Thursday, May 31, 2018

వాస్కోడగామా అదృష్టం.. గల్పిక





వాస్కోడగామా పోర్చుగీసు నుంచి బయలుదేరుతున్న దృశ్యం
క్రెడిట్ వికీపీదియా
ఇండియాకు సముద్రమార్గం కనుక్కొన్నమొదటి నావికుడు ఎవరు? అనడిగితే 'వాస్కోడగామా' అని ఠక్కున బదులిచ్చేస్తాడు బడికెళ్లే బుడ్డోడు కూడా! నిజానికి ఆ అదృష్టం దక్కి ఉండవలసింది బార్తొలోమ్యూ దియాజ్ కి. కొద్దిలో తప్పిపోవడానికి కారణం అతగాడి పిరికితనమే! ఈ చిన్న కథ వింటే మీరూ నా మాటను కాదనరు.
యూరోపు దేశీయులకు మన భారతదేశంతో వ్యాపార సంబంధాలు రెండువేల ఏళ్ల కిందటి నుంచే కొనసాగుతూ వస్తున్నాయ్! మన దగ్గర దొరికే సుగంధ ద్రవ్యాలు వాళ్లకు బంగారంతో సమానం. మరీ ముఖ్యంగా మన మిరియాలంటే వాళ్లకి పరమ ప్రియం కూడా.
అరబ్బు దేశాలే అప్పటికి రవాణామార్గాలు. క్రీ.1453లో టర్కీ దేశం కాన్ స్టాంటినోపుల్ ని ఆక్రమించుకుని ఆ మార్గాన్ని దిగ్బంధం చేయడంతో యూరోపు దేశాలకు చిక్కులొచ్చిపడ్డాయ్. అధిక సుంకం చెల్లించి ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగించేకన్నా మరో కొత్త దారి ఏదైనా ఉందేమో కనుక్కోవాలన్న కాంక్ష మొదలయింది పశ్చిమ దేశాల్లో.
పోర్చుగీసు  మొదట్నుంచి నౌకానిర్మాణంలో అగ్రగామి. ఆ దేశం రాజు హెన్రీ వన్(ఆయన్ని కింగ్ ఆఫ్ నేవిగేషన్ అని పిలుచుకునేవాళ్లు ఆ రోజుల్లో) ఆదేశాల మేరకు భారతదేశానికి మరో జలమార్గం కనుక్కొనేందుకు నావికాబృందాలు బయలుదేరేవి.
సముద్రాలలో ప్రయాణం చేయడమే తప్ప మహాసముద్రాలలోకి అడుగు పెట్టేందుకు సాహసించేవాళ్లు కాదు అప్పటి నావికులు. దారి తప్పి పోతామేమోనని భయం. ((కొలంబస్ విషయంలో జరిగింది అదే). దిక్సూచి యంత్రం కనుక్కొన్న తరువాత నావికులకు ధైర్యం పెరిగింది. ఆఫ్రికా ఖండం అంటూ ఒకటి ఉందని తెలుసు కానీ.. అది దక్షిణ దిశగా ఎంత  వరకు విస్తరించి ఉందో తెలీని పరిస్థితి. అందుకే చీకటి ఖండంగా పిల్చుకునేవాళ్లు. పరికారాల నాణ్యత పెరిగాక వాటి సాయంతో సాహసించి అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవేశించి ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడే ప్రయాణించుకుంటూ పోయారు.  ఆఫ్రికా మీదుగా భారతదేశం చేరవచ్చని వాళ్ల ఆశ. భూమధ్యరేఖ మీదున్నందు వల్ల ఆఫ్రికా సాగరాలెప్పుడూ సలసలా కాగుతుంటాయని అప్పటి వరకు భయపడ్డ నావికులు ' బార్తొలోమ్యూ దియాజ్ ' చొరవతో సాహసించి ముందకు అడుగు వేశారు. తీరాపోతే ఆఫ్రికా తీరంవెంట అంతా పచ్చదనమే పచ్చదనం. అడవులే అడవులు. ఊహించనంత బంగారం, ఏనుగు దంతాలు, బానిసలు తేరగా దొరకపుచ్చుకోవడం మొదలుపెట్టారు తెల్లవాళ్లు. అంతటితో సంతృప్తి పడకుండా బార్తొలోమ్యూ దియాజ్ ఆఫ్రికా దక్షిణాగ్రానికి చేరగలిగాడు.  