Monday, June 18, 2018

దిగంబర కవిత్వం- ఒక పరిశీలన



నిజాన్ని నిజంగా చెప్పడం నిజంగా చాలా కష్టం.. నష్టం! ఆ రెండింటికీ సిధ్దపడే దిగామన్న  'దిగంబర కవులు' చివరిదాకా తమ ఉద్యమ స్వరూపాన్ని నిలబెట్టుకోలేదు.  ఆ కథా.. కమామిషూ.. కొద్దిగా!
20వ శతాబ్దం ఆరంభం నుంచి తెలుగు గడ్డల మీద ఎన్నో ఉద్యమాలు చెలరేగాయి. స్వాతంత్ర్యోద్యమం, ఆధ్రోద్యమం, తెలంగాణా సాయుధ పోరాటం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం ఆరాటం.. వగైరా! ప్రధానమైన ఉద్యమాలన్నింటిలో  ప్రజాకవిత్వం మమేకమైంది. స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటయింది.  తెలంగాణా సాయుధ పోరాటం విజయవంతమయింది. విశాలాంధ్ర సాధ్యమయింది. ఏ ఉద్యమ చైతన్యమూ ప్రేరణగా లేనందున తెలుగు సాహిత్యం సామాజిక స్పృహ కోల్పోయిందని  యువతలో అసంతృప్తి మొదలయింది. ఊసుబోని ప్రణయ ప్రేలాపన, ఉత్కంఠే ప్రాణంగా నేరపరిశోధన, పాలకులకు అనుకూలమైన చక్కభజనే..  సాహిత్యంగా పెట్రేగడం సమాజం పట్ల జరిగే కుట్రగా భావించిన యువకులు కొందరు 1960 ప్రాంతాల్లో ‘దిగంబర కవితోద్యమం’ పేరుతో కరెంటు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వదలిచారు. కుందుర్తి 'తెలంగాణా', కాళోజీ 'నా గొడవ', సీతాదేవి నవలా ప్రక్రియ, కొకు విమర్శ వంటి ప్రగతికాముక సాహిత్యం పట్ల ఆదరణ తగ్గనప్పటికీ.. అంతకు మించిన ఆసక్తి ఊకదంపుడు సాహిత్యం మీదే పాఠక జనం ప్రదర్శించడం అభ్యుదయ సాహిత్యకాముకులకు ఆవేదన కలిగించింది. చాసో, రావి శాస్త్రి వంటి వారి నుంచి ప్రగతిశీల  వచన సాహిత్యం ప్రబలంగా వస్తున్నప్పటికీ.. కవిత్వపరంగా స్తబ్దత ఆవరించడం ఆ యువత కలతకు కారణమయింది. ప్రయోజశూన్యతను ప్రశ్నిస్తూ  రక్తం ఉడికే ఓ ఐదుగురు యువకవులు 1965లో ఓ వినూత్న కవిత్వోద్యమానికి భాగ్యనగరం నుంచి శ్రీకారం చుట్టారు. 'నన్నయను నరేంద్రుడి బొందలోనే/ నిద్రపోనియ్యి/ లేపకు/ పీక నులిమి గోతిలోకి లాగుతాడు’ అంటూ గతించిన కవిత్వ ధోరణులన్నింటిపైనా ధిక్కారస్వరం ప్రకటిస్తూ ఒక్క పెట్టున ఉప్పెనలా  తెలుగు కవిత్వం మీద విరుచుకు పడిన ఆ కొత్త ప్రక్రియే 'దిగంబర కవిత్వం'. అచ్చు, ఆవిష్కరణ, కలంపేర్లు.. అన్నింటా అప్పట్లో అదో గొప్ప కలకలం. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు, మహాస్వప్న, భైరవయ్య.. పేర్లతో మూడేళ్ల పాటు వీరవెల్లి రాఘవాచార్యులు, యాదవరెడ్డి, మానేపల్లి హృషీకేశవరావు, బద్ధం భాస్కరరెడ్ది, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, మన్ మోహన్ సహాయ్.. సాహిత్య సాగరంలో  సృష్టించిన సునామీలకి పెద్ద పెద్ద పేర్లే చెట్లూ చేమలూ ఎక్కి  పెద్దరికాన్ని కాపాడుకొన్నాయి!
'మానసిక దిగంబరత్వం కోసం నిత్య సచేతన ఆత్మ స్ఫూర్తితో జీవించడమే’ తమ  ఆశయంగా ప్రకటించుకొన్నారా దిగంబర కవులు. ‘శ్వాసించే ప్రతీవ్యక్తితో సారూప్యం చెంది, వ్యక్తి అస్తిత్వ పరిరక్షణ కోసం, అంతరంగంలో అణిగి మణిగి పడి ఉన్న ఆరాటాన్ని, అసంతోషాన్ని, విసుగును అక్షరాల్లో వ్యక్తీకరించి నూతన విశ్వాసాన్ని, ఆశను కలిగించాల’న్న వాళ్ల సామాజిక తత్పరత- తరువాతి మరో మూడేళ్ళు వరకు నిత్యపరిణామ దిశగా ఆడుగులు వేస్తో  స్తబ్దసాహిత్య సాగరంలో నిజంగానే కల్లోలాన్ని సృష్టించింది.
పాత రుతువులు, సంవత్సరాల మీద సైతం వాళ్లకు నిలువెల్లా పరమరోత! పురాతత్వాన్ని సంపూర్ణంగా వదిలించుకొని..   కవిత్వాన్ని పై నుంచి కింది వరకు  దిశమొలగా నిలబెట్టాలన్న దిగంబర  కవుల ఆరాటం కొందరికి తెంపరితనమనిపిస్తే  ఇంకొందరికి నిస్పృహ పైన నిజాయితీగా చేసే  నిబద్ధ పోరాటంగా స్ఫూర్తినిచ్చింది. ప్రతీ నాణేనికీ బొరుసు ఒక్కటే కాదు.. బొమ్మా ఉంటుంది. తిరగేసి చూడాలి.. అంతే!
'ఇది దిగంబరశకం. మేం దిగంబరకవులం. మాది దిగంబరకవిత. ఇది సాహిత్యోద్యమంలో దిగంబర కవితోద్యమం. కవితా స్వరూపాన్ని బట్టి మేం రాస్తున్నది వచన కవిత అని మేం అనదలుచుకోలేదు. అననివ్వదలుచుకోలేదు.  వచన కవిత అనే పదం మాకు నచ్చదు.' అని తమ కవిత్వ ప్రక్రియ లక్షణాలను తామే ప్రకటించుకున్నారు దిగంబర కవులు. అందరిలా కాకుండా తమ కవితలను 'ధిక్' లు  గా పిల్చుకున్నారు.  
ప్రాచీన సంస్కృతిని దుర్గంధభూయిష్టంగా గర్హించే దిగంబర కవిత్వానికి అంతర్జాతీయ నేపథ్యం  ఉంది. 20వ శతాబ్దంనాటి పారిశ్రామికీకరణ.. నాగరీకరణల ఫలితంగా  సమిష్టి కుటుంబ వ్యవస్థ వ్యక్తి కేంద్రీకృత  వ్యవస్థగా విఛ్చిన్నమయింది. ఆ విధ్వంసం మానవ విలువలు దిగజారుడంగా భావించి వేదన చెందింది పాశ్చాత్య సాహిత్యంలోని ఒక యువ వర్గం. స్వార్థ చింతన పెచ్చుమీరడం, మనిషి ఆర్థిక సంబంధాలే ప్రధానంగా భ్రమించడం, విలాసజీవనం పట్ల నియతి, నియంత్రణలేని లౌల్యం పెరిగిపోవడం..  వ్యవస్థలో విశృంఖలతకు, అమానుషతలకు దారి తీస్తున్నట్లు ఈ యువ వర్గం భావించింది. మానవ ప్రేరిత ప్రపంచ యుద్ధాల విధ్వంసం తరువాతా సామ్రాజ్యవాదం తన దాష్ఠీకం కొనసాగింపుకే మొగ్గు చూపడం ఈ యువతను  కలచివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమయిన ఉపద్రవాలకి ప్రతిస్పందనగా   మేధావివర్గాలు స్తబ్దతనో, నిరాశావాదాన్నో, పలాయనవాదాన్నో ఆశ్రయించడం ఆగ్రహం తెప్పించింది. సహజంగా ఆవేశం పాళ్లు ఒకింత అధికంగా ఉండే యువకులు కొంతమంది అత్యంత తీవ్రంగా స్పందించారు. ఆ స్పందన ఉద్యమ రూపాలు వివిధ దేశాలలో వివిధ స్వభావాలలో సాగినా అన్నింటి సామాన్యలక్షణం నిరాశ నుంచి పుట్టిన నిరసనే. తెలుగు గడ్డ మీదా రేగిన ఈ తరహా సామాజిక  అసంతృప్తి జ్వాలలకు    సాహిత్యపరమైన ఉద్యమ రూపం దిగంబర కవిత్వం.
మానసిక సంఘర్షణ, సంప్రదాయం పట్ల నిరసన, గతంమంటే గల అనాసక్తత, ఆధునికత మీద వైముఖ్యతల కారణంగా అమెరికాలో 1960ల్లో  'బీట్నీక్కులు’ 'బీట్నిక్ జనరేషన్' తరహా నిరశనోద్యమం లేవదీశారు.   పొరుగుదేశాల దాడి కారణంగా జాతీయ  జీవనం విఛ్చినమైన హంగరీ (అప్పటి ఆస్ట్రియా)లో కూడా అశాంతికి గురయిన యువకులు  కొందరు 'గాయపడ్డ యువతరం' పేరుతో  ఈ మాదిరి సాహిత్య పరమైన నిరశనోద్యమానికి నడుం కట్టారు.  అంతర్జాతీయ ఆందోళనా బృందం 'యాంగ్రీ యంగ్ మెన్'   నిరశనోద్యమానికి సమాంతరంగా మన దేశంలో కూడా పశ్చిమ బెంగాల్లో 1960లో  'హంగ్రీ యంగ్ మెన్' సాహిత్య ధోరణి తలెత్తింది. పెరుగుతోన్న అన్యాయాలూ, అరాచకాలూ, ఆర్థిక అసమానత, నిరుద్యోగ పరిస్థితులకు వ్యతిరేకంగా దేశంలో ఏదో ఓ మూల'భూఖీ పీడీ', ఓ ‘హంగ్రీ జనరేషన్’ వంటి ఆకలి తరం ఆవిర్భవించే దుర్భిక్ష  కాలంలో తెలుగునాటా ‘దిగంబర కవులు’ కొత్త సాహిత్యోద్యమానికి తెర లేపారు.
'ఊపిరి పీల్చే ప్రతీ మనిషీ ఉనికి కోసం తపన పడి భావిని చూపి భయపడి వెక్కి వెక్కి ఏడ్చి పిచ్చెత్తి ప్రవచించిన కవిత తమద'ని  లక్షణం ప్రకటించుకున్నారు. ‘మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషి కోసం, కపటంలేని చిరునవ్వులు చిందే సమాజం కోసం, అహోరాత్రాలు ఆరని అగ్నిలో నడిచిన ఆత్మలోంచి పలుకుతున్న గొంతు'లని తమ నిరశన స్వరాలను నిర్వచించుకున్నారు. 'ఏ ఆఛ్చాదనకీ తలవగ్గని, ఏ భయాలకీ లొంగని నిరంతర  సజీవ మానవుడి కోసం ఎలుగెత్తి పిలుస్తున్నామ'ని లక్ష్యం  చెప్పుకొన్నారు. ఆ చెప్పడంలోని ఘాటుదనమే సమాజ పెద్దరికానికి   వెంపర్లు పుట్టించింది.
'నిండుగా నిజంగా ఊపిరి పీల్చేవాడు/
ఆత్మయోని నుంచి పుట్టుకొస్తున్నాడు' అన్నాడు నిఖిలేశ్వర్.
నిజానికి ఆత్మనుంచి పుట్టుకొస్తున్నాడన్నా.. అదే భావం! సమాజం బుద్ధిమాంద్యానికి షాక్ ట్రీట్ మెంటు ఇవ్వడమే తమ తపనగా చెప్పుకున్న దిగంబర కవులు ఈ తరహా పదప్రయోగాలకు పూనుకోవడం దిగ్భ్రమ కలిగించదు! 'చచ్చిన రాజుల పుచ్చిన గాథల/ మెచ్చే చచ్చు చరిత్రకారులను/ ముక్కు చెవులు కోసి అడగాలనుంది/ మానవ పరిణామ శాస్త్రం నేర్పిందేమని?' అన్నప్పుడూ ' 'ముక్కు  చెవుల కోతలు' కవుల కసిలోనుంచి పుట్టుకొచ్చినవే!
'దిగంబర కవిత్వంలోని అక్షరాలు/ కామంతో పుచ్చిపోయిన/ లతాంగి పయోధరాలపై నూతన నఖక్షతాలు కావ'ని భైరవయ్య ఎంత   సమర్థించుకున్నప్పటికీ  'కీర్తికాముకుల. నియంతల/ అహంతల దౌర్జన్య బాహువుల దురాక్రమణలో/ దేశదేశాల సుఖవ్యాధి పుండ్లతో/ భూమి వెలయాలై, పతితయై, భ్రష్టయై/ పుచ్చి గబ్బు గొడుతున్నప్పుడు/ నేను పుడుతున్నాను దిగంబరకవిని'(మహాస్వప్న) అనడం అప్పటి మర్యాదస్తుల సాహిత్య లోకాన్ని మెప్పించలేక పోయింది. 'ఐదేళ్ల పెంటపోగులో దొరికిన అద్దం పెంకులో పగలని తన అవయవాన్ని చూసుకుంటూ ఆంధ్రమాత గర్వంగా మురిసిపోతున్నద'న్న(నగ్నముని) తరహా వర్ణనలు  జాతిని, నాతిని ప్రేమించేవారెవరూ   జీర్ణించుకోవడం కష్టం.

