Saturday, September 26, 2020

చేతిరాత జాతకం మారేదెప్పుడు? -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ప్రచురణ

 


 

గౌరవనీయులైన ఓ మేజిస్ట్రేట్ గారిని  చదివే తీరులొ చేతితో తీర్పులు రాయాలని కేరళ హైకోర్టు మొన్నీ మధ్యన మందలించిన ఘటన  చదివినప్పుడు చేతిరాతను గురించిన కొన్ని  చిత్రమయిన సంగతులు గుర్తుకొచ్చాయి. బ్రహ్మరాత పద్ధతిలో మందుల చీటీ రాసిచ్చినందుకు ముగ్గురు వైద్యశిఖామణుల శిఖలు పట్టుకు ఝాడించిన అలహాబాద్ కోర్టు ఉదంతం అందులో ఒకటి.

 

చిన్నతనంలో కాపీ బుక్కులు ఎన్ని నింపినా, ఎదిగొచ్చి సెల్ఫోన్ చిక్కిన తరువాత చేతితో రాసేందుకు చిన్నబుచ్చుకునే నడమంత్రపు నాగరీకం ప్రస్తుతం నడుస్తున్నది! కంప్యూటర్లు,  సెల్ఫోనులు వంటి ఐ-సరంజామా చేతి కొచ్చి  అక్షరమాల, అనూ-లంటూ ఫాంటుల  మోహజాలంలో పడ్డప్పుడు, మనిషికి  చేతిరాత మీద కొంత రోత మొదలవుతుంది! కొత్త శతాబ్దిలోకి కాలం అడుగు పెట్టినప్పటి బట్టి పుట్టుకొచ్చిన సజ్జుకంతా కీ-బోర్డుల మీద వేళ్లు టకటకలాడించటం ఒక్కటే  తెలుస్తున్న రాతవిద్య! నేటి ఉపాధులకు  కీ-బోర్డు విద్యలు కీలకమే. అలాగని, ఓపిగ్గా ఓ సారి పెన్ను కేప్ ఓపెన్ చేసి నింపాదిగ కలానికి పని చెప్పనంత నిరాసక్తతే వింత!

 

కార్డు ముక్క గిలికే రోజుల్లో   చేతిరాతే  మహారాజు!  ఫాస్ట్ కాలానికి అనుగుణంగా ఈ-మెయిళ్లు దూసుకురావడం,  పోస్ట్‍ కార్డు కనుమరగువడం.. చేతిరాతకు ఎదురయిన పెనుగండం!  ఇసుక-అక్షరం నుంచి ఈ-అక్షరం దాకా చేతిరాత కథ మహాభారతమంత. ఇవాళ ఇంగ్లీషు బడి పిల్లగాడికి  వందేళ్ల కిందటి బుడతడికి మల్లే నేల అంటకుండా వేలుతో అక్షరాలు దిద్దవలసిన అగత్యం లేదు. ఐదేళ్ల కిందట ఫిన్లాండ్ దేశం చిన్నబడి పిల్లలక్కూడా కీ-బోర్డు వాడకం తప్పనిసరి చేసింది. ఆ తరహా అదుపాజ్ఞలేవీ మనకు లేకపోవచ్చు. కానీ చేతిరాత తలరాతకు మన సమాజంలో మాత్రం ఏమంత సానుకూలత ఉండడం లేదిప్పుడు. సంతకం ఒక్కటే  చేతిరాత వంతులా ఉంది  తంతంతా.

 

రాయించెడివాడు ఏ రామభద్రుడయినా రాసెడివాడి రాతలో తేడా ఉండటం లేదిప్పుడు. అంతా కంప్యూటరమ్మ రాత మహిమ! అక్షరాలను బట్టి రాసే మనిషి అంతరంగాన్ని విశ్లేషించే శాస్త్రానికి నిన్న మొన్నటి దాకా యమ డిమాండ్! అదీ అప్రస్తుతం అయిపోతోంది ప్రస్తుతం. కనీసం నేరాంగీకార పత్రం మీద అయినా నేరుగా దోషి  స్వహస్తాలతో తప్పు ఒప్పుకునే పద్ధతి తగ్గుతున్నదిప్పుడు. చదువుకొన్నవాడికీ చదువురాని వాడికీ కీబోర్డు మీటలే సర్వం సిద్ధం చేసిపెడుతున్నప్పుడు  చేతిరాతకు ఇక సాయం పట్టే సిద్ధివినాయకుడెవడు?!

