తెలుగువాడు పాలిటిక్సులో ఎంత చురుకో.. పాకశాస్త్రంలో
అంతకన్నా చురుకు. తింటే గారలే తినాలనుకొనే రకం. నలుడికి, భీముడుకి నవగాయ పిండివంటలు నేర్పిన ఘటం
తెలుగువాడే! పంచదారకన్న పాలమీగడకన్న జుంటితేనియకన్న జున్నుముక్కకన్న వెన్నకన్న దోరమాగిన
మామిడికన్న తెలుగు తియ్యగా ఉంటుదంటూ భాషాభిమానాన్ని సైతం పాకపరిభాషలో వెలిబుచ్చడం
ఒక్క తెలుగువాడికే చెల్లింది. గొల్లపిల్లల వేళ్ళ సందుల్లోని మాగాయపచ్చడి పసందును
రుచిచూపించిన పోతన మన తెలుగువాడే! కప్పురపు విడియాన్ని గురించి ఏ మాత్రం బిడియపడకుండా కవిసార్వభౌముడు అంత గొప్పగా
చెప్పగలిగాడంటే కారణం శ్రీనాథుడి డి. ఏన్. ఏ లో
అచ్చమైన ఆంధ్రత్వం ఇమిడి ఉండబట్టే!
'భరతఖండంబు చక్కటి పాడియావు' అన్న ఐడియా చిలకమర్తివారి బుర్రకి తట్టేందుకు దోహదబడిందీ ఆ యుగవైతాళికుడి కుదురులో
పాదుకొన్న తెలుగుదనమేనని వేరేగా చెప్పాలా!
'చిక్కటి పాలమీది మిసమిసలాడే
మీగడ పంచదారలో అద్దుకు తిన్నట్లు
రామామృతరసాన్ని దాస్యమనే దోసిలిపట్టి జుర్రుకొంటా'నంటాడు భక్తరామదాసు. కంచర్ల గోపన్నకు అంత భక్తిపారవశ్యంలో సైతం కంచంలోపడే
పదార్థాలనుంచి దృష్టిమళ్లకపోయ! తెలుగువాడి తిండియావకు ఇంతకుమించిన మంచి
దృష్టాంతమేముంటుంది?
అలంకారాల్లో 'ఉప్మా'లంకారం..
పండగల్లో 'అట్ల'తదియ తెలుగువాడి ప్రత్యేకతలు. బిడ్డ దుర్ముహూర్తంలో పుడితే
మేనమామ గారెలదండ మెళ్లోవేస్తేగాని
బైటిప్రపంచాన్ని చూడనీయని సంప్రదాయం తెలుగువాడిది. బందరు లడ్డు, కానాడ కాజా, హైదరాబాదు
బిర్యానీ అంటూ ఊరుకో తినుపాకం పేరు పెట్టేసుకొని మురిసిపోయే తిండితత్వం
తెలుగువాడిది. కాకి-రొట్టె, పిల్లులు పంచుకొన్న రొట్టెల్లాంటి తినుబండారాలున్న కథలనేకదా చిన్నతనంబట్టి
మనం పిల్లలకు పట్టుబట్టి మరీ నేర్పేది! 'తిండిగలిగితె కండ కలదోయ్!/ కండకలవాడేను మనిషోయ్' అంటూ
మన గురజాడ అప్పారావుగారుకూడా తిండిగోలతోనే తెలుగుజాతిని తట్టిలేపే ప్రయాస పడ్డారు.
'రొట్టెముక్కా.. అరటితొక్కా' దేన్నీ
పక్కన పెద్దని సుద్దులు చెప్పలేదూ మన మహాకవి శ్రీ శ్రీ రుక్కుల్లో! పరమానందంనుంచి.. పరమాన్నంవరకు దేన్నీ వదలకుండా పద్యాల్లో
ఇరికించారు తెలుగు కవులు. 'పీత్వా పీత్వా పునఃపీత్వా స్వర్గలోకమ్ అవాప్నుయేత్' అంటూ
కాఫీదండకాలు చేసిన కవులకు తెలుగునేలమీద కొదవ లేదు.
తెలుగువాడు వట్టి అల్ప సంతోషి. గట్టిచట్నీ గంటెడు ఎక్కువేసి రెండిడ్లీ వేడిగా ప్లేట్లో పెట్టిస్తే..
