Saturday, July 3, 2021

ఆంధ్ర'భాషాపదం- చరిత్ర పరంగా -కర్లపాలెం హనుమంతరావు

 



క్రీస్తుకు పూర్వం పదో శతాబ్దం దాకా 'తెలుగు' అనే పదమే కనిపించదు. ఈ పదం మొదటిసారి ప్రత్యక్షమవడం తమిళ, కన్నడ శాసనాలలో, ఆంధ్రకర్ణాటక వాజ్ఞ్మయంలో! అదీ 'తెలుంగు, తెలుంగ, తెలింగ' తరహా రూపాలలో!

జాతికా? భాషకా? ఈ ‘తెలుగు’ పదం దేనికి సూచకం? అన్న ప్రశ్నకు ‘రెండింటికీ’ అన్నది  సరిపోయే సమాధానం. ఈ రెండింటికే కాకుండా మూడోది, ముఖ్యమైనది ‘స్థాన’ సూచకంగా కూడా వాడుకలో ఉండేది ఒకానొకప్పుడు. 'తెలుంగ నాడొళగణ మాధవియకెఱెయ' అంటూ 'తెలుగుదేశంలోని 'మాధవియకెఱెయ' అనే ఊరి పేరు 'దేశ'పరంగా ప్రస్తావించిన తొలినాటి శాసనమే ఇందుకు ఆధారం.  ‘తెలుగు’ అనే పదం  భాషకు చేసే సేవనే  ఆంధ్రతిలింగ, తెలింగ అనే రెండు పదాలు అప్పటికే  చక్కబెడుతున్నాయి.

ఇట్లా దేశపరంగా 'తెలుగు'  పదం ప్రాచుర్యంలోకి రావడం క్రీ.శ పదో శతాబ్దం తరువాత. కానీ ఆ తెలుగు పదం   'తెలుంగు, తెలింగ' లాంటి రూపాలలో కనిపించేది.  పదకొండో శతాబ్ది నాటి  చాళుక్య రాజరాజు నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయభట్టు కాలం నాటికి  తెలుగుకు 'తెనుగు' అనే మరో భాషారూపం కూడా జతపడింది.  పన్నెండో శతాబ్దపు  నన్నెచోడుడి చలవతో ఆ 'తెనుగు' అనే పదం  భాషకు సంబధించిందన్న భావం గట్టిపడింది. పదమూడో శతాబ్దిలో మహమ్మదీయ చరిత్రకారులు కూడా 'తిలింగ్' అన్న పదం వాడేసి  'తిలింగ' అన్న రూపానికి సాధికారత కల్పించడం విశేషం! ఏతావాతా తేలేది ఏమిటి? తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు తరహా పదాలు కూడా అంతకు మునుపట్లా కేవలం, ప్రాంతానికి.. జాతికే  కాకుండా  'భాష'ను సూచించే పదాలుగా కూడా సామాజిక ఆమోదం పొందాయని. అప్పటికి వరకు వాడుకలో ఉన్న ‘ఆంధ్ర’  పదానికి ఈ 'తిలింగ, తెలుంగు, తెలింగ, తెనుగు' తరహా పదాలు ప్రత్యామ్నాయాలు అయ్యాయన్నమాట.  బొత్తిగా శబ్ద సాజాత్యం లేకుండా ‘ఆంధ్ర’ పదానికి ఎట్లా   ప్రత్యామ్నాలయాయీ? అంటే అదే చిత్రం!

ఇక తెలుగు, తెనుగు పదాల వ్యుత్పత్తి పుట్టుక అంతకు మించిన విచిత్రం. వివాదాస్పదం కూడా.  క్రీ.శ 14 వ శతాబ్ది ప్రథమార్థంలో ఓరుగల్లును ఏలిన కాకతి చక్రవర్తి ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉండే దుండిన విశ్వనాథకవి తన  ప్రసిద్ధ 'ప్రతాపరుద్రీయం' లో 'యై ర్దేశ స్త్రిభి రేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా/యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాస శైలః కృతః/తే దేవాః ప్రసర త్ప్రసాదమధురాః శ్రీశైల కాళేశ్వర/ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్పచ్ఛ్రేయసే జాగ్రతు' అంటూ చేసిన ప్రార్థనలో 'త్రిలింగ' అనే పదం  వాడాడు. అందుకు ఆ కవి చెప్పిన కారణం తిరుగులేనిది కావడంతో  ‘ఆంధ్ర’కు  అదే సరైన పదంగా భాషలో స్థిరపడిపోయింది.