 

చిన్నతనంలో  కాపీ బుక్కుల మీదాట్టే ధ్యాస పెట్టనందుకు బాపూజీ అయిన పిదప గాంధీజీ గిల్టీ ఫీలయ్యారు. కంప్యూటర్ల కాలంలో పుట్టలేదు కాబట్టే నోబెల్ గ్రహీత  ఠాగోర్ రంగు కాగితాల మీద   అక్షరాలు పూల తీగెల్లాగా ఎలా అల్లేవారో  తెలుసుకునే వీలుకలిగింది. జాతుల తలరాతలు మార్చిన నేతల  చేరాతలు ఎక్కువగా  గజిబిజిగానే ఉంటాయి. ఎందుకో? అదో  చిత్రం!  వనితల చేరాతలు వారి అంతరంగ అద్దాలకు మల్లే కళకళలాడతాయి. అదీ విచిత్రమే! తాతల కాలంలో పెద్దల రాతలు గొలుసుకట్టు తీరులో కలం దింపకుండా ఒకే ఊపులో సాగేవి.  పద్దుపుస్తకాలలో వ్యాపారస్తులు    మెలిక రాతల్లో వివరాలు తమాషాగా దాస్తుండేవాళ్ళు. బాపు  వంటి గీతకారులయితే ఏకంగా చేతిరాతల జాతకాలే మార్చేశారు.

 

అచ్చు యంత్రం ముందు నాటి మహద్గ్రంథాలన్నీ గతకాలపు మహాకవుల చేరాతలే కదా! చేతితో చెక్కే అద్భుత విద్య మనిషికి అబ్బకపోయి ఉండుంటే? ఉండవల్లి,  అజంతా, ఎల్లోరా వంటి గుహా కుద్యాల మీదిప్పుడు కనిపించే శాసనసంపద మన దాకా వచ్చేదే కాదు. రోజుకోటి చొప్పున తాళపత్రాల పైన తాళ్లపాక అన్నమయ్య  దేవుడికర్పించిన కీర్తనలన్నింటికీ చేతిరాతే కదా ఆలంబన! త్యాగరాజయ్యరు గాలికి పాడి వదిలేసిన రాగాలను శిష్యులు చేఅక్షరాలుగ మార్చి తాటాకు దొన్నెలకు పట్ట బట్టే దక్షిణాదికి ఒక కొత్త సంగీత సంప్రదాయం పట్టుబడింది! ఆ చేతిరాత వైభవమంతా చెల్లిపోయేలా చేతులెత్తేయడం తాతలిచ్చిన సంప్రదాయానికి జెల్లకొట్టడమే! భారత రాజ్యాంగ చట్టం ముచ్చటైన చేతిరాతల్లోనే    శాశ్వతత్వం సాధించుకొందన్న సత్యం.. భారతీయులమై ఉండీ మనం మర్చిపోతున్నాం! మహా దురదృష్టం.

 

