రెండో ప్రపంచయుద్ధంలో పట్టుబడ్డ జర్మన్ నాజీ సైనికాధికారులను విచారించే
సందర్భంలో ఒక విచిత్రమైన విషయం బైటపడింది. రష్యన్
భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశమేలేని ఆ సైనికాధికారులు ఆ దేశ బౌగోళిక పరిస్థితులను ముందుగానే ఎట్లా పసిగట్టినట్లు?! ఆ విషయం
తెలుసుకుంటే అవాక్కవడం ముందు మన వంతవుతుంది. టాల్ స్టాయ్
లాంటి గొప్పరచయితల నవలలు చదివినందువల్ల రష్యా బౌగోళిక పరిస్థితుల మీద ఒక నిర్దుష్ట
అవగాహన ఏర్పడిందట!
రష్యన్ రచయితల కాల్పనిక రచనల్లో సైతం కనిపించే వర్ణనలు
చరిత్రను అంత విశుధ్ధంగా చిత్రీకరిస్తాయన్న మాట! ఆ రచయితలు వెర్రివాళ్లు.
మన తెలుగు రచయితలకు అంత వెర్రిలేదు. శత్రువులకు
ఉప్పందించడం ఎందుకన్న ఉద్దేశంతో చారిత్రక నవలలల్లో సైతం నిండా అభూత కల్పనలు నింపి
పెడుతుంటారు!
మన తెలుగు చారిత్రక నవలలు చదువుకొని ఏ మూర్ఖుడైనా మన దేశం
మీదకు దండెత్తి వస్తే వింద్యకు ఇవతల దిక్కు తోచక చచ్చూరుకోవడం ఖాయం. భద్రత దృష్ట్యా చరిత్రలను సైతం తప్పుల తడకలతో నింపి తమ దేశభక్తిని నిరూపించుకుంటున్నారు మన తెలుగు చరిత్రకారులు!
మనం ఉండేది జంబూ ద్వీపం, భరతఖండం, భరతవర్షం.. కృష్ణాగోదావరీ నదీ తీరాల మధ్య మనల్ని ఏలిన రాజులు చతుస్సాగర పర్యంతం
పరుచుకున్న భూమిని ఏలిన మహావీరులు. దైవాంశ
సంభూతులకు మన భూమి గొడ్డుపోలేదు. ఇక్కడి బ్రాహ్మణ్యం బ్రహ్మతేజస్సుతో, బ్రహ్మజ్ఞానంతో వెలుగొందిపోతుంటుంది. గోదావరి వేదఘోషతో ప్రవహిస్తుంటుంది. తెలుగునాట అంగళ్లలో రత్నాలు రాశులు పోసి
అమ్ముతారు.
కళింగసీమ విజయనగరరాజు పూసపాటి విజయరామ గణపతి రాజు లక్షమంది
సైనికులతో,
లక్ష ఏనుగులతో, పదివేల
లొట్టిపిట్టలతో బొబ్బిలి మీదకు దండెత్తి వస్తాడు. బొబ్బిలి పక్కనే రాజాం ఠాణాలో సుంకాలు వసూలు చేసుకొనే తాండ్రపాపారాయుడు
అర్థరాత్రి చీకట్లో చడీ చప్పుడు లేకుండా విజయరామరాజు గుడారం గుడ్డలు చించి మరీ
నిద్రలో ఉన్న రామరాజును ఖూనీ చేసి 'పులి.. పులి'
అంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ వీరోచితంగా పోరాడి చచ్చిన
మహావీరుడు!
మన పురాణ గాధలు,
తరువాత వచ్చిన విశ్వనాథవారి పురాణ వైరగ్రంథమాల నవలా సిరీసు
పూర్తి 'ఉన్మత్త భావుకత్వం'తో వెలిగిపోతుంటుంది.
విశ్వనాథవారి వేయిపడగలు ఊహకందని ఉదాత్త పాత్రల జీవిత
చిత్రీకరణలతో, చెప్పనలవికాని గ్రామీణ వ్యవస్థ
వర్ణనలతో విభ్రాంతిగొల్పుతుంటుంది. 'ఆంధ్రప్రశస్తి' పద్యాలు పరమాద్భుతంగా ఉంటూనే వాస్తవానికి
సహస్రయోజనాల దూరంలో సాగుతుంటాయి
జానా బెత్తెడు రాజ్యమేలిన వేంగిరాజుల పౌరుష ప్రతాపాలకి జడిసి సముద్రగుప్తుడు
అనే చక్రవర్తి పుటాయించి పారిపోయాడుట! 'అటనెటగనిన
బంగరేనట!'
