Saturday, August 8, 2015

ఏడువారాల నగలు- ఓ సరదా గల్పిక

‘ఆ అమెరికా యూనివర్సిటీవాళ్ళకు పనీ పాటా లేదాఏంటీ 'ఆదివారం ది బెస్ట్' అని తేల్చుకోవడానికి అంతచేటు అంతర్జాలం మధించాలా? మన దేశంలో చంటోణ్నడిగినా చటుక్కున చెబుతాడే.. 'సండేని మించిన గ్రాండ్ డే భూమండలంమీద ఎంత గాలించినా కానరాదని!’
‘అవునన్నా! ఆదివారం అంటే కడువునిండా భోజనం.. కంటినిండా నిద్ర.. టీవీ నిండా మూవీలే! ఆడవాళ్లకుతప్ప ట్రాఫిక్ పోలీసుల్తో సహా ఆదివారం అంటే అందరికీ అందుకే అంత అభిమానదినం సోదరా!’
'ఆహా! అందుకేనా భాయ్.. ఆ డిసెంబరు ఆదివారంపూట అంతమందిని అమాంతం మింగిన  సునామీ పుట్టుకొచ్చిందీ!  సోమవారం షేర్ మార్కెట్లకు మహా హుషార్ అంటారే! మరి 'బ్లాక్ మండే' సంగతి మనం మర్చిపోతే ఎట్లా? చంద్రమండలంమీద మనిషి మొదటిసారి కాలుపెట్టింది ‘సోమ’వారంనాడు కూడా కాదే! మరా సోమవారాన్ని  ‘చంద్ర’దినం అని ఎవరనమన్నారంట?’
'సర్వేలయ్యా సర్వేలు'
 ‘హూఁ.. సర్వే గణాంకాల్లో సగంశాతం నిర్దుష్టంగా  ఉండవని ఈ మధ్య ఓ సర్వే- గణాంకాలతో సహా తేల్చిపారేసిందోయ్ సర్వేశ్వర్రావ్! ‘మంగళవారం  ప్రయాణాలకు మినహా.. మిగతా సర్వ మహత్తర కార్యాలకూ ప్రశస్తమైన ముహూర్తం’ అంటున్నాయిగదా మీ బిత్తిరి పంచాంగాలు! మరి ప్రపంచం బిత్తరపోయేట్లు  వరల్డ్ ట్రేడ్ సెంటరు కుప్పకూలింది మంగళవారంనాడే కదా మహానుభావా!’
‘మరీ ప్రద్దాన్నీ దద్దమ్మకిందలా కొట్టిపారేయకు మిత్రమా! బుధవారం పరమ చెత్తరోజని పంచాగాల థీరీ. ముంబయిమీద దాడులు జరిగిందీ,   ఇందిరమ్మ మహాతల్లి యమర్జెస్నీ  మొదలయిందీ బుధవారాలనాడే! మరో మూడేళ్లకు ఇంకో మహాప్రళయమొచ్చి మనందరికీ మూడుతుందంటున్నది ఆల్విన్ టోప్ఫ్లెర్ ఫ్యూచర్ షాక్. బాగా చూసుకో ఇంటర్నెట్లో! ఆ రోజుకూడా బుధవారమే అవబోతోంది! ప్రిడిక్షన్ థీరీనా మజాకానా!’
‘అబ్బో! బహుదొడ్డ థియరీ! గురువారం పొగతాగడం మానేసేందుకు  మహామంచిరోజా! శుక్రవారంనాడు నిర్ణయించుకొన్నాసరే  మీ పంచాంగం పంతులుగారి థియరీ ప్రకారం మళ్ళొచ్చే గురువారందాకా దగ్గుతూనే  తాగుతుండాలి కాబోలు.. పొగ!’
‘మరీ రెటమతంగా మాట్లాడకన్నా! మనం మాత్రం అలాంటి నమ్మకాలకేమన్నా తక్కువా? శుక్రవారంనాడు పర్సు బైటికి తీస్తామా? మంగళవారంనాడు తలక్షవరానికి తలబడితే  తలనొప్పి రావడం ఖాయమని  సిద్ధాంతులు చెబుతుళ్లా! అమెరికావాడే శుక్రవారం పేరు చెబితే ఉలికులికి పడుతున్నాడు. అందులోనూ అది ఏ పదమూడో తారీఖునో వచ్చిందంటేనా.. గొర్రె చచ్చిందన్నమాటే! ఏసుప్రభువు శిలువ ఎక్కింది పదమూడు శుక్రవారమే!’
‘మరి ఆ ఏసుప్రభువు తిరిగొచ్చిందికూడా శుక్రవారమే గదా సోదరా! 'గుడ్ ఫ్రై డే'అనికూడా పండుగ చేసుకొంటాం!’
‘నువ్ ప్రద్దానికీ ఇలాగే బుకాయిస్తావ్ గానీ.. మన దేవుళ్లకు మాత్రం మంచి రోజులు.. చెడ్డ రోజులు లేవంటావా? శివయ్యకి సోమ  బుధవారాలు, ఆంజనేయుడికి మంగళవారం, సాయిబాబాకి గురువారం, లక్ష్మీదేవికి శుక్రవారం, వేంకటేశ్వరుడికి శనివారం..’
