Sunday, June 3, 2018

ఇదేం చారిత్రిక సాహిత్యం?!- సాహిత్య విమర్శ




రెండో ప్రపంచయుద్ధంలో పట్టుబడ్డ జర్మన్ నాజీ సైనికాధికారులను విచారించే సందర్భంలో ఒక విచిత్రమైన విషయం బైటపడింది. రష్యన్ భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశమేలేని ఆ సైనికాధికారులు ఆ దేశ బౌగోళిక పరిస్థితులను  ముందుగానే ఎట్లా పసిగట్టినట్లు?! ఆ విషయం తెలుసుకుంటే అవాక్కవడం ముందు మన వంతవుతుంది. టాల్ స్టాయ్ లాంటి గొప్పరచయితల నవలలు చదివినందువల్ల రష్యా బౌగోళిక పరిస్థితుల మీద ఒక నిర్దుష్ట అవగాహన ఏర్పడిందట! రష్యన్ రచయితల కాల్పనిక రచనల్లో సైతం కనిపించే వర్ణనలు చరిత్రను అంత విశుధ్ధంగా చిత్రీకరిస్తాయన్న మాట! ఆ రచయితలు వెర్రివాళ్లు.
మన తెలుగు రచయితలకు అంత వెర్రిలేదు. శత్రువులకు ఉప్పందించడం ఎందుకన్న ఉద్దేశంతో చారిత్రక నవలలల్లో సైతం నిండా అభూత కల్పనలు నింపి పెడుతుంటారు! మన తెలుగు చారిత్రక నవలలు చదువుకొని ఏ మూర్ఖుడైనా మన దేశం మీదకు దండెత్తి వస్తే వింద్యకు ఇవతల దిక్కు తోచక చచ్చూరుకోవడం ఖాయం. భద్రత దృష్ట్యా  చరిత్రలను సైతం  తప్పుల తడకలతో నింపి తమ దేశభక్తిని నిరూపించుకుంటున్నారు మన తెలుగు చరిత్రకారులు!
మనం ఉండేది జంబూ ద్వీపం, భరతఖండం, భరతవర్షం.. కృష్ణాగోదావరీ నదీ తీరాల మధ్య మనల్ని ఏలిన రాజులు చతుస్సాగర పర్యంతం పరుచుకున్న భూమిని ఏలిన మహావీరులు. దైవాంశ సంభూతులకు మన భూమి  గొడ్డుపోలేదు. ఇక్కడి బ్రాహ్మణ్యం బ్రహ్మతేజస్సుతో, బ్రహ్మజ్ఞానంతో వెలుగొందిపోతుంటుంది. గోదావరి వేదఘోషతో ప్రవహిస్తుంటుంది. తెలుగునాట అంగళ్లలో రత్నాలు  రాశులు పోసి అమ్ముతారు. కళింగసీమ విజయనగరరాజు పూసపాటి విజయరామ గణపతి రాజు లక్షమంది సైనికులతో, లక్ష ఏనుగులతో, పదివేల లొట్టిపిట్టలతో బొబ్బిలి మీదకు దండెత్తి వస్తాడు. బొబ్బిలి పక్కనే రాజాం ఠాణాలో సుంకాలు వసూలు చేసుకొనే తాండ్రపాపారాయుడు అర్థరాత్రి చీకట్లో చడీ చప్పుడు లేకుండా విజయరామరాజు గుడారం గుడ్డలు చించి మరీ నిద్రలో ఉన్న రామరాజును ఖూనీ చేసి 'పులి.. పులి' అంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ వీరోచితంగా పోరాడి చచ్చిన మహావీరుడు!
మన పురాణ గాధలు, తరువాత వచ్చిన విశ్వనాథవారి పురాణ వైరగ్రంథమాల నవలా సిరీసు పూర్తి 'ఉన్మత్త భావుకత్వం'తో వెలిగిపోతుంటుంది. విశ్వనాథవారి వేయిపడగలు ఊహకందని ఉదాత్త పాత్రల జీవిత చిత్రీకరణలతో, చెప్పనలవికాని గ్రామీణ వ్యవస్థ  వర్ణనలతో విభ్రాంతిగొల్పుతుంటుంది. 'ఆంధ్రప్రశస్తి' పద్యాలు పరమాద్భుతంగా ఉంటూనే  వాస్తవానికి సహస్రయోజనాల దూరంలో సాగుతుంటాయి
జానా బెత్తెడు రాజ్యమేలిన వేంగిరాజుల పౌరుష ప్రతాపాలకి జడిసి సముద్రగుప్తుడు అనే చక్రవర్తి పుటాయించి పారిపోయాడుట! 'అటనెటగనిన బంగరేనట!' 'అదెంత శ్రీయో, అదెంత భాగ్యమో' అంటూ అవాస్తవికమైన ఒక వైభవాన్ని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు విశ్వనాథుడు. పల్లవరాజులు అసలు ఆంధ్రులే కారు. ఇరాన్ నుంచి తరలి వచ్చిన పహ్లవి జాతివాళ్ళు. భూముల్ని ఆక్రమించి  ప్రజలని పీడించి పాలించిన పాలకులు స్థానిక ప్రజలతో కలగలసి ఇక్కడి భాషను, సంస్కృతిని వంటబట్టించుకున్న బాపతు. ఒకవేళ నిజంగా ఆంధ్రులే అయినా వాళ్లకి అంత వైభవమూ లేదు, భాగ్యమూ లేదు. ఇక్ష్వాకులూ.. చాళుక్యులూ  అంతే. చిన్న  స్థాయి రాజ్యాలను ఆక్రమించుకొంటూ.. వాళ్ల నుంచి వసూలైన పన్నుల మీద ఆధారపడిన వీరకళాకారులు వాళ్లంతా. విశ్వనాథ వంటి మహాప్రతిభావంతుడు కలం పుచ్చుకొని వళ్లు మరచి వాళ్ల కీర్తిగానానికి పూనుకుంటే ఇదే నిజమైన చరిత్రగా భావించే అమాయకులకు కొదవ లేదు మన తెలుగు గడ్డల మీద!
