Wednesday, May 30, 2018

అమరకోశంలో అర్థవివరణ ఏ పద్ధతిలో సాగింది?


'కోశం' అంటే పదానికి అర్థం చెప్పే పద్ధతి.
వ్యాకరణం, ఉపమానం, వ్యవహారాలు వంటి ద్వారా సిద్ధించిన విషయాల అర్థ నిర్ణయాలు వగైరా కోశాలలో కనిపిస్తుంటాయ్!('శక్తిగ్రహం వ్యాకరణోపమానకో శాప్తవాక్యాద్వ్యవహారతశ్చ/ వాక్యన్య శేషాద్వివృతేర్వదన్తి సాన్నిధ్యతః సిద్ధపదస్య వృద్ధాః').
నిఘంటువు’ అనే  పదం ‘కోశం’ అనే అర్వాచీన పదానికి ప్రాచీన రూపం. వేదాలలోని పదాలన్నిటినీ సంకలించి నిర్మించిన 'నిఘంటువులు' మన దేశంలో విసృతంగా ప్రచారంలో ఉండేవి ఒకానొకప్పుడు. వీటికి వ్యాఖ్యాన రూపాలు 'నిరుక్తాలు'. యాస్కుడు రాసిన నిరుక్తం ప్రసిద్ధం. 7వ శతాబ్దానికి చెందిన పాణిని తన వ్యాకరణంలో  నిరుక్తాలను వాడుకొన్నాడునిఘంటువులోని ఒక్కో పదం తీసుకొని దానికి సంబంధించి- ఏ ధాతువు నుంచి ఏ పదం ఉత్పన్నం ఆయిందో వివరించే ప్రయత్నం చేసాడు యాస్కుడు. వీలున్న చాలా సందర్భాలలో వేదాల నుంచే ప్రమాణాలు చూపించాడా పండితుడు. అ ప్రమాణాలలో అంతగా ప్రసిద్ధం కాని పదాలు కనిపిస్తే వాటికి అర్థాలు తానే స్వయంగా వివరించాడు. ఇంత శ్రమపడ్డాడు కాబట్టే యాస్కుడి నిరుక్తి ‘వేద-నిరుక్తి’గా వేదార్థసారం తెలుసుకొనే జిజ్ఞాసువులకు ప్రామాణిక గ్రంథంగా స్థిరపడింది.
వేద సంబంధమైన పదాలతో పాటు లౌకిక పదాలను కూడా ఇముడ్చుకొన్నవి కోశాలు. కవులకు సహాయపడే విధంగా ఈ కోశాల నిర్మాణం జరిగింది. మయూరుడు, బాణుడు (బాణోచ్ఛిష్టం జగత్ సర్వమ్ లోని బాణుడు), శ్రీహర్షుడు, బిల్హణుడు ఇట్లా చాలా మందే ఈ కోశాల నిర్మాణం మీద దృష్టి పెట్టారు
శ్లేషకావ్యాలు రాసే కవులకు ఉపయోగంగా ఉంటుందని శ్రీహర్షుడు 'శ్లేషార్థపదసంగ్రహః' అనే కోశం నిర్మంచాడు.
అమరసింహ పండితుడూ కవే. కాబట్టి వివిధ శాస్త్రాలకు సంబంధించిన సమాచారం తన కోశంలో నిక్షిప్తం చేసాడు.  కావ్యాలు రాయాలనుకొనే  కవులకు ప్రత్యేకంగా ఆయా శాస్త్రాలు పరిశీలించే ప్రయాస కొంత తగ్గించిన పుణ్యం అమరకోశానిది.
కోశాలలో రెండు రకాలుంటాయి. ఒకే అర్థం ఉన్న అనేక పదాలను ఒకచోట పేర్చడం ఒక పద్ధతి. వీటిని పర్యాయపదకోశాలు అనుకోవచ్చు. ఒక పదానికి ఉండే అనేక అర్థాలను వివరిస్తూ నిర్మించే కోశాలు కొన్ని. ఇవి నానార్థపదకోశాలుగా భావించవచ్చు.
పర్యాయపదకోశాలలో ఒక అంశానికి సంబంధించిన అనేక పదాలను ఒక గుంపుగా వర్గీకరించే పద్ధతి కనిపిస్తుంది. దీనిని ‘వర్గం’ అన్నాడు అమరసింహుడు.
ఉదాహరణకి 
మనుషులకు సంబంధించిన పదాలన్నీ ఒకచోట పేర్చితే అది ‘మనుష్యవర్గం’ అయింది. అమరకోశం ద్వితీయకాండలో ఆరవ విభాగంగా ఈ  మనుష్యవర్గం కనిపిస్తుంది. ఈ వర్గం కింద 'గృహనిరుద్ధపక్షిమృగప్రసంగాత్' తద్వర్తిమనుష్యాణాం నామాని వివక్షుం ఇదానీం సాంగోపాంగం మనుష్యవర్గమాహ' అని నిర్ణయం చేశాడా పండితుడు. మనుషులను ఏ పేర్లతో గుర్తిస్తారో వివరించే విధానం ‘మనుష్యవర్గం’ అని ప్రామాణీకరించాడు అమరసింహుడు.
'మనుష్యా మానుషా మర్త్యా మనుజా మానవా నరాః' (2వ కాండం -6వ వర్గం - 529 
1.     మనోరపత్యాని మనుష్యాః 