కళింగం తప్పించి తతిమ్మా యావదాంధ్రం  కాకతి ప్రతాపరుద్రుడి స్వాధీనంలో ఉండటంతో శివక్షేత్రాలుగా ప్రసిద్ధమైన శ్రీశైల, కాళేశ్వర, దాక్షారామాలను ఉజ్జాయింపు ఎల్లలుగా చెప్పి ఆయా క్షేత్రాలలోని శివలింగాల పట్ల భక్తితోనే  ఈ ప్రాంతాన్ని 'త్రిలింగం' అన్నాను పొమ్మన్నాడు సోమనాథుడు గడుసుగా. నిజానికి కవి ఇక్కడ చేసింది సాహిత్యపరమైన చమత్కారం. అయినా అప్పటి వరకు ఆంధ్రపథంగా ప్రసిద్ధిలో ఉన్న ప్రాంతం కాస్తా 'త్రిలింగ' దేశంగా మారికూర్చుంది. కాకతీయులు శైవులు. వారు పాటించిన  శైవమతానికి అతికినట్లు సరిపోయే ఈ కావ్య చమత్కారానికి 'ఆంధ్ర' అనే పాత పదం పాపం, ఇంకేం బదులిస్తుంది? మొత్తానికి మహాదేవుడి  మూడు శివలింగాల చలవతో చివరకు ఆంధ్రులమంతా ‘త్రిలింగులు’గా మారిపోవడం మహాచిత్రం! 

ఓ మారు వ్యవహారంలోకంటూ వచ్చేసిన తరువాత  ఉచ్చారణలో తొణికిసలాడే గాంభీర్యం.. వ్యుత్పత్తి వివరణ- పదానికి దగ్గరగా ఉండటంతో ఈ 'త్రిలింగ' పదం జనం నాలుకల మీద సునాయాసంగా స్థిరపడిపోయింది. దేశపరంగా ‘త్రిలింగదేశం’ అట్లా స్థిరపడిందే! ఆ త్రిలింగదేశ వాసులం కనక మనం 'త్రిలుంగులు' గా మార్పుచెందాం. మనం మాట్లాడే భాష 'త్రిలింగ భాష'గా మారిపోయింది.  కాలక్రమేణా  తిలింగ భాష, తెలింగ భాష, తెలుంగు భాషగా రూపాంతరం చెందుతూ చెందుతూ  'తెలుగు భాష'గా గుర్తింపు పొందే దశలో ఉంది  ప్రస్తుతం.   

'తెలుగు' పదానికి  వ్యుత్పత్తి చెప్పటంలో విద్యానాథుడు అనుసరించిన విధానాన్నే అతని తరువాతి కాలపు తెలుగు లక్షణవేత్తలూ అనుకరించారు. ఆ తరహా లాక్షణికులలో మొట్టమొదటివాడు 15వ శతాబ్ది పూర్వార్థానికి  చెందిన  విన్నకోట పెద్దనకవి. ఆయన తన  కావ్యాలంకార చూడామణిలో 'ధర శ్రీపర్వత కాళే/శ్వర దాక్షారామ సంజ్ఞ వఱలు త్రిలింగా/కర మగుట నంధ్రదేశం/బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్' అన్నాడు.

'తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ/దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె/వెనుకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద'రని అప్పటి వరకు  వ్యవహారంలో ప్రసిద్ధంగా ఉన్న తెనుగుదేశానికి సమన్వయం కూడా ఇచ్చాడు. ఎదురు బదులివ్వగలరా ఇంకెవరైనా! 17వ శతాబ్ది నాటి అప్పకవీ దీనినే అనువదించాడంటేనే ఈ వ్యుత్పత్తి పదం సత్తా ఏంటో అర్థమవటంలేదా!.  

