంది. మౌఢ్యాన్ని ప్రశ్నించడానికి మనిషి ఎన్నుకున్న ప్రక్రియా అనాదిలో ఆరంభంలో అనుసరించిన ప్రశ్న పధ్ధతే అని మనం మర్చిపోరాదు. 'ప్రతి వస్తువును ఎవరో ఒకరు సృష్టించాలన్న సిధ్ధాంతం ప్రకారం తనకోసం సృష్టించిన వాడినీ ఎవరో ఒకరు సృష్టించి ఉండాలి కదా?' అన్నది తర్కం కిందకే వస్తుంది కదా! ఆ ప్రశ్నకు జవాబు దొరకని మతం అలా పదే పదే ఎదురు తిరిగి ప్రశ్నించేవాళ్ల మీద 'మౌఢ్యం' ముద్ర వేయకపోతే మరింత మంది బుద్ధిమంతులు ఆ ప్రశ్ననే కొనసాగించి సమాజాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడతారని 'మతం' బెదురు. మొదటి తర్కంలో నుంచి పుట్టిన మతాన్ని అక్కున చేర్చుకున్నవారే రెండో తర్కానికి మూఢత్వం అనే లేబుల్ అంటగట్టడం.. విచిత్రం! 'ఆస్తికత్వం' అనే పదాన్ని దేవుడు పరంగా 'ఉన్నాడు'అన్న అర్థంలో తప్ప మరో విధంగా భావించడం రాని భావదాస్యత 'ఆ ఉన్నాడు అంటున్నవాడు ఎక్కడున్నాడో.. ఎలా ఉంటాడో.. చెప్పండి.. అలా చెప్పలేక పోయినా.. పోనీ ఫలానా విధంగా ఉన్నాడన్న రుజువులైనా కొద్దిగా చూపించండ'ని ఆడుగుతుంటే సంతృప్తికరమైన జవాబు ఇచ్చే పరిస్థితుల్లో లేక  'నాస్తికత్వం' అన్న పేరు తగిలించి సంఘబహిష్కరణ చేసే విఫల ప్రయత్నాలు విశ్వవ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ జరుగుతున్న అకృత్యమే!
సత్యాన్వేషణకు కట్టుబడ్డ ఎంతోమంది శాస్త్రవేత్తలు.. సామాజిక తత్వవేత్తలు తమ నిబద్ధత కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చరిత్ర నిండా బోలెడన్ని.
జిజ్ఞాస, తర్కం సృష్టిలో మనిషి విశిష్టతలు. ఆ రెండింటినీ అణగదొక్కడమంటే మానవజాతిని జంతుప్రాయంగా జీవించమని నిర్బధించడమే!
తెలుగు సమాజంలోని అనేకమైన లోటుపాట్లను బట్టలు విప్పదీసి మరీ ప్రదర్శించిన ప్రశ్నవేత్త యోగి వేమన. కులభేదాలతో కుళ్లిన సమాజాన్ని సంస్కరించే సదుద్దేశంతో సామూహిక భోజన కార్యక్రమాన్ని సాహసంతో తలపెట్టిన గొప్ప సంస్కర్త బ్రహ్మనాయుడు. వీరిద్దరు చూపించిన వైజ్ఞానికి, సామాజిక తర్కవాదం దారిలోనే తదనంతర దశల్లో మరిన్ని అడుగులు జాతిని ముందుకు నడిపించిన హేతువాదులు.. కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులు.. వారి అనుయాయులూ త్రిపురనేని రామస్వామి చౌదరి, గుర్రం జాషువా(భగవంతుడు ఉన్నాడన్న భావన ఉన్నా నిర్భయంగా నిలదీసిన ప్రశ్నవాది). రాజారామ్మోహన్ రాయ్  బ్రహ్మసమాజం, దయానంద సరస్వతి ఆర్యసమాజం, అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజం, రాజకీయ, ఆర్థిక రంగాల పరంగా కమ్యూనిజం.. వంటి భావజాలాల మూలకంగా భారతదేశంలో హేతువాదానికి ఎప్పటికప్పుడు కొత్త జవసత్వాలు పుట్టుకొస్తూనే ఉన్నాయ్! ఎం.ఎన్.రాయ్ రాడికల్ హ్యూమనిజం దారిలోనే గోరా హేతువాద ఉద్యమం ముందుకు సాగింది. హేతువాదానికి మరో ఉద్యమ రూపంగా సమాజంలో తనదైన ప్రత్యేక ముద్ర వేయించుకొన్న గోరాని గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది.
కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో  చేసే చేసే ఉద్యోగాన్నుంచి ఉద్వాసన పలకాల్సొచ్చింది గోరాగారికి 1933లో హేతువాదాన్ని విద్యార్థుల్లో ప్రచారం చేస్తున్నారన్న నెపంతో. బందరు హిందూ కళాశాలలో  ఏ ప్రతిబంధకాలు లేని కారణంగా విశాఖపట్నం హిందూ పఠన మందిరంలో ఏకంగా నాస్తికత్వం మీద బహిరంగ నిర్వహించారు. ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించుకొని, కృష్ణా జిల్లాల్లో నాస్తిక కేంద్రం స్థాపించారు గోరా. 'నాస్తికత్వం లేక దేవుడు లేడు' అనే పుస్తకం ద్వారా ఆలోచనాపరులను కదిలించారు. హేతువాద దృష్టికి ఒక వ్యవస్థీకృత స్థాయి ఆంధ్రదేశంలో ఏర్పడేందుకు ఆ కాలంలోనే ఊపందుకొన్న ఎం.ఎన్.రాయ్ హ్యూమనిజం భావజాలం కూడా ఒక ముఖ్యమైన కారణమే!
స్వాతంత్రోద్యమం, తెలంగాణా విమోచనోద్యమాలలో నాస్తికుల పేరునే మేధావులు కొందరు పాలుపంచుకొన్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత గోరాగారు విజయవాడలో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసుకొన్నారు. అక్కణ్నుంచే 'సంఘం' పేరుతో వారపత్రిక ప్రచురణ జరిగేది. అదే పంథాలో తెనాలి నుంచి రాడికల్ హ్యూమనిజం భావప్రచారానికి 'సమీక్ష' పేరుతో  మరో వారపత్రిక వెలువడుతుండేది.
మూఢనమ్మకాలను ప్రశ్నించడం, దైవాంశసంభూతులని డబ్బాలు కొట్టుకునేవాళ్ల మహిమలను బహిరంగా సవాలు  చెయ్యడం, బాబాల  అద్భుతాలుగా కొనియాడే గమ్మత్తులను నాస్తికకవాదులుగా తామే బహిరంగంగా ప్రదర్శించి చూపించడం.. ఆనక ఆ మహిమల వెనుక ఉన్న మర్మాలను  వివరించడం వంటి  చర్యల ద్వారా అభూత కల్పనలకు అడ్డుకునే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతుండేవిచర్చల సందర్భంలో మొహం చాటు చెసే సాధారణ పౌరులలో తార్కికమైన ఆలోచనలను రేకెత్తించడమే ఇలాంటి చర్యల ప్రధాన ప్రయోజనం. గోరాగారు ఒక వ్యక్తిగా కాకుండా సకుటుంబంగా ఈ హేతువాద ఉద్యమంలో పాలుపంచుకోవడం మరన్ని హేతువాద కుటుంబాలు ఏర్పడేందుకు దోహదపడింది.
నార్ల వేంకటేశ్వర్రావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ త్రిపురనేని వెంకటేశ్వర్రావు, గౌరిబోయిన పోలయ్య, రావిపూడి వెంకటాద్రి, మల్లాది సుబ్బమ్మ వంటి మేధావుల కార్యకలాపాల కారణంగా హేతువాద ఉద్యమం  బహుళ వ్యాప్తిలో ఉండేది. ఉంటోంది.
గోరాగారు మహాత్మాగాంధీతో చేసిన చర్చలు 'An Athiest with Gandhi' పేరుతో పుస్తక రూపంలో వెలువడి.. తదనంతర కాలంలో ఆంగ్ల తర్జుమా కూడా సంఘం పత్రికలో  వెలువడింది. నాస్తికవాద ప్రచారానికి ప్రపంచ పర్యటనకు పూనుకున్న గోరా 1970లో ప్రపంచ నాస్తిక మహాసభలు సైతం విజయవాడలో నిర్వహించారు. అదే దశకంలో ఆంధ్రదేశంలో హేతువాద సంఘం, విశాఖ వేదికగా  మార్క్సిస్టు భావజాలంతో భారత నాస్తిక సమాజం ఎర్పడ్డాయి. శిక్షణా తరగతులు, అధ్యయన తరగతులు జిల్లాల వారీగా నిర్వహించేవారు. తెలుగునాట ఉధృతమవుతున్న హేతువాద ఉద్యమానికి ఆకర్షితులయే శ్రీ లంక ప్రొఫెసర్ డాక్టర్ కోవూర్ అబ్రహాం మూడు సార్లు ఇక్కడ పర్యటించారు. దైవాంశ సంభూతల మహిమలకు వ్యతిరేకంగా ఉద్యమించే డాక్టర్ పి. ప్రేమానంద్ ఇక్కడ అనేక శిక్షణా తరగతులు నిర్వహించారు.
