వ్యాసం
పాడ 'నా' తెలుగుపాట
- యూ . ఎ. నరసింహమూర్తి
( నేటి తెలుగు - నుంచి )
సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు
వ్యాసం
పాడ 'నా' తెలుగుపాట
- యూ . ఎ. నరసింహమూర్తి
( నేటి తెలుగు - నుంచి )
సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు
' గంగ తల నుండి కావేరి కాళ్లదాక వెలిగె దిఓ్మోహనమ్ముగా తెలుగు కీర్తి' అంటూ కించి గానం చేశాడు రాయప్రోలు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తరించే నాటికి కీర్తి ఖండఖండాంతరాలకు వ్యాప్తమౌతున్నట్లు కీర్తించే అవకాశం కళాకారులకు ఉచింది. కళాకారులతో గొప్ప చిక్కుంది. వాళ్లకు నచ్చితే ఆకాశానికెత్తేస్తారు. నచ్చకపోతే పాతాళానికి అణచేస్తారు. విజయవాడలో రేడియో స్టేషను ప్రారంభిస్తే గాని పాడనని భీష్మించుకుని కూర్చున్నాడు గురువు. ఒకానొక ప్రభుత్వం తెలుగుదేశంలో అంతరించేదాకా తెలుగునాట గొంతువిప్పనని ప్రతిజ్ఞ చేశాడొక శిష్యుడు. ఎంతో తపస్సు చేస్తేగాని తెలుగుదేశంలో పుట్టడం, తెలుగుభాష మాట్లాడటం అనే వరం సిద్ధించదని పూర్వం అప్పయ్యయ్య దీక్షితులన్నమాట. ఆ తెలుగు జిల్లాలలో పుట్టడమే మహా పాపఖర్మం అనేక విధాల' అన్నాడు గుడిపాటి వేంకటచలం. ' ఆ తెలుగుగాలి మురికిని కొంతన్నా కడిగేస్తుంది అరుణాచలం' అని కూడా అన్నాడాయన. అయినా ఆయన తెలుగుభాషను మాత్రం లలేదు. దాని సొగసుల్ని కాదనలేదు.
' మనవాళ్లుట్టి వెధవవాయ్ లోయ్' అన్న గిరీశం మాటలో గురజాడ గొంతుకూడా కలిసే ఉంది. అది మన పాత సంస్కారాన్ని గురించి విసిరిన విసురులా కనిపిస్తుంది. పూర్వుల తెలుగుతనాన్ని కాపాడుకోలేక పోయామన్న చింత చాలా మందికుంది. తెలుగువారిలో తెలుగుతనం చచ్చిపోయి ఎన్నో ఏండ్లయిపోయింది, అది ఎప్పుడో ఉండేది కూడా. మన తెలుగుపిల్లలెరుగరు. ' కలిమికి ఆంగ్లము - తెలివికి సంస్కృతము బా జా జాతీయతకు హిందీ, 'నీ తెలుగెవ్వరి పాలు చేసి తిరిగెదవాంధ్రా!' అని నేను దశాబ్దాల కిందటే ప్రశ్నించాను' అని వేలూరి శివరామశాస్త్రి వాపోయారు. ఆ యన వచనంలో చెప్తే విశ్వనాథవారు ' అచ్చ సంస్కృతి తెలియని యాంధ్రజాతి - యాధునిక మిది పలుత్రోవలై వించు' అంటూ పద్యంలో పరామర్శించారు. తెలుగువారి ప్రాచీన వైభవాన్ని ఘనంగా కీర్తించిన విశ్వనాథ ' వాల్మీకి రెండు విధములుగ నదృష్టవంతుడు. ఒకటి ఆంధ్రదేశమున పుట్టకపోవుట ; రెండు - అప్పటికింకను ఆంగ్లేయులు మనదేశమున నడుగుపెట్టకపోవుట' అంటూ తెలుగుదేశంలో పుట్టడమే నేరమన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ' ఏ ప్రాచీన నిక్షేపమైనా చేజారిపోయిన తరువాత బిక్కమొగం పెట్టేవాడు తెలుగువాడు' అంటూ ఇటీవలి మధురాంతకం రాజారాం కూడా అనడం ఆలోచించదగ్గది.