‘.. సూర్యభగవానుడికి ఆదివారం.. చంద్రభగవానుడికి సోమవారం..  బృహస్పతికి బుధవారం.. గురుగ్రహానికి గురువారం.. శుక్ర శని గ్రహాలకు శుక్ర శని వారాలు.. ఇష్టంట! ఆ రోజు పూజా పునస్కారాలు చేయకపోతే ఆ గ్రహాలకు ఆగ్రహం అంట! మరి శనివారాలు పిల్లలు పుట్టేందుకు మంచిరోజనీ.. ఆ రోజు పుట్టినవాళ్లలోనే  ప్రధానమంత్రులైనవాళ్ళు  ఎక్కువమందున్నట్లుకూడా తేలిందే! అలాంటి సర్వేలనుగురించి భాయీ  నేను పట్టించుకోవద్దని మొత్తుకొనేది! చాదస్తం ఎక్కువైతే గంటల పంచాంగంకూడా నిమిషానికోసారి చూడబుద్ధవుతుంది. నమ్మకాల కాళ్ళు భూమ్మీద నిలబడకపోతేనే మూఢనమ్మకాలుగా మారి కాల్చుకుతినేది! తాగుబోతుకి దీపస్తంభంలాగా! వెలుగుకోసం కాదు..  తూలిపడిపోకుండా పట్టుకొడంకోసం లైటుస్తంభం ఉందని మందుబాబులు మనసావాచా నమ్మినట్లుగా!’
‘ఇంతకీ నువ్వనేదేందో సూటిగా బైటపెట్టేయరాదా సోదరా!
‘మంచిరోజు చూడకుండా చెడ్డపనికూడా చెయ్యలేని బలహీనతని వదులుకోమంటున్నా! మనకు పనికిరాని అమావాస్య పక్కరాష్ట్రం తమిళనాడులో పరమ పవిత్రమైన రోజు. గ్లోబుమీది అన్ని దేశాల్లో ఆదివారాలు ఒకేసారి రావు. 'రోజు' అనేది కాలమనే దేవుడు మనకి పరగడుపునే  సంతకం చేసిచ్చిన  బ్లాంక్  బాంక్ చెక్కు. వాడుకొనే తీరును బట్టి దాని విలువ. ప్రతివాడికీ తొమ్మిది దినాల్లో ఒకటి అనుకూలంగానే ఉంటుందని  'లస్టర్ ఆఫ్ వెటర్నిటీ' ఆరో ఛాప్టరులో ఉంది తెలుసా! ఘనాదేశస్థులు  పుట్టినరోజు పేరునే బిడ్డకు పెట్టుకొంటారు.మంచిదా.. చెడ్డదా అని చూసుకోరు.  అంటార్కిటికాలో ఏడాది ఒక్క రోజునే సూర్యోదయం. సెప్టెంబరు 21వ.  అది ఆదివారమయినా.. అమావాస్య అయినా.. వాళ్లకి పరమానందం కలిగించే దినమేగదా! 'భగవన్నిమిత్తమైన అన్ని దినాలూ సుదినాలే' అనలేదా  మన చిలకమర్తి నరసింహంగారు! పనిచేసేవాడికి ఏ రోజూ పనికి మాలినది కాదు. వారంలోని ఏడువారాలు సృష్టి మనకిచ్చిన ఏడువారాల నగలు భాయీ!'
'నిజమే సోదరా! ఇప్పుడు చెప్పేవాళ్ళు తగ్గి  మర్చిపోయాంగానీ.. చిన్నప్పుటి మన  తెలుగువాచకాల్లో ఒక మంచిపాట ఉండేది. 'ఆదివారంనాడు అరటి మొలచింది/ సోమవారంనాడు సుడి వేసి పెరిగింది/ మంగళవారంనాడు మారాకు తొడిగింది/ బుధవారంనాడు పొట్టిగెల వేసింది/ గురువారంనాదు గుబురులో దాగింది/ శుక్రవారంనాడు చూడగా పండింది/ శనివారంనాడు చకచకా గెలకోసి/  అందరికి పంచితిమి అరటిపొత్తములు' అని పాట. అందరికీ పంచే అరటి పొత్తాలు అందుకోవాలంటే వారంలోని ఏడురోజులూ ఆ అరటిచెట్టులా ఎదుగుతూనే ఉండాలని గదా! సరే! నేను వస్తానన్నా!’
‘ఎక్కడికిరా?’
‘శనివారంకదా అని పనికి పాలుమాలా. అత్యవసరంగా ఒక దస్త్రం పరిష్కరించాల్సి ఉంది. ఒక పెద్దాయన పాపం.. పింఛనుకోసం వారం వర్జ్యాలుకూడా చూసుకోకుండా నా టేబుల్ చుట్టూ ప్రదక్షిణాలు చెస్తున్నాడు'
'భళా! ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు సోదరా!'
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సెప్టెంబరు 6 నాటి సంపాదక పుటలో ప్రచురితం)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...