Wednesday, August 12, 2015

నమస్కారం!- ఓ సరదా గల్పిక

'నమస్తే'లోనే ఉంది సమస్తమంతా.
నమస్తే అంటే తల లేని వాళ్ళ వ్యవహారం కింద  వెటకారం కొంతమందికి. బతకడం చేత రాక చేతుల్ని తిట్టిపోయడమే అదంతా. జాలి పడాలి.
తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవంత కార్యలాభం కలగ లేదు భారతంలో. అదే  ఆలస్యంగా వచ్చీ నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన అర్జునుడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహం లాభించింది. నిండు సభామధ్యంలో ఇలా దండకం  చదివీ చదవంగానే  ఆయనగారి అర్థాంగికీ అదే లాభం.  కృష్ణ పరమాత్ముడి అండ దొరికింది. దండాలా మజాకా?
రామాయణంలో మాత్రం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అలా అంజలి ఘటించి నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకైనా  దక్కని అపురూప గౌరవం ఆంజనేయుడికి దక్కింది. ఉన్న ఒక్క తొండంతోనే  చేతనైనంత వరకూ దాసోహ  పడి  ఆపదల నుంచి గట్టెక్కింది  గడుసు గజేంద్రం.
ఆ చాయలో పోయే ఇప్పుడు మన పక్క రాష్ట్రం పన్నీరు సెల్వం సారూ అమ్మవారి అనుగ్రహం కొట్టేసారు. ఆమెగారు సర్కారువారి సత్కార గృహానికి వేంచేసినప్పుడల్లా తిరిగొచ్చే వరకు ఈయనగారే ముఖ్యమంత్రి పీఠానికి  కుక్క కాపలా! ఆ సత్కార్యం  లభించడానికి  ప్రణామ తంత్రమే  ముఖ్య కారణమంటే  కాదనగలరా!
స్వామివారు కంట బడ్డప్పుడు స్వాభిమానలేవీ పెట్టుకోకుండా 'నమో నమః' అంటూ సాష్టాంగాలు పడక పోతే అష్ట కష్టాలు తప్పవు. యడ్యూరప్ప కథే అందుకు గొప్ప  ఉదాహరణ. పది తలకాయలున్నాయి.. ఏం ప్రయోజనం? ఉన్న రెండు చేతుల్నీ వేళకి సద్వినియోగం చేసుకోవడం రాక   అంత లావు రావణాసురుడూ   రాముడి ముందు  తేలిపోయాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుళ్ళ పతనానికి  ముఖ్య కారణం  ఈ దాసోహ రాజకీయాలు  వంటబట్టక పోవడం కాదూ!
రాక్షసులకు  తెలియని నమస్కార రాజకీయాలు మన రాజకీయ నాయకులు కాచి వడబోసారు.
కడుపులో ఎంత కంటు ఐనా ఉండనీయండి.. బైట ఓదార్పుయాత్ర కంటూ బైలుదేరాక   దేవుడిచ్చిన రెండు చేతులూ  అలా ఓర్పుగా గోజుతో అతికించినట్లు కరిపించుకునే ఉంటాడు జగన్.  జైలుకి పోతూ వస్తూ   అయన గారి బృందం పడే ఆ పాట్లు  చూస్తూ కూడా ఇంకా  అంజలి మాహాత్మ్యంమీద అపనమ్మకమా?
షడ్రషోపచారాల్లో ముఖ్యమైనది. తైత్తరీయం సైతం ప్రస్తావించినదీ  నమస్కారం.
దండాలన్నీ ఒకేలా ఉండవండీ!  చంద్రబాబుగారిది  విభిన్నమైన శైలి. చేతులకు బదులు వేళ్లను వడుపుగా వాడటం ఆయన విధానం. మారిన రాజకీయంల్లో మనం మాత్రం ఏం చేస్తాం? ఎన్నికైన నేత వేళ్ళకు బదులు  గోళ్ళు  చూపించినా అదే  గోల్డెన్ హ్యాండు కింద సర్దుకోవాల్సుంది..
నేతలకీ నమస్కారాలకీ అసలింత లింకెందుకో తెలుసా? ప్రణామాలకి  హామీలు, వాగ్దానాలకు మాదిరిగా  కాలపరిమితి బెడద లేదు. నగదు బదిలీ.. రుణమాఫీలకు మల్లే   ఈ ప్రజాకర్షక పథకానికి మూటా ముల్లెలతో పని లేదు.  ఏ ఎన్నికల సంఘం  అదుపూ.. అజమాయిషీ ల్లేకుండా హాయిగా  ఓపికున్నంత వరకు వాడి వదిలేసే సౌకర్యం ఈ చేతుల  జోడింపులో ఉన్నంతగా మరి దేన్లోనూ లేదు.

