Friday, December 4, 2015

కవిత్వతత్వం -సాహిత్య వ్యాసం


బమ్మెర పోతనామాత్యునికి  కావ్యకన్య 'బాల రసాలసాల నవ పల్లవ'మంత కోమలం. పింగళ సూరనకైతే కైత 'బహుతపఃఫలం'. కాళిదాసు దృష్టిలో 'మందఃకవియశః ప్రార్థీ(ఎత్తైన చెట్టు చిటారుకొమ్మనున్న పొట్టివాడికి అందని పండు). మిల్టన్ మహాశయుడికి  స్వర్లోకవాసిని. వర్డ్సువర్త్ ఊహలో 'సమస్తమైన పరిజ్ఞానానికి ప్రాణవాయువు'.  కోల్రెడ్జికి 'కళానందం'. రవీంద్రుడికి అనంతం.. శాశ్వతం. అరవిందునికి 'ఆత్మవిశ్వసందర్శనం'. ఇంతకీ  కవిత్వం అసలు తత్వం ఏమిటి?

'తత్వం' అనే మాట ఎక్కడ వినబడ్డా విషయం  కాస్త జటిలమనే అనిపిస్తుంది. కంటి ముందు కనబడుతుంది.. అంటుకుంటే తెలుస్తుంది.. ఆలోచిస్తే ఊహకి అందుతుంది శరీరం. దానికి   తత్వం అనే పదం తగిలించామా.. తంటా మొదలవుతుంది.  కవిత్వానిదీ అదే వరస.

కవిత్వం అంటే కావ్యరసం,. రాగపు వరసలు.. వగైరా వగైరా. సరే! మరి దాని తత్వం? ఆ ఆరాకు దిగామా! ఆయాసమే సుమా! 'ఐనా సరే' అనుకునే వారి కోసమే చిరుపరిచయ వ్యాస ప్రయాస.

(తత్= అది, త్వం= నీవు) తత్త్వం= అదే నీవు అని ముక్కస్య ముక్క అర్థం చెప్పుకోవచ్చు. కానీ సరిపోదు.  'శరీరం'తో జతచేస్తే స్వభావమనీ,  వేదాంతంతో జోడిస్తే పరంధామమనీ నానార్థాలు పోయే 'తత్త్వం' మరి  కవిత్వంతో జతకలిసి సాధించే పరమార్థమేంటో పెద్దల పద్యాల్లో చూద్దాము.
'కాళ్లకు గజ్జెలు, చేతికి చిడతలు, భుజంమీద తంబూరా.. మొదలు పెట్టరాదా భజన! అదిగో భగవంతుడు!' అంటే ఎలా ఉంటుందీ?
 'శ్రవణోదంచిత కర్ణికారవముతో స్వర్ణాభచేలంబుతో/
నవతంసాయిత కేకిపించములతో నంభోజధామంబుతో/
స్వవశుండై మధురాధరామృతముచే వంశమ్ము బూరించుచున్/
ఉవిదా! మాధవు డాలవెంట వనమం దొప్పారెడిన్ జూచితే' అంటే ఎలా ఉంటుందీ? చదువరి హృదయాన్నిలా రసప్లావితం చేయడమే కవిత్వ తత్వం అనుకోవాలా?

నంది తిమ్మనగారి  'పారిజాతాపహరణం;లో సత్యభామ ప్రేమకోపంతో భర్త శిరస్సును వామపాదంతో తంతుంది. ఎంత కృష్ణయ్య అయినా  కినుక తప్పదు కదా! కానీ అది ప్రకటితమైన  తీరులోనే ఉంది అసలు కవిత్వమంతా.
'నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్క బూని తా/
చిన అది నాకు మన్ననయ, చెల్వకు  నీ పదపల్లవంబు మ/
త్తనుపులకాగ్రకంటకవితానము సోకిన నొచ్చునంచు నే/
ననియెద, నల్క మానవుకదా! యికనైన నరాళ కుంతలా!'
క్రోధభావాన్నైనా ఇలా బహు కోమలంగా వెలిబుచ్చగలగడమే కవిత్వతత్వం అనుకోవాలా?

'పూతపసిండి వంటి వలపున్ బచరించుకులమ్ము నీతికిన్/
లేతకదమ్మ యిత్తెఱగు లేమ సురాంగన లెల్ల నిట్టి నీ/
సేతకు మెత్తురమ్మ, దయసేయక  తిన్నని మేము వెన్నెలన్/
వేతురటమ్మ, యింత కనువేదుఱు సెల్లునటమ్మ యింతికిన్'
అల్లసాని పెద్దనయ్య మనుచరిత్రపాదపానికి పూసిన పద్యకుసుమం ఇది.
'నీతి తప్ప వద్దు' అన్న  హితవూ ఎంత నుతిమెత్తంగా ప్రవరాఖ్యుడి నోట పలికిందో!  ఇదే సుమా  కవిత్వతత్వం మరో పార్శ్వం అనుకోవాలా?

'తమి బూదీగెల దూగుటుయ్యెలల బంతాలాడుచున్ దూగుగా/
కొమరుం బ్రాయపు గుబ్బిగుబ్బెతల యంఘ్రల్ జక్కగా జాగి మిం/
టి మొగంబై చనుదెంచుఠీవి గనుగొంటే దివ్యమౌనీంద్ర! నా/
కమృగీ నేత్రలమీద కయ్యమునకున్ గాల్చాచులా యొప్పెడి న్'(కళాపూర్ణోదయం)
నేలనుండి నింగికి  సాగే ఆడపిల్లల తూగుటూయలల సౌందర్యం.  ఇద్దరు  బ్రహ్మచారుల  ఆకాశదృష్టి కోణంనుంచి ఆ విలాసాలనన్నింటినీ  వర్ణించవలసి రావడం. కవి  ఏమాత్రం వశంతప్పినా  ఆ పరవశం అభాసుగోతిలో పడిపోవడం ఖాయం. అత్యంత సున్నితమైన సందర్భానా పింగళి సూరనార్యుడు భావాలకి రంగులద్దిన వైనం కవిత్వతత్త్వ అంతస్సార శక్తికో గొప్ప ఉదాహరణగా తీసుకోవద్దా మరి!