అన్నింటిలోను మనం గొప్పవాళ్లమేనని గప్పాలు కొట్టినరోజులు కొన్ని ఉన్నాయి. అందుకు భిన్నంగా ' సర్వ విషయాలలోను మన వాళ్లు తీసికట్టే తమలోతాము గోతులు తవ్వుకోవడంలో తప్పించి| అంటారు శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి. తెలుగుతనాన్ని అత్యంతగా ప్రేమించిన ఆ మహనీయుడు 'వేషం విషయమై మన తెలుగువారికిప్పుడు శ్రద్ధాలేదు. సంప్రదాయ గౌరవమూలేదు. అనుకరణ పరాయణత్వం తప్ప' అని తెలుగు వేషభాషలు అంతరించిపోతున్నందుకు చింతించారు. ఆఖరికి తెలుగు వాళ్లకు హోటళ్లు నడపడం కూడా చేతకాదని ఆయన అభిప్రాయం. ' రావలసిన వాళ్లను ఆకర్షించకపోవడమే గాదు, వచ్చినవాళ్లనైనా ఆదరించలేడు తెలుగు యజమాని' అంటూ తెగబడి చెప్పాడాయన. ఆంధ్రదేశంలో పుట్టడం వలన చాలా నష్టం ఉందని అభిప్రాయపడిన వాళ్లలో ఆయనా ఉన్నాడు. ' వారు ఆంధ్రులు కాక మరే జాతివారయినా అయివుంటే బతికి వుండినప్పుడూ, పరమపదించాక గూడా వారినాజాతీయులు బహువిధాల పూజించుకుని వుందురు' అంటూ వేటూరి ప్రభాకరశాస్త్రి గురించి ఆయన గ్రహించకపోలేదు. ' ఈ తెలుగు సినిమాలకు - బ్రాఁతిగఁ గొనిపోకు పిల్లవానిని వీడున్ బూతులను నేర్చుకొనియెను - చేతో మర్యాదలేని చీదరమాటల్' అంటూ విశ్వనాథ వారెప్పుడో చెప్పారు. పాతికేళ్ల కాలంలో తెలుగు సినిమాలలోని సమస్త విషయాలు ఎంత బరితెగించి పోయాయో ఆయనగాని చూసివుంటే ఇంకా ఇంకా ఏమనేవారో! ' ఆంధ్రులకు దేశాభిమానం లేదు. భాషాభిమానం అంతకన్నా లేదు' అన్నాడు ఆత్రేయ. ' తెలుగావకాయ ఘాటెక్కింది - తెలుగు గోంగూర పులుపెక్కింది' అంటూ 1939లో కాటూరి వారొక హాస్యరచన చేశారు. ఆయన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి పదవీ విరమణ సందర్భంలో "ఆంధ్రదేశస్థ సర్వాంగ్లభాషా కళాశాలలకున్ కనులు చల్లబడెనే' అంటూ పద్యాలు రాశారు. చెళ్లపిళ్ల వంటివాడు ఒక హైస్కూలులో తెలుగు పండితుడుగా పదవీ విరమణ చేయవలసిన దుర్గతి ఆంధ్రదేశంలో ఉందన్నది ఆయన విచారం. తెలుగువారి పత్రికాపోషణ మీద కూడా విలువైన అభిప్రాయాలున్నాయి. ' ప్రబుద్ధాంధ్ర సంపాదకుడు నెలకు ఇరవై రోజుల చొప్పున ప్రెస్సు బిల్లూ, పేపరు బిల్లూ పూర్తిగా చెల్లించలేకపోతూ ఉండడం దేశీయుల గాఢనిద్రకు నిదర్శనం' అని సాక్షాత్తు గిడుగువారే అన్నారు. అది ఆసరాగా చేసుకుని శ్రీపాదవారు ' తెలుగువాడిప్పుడు భావదాస్యంలో మగ్గిపోయి ఆత్మగౌరవం యెరక్కుండావున్నాడు. పామునోట్లో కప్ప కబళించే
దోమలా ఉన్నాడు" అంటూ వాపోయారు.