'కార్జ్యంలేని యజమాని/ గుండెలేని గృహిణి/ చెత్తకుండీ విస్తరాకుల యువకులతో/ ఈ చాప వ్యవస్థ మారేదెప్పుడు?' అని చెరబండరాజు ప్రశ్న. భయంకరంగా విజృంభించిన కుల మత దురహంకారాలకి, ధనమదంతో ప్రజాస్వామ్యాన్ని యధేఛ్చగా వాడుకుంటున్న గూండాయిజానికి, సినిమారొంపిలో ఈదులాడుతున్న యువత బలహీనతకి, స్తోత్రపాఠాల కుడితిలో పడిపోయిన పత్రికాలోకం పడుపు జీవనానికి, అతీత జీవనంతో గడుపుతున్న మేధావుల అనాసక్తతకి, నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి, నేటి కుష్టువ్యవస్థకి క్రూరంగా బలైన కంచికచర్ల కోటేశు స్మృతికి అంకితం చేసిన మూడో సంకలనమే దిగంబర కవిత్వ పరంపరలోని ఆఖరి అంచె. మొదటి సంపుటి ఆవిష్కరణ 1965, మే 6వ తేదీ అర్థరాత్రి. హైదరాబాద్ నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుడు ఆవిష్కర్త. రెండో సంపుటి విజయవాడ జంగాల చిట్టి 1966, డిసెంబర్ 8 న ఆవిష్కరించింది. దిగంబర కవిత్వానికి పరిణత దశగా భావించే మూడో సంపుటి 1968లో విశాఖపట్టణం బిచ్చగత్తె 'ఎడమసూరి యశోద' ఆవిష్కరించింది.
మూడు సంపుటాల్లో తొంభై మూడు కవితలు. అనువాదాలకు, అనుకరణలకు అలవాటు పడిన తెలుగు కవిత్వాభిమానులకు దిగంబర కవిత్వ మౌలిక రూపం నిర్ఘాంతపరచిన మాట వాస్తవం. తిరుగుబాటు కవిత్వం తెలుగువారికి కొత్తేమీ కాదు. అంతర్జాతీయం, అణుయుద్ధం, నగరజీవనం, వర్గపోరు, వ్యక్తిస్వేఛ్చ, ప్రపంచశాంతి ఇన్నేసి అంశాల మీద గంపగుత్తగా ఇంత తీవ్రంగా దుయ్యబట్టిన సందర్బాలకు దిగంబర కవిత్వమే నాందీ పలికింది.
రాచమల్లు రామచంద్రారెడ్డి అంతే తీవ్రంగా విమర్శనాస్త్రాలు  దిగంబర కవిత్వం పైన సంధించారు. పాతికేళ్ల అనంతరం దిగంబర కవుల్లో ఒకరైన జ్వాలాముఖి స్వయంగా తెలుగు దినపత్రికల్లో ఆత్మవిమర్శ చేసుకున్నారు.  బూతు పరిష్కారం కాబోదు. తిట్లు ఎవరిని మేల్కొలపవు. కాకపోతే స్తబ్దత నుంచి తిరుగుబాటు దారిలో విప్లవలక్ష్యం వైపుకు తెలుగు సాహిత్యం దృష్టిని మళ్లించినవారిగా దిగంబర కవులను జ్వాలాముఖి సూత్రీకరించడం సబబే అనిపిస్తుంది.
'హిందీ ధర్మయుగ్' లో దిగంబర కవిత్వానికి అనువాదాలొచ్చాయి. భారతీయ జ్ఞాన్ పీఠ్, లహర్, పొయెట్, కొన్ని బెంగాలీ, కన్నడ పత్రికలూ దిగంబర కవితలకు అనువాదాలు ప్రచురించాయి. మూడు సంపుటాలనూ ప్రొఫెసర్ రామానాయుడు అనువదించారు. కేంద్రీయ సంస్థాన్ పురస్కారం దిగంబర కవిత్వం అందుకుంది. ఉర్దూ, పంజాబీ,  అస్సామీ భాషల్లో కూడా దిగంబర కవిత్వం అనువదింపబడింది. కన్నడంలో బండాయ సాహిత్యానికి, హిందీలో సరికొత్త ధోరణులకు దిగంబర కవిత్వం స్ఫూర్తినిచ్చింది.
విచిత్రం ఏమిటంటే దిగంబర కవుల్లోని ఇద్దరు తదనంతర పరిణామ క్రమంలో మార్క్సిజం వైపుకు మళ్లితే, మరో ఇద్దరు అస్తిత్వవాదం వైపుకు వెళ్ళిపోయారు. నిర్దిష్టమైన భావజాలం, స్పష్టమైన సంస్థాగత నిర్మాణం లేని ఏ ఉద్యమానికయినా తదనంతర కాలంలో పట్టే దుర్గతే దిగంబర కవిత్వానికీ దాపురించింది. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు 1970లో విప్లవ రచయితల సంఘంలో చేరి.. 1975 నాటికి మళ్లీ బైటికి వచ్చేసారు. పోతే.. మిగతా ఇద్దరూ భైరవయ్య, మహాస్వప్నలు  వ్యక్తులుగా మిగిలిపోయారు. విప్లవ కార్యకలాపాలలో మొదటినుంచి క్రియాశీలకంగా పనిచేసిన చెరబండరాజు .. బ్రయిన్ ట్యూమర్ తో కాలం చేసాడు. కఠిన కారాగారవాసాలు, పోలీసుల చిత్రహింసలు కారణమని కొందరి విశ్వాసం.
సాహిత్యంలో సంకోచాలను  వదిలించుకొనేందుకు, అనుభూతులు యధేచ్చగా వ్యక్తీకరించుకొనేందుకు ప్రజాస్వామిక భూమికను సిద్ధం చేయడం వరకు దిగంబర కవితోద్యమం సార్థమయిందన్న వాదనతో అందరం అంగీకరించక తప్పదు.
మొదటి సంపుటిలో సామాజిక రుగ్మతలు, రెండో సంపుటిలో మనిషి ఉనికి, సామాజిక అస్తిత్వం, మార్క్సిజం పట్ల సానుకూలత, మూడో సంపుటి సమస్యల పరిష్కారానికి సాయుధ పోరాటం.. అనే అంశాల చూట్టూ పరిభ్రమించినట్లు సాహిత్య విమర్సకులు విశ్లేషించుకుంటున్నారిప్పుడు.
ఏదేమైనా తదనంతర కాలంలో సాహిత్యంలో కొత్త కొత్త ఆలోచనా ధోరణులకు వికాసానికి దిగంబర కవిత్వం దోహదం చేసిందన్న మాట మాత్రం వాస్తవం.
-కర్లపాలెం హనుమంతరావు
17 -06 -2018

