Saturday, August 15, 2015

పెరుగుట (నడ్డి) విరుగుట కొరకే!- ఓ సరదా గల్పిక

తెలుగువాడు పాలిటిక్సులో ఎంత చురుకో.. పాకశాస్త్రంలో అంతకన్నా చురుకు. తింటే గారలే తినాలనుకొనే రకం. నలుడికి, భీముడుకి నవగాయ పిండివంటలు నేర్పిన ఘటం తెలుగువాడే! పంచదారకన్న పాలమీగడకన్న జుంటితేనియకన్న జున్నుముక్కకన్న వెన్నకన్న దోరమాగిన మామిడికన్న తెలుగు తియ్యగా ఉంటుదంటూ భాషాభిమానాన్ని సైతం పాకపరిభాషలో వెలిబుచ్చడం ఒక్క తెలుగువాడికే చెల్లింది. గొల్లపిల్లల వేళ్ళ సందుల్లోని మాగాయపచ్చడి పసందును రుచిచూపించిన పోతన మన తెలుగువాడే! కప్పురపు విడియాన్ని గురించి ఏ మాత్రం బిడియపడకుండా కవిసార్వభౌముడు అంత గొప్పగా చెప్పగలిగాడంటే కారణం శ్రీనాథుడి డి. ఏన్. ఏ లో అచ్చమైన ఆంధ్రత్వం ఇమిడి ఉండబట్టే!
'భరతఖండంబు చక్కటి పాడియావు' అన్న ఐడియా చిలకమర్తివారి బుర్రకి తట్టేందుకు దోహదబడిందీ ఆ యుగవైతాళికుడి కుదురులో పాదుకొన్న  తెలుగుదనమేనని వేరేగా చెప్పాలా! 'చిక్కటి పాలమీది మిసమిసలాడే మీగడ  పంచదారలో అద్దుకు తిన్నట్లు రామామృతరసాన్ని దాస్యమనే దోసిలిపట్టి జుర్రుకొంటా'నంటాడు భక్తరామదాసు. కంచర్ల గోపన్నకు అంత భక్తిపారవశ్యంలో సైతం  కంచంలోపడే పదార్థాలనుంచి దృష్టిమళ్లకపోయ! తెలుగువాడి తిండియావకు ఇంతకుమించిన మంచి దృష్టాంతమేముంటుంది?
అలంకారాల్లో 'ఉప్మా'లంకారం.. పండగల్లో 'అట్ల'తదియ తెలుగువాడి ప్రత్యేకతలు. బిడ్డ దుర్ముహూర్తంలో పుడితే మేనమామ  గారెలదండ మెళ్లోవేస్తేగాని బైటిప్రపంచాన్ని చూడనీయని సంప్రదాయం తెలుగువాడిది. బందరు లడ్డు, కానాడ కాజా, హైదరాబాదు బిర్యానీ అంటూ ఊరుకో తినుపాకం పేరు పెట్టేసుకొని మురిసిపోయే తిండితత్వం తెలుగువాడిది.  కాకి-రొట్టె, పిల్లులు పంచుకొన్న రొట్టెల్లాంటి తినుబండారాలున్న కథలనేకదా చిన్నతనంబట్టి మనం  పిల్లలకు పట్టుబట్టి మరీ నేర్పేది! 'తిండిగలిగితె కండ కలదోయ్!/ కండకలవాడేను మనిషోయ్' అంటూ మన గురజాడ అప్పారావుగారుకూడా తిండిగోలతోనే తెలుగుజాతిని తట్టిలేపే ప్రయాస పడ్డారు. 'రొట్టెముక్కా.. అరటితొక్కా' దేన్నీ పక్కన పెద్దని సుద్దులు చెప్పలేదూ మన మహాకవి శ్రీ శ్రీ రుక్కుల్లో! పరమానందంనుంచి.. పరమాన్నంవరకు దేన్నీ వదలకుండా పద్యాల్లో ఇరికించారు తెలుగు కవులు. 'పీత్వా పీత్వా పునఃపీత్వా స్వర్గలోకమ్ అవాప్నుయేత్' అంటూ కాఫీదండకాలు చేసిన కవులకు తెలుగునేలమీద కొదవ లేదు.
తెలుగువాడు వట్టి అల్ప సంతోషి. గట్టిచట్నీ గంటెడు ఎక్కువేసి రెండిడ్లీ వేడిగా ప్లేట్లో పెట్టిస్తే.. గుండెకాయనైనా కోసేసి దోసిట్లో పెట్టేసే  తిండియావ మనవాడిది. పుల్లగోంగూర పేరు వింటేనే చాలు..  వళ్ళు పులకరించే బోళాతనం తెలుగువాడిది కాక మరెవరిది! తెలుగువాడిది ఫికిల్ మైండు అన్నమాటలో నిజం ఎంతుందో తెలీదుగానీ..  'పికిల్' మైండు అన్నమాటలో మాత్రం నూరుపాళ్ళు నిజం ఉంది. పిల్లలు అమెరికా వెళుతుంటే ఏ పచ్చళ్ళు ప్యాక్ చేయించి ఇవ్వాలా అని తెలుగుతల్లి తల్లడిల్లిపోతుంది. సాఫ్టువేరు అంటే ఇప్పుడు వచ్చిందికానీ.. తెలుగువాడికి అంతర్జాతీయంగా మొదట్లో పేరు తెచ్చిందిమాత్రం ఊరగాయ పచ్చళ్లే సుమండీ! మన గుత్తొంకాయకూరమీద ఇంతవరకు ఎవరూ పరిశోధనలు చేసి డాక్టరేటు కొట్టకపోవడం  ఎంతో వింతగొలిపే విచిత్రం! ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని తెలుగువాడు నమ్మినంతగా మరెవ్వడూ నమ్మడు.    కరివేపాకును కూడా వదిలిపెట్టని రకం మనం. 'తినగ తినగ వేము తీయగనుండు' అనుకొంటూ వేపాకునూ  నములుతుంటాం.  'మాయాబజారు' చిత్రంమీద మనకీనాటికీ తగని మోజెందుకో తెలుసాండీ! పెళ్ళివారికని వండివార్చిన వంటకాలన్నింటినీ ఘటోత్కచుడు వంటింట్లో చేరి ఓ వరసలో గుటకాయస్వాహా చేస్తాడు చూడండి! ఆ సీను చూసి కడుపునిండినంత సంబరపడిపోతాం కనకే! ఆ  'వివాహ భోజనంబు'లోని అనుపాకాల జాబితా విని 'ఆహాహా.. ఏమి రుచి!' అంటూ లొట్టలేయకపోతే అది తెలుగు అభిరుచే కాదు!  పెళ్ళిని పప్పన్నంగా చెప్పుకొని మురిసేది ప్రపంచంమొత్తంమిద ఒక్క తెలుగు జాతే!  అప్పు చేసైనా సరే.. పప్పుకూడు తినడం తెలుగువాడికి తప్పు కానే కాదు. తిండి ఊసు లేకుండా మనకే పండగా పబ్బమూ ఉండదుగాక ఉండదు. ఒకప్పటి పెళ్ళిచూపుల్లో మగపెళ్ళివాళ్ళు పెళ్ళికూతుర్ని అడిగే మొదటి ముఖమైన ప్రశ్న తిండి తిప్పల్ని గురించే! 'వంట' రాని ఆడపిల్ల  సావిత్రంత అందగత్తయిన్నా.. భానుమతంత చలాకీతనమున్నా   సంసారానికి పనికిరాదని అప్పటి పెద్దల ప్రగాఢ విశ్వాసం మరి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని నిద్రపాటులో కూడా నమ్మేవాడు మన తెలుగువాడు!
క్షీరసాగర మధనమప్పుడు తెలుగువాడే కనక కవ్వంచిలికే  జనంలో ఉండుంటే 'ముందొక్క కప్పు కాఫీ గొంతులో పడితేగాని పని ముందుకు కదలదని మొండికేసేవాడే నిర్మొహమాటంగా. రటమతమో.. రెటమతమో..  ఆహారం దగ్గర వ్యవహారం దగరా మొహమాటలుండరాదన్నదే మరి తెలుగువాడి మతం!
తిండిపోతు పోటీలు గనక ఒలంపిక్సులో ఉండుంటే స్వర్ణాలన్నీ తెలుగువాడి ముంగిట్లోనే వేలాడుతుండేవి.
తెలుగురాష్ట్రాలు రెండూ 'అన్నపూర్ణమ్మతల్లి' అడ్డాలని మా చెడ్డ పేరు అనాదినుంచి. సాగుచేసే రైతన్నకు 'అన్నదాత'న్న గొప్పగౌరవమిచ్చేది  ప్రపంచంమోత్తంమీదా ఒక్క తెలుగువాడేనండీ! గర్వపడాల్సిన విషయం కదూ! ఇప్పుడంటే ఎక్కడబడితే అక్కడ మందుపాతర్లు బైటపడుతున్నాయ్ గానీ.. తెలుగుదేశం అంటే నిన్నమొన్నటిదాకా  యావద్దేశానికీ ధాన్యం పాతరేగదా! కిలో బియ్యం రెండు రూపాయలకిచ్చిన చరిత్ర తెలుగువాడిది!

తెలుగువాడికిమల్లే తెలుగు దేవుళ్ళూ అన్నప్రసాద ప్రియులు.  తిరుపతి లడ్డు తిరుపతి వెంకన్నకన్నా ప్రసిద్ది. రుద్రాక్షమాల తిప్పే ముముక్షువు  మన తెలుగువాడయి ఉంటే 'ద్రాక్ష' పేరు వినబడంగానే  నాలిక చప్పరించకుండా ఉండలేడు. మన తెలుగు బాలకృష్ణుడు
చేతవెన్నముద్దకోసం చేసిన అల్లరి  పోతనగారి రాతలో ఎన్ని వన్నెచిన్నెలు పోయిందీ!
'ఇంతకీ ఈ తిండిగోలంతా  ఇప్పుడు దేనికండీ?' అని కదా  మీ చిరాకు?  భోజనాల వేళలో ఈ తిండివేళాకోళాలేమిటోనని విసుక్కుంటున్నారనీ తెలుసు! అయ్యా!  ఓ మోస్తరు రకం బియ్యం కిలో యాభై.. నూక పలుకు  పాతిక పలుకుతోందని తమరికి తెలుసా? అమ్మా!  టీ, రోటీ సంగతి ఆనక! పేదోడి ఆహారం..  రోటిమీద నూరుకునే  మిరప్పచ్చడి.. సరుక్కికూడా రెక్కలొచ్చేసి గాల్లో ఎగురుతున్నదని తమకు తెలీకుండా ఉంటుందా! పిల్లకాయలు  చప్పరించే పప్పు బెల్లాలుకూడా నిప్పుల్లా కాలిపోతున్నాయి. కూరగాయల దరవరల సంగతి ఇహ సరేసరి!  విడివిడిగా వివరాలు ఎందుగ్గానీ.. ఒక్క ముక్కలో చెప్పాలంటే .. నసాళానికి అంటుతున్నాయి!  చికెన్నుంచి.. చిక్కుడు వరకు.. ధరల గేలానికి చిక్కి విలవిలాడని కాయగూర కనిపించడం లేదు. పొయ్యి వెలిగించాలంటే ముందు జేబుకాలే తీరులో ఉంది బజారు తీరు! ఆ   శ్రీకృష్ణ పరమాత్ముడుగాని ఈ కాలంలో  భూమ్మీదవతరించి ఉంటే పదహారువేల గోపికలనెలా పోషించకోవాలో తెలీక ఆపద్భాంధవుడి అవతారం అర్థాంతరంగా చాలిందుకొనుండేవాడు! 'అన్నబలమే అన్ని బలాలకు మూలమ'ని అన్నదెవరో  తెలీదుగాని ..  రావణాసురుడైనా  పదినోళ్ల పోషణకు లంకను ఏ ప్రపంచబ్యాంకుకో తాకట్టు పెట్టక తప్పని పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి తెలుగు ప్రజలారా! 
తలకొక్క ఊరైనా ఇస్తే చాలని పాండవులు పదే పదే కౌరవులకు  కబురు పంపించారు ద్వాపరంలో గనక! అదే ఈ నకనకలకాలంలో అయితే?   ఒక్క మండలం తగ్గకుండా  ధారపోసినా వెనక్కి తగ్గేది లే'దని  మొండికేయక తప్పని పరిస్థితి.   రోజుకో బండెడు అన్నం.. కూరలు..  బండిమనిషితో పాటు పంపించమని కండిషన్ పెట్టాడుగదా బకాసురుడు భారతంలో! బండి మనుషులని ఎంతమందినైనా తేలిగ్గా తోలుకు పోవచ్చుగాని.. బండెడు భోజనం.. అంటే బాబోయ్! విరాటరాజైనా చచ్చూరుకొంటాడు.. ఈ కరువు కాలంలో అయితే! వేలుపోసినా నోట్లోకి నాలుగు వేళ్లు పోవడంలేదు మహాశయుల్లారా! పెరిగే ధరలను గురించి నిలదీస్తారన్న భయంకొద్దీనే కాబోలు తిరుపతిగుళ్ళో సైతం  దేవుడు భక్తులకి ఒక్క క్షణానికి మించి అప్పాయింటుమెంటు ఈయడం లేదు. ఈ కరువు ఇలాగే కొనసాగితే వెంకన్నకైనా 'శబరి' ఫలహారం తప్పకపోవచ్చు.
సౌదీలో వేళకి చాయి అందించని బాయికి భర్త తలాక్ చెప్పినా తప్పుకాదంట. ఇక్కడ అలాంటి వెసులుబాటు లేకపోబట్టిగానీ.. లేకపోతే  సంసారాలొక్క రోజైనా సవ్యంగా సాగుతాయా?
'పెరుగుట.. విరుగుట కొరకే! ఆ  అచ్చే దినాలు వచ్చే వరకు  చకోర పక్షుల్లాగా ఎదురు చూడ్డమే బాధ్యతగల తెలుగువాడిగా మన కర్తవ్యం' అన్న మాట తెలివిగానే ఉందిగానీ .. అప్పటివరకు  తెలుగు నడుములు విరగకుండా ఉండాలిగదా!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకీయ పుట 07-06-2009 నాటి ఈనాడు సంపాదకీయ పుటలో 'అధికస్య అధికం ఫలం' పేరుతో గల్పికగా ప్రచురితం)



