Monday, January 30, 2017

దగ్గరి దారి- మరీ చిన్న కథ

ముఫ్ఫై అపార్ట్ మెంట్ల కాంప్లెక్స్ మాది. లిఫ్ట్ పనిచేయని ఓ పరగడున పాల పాకెట్లు తీసుకొని మెట్ల దారిన వస్తుంటే రెండో ఫ్లోర్ మెట్లకు ఓ మూల నిండుగర్భిణీలా ఉన్న ఓ వ్యాలెట్ కంటబడింది. అప్రయత్నంగా వంగి దాన్నందుకొని చూస్తే బరువును బట్టి లోపల సొమ్ము భారీగా ఉందని తేలింది. సభ్యత కాదు కాబట్టి ఎంతుందో తెలీదు కానీ.. మొత్తానిక అంతా దాదాపుగా ఐదొందలు.. వెయ్యినోట్లే. క్రెడిట్ .. డెబిట్ కార్టుల్లాంటివీ ఏవేవో ఉన్నాయి.  అన్నింటి మీదా బి. గోవింద రాజన్ అన్న పేరే ఉండుంటం వల్ల ఆ పర్శుతాలూకు ఆసామి ఎవరో తేలిపోయింది. వాచ్ మెన్ అప్పారావును అడిగితే .. అలాంటి పేరున్న వాళ్లెవరూ అపార్టుమెంట్లలో లేరని తేల్చాడు.
'ఇంత సొమ్ముంది. పై పెచ్చు ప్లాస్టిక్ కార్డులు! పోగొట్టుకొన్న మనిషి తానే వెదుక్కుంటూ రాడా? అప్పుడు తిరిగిచ్చేద్దాంలే!' అనిపించి ఇలా పర్శు నా దగ్గరుందని వాచ్ మెన్ కు చెప్పి  వచ్చేసాను.

ఒకటి రెండు రోజుల్దాకా ఎవరూ రాలేదు! ఆశ్చర్యం! మరీ ఆశ్చర్యం ఒక నెల రోజులు దాటినా ఎవరూ రాలేదు.

పరాయి సొమ్మును పాములా భావించే చాదస్తం  నాది. పోనీ  పోలీసులకిలా దొరికిందన్న సమాచారమిద్దామా అనిపించింది. వాళ్ల పోకిరీ బుద్ధి బాగా తెల్సుండబట్టి మనసొప్పలేదు. గుళ్లో హుండీలో వేయమని మొదలు పెట్టింది మా శ్రీమతి. పోలీసులకన్నా దేవుడి చూట్టూతా చేరిన  వాళ్లేమన్నా బుద్ధిమంతులా? ఆ పనీ చెయ్య బుద్ధి కాలేదు.
ఇంట్లో మధన ఇలా సాగుతుండగానే  మా  ధర్మ విచికిత్సను పటాపంచలు చేస్తూ  కాలింగు బెల్ కొట్టి మరీ ఓ నడి వయసు శాల్తీ లోపలి కొచ్చింది. అయిన పరిచయాలను బట్టి అతగాడు ఏదో ప్రైవేటు కాలేజీ లక్చెరరని తేలింది. అందరికీ    'గోరా'గా తెలిసిన అతగాడి అసలు పేరు 'గోవింద రాజ కుమారన్'ట! మా కాంప్లెక్సులో అద్దెకు దిగి ఇంకా రెండు నెలలు కూడా నిండక పోవడంతో అతగాడి ఆరిజన్ తమిళనాడు సైడు వేలూరని పసిగట్ట లేకపోయాం.   కృష్టాజిల్లా బ్రాహ్మణ యాసతో స్పష్టమైన తెలుగు మాట్లాట్టం వల్లా  గోరా రూట్స్ గోరైంతైనా పసిగట్టలేక పోయాం ఎవ్వరం.
పర్శులో ఐదువేల ఏడొందలు .. ఐదు వెయ్యి నోట్లు.. ఒక్క ఐదొందల నోటు.. నాలుగు యాభై నోట్లున్నాయని చూడకుండానే చెప్పేసాడు. క్రెడిట్.. డెబిట్ కార్డు వివరాలు కూడా అన్నీ పొల్లుపోకుండా చెప్పడంతో .. ఇంకా సందేహించడం అవమానించడమే అవుతుంది. అంతే కాదు. ఆ పరాయి సొమ్మును ఇంకా మోసే మానసిక స్థైర్యం నాకు లేదు. మా శ్రీమతిగారి హుషారుక్కూడా  అడ్డుకట్ట పడినట్లుంటుందన్న ఆత్రంతో పర్శు తిరిగి తెచ్చిస్తూ' అన్నీ సరిగ్గా  ఉన్నాయో.. లేవో.. ఒకసారి సరి చూసుకో బాబూ!' అన్నాను,
'ఉంటాయంకుల్! మీ నిజాయితీని గురించి  ఇక్కడందరూ చెప్పుకుంటుంటారు. ఆ  ధీమతోనే  ఆ రోజు మీ కంట బడేట్లు ఈ పర్సును  మెట్ల మూల పడేశాను. మీరా పరగడుపు చీకట్లలో  చూడ లేదు కానీ.. నేనక్కడే ఓ వారగా నిలబడున్నాను' అన్నాడు!
ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టడం నా వంతయింది. ఇన్నాళ్ళూ నన్నవసరంగా టెన్షన్ పెట్టడం కొద్దిగా కోపం కూడా తెప్పించింది. నా ముఖంలోని భావాలను చదివినట్లుగా నొచ్చుకుంటున్నట్లు మొహం పెట్టి అన్నాడు గోరా 'సారీ! పెద్దవారు. మిమ్మల్నిలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది. ఇంకేం  చేసేది? ఆ టైంలో ఇంట్లో మా అమ్మ నాన్నలున్నారు. మా నాన్నగారికి మందు పిచ్చి, దానికి తోడు నా జేబులు తడిమి ఎంతుంటే అంత పట్టుకేళ్లే అలవాటు. అడిగితే పెద్ద రభస అమ్మతో కూడా. బైకుమీదనుంచి పడి బాగా దెబ్బలు తగిలున్నాయని నన్ను చూడ్డానికి  హఠాత్తుగా ఊడి పడ్డారిద్దరూ. మర్నాడు మళ్లా బ్యాంకులో వేద్దును కానీ కుంటికాలు.. పెద్ద పెద్ద  క్యూలు! కుదర్లా! అంతకు ముందు రోజు రాత్రే మోదీగారీ పెద్దనోట్లు రద్దుచేసారు.  మా   వాళ్లిద్దర్నీ ఇప్పుడే బస్సెకించి  వస్తున్నా. సారీ  అంకుల్..  మా పేరెంట్సిద్దరూ  ఊరికెళ్లిందాకా నా హార్డ్ ఎరన్డ్ మనీ భద్రంగా ఉండాలంటే ఇంతకు మించి నాకు మరో దారి కనిపించలా’
.  
డబ్బు దాచుకోడానికి డబ్బు పోగొట్టుకోడం కూడా ఓ దగ్గరి దారని కనిపెట్టిన గోరా తెలివికి నోరెళ్ల బెట్టడం నా వంతయింది!
లకీగా ఇవాళ్టికింకా ఒక్క రోజు గడువు మిగిలుంది రద్దైన పెద్ద నోట్లు బ్యాంకులో వేసుకోడానికి. సంతోషమూ అయింది.
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల పత్రికలో మరీ చి.క(మరీ చిన్న కథ) గా ప్రచురితం)

***


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...