(సాహిత్య దృక్పథాలు- దిగంబర కవిత్వం - డా।। యస్వీ సత్యనారాయణ  వ్యాసం ప్రేరణగా)


Saturday, June 16, 2018

మంచిపని ఎవరు చేసినా అదేపనిగా ప్రశంసించు!- ఒక తండ్రి కొడుకుకి చేసిన ఉద్బోధ



తండ్రుల పండుగ సందర్భంగా!

చిత్తూరు జిల్లా కలకడ మండలం రాతిగుంటపల్లె గ్రామం. ధర్మం.. పుణ్యం తెలిసిన పెద్దమనిషి. రైతు.  ఆయన పేరు శ్రీ కోట వెంకటయ్య నాయుడు. ఆయన కుమారుడు కోట పురుషోత్తముడు. తండ్రి తనకు నేర్పించిన జీవితపాఠాలని  గుర్తు చేసుకునే స్మృతి దీపిక పుస్తకం. 

బడికి వెళ్ళేందుకు వీలు లేక మూడవ తరగతి తర్వాత బడిచదువు మానుకోవలసి వచ్చింది వెంకటయ్యగారికి. అయినా వెనుకంజ వేయలేదు. పంతంతో తనకు తానుగా చదువుకుని, పలు విషయాలు నేర్చుకొన్నారు. పండితుల్లాగా మాట్లాడేవారు.  ఊరి ప్రజకు ఉపయోగమైన కార్యాలు చాలా చేశారు. విద్యకు పెద్దపీట వేయడం గొప్ప పనులలలో అన్నిటికన్నా గొప్పది. పిల్లలకు సత్ప్రవర్తన.. మంచికి చెడ్డకి తేడాను విపులంగా వివరించడమే కాకుండా ఆచరించి చూపించేవారు.

