Tuesday, January 31, 2017

"నిజమే.. కానీ!"- కౌముది కథానికల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికయిన కథానిక


విశ్వాసానికి తర్కానికి ఆమడ ఎడం
             *       *         *
ఆగకుండా కురుస్తోంది వర్షం. ఇవాళ్టికి మూడో రోజు.
పెనుగాలుల మూలకంగా  కరెంటు లేక.. మధ్యాహ్నం మూడింటికే సాయంత్రం ఆరుదాటినట్లుంది వాతావరణం.శలవులకని ఇంటికి వచ్చిన మూర్తికీ  హౌస్ అరెస్టు చికాకుగా ఉంది.
కాలుగాలిన పిల్లిలాగా లోపలికి, బైటికి తిరిగే కొడుకును చూసి చిన్నగా నవ్వుకుంది సుభద్రమ్మగారు. 'పట్నం కులాసాలకి అలవాటు పడ్డ ప్రాణంముసలాళ్ళకి మల్లే ఇంటి పట్టునుండాలంటే చిరాకే మరి. పొద్దుపోయే సాధనాలేవీ కొంపలో లేకపాయ. బొమ్మ్లల పెట్టున్నా ఏం లాభం..  కరెంటు లేకపోతే అది వట్టి బొమ్మపెట్టే. రేడియాలో బ్యాటరీలు లేవు. అవి కావాలన్నా ముందు పట్నందాకా పోయి రావాలి'.
" చదివిన పేపరే ఎన్ని సార్లు చదువుతారు గానీ అబ్బాయిని కూర్చోబెట్టుకుని కాస్తేదన్నా కాలక్షేపం  చెయ్యరాదూ! పొద్దు గడవక పాపం పిల్లాడెట్లా  గిలగిలలాడిపోతున్నాడో! మీకేదీ  పట్టదాయ!" అంటూ ముందు గదిలో పేపరు తిరగేస్తున్న సుందరయ్య దగ్గరికొచ్చి మొత్తుకుంది సుభద్రమ్మ
సుందరయ్య చదివే పేపరు పక్కన పారేసి "మూర్తీ!" అని లోపలికి కేకేసాడు.
మూడో పిలుపుకి గానీ మూర్తి ఊడి పడలేదు.
"చదరంగం ఆడదాముట్రా కాస్సేపు.. నీతో ఆడి చాలా కాలమైందిఅనడిగాడు సుందరయ్య.
"ఒద్దులే నాన్నా! ఓడిపోతే చాలా ఫీలైపోతావు" అన్నాడు మూర్తి అదోలా నవ్వి.
"ఓడటమా? నీతోనా? అదీ చూద్దాం.. బోర్డు సర్దరా ముందూ" అన్నాడు సుందరయ్య తెల్లటి మీసాలు దువ్వుకుంటూ.
"వట్టి ఆటైతే బోరు. ఏదైనా పందెం కాయండి.  ఇంటరెస్టుగా ఉంటుంది" అన్నాడు మూర్తి కాయలు సర్దుతూ.
" పందేలు కాస్తావుట్రా.. ఇదెప్పట్నుంచీ? అంత పెద్దాడివై పోయావేం అప్పుడే!" అంటూ మందలింపులకి దిగబోయింది సుభద్రమ్మ. సుందరయ్యే అడ్డొచ్చాడు "అందులో తప్పేముందిలేవే. ఇంట్లో మనతోనేగా ఆడేదీ! కాకపోతే అబ్బాయిగారికీ సొంత సంపాదన ఎప్పణ్నుంచో.. ఆ సంగతి కనుక్కో ముందు. నా డబ్బులతో నా మీదే పందెం కాయడం.. ఆహా.. ఇదో కొత్త తరహా  పందెం కాబోలు ఈ కాలం పిల్లలకి!"
తండ్రి వెటకారం ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత పసిపిల్లాడేం కాదు మూర్తి. బెంగుళూర్లో థర్డియర్ ఎమ్.టెక్ చేస్తున్నాడు.
"డాడీ! మర్చిపోయారేమో కానీ.. మీరు నాకో బైకు బాకీ. పోయిన బర్త్ డేకే రావాల్సిన బండి.. పంటలు బాగా లేవని వాయిదా వేసాం. సుమారు ఆరవై వేలు. బెస్టాఫ్ త్రీలో నెగ్గండి.. ఆ డిమాండును స్వచ్చందంగా వదులుకుంటా.. ఓకేనా" అన్నాడు మూర్తి రోషంగా.
"సరేలేరా.. ముందు ఓడించు చూద్దాం" అని నవ్వుకుంటూ తన తెల్లబలగంలోని పావుని రెండు గడులు ముందుకు దూకించాడు సుందరయ్య.
వెంటనే మూర్తీ తన వంతు  ఎత్తువేసి తల్లి వేపు సాభిప్రాయంగా నవ్వుతూ చూసాడు.
మొదలు పెట్టడమే కష్టం. మొదలైంతరువాత ఆపడం అంతకన్నా  కష్టం.. చదరంగం తీరే అంత. స్వయంగా ఆడలేదు కానీ సుభద్రమ్మగారికి భర్త ఆటల పిచ్చితో పెళ్ళినాటినుంచీ పరిచయమే. ఆయన గవర్నమెంటు హైస్కూల్లో డ్రిల్లు టీచరు. ఈ మధ్యనే పదవీ విరమణ చేసాడు. తండ్రి తర్ఫీదులో మూర్తీ బాగానే పుంజుకున్నాడు. ప్రస్తుతం అతనే వాళ్ళ యూనివర్శిటీ చెస్ చాంపియన్.
ఐదు నిమిషాల్లోనే తండ్రీ కొడుకులిద్దరూ ఆటలో లీనమై పోయారు.
మరో మూడు గంటల దాకా ఇద్దరూ గుళ్లో విగ్రహాలే.
చీకటి చిక్కపడుతోంది.
'దీపాలు సిద్దం చెయ్యకపోతే  ఎంత రాద్దాంతమవుతుందో తెలుసు. పిల్లాడికీ, ఆయనకీ ఇలాంటి వేళ వేడి వేడి పకోడీలంటే ఎంతో ఇష్టం.'
ఆ తయారీకని వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్రమ్మగారు. హాల్లోనుంచీ తండ్రీ కొడుకుల మాటలు  వాన హోరు మధ్య వింటూ పనిలో పడిపోయింది.
"తోసి రాజు".. మూర్తి గొంతుసుందరయ్య గొణుగుడు.  ఏదో  కాదని గట్టిగా వాదులాడుతున్నాడు కొడుకుమీద.
మొత్తానికి అబ్బాయి చేతిలో ఆయనగారికేదో గట్టి దెబ్బే తగిలినట్లుందీ! ఆ గిజగిజలు వింటుంటే అర్థవవడంలా!
మూర్తి కొత్త బుల్లెట్ మీద తండ్రి నెక్కించుకుని ఊరి మధ్యనుంచి దర్జాగా పోతున్నట్లు ఓ ఊహ తటాలుమని బుర్రలో మెరిసింది. సుభద్రమ్మగారి పెదాల మీద చిరునవ్వు విరిసింది.
'పందెం సంగతెలా ఉన్నా ఈ ఏడాది మాత్రం మూర్తికి తప్పకుండా బండి కొనివ్వాలి. ఒక్కగా నొక్క నలుసు. ఇంటికి వెలుగు.  పంటల బాగోగులతో నిమిత్తం పెట్టుకోకూడదీసారి. అంతగా ఐతే చేతి గాజులైనా సరే..'
హాల్లోనుంచి కొత్త గొంతు వినిపించే సరికి సుభద్రమ్మ ఆలోచనల చైన్ తెగిపోయింది.
చేస్తున్న పని ఆపి బైటికి తొంగి చూసింది.

