Sunday, May 3, 2020

అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలు-





తెలంగాణలో ఆయా కులాలకు కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాల వ్యవస్థ ఉన్నది. పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాలు నియమంగా తమకంటూ ఒక విశిష్టమైన సాంస్కృతిక పరంపరను అనుసరిస్తూ తమను పోషించే కులాల మౌఖిక సాహిత్యాన్ని పరిరక్షిస్తున్నాయి. వీరి మౌఖిక సాహిత్యమంతా పోషక కులాల (దాతృ కులాల) సాహిత్యమే అవుతుంది. ఇందులో పోషక కులం యొక్క పుట్టుక, కులం మూలపురుషుని ఆవిర్భావం, దేవతలకు కుల మూలపురుషునికి ఉన్న సంబంధం, వృత్తి ఆవిర్భావం, వృత్తి పరికరాల పుట్టుక, నియమాలు, నమ్మకాలు మొదలైన వృత్తి ధర్మాన్ని తెలియజేసే అంశాలు. వారి కుల దైవం ప్రస్తావనతో పాటు కులం సామాజికంగా మనుగడకు కావలసిన అనేకాంశాలు పురాణాల్లో కనిపిస్తాయి. ఆశ్రిత జానపద కళలు పటం కథలు, హరి కథలు, నాటకాలు మొదలైన ప్రక్రియలతో కుల పురాణాలను ప్రదర్శిస్తూ మనుగడ సాగిస్తున్నాయి. రకంగా కుల పురాణాలను కథా గానం చేసే ఆశ్రిత జానపద కళారూపాలు ఆయా కులాలకు ఒకటికి మించి ఎక్కువగా ఉన్నాయి. ఇవి కులాన్ని అయితే ఆశ్రయించి కుల పురాణం కథా గానం చేస్తుందో, కులం దగ్గర మిరాశి కలిగి ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో వేరే కులాన్ని ఆశ్రయించకుండా తమకు నియమింపబడిన కులాన్ని ఆశ్రయించటం వీటి ప్రత్యేకత. అయితే రజకుల కుల పురాణమైన మడేలు పురాణాన్ని కథాగానం చేసే గంజి కూటి, మాసయ్యలు అనే రెండు ఆశ్రిత కళారూపాలు ఉన్నాయి. ఇందులో గంజి కూటి వారు హరికథ రూపంలో మడేలు పురాణం కథా గానం చేయగా, మాసయ్యలు పటం ఆధారంగా మడేలు పురాణాన్ని కథాగానం చేస్తారు. మాసయ్యలను పటమోళ్లని, పటం చాకళ్లని కూడా పిలుస్తారు. కళాకారులు చెప్పే మడేలు పురాణంలో వీరి పుట్టుకకు చెందిన ప్రస్తావన కనిపిస్తుంది.
మడేలు పురాణం:
మడేలు పురాణం కూడా సృష్టి పుట్టుకతోనే మొదలవుతుంది. త్రిమూర్తుల జననం అనంతరం పార్వతీ కల్యాణం జరుగుతుంది. పురాణం లో భాగంగా దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి శివపార్వతులను పిలవ కుండానే యజ్ఞాన్ని తల పెడతాడు. అయితే పార్వతీ దేవి పిలువని యజ్ఞానికి వెళ్లగా దక్షుడు ఆమెను అవమానిస్తాడు. అవమానం తట్టుకోలేక యజ్ఞగుండంలో నే పార్వతీదేవి ఆహుతి అవుతుంది. ఇందుకు కోపించిన శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసి అతన్ని సంహరించి రమ్మంటాడు. ప్రకారంగా వీరభద్రుడు కార్యం ముగించుకొని త్రిమూర్తుల వద్దకు వెళ్లి విషయం చెప్తాడు. అందుకు త్రిమూర్తులు కోపంతో నువ్వు మూడు తప్పులు చేశావని, అందులో ఒకటి బాలకీ దేవుని సంహరించడం, రెండు శిశు హత్య, మూడు బ్రహ్మ హత్య చేశావని కాబట్టి నీ నీడ మాపై పడకూడదని పాల గుండంలో స్నానం చేసి పాప పరిహారంగా మడివేలయ్య అవతారం ఎత్తమంటారు. వీరభద్రుడు సరేనని పాల గుండంలో దూకేేసరికి అందులో నుండి మడివేలయ్య, మాసయ్య ఇద్దరూ పుడతారు.
