Monday, August 3, 2015

వరపరీక్ష- కథ


కథ 
వరపరీక్ష 
- కర్లపాలెం హనుమంతరావు 
( విపుల మాసపత్రికలో ప్రచురితం ) 

దమయంతి-పేరు ఎంత అందంగా ఉంటుందో.. మనిషీ అంతే అందంగా ఉంటుంది. బీఫార్మసీ చదువుకొంది. ఎమ్ ఫార్మసీ కూడా చేయాలనుకొందికానీ.. 'కోర్సు పూర్తయ్యేదాకా వెయిట్ చేయలేను. నా రిటైర్మెంటు అయేలోపు నిన్నో అయ్యచేతిలో పెడితేనే నాకు మనశ్శాంతి' అన్నాడు తండ్రి విశాఖరావు. తండ్రిమాటే ఆ యింట్లో చివరిమాట. ఆ సంగతి చిన్నతనంనుంచి దయయంతికి తెలుసు కనకనే ఎదురు చెప్పలేదు.

పెళ్ళిచూపులకు వస్తున్న ఆరో పెళ్ళికొడుకు సుబ్బారావు. హైదరాబాదులో ఏదో సాఫ్టువేరు ఉద్యోగం. తల్లినీ, మేనమామను తీసుకొని చూడ్డానికి వచ్చాడా ఆదివారం.

ఫార్మాలిటీసన్నీ పూర్తయ్యాక దమయంతి వచ్చి కూర్చుంది. ఈ కాలంలో ఎవరూ
'ఒకసారి లేచి నిలబడు!.. పాటలు పాడటం వచ్చా?.. వంట బాగా చేస్తావా?' లాంటి మరీ పాతకాలం ప్రశ్నలు అడక్కపోయినా.. పిల్లను నఖశిఖపర్యంతం శల్యపరీక్ష చేయడం మాత్రం ఏదో ఒక విధంగా సాగుతూనే ఉంది. సంప్రదాయాలను మధ్యతరగతి జీవులు అంత తొందరగా వదిలించుకొంటాయా?!

అటూ ఇటూ కాస్సేపు మాటా మంతీ అయిన తరువాత 'వెళ్ళి కబురు చేస్తాం.. ఏ సంగతీను' అంటూ లేచారు మగపెళ్ళివారు.

అప్పుడు చెప్పింది దమయంతి తన మనసులోని మాట తల్లిదండ్రులతో. 

'బాగుండదేమోనే!' అని ఒక వంక తల్లి గునుస్తున్నా.. 'వాళ్లకి అభ్యంతరం లేకపోతే మనకు మాత్రం  అభ్యంతరం ఎందుకుండాలి? చూద్దాం..' అంటూ విషయం పెళ్ళికొడుకు మేనమామ చెవిలో వేసాడు తండ్రి విశాఖరావు.
'పెద్దవాళ్లం మనం ఎన్ని మాట్లాడుకొన్నా.. పిల్లల మనసుల్లో ఏవేవో ఆలోచనలు ఉంటాయి. కాలం అలా ఉంది. కానివ్వండి! మరో పది నిమిషాలు కూర్చుంటాం' అన్నాడు ఆ మేనమామ.

మేడమీద దమయంతి గదిలోనే సమావేశం ఏర్పాటయింది. పెద్దవాళ్లముందు బిడియంగా కూర్చున్న దమయంతి సుబ్బారావుముందు కాస్త స్వేచ్ఛగానే  మాట్లాడింది. 'మీ మామయ్యగారికి ఆడపిల్లలు లేరా?'
సుబ్బారావుకి అర్థమయింది. 'ఉన్నారు. మేనరికాలు చేసుకోవడం నాకే ఇష్టం లేదు.' అన్నాడు సుబ్బారావు.
అభినందనపూర్వకంగా చూసింది దమయంతి. 'కాలేజీలోగానీ.. ఆఫీసులోగానీ.. క్లోజ్ ఫ్రెండ్స్?'
'యూ మీన్.. గార్ల్ ఫ్రెండ్స్? ఉన్నారు. కానీ ఫ్రెండ్షిప్ వరకే పరిమితం. లిమిట్లో ఉండటం అమ్మ నేర్పింది. అమ్మకు కష్టం కలిగించే పని చేయడం నాకిష్టం ఉండదు మేడమ్!' అన్నాడు సుబ్బారావు కాస్త దృఢంగా.