*     *     *
ఎవరో కొత్త మనిషి. ఎప్పుడూ చూడని మొహం. ఆకారం ఒకింత వింతగానే ఉంది.
భుజం చుట్టూ కాషాయం రంగు శాలువా.. కిందేమో అబ్బాయి వేసుకునే లాంటి ఇరుకు ప్యాంటుభుజానికి ఓ జోలెలాంటిది వేలాడుతున్నది. సగం సన్యాసి.. సగం సంసారి లాగుంది వేషం.
గలగలా మాట్లాడుతున్నాడు.  'ఏట్లో పోటు మహా ఉద్దృతంగా ఉంది స్వామీ. అక్కడికీ మొండికేసి సగం దూరందాకా వెళ్లా . నా వల్ల కాలా. ఊళ్లోకి వస్తుంటే  మొదటగా మీ ఇల్లే కనబడింది. వాన వెలిసిందాకా తల దాచుకోక తప్పదు కదా! ఈ వరండాలో కూర్చుంటా.. మీకెవ్వరికీ ఇబ్బంది కలిగించను' అని చెప్పుకొస్తున్నాడు.
'పాపం' అనిపించింది సుభద్రమ్మ గారికి.  తలుపులు బిడాయించుకుని లోపల కూర్చుంటేనే చలిగాలికి వళ్ళు గజగజలాడి పోతున్నది. నడి వయసు మనిషికి.. ఎంత కష్టం.. రాత్రంతా బైట వరండాలో అంటే'
వాకిలి తలుపులు బార్లా తీసుండటం వల్ల జల్లు లోపలికి కొట్టి గదంతా రొచ్చు రొచ్చవుతున్నది.
"మూర్తీ! ముందా తలుపులు వేసేయరా.. ఆయన్నొచ్చి లోపల  కూర్చోమను" అంది సుభద్రమ్మగారు వంటింటి గుమ్మాని కవతలే నిలబడి.
మూర్తి తలుపులు మూసి వచ్చి కూర్చున్నాడు.
వేసిన తలుపులకు పక్కనే గోడకు చేరగిలబడి కూర్చుండి పోయాడా కొత్త మనిషి. సుభద్రమ్మవంట పనిలో కెళ్ళిపోయింది.
ఆటాడుతూనే  ఆ మనిషితో మాటల్లో పడ్డాడు సుందరయ్య.
ప్రసంగ వశాత్తూ చాలా కొత్త విషయాలే తెలిసాయి. ఆ సన్యాసి పూర్వ నామం భైరవయ్యట. పొద్దుటూరు నివాసి. కాశీ విశ్వేశ్వరుని దర్శనానికని పోయి భార్యా బిడ్డలిద్దర్నీ గంగలో పోగొట్టుకున్నాట్ట. ఆ వైరాగ్యంతో చేసే బంగారం వ్యాపారం చాలించుకుని ఇట్లా దేశాలు పట్టి తిరుగుతున్నానని చెప్పాడు. 'కైలాసగిరి నుంచి కన్యాకుమారి దాకా తిరగని పుణ్యక్షేత్రం లేదు స్వామీ! మనశ్సాంతి కోసం  ఆరాటం. నీడలా వెన్నంటుండే ఇల్లాలు, బిడ్డా.. ఇద్దరూ ఒకేసారి  కనుమరుగయిపోయాక గానీ .. జీవితంలోని డొల్లతనం బైట పడలేదు." అంటూ ఓ  మెగా సీరియల్ కి సరిపడా కథాగానం చేసాడా సెమీ సన్యాసి.
ఇంట్లో వాళ్ళతోపాటే వేడి వేడి పకోడీలు  ఒక ప్లేటులో పెట్టిస్తే ఇంత వేదాంతమూ వల్లించిన సన్యాసి 'ఉల్లివి కదా వద్ద'నలేదు సరికదా.. ఒక్క పలుక్కూడా మిగలకుండా ప్లేటు మొత్తం నిమిషంలో లాగించేసాడు.
ఆరగింపుల పర్వం అలా కొనసాగిస్తూనే ఓ కంట తండ్రీ కొడుకుల ఆటమీద కన్నేసీ వుంచాడు.
ఒక రౌండు అప్పటికే మూర్తి గెలిచి ఉన్నాడు. రెండో రౌండు చివర్లోకొచ్చి అడ్వాంటేజిలో ఉన్నాడు. సుందరయ్య తన  రాజుని అన్ని రకాలా  ఇరకబెట్టుకుని తప్పించుకునే దారి తోచక తన్నుకులాడుతున్న తరుణంలో..
అమాంతం బల్ల ముందుకు దూకేసి " ఈ కుడి వైపు ఏనుగుని బలిచ్చేయండి స్వామీ.. రాజు తప్పుకొనే తోవ అదే ఏర్పడుతుంది!" అని సలహా పారేసాడు. సుందరయ్య శషభిషలు చూసి తనే చొరవగా ఏనుగుని ఎదుటి పక్షం ఏనుగు ముందు మోహరించేసాడు. 'హుమ్' అని మూలిగాడు సుందరయ్య మరో మార్గమేదీ తోచక.
'ఇదొక ఎత్తా' అనుకుంటూ అమాంతం  ఆ బలగాన్ని తన ఏనుగుతో  ఎత్తికుదేసే ఉత్సాహంలో  తన రాజు అరక్షణ గోతిలో పడిపోవడం గమనించనే లేదు  మూర్తి కూడా.
ఏనుగు ఖాళీ చేసిన ఆ స్థానంలోకి వెంటనే మంత్రిని తోసేసి 'షా' అని సుందరయ్య బిగ్గరగా అరవడం.. మూడే మూడు నిమిషాలపాటు సంపూర్ణ ధ్యానంలోకి వెళ్ళినా లాభంలేక.. మూర్తి  పూర్తిగా చేతులెత్తేయడం.. క్షణాల్లో జరిగి పోయాయి.
ఆట గెలిచిన సుందరయ్య ఆనందం అంతా ఇంతా కాదు.
 ఆశ్చర్యంగా సన్యాసి వైపు చూసి "బంటును ఏనుగని.. మంత్రిని రాజని అంటుంటే   బేసిక్సు కూడా తెలీవని పొరబడ్డా స్వామీ! మీరు ఇంతాట పెట్టుకుని.."
తలడ్డంగా ఊపాడా సన్యాసి నవ్వుతూ " నిజంగానే నాకీ ఆట 'అ ఆ' లు కూడా తెలీవు స్వామీ! మీరాడే తీరు చూసి తోచిన సూచన చేసానంతే.  ఇదంతా నా గొప్పతనమా?.. దీనిది కానీ" అంటూ మెడలో వేలాడే గొలుసు వంక చూపించాడు.
మెరుపు తగ్గిన బంగారపు గొలుసది.  లాకెట్ స్త్ఘానంలో ఏదో ఎర్రరంగు రాయి వేలాడుతున్నది.
సుందరయ్యమొహంలో అయోమయం. మూర్తి మొహంలో చిరునవ్వు. సన్యాసి మెళ్లో బంగారపు గొలుసంటే నవ్వు రాదా మరి హేతుబద్ద్ధంగా ఆలోచించే బుద్ధిమంతుల కెవరికైనా! ఎంగిలి ప్లేట్లు ఎత్తు కెళ్ళటానికని వచ్చిన సుభద్రమ్మగారు  సన్యాసి మాటలు శ్రద్దగా వింటో అక్కడే నిలబడి పోయింది.
"ఇది వంటిమీద గుండెల్ని తాకుతున్నంత సేపూ మనసులో వున్నదంతా వాస్తవమై తీరుతుంది. ఆటలో మీకు సాయం చేసేటప్పుడు నా మనసులో ఉన్నది ఒక్కటే కోరిక  'ఈ అబ్బాయి ఎట్లాగైనా ఆ ఏనుగుమీద ఆశతో రాజు కాపుగడిని ఖాళీ చేసెయ్యాల'ని. మీ కళ్లతోనే  చూసారుగా.. ఏం జరిగిందో! అదీ ఈ రాయి మహత్యం. మీ ఇంటి గుమ్మం ముందు తడిబట్టలతో నిలబడున్నప్పుడు నన్ను లోపలికి రానీయాలా.. వద్దా అని మీమాంస పడ్డారు   మీ అబ్బాకొడుకులిద్దరూ. ఎక్కడో లోపల వంటింట్లో పని చేసుకునే ఈ తల్లి పనిమాలా వచ్చి మీ చేత  లోపలికి పిలిపించింది. అదీ ఈ రాయి మహిమే"
మూర్తి మొహం చూసి మళ్లీ అన్నాడా సన్యాసి మీరు నమ్మడం లేదని తెలుస్తూనే ఉంది. మీ వయసుకది సమంజసమే! దీని శక్తిని మరో సారి నిరూపిస్తా..  చూడండి. మూడు రోజుల బట్టీ ఈ ప్రాంతంలో కరెంటు నిలకడగా ఉండటం లేదు కదా! "
" కొంప తీసి ఇప్పుడుగానీ కరెంటు పుట్టిస్తానంటారేమిటి?" అన్నాడు మూర్తి. ఎంత వద్దనుకున్నా గొంతులో హేళన దాగడం లేదు. పట్టించు కోలేదా సన్యాసి.