శక్తిమంతులు, కళాకారులు తెలిసి అబద్ధాలు ప్రచారం చెయ్యకూడదు. అబద్ధానికి నిజం కన్నా ఎన్నో రెట్లు బలమెక్కువ. నిజాన్ని చంపేసిన పాపం కళాకారులకు చుట్టుకుంటుంది. కళ ఎంతటి అమృతమో, అంతటి హాలాహలం కూడా కళ. విశ్వనాథ వంటి మహాకవి ప్రజాపక్షాన నిలబడి.. ప్రజాస్వామిక ఉద్యమాలకి అగ్రభాగాన ఉండుంటే తెలుగు సాహిత్య చరిత్ర విశ్వవిఖ్యాత స్థాయికి చేరి ఉండేది. ప్రతీ తెలుగు గుండె గర్వంతో ఉప్పొంగే సాహిత్య చరిత్ర మన సొంతమై ఉండేది!
విశ్వనాథకు సమకాలీనులు అడవి బాపిరాజు. అవడానికి ఆయన ప్రజాస్వామ్యవాదే. చారిత్రక దృష్టిగల రచయితే!  కానీ ప్రతిభా వ్యుత్పత్తుల విషయంలో విశ్వనాథవారి తరువాతే! ప్రజల రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి  మంచి చారిత్రక నవలలు అందించారు. కానీ వాటిని  స్పార్టకస్, వార్ అండ్ పీస్,  హ్యూమన్ కామెడీ స్థాయిలో ఊహించడం కుదరదు. మహీధర రామ్మోహనరావుగారికి రాచమల్లు రామచంద్రారెడ్డి వంటి పెద్దల నుంచి మంచి చారిత్రక నవలా రచయితగా ప్రశంసలు దక్కాయి. బహుశా 'కొల్లాయి గట్టితేనేమి' 'రథ చక్రాలు' వంటి నవలల వల్ల ఆ ప్రశంసలు దక్కివుంటాయి. కానీ రామ్మోహనరావుగారి చారిత్రక రచనల్లో  గొప్పనవలల్లో ఉండే జీవలక్షణం, నవల  చదువుతున్నప్పుడు వినిపించవలసిన గుండె చప్పుళ్లు ఉండవు. పనివాడే కానీ మహాపనివాడు కాదంటే ఆయన  అభిమానులకు కించిత్ రోషం రావచ్చు. కానీ వాస్తవాన్ని వాస్తవంగానే చూడవలసి ఉంటుంది! ఇంతమంది మంచి రచయితలు ఉండీ  మరి మన తెలుగులో మంచి చారిత్రిక సాహిత్యం ఎందుకు రావడం లేదు? మన కాల్పనిక రచయితలకు చారిత్రక దృక్పథం కరువవడమే కారణం అనిపిస్తుంది!
మన భారతీయులు శిరోధార్యాలుగా భావించే భారత, రామాయణాలు కావ్యాలా? చారిత్రిక సంఘటనలా? అన్న శంక  ఇంకో వెయ్యేళ్ళు గడిచినా తీరేది కాదు. కళింగయుద్ధంలో అశోకుడితో పోరిన కళింగరాజు అసలు పేరేమిటో ఇప్పటికీ తెలియదు! అశోకుడు రాతి స్తంభాల మీద, రాతి పలకల మీద చెక్కించాడని చెప్పుకునే శాసనాలు ఎంత వరకు వాస్తవమో నిర్ధారణ కాలేదు. అంతటి ఘోరమైన యుద్ధం చేసినందుకు పశ్చాత్తాపం కలిగి ఉంటే తనతో పోరిన ఆ కళింగరాజు పేరును అశోకుడు ఎందుకు గుట్టుగా దాచేసినట్లు?!
అశోకుడి శాసనాల వల్ల కళింగ యుద్ధం, అలెగ్జాండర్ దండయాత్రల వల్ల మౌర్యులకాలం నాటి విశేషాలు, హ్యూయన్ త్సాంగ్, ఫాహియాన్ వంటి విదేశీ యాత్రికల కథనాల వల్ల మాత్రమే ఆ నాటి పరిస్థితులు, ముస్లిం పాలకులు రాసిన, రాయించుకున్న ఐనీ అక్బరీ.. బెర్నెయర్ రాతల వల్ల మాత్రమే  మొగలాయీల  విశేషాలు.. తెలుసుకునే దుస్థితి మనకెందుకు కలిగినట్లు? మన తెలుగు రచయితలకు.. ఆ మాటకొస్తే భారతీయ రచయితలకు చారిత్రిక దృష్టికోణం, చారిత్రిక వాస్తవాల  మీద ఆట్టే గౌరవం లేకపోవడమే కారణం అనుకోవాలి.