Wednesday, August 12, 2015

నమస్కారం!- ఓ సరదా గల్పిక

'నమస్తే'లోనే ఉంది సమస్తమంతా.
నమస్తే అంటే తల లేని వాళ్ళ వ్యవహారం కింద  వెటకారం కొంతమందికి. బతకడం చేత రాక చేతుల్ని తిట్టిపోయడమే అదంతా. జాలి పడాలి.
తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవంత కార్యలాభం కలగ లేదు భారతంలో. అదే  ఆలస్యంగా వచ్చీ నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన అర్జునుడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహం లాభించింది. నిండు సభామధ్యంలో ఇలా దండకం  చదివీ చదవంగానే  ఆయనగారి అర్థాంగికీ అదే లాభం.  కృష్ణ పరమాత్ముడి అండ దొరికింది. దండాలా మజాకా?
రామాయణంలో మాత్రం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అలా అంజలి ఘటించి నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకైనా  దక్కని అపురూప గౌరవం ఆంజనేయుడికి దక్కింది. ఉన్న ఒక్క తొండంతోనే  చేతనైనంత వరకూ దాసోహ  పడి  ఆపదల నుంచి గట్టెక్కింది  గడుసు గజేంద్రం.
ఆ చాయలో పోయే ఇప్పుడు మన పక్క రాష్ట్రం పన్నీరు సెల్వం సారూ అమ్మవారి అనుగ్రహం కొట్టేసారు. ఆమెగారు సర్కారువారి సత్కార గృహానికి వేంచేసినప్పుడల్లా తిరిగొచ్చే వరకు ఈయనగారే ముఖ్యమంత్రి పీఠానికి  కుక్క కాపలా! ఆ సత్కార్యం  లభించడానికి  ప్రణామ తంత్రమే  ముఖ్య కారణమంటే  కాదనగలరా!
స్వామివారు కంట బడ్డప్పుడు స్వాభిమానలేవీ పెట్టుకోకుండా 'నమో నమః' అంటూ సాష్టాంగాలు పడక పోతే అష్ట కష్టాలు తప్పవు. యడ్యూరప్ప కథే అందుకు గొప్ప  ఉదాహరణ. పది తలకాయలున్నాయి.. ఏం ప్రయోజనం? ఉన్న రెండు చేతుల్నీ వేళకి సద్వినియోగం చేసుకోవడం రాక   అంత లావు రావణాసురుడూ   రాముడి ముందు  తేలిపోయాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుళ్ళ పతనానికి  ముఖ్య కారణం  ఈ దాసోహ రాజకీయాలు  వంటబట్టక పోవడం కాదూ!
రాక్షసులకు  తెలియని నమస్కార రాజకీయాలు మన రాజకీయ నాయకులు కాచి వడబోసారు.
కడుపులో ఎంత కంటు ఐనా ఉండనీయండి.. బైట ఓదార్పుయాత్ర కంటూ బైలుదేరాక   దేవుడిచ్చిన రెండు చేతులూ  అలా ఓర్పుగా గోజుతో అతికించినట్లు కరిపించుకునే ఉంటాడు జగన్.  జైలుకి పోతూ వస్తూ   అయన గారి బృందం పడే ఆ పాట్లు  చూస్తూ కూడా ఇంకా  అంజలి మాహాత్మ్యంమీద అపనమ్మకమా?
షడ్రషోపచారాల్లో ముఖ్యమైనది. తైత్తరీయం సైతం ప్రస్తావించినదీ  నమస్కారం.
దండాలన్నీ ఒకేలా ఉండవండీ!  చంద్రబాబుగారిది  విభిన్నమైన శైలి. చేతులకు బదులు వేళ్లను వడుపుగా వాడటం ఆయన విధానం. మారిన రాజకీయంల్లో మనం మాత్రం ఏం చేస్తాం? ఎన్నికైన నేత వేళ్ళకు బదులు  గోళ్ళు  చూపించినా అదే  గోల్డెన్ హ్యాండు కింద సర్దుకోవాల్సుంది..
నేతలకీ నమస్కారాలకీ అసలింత లింకెందుకో తెలుసా? ప్రణామాలకి  హామీలు, వాగ్దానాలకు మాదిరిగా  కాలపరిమితి బెడద లేదు. నగదు బదిలీ.. రుణమాఫీలకు మల్లే   ఈ ప్రజాకర్షక పథకానికి మూటా ముల్లెలతో పని లేదు.  ఏ ఎన్నికల సంఘం  అదుపూ.. అజమాయిషీ ల్లేకుండా హాయిగా  ఓపికున్నంత వరకు వాడి వదిలేసే సౌకర్యం ఈ చేతుల  జోడింపులో ఉన్నంతగా మరి దేన్లోనూ లేదు.

మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోడీజీకి కలిసొచ్చిన అంశాల్లో ఆయన గారి హ్రస్వ నామధేయం ఒకటి. పేరులోనే 'నమో' ఉన్న గడుసు పిండం గదా ఆయన. ఓ వంక చెడ తిట్టి పోస్తూనే మరోవంక 'నమో..నమో' అంటూ  మోదీ నామస్మరణ చెయ్యక తప్పని దుస్థితి పాపం చేతిగుర్తు బృందానిది. ఆ  ప్రభావం ఎన్నికల్లో కనిపించిందా.. లేదా?
పబ్లిగ్గా ఎంత పడ తిట్టిపోసుకున్నా మనిషి కంటబడ్డప్పుడు ఏ సంకోచమూ లేకుండా 'నమస్తే' ముద్ర  అభినస్తే చాలు.. సగం చిక్కులు అవే సర్దుకుంటాయి. ప్రధాని పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో సార్క్ దేశాధిపతులంతా మూకుమ్మడిగా  కలసి వచ్చిసాధించిందేమిటీ?  ఎవరి బాణీలో వారు  నమస్కార బాణాలు సంధించుకోవడం. ఆ తరువాతనే కదా సంధి రాజకీయాలు రసకందాయంలో పడింది!
జపాను పోనీ.. చైనా పోనీ.. అమెరికాతో సహా ఏ గడ్డమీదైనా  కాలు మోపనీ.. చేతుల్నే ప్రధానంగా నమ్ముకున్నారు కనకనే మన ప్రధానికంత హవా. ఒబామానైనా తప్పించుకోలేని ప్రభావం నమస్కారానిది. నమో  ప్రభంజనం  ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇంకా ప్రణామ మాహాత్మ్యంమీద అనుమానమంటే.. మిత్రమా..తమకో నమస్కారం!
ఆరోగ్యాన్నిచ్చి, బంధు కృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడనే గదా  సూర్యుణ్ణి భగవంతుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో పొద్దునా సాయంత్రం పడీ పడీ  నమస్కారాలు చేస్తున్నాం! మరి  అర్హతలతో నిమిత్తం లేకుండా  అందలం ఎక్కించి పది  మందిలో గుర్తింపు తెచ్చి పెట్టే  ప్రణామ యోగానికి 'లోకబాంధవ' గౌరవం ఇస్తే తప్పేమిటి? నోబెలు పురస్కారాలే ఎవరెవరికో వస్తున్నాయి గదా ఇవాళా రేపూ?
ఎక్కడో  ఉన్న సూర్యనారాయణుడి శక్తికే  నిత్యం నమస్కారాలు సమర్పిస్తున్న మనం  అర్హతలతో నిమిత్తం లేకుండా వెధవాయలని సైతం  అధికార పదవులకు  సదా చేరువులో  ఉంచే  చేతుల ఇంద్రజాలాన్ని  మరెంతగా మన్నించాలి?
అదృష్టం. ఏ అరబ్బుల దేశంలోనో  పుట్టుంటే  ఖర్మ కాలి ఏ ఒసామా బిన్ లాడెన్నో కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకోవాల్సి వచ్చేది. 'దేవుడానన్నీ 'నమస్తే'ల ఖండంలో పుట్టించినందుకు శతకోటి నమస్కారాలు! రాం రాం, నారాయణ నారాయణ, జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- ఆహా.. ఎన్నేసి రకాల నమస్కారాలు   మన సంస్కృతిలో!
-కర్లపాలెం హనుమంత రావు
(ఈనాడు- సంపాదకీయ పుటలో ప్రచురితం)


...