" శ్రీ మల్లికార్జున స్వామివారి సుప్రభాతం  చదువుకుంటూ పోతుంటా స్వామీ ఒక వరసలో.  ఈ లోపలొక  ఐదారు నిమిషాలపాటైనా విద్యుద్దీపాలు వచ్చిపోతే ఈ  రంగురాయిలో శివసత్తువ ఉన్నట్లే లెక్క" అంటో  చప్పట్లు కొట్టుకుంటో శ్లోకాలు చదవడం  ఆరంభించాడు.
"ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం
సింధూరపూరపరిశోభితగండయుగ్మమ్
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ
మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్।
కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్।.."
ఆశ్చర్యం!
"..నమస్తే నమస్తే మహాదేవ శంభో! నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో! నమస్తే నమస్తే నమస్తే మహేశ!.." అంటూండగానే తటాలుమని గదిలో దీపాలు వెలిగాయి.
ఎప్పుడు ఆన్ చేసుందో టీవీ స్పోర్ట్స్ చానెల్.. ఒన్-డే చివరి ఓవర్ లాస్త్ బట్ ఒన్ డెలివరీకని జడేజా స్టంప్స్ వైపు దూసుకొచ్చేస్తున్నాడు. చూస్తుండగానే అతగాడు విసిరిన బాలుని  గేల్ ఎదురెళ్లి బలంకొద్దీ బాదడం.. గాల్లోకి లేచిన బంతి సరిగ్గా బౌండరీ లైనుకి ఇంచికిటుగా నిలబడ్డ ఫీల్దరు పట్టిన దోసిట్లో.. పడినట్లనిపించడం! స్లిప్పయినట్లూ ఉంది.. 'సిక్సర్'అని  కామెంటేటర్ల అరుపులు వినిపించడం. గ్యాలరీ జనాల గోల మధ్య .. విన్ అయిందో విండీసో.. చాంపియనయిందో ఇండియన్సో.. క్లియరయే లోపలే.. మళ్ళా ఠప్పుమని కరెంటు పోనే పోయింది.
పూర్తిగా మతి పోయినంత పనయింది సుందరయ్య దంపతులకు.
మూర్తీ ఆలోచనలో పడ్డాడుపూర్తిగా నమ్మడానికి హేతువాదం అడ్డొస్తున్నది.
"నాకంతా అర్థమవుతూనే ఉంది. నీకింకా పూర్తివిశ్వాసం కలగనే లేదు కదా స్వామీ.. పోనీ వదిలేయండి"  అన్నాడా అర్థసన్యాసి అదో రకమైన నిర్వేదంతో.
సుభద్రమ్మగారు అప్పుడే  విస్తరి నిండా భోజనం తెచ్చి సన్యాసి ముందుంచింది.  "తల్లీ! మీరింత అభిమానం చూపిస్తున్నారు. చీకటని కూడా చూడకుండా  ఓపిగ్గా ఇన్నేసి అనుపాకాలు కమ్మంగా చేసి తెచ్చారు.  తినే ప్రాప్తం  ఈ నోటి కుండద్దూ?" అన్నాడు అదే మూడులో.
"ముందు తినండి స్వాములూ! ఇంటికొచ్చిన అతిథిని ఖాళీ కడుపుతో ఉంచి మేం మాత్రమే భోంచేయడం.. అదేమంత మంచీ మర్యాదా!"అన్నాడు సుందరయ్య. అప్పటికే అతనికా సన్యాసిమీద అపరిమితమైన గురి ఏర్పడిపోయుంది.
పెదవి విరిచాడా సన్యాసి " అభోజనం రాసిపెట్టుంది స్వాములూ ఈ పూట. ఒక్క నాకే కాదు.. ఇంటిల్లిపాదికీ. అమ్మా! ఒక్కసారి మీరా  లాంతరు వంటింటిదాకా పట్టుకెళ్లి  పొయ్యి మీది చూడండి. మీకే అర్థమవుతుంది జరిగిన అనర్దమేమిటో?"
వింత పడుతూ దీపం బుడ్డితో లోపలకి వెళ్ళింది సుభద్రమ్మగారు. అక్కడినుంచే ఒక్క గావుకేక వినబడింది. కంగారుగా లోనికి పరుగెత్తికెళ్ళిన మూర్తి.. సుందరయ్యలకు  గిన్నెలో అన్నం మెతుకులతో సహా ఉడికి ఉబ్బిన ఇంత లావు బల్లి కనబడింది. వళ్ళు జలదరించింది అందరికీ.
"ఇదీ తమరి రంగురాయి మహత్తేనంటారా మహానుభావా?"అనడిగాడు మూర్తి సాధ్యమైనంత వెటకారంగా. వెళ్ళిపోయే మూడ్ లో జోలె సర్దుకుంటున్న సన్యాసి నుంచి బదులే లేదు.
అప్పటికి వర్షం కాస్త తగ్గు ముఖం పట్టింది.
లేచి నిలబడి సుందరయ్యకు నమస్కారం చేసి అన్నాడు సన్యాసి" దారి ఖర్చులకు చేతిలో తైలం బొత్తిగా లేదు. ఈ గొలుసు తమరి దగ్గరుంచుకుని కాస్త నగదు ఇప్పిస్తారేమోనని ఆశతో వచ్చాను. అసలు మీ ఇంటి తలుపు తట్టిన కారణం కూడా  అదే స్వామీ!"
వెంటనే అందుకున్నాడు మూర్తి "అదేం.. మీ దగ్గరే మహత్తుగల  రాయుందిగా! కావాల్సినంత సొమ్ము తమరే సృష్టించుకోవచ్చు కదా?"
సన్యాసి మొహంలో చిరునవ్వు"ఈ రాయికి మహత్తుందన్నానే కానీ.. శూన్యంలోంచి శివలింగాలనీ.. గాల్లోంచీ కరెన్సీ నోట్లను రాలుస్తుందనన్నానా?   ఆ తరహా మహత్తే గనక ఈ రాయికుండుంటే ప్రాణానికన్నా మిన్నగా ప్రేమించిన వాళ్లను గంగ్గమ్మతల్లి ఒడికి వదిలి వస్తానా? వ్యాపారం వద్దని వదిలేసుకునే నాటికి నా స్థిర చరాస్తుల విలువ సుమారు పది కోట్ల పైమాట. కొంత ఊరి అనాథ శరణాలయానికి, కొంత చెన్నకేశవస్వామివారి ఆలయానికి  రాసిచ్చేసాను. ముందే చెప్పాను.. నేనూ మీ అందరిలాంటి వాడినే అని. ఈ  రాయుండట మొక్కటే  నా ప్రత్యేకత. తాకట్టు వ్యాపారం చేసే రోజుల్లో నా చేతికొచ్చిందీ గొలుసుకుదవబెట్టిన మనిషే స్వయంగా చెప్పుకొచ్చాడు  దీని మహిమలు. నమ్మలా అప్పట్లో. విడిపించుకోడానికి అతగాడు మళ్ళీ ఎందుకు రాలేదో.. తరువాత తరువాత  గానీ తెలిసిరాలేదు. గంగపాలయినప్పుడిది నా భార్య మెడలోనే ఉంది. తన గుర్తుకోసమనే ఇంతకాలం నావెంట తిప్పుకుంది. మామూలు బంగారమని  చెప్పి  వదిలించుకోవడం తేలికే. నమ్మి కొన్నవాడిని మోసగించినట్లవుతుందది. ఉన్న విషయమేదో చెప్పి.. దృష్టాంతాలు చూపిస్తున్నదందుకే. మీ లాగానే చాలామంది  కాశీ మజిలీ కథలని కొట్టి పారేసారుఈ పెద్దయ్యలాగా  కాస్త నమ్మకం కుదిరినవాళ్ళు గ్యారంటీ అడిగారు.   దారి ఖర్చులకోసం రొక్కం అత్యవసరం పడింది. కనకే ఇంతలా మీకు చెప్పుకోవాల్సొస్తోంది. ఆ పైన మీ ఇష్టం. నా ప్రాప్తం" అంటూ సుభద్రమ్మగారికి నమస్కారం చేసి వీధి వాకిలి వైపుకి అడుగులేశాడు సన్యాసి.
మూర్తి ఏదో అనబోయాడు కానీ.. 'వద్దన్న'ట్లు వారించింది సుభద్రమ్మ గారు