మానవ సమాజం మీద పడ్డ అక్షరం ముద్ర మామూలుది కాదు, ఈనాటిదీ కాదు. ఇండియన్ యాంటిక్వరీ (Indian  Antiquery) రాసిన డాక్టర్ బూలర్  భారతీయులకు ఈ అక్షరాలు చేతితో రాసే అపూర్వ విద్య  క్రీస్తు పుట్టుకకు ఎనిమిదొందల ఏళ్లకు పూర్వమే తెలుసన్నాడు. పండిత్ గౌరీశంకర్ హీరాచంద్ర ఓఝా క్రీస్తుకు పూర్వం పదహారు, పన్నెండు శతాబ్దాల మధ్యకే ఉత్తరాలు రాసే కళ ఉత్కృష్ట దశకు భరతజాతి చేరుకుందని నిరూపించాడు. 'షణ్మాసికే తు సంప్రాప్రే భ్రాంతిస్సంజాయతే యతః, ధాత్రాక్షరాణి సృష్టాని పత్రారూఢాన్యతః పురా'- ఏ విషయం తెలిసినా ఎంత ఏనుగు జ్ఞాపకశక్తి కలిగి ఉన్నా ఆరు నెలలు గడిస్తే మనిషికి కొంత మతిమరుపు సహజమని జీవశాస్త్రవేత్తల భావిస్తారు. మనిషి మతిమరుపు కతలు ముందుగా తెలిసే అతగాడి ఆ ముదురుజబ్బుకు మందుగా  బ్రహ్మదేవుడు వర్ణమాల వరంగా ప్రసాదించాడని బృహస్పతి స్మృతి! రజస్వల అయి రాసినమ్మకు బట్టతలతో బిడ్డ పుడుతుంద'ని కృష్ణయజుర్వేద సంహిత ద్వితీయ కాండ చెబుతుంది. 'యాప్ర లిఖతే తస్యైఖలతిః' అన్న ఆ సూక్తిని బట్టి చూస్తే అక్షరాలను గురించి, వాటిని చేతితో రాయడాలను గురించి యుగాల కిందటే భరత ఖండంలో బ్రహ్మాండమైన చర్చ జరిగిందని బోధపడటంలేదా! 

 

వ్యాసుడు చెప్పుకుపోతుంటే విఘ్ననాయకుడు రాసుకుపోయాడంటారు పంచమవేదం. వ్యాస మహర్షి కాలం సుమారు 5 వేల సంవత్సరాల కిందటిదని ఒక వాదం. చేతిరాత సహస్రాబ్దాల  బట్టి ఆర్షభూమిలో పరంపరగా  కొనసాగుతోన్న హస్తకళ అనేందుకు  వందల కొద్దీ ఉదాహరణలు చరిత్రగని తవ్వే  కొద్దీ బైటపడతాయి. చక్రవర్తి కుమారుడైనా సరే, చౌలమైన(పుట్టెంట్రుకలు తీసే సంస్కారం) తరువాత అక్షరాలు నేర్చుకు తీరాల్సిందే అన్న 'వృత్త చౌల కర్మా లిపిం సంఖ్యానం చోపయుంజీత' అనే కౌటిల్యుడి అర్థశాస్త్ర విధి అందులో ఒకటి.   వాల్మీకి మహర్షి ఆ విధంగానే చౌలసంస్కారం చేయించి మరీ లవకుశులకు అక్షరాలు దిద్దించినట్లు భవభూతి కథనం. కాళిదాసు కూడా రఘువంశంలో అజుడు లిపి పరిజ్ఞాత అయిన తరువాతనే సంస్కృత సాహిత్య సముద్ర ప్రవేశం చేసినట్లు రాసుకొచ్చాడు. బాణుడు చంద్రాపీడ మహారాజు విద్యామందిరంలో అరో ఏట అడుగుపెట్టింది మొదలు ఏ విధంగా విద్యను అభ్యసించాడో వివరించాడు. విశ్వామిత్రుడి మతం ప్రకారం పిల్లలు అయిదో ఏట పడగానే  అక్షరాల గుంట ముందు కూలబడాలి.  పండిత భీమసేన్ వర్మ కృత 'షోడశ సంస్కార విధి' గ్రంథానుసారం అజ్ఞాతుడైన రచయిత రాసిన స్మృతిని బట్టి 5, 7 వయసుల్లో అక్షరాలు నేర్చుకోవడం వటువులకు తప్పనిసరి సంస్కారవిధి. వడుగుకు ముందే మనిషి  గంటం చేతబట్టాలని  బృహస్పతి స్మృతి విధి. మార్గశిరం నుంచి జ్యేష్ఠం వరకు అక్షరజ్ఞానానికి అనుకూలమైన కాలం. ఆషాఢం నుంచి కార్తీకం వరకు అక్షరాభ్యాసం నిషిద్ధమని విశ్వామిత్ర నీతి.  సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నప్పుడే అక్షరాల అవపోసన ఆరంభించడం వశిష్ఠ వాక్కు ప్రకారం శ్రేయస్కరం.  స్మృతి చంద్రిక కర్త మార్కెండేయ పురాణోక్తులను పేర్కొంటో అపరార్కుడు ఐదవ ఏట  కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపల అమావాస్య, పౌర్ణమి లాంటి తిధులు; చవితి, నవమి, చతుర్దశులు; శని, మంగళ వారాలు- చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించకూడని కాలాలని హెచ్చరించాడు. కుంభరాశిలో రవి ఉన్నా, లగ్నాతు అష్టమంలో గ్రహాలు తిష్ఠ వేసినా అక్షరాల జోలికి పోరాదన్న విధీ  ఒకప్పుడు భరతభూమిలో కథ. ఓనమాలు రానివాడు ఆనవాలు లేకుండా పోతాడన్న భయం అనాదికాలం నుండి మనిషి గుండెల్లో మారుమోగుతుండబట్టే ఇన్నేసి పురాణేతిహాసాలలో, స్మృతి స్ముతుల విధివిధానాలలో అక్షరాల గురించి వాటి అభ్యాసాదుల గురించి రుషుల మధ్య అంతంతలేసి చర్చోపచర్చలు సాగింది. కంప్యూటర్ మాయలో పడి ఆ సంప్రదాయం ఛాయామత్రంగానైనా  మిగిల్చుకునేందుకు ప్రస్తుతం మనం పస్తాయిస్తున్నాం. అది కదా విచారం!