Saturday, August 8, 2015

ఏడువారాల నగలు- ఓ సరదా గల్పిక

‘ఆ అమెరికా యూనివర్సిటీవాళ్ళకు పనీ పాటా లేదాఏంటీ 'ఆదివారం ది బెస్ట్' అని తేల్చుకోవడానికి అంతచేటు అంతర్జాలం మధించాలా? మన దేశంలో చంటోణ్నడిగినా చటుక్కున చెబుతాడే.. 'సండేని మించిన గ్రాండ్ డే భూమండలంమీద ఎంత గాలించినా కానరాదని!’
‘అవునన్నా! ఆదివారం అంటే కడువునిండా భోజనం.. కంటినిండా నిద్ర.. టీవీ నిండా మూవీలే! ఆడవాళ్లకుతప్ప ట్రాఫిక్ పోలీసుల్తో సహా ఆదివారం అంటే అందరికీ అందుకే అంత అభిమానదినం సోదరా!’
'ఆహా! అందుకేనా భాయ్.. ఆ డిసెంబరు ఆదివారంపూట అంతమందిని అమాంతం మింగిన  సునామీ పుట్టుకొచ్చిందీ!  సోమవారం షేర్ మార్కెట్లకు మహా హుషార్ అంటారే! మరి 'బ్లాక్ మండే' సంగతి మనం మర్చిపోతే ఎట్లా? చంద్రమండలంమీద మనిషి మొదటిసారి కాలుపెట్టింది ‘సోమ’వారంనాడు కూడా కాదే! మరా సోమవారాన్ని  ‘చంద్ర’దినం అని ఎవరనమన్నారంట?’
'సర్వేలయ్యా సర్వేలు'
 ‘హూఁ.. సర్వే గణాంకాల్లో సగంశాతం నిర్దుష్టంగా  ఉండవని ఈ మధ్య ఓ సర్వే- గణాంకాలతో సహా తేల్చిపారేసిందోయ్ సర్వేశ్వర్రావ్! ‘మంగళవారం  ప్రయాణాలకు మినహా.. మిగతా సర్వ మహత్తర కార్యాలకూ ప్రశస్తమైన ముహూర్తం’ అంటున్నాయిగదా మీ బిత్తిరి పంచాంగాలు! మరి ప్రపంచం బిత్తరపోయేట్లు  వరల్డ్ ట్రేడ్ సెంటరు కుప్పకూలింది మంగళవారంనాడే కదా మహానుభావా!’
‘మరీ ప్రద్దాన్నీ దద్దమ్మకిందలా కొట్టిపారేయకు మిత్రమా! బుధవారం పరమ చెత్తరోజని పంచాగాల థీరీ. ముంబయిమీద దాడులు జరిగిందీ,   ఇందిరమ్మ మహాతల్లి యమర్జెస్నీ  మొదలయిందీ బుధవారాలనాడే! మరో మూడేళ్లకు ఇంకో మహాప్రళయమొచ్చి మనందరికీ మూడుతుందంటున్నది ఆల్విన్ టోప్ఫ్లెర్ ఫ్యూచర్ షాక్. బాగా చూసుకో ఇంటర్నెట్లో! ఆ రోజుకూడా బుధవారమే అవబోతోంది! ప్రిడిక్షన్ థీరీనా మజాకానా!’
‘అబ్బో! బహుదొడ్డ థియరీ! గురువారం పొగతాగడం మానేసేందుకు  మహామంచిరోజా! శుక్రవారంనాడు నిర్ణయించుకొన్నాసరే  మీ పంచాంగం పంతులుగారి థియరీ ప్రకారం మళ్ళొచ్చే గురువారందాకా దగ్గుతూనే  తాగుతుండాలి కాబోలు.. పొగ!’
‘మరీ రెటమతంగా మాట్లాడకన్నా! మనం మాత్రం అలాంటి నమ్మకాలకేమన్నా తక్కువా? శుక్రవారంనాడు పర్సు బైటికి తీస్తామా? మంగళవారంనాడు తలక్షవరానికి తలబడితే  తలనొప్పి రావడం ఖాయమని  సిద్ధాంతులు చెబుతుళ్లా! అమెరికావాడే శుక్రవారం పేరు చెబితే ఉలికులికి పడుతున్నాడు. అందులోనూ అది ఏ పదమూడో తారీఖునో వచ్చిందంటేనా.. గొర్రె చచ్చిందన్నమాటే! ఏసుప్రభువు శిలువ ఎక్కింది పదమూడు శుక్రవారమే!’
‘మరి ఆ ఏసుప్రభువు తిరిగొచ్చిందికూడా శుక్రవారమే గదా సోదరా! 'గుడ్ ఫ్రై డే'అనికూడా పండుగ చేసుకొంటాం!’
‘నువ్ ప్రద్దానికీ ఇలాగే బుకాయిస్తావ్ గానీ.. మన దేవుళ్లకు మాత్రం మంచి రోజులు.. చెడ్డ రోజులు లేవంటావా? శివయ్యకి సోమ  బుధవారాలు, ఆంజనేయుడికి మంగళవారం, సాయిబాబాకి గురువారం, లక్ష్మీదేవికి శుక్రవారం, వేంకటేశ్వరుడికి శనివారం..’
‘.. సూర్యభగవానుడికి ఆదివారం.. చంద్రభగవానుడికి సోమవారం..  బృహస్పతికి బుధవారం.. గురుగ్రహానికి గురువారం.. శుక్ర శని గ్రహాలకు శుక్ర శని వారాలు.. ఇష్టంట! ఆ రోజు పూజా పునస్కారాలు చేయకపోతే ఆ గ్రహాలకు ఆగ్రహం అంట! మరి శనివారాలు పిల్లలు పుట్టేందుకు మంచిరోజనీ.. ఆ రోజు పుట్టినవాళ్లలోనే  ప్రధానమంత్రులైనవాళ్ళు  ఎక్కువమందున్నట్లుకూడా తేలిందే! అలాంటి సర్వేలనుగురించి భాయీ  నేను పట్టించుకోవద్దని మొత్తుకొనేది! చాదస్తం ఎక్కువైతే గంటల పంచాంగంకూడా నిమిషానికోసారి చూడబుద్ధవుతుంది. నమ్మకాల కాళ్ళు భూమ్మీద నిలబడకపోతేనే మూఢనమ్మకాలుగా మారి కాల్చుకుతినేది! తాగుబోతుకి దీపస్తంభంలాగా! వెలుగుకోసం కాదు..  తూలిపడిపోకుండా పట్టుకొడంకోసం లైటుస్తంభం ఉందని మందుబాబులు మనసావాచా నమ్మినట్లుగా!’
‘ఇంతకీ నువ్వనేదేందో సూటిగా బైటపెట్టేయరాదా సోదరా!
‘మంచిరోజు చూడకుండా చెడ్డపనికూడా చెయ్యలేని బలహీనతని వదులుకోమంటున్నా! మనకు పనికిరాని అమావాస్య పక్కరాష్ట్రం తమిళనాడులో పరమ పవిత్రమైన రోజు. గ్లోబుమీది అన్ని దేశాల్లో ఆదివారాలు ఒకేసారి రావు. 'రోజు' అనేది కాలమనే దేవుడు మనకి పరగడుపునే  సంతకం చేసిచ్చిన  బ్లాంక్  బాంక్ చెక్కు. వాడుకొనే తీరును బట్టి దాని విలువ. ప్రతివాడికీ తొమ్మిది దినాల్లో ఒకటి అనుకూలంగానే ఉంటుందని  'లస్టర్ ఆఫ్ వెటర్నిటీ' ఆరో ఛాప్టరులో ఉంది తెలుసా! ఘనాదేశస్థులు  పుట్టినరోజు పేరునే బిడ్డకు పెట్టుకొంటారు.మంచిదా.. చెడ్డదా అని చూసుకోరు.  అంటార్కిటికాలో ఏడాది ఒక్క రోజునే సూర్యోదయం. సెప్టెంబరు 21వ.  అది ఆదివారమయినా.. అమావాస్య అయినా.. వాళ్లకి పరమానందం కలిగించే దినమేగదా! 'భగవన్నిమిత్తమైన అన్ని దినాలూ సుదినాలే' అనలేదా  మన చిలకమర్తి నరసింహంగారు! పనిచేసేవాడికి ఏ రోజూ పనికి మాలినది కాదు. వారంలోని ఏడువారాలు సృష్టి మనకిచ్చిన ఏడువారాల నగలు భాయీ!'
'నిజమే సోదరా! ఇప్పుడు చెప్పేవాళ్ళు తగ్గి  మర్చిపోయాంగానీ.. చిన్నప్పుటి మన  తెలుగువాచకాల్లో ఒక మంచిపాట ఉండేది. 'ఆదివారంనాడు అరటి మొలచింది/ సోమవారంనాడు సుడి వేసి పెరిగింది/ మంగళవారంనాడు మారాకు తొడిగింది/ బుధవారంనాడు పొట్టిగెల వేసింది/ గురువారంనాదు గుబురులో దాగింది/ శుక్రవారంనాడు చూడగా పండింది/ శనివారంనాడు చకచకా గెలకోసి/  అందరికి పంచితిమి అరటిపొత్తములు' అని పాట. అందరికీ పంచే అరటి పొత్తాలు అందుకోవాలంటే వారంలోని ఏడురోజులూ ఆ అరటిచెట్టులా ఎదుగుతూనే ఉండాలని గదా! సరే! నేను వస్తానన్నా!’
‘ఎక్కడికిరా?’
‘శనివారంకదా అని పనికి పాలుమాలా. అత్యవసరంగా ఒక దస్త్రం పరిష్కరించాల్సి ఉంది. ఒక పెద్దాయన పాపం.. పింఛనుకోసం వారం వర్జ్యాలుకూడా చూసుకోకుండా నా టేబుల్ చుట్టూ ప్రదక్షిణాలు చెస్తున్నాడు'
'భళా! ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు సోదరా!'
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సెప్టెంబరు 6 నాటి సంపాదక పుటలో ప్రచురితం)



అడుగో ఆంజనేయుడు.. జాంబవంతుడెక్కడ?- రచన కథాపీఠం పురస్కారం


ఒక ప్రముఖ చినపిల్లల మాసపత్రికవాళ్ళు ఆ సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా గేయకథల పోటీ నిర్వహిస్తున్నార్రు.సెలెక్షన్ కమిటీలో నేనూ ఒక మెంబర్ని.
దాదాపు మూడువందల ఎంట్రీలు వచ్చాయి. మొదటి వడపోతలో ఒక వందదాకా పోయినా.. ఇంకా రెండువందలవరకు మిగిలాయి.
పిల్లలకోసం ఇంతమంది రాసేవాళ్ళు ఉన్నారంటే సంతోషం కలిగింది. రచనలు పంపించినవాళ్ళలో లబ్దప్రతిష్ఠులూ ఉండటం ఆనందం కలిగించింది. అన్నింటికంటే వింతగొలిపే విషయమేమిటంటే.. కొత్తగా రాస్తున్నవాళ్లలో కొంతమంది ఎంతో చురుకుగా రాసారు! నిజానికి ప్రముఖుల రచనలకన్నా అవి ఎందులోనూ తీసిపోవు. కొన్నయితే మిగిలిన వాటికన్నా  బాగున్నాయి. సెలక్షను చాలా కష్టమయింది. మొత్తంమీద అందరం కలసి కూర్చుని అన్ని కోణాల్లోనూ పరిశీలించి  ఫైనల్ గా ఒక పది రచనలు ఎంపిక చేసాం. వాటిలో ఒకటి, రెండు, మూడు బహుమతుల ఎన్నికను సంపాదకులకే వదిలేసాం. మిగిలిన వాటిని మాత్రం సాధారణ ప్రచురణకి తీసుకోవచ్చని సలహా ఇచ్చాం. అట్లాంటి సాధారణ ప్రచురణకు ఎన్నికైనదే 'ఛుక్ ఛుక్ రైలు'. గేయ రచయిత సి. ఆంహనేయులు, దేశాయిపేట.
దేశాయిపేట మా ఊరికి దగ్గర్లోనే ఉంటంది. మా ఊర్లో హైస్కూలున్నా దేశాయిపేటలో చదువు బాగుంటుందని మా నాన్న ఎస్సెల్సీలో  నన్ను అక్కడ చేర్చాడు. నాకెప్పుడూ ఫస్టు ర్యాంకే వస్తుండేది. క్లాసులో కృష్ణగాడికి రెండో ర్యాంకు. వాడి అన్నయ్యే ఆంజనేయులు.
ఆంజనేయుల్ని చూస్తే మాకు ఎడ్మైరింగుగా ఉండేది. ఆయన ప్రతిభ అలాంటిది. మాకు కొరుకుడు పడని లెక్కల్ని సులభ పద్ధతిలో ఎలా చెయ్యాలో చెప్పేవాడు. సోషల్ సబ్జెక్టులో సంవత్సరాలు, యుద్ధాలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అదే పనిగా బట్టీ పడుతుంటే.. అలా చేయడం తప్పనీ.. గుర్తు పెట్టుకోవడానికి ఉపాయాలున్నాయని చెప్పి చూపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు 'రిటెన్షన్ ఆఫ్ మెమరీ పవర్' అనే టెక్నిక్కు ఆన్ లైన్లో కోచింగ్ తీసుకొంటున్నారు. అందులో చెప్పిన సూత్రాల్లో కొన్ని నలభై ఏళ్లకిందట ఆంజనేయులు చెప్పినవే! అతనేమీ కోర్సులు చదువుకోలేదు. వాళ్ల నాన్న ఒక మామూలు బడిపంతులు, వాళ్లకంత స్తోమతూ లేదు.
కృష్ణగాడితో కంబైన్డు స్టడీసుకని నేను వాళ్ళింటికి వెళుతుండేవాణ్ని. ఆంజనేయులుకి ఇంకా చాలా విద్యలొచ్చు. పేపర్లను కత్తిరించి బొమ్మలు తయారుచేసెవాడు. రంగుపెన్సిళ్లతో బ్రహ్మాండంగా బొమ్మలేసేవాడు. ఎప్పుడూ ఏదో ఓ కొత్తపని చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. చేయడానికేమీ లేదనుకొన్న రోజున పేపరూ, పెన్నూ పట్టుకుని కూర్చునేవాడు. కథలు రాసేవాడు. కవితలల్లి వినిపించేవాడు. మా స్కూలు యానివర్సిరీకీ మా కోసం ఒక హాస్యనాటిక రాసి తనే డైరెక్టు చేసి మెప్పించాడు. గ్రీన్ రూంలో మాకు మేకప్ చేసిందికూడా ఆంజనేయులే. ఆ మేకప్ సామాను స్వయంగా తయారు చేసుకొన్నాడు.
 మాఅన్నయ్య అమెరికాలో పుట్టివుంటే చాలా గొప్పవాడయివుండేవాడు' అంటుండేవాడు కృష్ణ ఎప్పుడూ.
అమెరికా సంగతేమోగాని.. ఆంజనేయులు నిజంగా గొప్పవాడే. పెద్దయిన తరువాత అతను చాలా మంచిపేరు తెచ్చుకొంటాడు అనుకొనేవాళ్లం. కానీ అతనికి చపలత్వం ఉండేది. ఏ పనీ స్థిరంగా చేసేవాడు కాదు. చదువుకోవాల్సిన వయసులో ఆడుకొనేవాడు. ఆటలాడుకోవాల్సిన సమయంలో కవిత్వం రాస్తుండేవాడు. ఊళ్ళో వాళ్లెంత మెచ్చుకొంటున్నా ఇంట్లోవాళ్లచేత తిట్లు తింటుండేవాడందుకే. కృష్ణకున్న స్థిమితంలో పాతికోవంతు  ఆంజనేయులుకున్నా నిజంగా చాలా మంచిపేరు తెచ్చుకొనుండేవాడే.