వీధిలో దాకా  సన్యాసి వెనకనే వెళ్లొచ్చిన  సుందరయ్యను చూసి "పాపం.. ఆయన చేతిలో కాస్తేదన్నా పెట్టకపోయారా?" అంది సుభద్రమ్మగారు సానుభూతితో.
"ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేలేవే. పోతూ.. పోతూ..  తొందరలోనే మనకు పెద్ద మొత్తంలో ధనప్రాప్తి  కలగబోతున్నట్లు చెప్పాడోయ్" అన్నాడు సుందరయ్య  గుప్పెట్లోని గొలుసును హుషారుగా ఊపుకుంటో.
"పెద్ద మొత్తమంటే?" సుభద్రమ్మగారి ఆరా.
"సుమారు ఐదారు లక్షలు" సుందరయ్య గొంతులో ఉత్సాహం.
కనుబొమలు ముడిపడ్డాయి అప్రయత్నంగా మూర్తికి. "ఆ సన్నాసి మాటకూ నా బైకుకూ ముడిపెట్టొద్దు డాడీ" అన్నాడు  హెచ్చరికగా!
'చూద్దాం లేరా బాబూ! మూడో రౌండు వేద్దాం పట్టు.. అమ్మ మళ్లీ అన్నం వండటానికి ఎటూ టైం పడుతుంది!" అన్నాడు సుందరయ్య.
" మూడ్ పోయింది డాడీ.." అని లేచి గదిలోకి వెళ్ళిపోయాడు  మూర్తి.
"పిల్లాడినింక  వదిలేద్దురూ!  రేపు తెల్లారగట్లే వాడి ప్రయాణం. " అంది సుభద్రమ్మ గారు వంటింట్లోకి పోతూ.
"అయ్యో.. గ్యాసూ ఇప్పుడే ఐపోవాలా!" అని  లోపల్నుంచీ ఆమె అరుపు.
సన్యాసి చెప్పిన 'అభోజనం' గుర్తుకొచ్చింది సుందరయ్యకి.

***
తెల్లారు ఝామునే వెళ్ళి పోయాడు మూర్తి.
పట్నం దాకా తండ్రి తోడొస్తానంటే " రోడ్దంతా రొచ్చుగా ఉంది.. నా తంటాలేవో నేను పడతాగానీ పెద్ద మొత్తాలొస్తే మాత్రం  కాల్ చెయ్యండి. కొనాల్సిన లిస్టు చాలా పెద్దదే ఉంది నా దగ్గర " అని  హాస్యాలు పోయాడు మూర్తి  పోతూ పోతూ.
"ముందు రానివ్వరా బాబూ.. చూద్దాం" అని వద్దు వద్దంటున్నా కొడుకు మెళ్ళో రంగురాయి గొలుసు వేసేసాడు  సుందరయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ.
మూర్తి తీసేయబోతుండే అడ్డుతగిలింది తల్లి " బోసి మెడతో తిరగడం ఫ్యాషనా ఏందిరా? ఉండనీయ్ మా తృప్తి కోసమన్నా" అంటో.
తల్లికి కష్టం కలిగించడం ఇష్టం లేక గమ్ము నూరుకుండిపోయాడు మూర్తి.