కులపురాణాలు, వంశవృక్షాలు పరిశీలిస్తే మన చారిత్రిక జ్ఞానశూన్యత బట్టబయలవుతుంది. సూర్యుడు, వాడి కొడుకు చంద్రుడు, వాడి కొడుకు భరతుడు, వాడి కొడుకు ప్రసేనుడు, వాడి కొడుకు రవి, వాడి కొడుకు చంద్రదీపుడు, వాడి కొడుకు ఓ  చూరుపోయిన చిన్నయస్వామి.. ఈ రీతిలో సాగుతుంటాయి వంశచరిత్రలు!
కాబట్టే మనకు కాకతీయులు ఎవరో ఖచ్చితమైన సమాచారం లేదు.  కృష్ణదేవరాయలు తమ వాడేనని ఒక్క చైనా, జపాన్ వంటి పరాయి దేశాలు, ఉత్తర హిందూస్థానం మినహా దక్షిణాది ఆంధ్ర, కర్ణాటక  లోని దాదాపు అన్ని  కులాలు సగర్వంగా క్లెయిమ్ చేసుకుంటుంటాయ్ ఇప్పటికీ!
మనకు చరిత్ర కూడా మతం లాగా ఒక విశ్వాసమే! ఈ దేశంలో సీతమ్మ స్నానం చెయ్యని చెరువు, పాండవులు నిద్ర తీయని గుహలు, శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించని శివలింగమూ లేనేలేవని గురజాడ మహాకవి ఎన్నడో కడుపుమంటతో అనేశాడు. ఆయన కన్యాశుల్కం మీద నాటకం రాశాడు కానీ ఏ బొబ్బిలియుద్ధం మీదో రాసి ఉంటే మనం ఇక్కడ చెప్పుకునే మాటలకు వెయ్యి రెట్లు చురకలు  మన చరిత్రకారులకు వడ్దించుండేవారు,
జానపదులూ, జ్ఞానులూ, కవులూ, పండితులూ కూడా మన దేశంలో ఒకే మాట మీద నిలబడతారు. ఆయుర్వేదశాస్త్ర పితామహుడు ధన్వంతరి అయినా సరే.. చచ్చినట్లు దేవతలు, రాక్షసులు కలసి మధించిన క్షీరసాగరం నుంచే పుట్టుకురావల్సిందే. సంస్కృత వ్యాకరణం శివుని ఢమరుకం  నుంచి పుట్టితీరాల్సిందే! బుద్ధుదు తన ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా విధిగా భగవంతుడి అవతారాల్లో ఒకడిగా పడివుండాలి.
బ్రహ్మాండంలో హిందూమతం ఒక్కటే అతి సనాతనం, విస్తృతం, పవిత్రం, అచరణీయం.  భ్రమల్లో విహరిస్తూ బ్రహ్మానందం పొందే తెలుగు రచయితకు ఎప్పటికికైనా చారిత్రిక దృక్పథం అబ్బాలని ఆశిద్దాం. అప్పటి వరకు మనం ఐరోపా, అమెరికా, ఆఫ్రికా ఖండాల రచయితల హిస్టారికల్ ఫిక్షన్సే గతి!
-కర్లపాలెం హనుమంతరావు
03 – 06 -2018
(కలాలు- కరవాలాలు; పరాయి రచయితలనే చదువుకోవాలా?డా॥ ఎ.బి.కె.ప్రసాద్ వ్యాసం నుంచి కొంత భాగం- పు.133 – 136 )
డా॥ ఎ.బి.కె. ప్రసాద్ గారికి కృతజ్ఞతలతో! ఎమెస్కో వారికి ధన్యవాదాలతో!!
  



Saturday, June 2, 2018

సుమతీ శతకం పద్యాలన్నీ సుక్తులేనా?




ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా చేసి విరాళాలను పోగు చేశారు. అటువంటి  టెంకాయచిప్ప మీద శతకం రాసారు  వావిలికొలను సుబ్బారావు.
‘ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములు/
వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వాని లో/
దాచుకొనక ధరణి జాపతి కర్పించి ధన్యవైతి/
కర్మ గుణపణిముల కుప్ప ! టెంకాయ చిప్ప!
 లాంటి పద్యాలు రాసుకుంటే సరదాగా చదువుకొని నవ్వుకోవచ్చు. సమాజానికి సుద్దులు చప్పే బాధ్యతను భుజాన వేసుకొని ముందుకు వచ్చిన సుమతీ శతకం వంటి శతకాలకు మీద ఆ రకమైన సరదా  కుదరదు.
కవి బద్దెన సుమారు క్రీ.శ.1260 ల్లో రాసినట్లు చెప్పుకునే తెలుగు        నీతి కంద పద్యాలు సుమారు వందకు పైన. మకుటం 'సుమతీ' అన్న మాటను బట్టి లోకానికి నాలుగు మంచి మాటలు చెప్పాలని కవి భావించినట్లు అనుకోవాలి.