మాదిగపల్లె దగ్గర విరిగిపోయిన పరేందిమాను చుట్టూ ఉన్న పిలకల్ని పెళ్ళగించుదామని పిల్లతనంగా ఉత్సాహపడిన కొడుకుకి  చెప్పిన మాటలే   తండ్రి వ్యక్తిత్వాన్ని పట్టి చూపిస్తాయి. 'ఇతరులు నాటిన చెట్ల కాయల్ని నువ్వు అనుభవించావు కదా! నువ్వు నువ్వుగా ఒక్క చెట్టును కూడా నాటలేదు. పాపం.. గాలి వచ్చి విరిగిపోయిన మాదిగపల్లోళ్ళ పరేంది చెట్టు పిలకల్ని వేస్తే వాటిని పెరికి వినోదిద్దామని చూస్తున్నావు ఇది దుర్మార్గం కాదా? వాళ్ళు పెంచిన చెట్టు పిలకల్ని ఇరిచేసి.. పెరికేసి మాదిగపల్లి పిలకాయలకు పరేందికాయలు లేకుండా చేయటం చెడ్డపని కాదా?' తప్పు తెలుసుకున్న కుమారుడు మర్నాడు ఒక నేరేడుచెట్టు, కొబ్బరి చెట్టు నాటాడు

సత్కార్యాలతో, అమృతం కురిపించే వాక్కులతో ప్రతిరోజునీ ఒక మధురస్మృతిగా  మార్చే మంచి తండ్రి ఆయన. రోజూ చేయగల, మధురస్మృతులు మిగిల్చే వందలాది సత్కార్యాలకి, కానీ ఖర్చు లేని గొప్ప పనులకి ఆయన చెప్పిన ఉదాహరణలు కోకొల్లలు.

ఆవు గంగడొలును అరచేత్తో దువ్వు!
ఎదురింటి పిల్లాణ్ణి ఎత్తుకుని ఎగరేసి ముద్దాడు!
గాటికాడ ఉన్న ఎద్దు నోటికి పచ్చిగడ్డిని అందించు!
మంచిపద్యం నేర్చుకుని అప్పచెప్పు!
పిచ్చిక్కి బియ్యపునూక వెయ్యి!
పక్కింటి ముసలవ్వ చేతినుంచి చేంతాడందుకుని నీళ్ళు తోడిపెట్టు!
పిల్లికి పాలూ కూడూ పెట్టు!
నాయనమ్మ చేతుల్ని చెంపకు ఆనించుకుని తృప్తిపొందు!
మొక్క నాటి పెంచు!
పుస్తకానికి అట్ట వేసుకో!
వానొచ్చినప్పుడు మట్టి వాసనను రుచి చూడు!
అరచేతిలో సంగటిముద్దేసుకుని గుంతలో ఊరుబిండి పెట్టుకుని కూలీల మధ్య కూర్చుని తిను!
కానగాకుతో పీక చేసి ఊదు!
సంక్రాంతికి ఎద్దుకొమ్ములు జివిరి రంగులేసి కొమ్ములకు ఊపిరిబుడ్డలు కట్టు!
చెరువు కొళ్ళబోయే రోజు పిలకాయల్తో కలిసి చేపలు పట్టు!
కపిల తోలేటప్పుడు జిళ్ళ వెయ్యి!
చెట్టెక్కి చింతచిగురు కొయ్యి!
ఇసక నారవలో చెలమ తీసి వొంగి నోరు పెట్టి ఆ నీళ్ళు తాగు!
మంచిపని ఎవరు చేసినా అదేపనిగా ప్రశంసించు!
పెద్దలను గౌరవించు!'

మంచిగా జీవించటానికి, మంచితనం పెంచటానికి కృషిచేసిన ఎవరికయినా చేయెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అందుకే ఈసారి 'తండ్రుల పండుగ' కోసంగాను సేకరించింది  ఈ వ్యాసం.

'తెలుగు పద్యం నిన్ను సమూహం నుంచి వేరుచేసి సింహాసనం మీద కూర్చోబెడుతుంది' అని చెప్పి  పద్యం మీద అభిమానాన్ని, ఆసక్తిని, అనురక్తిని కలిగించి, రగిలించి  పద్యాలు కంఠస్థం చేయించిన 'నాన్న' జ్ఙాపకంగా, ఇప్పటి బడిపిల్లలకీ, యువతకీ కానుకగా ఇవ్వాలని ఒక కొడుకు తెచ్చిన పుస్తకాన్ని గురించి  సారి నాన్న పండుగ సందర్భంగా ఒక చిన్న వ్యాసంఅప్పుడెప్పుడో జంపాల చౌదరిగారు పుస్తకం.నెట్ లో చేసిన పరామర్శ  వ్యాసానికి ఆధారం.

పుస్తక రచయిత శ్రీ కోట పురుషోత్తముడికి, జంపాల చౌదరిగారికి ధన్యవాదాలతో!
(పుస్తకం.నెట్ సౌజన్యంతో)
-కర్లపాలెం హనుమంతరావు
16 -06 -2018.


ఫుట్ నోట్ః
పురుషోత్తంగారు విద్యార్థి దశలో ఏఐఎస్సెఫ్‌లో కార్యకర్త. ఉండి, పదేళ్ళు ఆర్థికశాస్త్రం ఉపన్యాసకునిగా పనిచేసారు. తెలుగుభాషోద్యమంపట్ల ఆకర్షితులయి. తిరుపతి తెలుగు భాషోద్యమ సమితిలో కార్యవర్గ సభ్యులయారు. వారి నాన్న స్ఫూర్తిగా ఆయన సేకరించిన పిడికెడు మంచి పద్యాలతో ఈ పుస్తకాన్ని ప్రచురించి వీలైనంతమంది పిల్లల చేతుల్లోకి చేర్చేమ్దుకు ప్రయత్నించారు.

మహాభారతం నుంచి, నవీన నానీల వరకు,  ప్రసిద్ధమైన తెలుగు పద్యాలు, గీతాలు పుస్తకంలో కనిపిస్తాయి. తెలుగు భాష, తెలుగు నేలను ప్రస్తుతించేవి,  ప్రబోధాత్మకంగా ఉండే సుభాషితాలు, ఇతరత్రా ప్రసిద్ధి చెందిన తెలుగు పద్యాలతో పుస్తకం నిండి ఉంటుంది. ఒక్క నన్నయే కాదు.. నవీన ఉద్యమ కవి కత్తి పద్మారావుగారి రచనలూ కంటబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. కనిపిస్తారు. పుస్తకం చిన్నదే.. అయినా భద్రంగా దాచుకోదగ్గ పెన్నిధి.

2006లో ప్రచురింపబడి, రెండు ముద్రణలు పొంది. రెండవ వెయ్యికి పైగా ప్రతులు చెల్లిపోయాయంటేనే.. అయ్య బాబోయ్! అనిపిస్తుంది చదువరులు క్రమంగా తగ్గిపోతున్నారన్న భ్రమలో ఉన్న మనకు!.

ఏమైనా ఉత్తముడైన ఒక తండ్రికి కుమారుడు ప్రేమగా సమర్పించిన ఈ గొప్ప  నివాళిని  'తండ్రుల పండుగ' రోజున స్మరించుకోవడం ఉత్తమ సాహిత్యసేవ అనిపింది.








కొమఱ్రాజుగారి ‘వియోగ గీతి’ కత!