మొన్నటి ఎన్నికల్లో నరేంద్ర మోడీజీకి కలిసొచ్చిన అంశాల్లో ఆయన గారి హ్రస్వ నామధేయం ఒకటి. పేరులోనే 'నమో' ఉన్న గడుసు పిండం గదా ఆయన. ఓ వంక చెడ తిట్టి పోస్తూనే మరోవంక 'నమో..నమో' అంటూ  మోదీ నామస్మరణ చెయ్యక తప్పని దుస్థితి పాపం చేతిగుర్తు బృందానిది. ఆ  ప్రభావం ఎన్నికల్లో కనిపించిందా.. లేదా?
పబ్లిగ్గా ఎంత పడ తిట్టిపోసుకున్నా మనిషి కంటబడ్డప్పుడు ఏ సంకోచమూ లేకుండా 'నమస్తే' ముద్ర  అభినస్తే చాలు.. సగం చిక్కులు అవే సర్దుకుంటాయి. ప్రధాని పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో సార్క్ దేశాధిపతులంతా మూకుమ్మడిగా  కలసి వచ్చిసాధించిందేమిటీ?  ఎవరి బాణీలో వారు  నమస్కార బాణాలు సంధించుకోవడం. ఆ తరువాతనే కదా సంధి రాజకీయాలు రసకందాయంలో పడింది!
జపాను పోనీ.. చైనా పోనీ.. అమెరికాతో సహా ఏ గడ్డమీదైనా  కాలు మోపనీ.. చేతుల్నే ప్రధానంగా నమ్ముకున్నారు కనకనే మన ప్రధానికంత హవా. ఒబామానైనా తప్పించుకోలేని ప్రభావం నమస్కారానిది. నమో  ప్రభంజనం  ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇంకా ప్రణామ మాహాత్మ్యంమీద అనుమానమంటే.. మిత్రమా..తమకో నమస్కారం!
ఆరోగ్యాన్నిచ్చి, బంధు కృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడనే గదా  సూర్యుణ్ణి భగవంతుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో పొద్దునా సాయంత్రం పడీ పడీ  నమస్కారాలు చేస్తున్నాం! మరి  అర్హతలతో నిమిత్తం లేకుండా  అందలం ఎక్కించి పది  మందిలో గుర్తింపు తెచ్చి పెట్టే  ప్రణామ యోగానికి 'లోకబాంధవ' గౌరవం ఇస్తే తప్పేమిటి? నోబెలు పురస్కారాలే ఎవరెవరికో వస్తున్నాయి గదా ఇవాళా రేపూ?
ఎక్కడో  ఉన్న సూర్యనారాయణుడి శక్తికే  నిత్యం నమస్కారాలు సమర్పిస్తున్న మనం  అర్హతలతో నిమిత్తం లేకుండా వెధవాయలని సైతం  అధికార పదవులకు  సదా చేరువులో  ఉంచే  చేతుల ఇంద్రజాలాన్ని  మరెంతగా మన్నించాలి?
అదృష్టం. ఏ అరబ్బుల దేశంలోనో  పుట్టుంటే  ఖర్మ కాలి ఏ ఒసామా బిన్ లాడెన్నో కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకోవాల్సి వచ్చేది. 'దేవుడానన్నీ 'నమస్తే'ల ఖండంలో పుట్టించినందుకు శతకోటి నమస్కారాలు! రాం రాం, నారాయణ నారాయణ, జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- ఆహా.. ఎన్నేసి రకాల నమస్కారాలు   మన సంస్కృతిలో!
-కర్లపాలెం హనుమంత రావు
(ఈనాడు- సంపాదకీయ పుటలో ప్రచురితం)


...

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...