పెసలో, బొబ్బర్లో, వే
రు శనగలో విక్రయించి రూపాయిలు బొ
క్కసమున కెక్కించడమా
సిసలైన కవిత్వ రచన? సిరిసిరిమువ్వా!
***
'పందిని చంపిన వాడే
కందం రాయాల'టన్న కవి సూక్తికి నా
చందా ఇస్తానా? రా
సేందు కయో షరుతులేల సిరిసిరిమువ్వా!
***
కుర్చీలు విరిగిపోతే
కూర్చోడం మాననట్లు గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే
చేర్చదగు నొకింత చెత్త సిరిసిరిమువ్వా!
***
మళ్లీ ఇన్నాళ్లకు ఇ
న్నేళ్లకు పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్లన్ సవరించినట్లు సిరిసిరిమువ్వా!
***
ఖగరాట్ కృషి ఫలితంగా
పొగాకు భూలోకమందు పుట్టెను గానీ
పొగ చుట్టలెన్నియైనను
సిగిరెట్టుకు సాటిరావు సిరిసిరిమువ్వా!
***
ఏం లాభం పెరిగిన గ
డ్డంలా చట్టపు కారడవిలా మన దే
శంలో వ్యాపించిన ము
స్లింలీగును చూడరాదె సిరిసిరిమువ్వా!
***
ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగు సుజనుల్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా!
***
అవురా, శ్రీరంగం శ్రీ
నివాసరావూ, బలే మనిషివే, ఇక నీ
కవితా వాద్యం చాలించి
వెళ్లిపొమ్మనకు నన్ను సిరిసిరి మువ్వా
(ఆంధ్రజ్యోతి 1945, సెప్టెంబర్ ప్రచురణ)
--సేకరణః కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment