Friday, July 23, 2021

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)

 


ఎందుకలా అని అడగద్దెవరూ!

-కర్లపాలెం హనుమంతారావు


 

పిల్లల్లారా వినండర్రా!

మీ నాయన పోయాడివాళ.

ఆయన పాత కోట్ల నుంచి

మీకు  అంగీలు, లంగాలు కుట్టించేదా?

నాయన పాత పేంట్లు చించి

మీ సైజుకు సరిపోయే  జేబులు కుట్టిస్తానర్రా!

తాళాలూ చిల్లర డబ్బులు

పొగాకు చుట్టల అడుగున

ఆ జేబుల్లోనే కదా పడివుండేదెప్పుడూ!


డుంబూకేమో తన తండ్రి ఆస్తి పైసలు

బ్యాంకుల్లో వేసుకు దాచుకునేందుకు

బుజ్జి తల్లికి  నాన్న గుర్తుగా తాళాల గుత్తులు

కాళ్ల గజ్జెలకు మల్లే ఆడించుకు తిరగచ్చు భలేగా!

..

అంతేనరా! ఎన్ని చావులొచ్చినా

బతికుండక తప్పదు మనకు

పోయినోళ్లు ఎంతటి మంచోళ్లయినా

ఎల్లకాలం గుర్తుండరు కదా ఎక్కడయినా!


బుజ్జీ, లే!

 బడికెళ్లే టైమయింది

బువ్వ తినమ్మా

డుంబూ,  నీ కాలికి గాయమయిందిగా

పోయి ముందు నువు మందేసుకో!


జీవితంతో  అదేరా గొడవ భడవాయిల్లారా!

మనసెంత నొచ్చినా తప్పించుకు తిరక్క చావదు 

ఎందుకలా అని అడగద్దెవరూ పిల్లలూ!

ఎందుకనో..   నాకూ పెద్దలెవరూ చెప్పలేదు 

ఇంతవరకు

- కర్లపాలెం హనుమంతరావు

24 -07 -2021

(ఎద్నా సైంట్ విన్సెంట్ మిలే కవిత – లేమెంట్ కు నా తెలుగు సేత) 


Lament

- Edna St. Vincent Millay 

Listen, children:

Your father is dead.

From his old coats

I’ll make you little jackets;

I’ll make you little trousers

From his old pants.

There’ll be in his pockets

Things he used to put there,

Keys and pennies

Covered with tobacco;

Dan shall have the pennies

To save in his bank;

Anne shall have the keys

To make a pretty noise with.

Life must go on,

And the dead be forgotten;

Life must go on,

Though good men die;

Anne, eat your breakfast;

Dan, take your medicine;

Life must go on;

I forget just why.

-Edna St. Vincent Millay

నా పరామర్శః

ఇంటికి పెద్ద దిక్కు అనూహ్యంగా మరణించినప్పుడు అప్పటి వరకు ఎంతో బేలగా కనిపించిన ఆ ఇంటి ఇల్లాలు  ధీరవనితగా మారిపోతుంది. ముందు ముందు ఎదిగి జీవితంలో  సొంత కాళ్లపై నిలబడవలసిన తన పసికూనల కోసం ఆ ఉగ్గబట్టుకోడం! పుట్టెడంత దుఃఖం కడుపులో తెరలుతున్నా.. అణుచుకుంటుందా ఇల్లాలు! అసలేమీ జరగనట్లే రోజూలానే పిల్లలను ఆమె పరామర్శించే తీరు ఈ కవితలోని ప్రతీ పాదానికీ ఉదాత్తత చెకూరుస్తుంది. పిల్లల పట్ల అంత అప్రమత్తతతో ఉన్నప్పటికీ  పిల్లల తండ్రిని గురించే అడుగడుగునా ప్రస్తావించడం ఈ కవిత విశిష్టత. స్త్రీకి తరలెళ్ళిపోయిన తన జీవితభాగస్వామి పైనుండే తరగనంత అనురాగాన్ని  బిడ్డల వైపుకు మళ్లించే కుటుంబ సంబంధాన్ని ఎంతో బలంగా చాటుతున్నది  కనకనే ఈ కవితకు ఇంత  గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా. 

కుటుంబంలో జరిగే పెను విషాదాలు పసికూనలపై పడకూడదని, పోయినవాళ్లను గురించి ఎంత దుఃఖం పొర్లుతున్నప్పటికీ పెద్దలు తమ బాధ్యతగా పిల్లలతో ఎప్పటిలాగానే ప్రవర్తించాలన్న గొప్ప సందేశం ఈ పద్యంలని ప్రతి పాదంలోనూ కనిపించడం విశేషం. 

ఎంత మంచివాళ్లు పోయినా జీవితం ఆగకుండా ముందుకు  కొనసాగాల్సిందేనన్న తాత్విక చింతనతో ముగిసే  ఈ పద్యనికి కొసమెరుపులా మరో లోక రీతీ 

‘లైఫ్ ముస్ట్ గో ఆన్.. అని ఊరుకోకుండా.. ‘ఐ ఫరగెట్ జస్ట్ వై’ అని కర్త అనడం కవితను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది.  చావు పుట్టుకలతో నిమిత్తం లేకుండా జీవితం కొనసాగుతూనే ఉండాలన్న నిత్యసత్యం ఊరడింపు వాక్యంగా తనకు తాను చెప్పుకోడం కోసం. ‘ఎందుకు అట్లా’ అనే తాత్విక సంశయం సహజంగానె పసి మెదళ్లలో మొలకెత్తక మానక మానదు కదా! ఆ సందేహం తలెత్తి చిన్నారులు అయోమయం పాలవకుండా ‘ ఐ ఫర్ గెట్ జస్ట్ వై’ అని ఆదిలోనే  ఫుల్ స్టాప్ పెట్టేసింది గడుసుగా తల్లి. ప్రకృతిలో జరిగే అన్ని సంఘటనలకు కారణాలు వెతకబోతే మనిషి అవగాహనకు అందనివీ ఎన్నో ఉండనే ఉన్నాయి కదా!

-     కర్లపాలెం హనుమంతరావు

   23 -07 -2021

 

 

Saturday, July 17, 2021

జీత భత్తేలు -కర్లపాలెం హనుమంతరావు

 


సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థలో ప్రధాని అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అదే విధంగా ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి  శక్తివంతమైన నాయకుడై ఉంటాడు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికి,  ఆ తర్వాత  ప్రధానమంత్రికి.. అని ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వాస్తవంలో అట్లాలేదు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ప్రధాని జీతం కన్నా ఎక్కువ.

దేశం స్వతంత్రమయే సందర్భంలో ప్రధాని జీతం నిర్ణయం కాలేదు. దేశ ప్రథమ ప్రధానిగా ఎన్నికయినా జవహర్ లాల్ నెహ్ర్రూ  ఈ జీతబత్తేల మీద మనసు పెట్టలేదు. బ్రిటిష్ వారి పాలన కాలంలో  ప్రధాని జీతం అతని  క్యాబినెట్ మంత్రుల  జీతం కంటే రెట్టింపు ఉండేది. ఇక  ఇతర ప్రయోజనాలు సరే సరి.  స్వతంత్ర  భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి ఉండాలి న్యాయంగా అయితే. ఆ సమయంలో కేంద్ర కేబినెట్ మంత్రుల జీతం నెలకు రూ .3,000 గా అనుకున్నారు. అయినా నెహ్రూజీ తను ప్రధానిగా రెట్టింపు జీతం తీసుకొనేందుకు ఇష్టపడలేదు. తన మంత్రులతో సమానంగా మాత్రమే జీతం తీసుకునేందుకు మొగ్గుచూపారు. ఇక ప్రస్తుతానికి వస్తేః

ఇప్పటి ముఖ్య మంత్రులందరిలో తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు నెలకు 4 లక్షల 10 వేల రూపాయలు జీతం కింద పుచ్చుకుంటున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల జీతాలన్నింటిలో ఇదే ఎక్కువ.  ఆ తరువాతి స్థానం దిల్లీ సి.యం ది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సి.యం గా అందుకుంటున్న జీతం 3 లక్ష 90 వేల రూపాయలు. గుజరాత్ సిఎం జీతం రూ.3.21 లక్షలు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు నెలకు రూ.3 లక్షలు.

రూ.2 లక్షలకు పైగా సంపాదించే ముఖ్యమంత్రుల జాబితాలో హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఉన్నారు.

ఒక లక్ష 5 వేల రూపాయలు తీసుకునే త్రిపుర సిఎం అతి తక్కువ ముఖ్యమంత్రి జీతగాడు.

దేశంలో అత్యధిక జీతం ఇచ్చే జీతం ప్రయివేట్ కంపెనీలలో టెక్ మహీంద్రాది మొదటి స్థానం. ఆ కంపెనీ  సీఈఓ జి.పి.గుర్నాని  ప్రస్తుతం రూ.165 కోట్ల వార్షిక వేతనంతో పుచ్చుకుంటున్నారు. చీఫ్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు రూ.15 కోట్ల నుంచి రూ.165 కోట్ల వరకు జీతాలు ఇచ్చే కంపెనీలు మనదేశంలో చాలా ఉన్నాయి.

-కర్లపాలెం హనుమంతరావు 



 


Tuesday, July 6, 2021

యక్షులు ( పౌరాణిక సమాచారం .. సరదాగా ) - కర్లపాలెం హనుమంతరావు

  

దేవతా గణాలలో యక్షులు ఒక విభాగం  .  యక్షులు దయ్యాలు కాదు. శివ పంచాక్షరీ స్తోతంలో మహాశివుడిని ‘యక్ష స్వరూపాయ ‘ అని స్తుతించడం వింటుంటాం. దయ్యాలయితే  పూజలు ఉంటాయా? 

యక్షుల ప్రస్తావన లేని పురాణాలు కూడా అరుదే! అధోలోకాలు ఏడయితే   అతలం పిశాచాలకు, వితలం గుహ్యకులకు, సుతలం రాక్షసులకు, రసాతలం భూతాలకు మల్లే  .. తలాతలం యక్షులకు  నివాసస్థలమయిందిట. తలాతలం కింది   మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగాలు  ఉంటాయని హిందువులనమ్మకం. గోమాతలోనూ సకల దేవతలూ వారి  వారి గణాలన్నీ కొలువై ఉంటాయనీ సురభిమాత   వామభాగం ఈ యక్షుల వసతిస్థలమని ఓ నమ్మిక . ఒక్కో దేవతాగణానికీ ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని వక్కాణించే   వరాహపురాణంలో  యక్షగణాల బస  శతశృంగ పర్వతం. 


యక్షజాతికి కుబేరుడు  అధిపతి. మగవాళ్లు   యక్షులయితే  , స్త్రీలు  యక్షిణిలుగ ప్రసిద్ధులు . యక్షిణులు మహా సౌందర్యమూర్తులు. ఆ జాతి  వృత్తి గుప్త నిధులకు  పహారా. యక్షులను  ప్రసన్నం చేసుకుంటే  కోరుకున్న సంపదలు సిద్ధిస్తాయని  ఉత్థమారేశ్వర తంత్రం వూరిస్తుంది.  యక్షిణులు ఎంత సౌందర్యవంతులో అంతకు మించి శక్తివంతులుకూడా.వారి ఆవాహనార్థం ఎన్నో యక్షిణీ సాధనలు అపర విద్యలుగా ప్రచారంలో ఉన్నాయి. దేహంలోనికి    చెవి ద్వారం గుండా  ప్రవేశించి భక్తుల చేత సత్కార్యాలు చేయిస్తారని విశ్వాసం . రౌద్రం వస్తే వీరంత  విధ్యంసకారులు మరొకరుండరనీ అంటారు . 

యక్షులు కళాకారులు ; పోషకులు కూడా!  మహాకవి కాళిదాసు మార్కు యక్షుడు ఆషాఢమాస విరహం  ఓపలేక ప్రియురాలికి  మేఘుని ద్వారా  సందేశం పంపిన కథ మనకందరికీ తెలిసిందే! మహాభారతం వ్యాసముని   సృష్టి యక్షుడు వేసిన ప్రశ్నల లోతుల   గురించి మరి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ' ఘన నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున 'యక్షిణి'  దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు' స్తుతింతును ' అన్నాడు నవీన వచనవస్తుకవి  పరవస్తు  చిన్నయసూరి. 


రామాయణంలోని రాక్షసి  'తాటకి' తొలి దశలో  యక్షిణి. బ్రహ్మ వర ప్రసాదిత. సుకేతుడు అనే యక్షుడుకి తపశ్శక్తి ఫలితంగా పుట్టిన వెయ్యి ఏనుగుల బలం కలిగిన బాలిక ఆమె .  తాటకి ఝఝరుడనే మరో  యక్షుడి కొడుకు  సుందుడి  జీవిత భాగస్వామిగా  మారీచుడిని కన్నది ఆ తల్లి .  అగస్త్యుడితో పెట్టుకున్న గొడువల మూలకంగా  సుందుడు బూడిదకుప్పగా మారినప్పుడు     తాటకి కొడుకు  మారీచుడుతో కలిసి వెళ్లి మళ్లీ దాడి చేసి ముని శాపం మూలకంగా బిడ్డతో సహా రాక్షసిగా మారుతుంది .  వాల్మీకి    రామాయణం బాలకాండ చదివితే  ఈ యక్షిణి కథ విపులంగా  తెలుస్తుంది.


భాగవతంలో కనిపించే మరో ఇద్దరు  యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు.  ఓ మహర్షికి  ఆగ్రహం తెప్పించిన కారణాన వాళ్లిద్దరూ  మద్ది చెట్లుగా మారిపోతారు . ఆ రెండు మద్ది వృక్షాల మధ్య నుంచే అల్లరి బాలకృష్ణుడు  తల్లి యశోదమ్మ తన కటి భాగానికి కట్టిన రోటిని  తాటితో  సహా ఈడ్చి  పడతోసి  శాపవిమోచన  కలిగించేది .


యక్షులవీ దేవతా గుణాలే.  కాకపోతే, దుష్టశక్తుల దగ్గరకు చేరడం,  స్వార్థ పరులకి సాయమందించడం , వేళగాని వేళలలో యధేచ్ఛగా విహరించడాలు  వంటి అసురగుణాలు అవధులు దాటి ప్రదర్శించినప్పుడు వికటించి శిక్షకింద రాక్షసులుగా మారడం, చెరవిముక్తికై  యుగాలు తపించడం మన పౌరాణిక కథలలో పరిపాటి. 

యక్షులు వశమయితే , కామ్యకాలు  నెరవేరుతాయని  దుష్టుల పేరాశకు పోవడం పురాణ కాలంలోనే కాదు ఈ కలియుగాంతంలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది.  దుర్మార్గులను దూరంగా ఉంచినంత కాలం యక్షులైనా .. మనుషులైనా  దైవగణాలకు సమానులే. మాననీయులే! 

- కర్లపాలెం హనుమంతరావు 

07-07-2021 

ƘᗩᖇᒪᗩᑭᗩᒪƐᗰ HᗩᑎᑌᗰᗩᑎƬHᗩ ᖇᗩO

Saturday, July 3, 2021

ఆంధ్ర'భాషాపదం- చరిత్ర పరంగా -కర్లపాలెం హనుమంతరావు

 



క్రీస్తుకు పూర్వం పదో శతాబ్దం దాకా 'తెలుగు' అనే పదమే కనిపించదు. ఈ పదం మొదటిసారి ప్రత్యక్షమవడం తమిళ, కన్నడ శాసనాలలో, ఆంధ్రకర్ణాటక వాజ్ఞ్మయంలో! అదీ 'తెలుంగు, తెలుంగ, తెలింగ' తరహా రూపాలలో!

జాతికా? భాషకా? ఈ ‘తెలుగు’ పదం దేనికి సూచకం? అన్న ప్రశ్నకు ‘రెండింటికీ’ అన్నది  సరిపోయే సమాధానం. ఈ రెండింటికే కాకుండా మూడోది, ముఖ్యమైనది ‘స్థాన’ సూచకంగా కూడా వాడుకలో ఉండేది ఒకానొకప్పుడు. 'తెలుంగ నాడొళగణ మాధవియకెఱెయ' అంటూ 'తెలుగుదేశంలోని 'మాధవియకెఱెయ' అనే ఊరి పేరు 'దేశ'పరంగా ప్రస్తావించిన తొలినాటి శాసనమే ఇందుకు ఆధారం.  ‘తెలుగు’ అనే పదం  భాషకు చేసే సేవనే  ఆంధ్రతిలింగ, తెలింగ అనే రెండు పదాలు అప్పటికే  చక్కబెడుతున్నాయి.

ఇట్లా దేశపరంగా 'తెలుగు'  పదం ప్రాచుర్యంలోకి రావడం క్రీ.శ పదో శతాబ్దం తరువాత. కానీ ఆ తెలుగు పదం   'తెలుంగు, తెలింగ' లాంటి రూపాలలో కనిపించేది.  పదకొండో శతాబ్ది నాటి  చాళుక్య రాజరాజు నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయభట్టు కాలం నాటికి  తెలుగుకు 'తెనుగు' అనే మరో భాషారూపం కూడా జతపడింది.  పన్నెండో శతాబ్దపు  నన్నెచోడుడి చలవతో ఆ 'తెనుగు' అనే పదం  భాషకు సంబధించిందన్న భావం గట్టిపడింది. పదమూడో శతాబ్దిలో మహమ్మదీయ చరిత్రకారులు కూడా 'తిలింగ్' అన్న పదం వాడేసి  'తిలింగ' అన్న రూపానికి సాధికారత కల్పించడం విశేషం! ఏతావాతా తేలేది ఏమిటి? తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు తరహా పదాలు కూడా అంతకు మునుపట్లా కేవలం, ప్రాంతానికి.. జాతికే  కాకుండా  'భాష'ను సూచించే పదాలుగా కూడా సామాజిక ఆమోదం పొందాయని. అప్పటికి వరకు వాడుకలో ఉన్న ‘ఆంధ్ర’  పదానికి ఈ 'తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు' తరహా పదాలు ప్రత్యామ్నాయాలు అయ్యాయన్నమాట.  బొత్తిగా శబ్ద సాజాత్యం లేకుండా ‘ఆంధ్ర’ పదానికి ఎట్లా   ప్రత్యామ్నాలయాయీ? అంటే అదే చిత్రం!

ఇక తెలుగు, తెనుగు పదాల వ్యుత్పత్తి పుట్టుక అంతకు మించిన విచిత్రం. వివాదాస్పదం కూడా.  క్రీ.శ 14 వ శతాబ్ది ప్రథమార్థంలో ఓరుగల్లును ఏలిన కాకతి చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉండే దుండిన విశ్వనాథకవి తన  ప్రసిద్ధ 'ప్రతాపరుద్రీయం' లో 'యై ర్దేశ స్త్రిభి రేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా/యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాస శైలః కృతః/తే దేవాః ప్రసర త్ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర/ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్పచ్ఛ్రేయసే జాగ్రతు' అంటూ చేసిన ప్రార్థనలో 'త్రిలింగ' అనే పదం  వాడాడు. అందుకు ఆ కవి చెప్పిన కారణం తిరుగులేనిది కావడంతో  ‘ఆంధ్ర’కు  అదే సరైన పదంగా భాషలో స్థిరపడిపోయింది.

కళింగం తప్పించి తతిమ్మా యావదాంధ్రం  కాకతి ప్రతాపరుద్రుడి స్వాధీనంలో ఉండటంతో శివక్షేత్రాలుగా ప్రసిద్ధమైన శ్రీశైల, కాళేశ్వర, దాక్షారామాలను ఉజ్జాయింపు ఎల్లలుగా చెప్పి ఆయా క్షేత్రాలలోని శివలింగాల పట్ల భక్తితోనే  ఈ ప్రాంతాన్ని 'త్రిలింగం' అన్నాను పొమ్మన్నాడు సోమనాథుడు గడుసుగా. నిజానికి కవి ఇక్కడ చేసింది సాహిత్యపరమైన చమత్కారం. అయినా అప్పటి వరకు ఆంధ్రపథంగా ప్రసిద్ధిలో ఉన్న ప్రాంతం కాస్తా 'త్రిలింగ' దేశంగా మారికూర్చుంది. కాకతీయులు శైవులు. వారు పాటించిన  శైవమతానికి అతికినట్లు సరిపోయే ఈ కావ్య చమత్కారానికి 'ఆంధ్ర' అనే పాత పదం పాపం, ఇంకేం బదులిస్తుంది? మొత్తానికి మహాదేవుడి  మూడు శివలింగాల చలవతో చివరకు ఆంధ్రులమంతా ‘త్రిలింగులు’గా మారిపోవడం మహాచిత్రం! 

ఓ మారు వ్యవహారంలోకంటూ వచ్చేసిన తరువాత  ఉచ్చారణలో తొణికిసలాడే గాంభీర్యం.. వ్యుత్పత్తి వివరణ- పదానికి దగ్గరగా ఉండటంతో ఈ 'త్రిలింగ' పదం జనం నాలుకల మీద సునాయాసంగా స్థిరపడిపోయింది. దేశపరంగా ‘త్రిలింగదేశం’ అట్లా స్థిరపడిందే! ఆ త్రిలింగదేశ వాసులం కనక మనం 'త్రిలుంగులు' గా మార్పుచెందాం. మనం మాట్లాడే భాష 'త్రిలింగ భాష'గా మారిపోయింది.  కాలక్రమేణా  తిలింగ భాష, తెలింగ భాష, తెలుంగు భాషగా రూపాంతరం చెందుతూ చెందుతూ  'తెలుగు భాష'గా గుర్తింపు పొందే దశలో ఉంది  ప్రస్తుతం.   

'తెలుగు' పదానికి  వ్యుత్పత్తి చెప్పటంలో విద్యానాథుడు అనుసరించిన విధానాన్నే అతని తరువాతి కాలపు తెలుగు లక్షణవేత్తలూ అనుకరించారు. ఆ తరహా లాక్షణికులలో మొట్టమొదటివాడు 15వ శతాబ్ది పూర్వార్థానికి  చెందిన  విన్నకోట పెద్దనకవి. ఆయన తన  కావ్యాలంకార చూడామణిలో 'ధర శ్రీపర్వత కాళే/శ్వర దాక్షారామ సంజ్ఞ వఱలు త్రిలింగా/కర మగుట నంధ్రదేశం/బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్' అన్నాడు.

'తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ/దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె/వెనుకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద'రని అప్పటి వరకు  వ్యవహారంలో ప్రసిద్ధంగా ఉన్న తెనుగుదేశానికి సమన్వయం కూడా ఇచ్చాడు. ఎదురు బదులివ్వగలరా ఇంకెవరైనా! 17వ శతాబ్ది నాటి అప్పకవీ దీనినే అనువదించాడంటేనే ఈ వ్యుత్పత్తి పదం సత్తా ఏంటో అర్థమవటంలేదా!.  

 

ఇక, పాల్కురికి సోమనాథుడు ఈ త్రిలింగదేశాన్ని 'నవలక్ష తెలుంగు' (తొమ్మిది లక్షల గ్రామాలకు పరిమితమైన తెలుగు)గా తన ‘పండితారాధ్యచరిత్ర’లో కొత్తగా నిర్వచించాడు.  ఆనాటి మహమ్మదీయ చరిత్రకారుడు ఈసామీ సైతం ఈ మాటను పట్టుకునే 'నౌ లాఖ్ తిలింగ్' (తొమ్మిది లక్షల తిలింగ్) అని నిర్ధారించడం అదో తమాషా. 14వ శతాబ్దం పూర్వార్థం నాటి శాసనాలు ఈ ‘నవలక్ష తెలుంగు’లోని తెలుంగునే 'తిలింగ' దేశంగా మార్చేశాయి. 'తైలింగ ధరణితలం'గా వ్యవహృతమవడమే ఇందుకు ఉదాహరణ.  అదే శతాబ్దం నాటి ఒకానొక శాసనం 'తిలింగదేశం'  అనే పదాన్ని ‘పశ్చా త్పురస్తా దపి యస్య దేశౌ/ఖ్యాతౌ మహారాష్ట్రకలింగ సంజ్ఞౌ;/అవా గుదక్పాండ్యక కాన్యకుబ్జౌ/దేశ స్స్మతత్రాస్తి తిలింగనామా’ అంటూ నిర్వచించింది.

ఇట్లా కవులు, వైయాకరణులు,  లాక్షణికులు, చరిత్రకారులు వివిధకాలాలలో ఒకే రకంగా చేసిన ఎల్లల ప్రస్తావనల చలవ వల్ల అంతిమంగా ఆంధ్రదేశం త్రిలింగ దేశం(తెలుగుదేశం)గా స్థిరపడిందనుకోవాలి. 'తెలుగు' ఆంధ్ర’ పదానికి దేశపరంగా, జాతిపరంగా, భాషపరంగా కూడా   పర్యాయపదం అయింది.

ఇంత హంగామా జరిగినా,  ఇప్పటికీ 'తెలుగు' అనే పదానికి  శాస్త్రీయంగా వ్యుత్పత్తి అర్థం కాని, ఆ పదం ఎప్పుడు మొట్టమొదటగా వాడుకలోకి వచ్చిన వివరాలు కానీ, ఆ రావడం  దేశవాచకంగానా, జాతివాచకంగానా, భాషావాచకగానా రావడమని గానీ.. ఏవీఁ ఇతమిత్థంగా తెలీటం లేదు. జాతివాచకమో,  భాషావాచకమో అయితే ఆదిమకాలంలో అంధ్రులు, తెలుగువారు ఒక్కరే అయివుండాలి  మరి. ఏ చారిత్రిక పరిశోధనా ఈ దశగా సాగి వాదనలు వేటినీ నిర్ధారించినట్లు కనిపించదు! శబ్దపరంగా పొంతనకైనా ఆస్కారంలేని  ఈ రెండు పదాలు మధ్యనా ఎట్లా ఒకదానికి ఒకటి  పర్యాయపదాలు అనే బంధం బలపడిందో! ఇదీ ఓ  పెద్ద వింత.  భాషాపరిశోధకులు నిగ్గు తేలిస్తే తప్ప ప్రామాణీయకమైన సత్యాలుగా తేలని అనేక భాషాంశాలలో ఈ ఆంధ్ర -తెలుగు పదాల పరస్పర పర్యాయబంధ రహస్యం కూడా ఒకటి. నన్నయ కాలం నుండి తెలుగు, ఆంధ్రం ఒకదాని కొకటి పర్యాయ పదాలయ్యాయని కేవలం నమ్మకం మీద మాత్రమే చెప్పుకోవడం!  

 

ఇవాళ ఆంధ్రులు అంటే  తెలుగువాళ్ళే కానీ, తెలుగువాళ్లంతా ఆంధ్రులు అంటే ఒప్పుకోని పరిస్థితిలు నెలకొనివున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తరువాత  సంభవించిన మరో ప్రధానమైన మార్పు నవ్యాంధ్రప్రదేశ్    నివాసులు మాత్రమే ఆంధ్రులుగా పరిగణింపబడటం! తెలంగాణా రాష్టవాసులు తమను తెలుగువారుగా చెప్పుకుంటారు కానీ 'ఆంధ్రులు'గా గుర్తింపు పొందేందుకు మాత్రం సిద్ధంగా లేరు!

-కర్లపాలెం హనుమంతరావు

03 -07 -2021

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...