2. మనువు కొడుకులు కనుక మనుష్యులు మానుషులు-
2. మ్రియంత ఇతి మర్త్యాః.  మృఙ్ ప్రాణత్యాగే(మృతి పొందేవాళ్లు) మర్తో. భూలోకః తత్రభవాః మర్త్యాః(మర్తం అంటే భూలోకం, ఇక్కడ పుట్టినవాళ్ళు కనక మర్త్యులు).
3. మనోర్జాతా మనుజాః, జనీ ప్రాదుర్భావే (మనువు వలన పుట్టినవాళ్లు). 
4. మనో రిమే మానవాః(మనువు సంబంధమైనవాళ్లు).
5. సృణంతి నయంతి సర్వం స్వవశమితి నరాః సృనయే (సర్వం తమ ఆధీనంలోకి తెచ్చుకొనేవాళ్ళు కనుక నరులు)
ఈ ఆరు మనుష్యమాత్రుల పేర్లు.. అన్నాడు  అమరసింహుడు.
ఇలాగే ఈ మనుష్యుల్లోని పురుషులకు మరో 11 పేర్లు, స్త్రీలకు మరో 11 పేర్లు, ఆ స్త్రీలలోని గుణాలను బట్టి మరో 12 పేర్లు, మళ్లా ఆ గుణాలలో కూడా కోపాన్ని బట్టి 2 పేర్లు, ఉత్తమ గుణాలను బట్టి మరో 4 పేర్లు.. ఇలా  చిలవలు పలవులుగా పదాల ఉత్పన్నతను వివరిస్తుంది అమరకోశం.
విధాయకానికి అందరూ భార్యలే అయినా వారి వారి అర్హతలను అనుసరించి కొన్ని పేర్లు ఎట్లా ఏర్పడ్డాయో వివరించాడు ఆ మహాపండితుడు.  
'పత్నీ పాణిగృహితీ చ ద్వితీయా సహధర్మచారిణీ।
భార్యా జాయాథా పుంభూమ్ని దారాః'॥
అంటూ  ఎనిమిది విధాలైన భార్యలను గురించి వివరణలు ఇచ్చాడు అమరుడు తన కోశంలో. భర్తతో కలసి యాగంచేసే యోగం కలది, భర్తచేత హస్తం గ్రహింపబడింది, యాగఫలం పొందే సందర్భంలో భర్తతో కలసి తాను రెండో స్థానంలో ఉండేది, భర్త లాగానే దాన, యజ్ఞాదుల్లో  అధికారం కలది, పతిని పుత్ర రూపంలో తనయందు జనింపచేసెది, ఆఖరిది (ఆశ్చర్యం కలిగించే అర్థం కూడానేమో) కట్టుకున్నవాణ్ని హడలగొట్టేది(దారయంతి ఉద్వేజయంతి పతీనితి దారా:-దౄ భయే.. అని వివరణ).. ఇట్లా ఎనిమిది రకాల భార్యల పేర్లను వాళ్ల వాళ్ల అర్హతలు, గుణాలను ఆధారంగా అర్థ నిర్ణయం చేసిన గొప్ప పదకోశం అమరకోశం. మరీ సూక్ష్మంగా పరిశీలించేవాళ్ళకి మరో విశేషం. శ్లోకంలో మొదటి వరస నాలుగు పేర్లు ధార్మిక సంబంధమైనవయితే.. రెండో వరస నాలుగు పేర్లు సాధారణ జీవితానికి సంబంధించినవి!
ఇలా వివరించుకుంతూ పోతే అమరకోశంలోని విశేషాలకు అంతూ పొంతూ ఉండదు. అందుకే అమరకోశానికి అంత విశేష ప్రాచుర్యం. శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఆకులూ, పూతా, కాయలూ, పూలూ, పళ్లూ, అవి రాల్చే గింజలూ.. సర్వం ఒక మహావృక్ష సమగ్ర స్వరూపాన్ని ఎట్లా  కళ్లకు కడతాయో.. అదే విధంగా  అర్థ విస్తరణ కొనసాగించే పద్ధతిలో అమరకోశమూ ఒక సమగ్ర శబ్దమహాస్వరూపాన్ని తలపిస్తుంది. తెల్లదొరల పాలనకు ముందు మన ప్రాచీన భారతదేశపు గురుకుల విద్యావిధానంలో పిల్లల చేత కంఠస్తం చేయించిన పంచకావ్యాలలో అమరకోశమూ ఒకటి. ఇప్పుడు మహాకవులు, మంచి ప్రతిభగల కవులుగా కీర్తి గడించిన శ్రీ శ్రీ, జాషువాలు సైతం చిన్నతనంలో ఒళ్లో అమరకోశం పుస్తకం పెట్టుకు కళ్లుమూసుకుని గడగడా పాఠాలు వప్పచెప్పుకున్నవాళ్లే! ఇప్పటి మనమే అమరకోశం పేరు వినగానే ఆమడదూరం తారుకుంటున్నాం.. ఆ జలతారు వాఙ్మయంలో ఎన్ని తళుకు బెళుకులీనే ముత్యాలు, రత్నాలు పొదిగివున్నాయో తెలుసుకోలేక! ఎన్ టి ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అమరకోశంలోని కొన్ని భాగాలనైనా పాఠ్యగ్రంథాలలో చేర్పించాలని మోజు పడ్డారు. ఆంగ్లం మీద ఉండే యావ మన సంస్కృతం మీద లేక పథకం విఫలమయింది.
-కర్లపాలెం హనుమంతరావు
***



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...