స్థల, కాలాదులను అనుసరించి నీతులు, జీవన రీతులు మారుతుంటాయి. వర్తమాన కాలరంగం నడుమ నిలబడి గతానికి సంబంధించిన విలువలను బేరీజు వేయడం సరయిన అనుశీలనా విధానమా, అంటే  'కాదు' అనే సమాధానం చెప్పుకోవాలి.  కానీ ఈ కాలంలో వాటిని నీతులుగా చదువుకొంటున్నాం. అందులో చెప్పే భావాలని సూక్తులుగా భావించి జీవితంలో ఆచరించాలన్న లక్ష్యంతో పిల్లల  పాఠ్యగ్రంథాలలో సైతం చేర్చుకుంటున్నాం . కనక ఏ కాలానికైనా పాటించదగ్గ  జీవిత సూత్రాలేనా ఆ సుమతీ శతకంలో ఉన్నాయని మనం చెప్పుకుంటున్నవి-  అని తరచి చూడడంలో తప్పేమీ లేదు. ఆ కోణంలో చూస్తే సుమతీ శతకంలోని  కొన్ని సూక్తులు  సార్వజనీననతకు కట్టుబడి లేవనే ఒప్పుకోవాలి.
ఉదాహరణకు
'ఆకలి యడడుగని కడుపును/ వేకటియగు లంజ కడుపు విడువని బ్రతుకున్/
బ్రాకొన్న నూతియుదకము/
మేకల పాడియును మేదిని సుమతీ' జీవితానికి ఎమేమి రోత కలిగించేవో వివరిస్తూ శతకకర్త 'గర్భం ధరించిన వెలయాలి వ్యభిచారాన్ని'  ఆకలి తీరని అన్నంతో కలగలిపి చెప్పేడు. పాచి పట్టిన బావి నీటిని మేకల పాడికి జత కలిపాడు. నిజానికి మేక పాలు ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. గాంధీగారు మేకపాలనే నియమంగా తాగేవారు. పిల్లలకు బుద్ధులు నేర్పించే శతకపద్యాల మధ్య 'లంజల కడుపు.. వ్యభిచార జీవనం' వంటి దురాచారాల ప్రస్తావన ఉంటే నేర్పించే గురువులకు ఇబ్బందే కాదు.. నేర్చుకొనే వయసులో గల పిల్లల మీదా ఎంతో దుష్ప్రభావం  చూపిస్తుంది.
సుమతీ శతకకర్తకు కరణాల మీద ఏ కారణం చేతో అపరిమితమైన కినుక ఉన్నట్లుంది.  వ్యక్తిగతమైన కవి  కోపతాపాలను సుద్దుల రూపంలో  నూరిపోయడం వల్ల  అకారణంగా పిల్లల మనసుల్లో ద్వేషభావం నింపినట్లు అవుతుంది కదా! నిజానికి
'కరణము సాదై యున్నను/
గరి మద ముడింగినను బాము గరవకయున్నన్/
ధర దేలు మీటకున్నను/
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!'
(కరణం మంచివాడైనా, ఏనుగు మదం ఉడిగినదైనా, పాము కరవకపోయినా, తేలు కుట్టకపోయినా జనం లెక్కచేయరు)ఇలాంటి సూక్తులు నేర్పితే పిల్లలకు జీవితంలో జీవసాహచర్యం పాటించకూడదని, సాటి మనుషుల పట్ల వృత్తి రీత్యా  ద్వేషం పెంచుకోవాలని నూరిపోస్తున్నట్లవదా! జీవ వైవిధ్యం పట్ల సదవగాహన, తోటివారి పట్ల సుహృద్భావం అలవరుచుకోవలసిన బాల్యదశలో ఈ చెడ్డమాటల వల్ల కలిగే ప్రయోజనం సున్నా! మరో పద్యంలో కూడా  సుమతీ శతకకర్త '..లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ!' అని నూరిపోస్తాడు. ఆడవారికి ప్రేమించడం బొత్తిగా తెలియదు' అంటూ రుజువు కాని ఒక లైంగిక విద్వేషభావాన్ని బోధించడం పసిమనసులకు మేలు చేస్తుందా?
'కొక్కోకమెల్ల జదివిన/
జక్కనివాడైన రాజ చంద్రుడైనన్/
మిక్కిలి రొక్కంబీయక/
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ' అనే పద్యం వల్లించినప్పుడు  'కొక్కోకశాస్త్రం' అంటే 'ఏంట'ని  ఏ పసిజిజ్ఞాసికైనా అనుమానం వస్తుంది. సహజం. 'వారకాంతలంటే ఎవరు? వాళ్లకు డబ్బిచ్చి దక్కించుకునేది ఏమిటి?' అని మరో పసిదానికి డౌటొస్తుంది. ఏం చెబుతారు తరగతి గదిలో గురువులు?!
'చేతులకు దొడవు దానము/ భూతలనాథులకు దొడవు బొంకమి దరలో/
నీతియే దొడవెవ్వారికి/
నాతికి మానంబు దొడవు నయముగ సుమతీ'
చేతులకు దానం, పాలకులకు సత్యసంధత వరకు సరే.. స్త్రీలకు శీలం అనడంలో సమంజసత ఉందా?  లైంగిక వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించే బట్టీయం వేసే పిల్లలు ఎదిగిన తరువాత ఎన్ని రకాల వెర్రివేషాలకు తెగబడతారో వేరే చెప్పనక్కర్లేదు. 'నీతిబద్ధమైన జీవితం అందరికీ అలంకారం' అని అనివుంటే సుమతీ శతకం తన సూక్తినిబద్ధతను నిలబెట్టుకున్నట్లయేది.