గుండెకాయనైనా కోసేసి దోసిట్లో పెట్టేసే
తిండియావ మనవాడిది. పుల్లగోంగూర పేరు వింటేనే చాలు.. వళ్ళు పులకరించే బోళాతనం తెలుగువాడిది కాక మరెవరిది! తెలుగువాడిది ఫికిల్ మైండు అన్నమాటలో నిజం ఎంతుందో తెలీదుగానీ.. 'పికిల్' మైండు అన్నమాటలో మాత్రం నూరుపాళ్ళు నిజం
ఉంది. పిల్లలు అమెరికా వెళుతుంటే ఏ పచ్చళ్ళు ప్యాక్ చేయించి ఇవ్వాలా అని తెలుగుతల్లి
తల్లడిల్లిపోతుంది. సాఫ్టువేరు అంటే ఇప్పుడు వచ్చిందికానీ.. తెలుగువాడికి
అంతర్జాతీయంగా మొదట్లో పేరు తెచ్చిందిమాత్రం ఊరగాయ పచ్చళ్లే సుమండీ! మన గుత్తొంకాయకూరమీద ఇంతవరకు ఎవరూ పరిశోధనలు చేసి
డాక్టరేటు కొట్టకపోవడం ఎంతో వింతగొలిపే విచిత్రం! ఉల్లి చేసిన మేలు తల్లికూడా
చేయదని తెలుగువాడు నమ్మినంతగా మరెవ్వడూ నమ్మడు.
కరివేపాకును కూడా వదిలిపెట్టని రకం మనం. 'తినగ తినగ వేము తీయగనుండు' అనుకొంటూ వేపాకునూ నములుతుంటాం.
'మాయాబజారు' చిత్రంమీద మనకీనాటికీ తగని మోజెందుకో తెలుసాండీ!
పెళ్ళివారికని వండివార్చిన వంటకాలన్నింటినీ ఘటోత్కచుడు వంటింట్లో చేరి ఓ వరసలో
గుటకాయస్వాహా చేస్తాడు చూడండి! ఆ సీను చూసి కడుపునిండినంత సంబరపడిపోతాం కనకే! ఆ
'వివాహ భోజనంబు'లోని అనుపాకాల జాబితా విని 'ఆహాహా.. ఏమి రుచి!' అంటూ
లొట్టలేయకపోతే అది తెలుగు అభిరుచే కాదు!
పెళ్ళిని పప్పన్నంగా చెప్పుకొని మురిసేది ప్రపంచంమొత్తంమిద ఒక్క తెలుగు
జాతే! అప్పు
చేసైనా సరే.. పప్పుకూడు తినడం తెలుగువాడికి తప్పు కానే కాదు. తిండి ఊసు లేకుండా
మనకే పండగా పబ్బమూ ఉండదుగాక ఉండదు. ఒకప్పటి పెళ్ళిచూపుల్లో మగపెళ్ళివాళ్ళు
పెళ్ళికూతుర్ని అడిగే మొదటి ముఖమైన ప్రశ్న తిండి తిప్పల్ని గురించే! 'వంట' రాని ఆడపిల్ల సావిత్రంత
అందగత్తయిన్నా.. భానుమతంత చలాకీతనమున్నా
సంసారానికి పనికిరాదని అప్పటి పెద్దల ప్రగాఢ విశ్వాసం మరి! ఏ పాటు తప్పినా
సాపాటు తప్పదని నిద్రపాటులో కూడా నమ్మేవాడు మన తెలుగువాడు!
క్షీరసాగర మధనమప్పుడు తెలుగువాడే కనక కవ్వంచిలికే జనంలో ఉండుంటే 'ముందొక్క కప్పు కాఫీ గొంతులో పడితేగాని పని ముందుకు కదలదని మొండికేసేవాడే నిర్మొహమాటంగా. రటమతమో..
రెటమతమో.. ఆహారం దగ్గర వ్యవహారం దగరా
మొహమాటలుండరాదన్నదే మరి తెలుగువాడి మతం!
తిండిపోతు పోటీలు గనక ఒలంపిక్సులో ఉండుంటే స్వర్ణాలన్నీ తెలుగువాడి ముంగిట్లోనే
వేలాడుతుండేవి.
తెలుగురాష్ట్రాలు రెండూ 'అన్నపూర్ణమ్మతల్లి' అడ్డాలని మా చెడ్డ పేరు
అనాదినుంచి. సాగుచేసే రైతన్నకు 'అన్నదాత'న్న గొప్పగౌరవమిచ్చేది
ప్రపంచంమోత్తంమీదా ఒక్క తెలుగువాడేనండీ! గర్వపడాల్సిన విషయం కదూ! ఇప్పుడంటే ఎక్కడబడితే అక్కడ
మందుపాతర్లు బైటపడుతున్నాయ్ గానీ.. తెలుగుదేశం అంటే నిన్నమొన్నటిదాకా యావద్దేశానికీ ధాన్యం పాతరేగదా! కిలో బియ్యం
రెండు రూపాయలకిచ్చిన చరిత్ర తెలుగువాడిది!
తెలుగువాడికిమల్లే తెలుగు దేవుళ్ళూ అన్నప్రసాద ప్రియులు. తిరుపతి
లడ్డు తిరుపతి వెంకన్నకన్నా ప్రసిద్ది. రుద్రాక్షమాల తిప్పే ముముక్షువు మన తెలుగువాడయి ఉంటే 'ద్రాక్ష' పేరు
వినబడంగానే నాలిక చప్పరించకుండా ఉండలేడు.