అక్కడి తుఫానులను రుచి చూశాడు. కొత్త వాతావరణంలో నెలల కొద్దీ చేసిన ప్రయాణాల కారణంగా చాలా మంది సాటి నావికులు జబ్బుపడ్డారు. మరిక ముందుకు పోయేందుకు వాళ్లంతా మొండికి దిగడంతో చేసేది లేక బార్తొలోమ్యూ దియాజ్   వెనక్కి తిరగాల్సి వచ్చింది.  తనకు దక్కవలసిన కీర్తిని వాస్కోడగామాకు వదిలేసినట్లయింది ఆ విధంగా. బార్తొలోమ్యూ దియాజ్ మూలకంగానే భారతదేశానికి  జలమార్గం దక్షిణాఫ్రికా అంచును చుట్టి వెళ్ళగలిగితే ఖచ్చితంగా దొరుకుతుందని మంచి ఆశ (గుడ్ హోప్) మొదలయింది పోర్చుగీసుల్లో. అందుకే ఆ అంచుకు 'గుడ్ హోప్' అనే పేరూ  స్థిరపడిపోయింది. 'హోప్' ను నిజమని సాకారం చేసిన సాహసయాత్రికుడు మాత్రం వాస్కోడగామానే.
అతగాడో మొండి ఘటం. మెరుగైన భూగోళ పటాలు, పరికరాలు, నైపుణ్యం కలిగిన నావికులను వెంటేసుకొని  బార్తొలోమ్యూ దియాజ్   చూపించిన దారిలోనే ఆఫ్రికా పశ్చిమ తీరం మీదుగా 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' ను చుట్టుకొని తూర్పు తీరం గుండా దక్షిణానికి సాగి చివరికి  క్రీ.1498 లో భారతదేశానికి దక్షిణాన ఉన్న కేలికట్ తీరం(ఇప్పటి కొచ్చి) చేరగలిగాడు.  కొన్ని నెలల పాటు అక్కడే మాకాం వేసి నౌకల నిండుగా సుగంధ ద్రవ్యాలు సేకరించుకొని తిరిగి క్షేమంగా స్వదేశం చేరగలిగాడు.
ఆ విధంగా భారతదేశానికి మొదటి సముద్రమార్గాన్ని కనిపెట్టిన మొనగాడుగా  బార్తొలోమ్యూ దియాజ్  కు దక్కవలసిన అదృష్టం తాను దక్కించుకున్నాడు వాస్కోడగామా! 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' ను చుట్టి ముందుకు సాగితీరాలన్న మొండితనమే వాస్కోడగామాకి 'గుడ్ లక్' తెచ్చిపెట్టింది!
కొలంబస్  భారతదేశం కోసం నాలుగు యాత్రలు చేసినా సఫలం కాలేదు. వెస్ట్ ఇండీస్, ఆఫ్రికా ఖండాలే  చాలా కాలం ఇండియా అనే భ్రమలో ఉండేవాళ్లు యూరోపియన్లు. ‘ఇండియాకు సముద్రమార్గం కనుక్కొన్నమొదటి నావికుడు ఎవరు?’ అనడిగితే ఇవాళ  చిన్నపిల్లల నాలుకల మీద కూడా చటుక్కున ఆడే పదంగా  'వాస్కోడగామా'. చరిత్రలో ఆ విధంగా స్థిరపడిపోవడం.. అదీ అదృష్టమేగా!
అందుకే మన పెద్దలనేది 'ధైర్యే సాహసే లక్ష్మీ'అని! కాదనగలమా?!
-కర్లపాలెం హనుమంతరావు
01 - 06 -2018
(విదేశీయాత్రికులు అందించిన మన చరిత్ర- పుట. 95  టి.వెంకట్రావ్ గారి వ్యాసం ప్రేరణతో) 
వాస్కోడగామా సంతకం


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...