'తన కోపమె తన శత్రువు/
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ/
తన సంతోషమె స్వర్గము/
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ'
అన్నాడూ.. ఎంతో బావుంది. పిల్లలు  ముందు ముందు తమ బతుకులు చల్లంగా దిద్దుకునేందుకు అక్కరకొచ్చే గొప్ప అచ్చమైన సూక్తులు అవుతాయట్లాంటి మంచి మాటలు!
'తనవారు, జగడము, జనం, అనుమానం.. ఉన్న చోట ఉండవద్దని హెచ్చరించాడు మరో మంచి పద్యంలో
'దగ్గర కొండెము సెప్పెడు/
ప్రగ్గడ పలుకులకు రాజు ప్రియుండై మరి తా/
నెగ్గుం బ్రజకాచరించుట/
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ!'
-చెడ్డమంత్రులు చెప్పే చాడీలు  నమ్మి ప్రజలకు కీడు తలపెట్టడం బొగ్గుల కోసం కోరికలు తీర్చే కల్పతరువును నరుక్కున్నంత వెర్రితనం అని హితవు చెప్పడం.. అన్ని కాలాలలో అందరు పాలకులూ ప్రజల పట్ల నడుచుకోదగ్గ మంచి మార్గం. ఈ తరహా పద్యాలే నిజమైన 'సుమతీ' సూక్తువులవుతాయి. ఈ తరహా మంచి పలుకులు మనసుకు పట్టించుకుని ఎదిగే పిల్లలే భావి జీవితంలో 
'వినదగు నెవ్వరు చెప్పిన/
వినినంతనె వేగపడక వివరింపదగున్/
గని కల్ల నిజము దెలిసిన/
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!' అని సుమతీ శతకం సూక్తుల అంతరార్థం అర్థం చేసుకునేది.
 ఎవరేం చెప్పినా ఓపికగా వినడం  విన్న విషయాన్ని వెంటనే తొందరపడి ఆమలు చేయకుండా... అందులోని నిజా నిజాలను తరచిచూసే బుద్ధిని పెంచితే అంతకన్నా బిడ్డలకు ఏ శతకమైనా నేర్పే మంచి నీతి మరేముంటుంది?
ఆ ముఖ్యమైన విషయం మరచి తరచి చూసుకోకుండా 'సుమతీ'  అన్న మకుటం ఉన్న ప్రతి పద్యాన్ని పిల్లలకు సూక్తుల పేరుతో నూరిపోస్తేనే పెను ప్రమాదం.
-కర్లపాలెం హనుమంతరావు
01 -06 -2018

Thursday, May 31, 2018

వాస్కోడగామా అదృష్టం.. గల్పిక





వాస్కోడగామా పోర్చుగీసు నుంచి బయలుదేరుతున్న దృశ్యం
క్రెడిట్ వికీపీదియా
ఇండియాకు సముద్రమార్గం కనుక్కొన్నమొదటి నావికుడు ఎవరు? అనడిగితే 'వాస్కోడగామా' అని ఠక్కున బదులిచ్చేస్తాడు బడికెళ్లే బుడ్డోడు కూడా! నిజానికి ఆ అదృష్టం దక్కి ఉండవలసింది బార్తొలోమ్యూ దియాజ్ కి. కొద్దిలో తప్పిపోవడానికి కారణం అతగాడి పిరికితనమే! ఈ చిన్న కథ వింటే మీరూ నా మాటను కాదనరు.
యూరోపు దేశీయులకు మన భారతదేశంతో వ్యాపార సంబంధాలు రెండువేల ఏళ్ల కిందటి నుంచే కొనసాగుతూ వస్తున్నాయ్! మన దగ్గర దొరికే సుగంధ ద్రవ్యాలు వాళ్లకు బంగారంతో సమానం. మరీ ముఖ్యంగా మన మిరియాలంటే వాళ్లకి పరమ ప్రియం కూడా.
అరబ్బు దేశాలే అప్పటికి రవాణామార్గాలు. క్రీ.1453లో టర్కీ దేశం కాన్ స్టాంటినోపుల్ ని ఆక్రమించుకుని ఆ మార్గాన్ని దిగ్బంధం చేయడంతో యూరోపు దేశాలకు చిక్కులొచ్చిపడ్డాయ్. అధిక సుంకం చెల్లించి ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగించేకన్నా మరో కొత్త దారి ఏదైనా ఉందేమో కనుక్కోవాలన్న కాంక్ష మొదలయింది పశ్చిమ దేశాల్లో.
పోర్చుగీసు  మొదట్నుంచి నౌకానిర్మాణంలో అగ్రగామి. ఆ దేశం రాజు హెన్రీ వన్(ఆయన్ని కింగ్ ఆఫ్ నేవిగేషన్ అని పిలుచుకునేవాళ్లు ఆ రోజుల్లో) ఆదేశాల మేరకు భారతదేశానికి మరో జలమార్గం కనుక్కొనేందుకు నావికాబృందాలు బయలుదేరేవి.