'మా అమ్మ నన్ను కార్తికమాసంలో చన్నీళ్ల స్నానంచేసి గుడిచుట్టూ పొర్లుదండాలు పెట్టమని పోరుతుంటుందండీ! దణ్నాలు పెట్టుకోవడం వరకూ ఓకేనేగానీ.. మరీ అలా తడిబట్టలతో పబ్లిగ్గా పొర్లుదణ్ణాలంటే.. నో వే.. అమ్మకాదుగదా.. బ్రహ్మదేవుడొచ్చి చెప్పినా నేను చేయలేను సార్!' అంది దమయంతి.

సుబ్బారావుకి అందులో తప్పు పట్టాల్సిందేమీ కనిపించలేదు.
'మనకు నష్టం.. కష్టం కలిగించేటట్లుంటే.. ఎవరు చెప్పినా వినాల్సిన పనేం లేదులేండి. మా అమ్మకు జనరల్ బుక్స్ చదవడం ఇష్టం ఉండదు. ఆ బుక్స్ చదివితేనేగదా మన మనసులు విశాలమయేది? అలాగని  ఆమెకు నచ్చచెప్పే వయసా నాది? టెక్స్టుబుక్కులో చందమామ దాచిపెట్టి చదువుతుండేవాణ్ణి చిన్నతనంలో. పెద్దాళ్లని హర్టు చేయకుండా ఉంటే  చాలన్నది ఒక్కటే నా ఉద్దేశం' అన్నాడు సుబ్బారావు.

కొద్దిగా ఉడుక్కున్నట్లుంది అతని మొహం. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటేతప్ప కొత్తవాళ్లదగ్గర ఎవరూ అలా బైటపటరు. దమయంతికి ముచ్చటనిపించింది.

తలుపుదగ్గర అలికిడికి అటు తిరిగి చూసారిద్దరూ. తల్లి కాఫీకప్పులతో గుమ్మందగ్గర నిలబడి ఉంది. అందుకోవడానికి గుమ్మందగ్గరికి వెళ్ళిన కూతురితో 'ఇంకెంత సేపే? వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బాగుండదు. కాఫీలు తాగి కిందకు 
వచ్చేయండి!' అని హచ్చరించి పోయింది తల్లి.

విన్నట్లున్నాడు .. లేచి నిలబడ్డాడు సుబ్బారావు. 'కాఫీలు కింద తాగుదాం.. పదండి!' అన్నాడు కప్పు అందుకొంటూ.

'ఒన్ మినిట్' అంటూ దమయంతి బీరువా తలుపుతీసి ఓ కవరు బయటకు తీసి సుబ్బారావు చేతిలో పెట్టి అంది 'కాస్త దీన్ని మీరు హైద్రాబాదులో పోస్టు చేస్తారా? ఇక్కడ చేయద్దు! మర్చిపోకుండా రేపే చేయండి.. ప్లీజ్!'

'వై నాట్?' అని కవరందుకొన్నాడు సుబ్బారావు. కవరుమీద 'ఎ.నాగరాజు, 6342/ఎ, అరండల్ పేట, గుంటూరు-20' అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ లేదు!

 'ఎవరీ నాగరాజు? కవరింతగా బరువుగా ఉందేంటీ? ఏముంది ఇందులో? ఫ్రం అడ్రసు లేదెందుకు? గుంటూరు చిరునామా ఉన్నా గుంటూరులో పోస్టు చేయద్దా? ముక్కూ మొగం తెలీని తనకు ఈ కవరు పోస్టుచేసే పని అప్పచెప్పడంలో ఆంతర్యమేమన్నా ఉందా?  అడిగితే బాగుంటుందా? బాగుండదా? అన్నీ సందేహాలే సుబ్బారావు మనసులో.

