Sunday, January 29, 2017

హే.. గాంధీ! -జనవరి- 30 గాంధీజీ వర్ధంతి సందర్భంగా


'హే.. గాంధీ!' అన్నాడు రాముడు.
'మహాత్మా! నువ్వు బతికున్నంత కాలం 'రఘుపతి.. రాఘవ.. రాజా.. రాం..' అంటూ పద్దాకా రాంకీర్తనలతో నా బుర్ర పాడుచేసేవాడివి! అందరికీ సన్మతి ఇవ్వమని తెగ ఇబ్బంది పెట్టేవాడివి. ఇప్పుడు ఆ రఘు.. రాఘవులు... రాజా.. రాం' లంతా .. ప్రతిపక్షాలలో చేరిపోయారయ్యా!  నా రామరాజ్యస్థాపనకి అడ్డు పడుతున్నారయ్యా!'
‘నారాయణ.. నారయణ.. అల్లా,, అల్లా..   భగవంతుడి బిడ్డలమే మేమల్లా!.. అనుకొని సర్దుకు పోరాదా రామా?'
'అల్లా వచ్చి నచ్చి చెప్పినా ఆ నారాయణా.. ఈ  సత్యనారాయణా.. అంతా  అవతలి పక్షంలోనే ఉండి పుల్లలు పెడుతున్నారు కదయ్యా!’
ఆలోచనలో పడ్డాడు మహాత్ముడు.
సందుచూసుకొని అందుకొన్నాడు ఆంజనేయుడు 'బాపూజీ!. నరలోకంనుంచి నాకూ సమాచారం ఉంది. నువ్వు సత్యంతో  ప్రయోగాలు చేసావు.   నీ వారసులు  ఇప్పుడు అక్కడ అసత్యాలతో ప్రయోగాలు చేస్తున్నారు. అమాయకులైన జనాలలో అయోమయం సృష్టిస్తున్నారు'
'అసత్యాలతో ప్రయోగమా?!'
'అవును మహాత్మా! ఎన్నికలు తన్నుకు రాగానే ముందు అసత్యం సత్యం మేకప్పేసుకొని తైతెక్కలాడేందుకు  తయారవుతోంది! చాలా పార్టీల ఎజెండాలు అసత్యాలతో చేసే ప్రయోగాలే! అభ్యర్థులైతే సాక్షాత్తూ  మూర్తీభవించిన అసత్యనారాయణమూర్తులు! ఎన్ని లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన షావుకారైనా .. ఎన్నికల సంఘం ముందు ఒకటో అరో  తప్ప ఏ కారూ లేని   బికారి. ఆ డొక్కు కారూ ఏ బ్యాంకువారి  సహకారంతోనో అరువుమీద  తెచ్చుకొన్నదంటున్నాడు.. పాపం. ఇంటాడాళ్ళ  షాపింగు పనికే  ఆ కారు.  అయ్యవారు చట్టసభకు వెళ్లి రావాలన్నా షేరు ఆటోనే గతి. ఆస్తి పాస్తులకన్నా.. అప్పులు, పన్నులు.. పస్తులైనా ఉండి కట్టాల్సిన బొచ్చెడు శిస్తులు! ఇంత కష్టంలో ఉండీ మరి ఎన్నికల్లో పోటీ ఎందుకయ్యా? అంటే..  ప్రజాసేవ ఓ గ్రామైనా చేయకపోతే  జీవితానికసలు పరమార్థమే లేదు. వృథా ఐపోతుందని  బతికున్న రోజుల్లో తవరు ఏ  సేవాగ్రామ్ లోనో సెలవిచ్చారుట! మీ మాటే మీ వారసులకు శిరోధార్యమట!’
బిత్తర పోయి చూశాడుబాపూజీ.
తవరు చెట్టైతే వాళ్లు తమరి పేరుతో అమ్ముడయ్యే పచ్చికాయలు. తవరు తల్లైతే వాళ్లు తమరి  కొంగుచాటున ఎదిగిన  పసిపిల్లకాయలు! '
'నిజంగానే వాళ్లు నా సిధ్ధాంతాలను నమ్మి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారేమో?  అనుమానం.. అవమానం అవుతుందయ్యా హనుమంతయ్యా!’
'మరే.. మహాత్మా! వాళ్లంత ఉగ్రభక్తులు కాబట్టే తవరు తాగద్దన్నారని  కల్లు గట్రా  మానేసి ఖరీదైన సీమ సరుకుతో సర్దుకుపోతున్నారు. సన్నకారుకంత భరించే స్తోమతుండదు కాబట్టి.. చీపు లిక్కరు బట్టీలు పెట్టించి  ప్రజాసేవలో తరిస్తున్నారు. చాలా సర్కారులకు మొన్నటి వరకూ అబ్కారీ వసూళ్ళే అసలైన ఆదాయం. జనంకూడా జాతిపితను మర్చి పోలేక .. తవరి జయంతి, వర్ధంతుల రోజుల్లో.. మందు  దుకాణాలు  బందుపడున్నా ఏ సందులో షట్టరు సందులో నుంచైనా పుడిసెడు పుచ్చుకోనిదే  నిద్రపోవడం లేదు.. పాపం'
'రామ!.. రామ! రామరాజ్యం వస్తే జనమంతా సుఖపడతారని కదా హనుమా  నా కల!’