వీరభద్రుని అంశతో పుట్టిన మడేలయ్య లింగాన్ని ఆరాధిస్తూ మెడలో 32 లింగాలు చేతిలో నల్లని వీర గంటతో మైల ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మాసయ్య నిత్యం శివున్ని పూజిస్తూ ఎప్పుడూ శివధ్యానం లోనే ఉండేవాడు. ఆకలిదప్పులు అనేది ఆయనకు ఉండేది కాదు. ఎవరైనా వచ్చి అన్నం పెడితేనే తినేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకలితో ఉన్న మాసయ్య, మడేలయ్య అడుక్కొని తెచ్చుకున్న అన్నా న్ని అతనికి చెప్పకుండా తింటాడు. అందుకు మడేలయ్య కు కోపం వస్తుంది. నేను తెచ్చుకున్న అన్నాన్ని నువ్వు తిన్నావు కాబట్టి త్రిమూర్తుల దగ్గరకి కోపంతో విషయమై వెళ్తారు. అక్కడ వారికి విషయం చెప్పగాత్రిమూర్తులు 33 కోట్ల దేవతల ముందర మడేలుతో నీ అన్నం తిన్న వాడు కాబట్టి నీకు అర్థివాడై ఏడాదికి ఒకసారి మీ ఇంటికి వస్తే మీ ఇంట పుడితే పురుడు కట్నం, చస్తే చావు కట్నం, పెరిగితే పెళ్లి కట్నంమివ్వాలని నీ తమ్ముడు కాబట్టి కంచం పొత్తు ఉంటుందని, అందుకు ప్రతిఫలంగా నీ వంశాన్ని కీర్తిస్తాడనిఒప్పందం చేస్తాడు.
తర్వాత మడేలయ్య తన యొక్క పాపపరిహారం తీర్చుకోవటానికి సుర ముప్పది మూడు కోట్ల దేవతలు మునులు విడిచిన వస్త్రాలను 12 సంవత్సరాలు శుద్ధి చేస్తాడు. ఒక రోజున శివుడు మడేలయ్య వృత్తిని పరీక్షించదలచి తన పులి చర్మంతోపాటు తాను కప్పుకునే బొంతను పిండ మని కోరుతాడు. బొంత 33 గజాల పొడవుతో అందులో చీర పేన్లు, నల్లులు 101 జంతువులు ఉన్నాయని వాటిని చావకుండా పిండటం నీ తరం కాదని చెప్తాడు. అయినప్పటికీ మడేలయ్య పిండు తానని బయలుదేరుతాడు. అప్పుడు మడేలయ్య ఏనుగు మీద బొంతను వేసుకొని నీటి కోసం లోకాలన్నీ తిరిగినా కనిపించవు. ఎందుకంటే అప్పటికే పరమ శివుడు నీటిని మాయం చేస్తాడు. అప్పుడు శీతలాదేవి పరమశివుడు పెట్టిన పరీక్షను ఎలాగైనా నెగ్గాలని మన వృత్తి ధర్మాన్ని పాటించాలని మడేలయ్యతో నన్ను సంహరించి నా అవయవాలతో బొంతను పిండి పరమశివుని కోరిక తీర్చాలని కోరుతుంది. అప్పుడు మడేలయ్య శీతలా దేవి కన్నీరు పోకుండా కట్టకట్టి నీరుగాను, కనుగుడ్లు తీసి ఉడకబెట్టే కడువలుగాను, చనుబాలను పొయ్యి రాళ్ల గాను, ఆమె ఇరవై వేళ్లు కొట్టి వంటచెరకు గాను, నరములు తీసి గాలి తాళ్లుగాను,చర్మాన్ని వడ కోక గాను, రక్తం తీసి చౌడు గాను, శీతలాదేవి డొక్కను బానగాను, కడుపుల అన్నం సున్నంగాను చేసి శివుని బొంత పిండుతాడు. అలాగే అప్పుడే ఆమె పేగులను తీసి చెరువు మీద వేయగా తూటికూరగా మొలుస్తాయి. రజకులు ఇప్పటికీ తూటికూర తినకపోవడాని కి కారణంగా ఇదే చెబుతారు. మడేలయ్య శివుని బొంత పిండిన తర్వాత శివుని కొరకు