నేను డిగ్రీ చదువులకని మా తాతగారి ఊరికెళ్ళిపోయిన తరువాత ఆంజనేయులు సంగతేమయిందో పట్టించుకోలేదు.

నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నరోజుల్లో ఓ రోజు ఆంజనేయులు నన్ను వెదుక్కొంటూ వచ్చాడు. వయసు అతనిలో ఆట్టె మార్పు తీసుకురాలేదు. కూర్చున్న పదినిమిషాల్లో వంద విషయాలను గురించి మాట్లాడాడు. మనది వాస్తవంగా లౌకిక ప్రజాస్వామ్యమేనా? అన్న అంశంనుంచి.. పారలల్ సినిమావరకు.. అన్ని అంశాలమీద అడక్కుండానే  సుబ్బారావు. చనువున్నవాళ్లు సుబ్బు అంటారు. ఆంజనేయులికి హిపోక్రసీ అన్నది తెలీదు. అదే అతనిలో నాకు నచ్చే గుణం.
అతను ఇచ్చిన కథ ఎడిటరుగారికి నచ్చింది.
ప్రచురించబడిన తరువాత నేనే అతనికి స్వయంగా కబురు చేసాను. ముందు ముందు ఇంకా మంచి కథలు రాస్తుండమని సలహాకూడా ఇచ్చాను.
రెండు నెలల తరువాత ఒక నవల పంపించాడు. బాగుంది. కొద్దిమార్పులతో ప్రచురించడానికి అంగీకారమయింది.
క్రమంగా ఆంజనేయులు రచయితగా మిగతా పత్రికల్లోకూడా కనిపించడం మొదలుపెట్టాడు.
రేడియోలో అతను రాసిన నవలలు రావడం మొదలుపెట్టాయి.
కవి సమ్మేళనాల్లో అక్కడక్కడా కనపడుతుండేవాడు.
ఒక నాటకపరిషత్తులో పోటీ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. 'రివ్యూ'కోసం పత్రిక తరుఫున నేనే హాజరవుతున్నాను. రెండో రోజున భుజాన వేళ్లాడే సంచీతో  ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయులు. నరసరావుపేటనుంచి నాటకం తయారు చేసుకొచ్చాట్ట! అక్కడికి దగ్గర్లోనే ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నాటకం బాగా పండింది. ఆంజనేయులు మూగవాడిపాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకత్వం అతనిదే. రచన సంగతి  సరేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డు ఆ సంవత్సరం ఆంజనేయులికి దక్కింది. 'అందుకేనన్న మాట ఈ మధ్య పత్రికల్లో ఎక్కువగా కనిపించడం లేదు' అన్నాను అతన్ని అభినందిస్తూ.
చిన్నగా నవ్వాడు ఆంజనేయులు 'సుబ్బూ! ఒకసారి నువ్వు మా ఊరు రావాలి!' అన్నాడు.
'ఏమిటీ విశేషం?'
'అఖిల భారత స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాం. నువ్వూ ఒక జడ్జిగా ఉంటే బాగుంటుంది'
'అమ్మో! పాటలగురుంచి నాకు ఏబిసిడిలు కూడా తెలీవన్నా!' అన్నాను. 
మేమందరం ఆంజనేయుల్ని 'అన్నా' అనే పిల్చేవాళ్లం కృష్ణతోపాటే.
'అలాంటివాళ్ళే నిజమైన న్యాయనిర్ణేతలవుతారు. నీకెందుకు.. నువ్వు రా!' అంటూ అడ్రసూ డేటూ ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆంజనేయులు నిజంగానే పాటల పోటీని భారీ ఎత్తున నిర్వహించాడు. అది చిన్న ఊరే అయినా ఆంజనేయులు  టీచరుగా వెళ్ళినతరువాత ఊరు పరిస్థితుల్లో చాలా మార్పులు తెచ్చాడని చెప్పారు అక్కడి జనం. ముఖ్యంగా కుర్రకారులో అతనికి మంచి ఫాలోయింగుంది. పెద్దవాళ్లలో గౌరవమూ ఉంది. పిల్లకాయల పోరంబోకు తిరుగుళ్ళు తగ్గాయి అన్నారు పెద్దవాళ్ళు. ఊరిపెద్దల సహకారం లేనిదే అంత పెద్ద కార్యక్రమం చెయ్యడం బైటివాళ్లకు సాధ్యం కాదు. మొత్తానికి నేను ఆ ఊళ్లో ఆంజనేయులు మరో అవతారం చూడగలిగాను. అప్పటిదాకా చూడని అవతారం.. సోషల్ వర్కర్ అవతారం!
ఊళ్లో ఉచితవైద్యం చేస్తున్నాడు. అందుకోసం పుస్తకాలు తెప్పించుకొని చదువుతున్నాడు. 'రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేయడం నేరంకదా!' అనడిగితే కలకత్తా బ్రాండ్ 'ఆర్ ఎం పి' సర్టిఫికేట్ చూపించాడు. మొత్తానికి అతని ఆశయం సేవే. లాభార్జన కాదు. చిన్న చిన్న రోగాలకే వైద్యం చేస్తున్నది.. ఉచితంగా. 'కొద్దిగా కాంప్లికేటేడ్ గా ఉన్నా పట్నం పొమ్మంటా' అన్నాడు ఆంజనేయులు.
ఊళ్ళో ఓ చిన్న గ్రంథాలయంకూడా పెట్టించాడు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఊరిసమస్యలని పరిష్కరించే విధానం. బోరింగుల్లోకి నీరు రాకపోయినా, వీధిదీపాలు వెలక్కపోయినా, వినాయక చవితి, శ్రీరామనవమిలాంటి పండుగలకి ఉత్సవాలు ఏర్పాటు చేయాలన్నా, పంచాయితీ బోర్డు వరండాలో కూర్చుని పబ్లిగ్గా  అందరిముందు చర్చించుకొనే అలవాటు చేయించాడు. ఆంజనేయులు ఒక్క టీచరే కాదు.. ఊరి పెద్దల్లో ఒకడూ, ముఖ్యుడూ అయికూర్చున్నాడు.

'ఇన్నిపనులు చెయ్యటానికి నీకు టైమెక్కడిదన్నా?' అనడిగాను ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు.
'ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. నువ్వైనా చెప్పు బాబూ! ఆరోగ్యం సంగతి చూసుకోవద్దూ!' అంది ఆంజనేయులు భార్య,
ఆమె కంప్లయింటు సమంజసమైందే అనిపించింది. కానీ నేను ఆంజనేయులుకి చెప్పేటంతటివాడినా!
'ఇప్పుడంటే ఫరవాలేదు. ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చినతరువాత కూడా తిరుగుతానంటే ఎట్లా?' అందామె.
'అప్పటి సంగతి చూద్దాంలేవే!' అని నవ్వి ఊరుకొన్నాడు ఆంజనేయులు.
అప్పటికి ఆంజనేయులు భార్య గర్భంతో ఉంది. అదీ ఆవిడ భయం.
ఆంజనేయులు ఇంట్లో లేనప్పుడు అందామె 'నువ్వూ మా కృష్ణలాంటివాడివే బాబూ! నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి నేను! వినేందుకు ఎవరున్నారు గనక! నన్ను చేసుకొన్నారని ఆయన్ని వాళ్లవాళ్ళు వెలేసినంత పని చేసారు. ఎవరూ ఇటువైపు రారు. మా వాళ్లు మరీ మొరటువాళ్ళూ' అని కన్నీళ్లు పెట్టుకొందావిడ.
ఆంజనేయులు ఇంతకుముందు పనిచేసిన ఊళ్ళోనే ఈ పెళ్ళి చేసుకొన్నాడు. కులాతర వివాహం. ఎవరు వారించినా వినకుండా చేసుకొన్నాట్ట! ఆయన బ్రాహ్మడు. ఈవిడది షెడ్యూల్డ్ కులం. ఇరువైపుల పెద్దలకూ ఈ వివాహం ఇష్టంలేకపోయింది. ఆ ఊళ్లోవాళ్ల బాధపడలేకే ఇక్కడికి బదిలీ చేయించుకొన్నాడు ఆంజనేయులు.
ఆంజనేయులు కులాంతర వివాహాలను గురించి కొన్ని కథలు రాసాడు. తను రాసిందె  ఆచరించి చూపించాడు. రియల్లీ గ్రేట్! ఆంజనేయులు ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకొన్నాను ఆ క్షణంలో.
 