‘సుఖపడే పాలన  యధేఛ్ఛగానే సాగుతోంది మహాత్మా అక్కడా! చెప్పడానికి  నాకే సిగ్గేస్తోంది.. రాజభవనాల్లో సైతం రాసలీలల స్వేఛ్చకు ఇబ్బందుల్లేవు. మోక్షమందించే ఆశ్రమాలు గొంది గొందికీ వందలు వందలు వెలుస్తూనే ఉన్నాయ్! మాయా మర్మాలతో  ప్రయోగాలు సాక్షాత్తు న్యాయదేవత కళ్లముందే  సశాస్త్రీయంగా సాఫీగా సాగిపోతున్నప్పుడు ఇహ  జానకీరాముడొచ్చి పాలనలో  కలగ చేసుకోవాలా? బంగారం  బిల్లులు.. ఆస్తి పత్రాలు..  బ్యాంకు కాతాలు.. బినామీలు..  నోట్ల నకిలీలు..  అన్నీ అసత్యంతో నల్లమారాజులు నిత్యం చేసే ప్రయోగాలేగదా!  నీది చరఖా చక్రం తిప్పుకొనే తిప్పలు. నీ వారసుల్ది  రాజకీయచక్రం స్వలాభంకోసం తిప్పే ఎత్తులు!’
‘చెడు.. వినొద్దు.. కనొద్దు.. అనొద్దు.. అన్న నా మొత్తుకోళ్లో మరి?’
‘చెడు అన్న ఆ ఒక్క పట్టింపు తప్పించి మిగతా ఆ ‘అనద్దు.. కనొద్దు.. అనద్దు’  సూత్రం మాత్రం మహా నిబద్ధతతో పాటిస్తున్నారు మహాత్మా తమరి వారసులు.. గాంధీలు. ఆడది అర్థరాత్రి ఒంటరిగా నిర్భయంగా బైట తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యమని మీరు మరీ అత్యాశ పెట్టారు కదా పిచ్చితల్లులకు!  మగాడే బైట పగటిపూట పదిమంది మధ్యలో ధీమాగా తిరిగే రోజులు కావని తెలుసుకోలేని అమ్మళ్లు ఇప్పుడు నానా అగచాట్లు పాలవుతున్నారు! ఏ మాటకు ఎవరు ఏ పూట ఏ  విపరీతార్థం లాగుతారో.. ఏ వైపునుంచి ఏ వాహనం తూలుతూ వచ్చి మీదెక్కుతుందో.. ఏ ముఖపుస్తకం టపా ‘ఠపా’మని పేలి ఎవరు ఎప్పుడు టపా కట్టాల్సొస్తుందో .. అంతా గందరగోళంగా ఉందిప్పుడు కింది భూగోళంలో! జీవితం క్షణభంగురం. నిజవేకానీ.. మరీ భంగుతాగినోడి మాదిరి తూలుతో సాగడం ఎంత ఇబ్బందో  సామాన్యులకు?’
‘ఐతే మళ్లీ ఓ సారి నా భరత ఖండాన్ని దర్శించి రాక తప్పదంటావా హనుమా?’ లేచి నిలబడ్డాడు బాపూజీ.
'బొడ్దులో గడియారం, బోసి నోరు, చేతిలో కర్ర, కొల్లాయి గుడ్డ, కళ్ల జోడు.. వంటివన్నీ వంటిమీదుంటేనే గాంధీతాత అనుకొనే తరాలు తెరమరుగయ్యాయి పిచ్చి మహాత్మా! గాంధీ అంటే మొన్నటోళ్లకి ఇందిరా గాంధి, నిన్నటోళ్లకి సోనియా గాంధి. ఇప్పటోళ్లకి రాహుల్ గాంధి. రేపటోళ్ళకి ఏ ప్రియాంక గాంధీనో.. అమె బిడ్డో!’
అంటే నా'దేశం నన్ను మర్చి పోయినట్లా.. నా బోధలు గుర్తుకురానట్లా?’
'’గాంధీ’ అని కొట్టి చూడు బాపూజీ ఈ కంప్యూటర్లో! ‘రాహుల్ గాంధీ’ అన్న హిట్లే ఎక్కువ కనిపిస్తాయయ్  గూగుల్ వెదుకులాట యంత్రంలో!  ఇప్పట్టున ఏ ఇండియా టు-డేతో సర్వే తీయించినా  ఇందిరా గాంధీకన్నా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకే తక్కువ ఓట్లొస్తాయి కచ్చితంగా ‘మహాత్ము’ల జాబితాలో!’