వెతుకుతుండగా ఎక్కడ శివుడు కనిపించడు. దారిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎదురుపడి మడేలయ్యనుఎవరి కోసం వెతుకుతున్నావనిఅడుగుతాడు. అతను శివుని గురించి అని చెప్పగా అయితేనన్ను నీ భుజాలమీద ఎక్కించుకొని తీసుకుపోతే, నేను శివున్ని చూపిస్తాఅంటాడు. అతన్ని భుజాలపై ఎక్కించుకొని బయల్దేరి తిరుగుతుండగా ఉన్నట్టుండి అతను బరువు పెరిగి పోతాడు. బరువు మోయలేక అతన్ని క్రిందికి దింపుతాడు. వెంటనే అతను మాయమైపోయి, అతని ఎదురుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమై నువ్వు పోయేటప్పుడు నీ భార్య నువ్వు ఇద్దరు వెళ్లారు కదా మరి ఇప్పుడు ఒక్కడివే వస్తున్నావు కారణమేమని అడుగుతాడు. అప్పుడు మడేలయ్య జరిగిన విషయమంతా వ్యక్తి కి వివరిస్తాడు. విషయం విన్న వ్యక్తి ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూడమన్నాడు. అతను వెనక్కి తిరిగి చూడగానే శీతలా దేవి కనిపిస్తుంది. ఆవ్యక్తియే శివుని రూపంలో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మడేలయ్యనాకు చాకలి వృత్తి కావాలని, వండని కూడు, వడ కని బట్ట, పిండని పాడి, ఇంటిముందు తడి వస్త్రాలు పొడి వస్త్రాలు తరగకుండా ఉండాలని, ఎవరి కోకలు అయినా కట్టుకున్నా నన్ను ఏమీ అనకూడదనికోరుకుంటాడు. అందుకు శివుడు దీవించి నీకు అన్నం పెట్టని వారు నరకం పోతారని అభయమిస్తాడు. అలాగే పురాణంలో చాకలి వృత్తిలోని నమ్మకాలు, వివిధ కులాల ప్రస్తావన కనిపిస్తుంది.
గంజి కూటి ప్రస్తావన:
మాసయ్యలు పటం ఆధారంగా కథా గానం చేసే మడివేలు పురాణంలో గంజికూటి ప్రస్తావన కూడా కన్పిస్తుంది. మడేలయ్య వృత్తి ధర్మంలో భాగంగా నుదుటన బొట్టు మెడలో లింగం ధరించిన శంకు ద్వారాజి రాజ్యానికి చెందిన బసవన్న రాజుల బట్టలు ఉతికే వాడు. అయితే కనగాంగిరి పట్టణాన్ని పరిపాలించే బొట్టు, లింగం ధరించని బైరాగి రాజుల బట్టలు మడేలయ్య ఉతకక పోవడంతో వారి మంత్రి అయినా రాజులబంటుకు సైన్యాన్ని , మాసిన కోకల మూటలను మరియు వరహాల మూటలను ఇచ్చి పంపుతాడు. ఒకవేళ మడేలయ్య కోకలు పిండితే వరహాల మూటలు అప్ప చెప్పమని లేకుంటే యుద్ధం చేయమని చెబుతాడు. ఇది గమనించిన మడేలయ్య తన దగ్గర ఉన్నవిభూదితో కోకలన్నింటినీ దగ్ధం చేసి, సైన్యాన్ని ఎదురించి నిలుస్తాడు .