తరువాత నేను ఉద్యోగం మారి ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే దాదాపు మూడు దశాబ్దాలు ఉండిపోయాను. పెల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్లయారు. మధ్య మధ్యలో ఆంధ్రావైపు వస్తున్నప్పుడు ఆంజనేయుల్ని గురించి వాకబు చేస్తుండేవాణ్ణి. ఉద్యోగాల రీత్యా అతనెక్కడెక్కడో ఉంటుండేవాడు. ప్రతిసారి ఏదో కొత్త ఆడ్రసు చెప్పేవాళ్ళు.
ఒకసారతన్ని మాచర్లలో పట్టుకోగలిగాను. మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లలు. పెద్దది పాప. సెకండ్ క్లాసు. రెండో వాడు యూ.కె.జి. చాలా చురుకుగా ఉన్నారిద్ద్దరూ. అచ్చు తండ్రి చురుకుతనమే. కదిలిస్తే చాలు ఇంగ్లీషులో రైమ్సు.. తెలుగులో పద్యాలు గడ గడ చదివేస్తున్నారు. పిల్లలిద్దర్నీ డ్యాన్సు స్కూల్లో చేర్పించారు.
'మైత్రికి పెయింటింగ్ కాంపిటీషన్లో టౌన్ మొత్తానికీ ఫస్టొచ్చింది.  ఇదిగో ప్రైజ్. చిన్నాడుకూడా చిచ్చర పిడుగే. వీడికీ సీతారామరాజు ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్లో ప్రయిజొచ్చింది. సంగీతంకూడా నేర్పించాలని ఉంది. క్లాసులో ఇద్దరూ ఫస్టే!' అన్నాడాంజనేయులు.  అక్కడున్నంత సేపూ మొగుడూ పెళ్ళాలు తమ పిల్లల్ని గురించే మాట్లాడారు.
'నువ్వేమన్నా వేరే ఏక్టివిటీస్ చేస్తున్నావా అన్నా?' అనడిగాను.
లోపలికి వెళ్లి ఓక ఫోటో ఆల్బమ్, రెండు పుస్తకాలు పట్టుకొచ్చాడు. అల్బంనిండా వాళ్ళ పిల్లల ఫోటోలే. రకరకాల భంగిమల్లో.. రకరకాల చోట్ల తీసినవి.
'వీళ్ళకోసం ఫొటోగ్రఫీ నేర్చుకొంటున్నాను. ఈ ఫోటోలన్నీ నేను తీసినవే. బాగున్నాయా?' అనడిగాడు.
నిజంగా ఫోటోలు బాగా వచ్చాయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ తీసిన స్థాయికి ఏమాతం తగ్గవు అవి. ఆంజనెయులు చెయ్యి ఎందులో పడినా అంతే! బంగారం! అందులోనుంచి మచివి రెండు ఏరి ఇచ్చాడు. 'నీకు తెలిసిన పత్రికల్లో వీలుంటే వేయించు' అన్నాడు.'పాటలు రాశాను కొన్ని. 
బాలల గేయాలు.. గేయ కథలు ఉన్నాయనుకో! మా పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి నోరుతిరిగే రీతిలో బాణీలు కట్టి రాసినవి. మైత్రీ! ఒక పాట పాడమ్మా! 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' అంటూ అందించాడు. వెంటనే ఆ పాప ఆ పాట అందుకొని దాదాపు ఐదారునిమిషాలు ఆపకుండా పాడుతూ పోయింది. మధ్య మధ్యలో చిన్నపిల్లవాడు అక్కకు తోడుగా వంత కలపడం..!
'వీళ్ళు పాడే పాటలన్నీ నేను రాసినవే. వీళ్లకోసమే రాసాను. వీటిని కేసెట్టుల్లోకి ఎక్కించాను. ఇందులో ఏమన్నా పనికొస్తయేమో!' అంటూ కేసెట్టూ.. పుస్తకమూ అందించాడు. మొత్తానికి అక్కడ కూర్చున్న రెండుగంటలూ ఆంజనేయులు తన పిల్లల్నిగురించి తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున వేరే టాపిక్ లోకి వెళితే ఆయన భార్య వెంటనే   సవరించేది. వాళ్ల ప్రపంచమంతా ప్రస్తుతం ఆ ఇద్దరి పిల్లలతోనే నిండిపోయిందని తెలుస్తూనే ఉంది.
'తమ పిల్లలకు అందుబాటులో లేనిదేదీ ఊహించే స్థితిలో లేడు ఆంజనేయులు' అనిపించిందా  క్షణంలో.
నాకు పరిచయమున్న పత్రికకు అతనిచ్చిన ఫొటోలు, గేయాలు పంపించాను. రెండు ప్రచురించారు. మంచి స్పందనా వచ్చిందని చెప్పారు.
'పిల్లల శీర్షికలకన్నా రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేయ'మని ఎంకరేజింగ్ గా సలహా ఇస్తూ ఆంజనేయులకి ఉత్తరం రాసాను.
కొన్నేళ్ళు ఆంజనేయులు రెగ్యులర్ గా రచనలు పంపించాడుట. 'మంచి క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ ఒరిజినల్స్' అని మెచ్చుకొన్నారు ఎడిటరుగారు నేనొకసారి ఆయన్ని కలిసినప్పుడు. '.. కానీ ఈ మధ్య ఏవో కామిక్సు పంపిస్తున్నాడు. అవి అంత ఒరిజినల్ గా లేవు. అయినా ఫరవాలేదనుకొని కొన్ని ప్రచురిస్తున్నాం' అన్నాడాయన. అంటే ఆంజనేయులు పిల్లలు హైస్కూలు చదువులకు వచ్చారన్నమాట..' అనుకొన్నాను, 'ఇంకొద్దికాలంపోతె ఇవీ రాయడు చూడండి! సస్పెన్సు.. క్రైం థిల్లర్ టైపు నవలలొస్తాయి' అన్నాను ఆ ఎడిటరు మిత్రునితో.
మరో ఐదేళ్ళ తరువాత ఆ మిత్రుడు ఓ పెళ్ళిఫంక్షనులో కలిసాడు. ఆ మాటా ఈ మాటా అయిన తరువాత టాపిక్ నవలలమీదకు మళ్ళింది.
'అన్నట్లు.. మర్చిపోయా!.. మన ఆంజనేయులు ఈ మధ్య ఒక క్రైం థిల్లర్ పట్టుకొచ్చాడు. అగాథ క్రిస్టీకి నకలుగా ఉందది. అతని దగ్గర్నుంచి రావాల్సిన నవల కాదది. వేస్తే పత్రికకూ, అతనిక్కూడా  పేరు పోతుంది. చూస్తాలే.. అని పక్కన పెట్టేసాను' అన్నాడు.
ఈ మలుపు నేనూహించిందే అయినా.. ప్రాణం ఉసూరుమంది. ఆంజనేయుల్లో ఎంత టేలెంటుంది! ఎంత వెర్సటాలిటీ ఉంది!  ఏమయిందా ప్రతిభంతా?!
తరువాతా కొంతకాలానికి ఆంధ్రా వైపొచ్చానుగాని.. పని వత్తిడివల్ల అతన్ని కలుసుకోవడానికి కుదరలేదు. 
తరువాత ఎప్పుడో అనుకోకుండా ఓ పెళ్ళిలో కృష్ణ కలిసాడు. చాలా ఏళ్ల తరువాత కలుసుకొన్నాం.. గంటలకొద్దీ మాట్లాడుకున్నా కబుర్లు తరగడం లేదు.
'ఇట్లా కాదు.. ఒకసారి మా ఇంటికి భోజనానికి రారా!' అని బలవంతాన ఇంటికి తీసుకువచ్చాను మర్నాడు. రాత్రి భోజనాలయిన తరువాత ఇద్దరం డాబామీద  కూర్చొని కబుర్లలో పడ్డాం. టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి ఆంజనేయులుదగ్గరికొచ్చి ఆగింది.
నేనే అన్నాను 'మీ అన్నయ్య నిజంగా ఎంత టేలెంటు ఉన్నవాడూ! సిన్సియర్! కులాంతర వివాహం చేసుకొన్నాడని మీరంతా ఆయన్ని దూరం పెట్టడం ఏం బాలేదురా! ఇంట్లో వాళ్లంతా వేలేస్తే ఆ లోటు పూడ్చుకోడానికి ఆ రోజుల్లో అతను చేసిన సోషల్ సర్వీసు అపూర్వం.  అట్లాంటివాడు పిల్లలు పుట్టేసరికి అప్పటివరకూ తాను సేవించిన సొసైటీనికూడా పూర్తిగా మర్చిపోయి .. ఆ పిల్లలలోకంలోకి వెళ్ళిపోయాడు!..  ఎంత విచిత్రమైన మనిషో!' 
కృష్ణ అందుకొని మిగతా భాగం పూర్తిచేసాడు '.. అన్నయ్యంటే ఇంట్లో అందరికీ అభిమానంగానే ఉండేది. వేరే కులం పిల్లని చేసుకొన్నాడని ఇంట్లో వెలేయకపోతే చెల్లెళ్లకు పెళ్ళిళ్ళవడం కష్టమయేదిరా! పోనీ అక్కడన్నా స్థిరంగా ఉన్నాడా అంటే..  అదీ లేదు. నువ్వు చెప్పిందీ నిజమే! పిల్లలే లోకంగా మసిలేవాడు. వాళ్లమీదే ఆశలన్నీ పెట్టుకొన్నాడు. వాళ్ళకోసమే తను ఇంతకాలంగా ప్రేమించి పెంచుకొన్న కెరియర్నికూడా కాదని కాలదన్నుకొన్నాడు. కానీ.. చివరికేమైందీ!..'
'ఏమైందీ?!' నా మనసేదో కీడు శంకింస్తోంది.
'కూతురు  అమెరికా పోయి తనలాగే వేరే దేశంవాడిని పెళ్ళి చేసుకొంది. తండ్రితో సంబధాల్లేవు. కొడుకిక్కడే ఉన్నాడుగానీ.. అబ్బపొడ గిట్టదు. తాను కోరుకొన్న కోర్సులో  చేర్పించలేదని అలిగి ఇంట్లోనుంచి వెళ్ళిపోతే వెదికి తెచ్చుకొన్నాడా ఉద్ధారకుణ్ణి. ఉన్నదంతా ఊడ్చి వాడి చదువులకు సమర్పించుకొన్నాడు. చివర్రోజుల్లో బికారిగా మారాడు. వదిన చచ్చిపోయింది. కొడుకూ కోడలే ఆధారం వాడికి ఇప్పుడు. వాళ్ళు చీదరించుకొంటున్నా పడుండక తప్పని దౌర్భాగ్యం' కృష్ణ కళ్ళల్లో నీళ్ళు.
'మరి ఈ మధ్య ఏదో గేయం చూసానే! ఏదో పత్రిక్కి పోటీకి పంపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా.
'పంపే ఉంటాడులే! కొడుకూ, కోడలూ ఉద్యోగాలకు వెళుతున్నారుగదా! పసిపిల్లల్ని వీడిమీద పడేసి పోతున్నారు. ఆ పసివాళ్లకోసం  పాటలూ.. గట్రా ఏవన్నా  కడుతున్నాడేమో మళ్ళీ! అదేగా వాడి బలం.. బలహీనతా!' అన్నాడు కృష్ణ  నిర్వేదంగా!
'శాపవశాన తన శక్తి తనకు తెలీని హనుమంతునివంటి వాడు ఆంజనేయులు. జాంబవంతుడికా శాపం తెలుసు. కనకనే రామాయణ ధర్మకార్యానికి అతన్ని యుక్తియుక్తంగా ఉపయోగించుకొన్నాడు. అసమాన ప్రతిభా సామర్థ్యాలున్న ఆంజనేయుల్లాంటి వాళ్లను సద్వినియోగించుకొనే జాంబవంతులు సమాజంలో, వ్యవస్థలో క్రమంగా  తరిగి పోతున్నారు. అదే ఈ కాలం  పెను విషాదం.' అనిపించింది నాకు.
-కర్లపాలెం హనుమంతరావు
***
                   
(రచన మాస పత్రిక  2003- ఫిబ్రవరి- 'కథాపీఠం' పురస్కారం)
మరియు
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము- తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ వారు శీ తారణ ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన  'తెలుగు వెలుగు' సావనీరు లో ప్రచురితం)





Wednesday, August 5, 2015

బతకనేర్చిన వాడు- చిన్నకథ

రాంబాబు నావలో బొబ్బర్లంక చేరాడు. అల్లుడుగారిని రిసీవ్ చేసుకోడానికి వెంకయ్యగారే స్వయంగా ఒడ్డుమీద వేచివున్నారు. వెంకయ్యగారు ప్రస్తుతం ఆ పరగాణామొత్తానికి ఎన్నికైన ప్రజాప్రతినిధి.