సముద్రాలలో ప్రయాణం చేయడమే తప్ప మహాసముద్రాలలోకి అడుగు పెట్టేందుకు సాహసించేవాళ్లు కాదు అప్పటి నావికులు. దారి తప్పి పోతామేమోనని భయం. ((కొలంబస్ విషయంలో జరిగింది అదే). దిక్సూచి యంత్రం కనుక్కొన్న తరువాత నావికులకు ధైర్యం పెరిగింది. ఆఫ్రికా ఖండం అంటూ ఒకటి ఉందని తెలుసు కానీ.. అది దక్షిణ దిశగా ఎంత  వరకు విస్తరించి ఉందో తెలీని పరిస్థితి. అందుకే చీకటి ఖండంగా పిల్చుకునేవాళ్లు. పరికారాల నాణ్యత పెరిగాక వాటి సాయంతో సాహసించి అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవేశించి ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడే ప్రయాణించుకుంటూ పోయారు.  ఆఫ్రికా మీదుగా భారతదేశం చేరవచ్చని వాళ్ల ఆశ. భూమధ్యరేఖ మీదున్నందు వల్ల ఆఫ్రికా సాగరాలెప్పుడూ సలసలా కాగుతుంటాయని అప్పటి వరకు భయపడ్డ నావికులు ' బార్తొలోమ్యూ దియాజ్ ' చొరవతో సాహసించి ముందకు అడుగు వేశారు. తీరాపోతే ఆఫ్రికా తీరంవెంట అంతా పచ్చదనమే పచ్చదనం. అడవులే అడవులు. ఊహించనంత బంగారం, ఏనుగు దంతాలు, బానిసలు తేరగా దొరకపుచ్చుకోవడం మొదలుపెట్టారు తెల్లవాళ్లు. అంతటితో సంతృప్తి పడకుండా బార్తొలోమ్యూ దియాజ్ ఆఫ్రికా దక్షిణాగ్రానికి చేరగలిగాడు.  అక్కడి తుఫానులను రుచి చూశాడు. కొత్త వాతావరణంలో నెలల కొద్దీ చేసిన ప్రయాణాల కారణంగా చాలా మంది సాటి నావికులు జబ్బుపడ్డారు. మరిక ముందుకు పోయేందుకు వాళ్లంతా మొండికి దిగడంతో చేసేది లేక బార్తొలోమ్యూ దియాజ్   వెనక్కి తిరగాల్సి వచ్చింది.  తనకు దక్కవలసిన కీర్తిని వాస్కోడగామాకు వదిలేసినట్లయింది ఆ విధంగా. బార్తొలోమ్యూ దియాజ్ మూలకంగానే భారతదేశానికి  జలమార్గం దక్షిణాఫ్రికా అంచును చుట్టి వెళ్ళగలిగితే ఖచ్చితంగా దొరుకుతుందని మంచి ఆశ (గుడ్ హోప్) మొదలయింది పోర్చుగీసుల్లో. అందుకే ఆ అంచుకు 'గుడ్ హోప్' అనే పేరూ  స్థిరపడిపోయింది. 'హోప్' ను నిజమని సాకారం చేసిన సాహసయాత్రికుడు మాత్రం వాస్కోడగామానే.
అతగాడో మొండి ఘటం. మెరుగైన భూగోళ పటాలు, పరికరాలు, నైపుణ్యం కలిగిన నావికులను వెంటేసుకొని  బార్తొలోమ్యూ దియాజ్   చూపించిన దారిలోనే ఆఫ్రికా పశ్చిమ తీరం మీదుగా 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' ను చుట్టుకొని తూర్పు తీరం గుండా దక్షిణానికి సాగి చివరికి  క్రీ.1498 లో భారతదేశానికి దక్షిణాన ఉన్న కేలికట్ తీరం(ఇప్పటి కొచ్చి) చేరగలిగాడు.  కొన్ని నెలల పాటు అక్కడే మాకాం వేసి నౌకల నిండుగా సుగంధ ద్రవ్యాలు సేకరించుకొని తిరిగి క్షేమంగా స్వదేశం చేరగలిగాడు.
ఆ విధంగా భారతదేశానికి మొదటి సముద్రమార్గాన్ని కనిపెట్టిన మొనగాడుగా  బార్తొలోమ్యూ దియాజ్  కు దక్కవలసిన అదృష్టం తాను దక్కించుకున్నాడు వాస్కోడగామా! 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' ను చుట్టి ముందుకు సాగితీరాలన్న మొండితనమే వాస్కోడగామాకి 'గుడ్ లక్' తెచ్చిపెట్టింది!
కొలంబస్  భారతదేశం కోసం నాలుగు యాత్రలు చేసినా సఫలం కాలేదు. వెస్ట్ ఇండీస్, ఆఫ్రికా ఖండాలే  చాలా కాలం ఇండియా అనే భ్రమలో ఉండేవాళ్లు యూరోపియన్లు. ‘ఇండియాకు సముద్రమార్గం కనుక్కొన్నమొదటి నావికుడు ఎవరు?’ అనడిగితే ఇవాళ  చిన్నపిల్లల నాలుకల మీద కూడా చటుక్కున ఆడే పదంగా  'వాస్కోడగామా'. చరిత్రలో ఆ విధంగా స్థిరపడిపోవడం.. అదీ అదృష్టమేగా!
అందుకే మన పెద్దలనేది 'ధైర్యే సాహసే లక్ష్మీ'అని! కాదనగలమా?!
-కర్లపాలెం హనుమంతరావు
01 - 06 -2018
(విదేశీయాత్రికులు అందించిన మన చరిత్ర- పుట. 95  టి.వెంకట్రావ్ గారి వ్యాసం ప్రేరణతో) 
వాస్కోడగామా సంతకం


Wednesday, May 30, 2018

అమరకోశంలో అర్థవివరణ ఏ పద్ధతిలో సాగింది?