ఇదంతా స్వయంగా చూసిన రాజుల బంటు భయపడి మడేలయ్య బట్టలు పిండే బండ కింద దాక్కుంటాడు. అతన్ని చూసిన మడేలయ్య ఎవరని ప్రశ్నించగా నేను బండ కింద దాక్కున్న పురుగునని చెప్తాడు. ముందు బయటకి రా యుద్ధం చేస్తామనగా, ఎంతకీ రాకపోయేసరికి మడేలయ్య విభూతి మంత్రించి బండమీద వేయగా రెండుగా విడిపోతుంది. అందులో నుండి బయటకు రాగానే మీ తల్లిదండ్రులు నీకు ఏం పేరు పెట్టారు అని అడుగగా నేను మరచిపోయానని అంటాడు. వీడేదో మాట తప్పి మాట్లాడుతున్నాడని బసవన్న బట్టలు పిండటం కోసం తెచ్చిన గంజిలో నుండి మూడు ముద్దుల అన్నం తీసిపెట్టగా తింటాడు. తర్వాత గంజి పోయగా తాగుతాడు. ఇప్పుడు చెప్పురా నీ పేరేంటి అని అడుగగా, నా పేరు ధాతి, కోటి, కితాభ్ అంటాడు. ధాతి అంటే దాయి గుడ్డ, కోటి అంటే తోడి గోలపుల్ల, కితాబ్ అంటే ఇస్త్రీ పెట్టె. అప్పుడు మడేలయ్య మా ఇసరల పేర్లు చెప్పినావని, మా గంజిలో అన్నం పెడితే తిన్నావని, గంజి పోస్తే తాగినావు కాబట్టి కలియుగంలో గంజి కూటి వారిగా జన్మించి మా మధ్యన, పటమోళ్ల మధ్యన ఆశ్రితునిగా ఉండమని వరమిస్తాడు. కానీ గంజి కూటి వారు చెప్పే పురాణం లో కథనం వేరే కనిపిస్తుంది.
గంజి కూటి వారు మాసయ్యలు ఇరువురూ చెప్పే మడేలు పురాణాల మధ్య కొంత భేద సాదృశ్యాలు కనిపిస్తాయి. పురాణాల్లో మాసయ్యలు మరియు గంజి కూటి వారి పుట్టుక విభిన్నంగా కనిపిస్తుంది. మాసయ్యలు చెప్పే పురాణంలో వీరభద్రుని అంశతోనే మడేలయ్య మాసయ్య జన్మించినట్లు కనిపిస్తుంది .అట్లాగే బైరాగి రాజుల బంటు బండ కింద దాక్కున్న వాడే గంజి కూటి వారిగా చెప్పబడుతుంది. ఇక గంజికూటి పురాణంలో శివుని బొంతను మడేలయ్య గంజి లో పిండుతుండగా అతని చెమట నుండి పుట్టిన వాడే గంజి కూటి వారని తెలుస్తుంది. అంతేగాక వీరి పురాణంలో జైన రాజుల మంత్రులలో ఒకరైన కొండేల మాసయ్య మడేలయ్యకు భయపడి బండ కింద దాక్కున్న వాడే మాసయ్యలని తెలుస్తుంది. ఈరకంగా వీరిరువురు తమ కులం పట్ల అత్యున్నత స్థానాన్ని పురాణంలో చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది.
పురాణంలో రజకుల మూలపురుషుడైన మడేలయ్య పరమ వీరశైవ భక్తుడిగా కనిపిస్తాడు. ఇతను శివుని కోరిక తీర్చడం కోసం వృత్తి ధర్మాన్ని పాటించడం కోసం సాక్షాత్తు పరమశివుడే పరీక్షించదలచిన కార్యాన్ని సైతం సాధించడానికి తన భార్యను సంహరించి కార్యాన్ని నిర్వర్తించడం శివుని మీద ఉన్న భక్తి, వృత్తి ధర్మం పురాణంలో కనిపిస్తుంది. అంతేగాక మడేలయ్య శివ భక్తుల మైల బట్టలనే ఉతుకు తానని, ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకు ఎదురు వచ్చిన వారితో యుద్ధం చేయడం శివుని మీద, అతని భక్తుల మీద ఉన్న భక్తి భావన, ఆసక్తి కనిపిస్తుంది. తమకు రజక వృత్తిని దేవతలే ప్రసాదించినట్లుగా కనిపించే సన్నివేశాలు, కులం పట్ల ఆత్మనూన్యతా భావాన్ని తొలగించడానికి దోహదం చేసి, వృత్తి మీద గౌరవాన్ని కలిగిస్తుంది. పురాణంలో వృత్తి మనుగడకు కావలసిన మానసిక ధైర్యాన్ని కలిగించే అంశాలు అనేకం ఉండటం విశేషం.
