Friday, August 19, 2016

ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే- ఈనాడు సంపాదకీయం

జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం- ఇన్ని దశలు దాటి రాకముందు జంతువే మనిషి మూలరూపం. విశ్వ సంస్కృతులు జంతు తతులను విభిన్న కాలాల్లో వేర్వేరు దృక్పథాలతో చూసినా, భారతీయతది మాత్రం సృష్టి ప్రారంభంనుంచి ఒకే విధానం... దైవభావం. ఆదిదేవుడు పశుపతి. స్థితిమూర్తి శేషశయనుడు. సృష్టికర్త హంసవాహనుడు. సోమకాసురుని వాడి రెక్కలచే చీల్చి చెండాడి వేదరాశిని కాచింది మత్స్యరూపమైతే, క్షీరసాగర మథనంలో మందరగిరి కిందకు జారిపోయిన వేళ మూపు
నడ్డుపెట్టి సురాసుర కార్యానికి సాయంపట్టింది కూర్మమూర్తి. ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో వర్ణించినట్లు 'అజాండ కర్పరము బీటలు వారగ మేను పెంచి మహీ మహిళా లలామను గొమ్ము కొన దగిల్చి' నీటినుంచి యెత్తినది వరాహ మూర్తి. హరి వైరంతో అరాచకం చేసే హిరణ్యకశిపుని వధాయజ్ఞం నిర్విఘ్న నిర్వహణకు హరి ఎత్తింది అర నరావతారం. 'కుటిల నఖాగ్ర కుంచికల'తో ధర్మకార్యం పూర్తిచేసింది మిగతా సగం మృగావతారం! భగవంతుడెత్తిన ఆ నృసింహావతారమే
నరుడికీ మృగానికీ మధ్యగల బలమైన బంధానికి తిరుగులేని ఉదాహరణ. సీతాన్వేషణలో ఉన్న రాముడికి ప్రథమంగా సమాచారం అందించింది జటాయువు. స్నేహహస్తం చాచిన సుగ్రీవుడు
, బంటుభావంతో సేవించిన ఆంజనేయుడు, సేతునిర్మాణం చేయించిన నీలుడు- చివరికి అల్పజీవి అయినా అనల్ప భక్తితో సాయానికొచ్చిన ఉడుత... అంతా జంతుసంతతే. విజ్ఞత, గ్రహణ శీలత, సున్నితత్వం, దయ, ఓర్పు, ధైర్యం, దూరదృష్టి, సహానుభూతి వంటి సద్గుణ సంపదలే దైవీయ భావనలనుకుంటే- పశుపక్షి కీటక సముదాయాలను మించిన దేవతామూర్తులు నేలా నింగీ నీటా మనిషికి మరేవీ తారసపడవు.


జంతుజాలాల్లోని ఈ విశిష్టతలవల్లే భారతీయులు చెట్టుమీది పిట్టనీ, పుట్టలోని పామునీ దేవతా స్వరూపాలుగా సంభావించి కొలిచేది. ఆవును సాక్షాత్ గోమాత స్వరూపంగా కరుణశ్రీ వంటి కవులు భావించి కీర్తించింది ఈ దైవీయ భావనతోనే. జాంబ పురాణం ప్రకారం అనంత కాలాల కిందటే జన్మించిన మూలపురుషుడు జాంబవంతుడు. కన్నబిడ్డ డొక్కలను కొలిమిగా, చర్మాన్ని తిత్తిగా, హస్తాలను పట్టుతెరలుగా, బొటనవేళ్లను ఉలులుగా మలచి విశ్వకర్మకే పరికరాలను సమకూర్చిన నిపుణుడు ఆయన. భూదేవికి వరాహపురాణం వినిపించిన మేధావి ఆదివరాహమూర్తి. సామవేదాన్ని గానంగా వినిపించిన మహాముని శుకుడు. భోజరాజీయంలోని గోవు అభిజ్ఞాన శాకుంతలంలోని కణ్వమహర్షితో సమానమైన ప్రతిభా విశేషాలతో తన చిన్నిదూడకు సుద్దులు చెబుతుంది. రఘునాథ నాయకుడి 'నలచరిత్ర' హంస కథానాయకుడి చేతజిక్కినప్పుడు చెప్పే 'సంసార ధర్మాలు' పండితుల పలుకులకు తీసిపోనివి. నలదమయంతుల మధ్య రాయబారం నడిపి వారి ప్రేమను పండించిన పెళ్ళిపెద్ద అది. శృంగారం మదన శివాలు తొక్కి నాయిక పరకీయగ మారే ప్రమాదాన్ని గ్రహించి రాత్రికో మడతపేచీ కథ చొప్పున చెప్పుకొస్తూ మగడు ఇల్లు చేరినదాకా ఇంటి పరువును, ఇంతి పరువును గుట్టుగా
కాపాడిన చతుర, కదిరీపతి 'శుకసప్తతి' చిలుక. రాబర్ట్ బ్రూస్ వంటి మహారాజుకే పాఠాలు చెప్పిన సాలెపురుగులోని యంత్రరహిత నూలు నిర్మాణ కౌశలం అద్భుతం. 'ఈశ్వరశక్తి నీ కడుపులోనే లీలమై యుండునో' అంటూ జాషువా వంటి మహాకవుల మన్ననలందుకున్న జంతుజాలాల విశేషాలు ఎంత చెప్పుకొన్నా సశేషాలే!