'కోశం' అంటే పదానికి అర్థం చెప్పే పద్ధతి.
వ్యాకరణం, ఉపమానం, వ్యవహారాలు వంటి ద్వారా సిద్ధించిన విషయాల అర్థ నిర్ణయాలు వగైరా కోశాలలో కనిపిస్తుంటాయ్!('శక్తిగ్రహం వ్యాకరణోపమానకో శాప్తవాక్యాద్వ్యవహారతశ్చ/ వాక్యన్య శేషాద్వివృతేర్వదన్తి సాన్నిధ్యతః సిద్ధపదస్య వృద్ధాః').
నిఘంటువు’ అనే  పదం ‘కోశం’ అనే అర్వాచీన పదానికి ప్రాచీన రూపం. వేదాలలోని పదాలన్నిటినీ సంకలించి నిర్మించిన 'నిఘంటువులు' మన దేశంలో విసృతంగా ప్రచారంలో ఉండేవి ఒకానొకప్పుడు. వీటికి వ్యాఖ్యాన రూపాలు 'నిరుక్తాలు'. యాస్కుడు రాసిన నిరుక్తం ప్రసిద్ధం. 7వ శతాబ్దానికి చెందిన పాణిని తన వ్యాకరణంలో  నిరుక్తాలను వాడుకొన్నాడునిఘంటువులోని ఒక్కో పదం తీసుకొని దానికి సంబంధించి- ఏ ధాతువు నుంచి ఏ పదం ఉత్పన్నం ఆయిందో వివరించే ప్రయత్నం చేసాడు యాస్కుడు. వీలున్న చాలా సందర్భాలలో వేదాల నుంచే ప్రమాణాలు చూపించాడా పండితుడు. అ ప్రమాణాలలో అంతగా ప్రసిద్ధం కాని పదాలు కనిపిస్తే వాటికి అర్థాలు తానే స్వయంగా వివరించాడు. ఇంత శ్రమపడ్డాడు కాబట్టే యాస్కుడి నిరుక్తి ‘వేద-నిరుక్తి’గా వేదార్థసారం తెలుసుకొనే జిజ్ఞాసువులకు ప్రామాణిక గ్రంథంగా స్థిరపడింది.
వేద సంబంధమైన పదాలతో పాటు లౌకిక పదాలను కూడా ఇముడ్చుకొన్నవి కోశాలు. కవులకు సహాయపడే విధంగా ఈ కోశాల నిర్మాణం జరిగింది. మయూరుడు, బాణుడు (బాణోచ్ఛిష్టం జగత్ సర్వమ్ లోని బాణుడు), శ్రీహర్షుడు, బిల్హణుడు ఇట్లా చాలా మందే ఈ కోశాల నిర్మాణం మీద దృష్టి పెట్టారు
శ్లేషకావ్యాలు రాసే కవులకు ఉపయోగంగా ఉంటుందని శ్రీహర్షుడు 'శ్లేషార్థపదసంగ్రహః' అనే కోశం నిర్మంచాడు.
అమరసింహ పండితుడూ కవే. కాబట్టి వివిధ శాస్త్రాలకు సంబంధించిన సమాచారం తన కోశంలో నిక్షిప్తం చేసాడు.  కావ్యాలు రాయాలనుకొనే  కవులకు ప్రత్యేకంగా ఆయా శాస్త్రాలు పరిశీలించే ప్రయాస కొంత తగ్గించిన పుణ్యం అమరకోశానిది.
కోశాలలో రెండు రకాలుంటాయి. ఒకే అర్థం ఉన్న అనేక పదాలను ఒకచోట పేర్చడం ఒక పద్ధతి. వీటిని పర్యాయపదకోశాలు అనుకోవచ్చు. ఒక పదానికి ఉండే అనేక అర్థాలను వివరిస్తూ నిర్మించే కోశాలు కొన్ని. ఇవి నానార్థపదకోశాలుగా భావించవచ్చు.
పర్యాయపదకోశాలలో ఒక అంశానికి సంబంధించిన అనేక పదాలను ఒక గుంపుగా వర్గీకరించే పద్ధతి కనిపిస్తుంది. దీనిని ‘వర్గం’ అన్నాడు అమరసింహుడు.
ఉదాహరణకి 
మనుషులకు సంబంధించిన పదాలన్నీ ఒకచోట పేర్చితే అది ‘మనుష్యవర్గం’ అయింది. అమరకోశం ద్వితీయకాండలో ఆరవ విభాగంగా ఈ  మనుష్యవర్గం కనిపిస్తుంది. ఈ వర్గం కింద 'గృహనిరుద్ధపక్షిమృగప్రసంగాత్' తద్వర్తిమనుష్యాణాం నామాని వివక్షుం ఇదానీం సాంగోపాంగం మనుష్యవర్గమాహ' అని నిర్ణయం చేశాడా పండితుడు. మనుషులను ఏ పేర్లతో గుర్తిస్తారో వివరించే విధానం ‘మనుష్యవర్గం’ అని ప్రామాణీకరించాడు అమరసింహుడు.
'మనుష్యా మానుషా మర్త్యా మనుజా మానవా నరాః' (2వ కాండం -6వ వర్గం - 529 
1.     మనోరపత్యాని మనుష్యాః 

2. మనువు కొడుకులు కనుక మనుష్యులు మానుషులు-
2. మ్రియంత ఇతి మర్త్యాః.  మృఙ్ ప్రాణత్యాగే(మృతి పొందేవాళ్లు) మర్తో. భూలోకః తత్రభవాః మర్త్యాః(మర్తం అంటే భూలోకం, ఇక్కడ పుట్టినవాళ్ళు కనక మర్త్యులు).