వడ్డాది  సుబ్బారాయుడిగారు ‘సతీ స్నృతి’ తెలుగులో వచ్చిన ఒక ప్రముఖ సంతాప కావ్యం (ఎలజీ). సుబ్బారాయుడిగారి వైవాహిక జీవితం చాలా పరితాపకరమైనది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. నలుగురు కాదు.. ఏకంగా ఐదుగురు సాథ్వీమణులు ఆయన చేత మెడలో తాళి కట్టించుకున్నా ఒక్కరికైనా కలకాలం కలసి జీవనయానం సాగించే యోగం లేకపోయింది. మొదటి కళత్రం పోయిన 1881 ప్రాంతంలో సుబ్బారాయుదుగారు ఇందాక చెప్పుకున్న కళత్ర వియోగానికి సంబంధిచిన కవితా సంపుటి రాసారు. కవిగారు రాసారు కానీ.. ప్రచురించేందుకు ఏ పత్రికా ముందుకు రాని దుర్గతి. కొక్కొండ వెంకటరత్నం పంతులుగారే తన ఆంధ్రభాషా సంజీవని పత్రికలో మొదటి సారి దాన్ని అచ్చువేసారు. దరిమిలా అది ఒక సంపుటిగా వెలువరించడం.. అశేషమైన  ప్రచారం సంపాదించుకోవడం.. అదో విశేషం. అక్కడితో అయిపోతే ఇక్కడ ఈ కథ చెప్పుకునే అవసరమే ఉండేది కాదు.
సుబ్బారాయుడిగారి ‘సతీ స్మృతి’ చదివి విశేషంగా ఉత్తేజం పొందిన వారు అసంఖ్యాకులు, అందులో కొమఱ్రాజు లక్ష్మణరావుగారూ ఒకరు. ఆ కావ్యం చదివిన ప్రభావంతో ఆయనా ‘వియోగ గీతి’ ఒకటి మరాఠీలో వెలువరించారు. యథాప్రకారం దానికీ అశేషంగా పాఠకులు స్పందించారు. కవిగారికి ఇంత చిన్నవయసులోనే కలిగిన కళత్ర వియోగానికి చింతించని వాడు లేడు. ఉత్తరాల ద్వారా ఊరడించే వాళ్ళు కొందరైతే.. వీలు కల్పించుకొని మరీ  కొంతమంది శోకతప్తులు ఏకంగా పూలదండలు పుచ్చుకొని మరి పరామర్శల కొచ్చేసారుట!
కొసమెరుపేమిటంటే.. కొమఱ్రాజు వారికి అప్పుడు నూనూగు మీసాల వయసే. భార్య సంగతి పక్కనుంచి.. అప్పటి మన సంప్రదాయాల ప్రకారం ఇంకా మగపిల్లవాడి ముందు  పెళ్లి ప్రస్తావనలు సైతం తీసుకురాకూడని తరుణం!
ఈ అనుభవంతో జడిసిన కొమఱ్రాజువారు కవిత్వం రాయడం బంద్! ఆ తరువాత ఆయన రాసినవనీ కవిత్వానికి ఆమడ దూరం ఉండటం గమనార్హం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం 4వ సంపుటి- పుట 235)

కొమఱ్రాజు లక్ష్మణరావుగారి వివరాలు కొన్ని
(సోర్స్ః వికీపీడియా) 
జననం మే 18, 1877
పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా
మరణం జూలై 12, 1923
మద్రాసు
మరణ కారణము    అనారోగ్యం
వృత్తి    దివాన్, రచయిత
ప్రసిద్ధి   చారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త, సాహితీవేత్త
భార్యః   కోటమాంబ
పిల్లల:  వినాయకరావు
తండ్రిః   వెంకటప్పయ్య
తల్లిః     గంగమ్మ


Thursday, June 14, 2018

ఇదేం సమాఖ్య స్ఫూర్తి మోదీజీ?




