Tuesday, July 6, 2021

యక్షులు ( పౌరాణిక సమాచారం .. సరదాగా ) - కర్లపాలెం హనుమంతరావు

  

దేవతా గణాలలో యక్షులు ఒక విభాగం  .  యక్షులు దయ్యాలు కాదు. శివ పంచాక్షరీ స్తోతంలో మహాశివుడిని ‘యక్ష స్వరూపాయ ‘ అని స్తుతించడం వింటుంటాం. దయ్యాలయితే  పూజలు ఉంటాయా? 

యక్షుల ప్రస్తావన లేని పురాణాలు కూడా అరుదే! అధోలోకాలు ఏడయితే   అతలం పిశాచాలకు, వితలం గుహ్యకులకు, సుతలం రాక్షసులకు, రసాతలం భూతాలకు మల్లే  .. తలాతలం యక్షులకు  నివాసస్థలమయిందిట. తలాతలం కింది   మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగాలు  ఉంటాయని హిందువులనమ్మకం. గోమాతలోనూ సకల దేవతలూ వారి  వారి గణాలన్నీ కొలువై ఉంటాయనీ సురభిమాత   వామభాగం ఈ యక్షుల వసతిస్థలమని ఓ నమ్మిక . ఒక్కో దేవతాగణానికీ ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని వక్కాణించే   వరాహపురాణంలో  యక్షగణాల బస  శతశృంగ పర్వతం. 


యక్షజాతికి కుబేరుడు  అధిపతి. మగవాళ్లు   యక్షులయితే  , స్త్రీలు  యక్షిణిలుగ ప్రసిద్ధులు . యక్షిణులు మహా సౌందర్యమూర్తులు. ఆ జాతి  వృత్తి గుప్త నిధులకు  పహారా. యక్షులను  ప్రసన్నం చేసుకుంటే  కోరుకున్న సంపదలు సిద్ధిస్తాయని  ఉత్థమారేశ్వర తంత్రం వూరిస్తుంది.  యక్షిణులు ఎంత సౌందర్యవంతులో అంతకు మించి శక్తివంతులుకూడా.వారి ఆవాహనార్థం ఎన్నో యక్షిణీ సాధనలు అపర విద్యలుగా ప్రచారంలో ఉన్నాయి. దేహంలోనికి    చెవి ద్వారం గుండా  ప్రవేశించి భక్తుల చేత సత్కార్యాలు చేయిస్తారని విశ్వాసం . రౌద్రం వస్తే వీరంత  విధ్యంసకారులు మరొకరుండరనీ అంటారు . 

యక్షులు కళాకారులు ; పోషకులు కూడా!  మహాకవి కాళిదాసు మార్కు యక్షుడు ఆషాఢమాస విరహం  ఓపలేక ప్రియురాలికి  మేఘుని ద్వారా  సందేశం పంపిన కథ మనకందరికీ తెలిసిందే! మహాభారతం వ్యాసముని   సృష్టి యక్షుడు వేసిన ప్రశ్నల లోతుల   గురించి మరి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ' ఘన నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున 'యక్షిణి'  దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు' స్తుతింతును ' అన్నాడు నవీన వచనవస్తుకవి  పరవస్తు  చిన్నయసూరి. 


రామాయణంలోని రాక్షసి  'తాటకి' తొలి దశలో  యక్షిణి. బ్రహ్మ వర ప్రసాదిత. సుకేతుడు అనే యక్షుడుకి తపశ్శక్తి ఫలితంగా పుట్టిన వెయ్యి ఏనుగుల బలం కలిగిన బాలిక ఆమె .  తాటకి ఝఝరుడనే మరో  యక్షుడి కొడుకు  సుందుడి  జీవిత భాగస్వామిగా  మారీచుడిని కన్నది ఆ తల్లి .  అగస్త్యుడితో పెట్టుకున్న గొడువల మూలకంగా  సుందుడు బూడిదకుప్పగా మారినప్పుడు     తాటకి కొడుకు  మారీచుడుతో కలిసి వెళ్లి మళ్లీ దాడి చేసి ముని శాపం మూలకంగా బిడ్డతో సహా రాక్షసిగా మారుతుంది .  వాల్మీకి    రామాయణం బాలకాండ చదివితే  ఈ యక్షిణి కథ విపులంగా  తెలుస్తుంది.


భాగవతంలో కనిపించే మరో ఇద్దరు  యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు.  ఓ మహర్షికి  ఆగ్రహం తెప్పించిన కారణాన వాళ్లిద్దరూ  మద్ది చెట్లుగా మారిపోతారు . ఆ రెండు మద్ది వృక్షాల మధ్య నుంచే అల్లరి బాలకృష్ణుడు  తల్లి యశోదమ్మ తన కటి భాగానికి కట్టిన రోటిని  తాటితో  సహా ఈడ్చి  పడతోసి  శాపవిమోచన  కలిగించేది .


యక్షులవీ దేవతా గుణాలే.  కాకపోతే, దుష్టశక్తుల దగ్గరకు చేరడం,  స్వార్థ పరులకి సాయమందించడం , వేళగాని వేళలలో యధేచ్ఛగా విహరించడాలు  వంటి అసురగుణాలు అవధులు దాటి ప్రదర్శించినప్పుడు వికటించి శిక్షకింద రాక్షసులుగా మారడం, చెరవిముక్తికై  యుగాలు తపించడం మన పౌరాణిక కథలలో పరిపాటి. 

యక్షులు వశమయితే , కామ్యకాలు  నెరవేరుతాయని  దుష్టుల పేరాశకు పోవడం పురాణ కాలంలోనే కాదు ఈ కలియుగాంతంలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది.  దుర్మార్గులను దూరంగా ఉంచినంత కాలం యక్షులైనా .. మనుషులైనా  దైవగణాలకు సమానులే. మాననీయులే! 

- కర్లపాలెం హనుమంతరావు 

07-07-2021 

ƘᗩᖇᒪᗩᑭᗩᒪƐᗰ HᗩᑎᑌᗰᗩᑎƬHᗩ ᖇᗩO

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...