‘నడి రోడ్డుమీద  నా విగ్రహలు అడుగడుక్కీ కనబడుతుంటాయి కదయ్యా హనుమయ్యా! వాటి వల్ల మరి ఎవరికీ ఏ ఉపయోగమూ లేనే లేదంటావా?’
‘ఒక్క పిట్టలు రెట్టలేసుకోడానికి, గల్లీ బుల్లి నాయకులు .. ఎన్నికలప్పుడు  కటౌట్లు పడిపోకుండా నిలబెట్టుకోడానికీ పనికొస్తాయి బాపూజీ న్ విగ్రహాలు!’
‘కొత్త రెండు వేల నోటుమీద నా మొహం ముద్రించి నా స్థాయి రెట్టింపు చేసారని  విని సంబర పడుతున్నాను కదయ్యా.. అదీ మరి వట్టి పటాటోపానికేనంటావా!’
‘ఆ   నోట్లమీద నీ బొమ్మకింద ‘మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ’ అని గానీ రాయించుకొనే ఏర్పాటు చేయించుకోకపోతే గాంధీ మూవీలో ఏ కిన్ బెన్స్లేనోలే అనుకునే  రోజులూ ఆట్టే దూరంలో లేవు! తమరు   ప్రబోధించిన సత్యం పథ్యంగా మాత్రమే పనికొస్తుందన్నదీ నాటి నాయకుల నమ్మకం. అహింస అంటే  చేతిలో ఏ కత్తో.. కర్రో.. కనీసం పాత చెప్పైనా  లేని నిస్సహాయ స్థితిలో  పనికొచ్చే ఆఖరి అస్త్రం అని జనమూ బలంగా నమ్ముతున్నారు. 'భలే తాత మన బాపూజీ' అని పాడిస్తో నిన్ను బాలలకి మాత్రమే ఓ మోడలుకింద  పరిమితం చేసేసి  తమ రాజకీయ లీలలను స్వలాభాలకోసం కొనసాగించే వ్యూహానికి పదును పెడుతున్నారు నీ గాంధీ వారసులు.  నిన్ను నమ్ముకున్న వారి ముందు   నవ్వుల పాలవకుండా ఉండేందుకైనా నువ్వు పెందలాడే మేలుకొంటే నీ పేరుకు మరింత మచ్చ రాకుండా ఉంటుంది. ఇవాళ నీ వర్ధంతి. కాబట్టి ఎక్కడున్నా నీ వారసులంతా నీ సమాధి  'రాజఘాట్' కొచ్చి కనీసం రెండు నిమిషాలైనా నిశ్శబ్దంగా తలొంచుకొని క్కూర్చోక తప్పదు.. మంచి అదను. ఇది తప్పితే మళ్ళీ అక్టోబరు రెండు దాకా నీకు అప్పాయింట్మెంటు దొరకదు. ఏం చేస్తావో.. ఎలా దారికి తెస్తావో మరి.. నీ వారసులమని వరసబెట్టి జనంలో కొచ్చి పడే వాళ్ల సంగతిహ నువ్వే చూసుకోవాలి’
'నిజమే! ఇదిగో  బైలుదేరుతున్నా!'
'ఇలాగా!  ఎవరూ నిన్ను గుర్తు పట్టరయ్యా పిచ్చి మహాత్మా! ఏ తెదేపా శివప్రసాదో మారు వేషంలో వచ్చాడని నవ్వుకుంటూ పోతారు. వంటికి వెండి పూత పట్టించు దట్టంగా!  ఓ గంట ముందే వెళ్లి ఆ ఎండలో రాజఘాట్ గేటు బైట శిలావిగ్రహంలా దారి కడ్డంగా నిలబడు. అదను చూసుకొని వాళ్ల చూపు నీ మీద పడ్డ తరువాత.. ఇహ నీ ఇష్టం'
కొల్లాయి గుడ్డ బిగించుకొని చేతి కర్ర పుచ్చుకొని  లేచి నిలబడ్డాడు అహింసా మూర్తి బాపూజీ ఆవేశంగా.
'అదీ వరస. శుభం. ముందే ప్రధాని మోదీ అక్కడ నువ్వు ప్రబోధించిన   ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెట్టేసాడు.  నువ్వూ  ఓ చెయ్యి వెయ్యి. నా రామరాజ్య స్థాపనకి ఓ ఇటుక వెయ్యి!’ అంటూ ఆశీర్వదించాడు పరంథాముడు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి ధన్యవాదాలతో.. ఈనాడు దినపత్రిక యాజమాన్యంవారి సౌజన్యంతో)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...