'ఇండియా దటీజ్ భారత్ షల్ బి ది యూనియన్ ఆఫ్ స్టేట్స్' అని భారత రాజ్యాంగం నిర్దేశించింది. అంటే భారతదేశం కొన్ని రాష్ట్రాల కలయిక- అని అర్థం.
భారతదేశ రాజ్యాంగ వ్యవస్థది ‘సమాఖ్య స్వరూపమా? ఏక కేంద్ర స్వభావమా?  అని అడిగివాళ్లకి ఇతమిత్థంగా  సమాధానం ఇవ్వడం కష్టం. ఈ అంశం మీద ఎన్నో ఏళ్లబట్టి ఎవరికి తోచినట్లు వాళ్లు వ్యాఖ్యానాలు చేసుకొస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన దేశ సమాఖ్య స్వరూపం ‘సమ్మిళిత’ స్వభావం కలిగివుంటుంది.. రాజ్యాంగం ప్రకారం.
సమాఖ్య లక్షణాలు ఉన్నప్పటికీ అంతిమంగా  కేంద్రీకృత అధికారానికి లొంగి ఉండేది ఈ 'సమ్మిళిత సమాఖ్య'.
అమెరికా సమాఖ్య రెండు పౌరసత్వాలు కలిగి ఉంటుంది. రాష్ట్ర పౌరసత్వం.. కేంద్ర పౌరసత్వం. బ్రిటన్ సమాఖ్యలో ఒకే పౌరసత్వం.. అదీ కేంద్రం అధీనంలో  ఉండేది. మన దేశ సమాఖ్య ఈ రెండిటికీ మధ్యస్థంగా సాగే వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది.
ఒకే రాజ్యాంగం,  ఒకే పౌరసత్వం, ఒకే ఎన్నికల సంఘం, అఖిల భారత సర్వీసులు.. తాజాగా ప్రవేశపెట్టిన జి.ఎస్.టి విధానం.. కేంద్రం నియమించే గవర్నరు రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే అంతిమ రాజ్యాంగాధికారిగా ఉండటం.. ఇవన్నీ కేంద్రీకృత అధికారాన్ని నిర్దేశించే లక్షణాలు.
 కానీ మనల్ని రెండు చట్టసభలు పాలిస్తుంటాయి ఇక్కడ. ఒకటి రాష్ట్రస్థాయిలో, మరోటి కేంద్రస్థాయిలో. కేంద్రస్థాయిలో కూడా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా  రాజ్యసభ కూర్పు  ఉంటుంది. ఇవీ  సమాఖ్య లక్షణాలు. అంటే కొన్ని కేంద్రీకృత అధికారాలు, కొన్ని రాష్ట్ర స్థాయి పెత్తనాలు. అందుకే  రాజ్యాంగ నిపుణులు కొందరు మనది 'అర్థ సమాఖ్య' (Half Federalism) వ్యవస్థగా అభివర్ణించారు. కానీ ఆ నిర్వచనం కూడా మన సమాఖ్య వాస్తవ స్వరూప స్వభావాలను నిర్వచించే విధంగా లేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే మన సమాఖ్య వ్యవస్థ ‘సహకార సమాఖ్య(Co-operative Federalism)’ లక్షణాలను కలిగి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో మాత్రమే సాగించవలసిన ప్రజాపాలన వ్యవస్థ ఇది.
అందుకే రాష్ట్ర పాలనలో కేంద్రం జోక్యం మితి మీరినప్పుడల్లా విమర్శలు జోరందుకుంటుంటాయి. కేంద్ర, రాష్ట్రాలలో వేరు వేరు రాజకీయపక్షాలు పాలన చేస్తున్నప్పుడు  ఈ విమర్శల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పుడు కేంద్రాన్ని నియంతగా చిత్రించే ధోరణీ ఉధృతంగా సాగుతుంది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రసవత్తర రాజకీయ వాతావరణానికి ఈ తరహా పరిస్థితులే ప్రథాన నేపథ్యం.
అటు కొత్తగా ఏర్పడిన తెలంగాణాలో సైతం పరిస్థితి విభిన్నంగా లేదు. కేంద్రం రాష్ట్రాలకు తగినన్ని  నిధులు, నీళ్ళతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు స్వేచ్ఛ, అధికారం ఇవ్వడం లేదని యాగీ చేస్తున్నది రాష్ట్రప్రభుత్వం. బలమైన ప్రాంతీయపార్టీల ఏలుబడిలో ఉన్న బీహారు,  పశ్చిమ బెంగాలు కమ్యూనిష్టుల ఏలుబడిలో ఉన్న కేరళ వంటి రాష్ట్రాలలో ఈ సంఘర్షణాత్మక వైఖరి మరింత దూకుడుగా సాగుతోంది.
ఆ మధ్య దక్షిణాది రాష్ట్రాలు తమకు న్యాయంగా దక్కవలసిన పన్నుల వాటాలో సైతం కేంద్రం వివక్ష చూపిస్తున్నదని, దక్షిణప్రాంతంలో వసూలు అయే పన్నుల్లో అధికభాగం ఉత్తరాది రాష్ట్రాలకు ఉదారంగా దోచిపెడుతోందని  వివాదం లేవదీసాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రత్యేకంగా సమావేశమై కేంద్ర పక్షపాత ధోరణిని ఎండగట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. ముందు ముందూ కేంద్రం మొండి వైఖరి   ఇదే విధంగా  కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక ప్రత్యేక సమాఖ్యగా ఏర్పడి ఉత్తరాది రాష్ట్రాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడే రోజులు వస్తాయని పార్టీ ప్రారంభించిన ప్రారంభదినాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన విషయం గుర్తుంది కదా!  
రాజ్యాంగానికి రూపకల్పన కమిటీ అధ్యక్షులు డాక్టర్ దాదా సాహేబ్ అంబేద్కర్ ఈ సమాఖ్య వ్యవస్థ మీద చేసిన వ్యాఖ్యానం ఈ సందర్భంగా స్మరించక తప్పదు. 'భారతీయ సమాఖ్య ఒప్పందం ప్రకారం ఏర్పడింది కాదు. కాబట్టి రాష్ట్రాలకు విడిపోయే హక్కు ఉండదు. సాధారణ పరిస్థితుల్లో నిజమైన సమాఖ్యగానూ, అత్యయిక పరిస్థితుల్లో ఏక కేంద్ర వ్యవస్థగానూ పనిచేసేందుకు మాత్రమే వీలు కలుగుతుంది' అని బాబా సాహేబ్ వ్యాఖ్య.
రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి ఉందని ప్రకటించే అధికారం సెక్షన్ 356 కింద కేవలం కేంద్రానికి మాత్రమే సోపడానికి వెనకున్న లక్ష్యం సమాఖ్య స్ఫూర్తి తిరిగి బాగుపడనంత పరిస్థితికి దిగజారకూడదనే.
దివంగత ప్రధాని ఇందిర హయాంలో దేశం ఒకసారి ఈ అత్యయిక దుస్థితిని  చవి చూసింది. అప్పటి నుంచి ఆ ఆర్టికల్ రద్దు కోసం  దేశంలోని రాష్ట్రాలన్నీ వత్తిడి చేస్తోన్న విషయం మనం మర్చిపోకూడదు.
కాంగ్రెసు పార్టీ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా నియంతృత్వ పాలనతో రాష్ట్రాలను వేధిస్తున్నదన్న విమర్శలతో 2014లో అధికారంలోకొచ్చిన నరేంద్ర మోదీ ఈ నాలుగేళ్లలో క్రమక్రమంగా తానూ అదే తరహా ఏకీకృతకేంద్ర పాలన దిశగా అడుగులు వేస్తున్న వైనం ఆందోళన కలిగించే అంశం. ఆ తరహా నియంతృత్వ పాలనకు విరుద్ధంగా ప్రతిపక్షాలు, పలు ప్రాంతీయపార్టీలు సహజంగానే  గగ్గోలు పెడుతున్నాయి.
గ్రామస్థాయి పథకాలపై సైతం కేంద్ర నియంత్రణ, పర్యవేక్షణ ఎక్కువై రాష్ట్ర ప్రభుత్వాల  పరిస్థితి పురపాలక సంస్థల స్థాయికి దిగజారిందని పలురాష్ట్రాల ఆవేదన. సంక్షేమరాజ్య స్ఫూర్తితో అనేక పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబధాలు కలిగివుండే రాష్ట్రాలకు మాత్రమే సంపూర్ణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని డిమాండు పెరుగుతోన్నదిప్పుడు! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యగల అధికార పంపిణీ విధానాన్ని పునస్సమీక్షించాలని, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు అప్పగించాలని, రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో కేంద్రం అతిజోక్యం తగ్గించుకోవాలని, దుర్వినియోగమవుతున్న గవర్నర్ల వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయాలని, రాష్ట్రపతి విచక్షణాధికారంతో రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి విధించే ఆర్టికల్ 356 ను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్లు రోజు రోజుకూ బలంగా పెంచుకుంటూ పోతున్నాయి రాష్ట్రాలు.
ఎవరి అవసరాలకు తగ్గట్లు వారు రాష్ట్రస్థాయిలో  రిజర్వేషన్లు  కల్పించుకునే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలన్న డిమాండ్ తో మొదలైన తెలంగాణా రాజ్య సమితి ఉద్యమం ఇప్పుడు క్రమంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు.. నిజమైన ఫెడరల్ సమాఖ్య' అన్న డిమాండ్లకు పెరిగి.. కలసి వచ్చిన పార్టీలతో కేంద్రస్థాయిలో మరో 'కూటమి' ఏర్పరచే ప్రయత్నం దిశగా సాగుతున్నది. మరో వైపు కేంద్రం అతిజోక్యంతో రాజ్యాంగం కల్పిసున్న సహకార సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తున్నదంటూ ప్రాంతీయపార్టీలన్నీ మరో కూటమిగా  ఏకమయి పోరాడే దిశగా రాజకీయాలు ఊపందుకుంటున్నాయి.
ఇప్పుడైనా కేంద్రంలో పాలన చేసే అధికార పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రాజ్యాంగం ప్రసాదించిన సహకార సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టే విధంగా స్వీయపాలనలో మార్పులు చేసుకుంటుందని సుపరిపాలన కోరుకొనే పౌరులుగా మనందరం ఆశిద్దాం.
(‘డెబ్బైయ్యేళ్ల భారత రాజ్యాంగం -విశ్లేషణాత్మక పరిచయం’  పుస్తక రచయిత శ్రీ అనిసెట్టి సాయికుమార్ వ్యాసం భారత రాజ్యాంగం నిర్దేశించిన వ్యవస్థ స్వరూప స్వభావాలు’ స్ఫూర్తితో)
రచయితకు ధన్యవాదాలు
-కర్లపాలెం హనుమంతరావు
15 -06 =2018

(విజ్ఞాన ప్రచురణల సౌజన్యంతో)

Wednesday, June 13, 2018

కథలు- సినిమా కతలు




ఇప్పుడంటే వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా సినిమాలమీదకు దృష్టి సారించడం లేదు. కానీ.. ఒక దశాబ్దం కిందట సినిమాలే ప్రపంచంగా..  సినిమా ప్రపంచంలో చెడ తిరిగిన వాడిని. 'చెడ' తిరగడం సినిమా జీవులకు ఉండవలసిన ప్రధాన లక్షణం.
బుద్ధిమంతులు ఇంట్లో.. గదిలో ఓ మూల చేరి  ప్రశాంతంగా .. ఏ అర్థరాత్రో.. ఆపరాత్రో.. ఎన్నికాగితాలూ.. కంప్యూటరు బైట్లు ఖరాబు చేసుకున్నా అడిగే నాథుడు ఉండడు. సినిమా రచయితకు అలా కుదరదు.  క్లాప్ బాయ్ నుంచి.. దర్శకుడిదాకా అందరూ 'నాథుళ్లే'. ఎవరికి వాళ్ళు వాళ్లను 'శ్రీనాథుళ్ల'ను కోవడం సినీజీవుల విలక్షణత. రావిశాస్త్రిగారినో సారి  సినీ కథ రాసేందుకని మద్రాసు తోలుకెళ్లారు తెల్సీ తెలియని అమాయకులెవరో తిరిగొచ్చిన తరువాత కొత్త  అనుభవం ఎలా ఉంది శాస్త్రిగారూ?' అనెవరో అడిగితే 'బాఁనే ఉంది. జల్సాగా కూడా ఉంది. మన భోజనానికి మన ఖర్చు లేదు. మన మందుకీ మనం  ఖర్చు అక్కర్లేదు. మన పసందు ఏదైనా సరే  మనం అచ్చుకోనక్కర్లేదు. మన పన్లేవీ  మన చేత చేయనివ్వరు.. చివరికి కథ కూడా..' అనేసారు.
ఈ కాలంలో అచ్చుపత్రికల్లో  కథల పేరుతో వచ్చే రాతలకే  'ఏకతా'సూత్రం (theory of  unification)) అతకడం లేదు. ఏ కతకైనా 'ఏకత'(Unity) అవసరమని SYD FIELD అనే పెద్దాయన 'Screenplay' అనే పుస్తకంలో సిద్ధాంతం చెబుతాడు. The Foundations of ScreenWriting పేరుతో పడీ పడీ 300 పేజీల ఉథ్గ్రంథం ఓటి   రాస్తూ బుర్రను తొలిచే  పురుగును .. చిట్టచివరగా  మిణుగురు పురుగు మాదిరి   ఎలా మెరిపించచ్చో  ‘స్టెప్ బై స్టెప్’ లెక్కలా  సాధికారికంగా వివరిస్తాడు.   హాలీవుడ్లో చిత్రాలు ఈ సిడ్ ఫీల్డ్   సూత్రాలమీద ఎంతవరకు తయారవుతాయో  తేల్చడం అంత తేలిక కాదు. కానీ.. హాలీవుడ్ స్థాయి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలందించాలని కలవరించే వెర్రి సజ్జంతా  కనీసం  ఒక్కసారైనా  ఈ పుస్తకం అట్టను తడిమి లోపలేం రాసుందో తెల్సుకుంటే లాభమే కానీ.. వచ్చే నష్టమేమీ ఉండదు.
కథను  తెరకు అనువదించడం  ఒక శాస్త్రం. శాస్త్ర ప్రకారం చేయడం అపాయకరమని మొదట్నుంచీ మన తెలుగువాళ్లకెందుకో ఒక అపనమ్మకం.  (ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందంటున్నారు). హాలీవుడ్డో. కొరియన్ ఫుడ్డో.. వాళ్లు అష్టకష్టాలూ పడి వండుకున్న వంటకాలని  దొంగతనంగా ఎత్తుకొచ్చి ఎంగిలి పడ్డంలో  మన రచయితలకదో రకమైన  థ్రిల్లు!
'లోకో భిన్న రుచిః ' అన్న సూత్రంలోని మాయమర్మం కాస్తయినా వంట పట్టిన   రచయిత  'నేటివైజేన్'  టెష్టులో 'సి' గ్రేడైనా సాధిస్తాడు. అదీ కుదరని 'మక్కీకి.. మక్కీ' కుక్కింగు రాయుళ్ళు-  నమ్ముకొని రంగంలోకి దూకిన దిగిన నిర్మాతల్ని నట్టేట ముంచేస్తారు.  మరో సినిమా తీయడం ఆనక.. బెజవాడ బస్టాండులో మిరబ్బజ్జీ  బాండీ వేసుకునే  స్థాయికి తీసుకు రాపోతే అక్కడికి అదృష్టవేఁ!  
హాలీవుడ్డు కయినా.. బాలీవుడ్డు కయినా.. టాలీవుడ్డు కయినా.. అతకడాలు.. అతక్క పోవడాలంటూ ఉండవు. సిడ్ ఫీల్డు స్క్రీన్ రైటింగు పాఠాలు ఒక్క  హాలీవుడ్డు మేథావుల చెవుల్లో  ఊదిన గాయత్రీ మంత్రాలేవీఁ కాదు.  ఊహా మాత్రంగా మెదడులో మెదిలిన ఆలోచన తెరమీదో కావ్యంగా కనిపించేందుకు జగమంతా ఒకే విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.  కథానిర్మాణం  వెన్నెముక కూర్పయితే కథలోకి జీవం తేవడం సృజనాత్మకతకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. సిడ్ ఫీల్డుకైనా.. రాబర్డ్ మెక్ కైనా.. సిద్ధాంతం బుర్రకెక్కించడం వరకే పరిమితం! స్పీల్ బర్గో.. చక్రపాణో కావడం  మేథస్సుకు సంబంధించిన  చమత్కారం.
తెరమీద కదిలే కథకి..  తెర వెనక ఎంత కథ నడవాలో వివరించే సిద్దాంతం స్క్రీన్ ప్లే!  వాస్తవానికి అనుభవ పూర్వకంగా సాధించవలసిన యోగం ఇది. ఈదే నైపుణ్యం నేర్పే పుస్తకాలుండచ్చేమో.. కానీ.. ఈదడానికి మాత్రం ఎవరి రెక్కలు వాళ్లకే సాయం రావాలి' . సినిమా కథ తయారీకి కూడా సరిగ్గా అతికేదీ మార్క్ ట్వైన్ సూక్తి. కాకపోతే పుస్తకాలలో మనం చదివే కథలకి.. తెరమీద  మనం చూసే కథనాలకీ నిర్మాణ సిద్ధాంతంలో ఆట్టే తేడా లేదు. మనసును రంజింపచేసే ఈ రెండు ప్రక్రియల్లో ఉండేది ఒకే సామాస్య నిర్మాణ సూత్రం. చదువరులకి.. వీక్షకులకి ఆ మర్మాలు అనవసరమేమో గానీ.. కథానిర్మాతలకు ఈ లోతు పాతులన్నీ కాకపోయినా .. కొన్నైనా తెలిసుండాలి కదా!  వడ్డించినన భోజనం ఆరగించే మనిషికి అనుపాకాల తయారీతో సంబంధమేముంటుంది? భోక్తకు కావల్సింది రుచి. రుచికరంగా వండటమెలాగో తెలుసుకోవాల్సిన ధర్మం వంట చేసే మనిషిది. వంటమనిషికి కథలు రాసేవాళ్లకి ఒకే సూత్రం. ఆ సూత్రాలు తెల్సుకునేందుకైనా కొన్ని సిద్ధాంత గ్రంధాలమీద మనసుంచి అవపోసన పట్టాలి.
సిడ్ ఫీల్డ్.. రాబర్ట్ మెక్ లాంటి  అనుభవజ్ఞులైన చలనచిత్రకథాశాస్త్రజ్ఞులు  స్క్రీన్ రైటింగుకి సంబంధించిన సిద్ధాంత గ్రంథాల్లో  చెప్పిన పాఠాలన్నీ అందుచేతనే.. ఔత్సాహిక  సినీకథా రచయితలకు.. కథారచయితలకు..  ఒకే విధంగా ఉపకరించే  పాఠ్యగ్రంథాలని నా ఉద్దేశం.
నేను సినిమారంగంలో క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలుః
నేను చదివిన కొన్ని పుస్తకాలు
1.SYD FIELD /SCREENPLAY
2.ROBERT MckEE/ STORY-
substance, structure, style, and the principle of screenwriting
3.తెలుగు సినిమా సాహిత్యం- కథ , కథనం, శిల్పం- డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణఉస్మానియా విశ్వవిధ్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టా పొందిన సిద్ధాంత గ్రంథం
4.సినిమా స్క్రిప్టు రచనా శిల్పం- చిమ్మని మనోహర్
వగైరా.. వగైరా
-కర్లపాలెం హనుమంతరావు
14 -06 -2018