పట్నం బస్సు స్టాండు నుంచీ కాల్ చేసాడు మూర్తి " రైల్వే లైన్లు సరిగ్గా లేవంటున్నారు. అన్ని బళ్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి. అదృష్టం బాగుండి వోల్వా బస్సొకటి దొరికింది నాన్నా! దాంట్లో పోతున్నాసిగ్నల్సు సరిగ్గా లేవు.   మధ్య్లలో  రెస్పాన్సు లేకపోతే  కంగారు పడద్దు. చేరంగానే మళ్లీ కాల్ చేస్తా" అన్నాడు
అదే మూర్తి నుంచి తల్లిదండ్రులకు  వినిపించిన చివరి మాటలు.

మూర్తి ఎక్కిన వోల్వా బస్సు దారిలో ఏదో కల్వర్తు దాటుతూ కాలవ నీళ్లల్లో జారి  పడింది. అధునాతనమైన బస్సు. లోపల్నుంచీ అన్ని డోర్లు ఆటోమెటిగ్గా లాకయ్ ఉండటం.. యమర్జన్సీలో అన్ లాకవాల్సిన మెకానిజం అట్టర్ ఫ్లాపయిపోవడం వల్ల..   అంత అందమైన వాహనమూ ఎక్కిన ప్రయాణీకులందరి పాలిట సామూహిక జలసమాధిగా మారి కూర్చుంది.
రకరకాల కారణాలతో  చనిపోయిన నలభై మందిలో మూర్తీ ఒకడు. అతని మృత్యుకారణం మాత్రం చాలా ప్రత్యేకం.
మెడలోని గొలుసు సీటురాడుకు చిక్కుబడిపోయి  రంగురాయి అంగిటికి అడ్దుపడటం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది.
లకీగా బస్సు ఓ ప్రముఖ నేతాశ్రీ ట్రావెలింగు ఏజెన్సీది.  
'ఎన్నికలు ముంచుకొస్తున్నప్పుడే ఈ దారుణం జరగడం ఖర్మ. జరిగిన  నష్టమేదో అణాపైసల్తో సహా   ఎలక్షన్లయినాక వర్లుకోవచ్చు. ముందు.. పార్టీ టికెట్టు పోకుండా చూసుకోవడం ముఖ్యం.  మీడియా ఆర్బాటం.. మృతుల సంబంధీకుల  ఆగ్రహం చల్లబడాలంటే  ఎవరూ ఊహించని భారీ మొత్తం నష్టపరిహారం కింద అచ్చుకోవడమే ఉత్తమం' నేతాజీ వ్యూహం ఆ లైనులో సాగబట్టి సహబాధితులందరికి మల్లే కొడుకు దుర్మరణానికి నష్టపరిహారం కింద సుందరయ్య దంపతులకు అందిన మొత్తం అక్షరాలా ఐదు లక్షలు!
సన్యాసి మాటలు అక్షరాలా సత్యమయ్యాయి..నిజమే!

కానీ…!
-గుడ్లదొన సరోజినీ దేవి 
w/o కర్లపాలెం హనుమంతరావు
 ***
(కౌముది అంతర్జాల మాస పత్రిక నిర్వహించిన కథల పోటీ(2015)లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథానిక)


















Monday, January 30, 2017

దగ్గరి దారి- మరీ చిన్న కథ

ముఫ్ఫై అపార్ట్ మెంట్ల కాంప్లెక్స్ మాది. లిఫ్ట్ పనిచేయని ఓ పరగడున పాల పాకెట్లు తీసుకొని మెట్ల దారిన వస్తుంటే రెండో ఫ్లోర్ మెట్లకు ఓ మూల నిండుగర్భిణీలా ఉన్న ఓ వ్యాలెట్ కంటబడింది. అప్రయత్నంగా వంగి దాన్నందుకొని చూస్తే బరువును బట్టి లోపల సొమ్ము భారీగా ఉందని తేలింది. సభ్యత కాదు కాబట్టి ఎంతుందో తెలీదు కానీ.. మొత్తానిక అంతా దాదాపుగా ఐదొందలు.. వెయ్యినోట్లే. క్రెడిట్ .. డెబిట్ కార్టుల్లాంటివీ ఏవేవో ఉన్నాయి.  అన్నింటి మీదా బి. గోవింద రాజన్ అన్న పేరే ఉండుంటం వల్ల ఆ పర్శుతాలూకు ఆసామి ఎవరో తేలిపోయింది. వాచ్ మెన్ అప్పారావును అడిగితే .. అలాంటి పేరున్న వాళ్లెవరూ అపార్టుమెంట్లలో లేరని తేల్చాడు.
'ఇంత సొమ్ముంది. పై పెచ్చు ప్లాస్టిక్ కార్డులు! పోగొట్టుకొన్న మనిషి తానే వెదుక్కుంటూ రాడా? అప్పుడు తిరిగిచ్చేద్దాంలే!' అనిపించి ఇలా పర్శు నా దగ్గరుందని వాచ్ మెన్ కు చెప్పి  వచ్చేసాను.

ఒకటి రెండు రోజుల్దాకా ఎవరూ రాలేదు! ఆశ్చర్యం! మరీ ఆశ్చర్యం ఒక నెల రోజులు దాటినా ఎవరూ రాలేదు.

పరాయి సొమ్మును పాములా భావించే చాదస్తం  నాది. పోనీ  పోలీసులకిలా దొరికిందన్న సమాచారమిద్దామా అనిపించింది. వాళ్ల పోకిరీ బుద్ధి బాగా తెల్సుండబట్టి మనసొప్పలేదు. గుళ్లో హుండీలో వేయమని మొదలు పెట్టింది మా శ్రీమతి. పోలీసులకన్నా దేవుడి చూట్టూతా చేరిన  వాళ్లేమన్నా బుద్ధిమంతులా? ఆ పనీ చెయ్య బుద్ధి కాలేదు.
ఇంట్లో మధన ఇలా సాగుతుండగానే  మా  ధర్మ విచికిత్సను పటాపంచలు చేస్తూ  కాలింగు బెల్ కొట్టి మరీ ఓ నడి వయసు శాల్తీ లోపలి కొచ్చింది. అయిన పరిచయాలను బట్టి అతగాడు ఏదో ప్రైవేటు కాలేజీ లక్చెరరని తేలింది. అందరికీ    'గోరా'గా తెలిసిన అతగాడి అసలు పేరు 'గోవింద రాజ కుమారన్'ట! మా కాంప్లెక్సులో అద్దెకు దిగి ఇంకా రెండు నెలలు కూడా నిండక పోవడంతో అతగాడి ఆరిజన్ తమిళనాడు సైడు వేలూరని పసిగట్ట లేకపోయాం.   కృష్టాజిల్లా బ్రాహ్మణ యాసతో స్పష్టమైన తెలుగు మాట్లాట్టం వల్లా  గోరా రూట్స్ గోరైంతైనా పసిగట్టలేక పోయాం ఎవ్వరం.
పర్శులో ఐదువేల ఏడొందలు .. ఐదు వెయ్యి నోట్లు.. ఒక్క ఐదొందల నోటు.. నాలుగు యాభై నోట్లున్నాయని చూడకుండానే చెప్పేసాడు. క్రెడిట్.. డెబిట్ కార్డు వివరాలు కూడా అన్నీ పొల్లుపోకుండా చెప్పడంతో .. ఇంకా సందేహించడం అవమానించడమే అవుతుంది. అంతే కాదు. ఆ పరాయి సొమ్మును ఇంకా మోసే మానసిక స్థైర్యం నాకు లేదు. మా శ్రీమతిగారి హుషారుక్కూడా  అడ్డుకట్ట పడినట్లుంటుందన్న ఆత్రంతో పర్శు తిరిగి తెచ్చిస్తూ' అన్నీ సరిగ్గా  ఉన్నాయో.. లేవో.. ఒకసారి సరి చూసుకో బాబూ!' అన్నాను,
'ఉంటాయంకుల్! మీ నిజాయితీని గురించి  ఇక్కడందరూ చెప్పుకుంటుంటారు. ఆ  ధీమతోనే  ఆ రోజు మీ కంట బడేట్లు ఈ పర్సును  మెట్ల మూల పడేశాను. మీరా పరగడుపు చీకట్లలో  చూడ లేదు కానీ.. నేనక్కడే ఓ వారగా నిలబడున్నాను' అన్నాడు!
ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టడం నా వంతయింది. ఇన్నాళ్ళూ నన్నవసరంగా టెన్షన్ పెట్టడం కొద్దిగా కోపం కూడా తెప్పించింది. నా ముఖంలోని భావాలను చదివినట్లుగా నొచ్చుకుంటున్నట్లు మొహం పెట్టి అన్నాడు గోరా 'సారీ! పెద్దవారు. మిమ్మల్నిలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది. ఇంకేం  చేసేది? ఆ టైంలో ఇంట్లో మా అమ్మ నాన్నలున్నారు. మా నాన్నగారికి మందు పిచ్చి, దానికి తోడు నా జేబులు తడిమి ఎంతుంటే అంత పట్టుకేళ్లే అలవాటు. అడిగితే పెద్ద రభస అమ్మతో కూడా. బైకుమీదనుంచి పడి బాగా దెబ్బలు తగిలున్నాయని నన్ను చూడ్డానికి  హఠాత్తుగా ఊడి పడ్డారిద్దరూ. మర్నాడు మళ్లా బ్యాంకులో వేద్దును కానీ కుంటికాలు.. పెద్ద పెద్ద  క్యూలు! కుదర్లా! అంతకు ముందు రోజు రాత్రే మోదీగారీ పెద్దనోట్లు రద్దుచేసారు.  మా   వాళ్లిద్దర్నీ ఇప్పుడే బస్సెకించి  వస్తున్నా. సారీ  అంకుల్..  మా పేరెంట్సిద్దరూ  ఊరికెళ్లిందాకా నా హార్డ్ ఎరన్డ్ మనీ భద్రంగా ఉండాలంటే ఇంతకు మించి నాకు మరో దారి కనిపించలా’
.  
డబ్బు దాచుకోడానికి డబ్బు పోగొట్టుకోడం కూడా ఓ దగ్గరి దారని కనిపెట్టిన గోరా తెలివికి నోరెళ్ల బెట్టడం నా వంతయింది!
లకీగా ఇవాళ్టికింకా ఒక్క రోజు గడువు మిగిలుంది రద్దైన పెద్ద నోట్లు బ్యాంకులో వేసుకోడానికి. సంతోషమూ అయింది.
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల పత్రికలో మరీ చి.క(మరీ చిన్న కథ) గా ప్రచురితం)