హైదరాబాదు వచ్చిన రోజునే ఆ కవర్ ని  పోస్టు చేసాడు యథాతథంగా సుబ్బారావు.

దమయంతి సంబంధం తల్లికీ నచ్చడంతో సుబ్బారావుకి ప్రాణం లేచివచ్చింది.
'పిల్లవాళ్లది మంచి కుటుంబం. తండ్రి చేసే యూనివర్శిటీలో విచారాణ చేయించాను. ఏ సమస్యలూ లేవు. అక్కమాత్రం మొదటి కాన్పు కష్టమై చనిపోయిందట. ఆ అమ్మాయి చదువుకొన్న కాలేజీలో కూడా బుద్ధిమంతురాలేనని చెప్పారు. మనం ముందుకు పోవచ్చు' అని మేనమామ నివేదిక అందించిన తరువాత 'ముహుర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం.. చెప్పండం'టూ కబురు చేసింది సుబ్బారావు తల్లి.

ఆ మాఘమాసంలోనే సుబ్బారావు ఒకింటివాడు అయిపోయాడు. 

మొదటి నిద్రలకని అత్తవారింటికి వెళ్ళిన రోజు సాయంత్రంపూట దమయంతి సుబ్బారావుని దగ్గర్లో ఉన్న రామాలయానికి తీసుకువెళ్ళింది.

అర్చనచేసే పూజారి చిన్నవయసువాడు. దమయంతిని చూసి ఇంతకుముందే పరిచయం ఉన్నవాడికి మల్లే చిరునవ్వుతో పలకరించాడు.

'తరచూ ఈ గుడికి వస్తుంటావనుకొంటా!' అనడిగాడు పూజాదికాలు అయిపోయి  ఆలయం మంటపంలో కూర్చున్న తరువాత సుబ్బారావు.

'ఈ పూజారబ్బాయి మా అక్క ఇంటర్ క్లాస్-మేట్. ఫ్లూట్ బాగా వాయిస్తాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అక్కకు చదువు పిచ్చి. సబ్జెక్టుల్లో డౌట్ ఉన్నప్పుడల్లా క్లియర్ చేసుకొనేందుకు గుడికి వస్తుండేది. నేనూ తోకలాగా తనవెంటబడదాన్ని.   అదీ నా పరిచయం నాగరాజుతో' అంది దమయంతి నవ్వుతూ.

నాగరాజు పేరు వినంగానే పెళ్ళిచూపులప్పుడు దమయంతి తనకు అందించిన కవరు గుర్తుకొచ్చించి సుబ్బారావుకు. 'ఆ నాగరాజేనా ఈ నాగరాజు?' అనడిగాడు కవరు సంగరి గుర్తుచేసి.

'బాగానే గుర్తుందే మీకూ?!' అంది దమయంతి అదోరకంగా తమాషాగా నవ్వుతూ.

'ఎట్లా మర్చిపోతాను తల్లీ! అవునూ.. రెండు వీధుల దూరంలో ఉన్న ఈ నాగరాజుకి హైదరాబాదునుంచి ఉత్తరం పోస్టు చేయమనడమేమిటి?! అర్థంకాక చచ్చాను అప్పట్లో! ఇప్పటికైనా ఆ మిస్టరీ విప్పుతారా రాణీగారూ!' అన్నాడు సుబ్బారావు తనూ హాస్యరసం కొద్దిగా గొంతులో రంగరించి.

'అంతగా అర్థంగాక ఇబ్బంది పడేబదులు.. కొద్దిగా కవరు ఓపెన్ చేసి చూసేస్తే మిస్టరీ మొత్తం విడిపోయేదిగా మాస్టారూ!' అంది దమయంతి అంతే సరదాగా.

'చ.. చ! మా అమ్మ నాకు అట్లాంటి దొంగబుద్ధులు నేర్పలేదు' అన్నాడు సుబ్బారావు బుంగమూతి పెట్టి.