కలకండ పలుకు- తెలుగు పలుకు


'కాళిదాసు భోజరాజు కీర్తిని కొనియాడే ఓ సందర్భంలో
నీరక్షేరే గృహీత్వా నిఖిల ఖగతితీర్యాతి నాళీకజన్మా
తక్రం ధృత్వాతు సర్వా నటతి జలనిధీం శ్చక్రపాణి ర్ముకుందః  సర్వాంగనుత్తుంగశైలాన్ వహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతే!  భోజరాజక్షితీంద్ర!’
అంటూ మహా అతిశయోక్తులు ప్రదర్శిస్తాడు! 
రాజుగారి కీర్తి శ్వేతవర్ణంలో దశదిశలా వ్యాపించడం వల్ల పక్షులన్నీ హంసల్లాగా  భ్రాంతి గొలుపుతున్నాయిట!  బ్రహ్మదేవుడికి తన వాహనం ఏదో ఆనవాలు  పట్టేందుకు నీళ్లు కలిపిన పాలు పక్షుల ముందు పెట్టవలసి వచ్చిందని కాళిదాసు చమత్కారం! సర్వసముద్రాలూ పాలసముద్రం మాదిరి తెల్లబడటంవల్ల జగజ్జేతకు తన పడకగల పాలసముద్రం ఏదో తెలుసుకోడం వల్లగాక  చల్ల  సాయం తీసుకోవాల్సి వచ్చిందని మరో ముచ్చట! మజ్జిగచుక్క పడిన తరువాత  ఏ సముద్రం గడ్డకడుతుందో అదే   తన పడక గల పాలసముద్రం అవుతుందనిట  పరమాత్ముని ఈ ప్రయోగం!  పరమేశ్వరుడిదీ అదే పరిస్థితి.  తన కైలాసగిరి  విలాసమేదో తెలుసుకునేందుకు ఫాలనేత్రం తెరిచి మరీ మండించవలసిన  పరిస్థితి! మండిన కొండే తన వెండికొండ అవుతుందని ఈశుని ఈ విచిత్ర పరీక్ష!  దీనబాంధవుల  స్థితిగతులనే ఇంత దయనీయంగా మార్చివేసాయి భోజరాజు వంటి గొప్ప మహారాజు కీర్తికాంతులని కాళిదాసు  వర్ణించడం కొంత అతిగా అనిపించినా.. రాసింది కావ్యం. రాసినవాడు అక్షరసిరి  కాళిదాసు కాబట్టి ఎంతటి  కల్పన అయితేనేమి.. అత్యంత రమణీయంగానే ఉండక తప్పదు! కాళిదాసు ప్రతిభకు సంస్కృతం శోభా తోడయిందని పండితుల గొప్పలు! ఒప్పుకుంటాం కానీ.. మరి మన తెలుగు తీయందనంలో భాషా దేవభాషకు ఏం తీసిపోయేది కాదు. ఈ తెలుగు పద్యం చూడండి!
వేల్పుటేనికలయ్యె బోల్ప నేనుగు లెల్ల- గొండలన్నియు వెండి కొండలయ్యె
బలుకు చేడియ లైరి పొలతుక లందరు- జెట్టులన్నియు బెట్టు చెట్టు లయ్యె
బాల సంద్రములయ్యెనోలి నేర్లన్నియు- నలువ బాబాలయ్యె బులుగు లెల్ల
బుడమి దాలపులయ్యె బడగదార్లన్నియు- మేటి సింగములయ్యె మెకము లెల్ల
బండు రేయెండ కన్నుల పండువగుచు
బిండి చల్లిన తెరగున మెండు మీరి
యొండు కడనైన నెడలేక యుండి యప్పు
డండ గొనగ జగంబెల్ల నిండుటయును’
అంటూ మన తెలుగు కవి కూచిమంచి తిమ్మకవి సైతం   తెలుగులో రామాయణం రచించే సందర్భంలో   అయోధ్యకాండ మధ్యలో ఓ హృద్యమైన  పద్యం చెప్పుకొచ్చాడు. ‘శభాష్!’ అనిపించే మెచ్చుకోళ్ళెన్నో సాధించుకొచ్చాడు.
విస్తారంగా పరుచుకొన్న  పండువెన్నెల్లో నల్లటి ఏనుగులు కూడా దెవేంద్రుడి ఐరావతంలాగా భ్రమింపచేస్తున్నాయనడం, నీలవర్ణం కుప్ప పోసినట్లుండే  కొండల కూడా మహాశివుని రజితాలయాల మాదిరి ధగధగలతో మెరిసి  పోతున్నాయనడం,  శ్యామల వర్ణంతో నిగనిగలాడే స్త్రీల సొగసులన్నీ శారదమ్మ శరీరకాంతితో పోటీకి దిగుతున్నాయనడం, హరితవృక్షాలన్నీ కల్పవృక్షాలకు మల్లే తెలుపురంగుకి తిరిగి  ప్రకాశిస్తున్నాయని కల్పనలు చేయడం,  నదులు సర్వస్వం క్షీరసాగరానికి మల్లే మల్లెపూల మాలల మాదిరి మతులు పోగొడుతున్నాయని వర్ణించడం,  వివిధ జాతుల  పక్షులన్నీ రంగులతో నిమిత్తం లేకుండా శ్వేతహంసల మాదిరి  బారులు తీరి శోభాయమానంగా అలరారుతున్నాయని అతిశయోక్తులు పోవడం..  ఆహాఁ..మన తిమ్మకవి తెలుగు మాత్రం కమ్మదనంలో  కాళిదాసు సంస్కృతానికన్నా  ఏం తక్కువగా తీసిపోయింది?
పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది’ అని  ఒక్క వాక్యంలో ముక్కి ఊరుకుంటే అది కావ్యం ఎలాగవుతుంది? తిమ్మనకు కవి శ్రేష్టతకు గుర్తింపు ఎలా వస్తుంది?  కనకనే  ఈ కమనీయమైన కల్పనలన్నీ!
అదంతా నిజమయితే కావచ్చు కానీ.. అసలు విశేషం అందులో ఇసుమంతే ఇమిడి ఉంది. నిశితంగా గమనించి చూడండి! ఈ పద్యమంతా అచ్చమైన తెలుగులో  రసవంతమైన శైలిలో  రాయడంలోనే కవి నిఖార్సైన ప్రతిభ దాగి ఉంది!
పసిగట్టగలిగే ప్రతిభ మన మనసుకు ఉండాలేగానీ తెలుగు పలుకుకి మాత్రం కలకండ పలుకుకు మించిన తీపిదనం లేదా!
మన మాతృభాషను చులకన చెయకండి! అంతర్జాతీయంగా అదే మన ప్రాంతీయతకు  గొప్ప గుర్తింపు!
***
-కర్లపాలెం హనుమంతరావు
12 -06 -2018

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...