Tuesday, February 25, 2020

మీర జాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్!





శ్రీస్వర్గానికి వెళ్ళి, వేయికన్నుల దేవరతో పోరు సలిపి మరీ సాధించుకున్న పారిజాతమూ, ప్రతిష్ఠ రెండూ సవతి ముందు వెలతెలపోతే సత్యభామలాంటి స్వాధీనపతిక ఊరకుంటుందా?  అన్నింటికంటే మిన్న, ఏడేడు లోకాల రేడు అయిన తన పతిని ఐశ్వర్యం ధారపోసైనా దక్కించుకుంటుంది. వ్రతవిధానమహిమ వలన తాను గీసిన గీటు దాటని కృష్ణుని ఊహించుకుని మురిసిపోతుంది.

"మీరజాలగలడా నాయానతి.." అని వ్రతఫలితాన్ని ముందే కళ్ళకు కట్టించుకుని ఆనందించే సత్యభామకు ఎన్నో తెలుసు. అన్నీ తెలుసు. నటన సూత్రధారి తన చేతికే కాదు, ఎవరికీ చిక్కడని ఆమెకు తెలుసు. అయినా సరే.. నోము పూని కట్టేసుకుందామని ఆశ! ఎంత ప్రియమైన పూనికో కదా ఆమెది? అన్నీ తెలిసీ దేనికీ అమాయకత్వం? అదే ఆమెకు కృష్ణునిపై గల గాఢానురాగానికి గీటురాయి.

మనోహరుని చేరుకునేందుకు మమతల వారాశిని ఈదేందుకు తనతో మరెవరూ పోటీ లేరని నొక్కి చెప్తోంది. సత్యభామకు తన ప్యత్యర్థి పేరు పలకడం సైతం ఇచ్చగించ లేదు. "వైదర్భికి.." "అదిగో.. వాళ్ళమ్మాయి ఉందే..!" అని ఈసుగా మాట్లాడినట్టే! సవతిపై ఆ మాత్రం అయిష్టం ఉండాలి మరి! ఉంటేనేగా ఉమ్మడి సొత్తు మీద తనకున్న పట్టుదల, తన ఆభిజాత్యమూ బయటపడేది. ఆఖరికి సత్యాపతి కూడా తనతో వాదులాడి ఆమెను వెనకేసుకురాడని ధీమాగా చెప్తోంది. "సత్యాపతి" అంటూ ఎంత గోటు ఒలకబోస్తోందో!
గీర్వాణమే కానీ ఈ భామ మనసులో ఇంకేం లేదని పొరబడేరు! వ్యయప్రయాసలకోర్చి ఈ నోము దేనికి..? మధుర మధుర మధురాధిపతిని కైవసం చేసుకునేందుకు. కృష్ణుని ప్రణయ సామ్రాజ్యానికి ఆధిపత్యాన్ని కోరుకుని కదూ! ఆ ఊహకే ఆమె మనసు ఎంత మైమరచిపోతోందో.. ఒక్క మధురమైన వాక్యంతో కనులముందు నిలిచే రాసక్రీడ "మధుర మధుర మురళీగాన రసాస్వాదనమున అధరసుధారసమది నే గ్రోలగ.." వేణువల్లే కన్నయ్య పెదవిని చేరి చెంగలించాలనే కాంక్ష!  "నేనంటూ వ్రతమూనాక, నేనంటూ ముద్దుముద్దరలేసాక.. నన్ను వదిలి పోగలడా?" అని అణువణువునా స్థైర్యమే! ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం సత్యభామ.
"స్థానం నరసింహారావు" రచన, సుమసౌకుమార్యమే కాక కాసంత పొగరూ, వగరూ.. అంతకు మించి ప్రియునిపై పట్టలేని ప్రేమా ఉన్న ప్రియురాలి మనసుకు అద్దం! చలనచిత్రం కోసం వ్రాసిన గీతం కాకపోయినప్పటికీ సినీవినీలాకాశంలో అందాల జాబిల్లి.
మీర జాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
నటన సూత్రధారీ మురారీ
ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
సుధాప్రణయ జలధిన్ వైదర్భికి ఈద తావుగలదే నాతోనిక
వాదులాడగలడా సత్యాపతి
మధురమధుర మురళీగాన రసాస్వాదనమున
అధర సుధారసమది నే గ్రోలగ
మీరజాలగలడా నాయానతి
వ్రతవిధానమహిమన్ సత్యాపతి
(సోర్స్ః కొత్తావకాయ బ్లాగ్)
అయితే ఈ 'మీర జాలగలడా నాయానతి/వ్రతవిధానమహిమన్ సత్యాపతి' పాట పుట్టుకను గురించి ఇదిగో స్థానం నరసింహారావుగారే స్వయంగా తన 'నటస్థానం' లోచెప్పిన ఈ ముక్కలు చదవండి.. ఆసక్తికరంగా ఉంటాయ్!
(సోర్స్ః ఆదివారం ఆంధ్రజ్యోతి- అనుబంధం మొదటి పేజీ- బహుళం -17 ఏప్రిల్ 2011 సంచిక నుంచి)
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
25 -02 -2020

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...