***


వినోద వల్లరి- ఎన్నికల్లో


రోజూ ఒకే మాదిరి రాజకీయాలంటే మజా ఏముంటుంది? చట్టసభలు నడిచే సమయలో అంటే అదో రకం వినోదమైనా దొరిదేది. సభాసమయాలూ సినీతారల వస్త్రవిశేషాలకు మల్లే దినం దినం కురచనై పోతున్నప్పుడు ఓట్లేసి గెలిపించిన జనాలను ఏం చేసి మెప్పించేట్లు ప్రజాప్రతినిధులు?
మామూలుగా అయితే మామూలు జనం వినోదార్థం  చలన చిత్రాలాడించే   థియే'టర్లను నమ్ముకోడం ఆచారం. బోలెడంత సొమ్ము..  విలువైన సమమం రెండూ వెచ్చించి టిక్కెట్లు కోయించి హాల్లో కెళ్ళి కూలబడ్డా మూడుగంటల్లో కనీసం ఒక్క సెకనైనా గాట్టిగా ఈలేసే పాటగానీ.. కేకేసే కామెడీగానీ కరవవుతున్నప్పుడు .. ఇహ నటించి అలరించే బాద్యత ప్రజాప్రతినిధులదే అవుతుంది కదా! కుదరదంటే వచ్చే ఎన్నికల మాటా?!
నిమ్మళంగా ఊరుకొంటే పక్క రంగాల పోటీకూడా ఎక్కువై పోవచ్చు. ఆశారాం బాపూజీ జాతిపిత బాపూకన్నా పాప్యులరై పోవచ్చు. నిత్యానందుల   ప్రియసఖి నిత్యా మీనన్ కన్నా గ్లామరు గార్ల్ గా పేరు కొట్టేయచ్చు. జనం వినోదం కోసం వెంపర్లాడే అదను చూసి నయీం  మార్కు భాయీలు సతీ సక్కుబాయి డ్రస్సుల్లో కనిపిసే ప్రజాప్రతినిధుల గతేంటీ?!
బంగారక్క.. కేతిగాడు, పిట్టల దొర, కట్టె తుపాకీ రాముడు, గడ కర్ర నడక, గంగిరెద్దు పాట,  చిందు భాగోతం, భామా కలాపం..  అంటూ ఏ మూలనుంచి ఏ నటనా దురంధరులో నటనా రంగంలోకి దూకేస్తే ప్రజానాయకుల కార్యరంగం కబ్జా అయిపోయినట్లే! కోలాటం కర్రలొకసారి పక్క చేతుల్లోకి మారితే.. ఇక్కడ  చెక్క భజనెంత చక్కగా చేసినా జనాలకిక పట్టి చావదు.
అక్కడికీ ఓటర్ల నమ్మకం వమ్ముకాకుండా ఆమరణ నిరాహారానికి బదులు  ఆమరణ రిలే నిరాహార దీక్షలు.. నీళ్లు లేని నదుల్లో దిగి ముక్కుమూసుకు  నిలబడ్డాలు, విజయరథాల్లో నిలబడి పాదయాత్రలు  చేయడంలాంటి చిత్ర విచిత్రాలతో చపలచిత్త జనాల చిత్తాలని  చిత్తు చేసే విన్యాసాల జోరు పెంచుతూనే ఉన్నారు. అయినా ఆశించిన ఫలితాలు ఏ ఎన్నికల్లోనూ ప్రజలు ప్రసాదించడం లేదు!
పసికూనలమీద అఘాయిత్యాలు జరిగి వాతావరణం వేడెక్కినప్పుడుకూడా జనవినోదం సంగతి మన నేతాజీలు పక్కన పెట్టడం లేదు. 'మగకుంకలు  కదా! వయసు కాక మీదున్నప్పుడు దున్నపోతుల్లాకాక ధర్మరాజుల్లా ప్రవర్తిస్తారా! ఆడపిల్లలే కాస్త చూసీ చూడకుండా సహకరించాలి.. కానీ' అంటూ నవ్వించే  కాకాజీలక్ కొదవుండటం లేదు. 'పశు మూత్రం ఫినాయిల్ లాంటిది. ఆసుపత్రుల పరిశుభ్రతకు ఆ ద్రావకం ఉపయోగిస్తే ఫినాయిల్ ఖర్చు బొక్కసానికి ఆదా అవుతుంద'ని మరో ప్రజానేత సెలవివ్వడం.. జనాలు కష్టాలు మరిపించి నవ్వించేందుకు  చేసే బృహత్ప్రయత్నమే!  స్వీయ మూత్రంతో పెరటి సాగును దివ్యంగా సాగించొచ్చని సాక్షాత్తూ ఓ కేంద్రమంత్రులే  ఉధ్భోధించారంటే.. ప్రజావళిని కన్నీళ్ల సాగరంనుంచి గట్టెంక్కించేందుకు హోదాలతోకూడా నిమిత్తం పెట్టుకోకుండా  హాస్యరస పోషణ చేసేస్తున్నారనేగా అర్థం!
ఒక్క అమాత్యులనేమిటి కర్మభూమిలో పుట్టిన ఖర్మానికి పశుపక్ష్యాదులు సైతం ప్రజల వినోదార్థం తమ వంతు పాత్ర నిస్వార్థంగా పోషిస్తున్నాయి. ఆ మధ్య జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పాలిటెక్నిక్కు ప్రవేశ పరీక్షల్లో గోమాతలు కూడా పరీక్షలు రాసి ప్రజలను నోటమాట లేకుండా చేసాయి. వత్తిళ్లల్లో ఉన్న సరిహద్దు ప్ర్రాంతానికి  గోమాత పుణ్యామా అని ఒకపూట ఉపశమనం.
'దేవుడున్నాడా? ఉంటే గింటే ఏ రాజకీయ పక్షం? మూడు సింహాల అశోకచక్రంమీద కనువిందు చేసే 'సత్యం' ప్రస్తుత నివాసం ఏదీ?'అంటూ సమాచార చట్టం కింద యోగాచార్యులొకరు సత్యాన్వేషణకు పూనుకున్నారు. దేవుళ్లమీద జోకులేస్తే ఏమవుతుందో ఫ్రాన్స్ దేశం మనకు ముందే ఉదాహరణగా ఉంది. అయినా ప్రజా వినోదంలో తనవంతు హాస్యపాత్ర నిర్వహించేందుకు అంతలా దుస్సాహం చేసారా ఆ చార్యులవారు.  ఆధ్యాత్మిక రంగం సైతం పోటీకి వస్తున్న సందర్భంలో ప్రజల మధ్య నిత్యం నలిగే ప్రజానాయాకుడు నిమ్మకు నీరెత్తినట్లు ఎట్లా ఉండిపోగలడు?
అందుకే 'దడా దడా పడే వడగళ్లను దారి మళ్ళించి అన్నదాతను ఆదుకోకుంటే  భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ఇళ్లముందు ఆమరణ నిరాహార చేస్తా'నంటూ ఓ ప్రజానాయకుడు ఆందోళనలు లేవదీసాడీ మధ్య. దిగజారుడు రాజకీయంగా చీదర పుట్టించ వచ్చేమో గానీ.. చట్టసభల సమావేశాలు సరిగ్గా సాగని కాలంలో ఓట్లేసి గెలిపించిన జనాలను ఏదో విధంగా వినోదపర్చక తప్పుతుందా మరి! అందులో తప్పు మాత్రం ఏముంది? 
ప్రతిపక్షంలో ఉండీ చట్టసభలకు హాజరవలేని కష్టకాలంలో ప్రశ్నలేసి ప్రజాసమస్యలు వెలుగులోకి తెచ్చే సావకాశం తక్కువ. ఆ కొరత తీర్చేందుకే నవ్వు పుట్టించే చురకలిలా   సర్కార్లమీద  వరసబెట్టి పడుతున్నాయని  అర్థం చేసుకోవాలి.
వినోదానికి ఉన్నంత గుర్తింపు వ్యాపార రంగానికి లేదు. ఆధ్యాత్మిక రంగానికి రాదు. న్యాయరంగానికి నవ్వులాట అసలు పొసగదు. ఉద్యోగ రంగానికది పెద్ద చేటు. రాజకీయరంగమొక్కటే మినహాయింపు. కనకనే ఎన్నికల్లో జనం చీదరించి అవతల పారేసిన చేదు మాత్రనే చక్కర బిళ్లగా చప్పరిస్తూ .. జనాల చేత ఎలాగైనా చప్పట్లు కొట్టించుకోవాలని ప్రజానేతలు తిప్పలు పడుతున్నారు.
నేపాల్ భూకంప బాధితుల పరామర్శకు వెళ్లిన విషాదఘట్టంలో కూడా రాహుల్ బాబు వినోదానికే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వడం మనం మర్చిపోకూడదు. సంతాప సందేశాన్ని కావాలనే కెమేరాలముందు జాతికంతటికీ కనిపించే విధంగా కాపీ కొడుతూ నవ్వు తెప్పించేసాడు. ప్రధాన సమస్యలు చట్టసభలో చర్చకు వచ్చిన సందర్భంలో కూడా బల్లమీద గుర్రు కొడుతూ భలే వినోదం కలిగించాడు. నిద్రలో సైతం జనవినోదం సంగతి మరచిపోలేని మంచిబాలుడన్న జాలైనా లేకుండా మనమే మొన్నటి ఎన్నికల్లో బాబును నిర్దాక్షిణ్యంగా 'ఎడం' చేసుకున్నాం.
అవేమీ మనసులో పెట్టుకోకుండా మళ్లీ ఓటర్ల మనసులు ఆకట్టుకొనేందుకు కిసాన్ యాత్రంటూ  యూపీమీదకొచ్చి పడ్డాడా! ఈ సారైనా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధికారం 'చేయి' జారిపోరాదనే. మోదీజీ  'చాయ్ పే చర్చా'కి పోటీ.. 'కాట్ పే చర్చా' భేటీ!  ఎవరికీ తట్టని ఈ కొత్త వినోదంతో జనాల మధ్యెలా చెలరేగి పోయాడో ఆ మధ్య!
కెమేరాల సాక్షిగా కడుపుబ్బే కామెడీ షో. కుర్చీ మళ్లీ సంపాదించాలంటే 'మంచమే' మంచి ఆయుదమని ఎలా తట్టిందో మరి! మోదీజీ మీద అతగాడు రువ్వే నిప్పు రవ్వల్లాంటి  మాటలు జనాలకు ఎలాగూ జోలపాటల్లాగుంటాయని కాబోలు.. ప్రశాంత్ కిశోర్  సాబు.. బాబు సభల్లో నులక మంచాల డాబు.. సందర్భోచితంగా ప్రవేశ పెట్టేయించింది . సమావేశాల అనంతరం     కనిపించిన  'మంచాల'  సమరావేశాల దృశ్యం  ఆసేతు హిమాచల పర్యంతం రాహులుకి అశేషమైన  గుర్తింపు తెచ్చి పెట్టింది.  సైకిలు అఖిలేషు బాబుతో కలిసి పోటీచేస్తున్నాడుగా ఉత్తర ప్రదేశులో! చూద్దాం! నిజంగానే ఈ నయా గాంధీ  వర్గానికి  అధికార పగ్గాలందితే ఇంకెన్ని వినోద వల్లరులు చెలరేగిపోతాయో దేశం నిండా?!
-కర్లపాలెం హనుమంతరావు