సుబ్బారావును ఆ ఫోజులో చూసినప్పుడల్లా దమయంతికి భలే సరదాగా ఉంటుంది. ఇంకా తమాషా చేయాలనిపిస్తుంది.
'అమ్మకొంగుచాటు అబ్బాయిగారూ! కవరు ఓపెన్ చేసి చూడకపోతే కాబోయే భార్య రహస్యాలు తెలిసేదెలా?'

'అవంత రహస్యాలే అయితే ఆ కాబోయే శ్రీమతిగారు ఆ కవరు నా చేతికి ఎందుకిస్తార్లెండి! మా శ్రీమతిగారికి ఆ మాత్రం మతిలేదని అప్పుడూ అనిపించలేదు. ఇప్పుడూ అనిపించడం లేదుగానీ .. అసలు విషయం చెప్పేయచ్చుగా చచ్చు తెలుగుసినిమాలా సాగదీసి చంపకపోతే!' అన్నాడు సుబ్బారావు.

 'అది చెప్పడానికేనండీ బాబూ ఈ పూట గుడివంకతో మిమ్మల్నిక్కడిదాకా తీసుకువచ్చింది.' అంటూ హ్యాండుబ్యాగులోనుంచి ఓ కవరు తీసి సుబ్బారావు చేతిలో ఉంచింది దమయంతి.

అదారోజు హైదరాబాదులో తను పోస్టు చేసిన కవరే! కవరుమీద ఆబిడ్స్ జి.పి.ఓ మొహర్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈమె చేతికి ఎలా వచ్చింది?!

'నాగరాజే నాకు తిరిగి ఇచ్చాడు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి! అందుకే మీకిచ్చింది.'అంది దమయంతి.

'నో.. నో! అదంతా ఏం వద్దుగానీ.. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు దమయంతీ! చాలు' అన్నాదు సుబ్బారావు.

దమయంతి కాస్త సుదీర్ఘంగానే సమాదానం ఇచ్చింది.

'అందరూ అనుకుంటున్నట్లు మా అక్క కాన్పు కష్టమై చనిపోలేదు. మా బావ చంపేసాడు దాన్ని అనుమానంతో. అక్కకూ నాగరాజుకూ  లింకుందని ఎవడో పనికిమాలిన కుంక ఆకాశరామన్న ఉత్తరం అఘోరిస్తే దాన్ని పట్టుకొని రోజూ అక్కని వేపుకు తిన్నాడు ఆ దుర్మార్గుడు.  ఇదొక రోజు ఏడుస్తూ ఇంటికొస్తే అమ్మానాన్నానే నచ్చచెప్పి వెనక్కి పంపించారు. దీనికి నెల తప్పినప్పటినుంచి వాడి సాడిజం మరీ పెరిగిపోయిందిట. పెళ్ళినాటికి ఇదింకా ఇంటర్లో అన్ని పేపర్లూ క్లియర్ చెయ్యలేదు. సబ్జెక్టుల్లో డౌట్లు తీర్చుకోవాటానికని గుడికి నాగరాజు దగ్గరకు వస్తుండేది. నిజం నిర్థారించుకోకుండా.. ఈ గుడి మండపంలో కూర్చుని సబ్జెక్టు డిస్కస్ చేసుకొనే టైంలో చాటుగా వచ్చి ఇద్దరిమీదా యాసిడ్ పోసి పారిపోయాడు బావ. అప్పటికిది నిండుగర్భిణీ.తొంభై శాతం వళ్ళు కాలి వారంరోజులు ఆసుపత్రిలో అల్లాడి కన్నుమూసింది. నాకు ఎక్కడ పెళ్ళికాదోనన్న భయంతో దాన్ని డెలివరీ టైం యాక్సిడెంటుగా మార్పించారు అమ్మానాన్న.' దమయంతికి ఏడుపును కంట్రోలు చేసుకోవడం కష్టంగా ఉంది.

'కూల్ డౌన్ .. దమయంతీ.. కూల్ డౌన్!' అన్నాడు సుబ్బారావు.

ఎప్పుడొచ్చి కూర్చున్నాడో నాగరాజు మిగతా కథ పూర్తిచేసాడు.

