Sunday, November 29, 2020

తాడికొండ శివరామశర్మ ' రహస్యం ' మంచి కథానిక - నా పరామర్శ

 తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం '  ప్రెన నా పరామర్శ 

కథను ఉత్కంఠతో చదివించే అనేక సుగుణాలలో ఒకటి -కథకుడి దృష్టి కోణం . అందరికీ తెలిసి అందరం ఒక విధంగా భావించే ఒకానొక ప్రముఖ సంఘటనను వస్తువుగా ఎంచుకొని .. దానిని విస్మయం కలిగించే మరో అనూహ్య కోణంలో ఆవిష్కరించడం ! ' ఆహా( ' అని అబ్బురపరచే ఆ కొత్త కోణం తర్కానికి అనువుగా సాగితే ఆ కథ నిస్సందేహంగా  గుర్తుంచుకోదగ్గ కథలలో చేరుతుంది. రచన  శాయి గారి కథావాహిని - 2005 లో కనిపించే తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం 'ఈ తరహా మరపురాని కథలలో ఒకటి.

భారతంలోని చిన్న కథ - ద్రోణాచార్యులవారు   ఉదరపోషణార్థమై రాచ కొలువులో ఉద్యోగం కోసరం అన్వేషించేనాటి కథ. హస్తిన రాచవీధులలో బాల కురుపాండవులు ఆడుకునే బంతిని బావిలో గిరాటేసుకుని  బైటికి తీసే సాధనాలు , ఉపాయాలు అందుబాటులో లేక బిక్కమొగాలతో  నిలబడి ఉన్నప్పుడు కాకతాళీయంగా అటుగా వచ్చిన ద్రోణాచార్యులు శర సంధానంతో సమస్యను పరిష్కరించడం- దరిమిలా ఆచార్యులవారికి  రాచ కొలువులో గురు పదవి  ఖాయం కావడం అందరికీ తెలిసిన కథ . నీటిలో పడిన బంతి శాస్త్రరీత్యా శరసంధానం ద్వారా బైటికి రావడం  అసాధ్యం. బంతి జడత్వాని కన్నా ఎక్కువ జడత్వం కలిగిన బాణం ఎంత చెక్క పదార్ధంతో చేసినదైనా నిట్టనిలువుగా నిలబడదు. బాణానికి బాణం సంధించి తాడులా పేని బంతిని బైటికి తీసినట్లు మా చిన్న తనంలో బాలల బొమ్మల భారతంలో బొమ్మ వేసి మరీ    చెప్పిన  కథను బాలలం కనక నమ్మాం. కానీ చిన్న పిల్లల మల్లే కాకుండా బుద్ధి వికాసం సాధించిన పెద్దలూ  అంత బలంగా  ఎలా నమ్ముతున్నారో !  

' కథకు కాళ్లుండవు ; ముంతకు  చెవులుండవు' అన్న సూత్రం అండ చూసుకొని మరీ చెవుల్లో    పూలుపెట్టే కాల్పనిక సాహిత్యం విశ్వవ్యాప్తంగా వినవస్తున్నదే !  కానీ ఆ తరహా కాల్పనికత బాలల్లో మాత్రమే మనోవికాస అభివృద్ధిని ఉద్దేశించినది.  పెద్దలకు కాదు . పురాణ,ఇతిహాసాలలో  పుట్టలు  పుట్టలుగా కనిపించే ఈ వింత కట్టు  కథానికల పరమార్ధ౦ మరేమైనప్పటికీ , ఆ తరహా అభూత కల్ప నను కథాంశంగా ఎంచుకొని దానికి ఓ శాస్త్రీయత ఆపాదించే తాడికొండ శివకుమార  శర్మ ప్రయత్నం నిశ్చయంగా తెలుగు కథ వరకు సరికొత్త ప్రయోగం ; సదా అభినందనీయం ! 

నూతిలోని నూలు బంతిని శర సంధానంతో కాకుండా పై మీది  అంగవస్త్రంలోని తేలికపాటి దారపు పోగులతో   తాడుగా పేని బాణానికె  కట్టి  సంధించడం ద్వారా బంతిని గురువులు బైటికి  తీసినట్లు కథకుడు చేసిన ఊహ శాస్త్రీయ పరిధులలో ఉంటూనే సమస్యకు  చక్కటి పరిష్కారంగా అనిపిస్తుంది! అంతకు మించిన లౌక్యం ప్రదర్శిస్తాడు ద్రోణాచార్యులు పాత్ర  ద్వారా .. అతగాని శిష్యుల శస్త్ర ప్రయోగ నైపుణ్యం పరీక్షకు పెట్టే సందర్భంలో !

చెట్టు మీద ముందే పెట్టించిన మట్టిపిట్ట కంటిని గురి చూసి కొట్టమన్నప్పుడు 105 మంది కురుపాండవులలో ఒక్క అర్జునుడు మినహాయించి  అందరూ వైఫల్యం చెందిన కథ మనకు సుపరిచితం.   శిక్షణ బాధ్యత నెత్తికెత్తుకున్న గురువుల సామర్ధ్యం  శిష్యుల పనితనాన్ని (performance) ను బట్టి బేరీజువేసే నేటి రివాజు భారత కథ నడిచిన రోజులకూ అన్వయించి రచయిత చేసిన కల్పన   తెలుగు కథకు   కొత్త ప్రయోగం! చెట్టుమీది పిట్ట కంటిని సూటిగా కొట్టడంలో విజయం సాధించింది 105 మంది శిష్యులలో ఒక్క అర్జునుడే! ఆ నిజం భీష్మాచార్యులవారి   దాకా చేరితే పరువుతో సహా ద్రోణాచార్యులవారి  కొలువుకూ ముప్పు ఖాయం. ఉదరపోషణ కోసం    మరో దారి వెతికే శ్రమ  తప్పించుకునే నిమిత్తం ఆచార్యులవారు ఆ పద్ధర్మంగా  ప్రదర్శించిన లౌక్యం నేటి కాలపు విద్యా రంగంలోని మాయా మర్మాలకు ఏ మాత్రం తీసిపోనిది! విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనకు  నలుగురికీ తెలిసే బహిరంగ విధానం కాకుండా in- door మెథడాలజీని ఆశ్రయిస్తాడు ద్రోణాచార్యులు. భోజనానంతరం శస్త్ర పరీక్షలకు ముందు   మరికొన్ని పరీక్షలు నిర్వహించిన మీదట రచయిత గురువుగారి  పాత్ర ద్వారా చమత్కారంగా చెప్పిన అసలు రహస్యం  ఏమిటంటే ఒక్క అర్జునుడికి మినహా మిగతా శిష్యులందరికీ దూరాన ఉండే వస్తువులు సృష్టంగా  కనిపించని కంటి దోషం! భారత కాలం నాటికి చికిత్స ప్రక్రియ ద్వారా కంటి దోషాలు సరిదిద్ద గలిగే వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందలేదు.. ఉన్న విషయం బైటపెట్టి కొలువు ఇచ్చిన పెద్దల ఆగ్రహానికి గురికాకుండా నేడు  ప్రభుత్వాంగాలలోని అధికారులు , ఉద్యోగులు ఏ విధంగా తిమ్మిని బెమ్మిని చేస్తారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ! అదే రహస్య పంథాని     అనుసరించిన ద్రోణాచార్యులు  కురుపాండవుల  కంటి సమస్యలను ధృతరాష్ట్ర , భీష్మాచార్యుల నుంచి  దాచిపెట్టి.  వేరే రాచ విద్యలు నేర్పించేందుకు  అనుమతి తీసుకుంటాడు. విలువిద్య అంటే గురి చూసి ప్రయోగించే యుద్ధ కళ. దుర్యోధన, భీమసేనుల వంటి వాళ్లకు వంటబట్టించిన గదాప్రహారం తరహా విద్యలకు గురితో పనిలేదు కదా ! విల్లు కాకుండా మరే ఇతర ఆయుధాలు ప్రయోగించినా కనీసం  కుడి వైపు వారి మీదో , ఎడమ వైపు వారి మీదో దెబ్బ పడటం ఖాయం' అంటూ గడుసుగా ముక్తాయించడం  కథాంతంలో రచయిత ప్రదర్శించిన  చక్కని చమత్కారం.    ' రహస్యం' కథానిక కలకాలం గుర్తుండి పోయేందుకు కారణం కథనం, శిల్పం కన్నా  రచయిత ఎంచుకున్న కథాంశం . . దానికి ఆపాదించిన శాస్త్రీయ దృక్పథం, కొత్త తరహా ప్రయోగశీలత; చమత్కారం అదనం. కథలన్నింటినీ బలాత్కారంగా ' సామాజిక స్పృహ ' బరిలోకి దించనవసరం లేదు. నవీన ప్రయోగం, సృజనాత్మక కాల్పనిక దృష్టి వంటివీ  కథానికకు పుష్టి చేకూర్చే దిట్టమైన సరుకులే! '

తాడికొండ శివకుమార శర్మగారికి మనసారా అభినందనలు! 

 - కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూఎస్.ఎ 

29 - 11 - 2019











No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...