మన తెలుగు బాలకృష్ణుడు
చేతవెన్నముద్దకోసం చేసిన అల్లరి పోతనగారి రాతలో ఎన్ని వన్నెచిన్నెలు పోయిందీ!
'ఇంతకీ ఈ తిండిగోలంతా ఇప్పుడు
దేనికండీ?' అని కదా మీ చిరాకు?
భోజనాల వేళలో ఈ తిండివేళాకోళాలేమిటోనని విసుక్కుంటున్నారనీ తెలుసు!
అయ్యా! ఓ మోస్తరు రకం బియ్యం కిలో యాభై.. నూక పలుకు పాతిక పలుకుతోందని తమరికి తెలుసా? అమ్మా! టీ, రోటీ సంగతి ఆనక! పేదోడి ఆహారం..
రోటిమీద నూరుకునే మిరప్పచ్చడి..
సరుక్కికూడా రెక్కలొచ్చేసి గాల్లో ఎగురుతున్నదని తమకు తెలీకుండా ఉంటుందా!
పిల్లకాయలు చప్పరించే పప్పు బెల్లాలుకూడా నిప్పుల్లా కాలిపోతున్నాయి. కూరగాయల దరవరల సంగతి ఇహ సరేసరి!
విడివిడిగా వివరాలు ఎందుగ్గానీ.. ఒక్క ముక్కలో చెప్పాలంటే .. నసాళానికి
అంటుతున్నాయి! చికెన్నుంచి.. చిక్కుడు
వరకు.. ధరల గేలానికి చిక్కి విలవిలాడని కాయగూర కనిపించడం లేదు. పొయ్యి
వెలిగించాలంటే ముందు జేబుకాలే తీరులో ఉంది బజారు తీరు! ఆ శ్రీకృష్ణ పరమాత్ముడుగాని ఈ కాలంలో భూమ్మీదవతరించి ఉంటే పదహారువేల గోపికలనెలా
పోషించకోవాలో తెలీక ఆపద్భాంధవుడి అవతారం అర్థాంతరంగా చాలిందుకొనుండేవాడు! 'అన్నబలమే అన్ని బలాలకు మూలమ'ని అన్నదెవరో తెలీదుగాని .. రావణాసురుడైనా
పదినోళ్ల పోషణకు లంకను ఏ ప్రపంచబ్యాంకుకో తాకట్టు పెట్టక తప్పని
పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి తెలుగు ప్రజలారా!
తలకొక్క ఊరైనా ఇస్తే చాలని పాండవులు పదే పదే కౌరవులకు కబురు పంపించారు ద్వాపరంలో గనక! అదే ఈ నకనకలకాలంలో అయితే? ఒక్క మండలం
తగ్గకుండా ధారపోసినా వెనక్కి తగ్గేది లే'దని
మొండికేయక తప్పని పరిస్థితి. రోజుకో
బండెడు అన్నం.. కూరలు.. బండిమనిషితో పాటు
పంపించమని కండిషన్ పెట్టాడుగదా బకాసురుడు భారతంలో! బండి మనుషులని ఎంతమందినైనా తేలిగ్గా తోలుకు పోవచ్చుగాని.. బండెడు భోజనం.. అంటే బాబోయ్! విరాటరాజైనా చచ్చూరుకొంటాడు.. ఈ కరువు కాలంలో అయితే! వేలుపోసినా నోట్లోకి నాలుగు వేళ్లు పోవడంలేదు మహాశయుల్లారా! పెరిగే ధరలను గురించి నిలదీస్తారన్న
భయంకొద్దీనే కాబోలు తిరుపతిగుళ్ళో సైతం దేవుడు
భక్తులకి ఒక్క క్షణానికి మించి అప్పాయింటుమెంటు ఈయడం లేదు. ఈ కరువు ఇలాగే
కొనసాగితే వెంకన్నకైనా 'శబరి' ఫలహారం
తప్పకపోవచ్చు.
సౌదీలో వేళకి చాయి అందించని బాయికి భర్త తలాక్ చెప్పినా
తప్పుకాదంట. ఇక్కడ అలాంటి వెసులుబాటు లేకపోబట్టిగానీ..
లేకపోతే సంసారాలొక్క రోజైనా సవ్యంగా
సాగుతాయా?
'పెరుగుట.. విరుగుట కొరకే! ఆ అచ్చే దినాలు
వచ్చే వరకు చకోర పక్షుల్లాగా ఎదురు
చూడ్డమే బాధ్యతగల తెలుగువాడిగా మన కర్తవ్యం' అన్న మాట తెలివిగానే ఉందిగానీ ..
అప్పటివరకు తెలుగు నడుములు విరగకుండా ఉండాలిగదా!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకీయ పుట 07-06-2009 నాటి ఈనాడు సంపాదకీయ పుటలో 'అధికస్య అధికం ఫలం' పేరుతో గల్పికగా ప్రచురితం)