Wednesday, June 13, 2018

కలకండ పలుకు- తెలుగు పలుకు


'కాళిదాసు భోజరాజు కీర్తిని కొనియాడే ఓ సందర్భంలో
నీరక్షేరే గృహీత్వా నిఖిల ఖగతితీర్యాతి నాళీకజన్మా
తక్రం ధృత్వాతు సర్వా నటతి జలనిధీం శ్చక్రపాణి ర్ముకుందః  సర్వాంగనుత్తుంగశైలాన్ వహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతే!  భోజరాజక్షితీంద్ర!’
అంటూ మహా అతిశయోక్తులు ప్రదర్శిస్తాడు! 
రాజుగారి కీర్తి శ్వేతవర్ణంలో దశదిశలా వ్యాపించడం వల్ల పక్షులన్నీ హంసల్లాగా  భ్రాంతి గొలుపుతున్నాయిట!  బ్రహ్మదేవుడికి తన వాహనం ఏదో ఆనవాలు  పట్టేందుకు నీళ్లు కలిపిన పాలు పక్షుల ముందు పెట్టవలసి వచ్చిందని కాళిదాసు చమత్కారం! సర్వసముద్రాలూ పాలసముద్రం మాదిరి తెల్లబడటంవల్ల జగజ్జేతకు తన పడకగల పాలసముద్రం ఏదో తెలుసుకోడం వల్లగాక  చల్ల  సాయం తీసుకోవాల్సి వచ్చిందని మరో ముచ్చట! మజ్జిగచుక్క పడిన తరువాత  ఏ సముద్రం గడ్డకడుతుందో అదే   తన పడక గల పాలసముద్రం అవుతుందనిట  పరమాత్ముని ఈ ప్రయోగం!  పరమేశ్వరుడిదీ అదే పరిస్థితి.  తన కైలాసగిరి  విలాసమేదో తెలుసుకునేందుకు ఫాలనేత్రం తెరిచి మరీ మండించవలసిన  పరిస్థితి! మండిన కొండే తన వెండికొండ అవుతుందని ఈశుని ఈ విచిత్ర పరీక్ష!  దీనబాంధవుల  స్థితిగతులనే ఇంత దయనీయంగా మార్చివేసాయి భోజరాజు వంటి గొప్ప మహారాజు కీర్తికాంతులని కాళిదాసు  వర్ణించడం కొంత అతిగా అనిపించినా.. రాసింది కావ్యం. రాసినవాడు అక్షరసిరి  కాళిదాసు కాబట్టి ఎంతటి  కల్పన అయితేనేమి.. అత్యంత రమణీయంగానే ఉండక తప్పదు! కాళిదాసు ప్రతిభకు సంస్కృతం శోభా తోడయిందని పండితుల గొప్పలు! ఒప్పుకుంటాం కానీ.. మరి మన తెలుగు తీయందనంలో భాషా దేవభాషకు ఏం తీసిపోయేది కాదు. ఈ తెలుగు పద్యం చూడండి!
వేల్పుటేనికలయ్యె బోల్ప నేనుగు లెల్ల- గొండలన్నియు వెండి కొండలయ్యె
బలుకు చేడియ లైరి పొలతుక లందరు- జెట్టులన్నియు బెట్టు చెట్టు లయ్యె
బాల సంద్రములయ్యెనోలి నేర్లన్నియు- నలువ బాబాలయ్యె బులుగు లెల్ల
బుడమి దాలపులయ్యె బడగదార్లన్నియు- మేటి సింగములయ్యె మెకము లెల్ల
బండు రేయెండ కన్నుల పండువగుచు
బిండి చల్లిన తెరగున మెండు మీరి
యొండు కడనైన నెడలేక యుండి యప్పు
డండ గొనగ జగంబెల్ల నిండుటయును’
అంటూ మన తెలుగు కవి కూచిమంచి తిమ్మకవి సైతం   తెలుగులో రామాయణం రచించే సందర్భంలో   అయోధ్యకాండ మధ్యలో ఓ హృద్యమైన  పద్యం చెప్పుకొచ్చాడు. ‘శభాష్!’ అనిపించే మెచ్చుకోళ్ళెన్నో సాధించుకొచ్చాడు.
విస్తారంగా పరుచుకొన్న  పండువెన్నెల్లో నల్లటి ఏనుగులు కూడా దెవేంద్రుడి ఐరావతంలాగా భ్రమింపచేస్తున్నాయనడం, నీలవర్ణం కుప్ప పోసినట్లుండే  కొండల కూడా మహాశివుని రజితాలయాల మాదిరి ధగధగలతో మెరిసి  పోతున్నాయనడం,  శ్యామల వర్ణంతో నిగనిగలాడే స్త్రీల సొగసులన్నీ శారదమ్మ శరీరకాంతితో పోటీకి దిగుతున్నాయనడం, హరితవృక్షాలన్నీ కల్పవృక్షాలకు మల్లే తెలుపురంగుకి తిరిగి  ప్రకాశిస్తున్నాయని కల్పనలు చేయడం,  నదులు సర్వస్వం క్షీరసాగరానికి మల్లే మల్లెపూల మాలల మాదిరి మతులు పోగొడుతున్నాయని వర్ణించడం,  వివిధ జాతుల  పక్షులన్నీ రంగులతో నిమిత్తం లేకుండా శ్వేతహంసల మాదిరి  బారులు తీరి శోభాయమానంగా అలరారుతున్నాయని అతిశయోక్తులు పోవడం..  ఆహాఁ..మన తిమ్మకవి తెలుగు మాత్రం కమ్మదనంలో  కాళిదాసు సంస్కృతానికన్నా  ఏం తక్కువగా తీసిపోయింది?
పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది’ అని  ఒక్క వాక్యంలో ముక్కి ఊరుకుంటే అది కావ్యం ఎలాగవుతుంది? తిమ్మనకు కవి శ్రేష్టతకు గుర్తింపు ఎలా వస్తుంది?  కనకనే  ఈ కమనీయమైన కల్పనలన్నీ!
అదంతా నిజమయితే కావచ్చు కానీ.. అసలు విశేషం అందులో ఇసుమంతే ఇమిడి ఉంది. నిశితంగా గమనించి చూడండి! ఈ పద్యమంతా అచ్చమైన తెలుగులో  రసవంతమైన శైలిలో  రాయడంలోనే కవి నిఖార్సైన ప్రతిభ దాగి ఉంది!
పసిగట్టగలిగే ప్రతిభ మన మనసుకు ఉండాలేగానీ తెలుగు పలుకుకి మాత్రం కలకండ పలుకుకు మించిన తీపిదనం లేదా!
మన మాతృభాషను చులకన చెయకండి! అంతర్జాతీయంగా అదే మన ప్రాంతీయతకు  గొప్ప గుర్తింపు!
***
-కర్లపాలెం హనుమంతరావు
12 -06 -2018

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...