సర్వసర్వంసహావ్యాపి సర్వజీవ- జీవనాధారుడగు నొక్క దేవుడెవడో
కల డనగ
విందు గాని నిక్కం బెరుంగ!-
వాడదృశ్యుండు మాకేల వాని గోల?
చండార్క కిరణప్రకాండముల్ చొరలేని దండకారణ్య
మధ్యమున నీవు!
పేరు చెప్పినమాత్ర నీరు గడ్డలు గట్టు
తుహినాచలాగ్రమందునను నీవు!
కడలేని జలరాశి గర్భమందు నడంగి కనరాని
దీవులందునను నీవు!
దిగ్దిదిగంతశ్రాంత దేశదేశములందు గల యూళ్ల
వాడవాడలను నీవు!
అయ్యరూ! యింక నీవు లేనట్టి తావు- కలదె పరికింప నెందు
భూవలయమందు!
అహహ! యింక సర్వవ్యాప్తి యనగ నెవడు-దేవు డన నింక నెవడోయి
నీవుగాక!
సకలవిశ్వస్థకీటకకోటి నీ ఫలహారసామాగ్రియం
దైక్యమయ్యె!
ఇడెను ముక్కల కాసబడి కుక్క లిప్పుడు
మలభక్షణాసక్తి మానుకొనియె!
వాయసంబులు నేడు వాయుసమ్మార్జన ప్రక్రియల్ మాని
నీ పంచ చేరె!
గర్భస్థపిండముఖ్యసమస్తమనుజసంఘమ్ము నీ, కాత్మార్పణ మ్మొనర్పె!
భళిరా! జీవకో ట్లిటుల జీవనవిరక్తి- మాని, యనురక్తి నీపాద మానియుండె!
సరికదా! యింక జగతిలో సర్వజీవ -జీవనాధారుడెవడోయి నీవుగాక!
అయ్యరూ! పృథ్విలోన మాయామనుష్య-మూర్తియైన యా రఘురామమూర్తివోలె
ఈవు నినుగూర్చి సుంతేని యెరుగనేమొ?- సత్యముగ నీవు దేవాంశసంభవుడవు!
పూర్వ మెపుడొ విష్ణువు జగన్మోహినియయి-అమృతమును పంచెనంట సురాసురులకు!
ఇట జగన్మోహనుండవై యీవు నిడవె= అమృత రూపాంతరం బైనయట్టి కాఫి!!
టీ యని, కో కో యని, కా-ఫీ యని, యెద్దాని వింత పేర్లిడి యమృత
ప్రాయంబుగ గొందురొ, యది- యే యమృతంబని తలంప రేలనొ జనముల్!
నీవె ప్రత్యక్షదైవంబు! నిన్ను
మించు- దేవు డన్యుండు లేడు పృథ్వీస్థలమున!
కలియుగంబున లోకరక్షణము కొరకు - అయ్యరను
పేర దేవుడే యవతరించె!!
***
(భారతి మాసపత్రిక, 1929, జూన్ సంచికలో ప్రచురితం)
No comments:
Post a Comment