 

చాలా మంది ఇళ్ళల్లో పాతలేఖలు నాటి తీపి గుర్తుల కింద దాచుకుంటారు. ఆ  ఉత్తరాల కోసం రోజులు, వారాల తరబడి ఎదురుచూసిన  పాతకాలం మధురానుభూతులను ఒక్కసారి నెమరువేసుకోవాలి.  కంప్యూటర్  కొత్తవింతలో పడి..  చేతిరాత రోతగా మారకుండా అప్రమత్తమవాల్సిన అగత్యం అప్పుడు తప్పకుండా స్పృహకొస్తుంది. ఇదే అంశం మీద పీడియాట్రిక్ థెరపిస్ట్ సాలీ పెయిన్  గార్డియన్ వార్తాపత్రికకు ఇంటార్వ్యూ ఇస్తూ 'బళ్లకు వెళ్లే పిల్లలకు పెన్సిళ్లు ఇస్తే  సరయిన పద్ధతిలో పట్టుకోలేకపోతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో రోజులో అధిక భాగం చేసే స్నేహం పిల్లల  ప్రాథమిక చలన నైపుణ్యాలను బాగా దెబ్బతీస్తుంది' అని అన్నారు. అధ్యయన, అభ్యాస రంగాలలో చేతిరాత పాత్ర రాను రాను ఎంతలా దిగనాసిల్లుతున్నదో   ప్రచారం చేసే బాధ్యత స్వచ్ఛందంగా  పుచ్చుకున్న డాక్టర్ జేన్ మెడ్వెల్, ఇళ్లలో పెరుగుతోన్న గ్యాడ్జెట్ల వల్లనే  పిల్లల్లో చాలా మందికి పెన్సిల్ మీద పట్టు కుదరడంలేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. నేషనల్ హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తోన్న డాక్టర్ మెలీసా ప్రూంటీ, ప్రాథమిక స్థాయి నుంచే పాఠశాలల్లో బాలలకు ఐ-పరికరాల స్థానే అచ్చు పుస్తకాలు, పలకా బలపాలు, పెన్నూ పెన్సిళ్లను పోలే ఆటవస్తువులు అలవాటు చేయడం-  బుద్ధివికాసం జీవనసమరానికి దగ్గరయే మేలైన అనుసంధాన చమత్కారం అని చెప్పుకొచ్చారు. 2014 నాటి  ఒహాయో యూనివర్శిటీ పరిశోధనల్లో అమెరికాలో ప్రతి ముగ్గురు పెద్దవాళ్లలో ఒకరు ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు చేతితో ఏమీ రాయడం లేదని తేలింది. ఇక్కడ ఇండియాలో కూడా దరిదాపులుగా అదే దుస్థితి. కానీ, అదృష్టం కొద్దీ చేతిరాత  పట్టు ఎంతో కొంత మేర చదువు సంధ్యల్లో, బతుకు తెరువులో ఇంకా మిగిలే ఉందని నమ్ముతున్నాం మనం.  కాబట్టే పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో చేతిరాత వైభవం పునరుద్ధరణార్థం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తోంది. 2005లో ఎయిక్స్-మార్సెల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరోసైన్స్ లేబరేటరీ మూడు నుంచి ఐదేళ్ల మధ్య వయసు పిల్లలను రెండు బృందాలుగా విడగొట్టి ఒక బృందానికి చేతిరాత, మరో బృందానికి కంప్యూటర్ రాత పని అప్పగించింది. చేతిరాత పిల్లలు, కంప్యూటరు సాయంతో రాసే పిల్లల కన్నా  అక్షర జ్ఞానంలో చురుకుగా ఉన్నట్లు  తేలింది.  అక్షరాలు దిద్దే క్రమంలో  క్లిష్టమైన కండరాల కదలికలను మాలిమి చేసుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అన్న ఆత్మవిశ్వాసం సాధకు బలపడుతుంది. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోనే సందర్భంలో ఈ ఆత్మవిశ్వాసమే విజయసాధనకు తోడ్పడేది అంటారు  డాక్టర్ మెడ్వెల్. మూడేళ్ల కిందట అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఇల్లినాయిస్  రాష్ట్రంలో చిన్నబళ్ళల్లో చేతిరాత తరగతులు  తిరిగి తప్పనిసరి పాఠ్యాంశాలలో ఒక్కటిగా మార్చడానికి ఈ తరహా కొన్ని అధిక ప్రయోజనాలే ప్రముఖ కారణం.