సామానంతా దిగింతరువాత అందరితోపాటే నావయజమాని రామలింగానికి రవాణాచార్జీలు చెల్లించబోయాడు రాంబాబు. రామలింగం చాలా నొచ్చుకొన్నాడు
'వెంకయ్యగారి అల్లుడంటే ఊరంతటికీ అల్లుడేనండీ బాబూ! అల్లుళ్లదగ్గర డబ్బులు దండుకొనే అథమస్థాయికి చేరలేదండీ ఈ రామలింగం ఇంకా!' అంటూ ఏవేవో నిష్ఠురాలాడాడు.
వెంకయ్యగారు రొయ్యమీసాలు మెలేసుకొంటూ అంతా ప్రసన్నంగా విన్నారు.
మామగారికా ఇలాకాలో ఎంత మందాన మర్యాద మన్ననలు అందుతున్నాయో స్వయంగా చూసిన అల్లుడురాంబాబు ఆనందంతో తబ్బుబ్బయిపోయాడు.
పెద్దపండుగ మూడురోజులు అదే పద్ధతిలో బ్రహ్మాండంగా గడిచిపోయింది రాంబాబుకు అత్తారూర్లో.
భార్యాపిల్లలు మరో వారం రోజులుండి వస్తామన్నారు.  ఏడాదికి సరిపడా ఊరగాయ పచ్చళ్ళు, పండుగకట్నంగా మామాగారిఛ్చిన టీవీ సెట్టులాంటి భారీసామానుతో ఒంటరిగానే తిరుగు ముఖం పట్టాడు రాంబాబు. వెంకయ్యగారే స్వయంగా లాంచిదాకా వచ్చి వీడ్కోలు పలికారు.
నావ అవతలి ఒడ్డు చేరుకోగానే ప్రయాణీకులంతా రామలింగానికి చార్జీలు చెల్లించి సామాను దింపుకొని పోతున్నారు. వెంట తెచ్చుకొన్న సామాను దింపించుకొని పోయేందుకు రామలింగంకోసం ఎదురుచూస్తూ నిలబడున్నాడు రాంబాబు.
రామలింగం ఇటువైపు రావడంలేదు సరికదా.. రెండుమూడుసార్లు పిలిచినా విననట్లే ఎటో వెళ్ళిపోతున్నాడు! రాంబాబుకి పరిస్థితి పూర్తిగా అర్థమయింది. మామగారు ఎదురుగా లేరు కదా! ఈ ఓడమల్లయ్య ఇప్పుడు నిజసరూపం చూపిస్తున్నాడన్నమాట!
చేసేదేముంది! రాంబాబూ అందరికిమల్లేనే రవాణా చార్జీలు రామలింగం చేతిలో పోసి 'ఇహనైనా నా సామాను వడ్డున పెట్టిస్తారా?' అనడిగాడు సాధ్యమైనంత వెటకారం జోడిస్తూ!’
రామలింగం అదేమీ పట్టించుకోకుండా వెకిలిగా నవ్వుతూ 'అల్లుడుగారు వచ్చినప్పటి  చార్జీలుకూడా ఇప్పిస్తే .. ఇదిగో ఇప్పుడే సామాను వడ్డుమీదకు పట్టిస్తా..' అనేసాడు.
అవాక్కయిపోవడం రాంబాబు వంతయింది.
దక్కిస్తూ పాత చార్జీలుకూడా పైసలుతో సహా రామలింగానికి సమర్పించుకొని సామాను వడ్డుకు పట్టించుకొన్నాడు బతుకుజీవుడా అనుకొంటో!
'బతకనేర్చినవాడురా బాబూ!' అని గొణుక్కునే రాంబాబు దగ్గరికొచ్చి 'హి.. హి..హి' అన్నాడు రామలింగం 'తెలుసు బాబూ! తవరు నన్ను 'బతకనేర్చిన వాడురా బాబూ!' అని తిట్టుకొంటున్నారని తెలుసు. మరేం చెయ్యమన్నారు  చెప్పండల్లుడుగారూ! ఇదంతా మీ మాంగారిదగ్గర్నుంచి వంటబట్టించుకొన్న విద్యేనండీ బాబూ! ఎన్నికలముందు ఇంటిగుమ్మందాకా వచ్చి మరీ ఓటుకు  ఓ ఐదొందలనోటు చొప్పున  లెక్కెట్టి  ఇచ్చిపోయారండీ ధర్మప్రభువులు! అందరం ఓట్లేసినాం. ఎన్నికల్లో గెల్చినారు సారు. మేం ఎన్నుకొన్న ప్రజాప్రతినిధేకదా.. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు కదా అని.. మా పేదోళ్లందరికీ తలా ఓ నాటుపడవైనా ఇప్పించమని ఆడగాడానికని వెళ్ళాం బాబూ! ఏం చేసారో తెలుసా మీ మాంగారు? నావలు కొనుక్కోడానికి బ్యాంకోళ్ళు ఇచ్చే అప్పుకు సిఫార్సు చేయడానికి మడిసికి ఐదువేలు చొప్పున లెక్కెటి మరీ  వసూలు చేసేసారండీ! పెద్దోళ్లకేనా మరి బతకనేర్చిన విద్యలన్నీ? పేదోళ్ళకు మాత్రం కావద్దా? మేం నేర్చుకొంటేనే తప్పయిపోతుందాండీ? ఏం చోద్యం సాగుతోందండీ లోకంలో!’ అంటూ నావను నెట్టుకొంటో వెళ్ళిపోయాడు రామలింగం.
-రచనః కర్లపాలెం హనుమంతరావు
***



Monday, August 3, 2015

వరపరీక్ష- కథ


కథ 
వరపరీక్ష 
- కర్లపాలెం హనుమంతరావు 
( విపుల మాసపత్రికలో ప్రచురితం ) 

దమయంతి-పేరు ఎంత అందంగా ఉంటుందో.. మనిషీ అంతే అందంగా ఉంటుంది. బీఫార్మసీ చదువుకొంది. ఎమ్ ఫార్మసీ కూడా చేయాలనుకొందికానీ.. 'కోర్సు పూర్తయ్యేదాకా వెయిట్ చేయలేను. నా రిటైర్మెంటు అయేలోపు నిన్నో అయ్యచేతిలో పెడితేనే నాకు మనశ్శాంతి' అన్నాడు తండ్రి విశాఖరావు. తండ్రిమాటే ఆ యింట్లో చివరిమాట. ఆ సంగతి చిన్నతనంనుంచి దయయంతికి తెలుసు కనకనే ఎదురు చెప్పలేదు.

పెళ్ళిచూపులకు వస్తున్న ఆరో పెళ్ళికొడుకు సుబ్బారావు. హైదరాబాదులో ఏదో సాఫ్టువేరు ఉద్యోగం. తల్లినీ, మేనమామను తీసుకొని చూడ్డానికి వచ్చాడా ఆదివారం.

ఫార్మాలిటీసన్నీ పూర్తయ్యాక దమయంతి వచ్చి కూర్చుంది. ఈ కాలంలో ఎవరూ
'ఒకసారి లేచి నిలబడు!.. పాటలు పాడటం వచ్చా?.. వంట బాగా చేస్తావా?' లాంటి మరీ పాతకాలం ప్రశ్నలు అడక్కపోయినా.. పిల్లను నఖశిఖపర్యంతం శల్యపరీక్ష చేయడం మాత్రం ఏదో ఒక విధంగా సాగుతూనే ఉంది. సంప్రదాయాలను మధ్యతరగతి జీవులు అంత తొందరగా వదిలించుకొంటాయా?!

అటూ ఇటూ కాస్సేపు మాటా మంతీ అయిన తరువాత 'వెళ్ళి కబురు చేస్తాం.. ఏ సంగతీను' అంటూ లేచారు మగపెళ్ళివారు.

అప్పుడు చెప్పింది దమయంతి తన మనసులోని మాట తల్లిదండ్రులతో. 

'బాగుండదేమోనే!' అని ఒక వంక తల్లి గునుస్తున్నా.. 'వాళ్లకి అభ్యంతరం లేకపోతే మనకు మాత్రం  అభ్యంతరం ఎందుకుండాలి? చూద్దాం..' అంటూ విషయం పెళ్ళికొడుకు మేనమామ చెవిలో వేసాడు తండ్రి విశాఖరావు.
'పెద్దవాళ్లం మనం ఎన్ని మాట్లాడుకొన్నా.. పిల్లల మనసుల్లో ఏవేవో ఆలోచనలు ఉంటాయి. కాలం అలా ఉంది. కానివ్వండి! మరో పది నిమిషాలు కూర్చుంటాం' అన్నాడు ఆ మేనమామ.

మేడమీద దమయంతి గదిలోనే సమావేశం ఏర్పాటయింది. పెద్దవాళ్లముందు బిడియంగా కూర్చున్న దమయంతి సుబ్బారావుముందు కాస్త స్వేచ్ఛగానే  మాట్లాడింది. 'మీ మామయ్యగారికి ఆడపిల్లలు లేరా?'
సుబ్బారావుకి అర్థమయింది. 'ఉన్నారు. మేనరికాలు చేసుకోవడం నాకే ఇష్టం లేదు.' అన్నాడు సుబ్బారావు.
అభినందనపూర్వకంగా చూసింది దమయంతి. 'కాలేజీలోగానీ.. ఆఫీసులోగానీ.. క్లోజ్ ఫ్రెండ్స్?'
'యూ మీన్.. గార్ల్ ఫ్రెండ్స్? ఉన్నారు. కానీ ఫ్రెండ్షిప్ వరకే పరిమితం. లిమిట్లో ఉండటం అమ్మ నేర్పింది. అమ్మకు కష్టం కలిగించే పని చేయడం నాకిష్టం ఉండదు మేడమ్!' అన్నాడు సుబ్బారావు కాస్త దృఢంగా.

'మా అమ్మ నన్ను కార్తికమాసంలో చన్నీళ్ల స్నానంచేసి గుడిచుట్టూ పొర్లుదండాలు పెట్టమని పోరుతుంటుందండీ! దణ్నాలు పెట్టుకోవడం వరకూ ఓకేనేగానీ.. మరీ అలా తడిబట్టలతో పబ్లిగ్గా పొర్లుదణ్ణాలంటే.. నో వే.. అమ్మకాదుగదా.. బ్రహ్మదేవుడొచ్చి చెప్పినా నేను చేయలేను సార్!' అంది దమయంతి.

సుబ్బారావుకి అందులో తప్పు పట్టాల్సిందేమీ కనిపించలేదు.
'మనకు నష్టం.. కష్టం కలిగించేటట్లుంటే.. ఎవరు చెప్పినా వినాల్సిన పనేం లేదులేండి. మా అమ్మకు జనరల్ బుక్స్ చదవడం ఇష్టం ఉండదు. ఆ బుక్స్ చదివితేనేగదా మన మనసులు విశాలమయేది? అలాగని  ఆమెకు నచ్చచెప్పే వయసా నాది? టెక్స్టుబుక్కులో చందమామ దాచిపెట్టి చదువుతుండేవాణ్ణి చిన్నతనంలో. పెద్దాళ్లని హర్టు చేయకుండా ఉంటే  చాలన్నది ఒక్కటే నా ఉద్దేశం' అన్నాడు సుబ్బారావు.

కొద్దిగా ఉడుక్కున్నట్లుంది అతని మొహం. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటేతప్ప కొత్తవాళ్లదగ్గర ఎవరూ అలా బైటపటరు. దమయంతికి ముచ్చటనిపించింది.

తలుపుదగ్గర అలికిడికి అటు తిరిగి చూసారిద్దరూ. తల్లి కాఫీకప్పులతో గుమ్మందగ్గర నిలబడి ఉంది. అందుకోవడానికి గుమ్మందగ్గరికి వెళ్ళిన కూతురితో 'ఇంకెంత సేపే? వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బాగుండదు. కాఫీలు తాగి కిందకు 
వచ్చేయండి!' అని హచ్చరించి పోయింది తల్లి.

విన్నట్లున్నాడు .. లేచి నిలబడ్డాడు సుబ్బారావు. 'కాఫీలు కింద తాగుదాం.. పదండి!' అన్నాడు కప్పు అందుకొంటూ.

'ఒన్ మినిట్' అంటూ దమయంతి బీరువా తలుపుతీసి ఓ కవరు బయటకు తీసి సుబ్బారావు చేతిలో పెట్టి అంది 'కాస్త దీన్ని మీరు హైద్రాబాదులో పోస్టు చేస్తారా? ఇక్కడ చేయద్దు! మర్చిపోకుండా రేపే చేయండి.. ప్లీజ్!'

'వై నాట్?' అని కవరందుకొన్నాడు సుబ్బారావు. కవరుమీద 'ఎ.నాగరాజు, 6342/ఎ, అరండల్ పేట, గుంటూరు-20' అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ లేదు!

 'ఎవరీ నాగరాజు? కవరింతగా బరువుగా ఉందేంటీ? ఏముంది ఇందులో? ఫ్రం అడ్రసు లేదెందుకు? గుంటూరు చిరునామా ఉన్నా గుంటూరులో పోస్టు చేయద్దా? ముక్కూ మొగం తెలీని తనకు ఈ కవరు పోస్టుచేసే పని అప్పచెప్పడంలో ఆంతర్యమేమన్నా ఉందా?  అడిగితే బాగుంటుందా? బాగుండదా? అన్నీ సందేహాలే సుబ్బారావు మనసులో.

హైదరాబాదు వచ్చిన రోజునే ఆ కవర్ ని  పోస్టు చేసాడు యథాతథంగా సుబ్బారావు.

