'చలి!.. చలి!.. చలి!'
'కార్తీకం కదా!
చెమటలు పడతాయా! చాదస్తం కాకపోతే!'
'ఆ చలి కాదు బాబాయ్!
ఇవాళేం రోజో తెలిస్తే నువ్వూ ఇలా నింపాదిగా కుర్చోలేవు!'
'అవునా! ఇవాళ రురువారం. సాయిబాబాకి చాల ఇష్టమైన రోజు.
సాయంతం దాకా అష్టమి రాదు. దుర్ముహూర్తమంటావా!
పొద్దున పదింటికే వచ్చి పోయె. మళ్లా వచ్చేది మధ్యాహ్నానికే..
వర్జ్యం..'
'అబ్బబ్బ! ఆపుతావా ఆ పంచాంగపఠనం కాస్సేపు! అసలు విషయం వింటే నీ
కాళ్ళు నేలమీద నీలబడవు!'
'ముందు నువ్వా చిందులు
ఆపు! ఓరుగల్లు ఎన్నికలకింకా చాలా సమయముందిరా నాన్నా! ఓహో! అర్థమైందిరా బాబూ ఇప్పుడు నీ పెడబొబ్బల సారం!
బీహార్ ఎన్నికల దెబ్బేగదా! బెక బెకలాడే కప్పల్నికూడా బెబ్బుళ్లనుకొని బెదిరిపోతున్నారు..
అబ్బెబ్బే!..'
'అబ్బబ్బా! ఒకట్రొండు చోట్ల కాస్త దెబ్బ తిన్నామని అంత వెటకారాలా! ప్రహ్లాదుడికన్నా వాడి అబ్బ విష్ణుమూర్తిని ఎక్కువ తలుచుకొనేవాడంట! మా కన్నా మీరే మోదీ నామజపం ఎక్కువగా
చేస్తున్నారు. ఈ రాజకీయాలకేం! రోజూ ఉండేవేగానీ..
ఇవాళ ప్రపంచ వేడాంతుల దినం. ఆ సందర్భంగా నీకు శుభాకాంక్షలు!'
'భలే! వేదాంతులకూ ఒక దినముంటుందా! వెర్రికాకపోతే! ఏడాదిలో మూడొందలరవైఐదు రోజులూ వేదాంతులవే కదుట్రా భడవా! విద్యాసెస్సు, గ్రంథాలయం సెస్సు.. ఇప్పుడు స్వచ్చభారత్ సెస్సు.. ఎన్ని సెస్సులు బాదినా
సర్కారు ఉస్సూరుమనుకొంటూ కట్టుకోవాల్సింది.. సంసారులేగాని..
సన్యాసులు కాదుగా! రైలు టిక్కెట్లు పెరిగాయన్న
బెంగ ఉండదు. ధరలు కొండెక్కి కూర్చున్నాయన దిగులు ఉండదు.
మూఢభక్తులు, ప్రభుత్వాల ప్రాపకం ఉన్నంతకాలం బైరాగులు
మహరాజులే! వేరే దేశాల వేదాంతుల సంగతేమో కానీ మన దేశీయ దిగంబరుల
స్వాములకు, సన్నాసులకు
ప్రతీ దినం పండగే!'
'ఎంత మెట్టవేదాంతం!
నిత్యం నడిచే ఈ వెటకారాలకేంగానీ.. ఇవాళ
'ప్రపంచ పురుషుల దినం' కూడా! పోనీ.. దానికైనా నా అభినందనలు అందుకోవడానికి అభ్యంతరమా?'
'పురుషులకు ఒక
'దినం' అంటేనే నవ్వొస్తుందిరా బాబూ! మగకుంకలకింకా మంచి 'దినాలు'కూడా
మిగులున్నాయా! ఆకాశంలో సగం' అని చెప్పి
అవకాశాలన్నీ ఆడాళ్లే ఊడలాక్కుపోతున్నారు కదా పిచ్చి నాయనా! సినిమాలూ
వాళ్లకే, సీరియళ్లూ వాళ్లకే. బట్టల కొట్లనుంచి..
బంగారు దుకాణాలదాకా సర్వం సోదరీమణులకే! దారేపోయే
అమ్మళ్లను చూస్తూ చొంగలు కార్చడం వరకే మగపుంగవులకు మిగిలినప్పుడు .. ఇంకేం మిగిలుందనిరా బాబూ మగవాళ్లు ప్రత్యేకంగా ఓ 'దినం'
జరుపుకోడానికి! ముఖపుస్తకమనే ఓ కాతా ఉమ్దిగదా! నీ
పేరున, మీ ఆవిడ పేరున తెరిచి చూడు! వచ్చే లైకుల్లో తేడానే నీ స్థానం ఎంత దిగువనున్నదో చెప్పేస్తుంది. మగాడై పుట్టేకన్నా.. అమరావతిలో మడిచెక్కయి పుట్టడం మేలురా చిన్నా! అయినా ఈ
మాత్రం భాగ్యానికి ఐదేసి మైళ్లు చలిలో బైకుమీద రావాలా! జేబులో
సెల్లుంది కదా! ఒక్క నొక్కు నొక్కితే నీ కుతి తీరేది కదా!'
'యూజ్'లెస్' డే బాబాయ్ ఇవాళ!'
'యూజ్ లెస్సా!
దానికీ మళ్లా ఓ దినమా!'
'యూజ్ లెస్..
కాదు బాబాయ్! యూజ్ 'లెస్'-
తక్కువగా ఉపయోగించే సందర్బం.అందుకే టాక్ టై వృథా
చేయడమెందుకనీ..'