Sunday, January 29, 2017

హే.. గాంధీ! -జనవరి- 30 గాంధీజీ వర్ధంతి సందర్భంగా


'హే.. గాంధీ!' అన్నాడు రాముడు.
'మహాత్మా! నువ్వు బతికున్నంత కాలం 'రఘుపతి.. రాఘవ.. రాజా.. రాం..' అంటూ పద్దాకా రాంకీర్తనలతో నా బుర్ర పాడుచేసేవాడివి! అందరికీ సన్మతి ఇవ్వమని తెగ ఇబ్బంది పెట్టేవాడివి. ఇప్పుడు ఆ రఘు.. రాఘవులు... రాజా.. రాం' లంతా .. ప్రతిపక్షాలలో చేరిపోయారయ్యా!  నా రామరాజ్యస్థాపనకి అడ్డు పడుతున్నారయ్యా!'
‘నారాయణ.. నారయణ.. అల్లా,, అల్లా..   భగవంతుడి బిడ్డలమే మేమల్లా!.. అనుకొని సర్దుకు పోరాదా రామా?'
'అల్లా వచ్చి నచ్చి చెప్పినా ఆ నారాయణా.. ఈ  సత్యనారాయణా.. అంతా  అవతలి పక్షంలోనే ఉండి పుల్లలు పెడుతున్నారు కదయ్యా!’
ఆలోచనలో పడ్డాడు మహాత్ముడు.
సందుచూసుకొని అందుకొన్నాడు ఆంజనేయుడు 'బాపూజీ!. నరలోకంనుంచి నాకూ సమాచారం ఉంది. నువ్వు సత్యంతో  ప్రయోగాలు చేసావు.   నీ వారసులు  ఇప్పుడు అక్కడ అసత్యాలతో ప్రయోగాలు చేస్తున్నారు. అమాయకులైన జనాలలో అయోమయం సృష్టిస్తున్నారు'
'అసత్యాలతో ప్రయోగమా?!'
'అవును మహాత్మా! ఎన్నికలు తన్నుకు రాగానే ముందు అసత్యం సత్యం మేకప్పేసుకొని తైతెక్కలాడేందుకు  తయారవుతోంది! చాలా పార్టీల ఎజెండాలు అసత్యాలతో చేసే ప్రయోగాలే! అభ్యర్థులైతే సాక్షాత్తూ  మూర్తీభవించిన అసత్యనారాయణమూర్తులు! ఎన్ని లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన షావుకారైనా .. ఎన్నికల సంఘం ముందు ఒకటో అరో  తప్ప ఏ కారూ లేని   బికారి. ఆ డొక్కు కారూ ఏ బ్యాంకువారి  సహకారంతోనో అరువుమీద  తెచ్చుకొన్నదంటున్నాడు.. పాపం. ఇంటాడాళ్ళ  షాపింగు పనికే  ఆ కారు.  అయ్యవారు చట్టసభకు వెళ్లి రావాలన్నా షేరు ఆటోనే గతి. ఆస్తి పాస్తులకన్నా.. అప్పులు, పన్నులు.. పస్తులైనా ఉండి కట్టాల్సిన బొచ్చెడు శిస్తులు! ఇంత కష్టంలో ఉండీ మరి ఎన్నికల్లో పోటీ ఎందుకయ్యా? అంటే..  ప్రజాసేవ ఓ గ్రామైనా చేయకపోతే  జీవితానికసలు పరమార్థమే లేదు. వృథా ఐపోతుందని  బతికున్న రోజుల్లో తవరు ఏ  సేవాగ్రామ్ లోనో సెలవిచ్చారుట! మీ మాటే మీ వారసులకు శిరోధార్యమట!’
బిత్తర పోయి చూశాడుబాపూజీ.
తవరు చెట్టైతే వాళ్లు తమరి పేరుతో అమ్ముడయ్యే పచ్చికాయలు. తవరు తల్లైతే వాళ్లు తమరి  కొంగుచాటున ఎదిగిన  పసిపిల్లకాయలు! '
'నిజంగానే వాళ్లు నా సిధ్ధాంతాలను నమ్మి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారేమో?  అనుమానం.. అవమానం అవుతుందయ్యా హనుమంతయ్యా!’
'మరే.. మహాత్మా! వాళ్లంత ఉగ్రభక్తులు కాబట్టే తవరు తాగద్దన్నారని  కల్లు గట్రా  మానేసి ఖరీదైన సీమ సరుకుతో సర్దుకుపోతున్నారు. సన్నకారుకంత భరించే స్తోమతుండదు కాబట్టి.. చీపు లిక్కరు బట్టీలు పెట్టించి  ప్రజాసేవలో తరిస్తున్నారు. చాలా సర్కారులకు మొన్నటి వరకూ అబ్కారీ వసూళ్ళే అసలైన ఆదాయం. జనంకూడా జాతిపితను మర్చి పోలేక .. తవరి జయంతి, వర్ధంతుల రోజుల్లో.. మందు  దుకాణాలు  బందుపడున్నా ఏ సందులో షట్టరు సందులో నుంచైనా పుడిసెడు పుచ్చుకోనిదే  నిద్రపోవడం లేదు.. పాపం'
'రామ!.. రామ! రామరాజ్యం వస్తే జనమంతా సుఖపడతారని కదా హనుమా  నా కల!’
‘సుఖపడే పాలన  యధేఛ్ఛగానే సాగుతోంది మహాత్మా అక్కడా! చెప్పడానికి  నాకే సిగ్గేస్తోంది.. రాజభవనాల్లో సైతం రాసలీలల స్వేఛ్చకు ఇబ్బందుల్లేవు. మోక్షమందించే ఆశ్రమాలు గొంది గొందికీ వందలు వందలు వెలుస్తూనే ఉన్నాయ్! మాయా మర్మాలతో  ప్రయోగాలు సాక్షాత్తు న్యాయదేవత కళ్లముందే  సశాస్త్రీయంగా సాఫీగా సాగిపోతున్నప్పుడు ఇహ  జానకీరాముడొచ్చి పాలనలో  కలగ చేసుకోవాలా? బంగారం  బిల్లులు.. ఆస్తి పత్రాలు..  బ్యాంకు కాతాలు.. బినామీలు..  నోట్ల నకిలీలు..  అన్నీ అసత్యంతో నల్లమారాజులు నిత్యం చేసే ప్రయోగాలేగదా!  నీది చరఖా చక్రం తిప్పుకొనే తిప్పలు. నీ వారసుల్ది  రాజకీయచక్రం స్వలాభంకోసం తిప్పే ఎత్తులు!’
‘చెడు.. వినొద్దు.. కనొద్దు.. అనొద్దు.. అన్న నా మొత్తుకోళ్లో మరి?’
‘చెడు అన్న ఆ ఒక్క పట్టింపు తప్పించి మిగతా ఆ ‘అనద్దు.. కనొద్దు.. అనద్దు’  సూత్రం మాత్రం మహా నిబద్ధతతో పాటిస్తున్నారు మహాత్మా తమరి వారసులు.. గాంధీలు. ఆడది అర్థరాత్రి ఒంటరిగా నిర్భయంగా బైట తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యమని మీరు మరీ అత్యాశ పెట్టారు కదా పిచ్చితల్లులకు!  మగాడే బైట పగటిపూట పదిమంది మధ్యలో ధీమాగా తిరిగే రోజులు కావని తెలుసుకోలేని అమ్మళ్లు ఇప్పుడు నానా అగచాట్లు పాలవుతున్నారు! ఏ మాటకు ఎవరు ఏ పూట ఏ  విపరీతార్థం లాగుతారో.. ఏ వైపునుంచి ఏ వాహనం తూలుతూ వచ్చి మీదెక్కుతుందో.. ఏ ముఖపుస్తకం టపా ‘ఠపా’మని పేలి ఎవరు ఎప్పుడు టపా కట్టాల్సొస్తుందో .. అంతా గందరగోళంగా ఉందిప్పుడు కింది భూగోళంలో! జీవితం క్షణభంగురం. నిజవేకానీ.. మరీ భంగుతాగినోడి మాదిరి తూలుతో సాగడం ఎంత ఇబ్బందో  సామాన్యులకు?’
‘ఐతే మళ్లీ ఓ సారి నా భరత ఖండాన్ని దర్శించి రాక తప్పదంటావా హనుమా?’ లేచి నిలబడ్డాడు బాపూజీ.
'బొడ్దులో గడియారం, బోసి నోరు, చేతిలో కర్ర, కొల్లాయి గుడ్డ, కళ్ల జోడు.. వంటివన్నీ వంటిమీదుంటేనే గాంధీతాత అనుకొనే తరాలు తెరమరుగయ్యాయి పిచ్చి మహాత్మా! గాంధీ అంటే మొన్నటోళ్లకి ఇందిరా గాంధి, నిన్నటోళ్లకి సోనియా గాంధి. ఇప్పటోళ్లకి రాహుల్ గాంధి. రేపటోళ్ళకి ఏ ప్రియాంక గాంధీనో.. అమె బిడ్డో!’
అంటే నా'దేశం నన్ను మర్చి పోయినట్లా.. నా బోధలు గుర్తుకురానట్లా?’
'’గాంధీ’ అని కొట్టి చూడు బాపూజీ ఈ కంప్యూటర్లో! ‘రాహుల్ గాంధీ’ అన్న హిట్లే ఎక్కువ కనిపిస్తాయయ్  గూగుల్ వెదుకులాట యంత్రంలో!  ఇప్పట్టున ఏ ఇండియా టు-డేతో సర్వే తీయించినా  ఇందిరా గాంధీకన్నా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకే తక్కువ ఓట్లొస్తాయి కచ్చితంగా ‘మహాత్ము’ల జాబితాలో!’
‘నడి రోడ్డుమీద  నా విగ్రహలు అడుగడుక్కీ కనబడుతుంటాయి కదయ్యా హనుమయ్యా! వాటి వల్ల మరి ఎవరికీ ఏ ఉపయోగమూ లేనే లేదంటావా?’
‘ఒక్క పిట్టలు రెట్టలేసుకోడానికి, గల్లీ బుల్లి నాయకులు .. ఎన్నికలప్పుడు  కటౌట్లు పడిపోకుండా నిలబెట్టుకోడానికీ పనికొస్తాయి బాపూజీ న్ విగ్రహాలు!’
‘కొత్త రెండు వేల నోటుమీద నా మొహం ముద్రించి నా స్థాయి రెట్టింపు చేసారని  విని సంబర పడుతున్నాను కదయ్యా.. అదీ మరి వట్టి పటాటోపానికేనంటావా!’
‘ఆ   నోట్లమీద నీ బొమ్మకింద ‘మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ’ అని గానీ రాయించుకొనే ఏర్పాటు చేయించుకోకపోతే గాంధీ మూవీలో ఏ కిన్ బెన్స్లేనోలే అనుకునే  రోజులూ ఆట్టే దూరంలో లేవు! తమరు   ప్రబోధించిన సత్యం పథ్యంగా మాత్రమే పనికొస్తుందన్నదీ నాటి నాయకుల నమ్మకం. అహింస అంటే  చేతిలో ఏ కత్తో.. కర్రో.. కనీసం పాత చెప్పైనా  లేని నిస్సహాయ స్థితిలో  పనికొచ్చే ఆఖరి అస్త్రం అని జనమూ బలంగా నమ్ముతున్నారు. 'భలే తాత మన బాపూజీ' అని పాడిస్తో నిన్ను బాలలకి మాత్రమే ఓ మోడలుకింద  పరిమితం చేసేసి  తమ రాజకీయ లీలలను స్వలాభాలకోసం కొనసాగించే వ్యూహానికి పదును పెడుతున్నారు నీ గాంధీ వారసులు.  నిన్ను నమ్ముకున్న వారి ముందు   నవ్వుల పాలవకుండా ఉండేందుకైనా నువ్వు పెందలాడే మేలుకొంటే నీ పేరుకు మరింత మచ్చ రాకుండా ఉంటుంది. ఇవాళ నీ వర్ధంతి. కాబట్టి ఎక్కడున్నా నీ వారసులంతా నీ సమాధి  'రాజఘాట్' కొచ్చి కనీసం రెండు నిమిషాలైనా నిశ్శబ్దంగా తలొంచుకొని క్కూర్చోక తప్పదు.. మంచి అదను. ఇది తప్పితే మళ్ళీ అక్టోబరు రెండు దాకా నీకు అప్పాయింట్మెంటు దొరకదు. ఏం చేస్తావో.. ఎలా దారికి తెస్తావో మరి.. నీ వారసులమని వరసబెట్టి జనంలో కొచ్చి పడే వాళ్ల సంగతిహ నువ్వే చూసుకోవాలి’
'నిజమే! ఇదిగో  బైలుదేరుతున్నా!'
'ఇలాగా!  ఎవరూ నిన్ను గుర్తు పట్టరయ్యా పిచ్చి మహాత్మా! ఏ తెదేపా శివప్రసాదో మారు వేషంలో వచ్చాడని నవ్వుకుంటూ పోతారు. వంటికి వెండి పూత పట్టించు దట్టంగా!  ఓ గంట ముందే వెళ్లి ఆ ఎండలో రాజఘాట్ గేటు బైట శిలావిగ్రహంలా దారి కడ్డంగా నిలబడు. అదను చూసుకొని వాళ్ల చూపు నీ మీద పడ్డ తరువాత.. ఇహ నీ ఇష్టం'
కొల్లాయి గుడ్డ బిగించుకొని చేతి కర్ర పుచ్చుకొని  లేచి నిలబడ్డాడు అహింసా మూర్తి బాపూజీ ఆవేశంగా.
'అదీ వరస. శుభం. ముందే ప్రధాని మోదీ అక్కడ నువ్వు ప్రబోధించిన   ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెట్టేసాడు.  నువ్వూ  ఓ చెయ్యి వెయ్యి. నా రామరాజ్య స్థాపనకి ఓ ఇటుక వెయ్యి!’ అంటూ ఆశీర్వదించాడు పరంథాముడు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి ధన్యవాదాలతో.. ఈనాడు దినపత్రిక యాజమాన్యంవారి సౌజన్యంతో)


Thursday, January 26, 2017

ఎద్దై పుట్టేకన్నా.. ఓ వృషభం సరదా విలాపం


ఎద్దై పుట్టే కన్నా ఏ అడవిలోనో  చింత మొద్దై పుట్టడం మేలు.
ఆరుగాలం పరుగులే పరుగులు. కొండ్రలు దున్నే వేళా  చెవుల్లో చెర్నాకోలు ‘ఛెళ్లు’ శబ్దాలు!