ఇంకా ప్రసిద్ధులెందరో వ్యతిరేకాభిప్రాయాలు వెల్లడిచేసినవారున్నారు. అందులో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, కొన్ని ఛాందసత్వంవల్ల, కొన్ని మార్పును అంగీకరించలేక పోవడం వల్ల, కొన్ని అవగాహన లోపంవల్ల వెల్లడైన భావాలు కావచ్చు. కాని అన్నీ అలాంటివి కావు. ఆంధ్రులు ఆరంభశూరులు, అనుకరణప్రియులు, అనేకత్వ లక్షణం కలవారు అనే విమర్శ పూర్వం నుంచీ ఉంది.
గోదావరి గట్టున కూర్చొని తెలుగుభారతం రాయడానికి నన్నయ్య ఎన్నో సంస్కృత సభల్లో సాముగరిడీలు చేయలసి వచ్చింది. పాల్కురికి సోమనాథుడు "తెలుగు మాటలనంగవలదు' అని బతిమలాడవలసి వచ్చింది, శ్రీనాథుడు తన భాషను సమర్థించుకోవలసి వచ్చింది. తెలుగువేషం మార్చుకోవలసి వచ్చినందుకు శ్రీనాథుడెంతో బాధపడ్డాడు. కాని మరాఠీవారి పాలనలో, మహమ్మదీయుల ఏలుబడిలో మన పేరు ఊరు, వేషం - భాష మార్చుకోవడం ఒక సంస్కారంగా మారింది. ఇంగ్లీషు వాళ్లు వచ్చిన తరవాత వైఖరిని గూర్చి చెప్పుకోవడం గొంగళిలో తింటూ వెంట్రుకలేరుకోవడమే కాగలదు. ఎప్పుడూ ఒక పరాధీనత మనకు, మన భాషకు, మన సంస్కృతికి తప్పడంలేదు. పరాధీనతను పల్లెత్తకుండా అంగీకరించేవారు ఎందరో ఉంటారు. స్వేచ్ఛాప్రియులు కొందరే ఉంటారు. అందులో ఆంధ్రదేశం తనను వెలివేసిందన్న బాధతో ఆంధ్రదేశాన్నే వెలివేసిన మహారచయిత ఒకడు. పరాధీనత అనే భావాన్నే భరించలేక స్వేచ్ఛకోసం మాతృ దేశాభిమానంతో ఆంధ్రదేశంలో అడుగుపెట్టిన అగ్గిపిడుగింకొకడు.
' కొన్ని గడియలకు ఓఢ్రరాష్ట్రీయచ్ఛాయ అలుముకుంటుందనగా నేను పర్లాకిమిడి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోకి వచ్చేస్తాను. పర్లాకిమిడిలో రైలెక్కుతాను. పాతపట్నం వెళ్లి ఏటిలో స్నానంచేసి... పర్లాకిమిడి మళ్లీ మద్రాసు ప్రెసిడెన్సీలో చేరితే తప్ప బతికి వుండగా నేనా ఊళ్లో అడుగుపెట్టనని కంకణం కట్టుకుని రైలెక్కుతాను' అన్నారు గిడుగువారు. మూడు లక్షలమంది ఆంధ్రులకు అన్యాయం జరిగే సందర్భంలో ఆయన ఈ మాట అనవలసి వచ్చింది. అందులో ఆయన స్వార్థమేమీలేదు. ఛాందసం లేదు. అవగాహన లోపంలేదు. అచ్చమైన తెలుగుతనం మూర్తీభవించిన మహదావేశం అందులో ఇమిడి ఉంది. ఆ మహావేశమర్థించి ఆంధ్రులార? చల్లుడక్షతలు నేడు' అన్న రాయప్రోలు మాటను ఇలాంటి సందర్భాలలో పునశ్చరణ చేసుకోవలసి వస్తుంది. కళాకారులు కాలాన్ని కట్టిపడేస్తారు. వాళ్లను కించపరిస్తే ఆమచ్చ కలకాలం మిగిలిపోతుంది. వాళ్లు నాణేన్ని పైకెగరేసి బొమ్మంటే బొమ్మే పడుతుంది. బొరుసంటే బొరుసే పడుతుంది. వారి ఉదాత్త హృదయాంతరాలలో మారుమోగినప్పుడు మాత్రమే తెలుగుపాట రక్తికట్టగలదు.
- యూ . ఎ. నరసింహమూర్తి
( నేటి తెలుగు - నుంచి )
సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు
10 - 12-2021
బోథెల్ ; యూ . ఎస్ . ఎ
No comments:
Post a Comment