'అదెంత శ్రీయో, అదెంత భాగ్యమో' అంటూ అవాస్తవికమైన ఒక వైభవాన్ని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు విశ్వనాథుడు. పల్లవరాజులు అసలు ఆంధ్రులే కారు. ఇరాన్ నుంచి
తరలి వచ్చిన పహ్లవి జాతివాళ్ళు. భూముల్ని ఆక్రమించి ప్రజలని పీడించి పాలించిన పాలకులు స్థానిక
ప్రజలతో కలగలసి ఇక్కడి భాషను, సంస్కృతిని
వంటబట్టించుకున్న బాపతు.
ఒకవేళ నిజంగా ఆంధ్రులే అయినా వాళ్లకి అంత వైభవమూ లేదు, భాగ్యమూ లేదు.
ఇక్ష్వాకులూ.. చాళుక్యులూ
అంతే.
చిన్న స్థాయి
రాజ్యాలను ఆక్రమించుకొంటూ..
వాళ్ల నుంచి వసూలైన పన్నుల మీద ఆధారపడిన వీరకళాకారులు
వాళ్లంతా.
విశ్వనాథ వంటి మహాప్రతిభావంతుడు కలం పుచ్చుకొని వళ్లు మరచి
వాళ్ల కీర్తిగానానికి పూనుకుంటే ఇదే నిజమైన చరిత్రగా భావించే అమాయకులకు కొదవ లేదు
మన తెలుగు గడ్డల మీద!
శక్తిమంతులు,
కళాకారులు తెలిసి అబద్ధాలు ప్రచారం చెయ్యకూడదు. అబద్ధానికి నిజం కన్నా ఎన్నో రెట్లు బలమెక్కువ. నిజాన్ని చంపేసిన పాపం కళాకారులకు చుట్టుకుంటుంది. కళ ఎంతటి అమృతమో,
అంతటి హాలాహలం కూడా కళ. విశ్వనాథ వంటి
మహాకవి ప్రజాపక్షాన నిలబడి..
ప్రజాస్వామిక ఉద్యమాలకి అగ్రభాగాన ఉండుంటే తెలుగు సాహిత్య
చరిత్ర విశ్వవిఖ్యాత స్థాయికి చేరి ఉండేది. ప్రతీ తెలుగు గుండె గర్వంతో ఉప్పొంగే సాహిత్య
చరిత్ర మన సొంతమై ఉండేది!
విశ్వనాథకు సమకాలీనులు అడవి బాపిరాజు. అవడానికి ఆయన ప్రజాస్వామ్యవాదే.
చారిత్రక దృష్టిగల రచయితే!
కానీ ప్రతిభా వ్యుత్పత్తుల విషయంలో విశ్వనాథవారి తరువాతే! ప్రజల రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి
మంచి చారిత్రక నవలలు అందించారు. కానీ
వాటిని స్పార్టకస్, వార్ అండ్ పీస్, హ్యూమన్ కామెడీ
స్థాయిలో ఊహించడం కుదరదు.
మహీధర రామ్మోహనరావుగారికి రాచమల్లు రామచంద్రారెడ్డి వంటి
పెద్దల నుంచి మంచి చారిత్రక నవలా రచయితగా ప్రశంసలు దక్కాయి. బహుశా 'కొల్లాయి గట్టితేనేమి'
'రథ చక్రాలు' వంటి నవలల వల్ల
ఆ ప్రశంసలు దక్కివుంటాయి.
కానీ రామ్మోహనరావుగారి చారిత్రక రచనల్లో గొప్పనవలల్లో ఉండే జీవలక్షణం, నవల చదువుతున్నప్పుడు వినిపించవలసిన
గుండె చప్పుళ్లు ఉండవు.
పనివాడే కానీ మహాపనివాడు కాదంటే ఆయన అభిమానులకు కించిత్ రోషం రావచ్చు. కానీ వాస్తవాన్ని వాస్తవంగానే చూడవలసి ఉంటుంది! ఇంతమంది మంచి రచయితలు ఉండీ మరి మన
తెలుగులో మంచి చారిత్రిక సాహిత్యం ఎందుకు రావడం లేదు? మన కాల్పనిక రచయితలకు చారిత్రక దృక్పథం కరువవడమే కారణం అనిపిస్తుంది!
మన భారతీయులు శిరోధార్యాలుగా భావించే భారత, రామాయణాలు కావ్యాలా? చారిత్రిక సంఘటనలా?
అన్న శంక ఇంకో
వెయ్యేళ్ళు గడిచినా తీరేది కాదు. కళింగయుద్ధంలో అశోకుడితో
పోరిన కళింగరాజు అసలు పేరేమిటో ఇప్పటికీ తెలియదు! అశోకుడు రాతి స్తంభాల మీద, రాతి పలకల మీద
చెక్కించాడని చెప్పుకునే శాసనాలు ఎంత వరకు వాస్తవమో నిర్ధారణ కాలేదు. అంతటి ఘోరమైన యుద్ధం చేసినందుకు పశ్చాత్తాపం కలిగి ఉంటే తనతో పోరిన ఆ కళింగరాజు
పేరును అశోకుడు ఎందుకు గుట్టుగా దాచేసినట్లు?!