మనిషి తన తోటి మనిషిని చిన్నబుచ్చడానికి జంతువులతో పోల్చడం ఎంతవరకు సమంజసం? 'బూడిద బుంగవై యొడలు పొడిమి దప్పి మొగంబు వెల్లనై/ వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొచోయనన్/ గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు' వారిని శ్రీనాథుడంతటి మహా పండితుడు గాడిదలని తూలనాడటం తగునా? పిల్లిమీద, ఎలుకమీద పెట్టి తిట్టే అన్యాపదేశాలు సాహిత్యంలో అలంకారాలు- అన్నంత వరకైతే సరిపుచ్చుకోవచ్చు. కానీ, చిన్నజీవులపట్ల పెద్దమనసు కలిగి ఉండటం బుద్ధిమంతుల లక్షణం. తీయని పదాల రామా రామా యటంచు/ తీయ తీయగా రాగాలు తీయుచున్న/ కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది' ఆదికవి వాల్మీకిని మనం 'కోకిలస్వామి'గా కొలుచుకుంటున్నాం. కర్ణాటక రాజ్యాధిపతులు ఒకప్పుడు 'ధరణీ వరాహ'మనే బిరుదును గొప్ప గౌరవంగా ధరించేవారు. నృత్య విశేషాలను మయూర భంగిమలతోను, చురుకు వేగాన్ని అశ్వతేజంతోను, సునిశితమైన వినికిడిని పాము చెవులతోను, సూక్ష్మదృష్టిని విహంగవీక్షణంతోను సరిపోల్చుకొని సంబరపడే మనిషి సాటి జీవాన్ని అల్పదృష్టితో చూడటం సృష్టిదోషం. విష్ణుశర్మ పంచతంత్రంలో జంతుపాత్రలు అందించే నీతిచంద్రికలు మనిషి మనసులో ముసిరి ఉన్న చీకట్లను పారదోలేవి. విశ్వాసానికి
శ్వపతి(కుక్క), శుచి-శుభ్రతలకు మార్జాలం, బృందస్ఫూర్తికి పిపీలక సందోహం, ఐక్యతకు కాకిమూక, సమానత్వ భావనకు వానరజాతి... మనసు తెరచుకుని ఉండాలేగానీ క్రిమికీటకాలనుంచి పశుపక్ష్యాదులదాకా సర్వజీవావళి మనిషి పాలిట పరమ గురువులే. సాధు హృదయంతో చేరదీయడమొక్కటే మనం చేయవలసిన సత్కార్యం. మైమీ విశ్వవిద్యాలయం, సెయింట్ లూయీ విశ్వవిద్యాలయం జంతువులను పెంచి పోషించేవారిమీద చేసిన ప్రయోగాల ఫలితం ప్రకారం- అది మానవ జాతికే ప్రయోజనకరం. పెంపుడు జంతువుల యజమానుల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యవంతమైన శరీరం, కలుపుగోలుతనం, సామాజిక స్పృహ, నిర్భయత్వం- జంతుజాలాలకు దూరంగా ఉండేవారిలోకన్నా ఇరవైశాతం అధికంగా ఉంటాయని పరిశోధన బృంద నాయకుడు అలెన్ ఆర్ మెక్కానిల్ చెబుతున్నారు. ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే సాటి జీవాలకు చేరువ కావడమే దగ్గరి దారి!

(ఈనాడు యాజమాన్యంవారి సౌజన్యంతో.. సంపాదక బృందానికి ధన్యవాదాలతో.. 24, ఆగష్టు. 2011 నాటి ఈనాడు సంపాదకీయం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...