ఈనాడు- సంపాదకీయం
నిద్ర ప్రాథమిక హక్కు
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 25 -03 -2012 )
'అశ్వినీ దేవతలు అత్యంత అప్రమత్తంగా నిన్ను గమనిస్తున్నా నా కంటిమీద వాలిన ఓ నిద్రాదేవతా! నీకు నమస్కారం' అంటుంది అధర్వణ వేదం. నిద్రావస్థలు ద్రష్టల దృష్టిని వేదకాలంనాడే ఆకర్షిం చాయనడానికి - స్వప్నయోని, స్వప్న జన్మభూమి - సిద్ధాంతాలే దృష్టాంతాలు. నిద్రస్థితిలో ప్రత్యగాత్మ బుద్ధి అంతఃకరణలో చైతన్యవంతమై ప్రకాశిస్తుంటుందని భారతీయ తత్వశాస్త్ర సిద్ధాంతం. 'నిద్రలో మేలుకొని ఉండేదే బ్రహ్మం' అని కఠోపనిషత్ వాక్యం! జగత్ కారకుడైన విష్ణువు శరత్ కాలారంభంలో గాఢనిద్రనుంచి మేల్కొన్న తరువాత పునఃసృష్టి ప్రారంభించాడంటున్నాయి పురా ణాలు. జగజ్జేత అలెగ్జాండర్ పర్షియా దేశం మీద ప్రచండ యుద్ధం ప్రారంభించే ముందు సుదీర్ఘనిద్రలోకి వెళ్ళినట్లు గ్రీసు చరిత్ర చెబు తోంది. 'నిద్రాదేవత నిన్ను పూనెగదరా నిర్భాగ్య దామోదరా!' అని మనకో నానుడి కద్దు . దామోదరుడిది యోగనిద్ర. మన్ను తిన్నందుకు శిక్షగా బాలకృష్ణుడి నడుమును తల్లి యశోదమ్మ తాడుతో బంధించి దామోదరుడిగా మార్చిన కథ భాగవతంలో ఉంది. నిద్ర కూడా మనకో దేవతా స్వరూపమే. జ్యేదేవి ఆ దేవత పేరు. జగన్మాతకు జ్యేష్ఠ భగిని. ఫిన్నిష్ జాతివారి నిద్రాదేవత 'ఉని' . 'శృంగార చతుష్షష్టి'లో శయన సందేశనం అత్యంత సుఖదాయకమని 'నాగరక వృత్తం' అభివ్యక్తీకరిస్తోంది. విశ్వవిఖ్యాత శిల్పకారుల్ని సైతం 'యోగనిద్ర' ఆపరిమితంగా ఆకర్షించింది. జ్ఞానీ బుద్ధ, ప్రజ్ఞాపారమిత, ప్రతిమా శిల్పరీతులే అందుకు ఉదాహరణలు. లీచ్ ఫీల్డ్ కెథడ్రాల్ లో కనువిందుచేసే నిద్రాదంపతుల ఫలకాలు నిద్రా దేవతకు శిల్పకళ అర్పించే ప్రజ్ఞా నివాళులు.
వేకువజామునే మేలుకొలిపే వైతాళికులు, సుఖశయ్యను గురించి విచారించే సౌఖ శాయనికులు- ప్రాచీనకాల రాచరిక మర్యాదల్లో అని వార్యంగా కనిపించే సపర్యక బృందాలు. దేశాక్షి, భూపాల, మలయ మారుతాది ఉదయరాగాల్లో ఇష్ట దేవతలను మేలుకొలిపే వైతాళిక సాహిత్యం భారతీయ భాషల్లో బోలెడంత . యుగాల కిందట కౌసల్యా సుప్రజా రాముణ్ని పూర్వసంధ్యలో మేల్కొలిపే నిమిత్తం విశ్వామిత్రుని నోట వాల్మీకి పలికించిన 'ఉత్తిష్ఠ' అనే మాట నేటికీ కోట్లాది భారతీ యులను నిద్రమత్తునుంచి తట్టిలేపుతూనే ఉంది . నిద్ర ఒక సృష్టి వింత. ఆకురాలే కాలం మొదలు కాగానే దీర్ఘనిద్రకు జారుకునే జీవజాతుల జాబితా సుదీర్ఘమైనది . గాఢనిద్రలో ఉన్న గుడ్లగూబను నీటముంచినా చావదంటారు. చలికాలపు పెనునిద్రలోని చుంచుల్ని చావమోదినా చలించకపోవడం గమనించదగ్గ విశేషం . ఈజిప్టు నత్తల నిద్ర ఐదారేళ్లు! జీవ ప్రతికూల వాతావరణంనుంచి సంతానాన్ని సంరక్షించుకొనే ప్రకృతి మాత తంత్రం- నిద్ర. పూర్వరాత్రి నిద్ర నొక సౌందర్య సంవర్ధకంగా పాశ్చాత్యులు భావిస్తారు. పురాణ కవులకు ఇష్టదైవాలు ప్రత్యక్షమై కావ్యకర్తృత్వాన్ని పురమాయించింది నిద్రావస్థలలోనే . జోల, లాలి వంటి నిద్ర సాహిత్యం ప్రతి భాషలోనూ ప్రత్యేకత సంతరించుకోవడం గమనించాలి. ఆరునెలల పాటు ఏకబిగిన నిద్రపోయే జాతిని స్వయంగా చూసినట్లు గ్రీకు చరిత్రకారుడు హెరడోటస్ చెప్పుకొన్నాడు. సెక్టస్ పాపే ను ఎదుర్కొనే వేళ సముద్ర మధ్యంలోనే గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు ఆగస్టస్ సీజర్. వాటర్లూ యుద్ధానంతరం రోజులో మూడొంతులు పడకలో ఉంటేగాని పోయిన శక్తి పుంజుకోలేకపోయాడు నెపోలి యన్. 'లోకంలోని సమస్త సింహాసనాలను బహుమానంగా ధార పోసినా శయ్యాసౌఖ్యాన్ని వదులుకోలేనని స్వయంగా ఆ జగజ్జెతే ఒప్పుకొన్నప్పుడు - నిద్రాదేవి శక్తికి మరో తార్కాణమవసరమా ?!