అనురాగం, ఆక్రోశం, ప్రణయ విరహం, ఘోర కలహం, అనంత మోక్షం, లౌకిక సంక్షోభంఅన్నీ తనలో అణగి ఉన్న అణుకణం లక్షణమే  కవిత్వతత్వానిదీ అనుకుంటే సరిపోతుందేమో మరి చివరికి! సుతిమెత్తని పూరెక్క.. శ్రుతి చేసిన మాండోలిన్.. మనసును మోసే స్ఫుత్నిక్ రెక్క కవిత్వ తత్వానికి సరిగ్గా అతికినట్లు సరితూగే పోలికలేనన్నా కాదనలేము కదా!

గిరిశిఖరంలా అరసుడిని హడలెత్తించే కవిత్వం.. అ'రసుడికి' పర్వత శిఖరంలాగా వెరపూ పుట్టించవచ్చు. తరచి తరచి చూస్తే చివరికి తేలే సారమేమిటయ్యా అంటే.. కవిత్వం ఒక 'సచ్చిదానందరూపాత్మకమైన జీవప్రపంచ కళాప్రదర్శన సంకీర్తనం' అని. కవిత్వసుమ కోమలత్వమంతా తొణికిసలాడుతుండేది  సంకీర్తనంలోనే సుమా!


ప్రపంచం మిథ్యఅజ్ఞానం వ్యసనాత్మకం.. లాంటి వేదాంతాలు చెప్పదు కవిత్వం. సత్యం జ్ఞానపూర్ణం, ఆనందమోహనం అని నొక్కి చెప్పేది కవిత్వం. సచ్చిదానందరూపాత్మకం అంటే ఇదే.  జీవప్రపంచం అంటే  మహత్, అమహత్ నపుంసక జీవులన్నింటితోనూ నిండివున్న కళాప్రదర్శనం. జీవాజీవాల హావభావాలు, సమీకరణాలను గురించి చేసే సంకీర్తనమే కవిత్వం అంటే  మహబాగుంటుంది.

గులాబి మొక్కనే ఉదాహరణగా తీసుకుందాం. కంటికి ఎదురుగా కనబడుతుందది. గాలిని శ్వాసిస్తుంది. పూవుగా వికసిస్తుంది. తాకినా, వాసన చూసినా ఆ పూవు ఉనికి తెలుస్తుంది. అంతేనా! కళ్ళు మూసుకున్నా స్మృతిపథంలో మెరుస్తుంది. తనవంటి  మరెన్నో పూల మనోహర రూపలావణ్యాలను, పరిమళాలను స్మృతిపథంలోకి మోసుకొస్తుంది.
వికాసం,  అందం, పరిమళం - పుష్పాల చిద్భావం. హావభావ ప్రదర్శనం చల్లగాలిలో  మెల్లగా తలలూచడం.. మెత్తని రేకులు వేకువ మంచుబిందువులకు దోయిలించడం. సౌరభాన్నినేల  నాలుగు చెరగులా ఉదారంగా వెదజల్లడం రసభావ ప్రకటనం. సచ్చిదానందమయాత్మకమైన  గులాబీల హావభావ రసప్రదర్శనాన్ని కీర్తించడమే కవిత్వతత్వం.

"అత్తరువు గబ్బును, నలవేము తీపి,  మెత్తని రాయియు మేదిని గలవె!"లాంటి పంక్తులు కవిత్వం అనిపించుకోవు. అత్తరువుకు జీవముండవచ్చుగానీ.. హావభావాలేవీ?!

కాళిదాసు 'ఆషాఢస్య ప్రథమ దివసే మేఘ మాశ్లిష్ట సానుమ్' లో కవిత్వం ఉట్టిపడుతోంది. సచ్చిదానందస్వరూపం మేఘసంజీవాన్ని ఆక్రమిస్తున్నట్లు కవి తనభావనలో దర్శిస్తున్నాడు. ఆ భావననే కొండమీదా దర్శిస్తున్నాడు.  'ఆషాఢస్య ప్రథమ దివసే' అనే కాలనిర్ణయంలో రసాన్ని ప్రదర్శిస్తున్నాడు. మామూలు మేఘమే అయినా  ఇన్ని కళాప్రదర్శనల కారణంగా కవిత్వపూర్ణమై అలరిస్తున్నది. కవిత్వతత్వమంటే అమూర్తాలను సైతం  అలా మూర్తిమంతంగా మలచడమేగదా!

కవిత్వంలో పరమాత్మ:
ఆత్మలోనే ఉంటూ ఆత్మకు ఇతరమై, ఆత్మకు లోబడకుండా ఆత్మను తనలో లీనమొనరించుకునేదే పరమాత్మగా భావిస్తుంది ఆధ్యాత్మికం. ఆత్మకు ఆశయం మూలం. ఆత్మలకెల్లా సర్వస్వం పరమాత్మ. దీన్నే విశ్వహృదయం అన్నా దోషం లేదు. ఈ విశ్వహృదయ వికాసమే  కవిత్వం అంతిమలక్ష్యం. సర్వసామాన్యమైన ఈ పరమాత్మని  ప్రతి పదార్థంనుంచి గ్రహించి తనలో సూచించడమే కవిత్వం చేసే మరో గొప్ప కార్యం.
'కొందలమందె డెందము శకుంతల తా నిపు డేగునం చయో/
క్రందుగ బాష్పరోధమున కంఠమునుం జెడె బుద్ధిమాంద్యమున్ బొందె' ఇది కణ్వుని ఆత్మానుభవం. 'ఒకింత పెంచిన తపోధనులే యిటుగుంద, నెంతగా గుందుదురో తమంత గను కూతుల బాయు గృహస్థు లక్కటా!' అని ఆ మహర్షి నోట అనిపించడంలో విశ్వహృదయం స్ఫురిస్తున్నది. వర్డ్సువర్త్ 'ఇంద్రధనుస్సు' ఏడో పంక్తీ ఇదే ధర్మం నెరవేర్చడం ఇక్కడ గమనార్హం. ఎప్పుడైతే కవిత్వం సచ్చిదానందమయాత్మకమైన పదార్థంగా మారి  హావభావరసాలను పోషిస్తూ పరమాత్మను స్ఫురింపచేస్తున్నదో.. అప్పుడే పాఠకులకు తత్ (ఆ పరమాత్మ) త్వం(నీవే) అనే ఐక్యతాభావం  చేకూరుస్తున్నది. 'తత్త్వమసి' అనే  వేదవాక్యం ఉత్తమకవిత్వం బోధిస్తో తన్మయత్వాన్ని కలిగిస్తున్నది.

