ఎద్దై పుట్టే కన్నా ఏ అడవిలోనో చింత మొద్దై పుట్టడం మేలు.
ఆరుగాలం పరుగులే పరుగులు. కొండ్రలు
దున్నే వేళా చెవుల్లో చెర్నాకోలు ‘ఛెళ్లు’
శబ్దాలు!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటారు. ఎంకి మా తమిళబ్బయితే. సుబ్బి.. ఇంకెవరు.. ఖర్మ కాలి
మా ఎద్దు జాతే!
పొంగళ్ళ పండుగొచ్చిందన్న పొంగు ఒక రోజన్నా ఉండదు. మూడో రోజునుంచే ఎద్దుకు యమలోక దర్శనం.
'దౌడో! దౌడో' అంటో ఒహడే గోడు! గుండాగి పోయేట్లు పరుగెత్తడానికి మేమేమన్నా సర్కారు
పోలీసు ఉద్యోగాలు కోరుకొంటున్నామా?
మానవా! ఉరుగులు పరుగులు తప్ప తమరికింకేమీ తెలీవా? పొద్దు పొడిచింది మొదలు.. పొద్దు
గడిచేదాకా .. పరుగులు నురుగులేనా గురువా? కొవ్వు కరిగించుకోడానికి పరుగులు. బడులకు..
పన్లకు పరుగులు. బాసుల వెనకాల బడి పరుగులు.
ఆడాళ్లవెంట పడీ పడీ పరుగులు. అప్పులోళ్లు
వెంటబడితే పక్క సందుల్లోకి పరుగులు. చిల్లర
మాట చెవినపడ్డా పరుగులు! కొత్త నోట్లకోసం
నురుగులు! ఒక్క ఒలంపిక్కు పరుగుల్లోనే నింపాదిగా పెళ్లివారి నడకలు!
ఎద్దు మొద్దు స్వరూపాలని ఎద్దేవా చేసే
పెద్దమనుషుల్లారా.. మా కాడెద్దులకన్నా తవఁరెందులోనండీ
పోటుగాళ్లు? గిట్టని మాట చెవిన బడితే చాలు.. గిట్టలిసిరే అసహనంలోనా? మా గడ్డిక్కూడా పాలుమాలే
పోటీల్లోనా?
ఏడాదికోసారే వచ్చి పోయేది పెద్దపండుగ. ఏదోలే.. ఏడ్చిపోతారని కదా మేం మీ కుళ్ళు
గుడ్డల్తో ఊరేగేది? గడప గడపకీ వచ్చి దణ్ణాలు.. దస్కాలు పడీ పడీ పెట్టి పొయ్యేది
తవఁరి గొప్పతనాలు చూసనా అయ్యల్లారా! నిన్నటి
దాకా ఒక పురచ్చి తలైవికి. ఆ తల్లి తరలెళ్ళి
పోయిన తెల్లారినుంచే మరో పుచ్చిన తలైవికి. మా గంగిరెద్దులకన్నా నంగిగా బుర్రలూపే తవఁరు
.. ఎందులోనండీ బాబులూ మా ఎద్దుజాతి కన్న మెరుగులు?
మీ పెట్ర్రోలోళ్ళ మాదిరి పూటకో రేటుతో
అదరగొట్టం మేం. ఆయిలు ధరలు అలా ఓ పది పైసలు
పెరిగినప్పుడల్లా మీ నేతలే కదా మా బుల్లక్కార్ట్ల మీద ఊరేగుతూ మా గొప్ప బిల్డప్పులిచ్చేది! కార్నుంచి కార్లోకి తప్ప కాల్తీసి పెట్టని షావుకార్లక్కూడా ఎన్నికలొస్తే చాలు మా ఎద్దులబళ్లమీదెక్కినప్పుడే
గొప్ప కిక్కొచ్చేది.
మళ్లీ జన్మంటూ ఉంటే ఆ మడోనా బాబులాగా
పుట్టి మీ గోముఖ వ్యాఘ్రం మార్కు తొడుగుల్తో చెడుగుడాడేయాలని ఉంది! ‘గుడ్డే’ తప్ప చెడుతో
ఆడ్డం చేతకాని పశువులం. అందుకే ఇప్పుడిన్ని తిప్పలు !
అలవాటు లేని మందూ మాకు మాకు పట్టించి బరికెల్తో, బరిసెల్తో నడివీదుల్లోబడి దౌడు తీయించే పాడు బుద్ధులెందుకండీ కామందులూ ప్రదర్శిస్తారు
మా ముందు? మీ బడి పిల్లకాయల పుస్తకాల బస్తాలకన్నా ఎక్కువ బరువులు చడీ చప్పుడు
లేకుండా మోస్తున్నందుకా ?