దమయంతి సంబంధం తల్లికీ నచ్చడంతో సుబ్బారావుకి ప్రాణం లేచివచ్చింది.
'పిల్లవాళ్లది మంచి కుటుంబం. తండ్రి చేసే యూనివర్శిటీలో విచారాణ చేయించాను. ఏ సమస్యలూ లేవు. అక్కమాత్రం మొదటి కాన్పు కష్టమై చనిపోయిందట. ఆ అమ్మాయి చదువుకొన్న కాలేజీలో కూడా బుద్ధిమంతురాలేనని చెప్పారు. మనం ముందుకు పోవచ్చు' అని మేనమామ నివేదిక అందించిన తరువాత 'ముహుర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం.. చెప్పండం'టూ కబురు చేసింది సుబ్బారావు తల్లి.

ఆ మాఘమాసంలోనే సుబ్బారావు ఒకింటివాడు అయిపోయాడు. 

మొదటి నిద్రలకని అత్తవారింటికి వెళ్ళిన రోజు సాయంత్రంపూట దమయంతి సుబ్బారావుని దగ్గర్లో ఉన్న రామాలయానికి తీసుకువెళ్ళింది.

అర్చనచేసే పూజారి చిన్నవయసువాడు. దమయంతిని చూసి ఇంతకుముందే పరిచయం ఉన్నవాడికి మల్లే చిరునవ్వుతో పలకరించాడు.

'తరచూ ఈ గుడికి వస్తుంటావనుకొంటా!' అనడిగాడు పూజాదికాలు అయిపోయి  ఆలయం మంటపంలో కూర్చున్న తరువాత సుబ్బారావు.

'ఈ పూజారబ్బాయి మా అక్క ఇంటర్ క్లాస్-మేట్. ఫ్లూట్ బాగా వాయిస్తాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అక్కకు చదువు పిచ్చి. సబ్జెక్టుల్లో డౌట్ ఉన్నప్పుడల్లా క్లియర్ చేసుకొనేందుకు గుడికి వస్తుండేది. నేనూ తోకలాగా తనవెంటబడదాన్ని.   అదీ నా పరిచయం నాగరాజుతో' అంది దమయంతి నవ్వుతూ.

నాగరాజు పేరు వినంగానే పెళ్ళిచూపులప్పుడు దమయంతి తనకు అందించిన కవరు గుర్తుకొచ్చించి సుబ్బారావుకు. 'ఆ నాగరాజేనా ఈ నాగరాజు?' అనడిగాడు కవరు సంగరి గుర్తుచేసి.

'బాగానే గుర్తుందే మీకూ?!' అంది దమయంతి అదోరకంగా తమాషాగా నవ్వుతూ.

'ఎట్లా మర్చిపోతాను తల్లీ! అవునూ.. రెండు వీధుల దూరంలో ఉన్న ఈ నాగరాజుకి హైదరాబాదునుంచి ఉత్తరం పోస్టు చేయమనడమేమిటి?! అర్థంకాక చచ్చాను అప్పట్లో! ఇప్పటికైనా ఆ మిస్టరీ విప్పుతారా రాణీగారూ!' అన్నాడు సుబ్బారావు తనూ హాస్యరసం కొద్దిగా గొంతులో రంగరించి.

'అంతగా అర్థంగాక ఇబ్బంది పడేబదులు.. కొద్దిగా కవరు ఓపెన్ చేసి చూసేస్తే మిస్టరీ మొత్తం విడిపోయేదిగా మాస్టారూ!' అంది దమయంతి అంతే సరదాగా.

'చ.. చ! మా అమ్మ నాకు అట్లాంటి దొంగబుద్ధులు నేర్పలేదు' అన్నాడు సుబ్బారావు బుంగమూతి పెట్టి.

సుబ్బారావును ఆ ఫోజులో చూసినప్పుడల్లా దమయంతికి భలే సరదాగా ఉంటుంది. ఇంకా తమాషా చేయాలనిపిస్తుంది.
'అమ్మకొంగుచాటు అబ్బాయిగారూ! కవరు ఓపెన్ చేసి చూడకపోతే కాబోయే భార్య రహస్యాలు తెలిసేదెలా?'

'అవంత రహస్యాలే అయితే ఆ కాబోయే శ్రీమతిగారు ఆ కవరు నా చేతికి ఎందుకిస్తార్లెండి! మా శ్రీమతిగారికి ఆ మాత్రం మతిలేదని అప్పుడూ అనిపించలేదు. ఇప్పుడూ అనిపించడం లేదుగానీ .. అసలు విషయం చెప్పేయచ్చుగా చచ్చు తెలుగుసినిమాలా సాగదీసి చంపకపోతే!' అన్నాడు సుబ్బారావు.

 'అది చెప్పడానికేనండీ బాబూ ఈ పూట గుడివంకతో మిమ్మల్నిక్కడిదాకా తీసుకువచ్చింది.' అంటూ హ్యాండుబ్యాగులోనుంచి ఓ కవరు తీసి సుబ్బారావు చేతిలో ఉంచింది దమయంతి.

అదారోజు హైదరాబాదులో తను పోస్టు చేసిన కవరే! కవరుమీద ఆబిడ్స్ జి.పి.ఓ మొహర్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈమె చేతికి ఎలా వచ్చింది?!

'నాగరాజే నాకు తిరిగి ఇచ్చాడు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి! అందుకే మీకిచ్చింది.'అంది దమయంతి.

'నో.. నో! అదంతా ఏం వద్దుగానీ.. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు దమయంతీ! చాలు' అన్నాదు సుబ్బారావు.

దమయంతి కాస్త సుదీర్ఘంగానే సమాదానం ఇచ్చింది.

'అందరూ అనుకుంటున్నట్లు మా అక్క కాన్పు కష్టమై చనిపోలేదు. మా బావ చంపేసాడు దాన్ని అనుమానంతో. అక్కకూ నాగరాజుకూ  లింకుందని ఎవడో పనికిమాలిన కుంక ఆకాశరామన్న ఉత్తరం అఘోరిస్తే దాన్ని పట్టుకొని రోజూ అక్కని వేపుకు తిన్నాడు ఆ దుర్మార్గుడు.  ఇదొక రోజు ఏడుస్తూ ఇంటికొస్తే అమ్మానాన్నానే నచ్చచెప్పి వెనక్కి పంపించారు. దీనికి నెల తప్పినప్పటినుంచి వాడి సాడిజం మరీ పెరిగిపోయిందిట. పెళ్ళినాటికి ఇదింకా ఇంటర్లో అన్ని పేపర్లూ క్లియర్ చెయ్యలేదు. సబ్జెక్టుల్లో డౌట్లు తీర్చుకోవాటానికని గుడికి నాగరాజు దగ్గరకు వస్తుండేది. నిజం నిర్థారించుకోకుండా.. ఈ గుడి మండపంలో కూర్చుని సబ్జెక్టు డిస్కస్ చేసుకొనే టైంలో చాటుగా వచ్చి ఇద్దరిమీదా యాసిడ్ పోసి పారిపోయాడు బావ. అప్పటికిది నిండుగర్భిణీ.తొంభై శాతం వళ్ళు కాలి వారంరోజులు ఆసుపత్రిలో అల్లాడి కన్నుమూసింది. నాకు ఎక్కడ పెళ్ళికాదోనన్న భయంతో దాన్ని డెలివరీ టైం యాక్సిడెంటుగా మార్పించారు అమ్మానాన్న.' దమయంతికి ఏడుపును కంట్రోలు చేసుకోవడం కష్టంగా ఉంది.

'కూల్ డౌన్ .. దమయంతీ.. కూల్ డౌన్!' అన్నాడు సుబ్బారావు.

ఎప్పుడొచ్చి కూర్చున్నాడో నాగరాజు మిగతా కథ పూర్తిచేసాడు.

'అప్పట్నుంచీ దమయంతికి పెళ్ళంటే భయం. మగాళ్లంటే మంట. అసలు పెళ్లే వద్దని పటుపట్టుకు కూర్చుంటే తనని ఒప్పించడానికి మేం పడ్డతిప్పలు అన్నీ ఇన్నీ కావు సుబ్బారావుగారూ! ఈ కవరు ఐడియా నాదే! పెళ్ళిచూపులకని వచ్చినవాళ్ల చేతిలో  నా పేరు ఉన్న కవరొకటి పెట్టి పోస్టు చేయమని చెబుతుండేది.. ఇంట్లోవాళ్లకి తెలియకుండా. ఇప్పటిదాకా ఐదు సంబంధాలు వచ్చాయి.అందులో ఇద్దరు పెళ్ళికొడుకులు అసలు కవర్లే పోస్టు చేయలేదు. దమయంతిని  వాళ్ళే వద్దనుకొన్నారు. ఒకడు ఓపెన్ చేసి చూసి మళ్ళీ అంటించి పోస్టు చేసాడు. అంటే అనుమానం ఉన్నట్లేగదా! వాడిని ఈమె వద్దనుకొంది. ఇంకోడైతే ఓపెన్ చేసి చూడ్డమేకాదు.. పెద్ద అల్లరే చేసాడు. వాడిని అందరం వద్దనుకొన్నాం.

'ఈయనే ఏం చేయకుండా.. ఏం చూడకుండా బుద్దిగా కవరు పోస్టు చేసింది'అంది దుఃఖంనుంచి తేరుకొని  చిన్నగా మందహాసం చేస్తూ దమయంతి.

'అలాంటి బుద్ధిమంతుణ్ణేగా నువ్వు కావాలని కోరుకొన్నదీ!' అన్నాడు నాగరాజుకుడా చిన్నగా నవ్వుతూ.

'మావారు మరీ అంత బుద్ధిమంతులేంకాదులే నాగరాజూ! కవరు ఓపెన్ చేసి చూడకపోతేనేం.. అందులో ఏముందోనని మధన పడ్డారా లేదా!'అంది దమయంతి నిందాపూర్వకంగా.

బిక్కమొగమేసాడు సుబ్బారావు. ఫక్కుమని నవ్వొచ్చింది దమయంతికి.
భర్తవంక సీరియస్ గా చూస్తూ 'సార్! కవరిప్పుడు మీ చేతుల్లోనే ఉందిగా! ఓపెన్ చేయండి! ఏమనుకోనులే' అంది.

సుబ్బరాజు కవరు ఓపెన్ చేయకుండానే పరపరా చింపి నాగరాజు చేతిలో పెట్టి దమయంతి చెయ్యిపట్టుకొని బైటికొచ్చేసాడు.

'మీ లాంటి సహచరుడు దొరకడం నిజంగా నా అదృష్టం. మనసులు విప్పి మాట్లాడుకోవాల్సిన మొదటి రాత్రి ఇది. మీ మనసులో ఆ కాస్త మధనకూడా ఉండకూదదనే మిమ్మల్నిలా  రామాలయానికి తీసుకువచ్చి జరిగిందంతా చెప్పింది. సీతమ్మతల్లిని అంతలా క్షోభ పెటిన రాములవారంటే నిజానికి నాకంత భక్తికూడా లేదు ' అంది దమయంతి  ఆ రాత్రి భర్త ఎదమీద సేదతీరే సమయంలో.

'తప్పు కళ్ళు పోతాయి. రాముడు ఇంకా చాలా  వేరే కారణాలవల్ల దేముడు' అన్నాడు సుబ్బారావు భార్యను మరింత దగ్గరికి తీసుకొంటూ.