కవిత్వం ఒక్క పద్యంలోనే ఉంటుందనుకోవడం పొరపాటు. గద్యంగానూ, గద్యపద్యాత్మకంగానూ ఉక్తానుక్తంగానైనా  ఉండవచ్చు. పసిబిడ్డల ముగ్ధావలోకనంనుంచి, కన్నెపిల్లల శృంగారచేష్టల వరకు ముదుసళ్ళ ముక్కాలి నడకల్లో సైతం దర్శించవచ్చు.ఇంత విశాలమైన కవిత్వతత్వాన్ని గ్రహించడానికి పాఠకుడికి మరి కావాలసిందేమిటీ?

దృష్టి వైభవం: అది కొరవడితే  వేశ్యాంగన విలాసాలు, మృదంగ ధిమధిమలు,  బాలకృష్ణుని మదస్మిత వదనారవిందం, కాళిదాసు కణ్వకుటీరం, రవీద్రుని గీతాంజలయినా  అర్థం కాని సముద్ర ఘోషే. ఇంద్రియనిగ్రం: అమాయకత్వంమీద అనురాగం, వియోగం,  కరుణార్ద్ర హృదయంతో స్పందించవలసిన సందర్భంలో సైతం  నీతి తప్పి పరవశుడైతే ఎంత కవిత్వమూ  చెవిటి ముందు చేసే శంఖునాదమే! ప్రఫుల్ల వ్యక్తిత్వం: వికాసవ్యక్తిత్వం లేని జడ్డికి కవిత్వం అగ్రాహ్యం.
ఆధ్యాత్మిక ప్రశాంతి: కేవల లౌకిక సంక్షుభిత మానసిక సంకుల స్థితిలో ఎంత ఉదాత్తకవిత్వమైనా అనాస్వాదితం.

'చదువన్ భావము- భావముట్టిపడుచో సుకీర్తనాశక్తియున్/
ముదమేపాఱ పరస్పరంబు మదినిన్ ద్రోపారుకొంచుందనున్/
 హృదయానందతరంగలాలముల ముంచెత్తంగనే పాఠ కుం/
డదిరా యంచు నుతించునో యదియెయౌ నచ్చంపు కావ్యంబుగన్"
పాఠకుడికి   అవ్యక్తమైన ఆనందాన్నిఅందించడమే కవిత్వం అంతిమ లక్ష్యం. కవిత్వతత్త్వాన్ని చక్కగా నిర్వచిస్తుందీ పద్యం***
-కర్లపాలెం హనుమంతరావు
(అంతర్జాజల పత్రిక సుజనరంజని డిసెంబరు 2015 సంచికలో ప్రచురితం)
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec2015/index.html

