ద్వేషించే మిత్రుడి
కోసం
దేశాలు పట్టుకు
గాలించు
ఆవుల మూతులకు మేతలు అందించే ఉదారహృదయులు
గొర్రెల గుంపులకు పచ్చిక మేపే కాపరులు
ప్రేమలు ఊరించే దిగుడుబావులకు
ఏనాడూ గొడ్డుపోలేదీ
పుణ్యగడ్డ
పావురాళ్లను
అరచేతులతో నిమురుతూ
పాలకంకులు తినిపించే మచ్చిక
ఒక ఉచ్చురా బచ్చా!
కణకణమండే కొలిమి
తిత్తిలో
రాత్రంతా నువ్వు
రహస్యంగా పేనిన కొడవలి
కనీసం ఒక ప్రశ్న
మొనగా అయినా
కొరగారాదనేరా సోదరా
శత్రుపక్ష ఈ
ప్రేమాయుధాల ప్రహారమంతా!
వాడు అల్లిన అమలిన
శృంగారాంగారంలో
నీకై నువ్వే
స్వయంతృప్తి కొరకై
నిరాస్త్రంగా
దగ్ధమైపోవాలన్నదే
వాడి ఆంతరంగపు
అడుగు పొర కోరిక
శత్రువును
ప్రేమించమనే
వాడి ప్రథమ ప్రార్థనాసారం
రాలిపడే ముందు
పిడుగుపాటు ప్రదర్శించే
మెరుపుకాటుకు
నిన్ను నీవు
మైమరిచిపొమ్మనడం!
ప్రకృతి పచ్చదనాన్ని
మాత్రమే
తడిమి చూసి పరవశమయిపోతావా
ప్రజ్వలించే అగ్నశిఖ
అంచు రగిల్చే
అరుణవర్ణం పైన
మోహపడతావా
ఇతమిత్థంగా నువ్వదో
ఇదో
ఓ దోవేదో తేల్చుకునే
మీమాంస మధ్యనే
ఆ ప్రేమించేపులి
కోరపళ్లు కసిదీరా
చీరేసే మాంసం ముద్దైపోతావు!
ప్రేమించే విరోధులకు
ఏనాడూ
గొడ్డుపోలేదబ్బీ ఈ పుణ్యగడ్డ
కనకనే
ద్వేషించే మిత్రుడి తోడు కోసమై
దేశాలు పట్టుకునైనా గాలించమనేది
ప్రహసనమని
తెలిసీ
నీ కై నే రాసే ఈ
ప్రేమ కైతలో
వాడి మైకానికి
ధీరోదాత్తత తగిలించనిది
***
-కర్లపాలెం హనుమంతరావు
May 10, 2020
No comments:
Post a Comment