అశోకుడి శాసనాల వల్ల కళింగ యుద్ధం, అలెగ్జాండర్
దండయాత్రల వల్ల మౌర్యులకాలం నాటి విశేషాలు, హ్యూయన్ త్సాంగ్, ఫాహియాన్ వంటి విదేశీ యాత్రికల కథనాల వల్ల మాత్రమే ఆ నాటి పరిస్థితులు, ముస్లిం పాలకులు రాసిన, రాయించుకున్న ఐనీ
అక్బరీ..
బెర్నెయర్ రాతల వల్ల మాత్రమే మొగలాయీల విశేషాలు.. తెలుసుకునే
దుస్థితి మనకెందుకు కలిగినట్లు?
మన తెలుగు రచయితలకు.. ఆ మాటకొస్తే భారతీయ రచయితలకు చారిత్రిక దృష్టికోణం,
చారిత్రిక వాస్తవాల
మీద ఆట్టే గౌరవం లేకపోవడమే కారణం అనుకోవాలి.
కులపురాణాలు,
వంశవృక్షాలు పరిశీలిస్తే మన చారిత్రిక జ్ఞానశూన్యత బట్టబయలవుతుంది. సూర్యుడు,
వాడి కొడుకు చంద్రుడు, వాడి కొడుకు
భరతుడు,
వాడి కొడుకు ప్రసేనుడు, వాడి కొడుకు రవి, వాడి కొడుకు చంద్రదీపుడు, వాడి కొడుకు ఓ చూరుపోయిన చిన్నయస్వామి.. ఈ రీతిలో సాగుతుంటాయి వంశచరిత్రలు!
కాబట్టే మనకు కాకతీయులు ఎవరో ఖచ్చితమైన సమాచారం లేదు. కృష్ణదేవరాయలు తమ వాడేనని
ఒక్క చైనా,
జపాన్ వంటి పరాయి దేశాలు, ఉత్తర హిందూస్థానం మినహా దక్షిణాది ఆంధ్ర, కర్ణాటక లోని దాదాపు అన్ని కులాలు సగర్వంగా క్లెయిమ్ చేసుకుంటుంటాయ్
ఇప్పటికీ!
మనకు చరిత్ర కూడా మతం లాగా ఒక విశ్వాసమే! ఈ దేశంలో సీతమ్మ
స్నానం చెయ్యని చెరువు,
పాండవులు నిద్ర తీయని గుహలు, శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించని శివలింగమూ లేనేలేవని గురజాడ మహాకవి ఎన్నడో
కడుపుమంటతో అనేశాడు.
ఆయన కన్యాశుల్కం మీద నాటకం రాశాడు కానీ ఏ బొబ్బిలియుద్ధం మీదో రాసి ఉంటే మనం ఇక్కడ చెప్పుకునే మాటలకు వెయ్యి రెట్లు
చురకలు మన చరిత్రకారులకు వడ్దించుండేవారు,
జానపదులూ,
జ్ఞానులూ, కవులూ, పండితులూ కూడా మన దేశంలో ఒకే మాట మీద నిలబడతారు. ఆయుర్వేదశాస్త్ర పితామహుడు ధన్వంతరి అయినా సరే.. చచ్చినట్లు దేవతలు, రాక్షసులు కలసి మధించిన క్షీరసాగరం నుంచే పుట్టుకురావల్సిందే. సంస్కృత వ్యాకరణం శివుని ఢమరుకం నుంచి
పుట్టితీరాల్సిందే!
బుద్ధుదు తన ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా విధిగా
భగవంతుడి అవతారాల్లో ఒకడిగా పడివుండాలి.
బ్రహ్మాండంలో హిందూమతం ఒక్కటే అతి సనాతనం, విస్తృతం, పవిత్రం,
అచరణీయం. భ్రమల్లో విహరిస్తూ బ్రహ్మానందం పొందే తెలుగు
రచయితకు ఎప్పటికికైనా చారిత్రిక దృక్పథం అబ్బాలని ఆశిద్దాం. అప్పటి వరకు మనం ఐరోపా,
అమెరికా, ఆఫ్రికా ఖండాల రచయితల
హిస్టారికల్ ఫిక్షన్సే గతి!
-కర్లపాలెం హనుమంతరావు
03 – 06 -2018
(కలాలు- కరవాలాలు;
పరాయి రచయితలనే చదువుకోవాలా?డా॥ ఎ.బి.కె.ప్రసాద్ వ్యాసం నుంచి కొంత భాగం- పు.133 – 136
)
డా॥ ఎ.బి.కె. ప్రసాద్
గారికి కృతజ్ఞతలతో! ఎమెస్కో వారికి ధన్యవాదాలతో!!
No comments:
Post a Comment