 

ఇక, పాల్కురికి సోమనాథుడు ఈ త్రిలింగదేశాన్ని 'నవలక్ష తెలుంగు' (తొమ్మిది లక్షల గ్రామాలకు పరిమితమైన తెలుగు)గా తన ‘పండితారాధ్యచరిత్ర’లో కొత్తగా నిర్వచించాడు.  ఆనాటి మహమ్మదీయ చరిత్రకారుడు ఈసామీ సైతం ఈ మాటను పట్టుకునే 'నౌ లాఖ్ తిలింగ్' (తొమ్మిది లక్షల తిలింగ్) అని నిర్ధారించడం అదో తమాషా. 14వ శతాబ్దం పూర్వార్థం నాటి శాసనాలు ఈ ‘నవలక్ష తెలుంగు’లోని తెలుంగునే 'తిలింగ' దేశంగా మార్చేశాయి. 'తైలింగ ధరణితలం'గా వ్యవహృతమవడమే ఇందుకు ఉదాహరణ.  అదే శతాబ్దం నాటి ఒకానొక శాసనం 'తిలింగదేశం'  అనే పదాన్ని ‘పశ్చా త్పురస్తా దపి యస్య దేశౌ/ఖ్యాతౌ మహారాష్ట్రకలింగ సంజ్ఞౌ;/అవా గుదక్పాండ్యక కాన్యకుబ్జౌ/దేశ స్స్మతత్రాస్తి తిలింగనామా’ అంటూ నిర్వచించింది.

ఇట్లా కవులు, వైయాకరణులు,  లాక్షణికులు, చరిత్రకారులు వివిధకాలాలలో ఒకే రకంగా చేసిన ఎల్లల ప్రస్తావనల చలవ వల్ల అంతిమంగా ఆంధ్రదేశం త్రిలింగ దేశం(తెలుగుదేశం)గా స్థిరపడిందనుకోవాలి. 'తెలుగు' ఆంధ్ర’ పదానికి దేశపరంగా, జాతిపరంగా, భాషపరంగా కూడా   పర్యాయపదం అయింది.

ఇంత హంగామా జరిగినా,  ఇప్పటికీ 'తెలుగు' అనే పదానికి  శాస్త్రీయంగా వ్యుత్పత్తి అర్థం కాని, ఆ పదం ఎప్పుడు మొట్టమొదటగా వాడుకలోకి వచ్చిన వివరాలు కానీ, ఆ రావడం  దేశవాచకంగానా, జాతివాచకంగానా, భాషావాచకగానా రావడమని గానీ.. ఏవీఁ ఇతమిత్థంగా తెలీటం లేదు. జాతివాచకమో,  భాషావాచకమో అయితే ఆదిమకాలంలో అంధ్రులు, తెలుగువారు ఒక్కరే అయివుండాలి  మరి. ఏ చారిత్రిక పరిశోధనా ఈ దశగా సాగి వాదనలు వేటినీ నిర్ధారించినట్లు కనిపించదు! శబ్దపరంగా పొంతనకైనా ఆస్కారంలేని  ఈ రెండు పదాలు మధ్యనా ఎట్లా ఒకదానికి ఒకటి  పర్యాయపదాలు అనే బంధం బలపడిందో! ఇదీ ఓ  పెద్ద వింత.  భాషాపరిశోధకులు నిగ్గు తేలిస్తే తప్ప ప్రామాణీయకమైన సత్యాలుగా తేలని అనేక భాషాంశాలలో ఈ ఆంధ్ర -తెలుగు పదాల పరస్పర పర్యాయబంధ రహస్యం కూడా ఒకటి. నన్నయ కాలం నుండి తెలుగు, ఆంధ్రం ఒకదాని కొకటి పర్యాయ పదాలయ్యాయని కేవలం నమ్మకం మీద మాత్రమే చెప్పుకోవడం!  

 

ఇవాళ ఆంధ్రులు అంటే  తెలుగువాళ్ళే కానీ, తెలుగువాళ్లంతా ఆంధ్రులు అంటే ఒప్పుకోని పరిస్థితిలు నెలకొనివున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తరువాత  సంభవించిన మరో ప్రధానమైన మార్పు నవ్యాంధ్రప్రదేశ్    నివాసులు మాత్రమే ఆంధ్రులుగా పరిగణింపబడటం! తెలంగాణా రాష్టవాసులు తమను తెలుగువారుగా చెప్పుకుంటారు కానీ 'ఆంధ్రులు'గా గుర్తింపు పొందేందుకు మాత్రం సిద్ధంగా లేరు!

-కర్లపాలెం హనుమంతరావు

03 -07 -2021

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...