'అప్పట్నుంచీ దమయంతికి పెళ్ళంటే భయం. మగాళ్లంటే మంట. అసలు పెళ్లే వద్దని పటుపట్టుకు కూర్చుంటే తనని ఒప్పించడానికి మేం పడ్డతిప్పలు అన్నీ ఇన్నీ కావు సుబ్బారావుగారూ! ఈ కవరు ఐడియా నాదే! పెళ్ళిచూపులకని వచ్చినవాళ్ల చేతిలో  నా పేరు ఉన్న కవరొకటి పెట్టి పోస్టు చేయమని చెబుతుండేది.. ఇంట్లోవాళ్లకి తెలియకుండా. ఇప్పటిదాకా ఐదు సంబంధాలు వచ్చాయి.అందులో ఇద్దరు పెళ్ళికొడుకులు అసలు కవర్లే పోస్టు చేయలేదు. దమయంతిని  వాళ్ళే వద్దనుకొన్నారు. ఒకడు ఓపెన్ చేసి చూసి మళ్ళీ అంటించి పోస్టు చేసాడు. అంటే అనుమానం ఉన్నట్లేగదా! వాడిని ఈమె వద్దనుకొంది. ఇంకోడైతే ఓపెన్ చేసి చూడ్డమేకాదు.. పెద్ద అల్లరే చేసాడు. వాడిని అందరం వద్దనుకొన్నాం.

'ఈయనే ఏం చేయకుండా.. ఏం చూడకుండా బుద్దిగా కవరు పోస్టు చేసింది'అంది దుఃఖంనుంచి తేరుకొని  చిన్నగా మందహాసం చేస్తూ దమయంతి.

'అలాంటి బుద్ధిమంతుణ్ణేగా నువ్వు కావాలని కోరుకొన్నదీ!' అన్నాడు నాగరాజుకుడా చిన్నగా నవ్వుతూ.

'మావారు మరీ అంత బుద్ధిమంతులేంకాదులే నాగరాజూ! కవరు ఓపెన్ చేసి చూడకపోతేనేం.. అందులో ఏముందోనని మధన పడ్డారా లేదా!'అంది దమయంతి నిందాపూర్వకంగా.

బిక్కమొగమేసాడు సుబ్బారావు. ఫక్కుమని నవ్వొచ్చింది దమయంతికి.
భర్తవంక సీరియస్ గా చూస్తూ 'సార్! కవరిప్పుడు మీ చేతుల్లోనే ఉందిగా! ఓపెన్ చేయండి! ఏమనుకోనులే' అంది.

సుబ్బరాజు కవరు ఓపెన్ చేయకుండానే పరపరా చింపి నాగరాజు చేతిలో పెట్టి దమయంతి చెయ్యిపట్టుకొని బైటికొచ్చేసాడు.

'మీ లాంటి సహచరుడు దొరకడం నిజంగా నా అదృష్టం. మనసులు విప్పి మాట్లాడుకోవాల్సిన మొదటి రాత్రి ఇది. మీ మనసులో ఆ కాస్త మధనకూడా ఉండకూదదనే మిమ్మల్నిలా  రామాలయానికి తీసుకువచ్చి జరిగిందంతా చెప్పింది. సీతమ్మతల్లిని అంతలా క్షోభ పెటిన రాములవారంటే నిజానికి నాకంత భక్తికూడా లేదు ' అంది దమయంతి  ఆ రాత్రి భర్త ఎదమీద సేదతీరే సమయంలో.

'తప్పు కళ్ళు పోతాయి. రాముడు ఇంకా చాలా  వేరే కారణాలవల్ల దేముడు' అన్నాడు సుబ్బారావు భార్యను మరింత దగ్గరికి తీసుకొంటూ.

'ఏమో ! నాకు మాత్రం మీరే దేముడు' అని కళ్ళు మూసేసుకొంది దమయంతి.
***
-కర్లపాలెం హనుమంతరావు
(విపుల మాసపత్రికలో ప్రచురితం)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...