' సుప్తి బోలంగ/ సుఖమెందు గలదు!' అంటాడు విక్రమార్క చరిత్రంలో జక్కన కవి. 'నిద్ర సుఖమెరుగదు' అన్న నానుడి మనకు ఉండనే ఉంది. 'నిద్ర దురదృష్ట హేతువుల్లో ఒకటి' అని పెద్దలన్నది పొద్దస్తమానం పడకమీదే పొద్దుపుచ్చే నిద్రబోతులనుద్దేశించి. నిజానికి మొద్దులాగా నిద్రిస్తేనే ఎద్దులాగా పనిచేసేది. నిద్ర ప్రాణావసరం. 'నిద్రాలేమి ఆరోగ్యానికి హాని' అన్నది ఆనాటి ఆర్య క్షేమేశ్వరుడి నుంచి నేటి ఆరోగ్యశాస్త్రవేత్తల దాకా అందరి అభిప్రాయం. నిద్ర మనో మాలిన్యాన్ని కడిగిపారేసే క్షారం. అవయవాలను ఉత్తేజపరిచే ఔషధం. 'శారీరక, మానసిక లోపాలను సర్దుబాటు చేసి ధాతువులను సుస్థితిలో నిలపడంలో నిద్రకు ప్రత్యామ్నాయం లేదు' అంటాడు విద్వ ద్వరేణ్యుడు. శయ్య మీదకొరిగి సున్నితంగా సుఖనిద్ర పొందే అదృ ష్టవంతులను తలచుకొని కుమిలిపోతాడో సంస్కృతకవి. లంక కంపి స్తున్నంత కోలాహలం సైతం కుంభకర్ణుడి నిద్రను భంగపర్చలేకపోయింది నిద్రాభంగం కాల. ప్రాణేశ్వరుడి ఎడబాటు దుఃఖం నుంచి నిద్రాదేవతను ఆశ్రయించి ఊర్మిళాదేవి ఊరడింపు పొందగలిగింది. 'అలుక యెత్తిన వానికి, నర్థచింతకునకు, నాతురునకు గాను గోచరాత్మకునకు వచ్చునే ఎన్నబడి జనులెరింగిన యిన్నాలుగు తెరగులందు నెయ్యదియైన నన్ను మొగుడ నీదట, నాకన్నియు గలుగంగ నిద్రయేటికి వచ్చున్? - అంటూ తిక్కన మహాభారతం సౌప్తిక వధోద్యోగ పూర్వరంగంలో నాటి అశ్వత్థామ పడిన వ్యధే నిద్రాదేవి సాంగత్యానికి దూరమైన వారందరిదీ. ఇరుగుపొరుగుల సొద , వాహనాల రొద, శ్రుతిమించిన ఉత్సవాల ఉత్సాహం, గూబలదిరే నేతల ప్రసంగాలు... కర్ణభేరికి ముప్పుగా దాపురించే ఇత్యాదుల జాబితా ముందు ఆంజనేయుని వాలం చాలా చిన్నది. నిద్ర ప్రకృతిసిద్ధంగా జీవికి దక్కే ప్రాథమిక హక్కు. దువ్వూ రివారు అన్నట్లు 'కాలమున దక్క మరియేమి కార్యమందు! మరణ మునకును నిద్రకును అంతరము కలదు! ' మానసిక సామర్థ్యాలు అచేతనంగా ఉండే ఈ అర్ధమరణ స్థితిలో ఉన్నవారి మీద జరిగే దాడులు అమానుషం. గత ఏడాది ఢిల్లీ రామ్ లీలా మైదానంలో రామ్ దేవ్ బాబా దీక్షకు మద్దతుగా చేరినవారిమీద పోలీసు యంత్రాంగం అర్ధ రాత్రి నిద్రవేళ విరుచుకుపడ్డ తీరును రాజ్యాంగ విరుద్ధ చర్యగా సర్వో న్నత ధర్మాసనం దుయ్యబట్టడం ముదావహం. నిద్రాభంగం కలిగించే అనాగరిక చేష్టమీద న్యాయపరమైన చర్యలు తీసుకొనేటందుకు దోహదం చేసే తీర్పు ఇవ్వడం అభినందనీయం.
- రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 25 -03 -2012 )
No comments:
Post a Comment