చారిత్రకంగా 12 శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం( 4 ఆశ్వాసం )లో మడేలయ్య కథ కనిపిస్తుంది. ఇందులో ఆనాటి కాలంలో శైవాన్ని ఆచరిస్తూ కీర్తిప్రతిష్టలు పొందిన శైవ భక్తులలో ఒకరిగా మడేలయ్యను కీర్తించబడుతుంది. ప్రాచీనమైన చరిత్ర కలిగిన మడేలయ్యను పురాణ పురుషునిగా పాల్కురికి సోమనాథుడే ఆవిష్కరించాడు. పురాణ పురుషుని వృత్తాంతాన్ని మాసయ్యలు నకాశి కళాకారులతో 33 మూరల పొడుగు, గజంనర వెడల్పు ఉండే నూలు గుడ్డ మీద చిత్రించుకొని పటం ఆధారంగా మూడు రోజులు కథా గానం చేస్తారు

కథకులుప్రదర్శనా విధానం :
మాసయ్యలకు వంశపారంపర్యంగా సంక్రమించిన హక్కు గ్రామాలు లేదా మిరాశి గ్రామాలుంటాయి. ఆయా గ్రామాలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రదర్శన నిమిత్తం వెళతారు .ప్రతి సంవత్సరం కళాకారులు మిరాశి గ్రామాలకు దసరా పండుగ లేదా దీపావళి పండుగ తర్వాత సంచారానికి బయలుదేరుతారు. రకంగా బయల్దేరేముందు ఏకాదశమి లేదా దశమి రోజున కళాకారులు పెట్టె పూజ చేసుకుంటారు. ఇందులో భాగంగా వేర్వేరు గ్రామాల్లో ఉన్న కళాకారులను ఏకం చేసుకుని మేళం అంటే బృందంగా ఏర్పడతారు. తర్వాత అందరూ కలిసి పటం, రాగి శాసనం, వీర పలకలు, మద్దెల హార్మోనియం, గజ్జెలను పూజించుకొని ఒక మేక పోతును బలి ఇచ్చి తమ మిరాశి గ్రామాల్లో త్యాగం సమృద్ధిగా లభించాలని కోరుకుంటారు. అంతేగాక ఇదే రోజున హక్కు గ్రామాల్లో వచ్చిన ప్రతిఫలం బృందంలోని కళాకారులు రకంగా పంచుకోవాలో నిర్ణయించుకుంటారు.
ప్రదర్శనలో కళాకారులు ఇప్పటికీ తమ పూర్వ పద్ధతినే అవలంభిస్తూ రావడం విశేషం. తమ హక్కు గ్రామాలకు వెళ్లినప్పుడు కళాకారులు తప్పనిసరిగా పటం ,రాగి శాసనం వీర పలకలు తీసుకొని బయలుదేరుతారు. గ్రామంలో మొదట రజకుల కుల పెద్దలను కలిసి రాగి శాసనం మరియు వీర పలకలను చూపించి త్యాగం లేదా సంభావన చెప్పాలని కోరుతారు. కళాకారుల దగ్గర ఉండే రాగి శాసనం మీద మడేలయ్య వృత్తాంతం తో పాటు మాసయ్యలకు రజకులు ఇచ్చే ప్రతిఫలం లిఖించి ఉండటమేగాక వారికి ఏయే గ్రామాలు మిరాశి గా సంక్రమించాయో వాటి పేర్లు రాయ బడి ఉంటాయి .