'ఏమో ! నాకు మాత్రం మీరే దేముడు' అని కళ్ళు మూసేసుకొంది దమయంతి.
***
-కర్లపాలెం హనుమంతరావు
(విపుల మాసపత్రికలో ప్రచురితం)


Friday, July 31, 2015

దిష్టిబొమ్మల వ్యాపారం- సరదా గల్పిక

ఉడయవర్లు పదిహేనేళ్ల కిందట అందరు కుర్రాళ్లకు మల్లేనే రెండు కంప్యూటర్ భాషలు టకటక నేర్చేసుకొని అమెరికా ఎగిరెళ్ళినవాడే! రోజులు బావోలేక రెండేళ్ల కిందటే ఇండియా తిరిగొచ్చేసాడు. ఇక్కడు పరిస్థితులు అప్పట్లో అంతకన్నా అర్థ్వానంగా ఏడ్చాయ్! స్వఛ్చందపదవీవిరమణ వంకతో చాలా కంపెనీలు బలవంతంగా ఉద్యోగుల్ని పీకేస్తున్నాయి. కొత్తగా వచ్చే కొద్ది ఉద్యోగాల్లో పెద్దతలల రద్దీనే ఎక్కువగా ఉంది. బాగా నడిచే బ్యాంకులూ ఉన్నట్లుండి బోర్డులు తిప్పేయడటంవల్ల అందులో పనిచేసే ఉద్యోగులూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి. వరస కరువులవల్ల పల్లెల్లో పనులక్కరువు. వృత్తిపని చేసుకొందామన్నా పెద్ద కంపెనీల వత్తిడి పెద్ద అవరోధంగా మారింది. బహుళజాతి కంపెనీల బహుకృతవేషాలముందు బక్కజాతి మనిషుల కళ ఎక్కడెక్కి వస్తుంది?! ఉన్న కాసిని ఉద్యోగాలీ సర్కార్లు ఔట్ సోర్సింగులకే సంతర్పణ చేస్తున్నదని తిట్టుకుంటూ కూర్చోలేదు ఉడయవర్లు. బిల్ గేట్ సు పీల్చి వదిలిని గాలిని మూడేళ్ళు పీల్చి వచ్చిన మల్లుడు ఉడయవర్లు. బ్యాంకులోనుకి దరఖాస్తు చేసాడు. ప్రోజెక్టు రిపోర్టు చూసి డైరక్టర్లకు మతిపోయింది. రోజుకు రెండుకోట్ల టర్నోవరు! పదిరోజుల్లో బ్రేక్ ఈవెన్. వరల్డ్ వైడ్ మార్కెటింగు! పోటీతంటాలేని వ్యాపారం! ‘వెయ్యిశాతం లాభం గ్యారంటీ!’ అంటున్నాడు ఉడయవర్లు! వినడానికి గిరీశం దంచే లెక్చర్లాగే ఉన్నా.. ఎకనామిక్సన్నీ మినిమమ్ రిస్కే చూపిస్తున్నాయి! ‘ఎండుగడ్డీ.. పాతగుడ్డలూ.. కర్రముక్కల్తో ఇదంతా సాధ్యమా!’ గుడ్లు తిప్పుతూ అడిగాడు బోర్డాఫ్ డైరక్టర్సు హెడ్డు. ‘ఇప్పటికే ఈ బిజినెస్ లో బిజీగా ఉన్నాను సార్! మిమ్మల్నేమీ మోసం చేసేందుకు రాలేదు. ఇరాక్ నుంచి ఆర్డర్సొచ్చి ఉన్నాయ్. చూడండి! అమెరికాకీ మన సరుకే కావాలి!అదీ అర్జంటుగా! బ్రిటన్నుంచి బొలీవియా వరకూ అందరికీ తొందరే! వెంట వెంటనే కావాలని వత్తిడి ఎక్కువైనందువల్లనే పెట్టుబడికోసం మిమ్మల్నాశ్రయించాల్సి వచ్చిందిగానీ.. విదేశీమారకద్రవ్యం వరదలా వచ్చిపడే మా ప్రాజెక్టుల్లో మేజర్ వాటాకోసం పెద్ద కంపెనీలే పోట్లాడుకొంటున్నాయ్! చెమట నాది.. సెంటు వాళ్లదవుతుందని నేనే సందేహిస్తున్నా’ అన్నాడు ఉడయవర్లు. ఉక్కిరి బిక్కిరయిపోయారు బ్యాంకు డైరక్టర్లందరూ! ఒక బొజ్జాయనకు మాత్రం ఇంకా అనుమానం పీకుతూనే ఉంది ‘అయితే మాత్రం చెత్తగడ్డికీ.. పాత గుడ్డపేలికలకీ .. పాతిక కోట్లా?!’ ‘పోనీ.. కుండపెంకులక్కూడా కలిపి ఇప్పించండి సార్!.. అవీ కావాల్సినవే దిష్తిబొమ్మల తయారీకి!’ ‘ఓ సారి ఓటికుండల ప్రదర్శన చేబడితే కోటి కుండపెంకులకుప్ప పోగవుతుంది. వాటినీ కొనాలా?!’ ఉద్యోగస్తుల తరుఫున బోర్డులో కూర్చున్న సభ్యుడు ఆయన. ‘పెంకులు ఏరడానికైనా మ్యాన్ పవర్ కావాలిగా సార్! ఎంత హైటెక్కైనా కంప్యూటర్లెళ్ళి పెంకులు ఏరలేవుగా! పోనీ.. పెయింట్ డబ్బాలకైనా డబ్బివ్వండి! బొగ్గు ముక్కలకిచ్చినా ఫర్వా నై!’ ‘ దిష్టిబొమ్మక్కట్టిన కర్రెలాగూ కాలుతుందిగా! బైప్రొడక్టుగా బొగ్గదే బోలెడంత దొరుకుతుందిలేవయా!’ ఉడయవర్లుకు విషయం అర్థమయింది. ఒంటివేలు చూపించి బైటికొచ్చాడు. డైరెక్టుగా మేనేజింగు డైరెక్టురుకే ఫోన్! శౌచాలయంలోనుంచే వ్యవహారాలన్నీ చక్కబడ్డాయి. ‘డిపాజిటర్ల డబ్బులయ్యా ఇవి. కమీషన్లు పుచ్చుకొని లోన్లిచ్చే బాడీ కాదు మనది.’ అంటూ రుసరుసలాడుటూ బైటికెళ్ళిపోయాడు ఉద్యోగస్తుల తరుఫు సభ్యుడు. అప్పుడు లోపలికొచ్చాడు ఉడయవర్లు. ‘కొత్త రకం ప్రాజెక్టు. కొద్దిగా రిస్కు తీసుకొని ఇస్తున్నాం లోను. మాకు మాటరాకుండా చూసుకునే పూచీ నీదే!’ అంటూ పాతిక కోట్ల అప్పుకు సమ్మతి తెలిపింది మిగతా బాడీ! *** ‘ఇంకో పాతిక కోట్లైనా ఇచ్చేదేగానీ.. ఈ లోపలే బ్యాంకు చతికిలబడింది.’ అన్నాడు ఉడయవర్లు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేకరితో కులాసాగా. ‘దిష్టిబొమ్మలు తయారుచేసే ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా తట్టింది సార్ మొదట్లో?’ అనడిగాడు విలేకరి. ‘అమెరికానుంచి తిరిగొచ్చిన రోజున విమానాశ్రయంలో పిల్లలు క్రికెట్ ఆటగాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెట్టడం చూసాను. రామలీలా మైదానంలో ఎప్పుడో దసరాకోసారి జరిగే సరదా ఈ దేశంలో ప్రతీరోజూ ఏదో ఓ మూల జరుగుతూనే ఉంటుందని వార్తలు చూసేవాళ్ళెవరికైనా తేలిగ్గా అర్థమవుతుంది. పాడెలు కట్టడం, కుండలు పగలగొట్టడం, జెండాలు తగలెట్టడం పాతకాలంనాటి మూటు నిరసనలు దిష్టిబొమ్మలు తగలెట్టడం లేటెస్టు ట్రెండు! అప్పట్లో గోద్రా గోల.. అయోధ్య అల్లర్లు.. ఎన్నికల కొట్లాటలు.. ఉద్యోగుల నిరసనలు.. విద్యార్థుల ఉద్రేకాలు.. పార్టీల ప్రొటెస్టులు.. కస్టడీ లాకప్ డెత్తులు,. ఎన్ కౌంటర్లకు కౌంటర్ ర్యాలీలు, ఉగ్రవాదులమీద ఆగ్రహాలు, మహిళామణుల ఆందోళనలు, మతమార్పిడి ఉద్రిక్తతలు, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాలు, అతివాదులు దాడుల నేపథ్యంలో ప్రతిదాడుల హడావుళ్ళు.. ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా ఇక్కడ దిష్టిబొమ్మల తగలెడితేనే తంతంగం పూర్తయినట్లు లెక్క. మాది కొండపల్లి. బొమ్మలు చేసి అమ్మేవృత్తి అనుభవం ఉంది. ముందు కొద్ది పెట్టుబడితో పని మొదలుపెట్టా. ఇంతలో ఇరాక్ వార్ వచ్చిపడింది. వరల్డు వైడుగా దిష్టిబొమ్మలకు డిమాండు పెరిగింది. బుష్ దిష్టిబొమ్మలకున్నంత గిరాకీ అప్పట్లో మరి దేనికీ ఉండేది కాదు. తొగాడియా బొమ్మలక్కూడా తెగ గిరాకీగానే ఉండేదిక్కడ. మధ్య మధ్యలో ముష్రాఫ్.. షరీఫు సరేసరి! సమయ సందర్భాల్నిబట్టి లోకల్ లీడర్లకూ ఆర్డర్లొస్తుంటాయ్! ఈ మధ్య ప్రభుత్వాలుకూడా దిష్టిబొమ్మలు తగలేయిసున్నాయ్ .. చూస్తున్నారుగా!’ ‘ఆర్డర్లన్నీ మీకే ఎందుకొస్తున్నట్లు?!’ ‘మా దిష్టిబొమ్మలకు ఆకారాలేగాని.. పోలికలు ఉండవు. సందర్బాన్నిబట్టి అదే మోదీ.. అదే సొనియా! అదే చంద్రబాబు.. అదే జగన్ బాబు! ఒక దిష్టిబొమ్మకొంటే నల్లజండా ఉచితం. పాడెలు డిస్కౌంట్లులో కట్టి ఇస్తాం. వీలును బట్టి వాటినే వాలుకుర్చీలు.. వీలుకుర్చిలుగాకూడా మార్చుకోవచ్చు. ఆటల్లో ఓడితే పడుకోబెట్టి తగలేయడానికి, గెలిస్తే కూర్చోబెట్టి ఊరేగించడానికి ఒకే బొమ్మ ఉపయోగించుకోవచ్చు. కాలం మారుతోంది సార్! మన ఆలోచనల్లోకూడా మార్పు రావాలి.
అప్పుడే విజయం. మా నాయన కొండపల్లి బొమ్మలు మాకు రెండుపూటలా తిండి పెట్టలేకపోయాయి. దిష్టిబొమ్మలు చేస్తూ నేనిప్పుడు కోట్లాదిమందికి తిండి పెడుతున్నాను.’ ‘అది సరే! మీకు లోనిచ్చిన బ్యాంకు మునిగింది కదా! పాతరుణం తీర్చి పనిచేసే ఉద్యోగులకు, నమ్మి మదుపు చేసిన కాతాదారులకూ మీ వంతు సహకారం అందిచవచ్చుకదా?’ ‘దిష్టిబొమ్మలు చవకగా ఇచ్చి నా వంతు సహకారం అందిస్తూనే ఉన్నానండీ! బ్యాంకు డైరక్టర్లో ఒకాయనకు అనాథశరణాలయం ఉంది. అది సేకరించే పాతగుడ్డలను కొనే షరతుమీద నాకు రుణమిచ్చారు. కుండపెంకులు కావాల్సి వచ్చినప్పుడల్లా ఖాళీ కుండల ప్రదర్శన ఏర్పాటు చేసే శ్రామికనేత డైరక్టరు ఇంకొకరు. వాళ్లవంతు లాభాల్లో కొంతైనా కడితే మిగతా కంతులు నేను కట్టడానికి సిద్ధం. రుణం సొమ్ము నాకు బిర్యానీలో ఎముకముక్క. ‘బ్యాంకు మూసివేతకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నాలుగురోజులీ నిరసనలు ఇలాగే కొనసాగితే నాలుగు దిష్టిబొమ్మలు అదనంగా అమ్ముకోవచ్చన్న దురాలోచన మీదని మీమీద అభియోగం?’ ‘దురాలోచనా లేదు. దూరాలోచనా లేదు. లోను పూర్తిగా కడితే మా ఉద్యోగులు సమ్మె కడతారు.ముందు వాళ్ల జీతాలు పెంచాలని ఆందోళన చేస్తారు. ఆనక నా దిష్టిబొమ్మలు తగలెడతారు. ఆ నష్టం ఎవరచ్చుకొంటారన్నా’ అన్నాడు ఉడయవర్లు చల్లంగా నవ్వుతూ. -కర్లపాలెం హనుమంతరావు 
**** (*) ****

(వాకిలి- అంతర్జాల మాస పత్రిక- 'లాఫింగ్ గ్యాస్'-ఆగష్టు 2015లో ప్రచురితం)


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...