-  


Tuesday, December 1, 2015

మగాళ్లం.. మమ్మల్నీ కాస్త ఏడవనివ్వరూ!- సరదా గల్పిక

ఏడుస్తూ పుడతాడు. పోతూ ఏడిపిస్తాడు. మధ్యలో ఏడవలేక నవ్వులు.. నవ్వురాక ఏడుపులు! ఛార్లీ చాప్లిన్ చిత్రంలాంటిది జీవితంఏడుపులు.. నవ్వులు  పప్పులు, కూరల్లో ఉప్పూకారాలు.
పిల్లలకి.. ఆడపిల్లలకేనా రోదన బలం.. అలంకారం! ఏడ్చి ఏడ్చి ఎర్రమన్ను తిన్నతరువాతేగా యడ్యూరప్పకి మళ్లా మాతృసంస్థలో పట్టు దొరికింది! మగజాతికి కన్నీటిని దూరంచేసి ఘోరనేరమే  చేసింది మన సంస్కృతి.
శ్రీరామచంద్రుడు స్మితపారిజాతుడు.. శ్రీకృష్ణుడేమో చిదానంద స్వరూపుడుదేవుళ్లే అయినా వాళ్లకళ్లూ కలువపూరేకులకు మల్లే తడవక తప్పిందికాదు! మామూలు మగవాడికిక మూగిరోదిగా బతుకు సాగించడం సాధ్యమేనా!
మొదటి కవిత పుట్టిందే మగవాడి ఏడుపులనుంచి. బావురుమంటే బాగుండదన్న మగబాధే వాల్మీకిచేత ఆరుకాండల రామాయణం   రాయించింది. ఆ రామాయణంనిండా మళ్లా మగాళ్ల శోకన్నాలేగదా!
దశరథుడి.. దాశరథుడి కన్నీళ్లతో ఎన్ని గంగానదుల్నైనా తేలిగ్గా నింపేయచ్చు! కన్నయ్యకళ్లూ ఎన్నడూ చెమ్మగిల్లలేదని ఖాయంగా చెప్పగలమా!  పెళ్లాం కాలి  తాపులు తిన్నమహాపురుషుడు! పదిమంది భక్తుల పాదాభివందనాలందుకొనే పరంధాముడికి.. ఆలికాలి తాపులు కన్నీళ్ళు తెప్పించవా!  ముకుందుడి  ముక్కుచీదుళ్లను ముక్కు తిమ్మన గడుసుగా  పడగ్గదిలోనే తొక్కేసాడని నా అనుమానం.
ఆరున్నొక్క రాగాలాపన ఆడదానికి మాత్రమే ఆయుధంగా ఎవరందించారో! మొగుళ్లను యములాళ్ళు ఎత్తుకెళుతున్నప్పుడు, అన్నగారు అడవికి తోలుకెళుతున్నప్పుడుఆడాళ్లకేమీ కన్నీళ్లు రాలేదే!    సొంతానికంటూ కొంతైనా లాభమంటేగాని ఏ కలికైనా శోకాల జోలికి పోదేమో!  సీతమ్మశోకం, రతీవిలాపం, త్యభామదుఃఖం.. మొగుళ్లకోసమో.. మొగుళ్ళు తేని పూలకోసమో తప్ప ఏ దీనజనోద్ధరణకోసమో అయితే కాదుగదా!
అదే మరి సిద్ధార్థుడో! రుజాగ్రస్తజాతి దౌర్భాగ్యస్థితిగతుల్ని చూసి దుఃఖించాడు. తథాగతుడుగా మారి దుఃఖమూలకారణాలు గుర్తించాడు. అయినా మగాడికి.. గోడుకీ మధ్య  ఇంకా ఇన్నేసి గోడలెందుకో!
'శ్రీ శ్రీ ఏడుపు ప్రపంచానిద'ని సందర్భం వచ్చింది కాబట్టి చలం అని ఉండవచ్చేమోగానీ.. నిజానికి మెజారిటీ మొగాళ్ల రోదన  లోకంకోసమే! కళింగయుద్ధ హింసకు కళ్లు తడిసిన  అశోకుడు చెక్కిళ్ళు తుడుచుకుంటూ కూర్చోలేదుగదా! రోడ్లపక్కన చెట్లు నాటించాడు! రఘునాథ నాయకుడి  'శృంగార సావిత్రి' కథానాయకుడుళ్ళాంటి ఏడుపుగొట్లు ఎన్ని కోట్లకో ఒకళ్ళు!   
చెట్లుచేమలుకూడా కన్నీళ్లు పెట్టుకొంటాయంటున్నారు  ఇప్పటి  జీవశాస్త్రవేత్తలు! చెట్టంత మగాడు! మరి మనసు నొచ్చితే  దుఃఖం ఆపుకోగలడాఆపుకోమనడం న్యాయమా!
కన్నీళ్ళవల్ల  కామినులకైతే   తాత్కాలికంగా మాత్రమే ప్రయోజనం! అదే  మగజనావళికో!  శాశ్వతమైన కీర్తిప్రతిష్టలు!.  రామాయణం సీతమ్మశోకం వాల్మీకి స్థానాన్నిసాహిత్యంలో సుస్థిరం చేసింది! ఉత్తర రామాయణం కరుణరసం పుణ్యమాఅని భవభూతికి  కాళిదాసు పక్కన చోటు దక్కింది! శకుంతలను అత్తారింటికి సాగనంపే సందర్భంలో కణ్వమహర్షి కార్చిన కన్నీళ్లైతే కాళిదాసుకు విశ్వసాహిత్యంలోనే శాశ్వతమైన గౌరవం సాధించి పెట్టిందా లేదా!
నవ్వు నాలుగిందాల చేటు అన్నవాళ్లే.. ఏడుపు ఎన్నిందాల గ్రేటో చెప్పుంటే బాగుండేది. చెప్పకుండా దాటేసారు! మయసభామధ్యంలో నవ్వి కష్టాలు కొనితెచ్చుకొన్న ద్రౌపది.. కురుసభామధ్యంలో ఏడ్చి కన్నయ్యకరుణను సాధించుకొంది. నవ్వు వత్తిడిని  గుండెగదుల్లో దాచేస్తే.. ఏడుపు దుల్లోని వత్తిడిబాంబు వత్తి అంటించి మరీ 'ఢా'మ్మని పేల్చేస్తుంది. కన్నీళ్లు చెక్కిళ్లదారిన బైటికెళ్లిన తరువాత  గుండె కడిగిన ముంగిలంత శుభ్రమవుతుంది. నచ్చిన ముగ్గులు పెట్టుకోడానికి సిద్ధంగానూ ఉంటుంది. ఆడగుండెకనే కాదు.. మగమనసుకూ ఈ శోకసూత్రం సమానంగా వర్తిస్తున్నప్పుడు.. గాడిమీదే ఏడుపొద్దన్న ఆంక్షలు రుద్దడం ఏం న్యాయం?
ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా శోకాన్నుంచి ఎవరం ఏకమొత్తంగా తప్పించుకొలేం.  'ఈద వలెను.. ఈది గెలువ వలెను' అంటూ పురందరదాసు పదం  పాడిందీ  కన్నీటిగోదారిని మనిషి ఈదడం గురించే! ఈ ముక్కు చీదుడుకి ఆడా మగా తేడా లేదు
రామచంద్రుని దర్శనం కాలేదని త్యాగరాజయ్య కాంభోజిరాగంలో  గావుఁమన్నాడుచెరసాల పాలైన కంచెర్ల గోపన్న నమ్మిన దైవాన్ని తిట్టిపోసినవన్నీ ఆరునొక్కరాగం మార్కు  శోకన్నాలే! జవ్వని కనికరించలేదని క్షేత్రయ్య జావళీల్లో జవురుకుంటే.. వేంకటేశుని కనికరం లేదని   సంకీర్తనల్లో  కన్నీరు మున్నీరయ్యాడు అన్నమయ్య. మగవాడి కళ్లు చెమ్మగిల్లినప్పుడల్లా జరిగింది సంగీత సాహిత్య లోకంలో నవీన సృష్టే! అయినా పురుషపుంగవులందరినీబాష్పలోకంనుంచి బహిష్కరించడమే బాధాకరం.

