Thursday, December 9, 2021

ఆంధ్రము - తెలుగు - కోరాడ రామకృష్ణయ్య -కర్లపాలెం హనుమంతరావు

 ఆంధ్రము - తెలుగు 

కర్లపాలెం హనుమంతరావు 

మనిషి, జాతి, దేశం - వీటి గుర్తింపుకు సాంకేతికంగా ఒక ప్రత్యేకమైన పేరు ఏదైనా ఉండటం తప్పని సరి . చిత్రాంగా తెలుగువారి భాషకు రెండు పేర్లు ఆంధ్రము , తెలుగు! ( తమిళులదీ ఇదే వరస : తమిళం - అరవము .. అట్లాగే మరికొన్ని భాషలకూ ఉన్నప్పటికి వాటి చర్చ ఈ వ్యాస పరిధికి బైట. కనుక ఆంధ్రము - తెలుగు వరకే మనం పరిమితమవుదాం . ఈ చర్చ వల్ల భాషా సాహిత్యాలు, సంఘం ప్రాచీన పరిస్థితులు, ప్రాచీనా భాష పరిణామ క్రమం మీద కొద్దిపాటి అవగాహన వస్తుంది. అదీ ఈ వ్యాసం ఉద్దేశం కూడా.  


భాష అంటే మనిషి తన మనసులోని భాషను సంఘంలోని సాటి మనిషితో పంచుకునే  ప్రక్రియ సాధనం.  మనుషులకు సంబంధించిన జాతి, రాళ్లు  నివసించే ప్రాంతానికి దగ్గరగా పలికే పేర్లు ఆయా భాషలకు ఉండటం సహజం. ఉదాహరణకు అంగిలులకు దేశం ఇంగ్లాండ్, భాష ఇంగ్లీషు; అట్లాగే మన ఓడ్రులకు ఒరిస్సా, ఒరియా ) . అయి అఱువాళర్ అనేది ఒక తెగ పేరు. వాళ్ల  భాష పేరు ' అఱు ' వము. కానీ అరవల ప్రాచీన వాజ్ఞ్మయంలో ఆ పేరు కాకుండా ' తమిళం ' అనే పేరు మాత్రమే కనపడుతుంది. ఈ వింతాకు కారణం ఉత్తర దిక్కున ఉండే మన తెలుగువాళ్లే అంటారు ప్రసిద్ధ భాషా పరిశోధకులు కోరాడ రామకృష్ణయ్యగారు. తమిళం - అరవం లాగే ఆంధ్రం- తెలుగు కూడా ఆయా జాతి పేరుకు బట్టి ప్రాంతాన్ని బట్టి ఏర్పడినవే. రెండు వేరు వేరు జాతులు అయివుండి వేరు లేరు భాషలు ఉపయోగిస్తూ కాలక్రమేణా రెండు జాతుల వాళ్లూ దక్షిణాపథంలో ఒకే ప్రాంతంలో స్థిర పడి పోవడం వల్ల ఒకే భాషగా కలగలసిపోయి రెండు పేర్లతో పిలవబడుతున్నదా? ఈ అనుమానం చాలాకాలం బట్టి పరిశోధకులను వేధిస్తూనేవుంది. 

ఐతరేయ బ్రాహ్మణంలో ఓ కథ ఉంది. ఆర్యాంధ్ర జాతికి చెందిన వాళ్లు ఆర్య సంఘం నుంచి బహిష్కరించబడి పుండ్ర, పుళింద, మూతిబ లాంటి జాతులలో కలసి వింధ్యకు దక్షిణం దిక్కులో స్థిర పడ్డారని దాని సారం. వీళ్లే క్రమంగా క్రమంగా దక్షిణా పథానికి విస్తరించి కృష్ణా గోదావరి ప్రాంతాల ఆదిమవాసులు తెలుగు వారితో కలసిపోయారని విశ్వాసం . కృష్ణాతీరంలో రాజ్యాన్ని స్థాపించుకుని పాలన కూడా చేసినట్లు ఒక నమ్మకం. క్రీస్తు పూర్వం 3 వ శతాబ్ది నాటికే మగధ రాజ్యం తరువాత అంతటి మహరాజ్యంగా మెజస్తనీస్ మెచ్చుకున్నది ఈ ప్రాంతాన్నే . కృష్ణానదీప్రాంతంలోని ' కుబీరకుడు ' అనే రాజును గురించి 

భట్టిప్రోలు శాసనం కూడా ప్రస్తావించింది. ఆ శాసనం అశోకుడి కాలానికి కొద్దిగా ఇటువైపుదని పరిశోధకుల అభిప్రాయం. పశ్చిమ దిగ్భాగంలో ఉన్న మగధను కూడా జాయించి ఆంధ్రులు హైందవ మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఉత్తర దేశంలోని ఆర్యాంధ్రులు దక్షిణంలోని గోదావరీ కృష్ణాప్రాంతవాసులు తెలుగు వారితో  కలసిపోయి    సామ్రాజ్యపాలకులుగా పశ్చిమదిక్కు కు కూడా ఆక్రమించి మొత్తానికి పాలకులు అయినందున తెలుగు మాట్లాడే ప్రాంతం కూడా ఆంధ్రప్రాంతం అయిందని, ఇక్కడి ప్రజలు ఆంధ్రులు, రాల్లు మాట్లాడే తెలుగు భాష ఆంధ్రం కూడా అయిందని   తాత్పర్యం . 