వీర పలకలు:
వీర పలకలు అనేవి టేకు కర్రతో తయారు చేయబడి సుమారుగా ఫీట్ నర వెడల్పు, పొడవుతో ఉంటాయి. పలకలమీద వీరభద్ర స్వామికి జన్మించిన మడేలయ్య మాసయ్యల సన్నివేశం మరియు శివుని బొంతను ఉతికే సన్నివేశాలను రంగులతో చిత్రించికొని సన్నివేశాలను చూపి కథా గానం చేస్తారు. తర్వాత రజకులను వీర పలకలను ముట్టుకొమ్మని చెప్పి, పలకల మీద సంభావన పెట్టమంటారు. తర్వాత మాసయ్యలు రజకులకు విభూది అలంకరించి, దివనార్తి పెడతారు.
ప్రదర్శన నిమిత్తం గ్రామంలో త్యాగం కుదుర్చుకున్న తర్వాత రజకుల వీధిలోనే వేదిక నిర్మించుకొని రాత్రి గాని ఉదయం గాని వారి వీలునుబట్టి పటాన్ని తూర్పుదిశగా వేలాడదీసి కథా గానం చేస్తారు. రకంగా వేలాడదీస్తే నే కథ సుఖాంతమవుతుందని విశ్వసిస్తారు . ప్రదర్శనలో కళాకారులు ఐదుగురు ఉంటారు . ఇందులో ఒకరు ప్రధాన కథకుడు. ఇతను నడుముకు దట్టీ కట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, చేతిలో బెత్తం బరిగే తో పటం మీద బొమ్మలను చూపుతూ కథా గానం చేస్తాడు. ఇతనికి ఇద్దరు సహాయంగా తాళాలు వాయిస్తూ వంత పాడతారు. మరొక ఇద్దరిలో ఒకరు తబలా హార్మోనియమ్ వాయిస్తారు.
ప్రధాన కథకుడు కొన్ని సందర్భాల్లో విశ్రాంతి తీసుకుంటే వంతల్లో ఒకరు ప్రధాన కథకుని పాత్ర పోషిస్తాడు. కథలో వచనం, పద్యం, పాటలతో పురాణాన్ని ప్రేక్షకులకు రసవత్తరంగా సందర్భాన్నిబట్టి కథలో వచ్చే పాత్రల హావభావాలను ప్రకటిస్తూ కథను రక్తి కట్టిస్తూ ప్రదర్శిస్తారు. అంతేగాక కథపట్ల, ప్రదర్శన పట్ల ప్రేక్షకుల్లో భక్తి మరియు గౌరవాన్ని పెంపొందించే విధంగా కథలో వచ్చే ముఖ్యమైన సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత అనుష్ఠానాలు, చదివింపులు చేయిస్తూ ఉంటారు. ప్రదర్శన పట్ల ఆకర్షితులైన భక్తులు కళాకారులకు చదివింపులు చేస్తే వారికి ఘనంగా దివనార్తి పెడతారు. కళాకారులు ప్రదర్శన మధ్యలో తమకు సహాయం చేసిన కుల పెద్ద మనుషులను స్మరిస్తూ, కీర్తిస్తూ ఇదంతా కళాకారులు తమ నైపుణ్యంతో సందర్భాను గుణంగా ప్రదర్శిస్తారు. అంతేగాక కళాకారులు కథలో భాగంగా వచ్చే రౌద్రం ,శోకం, యుద్ధం భయానకం వంటి సన్నివేశంలో అంతే ప్రతిభతో ప్రదర్శిస్తూ అడుగులు వేస్తూ ప్రేక్షకులు సన్నివేశాల్లో లీనమయ్యే టట్టు ప్రదర్శించటం వీరి ప్రత్యేకత.