'గతమంతా తడిసె రక్తమున.. కాకుంటే కన్నీళులతో' న్నాడు మహాకవి శ్రీశ్రీ. మీ రక్తం కలగి కలగి.. మీ నాడులు కదలి కదలి.. మీ ప్రేవులు కనలి కనలి..
 ఏడవకండేవకండి.. జగన్నాథ రథచక్రా లొస్తున్నాయొస్తున్నాయ'నీ అన్నాడురథచక్రాలేవో వచ్చేలోపైనా పతితులు.. భ్రష్టులు.. బాధాసర్పదష్టులు.. కడుపారా భోరుమనక తప్పదుకదా! ఆ వ్యథానివిష్టుల్లో మగాళ్ళూ ఉన్నారని నిష్ఠూరాలాడితే ఎలా! 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు/నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు' అని  తెగించేదాక మగాడి గొంతుకి ఉరితాడు బిగిస్తామన్నా అయే కడుపు చెరువు అవక మానదు కదా!  మనసు నొచ్చిననప్పుడు.. మనసుకు నచ్చినప్పుడూ కళ్లలో సెలయేళ్లు సుళ్లుతిరగడం దేహధర్మం. మగపుటక పుట్టినందుకు వగపోవద్దనడం.. అదేం ధర్మం!
పారూకి మల్లే దేవదాసూ విఫలప్రేమికుడే! అమ్మడై పోయింది కాబట్టి.. ఏడ్చి గుండె బరువుదించేసుకొంది పార్వతి. మగవాడన్న మొహమాటానికి పోయి  మందుకు బానిసయ్యాడు దేవదాసు. ఎవడి ఏడుపు వాడిని ఏడవనిచ్చేస్తే  ఈ మందులు..  మధ్యనిషేధాలు.. బందులు.. ఆందోళనళ్లాంటి గందరగోళాలేవీ ఉండవు కదా!
ఏడుపుగొట్టు చిత్రాలదెంత సక్సెస్ రేటో.. లెక్కలు చూస్తే అవాక్కవాల్సొస్తుంది! దేవదాసు.. అనార్కలి.. బాటసారి.. సుఖదుఃఖాల్లాంటి విషాదాంతాలన్నీ నిర్మాతలకు సుఖాంతాలే! 'చివరకు మిగిలేది' సైతం చివరికి కాసులే మిగిల్చిందంటే  టాకీసులోని టిక్కెట్లన్నీ అమ్మలక్కలవనేనా? ఆడాళ్ల చీరెచెంగులతో సమానంగా.. మగాళ్లు పైకండువాలూ తడిసి ముద్దయ్యాయనేగా అర్థం!
నవ్వి ఆడది.. నవ్వక మగాడు ఇబ్బందుల్లో పడతారన్నది వట్టి అబద్ధం.
నవ్వొచ్చినప్పుడు నవ్వనిచ్చినట్లే.. ఏడుపొచ్చినప్పుడూ ఏడవనివ్వాలి.. ఆడనైనా.. మగనైనా! లేకుంటేనే ఇబ్బంది. 'కలకంఠి కంట కన్నీరు ఒలికిఇంట సిరులేవీ నిలవ్వంటారు. కంఠికైనా.. కంఠుడికైనా .. సెంటిమెంటులో తేడా ఎందుకుండాలన్నదే పాయింటు.
ఎదపొద కదిలినప్పుడు ఏడుపు పురుగును బైటికి తరమాల్సిందే! దగ్గు.. డ్రగ్గు..  పెగ్గు.. పొగ.. మగతమాత్రతోడుతో  పరిష్కరించే సమస్య కానే కాదిది. నరాల వత్తిడి ఉపశమనానికి,  శరీరమలినం విసర్జనానికి, భావోద్వేగం వ్యక్తీకరణకు  దేహం నేర్చిన  చమత్కారాల్లో  కన్నీటిదీ ఓ  ప్రధాన మార్గం. ఆ ఆరునొక్కరాగానిక్కూడా  ఆడా.. మగా అంటూ సన్నాయినొక్కులెందుకంట!
పరీక్షలు పోవచ్చు. ప్రేమ విఫలమవచ్చు. ఉద్యోగానికి ఉద్వాసన కావచ్చు, వ్యాపారం ముంచేయచ్చు. దగ్గరి బంధువులు దూరమవచ్చు, దూరపు రాబందులు   నట్టింట తిష్ఠేయచ్చు.  క్రికెట్ మ్యాచిలో భారత్ ఓడచ్చు. పాక్ అదే మ్యాచిలో  గెలిచేయచ్చు.  ఇష్టమైనపార్టీకి న్నికల్లో డిపాజిట్టుక్కూడా దిక్కులేకపోవచ్చు. పక్కింటాయన పెళ్లాం పద్దాకా పుట్టింట్లోనే పడున్నా మన కట్టుకున్న దేభ్యం కాలు క్షణంకూడా బైట పెట్టకపోవచ్చు. కాన్వెంట్లొ పిల్లఫీజులు.. కాంప్లెక్సులో  మెయింటెనెన్సులు.. పెద్దాళ్ల ఆసుపత్రి బిల్లులు.. చెల్లించాల్సొచ్చినప్పుడు,  రైతుబజారులో కూరగాయలు కొనాల్సొచ్చినప్పుడు, కోడికన్నా కొత్తిమీరకట్టకెక్కువ భరించాల్సొచ్చిన్నప్పుడు, బండి పద్దాకా మరమ్మత్తుకొస్తున్నప్పుడు, పంజగుట్ట ట్రాఫిక్లో బైకు  ఇరుక్కున్నప్పుడు, ఆదితాళం మేళంకూడా తెలీని పక్కింటావిడ మన బెడ్ర్రూంగోడపక్కనే  కచేరీ క్కూర్చున్నప్పుడుఅవినీతి పితామహుడు  భారీ మెజారిటీతో ఎన్నికల్లో వియఢంకా మోగించినప్పుడు, పక్కసీటు  లంచగొండినే మళ్లీ మళ్లీ పదోన్నతలక్ష్మి వరిస్తున్నప్పుడు, చూసిన కుళ్ళుచిత్రమే టీవీలో మళ్ళీ మళ్లీ కుళ్లబొడుస్తున్నప్పుడు, వార్తాపత్రిక తెరిచే వేళకే టీవీనుంచి  ఆవిడ ధారావహికం కారేటప్పుడు, పదేళ్ళు నిండని చంటిబుడతడు ఆన్ లైను ఆటల మధ్యనే ఆడబడితెల బొమ్మల్చూస్తూ చొంగలు కార్చేస్తున్నప్పుడు.. ఆడకైనా.. మగకైనా ఏడుపు ఒకే విధంగా తన్నుకొస్తుందా రాదా!
 ఉల్లిపాయ పొరలు వలిచేటప్పుడుకూడా కన్నీళ్లు పెట్టుకోరాదని మగాళ్లమీదలా పడేసి ఆంక్షలు విధిస్తే సమస్యలేమన్నా పరిష్కారాలైపోతాయా!