గోరా మరణం తరువాత వారి కుమారుడు డాక్టర్ లవణం అంతర్జాతీయ హ్యూమనిష్టు ఉద్యమంలో అంతర్భాగమయారు.  ఎన్నో పర్యాయాలు ప్రపంచం చుట్టి రావడమే కాకుండా.. రెండవ నాస్తిక మహాసభలూ నాస్తిక కేంద్ర స్వర్ణోత్సవాల సందర్భంలో  ఘనంగా నిర్వహించారు. సర్ హార్మన్ బోండి, జాన్ ఎడ్వర్డ్స్, జిం హెర్రిక్. హేరి స్టోప్సరో, లెవీ ఫ్రాగెల్, ఫ్రాంక్ షూట్, ఎరిక్ హార్టికైనన్, డాక్టర్ నిహాల్ కరీం, రాయ్ బ్రౌన్, అజం కమ్గుయాన్.. లాంటి ఎందరో నాస్తిక ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అనేక నాస్తిక మహాసభల్లో, హేతువాద ఉద్యమాలలో పాలుపంచుకున్నారంటే.. ఆ ఘనత గోరా కుటుంబం మొత్తం  ఓ క్రతువుగా సాగించిన  హేతువాద, నాస్తికవాద  ఉద్యమాల ప్రభావం వల్లనే! ఆంధ్రదేశం నుంచి ఇతర దేశాలలో జరిగిన హేతువాద, నాస్తిక సభలు సమావేశాలకు హాజరయిన ప్రముఖులలో ఎన్. ఇన్నయ్య, రావిపూడి వెంకటాద్రి,  బాబు గోగినేని వంటి వారు ఇప్పటి తరానికీ సుపరిచితులే!
ఆంధ్రుల నాస్తిక, హేతువాద ఉద్యమాలు ప్రపంచంలోని మరే ఇతర దేశాల ఉద్యమాల ముందూ తీసిపోనంత ఉధృతంగా సాగుతున్నవే! మనిషిని ఆలోచించమని కోరడమంటే తన అనుభవాల నుంచి, అవగాహనలో నుంచి ఆలోచించమని కోరడమే! అందరి ఆలోచనలు ఒకేలా ఉండనప్పటికీ వ్యక్తి స్వేచ్ఛ, పరస్పర గౌరవం వంటి మౌలికమైన మానవ విలువులలో మార్పు ఉండదు. హేతువాదులేమీ మూసపోత ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించరు. వైరుధ్యం తలెత్తని విభిన్నత్వాన్ని, వైవిధ్యాన్నే ఆలోచనాపరులైన నాస్తికులైనా, హేతువాదులైనా ప్రోత్సహించేది.
వంద సంవత్సరాల కిందటి వరకు నాస్తికత్వం, హేతువాదం ఒక పెడవాదంగా హేళనకు గురయిందన్న వాస్తవం మనం మర్చిపోరాదు. చాలా నాగరిక దేశాలలో క అలా చెప్పుకునేవారికి ఇబ్బందులు  ఎదురయేవి. అంతటి ప్రతికూల పరిస్థితుల నుంచి నాస్తిక, హేతు భావజాలాలు ఇవాళ ఒక గౌరవనీయమైన మానవవాదాల జాబితాలో చేరి మేధావుల మన్ననలు అందుకుంటోన్నది. ఈ కృషిలో మన తెలుగువారు నిర్వహించిన పాత్రా అనల్పమైనదని మరో మారు గుర్తు చేసేటందుకే ఈ చిన్న ప్రయత్నం.
రాబోయే తరాల ప్రగతి బాట నిర్మాణంలో ఎవరు వద్దన్నా, కాదన్నా నాస్తిక, హేతు భావజాలాల పాత్రా తప్పక ప్రాముఖ్యం వహిస్తుందని జ్ఞప్తికి చేసేందుక్కూడా ఈ చిరువ్యాసం.
***
(ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రి గుత్తికొండ సుబ్బారావు, డా॥జి.వి. పూర్ణచంద్ గార్ల సంపాదకత్వంలో  విక్టరీ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన 'తెలుగు పసిడి'- ఆంధ్రప్రదేశ్ లో 50 సంవాత్సరాల నాస్తిక, హెతువాద ఉద్యమం - శ్రీ లవణం- పు.367 - 371)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...