ఆర్యాంధ్రులు రాక ముందు కృష్ణా ప్రాంతం నిర్జనంగా ఏమీలేదు. తూర్పుదిక్కు నుంచి దక్షిణానికి సముద్ర మార్గంలో వెళ్లే బౌద్ధ యాత్రికులకు అమరావతి  స్థావరంగా ఉన్న నాగజాతి వాళ్లు ఆతిథ్యం ఇస్తుండేవాళ్లు . నాగజాతి అనే ఒక జాతి ఉన్నట్లు అమరావతీ స్తూపం మీద చెక్కిన చిత్రకథల ద్వారా నిర్ధారణ కూడా చేసుకోవచ్చు .  ఇంత జరిగినా ' తెలుగు' వాళ్ల ప్రస్తావన ఎక్కడా లేకపోవడానికి పరిశోధకులు ఊహించేదే నిజమయితే అక్కడి తెలుగువాళ్లు ఆ సరికే బర్మా వైపుకు ' తెలుంగులు' పేరుతో వలసపోగా .. మిగిలిపోయినవాళ్లు ఏ ' తెలగాణ్య బ్రాహ్మణులు, తెలగాలు'  గానో వ్యవహరింపబడ్డారు. క్రీ.శ 2వ శతాబ్దినాటి యవన యాత్రికుడు టాలమీ పేర్కొన్న ' ట్రిలింగాన్ ' ' ట్రిగ్లిఫాన్ ' ఈ తెలుగు ప్రాంతమే అయివుండవచ్చు.  ప్రాభవం బలంగా  ఉన్న చోట బలహీనులు ఉనికి కొల్పోవడం చరిత్ర గమనంలో మనం చూస్తున్న పరిణామమే, ఇక్కడ ఆంధ్రుల ప్రాభావంలో  ఆదిమ తెలుగు జాతికీ  అదే గతి పట్టివుండవచ్చు.   త్రిలింగము అనే కథ తరువాతి కాలంలో పౌరాణిక పరంగా కల్పన చేసి ఉండవచ్చు. 


చిట్టచివరగా ఒక మాట. తైలంగులు, తెలగాలు, తెలంగానా వంటి శబ్దాలను బట్టి ' తెలుగు ' అనేదే మూల రూపం అయివుండవచ్చు . కానీ అప్పటి సంస్కృత పండితులు ఈ దేశీయ పదాన్ని సంస్కృతీకరించే శ్రద్ధతో స్వభాషానురూపమైన రూపం, వ్యుత్పత్తి తయారు చేసారనడంలో సందేహంలేదు. ఆ తరహారూపాన్నే టాలమీ తీసుకున్నందువల్లనే  తెలుగును  ' ' ట్రిలింగాన్' ' ట్రిగ్లిఫాన్ ' అని ప్రస్తావించి ఉండవచ్చు. 


నోట్ : సంస్కృతీకరణ - ప్రక్రియను గురించి కుమారిలభట్టు ' తంత్ర వార్తికం ' అనే గ్రంథంలో చాల విపులంగా వివరిస్తాడు. కృష్ణానదికి ప్రాచీన రూపం మైసోలాన్. ఆ పరీవాహక ప్రాంతమంతా 'మైసోలియా' . ( అదే ఇప్పటి మచిలీపట్టణం). మై - అంటే ద్రావిడ భాషలలో ' నలుపు ' అని అర్థం. దీనిని సంస్కృతీకరించినందు వల్లనే నది ' కృష్ణ ' అయింది. దీనికీ ఓ ప్రాచూ నామం ఉంది. . ' కృష్ణ బేణ్ణా ' . కాలక్రమేణా అదే కృష్ణవేణి అయింది. ఇట్లా సంస్కృతీకరణను గురించి ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వచ్చు. కానీ, ఇది సముయమూ కాదు. స్థలమూ పరిమితం, 

( వ్యాసానికి ఆధారం: కీ.శే. కోరాడ రామకృష్ణయ్యగారి ' ఆంధ్రము - తెలుగు ' - ( దక్షిణ దేశా భాషా సారస్వతములు - దేశి ) 


- కర్లపాలెం హనుమంతరావు 

03 - 10-2021 


బోథెల్ ; యూఎస్.ఎ 




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...