'ఏంటి మహానుభావా! నడిరాత్రి నెత్తికొట్టుకొంటూ ఈ సుత్తి రాతలు!' అంటూ గయ్యిమంది మా దేవేరి పక్కదిగకుండానే.
తెల్లారి ఈ ఏడుపు రాతలే చూపించి ‘ఎలాగుంది డార్లింగ్?’ అనడిగానా.. ఎప్పట్లానే 'ఏడ్చినట్లుంది' అని ఫక్కున నవ్వేసిందే మూడులోనో ఉండి.
ఇన్నాళ్లకి మా అర్థాంగి పంట నవ్వు తెప్పించినందుకేమో నా కళ్లవెంటా బొట బొటా నీళ్లు! నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే కదా వస్తాయి! అవార్డు ఫంక్షన్లలో ఆడాళ్లు ఏడవటంలా!
‘బట్ యూ ఆర్ యే బాయ్!’ అంది మా భార్యామణి.
'బాయ్సి డోంట్ క్రై' థియరీ.. నౌ  ఐ డోంట్ కేర్!’ అనేసా!
-కర్లపాలెం హనుమంతరావు
(డిసెంబరు 2015 నాటి వాకిలి- లాఫింగ్ గ్యాస్ కాలమ్ లో ప్రచురితం)
http://vaakili.com/patrika/?p=9502