ఎంకి పెళ్లి సుబ్బి  చావుకొచ్చిందంటారు.  ఎంకి మా తమిళబ్బయితే. సుబ్బి.. ఇంకెవరు.. ఖర్మ కాలి మా ఎద్దు జాతే!

పొంగళ్ళ పండుగొచ్చిందన్న పొంగు ఒక రోజన్నా  ఉండదు. మూడో రోజునుంచే  ఎద్దుకు  యమలోక దర్శనం.  'దౌడో! దౌడో' అంటో ఒహడే గోడు! గుండాగి పోయేట్లు పరుగెత్తడానికి మేమేమన్నా సర్కారు పోలీసు ఉద్యోగాలు కోరుకొంటున్నామా?

మానవా! ఉరుగులు పరుగులు తప్ప  తమరికింకేమీ తెలీవా? పొద్దు పొడిచింది మొదలు.. పొద్దు గడిచేదాకా .. పరుగులు నురుగులేనా గురువా? కొవ్వు కరిగించుకోడానికి పరుగులు. బడులకు.. పన్లకు  పరుగులు. బాసుల వెనకాల బడి పరుగులు. ఆడాళ్లవెంట పడీ పడీ   పరుగులు. అప్పులోళ్లు వెంటబడితే పక్క సందుల్లోకి పరుగులు. చిల్లర  మాట చెవినపడ్డా పరుగులు! కొత్త  నోట్లకోసం నురుగులు! ఒక్క ఒలంపిక్కు పరుగుల్లోనే నింపాదిగా పెళ్లివారి నడకలు!

ఎద్దు మొద్దు స్వరూపాలని ఎద్దేవా చేసే పెద్దమనుషుల్లారా.. మా కాడెద్దులకన్నా  తవఁరెందులోనండీ పోటుగాళ్లు? గిట్టని మాట చెవిన బడితే చాలు..  గిట్టలిసిరే అసహనంలోనా? మా గడ్డిక్కూడా పాలుమాలే పోటీల్లోనా? 

ఏడాదికోసారే  వచ్చి పోయేది  పెద్దపండుగ. ఏదోలే.. ఏడ్చిపోతారని కదా  మేం   మీ కుళ్ళు  గుడ్డల్తో  ఊరేగేది?  గడప గడపకీ  వచ్చి దణ్ణాలు.. దస్కాలు పడీ పడీ పెట్టి పొయ్యేది  తవఁరి  గొప్పతనాలు చూసనా అయ్యల్లారా!   నిన్నటి దాకా ఒక పురచ్చి తలైవికి.  ఆ తల్లి తరలెళ్ళి పోయిన తెల్లారినుంచే మరో పుచ్చిన తలైవికి. మా గంగిరెద్దులకన్నా నంగిగా బుర్రలూపే తవఁరు .. ఎందులోనండీ బాబులూ  మా ఎద్దుజాతి కన్న మెరుగులు?

మీ పెట్ర్రోలోళ్ళ మాదిరి పూటకో రేటుతో అదరగొట్టం మేం. ఆయిలు ధరలు  అలా ఓ పది పైసలు పెరిగినప్పుడల్లా మీ నేతలే కదా మా బుల్లక్కార్ట్ల మీద ఊరేగుతూ  మా గొప్ప బిల్డప్పులిచ్చేది!  కార్నుంచి కార్లోకి తప్ప కాల్తీసి పెట్టని  షావుకార్లక్కూడా ఎన్నికలొస్తే చాలు   మా ఎద్దులబళ్లమీదెక్కినప్పుడే గొప్ప  కిక్కొచ్చేది.  

మళ్లీ జన్మంటూ ఉంటే ఆ మడోనా బాబులాగా పుట్టి మీ గోముఖ వ్యాఘ్రం మార్కు తొడుగుల్తో చెడుగుడాడేయాలని ఉంది! ‘గుడ్డే’ తప్ప చెడుతో ఆడ్డం చేతకాని పశువులం. అందుకే ఇప్పుడిన్ని  తిప్పలు !

అలవాటు లేని మందూ మాకు  మాకు పట్టించి బరికెల్తో, బరిసెల్తో  నడివీదుల్లోబడి దౌడు  తీయించే పాడు బుద్ధులెందుకండీ కామందులూ ప్రదర్శిస్తారు మా   ముందు? మీ బడి పిల్లకాయల   పుస్తకాల బస్తాలకన్నా ఎక్కువ బరువులు చడీ చప్పుడు లేకుండా మోస్తున్నందుకా ?

తవఁరికేవఁన్నా వినోదాలు  తక్కువయ్యా దొరబాబులూ మా బతుకులనిలా వీధుల పాలు చేసి అల్లరి చేసేస్తున్నారూ ?  వారానికో అయిదు అన్రియల్  చలన చిత్ర రాజమ్ములు..  అరగంటకో పాలి తింగిరి పింగిరి టీవి సీరియళ్లు! అదనంగా.. ఇప్పుడీ ఐదు రాష్ట్రముల ఎన్నికల  పాంచ్ పటాకా చాలకా..  వినోదానికింకేం కరువొచ్చిందని ధర్మప్రభువులూ.. మా ఎనుబోతుల మీదిలా పడి కరవొస్తున్నది అందరూ.. 'జల్లికట్టు' సంప్రదాయమని వంక బెట్టుకొని!

ఆంబోతేమన్నా  అప్పుడే విడుదలైన కొత్తైదొందల నోటా ?  అందరూ కల్సి అలా కుమ్మేసుకోడానికి కనీసం  ఆ పూటే విడుదలైన సినిమా ఆటైనా కాదే?!

పురచ్చి తలైవమ్మలా మెరీనా బీచ్ రీచవగానే పొయస్ గార్డెన్ మార్క్ దస్కత్  కుర్చీ కోసం.. అది  సంపాదించే డబ్బూ దస్కంకోసం ఎన్ని ముఠాలు?  ఎంతమంది మాయల మరాఠీలు? ఎద్దు కాలి ముల్లంత లేకపోయినా ఏడూళ్ల పెత్తనానికి తయారై పోయారందరూ.  ఎలపటి ఎద్దు ఎండకు లాగా.. మలపటి ఎద్దు నీడకు లాగా సామెతలాగా  సాగే రాజకీయాలని మళ్లీ ఒక్క  కట్టుమీదకు లాక్కొచ్చినందుకన్నా జల్లికట్టును జాలితో  వదిలేసెయ్యచ్చు కదయ్యా?

నవరసు పేటల నగా నట్రా ఏమన్నా అడుగుతున్నామా? ఆ ‘పేటా’ పెద్దలు ఫిర్యాదులకు పీటముళ్లేసి న్యావానికి అడ్డు రావద్దనేది ఒక్కటే దయగల పెద్దలకు మా విన్నపాలు!

తవఁరు పెట్టే గడ్డి విషంకన్నా హీనం.  పట్టించే కుడితికన్నా గరళం మహా సరళం.   అయినా కిమ్మనకుండా కొమ్ములొంచుకొని  బండ బరువులన్నింటినీ మౌనంగానే భరిస్తుంటిమి గదా యుగ యుగాల బట్టీ. జల్లికట్టు మిషతో మా వళ్లనింకా ఇలా  జల్లెళ్ల మాదిరి తూట్లు పొడవడం అన్యాయం.. ఈ అత్యాధునిక యుగంలో కూడా!

'అరవం.. అరవం' అంటూనే ఎంతలా అరిచి అల్లరి చేస్తున్నారర్రా అందరూ! ఎంత లావు ఒంగోలు జాతైనా రాజకీయాలముందు ఒంగోక తప్పదని తేల్చేసారు! న్యాయస్థానాల దగ్గర పప్పులుడకవని.. రాజాస్థానాలను ఆశ్రయించేసారు! ఎద్దు తంతుందని గుర్రం చాటున నక్కే నక్క జిత్తులు ప్రదర్శించారు!

ఎవర్నని ఏం లాభం? ఎన్నుబోతు ఖర్మ రుచి చూడాలంటే  ఎద్దుగా ఏడాది ఎందుకు.. ఆంబోతుబా ఆర్నెల్లు బతికి చూడాలి! అదీ అరవనాడులో.. పొంగలు సంబరాల్లో. పశువు జీవితమంటేనే వికారం  పుడుతుంది.   రాజకీయాలమీదకే  మళ్లీ మమకారం మళ్లుతుంది.
ఏదేమైనా ఎద్దు చచ్చినా వాత బాగా వేశారర్రా అంతా  కల్సి. ఈ సారికేదో జల్లి కట్టు ‘కుమ్ములాట'కు సిద్ధం చేసేసామంటారా అంతా.
గిత్తలుగా పుట్టడం తప్పయి పోయింది.  సారీ! ఏ నత్తలుగానో.. సోనియాజీ అత్తలుగానో పుడతాం అవకాశం వస్తే వచ్చే సారి. పోనీ ఇహ ముందైనా  మా పశుజాతిమీద  పిసరంత జాలి చూపండయ్యా కామందులూ! కావాలంటే చచ్చి మీ రాజకీయ నేతల కడుపుల్లో పుట్టడానికైనా మేం సిద్ధం.

ఇన్ని చెప్పుకున్నా ఎనుబోతుమీద వాన కురిసినట్లే అంటారా?.. ఇహ మేం మాత్రం చేసేదేమంది.. కొమ్ములకు పదును పెట్టుకోడం మినహా!
-కర్లపాలెం హనుమంతరావు




  

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...