మన దేశంలో మొన్న మొన్నటి దాకా న్యాయస్థానాల దస్తావేజుల్లో చేతిరాతే ముఖ్యమైన స్థానంలో ఉండేది.  భాష సరే, కరక్కాయ సిరాతో రాసే ఆ  అక్షరమూ  ఎంత చూడ ముచ్చటగా ఉండేదో ఈ తరానికి తెలిసే దారేదీ? చిన్న దావాలలో న్యాయాధీశులు కంప్యూటరు గట్రాలు గట్టున పెట్టేసి స్వంత దస్తూరితో స్పష్టంగా  రాసిన  తీర్పులు వెల్లడించాలని ఈ మధ్య కేరళరాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఓ  సలహా ఇచ్చింది. కంప్యూటర్ రొట్టకొట్టుడు భాష తెచ్చే అనర్థాలను  వివరిస్తూ సాక్షుల వాజ్ఞ్మూలాలు సైతం వీలయినంత మేరకు ఆ అధికారం కలవారు స్వదస్తూరితో నమోదు చేస్తే, చేతిరాత   సాధికారత పునరుద్ధరించనట్లు అవుతుందన్నది ఉన్నత న్యాయస్థానం అభిప్రాయం. చేతిరాత ఘనతను ఇకనైనా చరిత్రలో కలవకుండా విజ్ఞతతో  వ్యవహరిద్దామా?

 

పొందికైన జీవితానికి అందమైన చేతిరాత ముంజేతిన మెరిసే బంగారు కంకణం. ఆ అందమైన చేతిరాతకు అదనంగా మార్కులేసి ప్రోత్సహించే   సంప్రదాయం గతంలో బడి పిల్లల పరీక్షల్లో కనిపించేది. మార్కుల కోసమేనా? జీవితంలో మంచి రిమార్కులు సాధించడానికీ చేతిరాత మీద పాతకాలంలో మాదిరి  శ్రద్ధ మరంత పెంచడం అవసరం. జాతీయ చేతిరాత దినం' అని ప్రతి ఏటా జనవరి 23 ను  ఓ ప్రత్యేక దినోత్సవంగా గుర్తిస్తున్నాం మనం. దస్తూరీ ఆవశ్యకత అవిస్మరణీయమని చెప్పడానికి ప్రత్యేకమైన ఉత్సవాలు జరపనవసరం లేని ప్రోత్సాహ వాతావరణం  తిరిగి చేతిరాతకు రావాలని కోరుకుందాం!

-కర్లపాలెం హనుమంతరావు

***

(సూర్య దినపత్రికలో ప్రచురితం) 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

చేతిరాత

-కర్లపాలెం హనుమంతరావు

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...