Monday, November 23, 2015

ఎన్ని సంబరాలో!- సరదా గల్పిక




'చలి!.. చలి!.. చలి!'
'కార్తీకం కదా! చెమటలు పడతాయా! చాదస్తం కాకపోతే!'
'ఆ చలి కాదు బాబాయ్! ఇవాళేం రోజో తెలిస్తే నువ్వూ ఇలా నింపాదిగా కుర్చోలేవు!'
'అవునా! ఇవాళ రురువారం. సాయిబాబాకి చాల ఇష్టమైన రోజు. సాయంతం దాకా అష్టమి రాదు. దుర్ముహూర్తమంటావా! పొద్దున పదింటికే వచ్చి పోయె. మళ్లా వచ్చేది మధ్యాహ్నానికే.. వర్జ్యం..'
'అబ్బబ్బ! ఆపుతావా ఆ పంచాంగపఠనం కాస్సేపు! అసలు విషయం వింటే నీ కాళ్ళు నేలమీద నీలబడవు!'
'ముందు నువ్వా చిందులు ఆపు! ఓరుగల్లు ఎన్నికలకింకా చాలా సమయముందిరా నాన్నా! ఓహో! అర్థమైందిరా  బాబూ ఇప్పుడు నీ పెడబొబ్బల సారం! బీహార్ ఎన్నికల దెబ్బేగదా! బెక  బెకలాడే కప్పల్నికూడా  బెబ్బుళ్లనుకొని బెదిరిపోతున్నారు.. అబ్బెబ్బే!..'
'అబ్బబ్బా! ఒకట్రొండు చోట్ల కాస్త దెబ్బ తిన్నామని అంత వెటకారాలా! ప్రహ్లాదుడికన్నా వాడి అబ్బ విష్ణుమూర్తిని ఎక్కువ తలుచుకొనేవాడంటమా కన్నా మీరే మోదీ నామజపం ఎక్కువగా చేస్తున్నారు. ఈ రాజకీయాలకేం! రోజూ ఉండేవేగానీ.. ఇవాళ ప్రపంచ వేడాంతుల దినం. ఆ సందర్భంగా నీకు  శుభాకాంక్షలు!'
'భలే! వేదాంతులకూ ఒక దినముంటుందా! వెర్రికాకపోతే! ఏడాదిలో మూడొందలరవైఐదు రోజులూ వేదాంతులవే కదుట్రా భడవా! విద్యాసెస్సు, గ్రంథాలయం సెస్సు.. ఇప్పుడు స్వచ్చభారత్ సెస్సు.. ఎన్ని సెస్సులు బాదినా సర్కారు ఉస్సూరుమనుకొంటూ కట్టుకోవాల్సింది.. సంసారులేగాని.. సన్యాసులు కాదుగా! రైలు టిక్కెట్లు పెరిగాయన్న బెంగ ఉండదు. ధరలు కొండెక్కి కూర్చున్నాయన దిగులు ఉండదు. మూఢభక్తులు, ప్రభుత్వాల ప్రాపకం ఉన్నంతకాలం బైరాగులు మహరాజులే! వేరే దేశాల వేదాంతుల సంగతేమో కానీ మన దేశీయ దిగంబరుల స్వాములకు,   సన్నాసులకు ప్రతీ దినం పండగే!'
'ఎంత మెట్టవేదాంతం! నిత్యం నడిచే ఈ వెటకారాలకేంగానీ.. ఇవాళ 'ప్రపంచ పురుషుల దినం' కూడా! పోనీ.. దానికైనా నా అభినందనలు అందుకోవడానికి అభ్యంతరమా?'
'పురుషులకు ఒక 'దినం' అంటేనే నవ్వొస్తుందిరా బాబూ! మగకుంకలకింకా మంచి 'దినాలు'కూడా మిగులున్నాయా! ఆకాశంలో సగం' అని చెప్పి అవకాశాలన్నీ ఆడాళ్లే ఊడలాక్కుపోతున్నారు కదా పిచ్చి నాయనా! సినిమాలూ వాళ్లకే, సీరియళ్లూ వాళ్లకే. బట్టల కొట్లనుంచి.. బంగారు దుకాణాలదాకా సర్వం సోదరీమణులకే! దారేపోయే అమ్మళ్లను చూస్తూ చొంగలు కార్చడం వరకే మగపుంగవులకు మిగిలినప్పుడు .. ఇంకేం మిగిలుందనిరా బాబూ మగవాళ్లు ప్రత్యేకంగా ఓ 'దినం' జరుపుకోడానికి! ముఖపుస్తకమనే ఓ కాతా  ఉమ్దిగదా! నీ పేరున, మీ ఆవిడ పేరున  తెరిచి చూడు! వచ్చే లైకుల్లో తేడానే  నీ స్థానం ఎంత దిగువనున్నదో చెప్పేస్తుందిమగాడై పుట్టేకన్నా.. అమరావతిలో మడిచెక్కయి పుట్టడం మేలురా చిన్నా! అయినా ఈ మాత్రం భాగ్యానికి ఐదేసి మైళ్లు చలిలో బైకుమీద రావాలా! జేబులో సెల్లుంది కదా! ఒక్క నొక్కు నొక్కితే నీ కుతి తీరేది కదా!'
'యూజ్'లెస్' డే బాబాయ్ ఇవాళ!'
'యూజ్ లెస్సా! దానికీ మళ్లా ఓ దినమా!'
'యూజ్ లెస్.. కాదు బాబాయ్! యూజ్ 'లెస్'- తక్కువగా ఉపయోగించే సందర్బం.అందుకే టాక్ టై వృథా చేయడమెందుకనీ..'
'పెట్రోలు తగలేసానంటావ్! యూజ్ లెస్ ఫెలో! అయినా యూజ్ లెస్సని ఆన్ని వదులుకోవడం కుదురుతుందేరాయూజ్ లెస్ రాజకీయనేతలని అద్వానీజీలాంటి వాళ్లని మీ పెద్దలు వదిలేయచ్చేమోగానీ..  మీ కన్నవాళ్ళు నిన్నొదిలేసారా!యూజ్ 'లెస్' అని మీ ఆవిడ నీతో సర్దుకుపోతున్నట్లే.. నేతలతో జనతాకూడా సర్దుకుపోడంలా!ఎక్కువగా వాడాలన్నా వనరులు మనకెక్కడ దొరుకుతున్నాయనిరా పిచ్చి నాగన్నా!ఉప్పుపప్పులు కొనలేక కంచంలోకి పదార్థాలు తక్కువే వాడుతున్నామా లేదా! అధునాతనం అనుకో.. పీనాసితనం అనుకొ.. వంటిమీది బట్టల్లోనూ పొదుపుతనమే చూపిస్తున్నాం కదా! ఇంట్లో మంది ఎక్కువైతే సౌకర్యాలకు ఇబ్బందవుతుందని కన్నవారిని పంచలకీ.. వృద్ధాశ్రమాలకో వదిలేస్తున్నామా లేదా!'
'ప్రద్దానికీ ఇలా పెడర్థాలు తీస్తావేం బాబాయ్! నవంబరు 19.. ఈ నెల్లో వచ్చే మూడో గురువారంలో బోలెడన్ని ప్రత్యేకతలున్నాయని చెప్పేందుకు నేనొస్తే.. నువ్వేమో..'
'ఏవిట్రా ఆ ప్రత్యేకతలు?'
'మన మగాళ్లందర్నీ ఒకాటాడించిన ఝాన్సీ లక్ష్మీబాయి, మేడమ్ ఇందిరాగాంధీ పుట్టిందివాళే!'
'అహాఁ! అలాగా! అదే మగాళ్లను మరో విధంగా ఆటాడించిన 'షకీలా' పుట్టిందికూడా ఈ ప్రత్యేకం దినం నాడే కన్నా! నచ్చని విషయాలు చెప్పకుండా పక్కదారి పట్టించడం నీకూ  బాగానే అలవాటయిందీ! ప్రత్యేక హోదా ఉదాహరణ ఒక్కటి చాలదా మీ గడుసుతనానికి. 'పురుషుల దినం' అని నువ్వబ్బో.. చంకలు తెగ గుద్దుకొనే ఈ దుర్దినానే బిల్ క్లింటన్ సెక్స్ బండారం భళ్లున బద్దలయింది.వేదాంతుల్లోకెల్లా పరమవేదాంతి లియో టాల్ స్టాయి. రష్యన్ సర్కారు దేశంనుంచి వెళ్లగొట్టిందీ ఈ వేదాంతుల దినానే! 'వృథా వద్దు' అని మొత్తుకొనే ఈ యూజ్'లెస్' రోజునే బిలియన్ డాలర్ల కాంట్రాక్టొచ్చిందని ఓ గిన్నీస్ బీరు కంపెనీ  అత్యంత ఖరీదైన విందు ఏర్పాటుచేసి చరిత్ర సృష్టించింది.'
'అవునా! ఇవేవీ తెలుసుకోకుండా నీ దగ్గర కుప్పిగంతులేసినందుకు  చెంపలు వాయించుకొంటున్నా!'
'నిజంగా నువ్వు చెంపలు పగలగొట్టుకోవాల్సిన తప్పిదం ఇంకోటుందిరా బుద్ధూ! ఇవాళ ప్రపంచ 'టాయిలెట్' దినం. అంటే పారిశుథ్యంమీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన సందర్బం. మన జాతికి అపకీర్తి తెసున్నది.. మనలోని కొంతమంది అభాగ్యుల జీవితాల ఆత్మగౌరవంతో ఆటలాడుతున్న మహమ్మారి మన పారిశుథ్యస్పృహలేమితనం. ప్రపంచంముందు మనల్ని నవ్వులపాల్జేస్తున్న ఈ దురలవాటును గురించి హెచ్చరించడం మానేసి.. వేదాంతమని, మగతనమని, పిసినారితనమని.. నవ్వించాలని చూస్తున్నావు చూడు!దానికి ముందు నీ చెంపలు రెండూ వాయించేయాలి!'
'తప్పయిపోయింది బాబోయ్! నన్నింక వదిలేయ్! పొద్దున్నే లేచి ఎవరి మోహం చూసానో! ఇవాళ నాకు 'బేడ్' డే! ఐమీన్ దుర్దినణ్'
'అన్నట్లు ఇవాళ 'విషింగ్ యూ అ బేడ్ డే!' కూడారా పిచ్చి సన్నాసీ! అది అమెరికాలోనే అయినా పనిచేయకుండా ఇలా పోచికోలు 'డే'లు చూసుకొంటూ సమయం వృథా చేసుకొనే నీబోటి వాళ్లందరికీ వర్తించేదే! ఏ దినాలు చూసుకోకుండా మన మానాన మన పని నిజాయితీగా, నిర్దుష్టంగా పూర్తి చేసుకొంటే చాలు కదారా.. అదే మనకి మిగిలే నిజమైన 'విజయ దినం'.. ఐ మీస్ సకెస్ డే!
***
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు-  19-11-2015 నాటి సంపాదక పుటలో ప్రచురితం)