నేటి స్థితి:
బహుళ చారిత్రక నేపథ్యం ఉన్న మాసయ్య లు తమ సంస్కృతిని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ, తమ సాంస్కృతిక మనుగడ ను కొనసాగిస్తూ మరుగున పడి పోయే దశకు చేరుకున్నారు . పూర్వం కళాకారులు రజకుల దగ్గర గౌరవమైన స్థానంలో ఆదరణ పొంది జీవించారు. కానీ నేటి ఆధునిక సమాజంలో గౌరవం లేకుండా పోయింది. కోవలో తమ మూల సంస్కృతిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కళాకారులు రాగి శాసనం మరియు వీర పలకలు చూపిస్తూ కథా గానం చేసేవారు. సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయింది. మిరాశీ గ్రామాల్లో రాగి శాసనాలు వీర పలకలు అడగడం లేదని వాటిని తీసుకు వెళ్లడం మానేశారు. అయితే ఇదే సందర్భంలో ఒక దళారీ వ్యవస్థ కళాకారులనే మధ్యవర్తులుగా చేసుకొని కళాకారుల దగ్గర అరకొర డబ్బులకు వాటిని సేకరించి వాటిని అధిక ధరలకు అమ్ముకున్నారని భోనగిరి సంగయ్య మాటల్లో తెలుస్తున్నది. అంతేగాక వీరి పటాలను కూడా సేకరించి లక్షల్లో అమ్ముకున్నట్లు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మడేలు పురాణం కథాగానం చేసే కళాకారులు కూడా ఒకటి లేదా రెండు కళాబృందాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఒకవేళ కళాకారులు ప్రదర్శించాలనుకున్నా వీరి తాతలు తండ్రులు పటాలను, రాగి శాసనాలను, వీర పలకలను అమ్ముకోవడం వల్ల మా మూల సంస్కృతి తెలియకుండా పోయిందని, మాకు బతుకునిచ్చే పటాలు అమ్ముకొని, మాకు బతుకుదెరువు లేకుండా చేశారని కళాకారులు వాపోతున్నారు. గంజి కూటి వారి సంస్కృతి కూడా రకంగానే కాలగర్భంలో కలిసిపోయి, చివరికి వారు కులం కిందికి వస్తారో తెలియకుండా పోయింది .అలాగే మాసయ్య లు తమ కళా సంస్కృతిని పరిరక్షిస్తూ వస్తున్నప్పటికీ పోషక కులం దగ్గర ఆదరణ లేక అంతరించే దశలో ఉన్నది. అంతేగాక వీరిని పోషించే రజకులు ప్రభుత్వపరంగా బీసీ – ‘కేటగిరిలో ఉండగా ఇదే కేటగిరీలో మాసయ్య లను గుర్తిస్తూ కులం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే అప్పుడు మరియు తమ పిల్లల చదువుల విషయంలో వీరికి ప్రత్యేక కులం లేకపోవడంతో సామాజికంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాసయ్యలను ప్రత్యేక కులంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు .అంతే గాక రజకుల ఆశ్రితులు అయిన గంజి కూటి వారికి, మాసయ్యల వారికి ఒకరి మధ్య ఒకరికి కంచం పొత్తు మాత్రమే ఉంటుంది. వియ్యం పొత్తు ఉండదు. అలాగే గంజి కూటి వారికి మాసయ్యలకు కూడా కంచం పొత్తు మాత్రమే ఉంటుంది. వీరి జనాభా అతి తక్కువగా ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాకారులు తమ మూల సంస్కృతిని పోషించుకుంటూ వస్తున్న సమయంలో ప్రభుత్వం మాసయ్యలను ప్రత్యేక కులంగా గుర్తించాలని, తమ కళా రూపం మనుగడకు కావలసిన ఆర్థిక వనరులను చేకూర్చాలని కోరుకుంటున్నారు. తద్వారా తమ మౌఖిక సాహిత్యం, సంస్కృతి భవిష్యత్ తరాలకు అందుతుందని ఆర్థికంగా తమ జీవనం కూడా కొనసాగుతుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కళాకారులు

పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం పై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంధాల్లో సహ సంపాదకులుగా, సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించాడు. జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

May 1, 2020
(కొలిమికి సౌజన్యంతో - రచయిత  డా. బాసని సురేష్ గారికి ధన్యవాదాలతో)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...