తవఁరికేవఁన్నా వినోదాలు తక్కువయ్యా దొరబాబులూ మా బతుకులనిలా వీధుల పాలు
చేసి అల్లరి చేసేస్తున్నారూ ? వారానికో అయిదు
అన్రియల్ చలన చిత్ర రాజమ్ములు.. అరగంటకో పాలి తింగిరి పింగిరి టీవి సీరియళ్లు! అదనంగా..
ఇప్పుడీ ఐదు రాష్ట్రముల ఎన్నికల పాంచ్ పటాకా
చాలకా.. వినోదానికింకేం కరువొచ్చిందని ధర్మప్రభువులూ..
మా ఎనుబోతుల మీదిలా పడి కరవొస్తున్నది అందరూ.. 'జల్లికట్టు' సంప్రదాయమని వంక బెట్టుకొని!
ఆంబోతేమన్నా అప్పుడే విడుదలైన కొత్తైదొందల నోటా ? అందరూ కల్సి అలా కుమ్మేసుకోడానికి కనీసం ఆ పూటే విడుదలైన సినిమా ఆటైనా కాదే?!
పురచ్చి తలైవమ్మలా మెరీనా బీచ్ రీచవగానే
పొయస్ గార్డెన్ మార్క్ దస్కత్ కుర్చీ కోసం..
అది సంపాదించే డబ్బూ దస్కంకోసం ఎన్ని ముఠాలు? ఎంతమంది మాయల మరాఠీలు? ఎద్దు కాలి ముల్లంత లేకపోయినా
ఏడూళ్ల పెత్తనానికి తయారై పోయారందరూ. ఎలపటి
ఎద్దు ఎండకు లాగా.. మలపటి ఎద్దు నీడకు లాగా సామెతలాగా సాగే రాజకీయాలని మళ్లీ ఒక్క కట్టుమీదకు లాక్కొచ్చినందుకన్నా జల్లికట్టును జాలితో
వదిలేసెయ్యచ్చు కదయ్యా?
నవరసు పేటల నగా నట్రా ఏమన్నా అడుగుతున్నామా?
ఆ ‘పేటా’ పెద్దలు ఫిర్యాదులకు పీటముళ్లేసి న్యావానికి అడ్డు రావద్దనేది ఒక్కటే దయగల
పెద్దలకు మా విన్నపాలు!
తవఁరు పెట్టే గడ్డి విషంకన్నా హీనం. పట్టించే కుడితికన్నా గరళం మహా సరళం. అయినా కిమ్మనకుండా కొమ్ములొంచుకొని బండ బరువులన్నింటినీ మౌనంగానే భరిస్తుంటిమి గదా యుగ
యుగాల బట్టీ. జల్లికట్టు మిషతో మా వళ్లనింకా ఇలా జల్లెళ్ల మాదిరి తూట్లు పొడవడం అన్యాయం.. ఈ అత్యాధునిక
యుగంలో కూడా!
'అరవం.. అరవం' అంటూనే ఎంతలా అరిచి అల్లరి
చేస్తున్నారర్రా అందరూ! ఎంత లావు ఒంగోలు జాతైనా రాజకీయాలముందు ఒంగోక తప్పదని తేల్చేసారు!
న్యాయస్థానాల దగ్గర పప్పులుడకవని.. రాజాస్థానాలను ఆశ్రయించేసారు! ఎద్దు తంతుందని గుర్రం
చాటున నక్కే నక్క జిత్తులు ప్రదర్శించారు!
ఎవర్నని ఏం లాభం? ఎన్నుబోతు ఖర్మ రుచి
చూడాలంటే ఎద్దుగా ఏడాది ఎందుకు.. ఆంబోతుబా
ఆర్నెల్లు బతికి చూడాలి! అదీ అరవనాడులో.. పొంగలు సంబరాల్లో. పశువు జీవితమంటేనే వికారం
పుడుతుంది. రాజకీయాలమీదకే
మళ్లీ మమకారం మళ్లుతుంది.
ఏదేమైనా ఎద్దు చచ్చినా వాత బాగా వేశారర్రా
అంతా కల్సి. ఈ సారికేదో జల్లి కట్టు ‘కుమ్ములాట'కు
సిద్ధం చేసేసామంటారా అంతా.
గిత్తలుగా పుట్టడం తప్పయి పోయింది. సారీ! ఏ నత్తలుగానో.. సోనియాజీ అత్తలుగానో పుడతాం
అవకాశం వస్తే వచ్చే సారి. పోనీ ఇహ ముందైనా
మా పశుజాతిమీద పిసరంత జాలి చూపండయ్యా
కామందులూ! కావాలంటే చచ్చి మీ రాజకీయ నేతల కడుపుల్లో పుట్టడానికైనా మేం సిద్ధం.
ఇన్ని చెప్పుకున్నా ఎనుబోతుమీద వాన
కురిసినట్లే అంటారా?.. ఇహ మేం మాత్రం చేసేదేమంది.. కొమ్ములకు పదును పెట్టుకోడం మినహా!
No comments:
Post a Comment