Sunday, November 22, 2015

సంకల్పం- కవిత



ఉమ్మనీరు చిమ్మచీకటి  వదిలి
అమ్మ పక్కకి  చేరినప్పుడే
సంకల్పం చెప్పుకోవాలి
లోకం మెల్లగా
పరిచయమయే కొద్దీ
లోపలి ఇంద్రియాలకు
పరాకులు చెప్పుకోవాలి
ఈ పాలబుగ్గల నునులేత నిగారింపులు
కాలంజలపాతానికి ఆట్టే కాలం నిలిచేవి కావని
ఊహలు  బలిసేకొద్దీ ముగ్ధత్వం ఈడేరుతుందని,
ప్రౌఢుల లోకంలో
పాలే నీళ్ళు నీళ్లే పాలవుతాయని,
పూలూ ముళ్ళలా గుచ్చుకోవచ్చని,
పురుగుల కోసమే దీపం
వెలుగులు నటిస్తుందని,
ప్రతి ఆశా చివరకు
యూ టూ బ్రూటస్స’నే నిట్టూర్చాల్సొస్తుందని,
లాస్ట్ సప్పర్ ప్రేమసందేశం
సారంతో సహా
సర్వం
మర్మం విప్పిమనసుకు చెప్పి పెట్టుకోవాలి.
ఎన్ని మాయలు ఓడించినా
అమ్ములపొది అమాయకత్వాన్ని  వీడద్దని,
కాలంగాయాలతో హృదయమెంత ఎడారిబీడైనా
ఒయాసిస్సులను కడుపుతూనే ఉండాలని,
కచేరీలో పాట ఎన్ని సార్లు అభాసుపాలయినా
నాగస్వరానికి ఆశలలా ఉర్రూత లూగుతుండాల్సిందేనని
నీకు నీవే నచ్చచెప్పుకోవాలి
అదుపులేని పసితనాన్ని
ఆకాశమైనా శాసించలేదు.
జ్ఞానం, ధ్యానం, సత్యం, నిత్యం-
మేథస్సు ఫిదా అయే ముచట్లేమో గానీ
ముక్కుపచ్చలారనితనానికి
అచ్చమైన పచ్చితనమే ముద్దూమురిపం.
చీకటికి భయపడి కిటికీలు మూయడం
ఓటమికి జడిసి ఆడడమే మానేయడం
పెద్దల నిర్వాకం.
పసితనానికి వసంతమే గాని
శిశిరం ఉండదు
బతకడం దానికి
ఆటల్లో అరటిపండు
బతుకు బుధ్బుదప్రాయమనేది
పెద్దల వేదాంతం
బుడగనుంచి బుడగకి దూకడం
బుడతతనం
సిద్దాంతం
పుడకల దాకా  పురిటితనాన్నే
పట్టుకునుండాలని
ఉమ్మనీరు చిమ్మచీకటి  వదిలి
అమ్మ పక్కకి  చేరినప్పుడే
అందుకే నువు
సంకల్పం చెప్పుకోవాలి
-
కర్లపాలెం హనుమంత రావు
నవంబర్ 22, 2012




Wednesday, November 18, 2015

మోక్షమే లేదా!-కవిత

పరగడుపునే లేచి
మంచి పద్యంతో పుక్కిలించాలని,
పుల్లాపుడకా రాయీరప్పా
పంటికింద పడకుండా
తేలికపాటి వార్తలే
స్వల్పాహారంగా సేవించాలనీ,
మధ్యాహ్నబోజనంలో
న్యూసు పేపరు
మధ్యపేజీ కథనాలు
సుష్టుగా లాగించినా..
టీబ్రేక్ టైములో
న్యూస్ ఐటం
ఎంత వెరైటీగా ఉన్నా..
లైటుగా మాత్రమే తీసుకోవాలనీ,
రాత్రి పడుకునే
రెండుగంటలముందు
చిన్నప్పుడు
అమ్మమ్మా తాతయ్యా చెప్పిన
కమ్మకమ్మని కథల్లాంటి
చర్చల్ని తప్ప వేరే ఏవీ
అస్సలు చూడరాదని..
నా అధికరక్తపు పోటు జబ్బుకు
ప్రకృతివైద్యనారాయణుడిచ్చిన సూచన

ఈశ్వరా!
ఈ ట్వంటీఫొరవర్సు
రొటీను టీవీ న్యూసుచానెల్స్
ట్వంటీఫస్టు సెంచరీలో
నా బతుక్కింక
మోక్షమే లేదా!
- కర్లపాలెం హనుమంత రావు

18-02-2011

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...