3. మనోర్జాతా మనుజాః, జనీ ప్రాదుర్భావే (మనువు వలన పుట్టినవాళ్లు). 
4. మనో రిమే మానవాః(మనువు సంబంధమైనవాళ్లు).
5. సృణంతి నయంతి సర్వం స్వవశమితి నరాః సృనయే (సర్వం తమ ఆధీనంలోకి తెచ్చుకొనేవాళ్ళు కనుక నరులు)
ఈ ఆరు మనుష్యమాత్రుల పేర్లు.. అన్నాడు  అమరసింహుడు.
ఇలాగే ఈ మనుష్యుల్లోని పురుషులకు మరో 11 పేర్లు, స్త్రీలకు మరో 11 పేర్లు, ఆ స్త్రీలలోని గుణాలను బట్టి మరో 12 పేర్లు, మళ్లా ఆ గుణాలలో కూడా కోపాన్ని బట్టి 2 పేర్లు, ఉత్తమ గుణాలను బట్టి మరో 4 పేర్లు.. ఇలా  చిలవలు పలవులుగా పదాల ఉత్పన్నతను వివరిస్తుంది అమరకోశం.
విధాయకానికి అందరూ భార్యలే అయినా వారి వారి అర్హతలను అనుసరించి కొన్ని పేర్లు ఎట్లా ఏర్పడ్డాయో వివరించాడు ఆ మహాపండితుడు.  
'పత్నీ పాణిగృహితీ చ ద్వితీయా సహధర్మచారిణీ।
భార్యా జాయాథా పుంభూమ్ని దారాః'॥
అంటూ  ఎనిమిది విధాలైన భార్యలను గురించి వివరణలు ఇచ్చాడు అమరుడు తన కోశంలో. భర్తతో కలసి యాగంచేసే యోగం కలది, భర్తచేత హస్తం గ్రహింపబడింది, యాగఫలం పొందే సందర్భంలో భర్తతో కలసి తాను రెండో స్థానంలో ఉండేది, భర్త లాగానే దాన, యజ్ఞాదుల్లో  అధికారం కలది, పతిని పుత్ర రూపంలో తనయందు జనింపచేసెది, ఆఖరిది (ఆశ్చర్యం కలిగించే అర్థం కూడానేమో) కట్టుకున్నవాణ్ని హడలగొట్టేది(దారయంతి ఉద్వేజయంతి పతీనితి దారా:-దౄ భయే.. అని వివరణ).. ఇట్లా ఎనిమిది రకాల భార్యల పేర్లను వాళ్ల వాళ్ల అర్హతలు, గుణాలను ఆధారంగా అర్థ నిర్ణయం చేసిన గొప్ప పదకోశం అమరకోశం. మరీ సూక్ష్మంగా పరిశీలించేవాళ్ళకి మరో విశేషం. శ్లోకంలో మొదటి వరస నాలుగు పేర్లు ధార్మిక సంబంధమైనవయితే.. రెండో వరస నాలుగు పేర్లు సాధారణ జీవితానికి సంబంధించినవి!
ఇలా వివరించుకుంతూ పోతే అమరకోశంలోని విశేషాలకు అంతూ పొంతూ ఉండదు. అందుకే అమరకోశానికి అంత విశేష ప్రాచుర్యం. శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఆకులూ, పూతా, కాయలూ, పూలూ, పళ్లూ, అవి రాల్చే గింజలూ.. సర్వం ఒక మహావృక్ష సమగ్ర స్వరూపాన్ని ఎట్లా  కళ్లకు కడతాయో.. అదే విధంగా  అర్థ విస్తరణ కొనసాగించే పద్ధతిలో అమరకోశమూ ఒక సమగ్ర శబ్దమహాస్వరూపాన్ని తలపిస్తుంది. తెల్లదొరల పాలనకు ముందు మన ప్రాచీన భారతదేశపు గురుకుల విద్యావిధానంలో పిల్లల చేత కంఠస్తం చేయించిన పంచకావ్యాలలో అమరకోశమూ ఒకటి. ఇప్పుడు మహాకవులు, మంచి ప్రతిభగల కవులుగా కీర్తి గడించిన శ్రీ శ్రీ, జాషువాలు సైతం చిన్నతనంలో ఒళ్లో అమరకోశం పుస్తకం పెట్టుకు కళ్లుమూసుకుని గడగడా పాఠాలు వప్పచెప్పుకున్నవాళ్లే! ఇప్పటి మనమే అమరకోశం పేరు వినగానే ఆమడదూరం తారుకుంటున్నాం.. ఆ జలతారు వాఙ్మయంలో ఎన్ని తళుకు బెళుకులీనే ముత్యాలు, రత్నాలు పొదిగివున్నాయో తెలుసుకోలేక! ఎన్ టి ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అమరకోశంలోని కొన్ని భాగాలనైనా పాఠ్యగ్రంథాలలో చేర్పించాలని మోజు పడ్డారు. ఆంగ్లం మీద ఉండే యావ మన సంస్కృతం మీద లేక పథకం విఫలమయింది.
-కర్లపాలెం హనుమంతరావు
***



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...