'పెట్రోలు తగలేసానంటావ్!
యూజ్ లెస్ ఫెలో! అయినా యూజ్ లెస్సని ఆన్ని వదులుకోవడం
కుదురుతుందేరా! యూజ్
లెస్ రాజకీయనేతలని అద్వానీజీలాంటి వాళ్లని మీ పెద్దలు వదిలేయచ్చేమోగానీ.. మీ కన్నవాళ్ళు నిన్నొదిలేసారా!యూజ్ 'లెస్' అని మీ ఆవిడ నీతో సర్దుకుపోతున్నట్లే..
నేతలతో జనతాకూడా సర్దుకుపోడంలా!ఎక్కువగా వాడాలన్నా
వనరులు మనకెక్కడ దొరుకుతున్నాయనిరా పిచ్చి నాగన్నా!ఉప్పుపప్పులు
కొనలేక కంచంలోకి పదార్థాలు తక్కువే వాడుతున్నామా లేదా! అధునాతనం
అనుకో.. పీనాసితనం అనుకొ.. వంటిమీది బట్టల్లోనూ
పొదుపుతనమే చూపిస్తున్నాం కదా! ఇంట్లో మంది ఎక్కువైతే సౌకర్యాలకు
ఇబ్బందవుతుందని కన్నవారిని పంచలకీ.. వృద్ధాశ్రమాలకో వదిలేస్తున్నామా
లేదా!'
'ప్రద్దానికీ ఇలా పెడర్థాలు
తీస్తావేం బాబాయ్! నవంబరు 19.. ఈ నెల్లో
వచ్చే మూడో గురువారంలో బోలెడన్ని ప్రత్యేకతలున్నాయని చెప్పేందుకు నేనొస్తే..
నువ్వేమో..'
'ఏవిట్రా ఆ ప్రత్యేకతలు?'
'మన మగాళ్లందర్నీ ఒకాటాడించిన
ఝాన్సీ లక్ష్మీబాయి, మేడమ్ ఇందిరాగాంధీ పుట్టిందివాళే!'
'అహాఁ! అలాగా! అదే మగాళ్లను మరో విధంగా ఆటాడించిన 'షకీలా' పుట్టిందికూడా ఈ ప్రత్యేకం దినం నాడే కన్నా!
నచ్చని విషయాలు చెప్పకుండా పక్కదారి పట్టించడం నీకూ బాగానే అలవాటయిందీ! ప్రత్యేక హోదా ఉదాహరణ ఒక్కటి చాలదా మీ గడుసుతనానికి. 'పురుషుల దినం' అని నువ్వబ్బో.. చంకలు తెగ గుద్దుకొనే ఈ దుర్దినానే బిల్ క్లింటన్ సెక్స్ బండారం భళ్లున బద్దలయింది.వేదాంతుల్లోకెల్లా పరమవేదాంతి లియో టాల్ స్టాయి. రష్యన్
సర్కారు దేశంనుంచి వెళ్లగొట్టిందీ ఈ వేదాంతుల దినానే! 'వృథా వద్దు'
అని మొత్తుకొనే ఈ యూజ్'లెస్' రోజునే బిలియన్ డాలర్ల కాంట్రాక్టొచ్చిందని ఓ గిన్నీస్ బీరు కంపెనీ అత్యంత ఖరీదైన విందు ఏర్పాటుచేసి
చరిత్ర సృష్టించింది.'
'అవునా! ఇవేవీ తెలుసుకోకుండా నీ దగ్గర కుప్పిగంతులేసినందుకు చెంపలు వాయించుకొంటున్నా!'
'నిజంగా నువ్వు చెంపలు
పగలగొట్టుకోవాల్సిన తప్పిదం ఇంకోటుందిరా బుద్ధూ! ఇవాళ ప్రపంచ
'టాయిలెట్' దినం. అంటే పారిశుథ్యంమీద
దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన సందర్బం. మన జాతికి అపకీర్తి తెసున్నది..
మనలోని కొంతమంది అభాగ్యుల జీవితాల ఆత్మగౌరవంతో ఆటలాడుతున్న మహమ్మారి
మన పారిశుథ్యస్పృహలేమితనం. ప్రపంచంముందు మనల్ని నవ్వులపాల్జేస్తున్న
ఈ దురలవాటును గురించి హెచ్చరించడం మానేసి.. వేదాంతమని,
మగతనమని, పిసినారితనమని.. నవ్వించాలని చూస్తున్నావు చూడు!దానికి ముందు నీ చెంపలు
రెండూ వాయించేయాలి!'
'తప్పయిపోయింది బాబోయ్!
నన్నింక వదిలేయ్! పొద్దున్నే లేచి ఎవరి మోహం చూసానో!
ఇవాళ నాకు 'బేడ్' డే!
ఐమీన్ దుర్దినణ్'
'అన్నట్లు ఇవాళ
'విషింగ్ యూ అ బేడ్ డే!' కూడారా పిచ్చి సన్నాసీ!
అది అమెరికాలోనే అయినా పనిచేయకుండా ఇలా పోచికోలు 'డే'లు చూసుకొంటూ సమయం వృథా చేసుకొనే నీబోటి వాళ్లందరికీ
వర్తించేదే! ఏ దినాలు చూసుకోకుండా మన మానాన మన పని నిజాయితీగా,
నిర్దుష్టంగా పూర్తి చేసుకొంటే చాలు కదారా.. అదే
మనకి మిగిలే నిజమైన 'విజయ దినం'.. ఐ మీస్
సకెస్ డే!
No comments:
Post a Comment