Sunday, August 30, 2020

రక్తదానం- కర్లపాలెం హనుమంతరావు-




తారతమ్యాలు లేకుండా దానం ఇవ్వగలిగింది రక్తం. ఆ దానానికి మనుషులందరిని మానసికంగా సిద్ధం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్. 14 వ తేదీని రక్తదాన దినోత్సవంగా నిర్దేశిస్తే, ఆ విధంగా రక్తం ఉదారంగా దానం చేసే కర్ణులను గుర్తించి గౌరవించేందుకు 'ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్స్' అనే అంతర్జాతీయ రక్తదాతల సమాఖ్య స్థాపించబడింది. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసే దాతలను గుర్తించి వారిని గౌరవించడం ద్వారా సమాజంలో రక్తదాన స్ఫూర్తిని మరింత పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది.
రక్తానికి గడ్డకట్టే స్వభావం ఉంది. అయినప్పటికీ ఒక పరిమిత కాలం వరకు దానిని నిలువచేసే సాంకేతిక పరిజ్ఞానం అభివృధ్ధి చెందింది. ఆ తరువాతనే 'బ్లడ్ బ్యాంకులు' స్థాపన అభివృద్ధి చెందింది. బ్యాకులు దేశ దేశ ఆర్థికరంగ పరిపుష్టికి ఎంత అవసరమో, బ్లడ్ బ్యాంకులు దేశ ఆరోగ్య రంగ పరిపుష్టికి అంతే అవసరం. కొన్ని కొన్ని ప్రదేశాలలో, రహదారుల వెంట ప్రమాదాలు తరచూ జరిగే అవకాశాలు కద్దు. ఆ తరహా ప్రాంతాలను గుర్తించి ఆ దారి పొడుగూతా రక్త బ్యాంకులు ఏర్పాటు చేయడం ఉచితం. అందుకోసమైన ప్రజలలో రక్తాన్ని ఉచితంగా దానం చేసే అలవాటు అభివృద్ధి చెందవవలసిన అవసరం ఉంది.
శరీరం ఉత్పత్తి చేసే రక్తాన్ని గురించి చాలా మందికి సరి అయిన అవగాహన ఉండదు. రక్తాన్ని దానం చేయడం అంటే ఒంట్లోని రక్తాన్ని తోడేయడంగా భావించరాదు. ఎంత రక్తం బైటికి పోతుందో అంతే మోతాదులో రక్తం కొత్తగా శరీరం ఉత్పత్తి  చేస్తుంది. కొత్త రక్తం వంటికి పట్టిన తరువాత మనిషిలోని పూర్వపు మందగొడితనం కొంత తగ్గి,  నూతనోత్సాహం అనుభవంలోకి వస్తుంది కూడా.  వంటి రక్తంలోని చిన్నిపాటి కొవ్వు, మాంస కృత్తుల అసమతౌల్యత  దానికదే సర్దుకుని రక్తదాత ఆరోగ్యంలో మెరుగుదల శాతం పెరుగుతుంది కూడా
అట్లాగని అందరి శరీరాలు రక్తదానానికి అనువుకావు. 17 - 18 సంవత్సరాల వయసు దాటిన వారి దగ్గర నుంచి మాత్రమే రక్తం సేకరిస్తారు. దీర్ఘరోగ పీడితులు, పసిపిల్లలు, పెద్ద వయస్సువారు, మెన్సుయేషన దశ దాటిన స్త్రీల వంటి వారి రక్తం దానానికి స్వీకరించడం శ్రేయస్కరం కాదని ఆరోగ్యశాస్త్రం హితవుచెబుతోంది.
రక్తదానం చేయాలనుకునేవారు తమ పేరును ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. దాత ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి అర్హుడు అని నిర్ధారణ అయితే స్వచ్ఛంద దాతగా పేరు నమోదు చేసుకుంటారు. అవసరమైన సందర్భంలో రక్తదానం చెయ్యడానికి పిలుపు వస్తుంది. రాకపోయినా ఏ పుట్టినరోజు వంటి సందర్భాన్ని మనమే  కల్పించుకుని రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయనూవచ్చు. తమ అభిమాన సినీకథానాయకుడు జన్మదినోత్సవమనో, తమ రాజకీయ అధినేత పిలువు ఇచ్చాడనో సామూహికంగా రక్తదానం చేసే సందర్భాలు మనం తరచూ చూస్తూ ఉంటాం. స్వఛ్ఛదంగా రక్తం దానం చెయ్యడం కూడా ఒక రకమైన సామాజిక సేవా కార్యక్రమం కిందే లెక్క
రక్తదాతల కరవు వల్ల రక్తాన్ని అమ్ముకునే దురాచారం ఒక వృత్తిగా అభివృద్ధి చెందే అవకాశం తగ్గుతుంది
 'రక్తం ప్రాణులను కాపాడుతుంది. ఆ రక్తదానం నాతో మొదలవుతుంది. స్వచ్ఛమైన రక్తం అందిస్తాను' అన్న నినాదంతో తొలి రక్తదాన దినోత్సవం ప్రారంభమయింది. ఆ నినాదాలు మానవజాతిని శాశ్వతంగా నిలబెట్టే విలువైన నినాదాలు. 'మోర్ బ్లడ్.. మోర్ లైఫ్' లాంటి నినాదాలు ఒక్కో ఏడు ఒక్కొక్కటి తీసుకుని  రక్తదాన దినోత్సవాలు సంరంభంగా జరపడం రివాజుగా వస్తోంది 2004 నుండిమొదటి రక్తదాన దినోత్సవం దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ్ నగరం నుంచి నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ప్రపంచమంతటా ఈ రక్తదాన దినోత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయి.
రక్తానికి ఉన్న విలువను గుర్తించడం ముఖ్యం. అయినవారు ఆపదలో ఉన్నప్పుడు, బంధువులు రోగికి సరిపడా రక్తం కోసం వెదుకులాడుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు రక్తం విలువ మనకు అర్థమవుతుంది. రైలు, రోడ్డు ప్రమాదాలు వంటివి పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో రకరకాల రక్తం అవసరమవుతుంది. రక్తం ముందే సేకరించి భద్రపరిచి ఉంచిన సందర్భాలలో అధిక మోతాదులో జరగబోయే ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. స్త్రీల ప్రసవాల సందర్భంలోనూ, కేన్సర్ వంటి రోగులకు.. దీర్ఘకాలిక రోగాల నుంచి కోలుకునేవారికి చికిత్సలు అందించే సందర్భంలోనూ రక్తం ప్రాధాన్యత బాగా పెరుగుతుంది.
మనిషి ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు బాధితుడిని కాపాడే దేవుడు వైద్యుడు అయితే, ఆ దేవుడికైనా సమయానికి అందుబాటులో ఉండవలసిన ముఖ్యమైన సాధనాలలో రోగికి సరిపడే  రక్తం చాలినంత ఒకటి. సరయిన గ్రూపు రక్తం, సరిపడా సమయానికి  దొరికినప్పుడే ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం.  అంత గొప్ప విలువైన సాధనం ప్రతి మనిషి వంట్లోనూ నిరంతరం రక్తం రూపంలో ప్రవహిస్తూనే ఉంటుంది. దానిని పరిమితులకు లోబడి దానం చేసినందువల్ల నష్టం ఏమీ ఉండకపోగా లాభాలే అదనం. ఆ విశేషం ప్రతీ వ్యక్తీ గుర్తించాలి. ఆ విధంగా గుర్తించే దిశగా ప్రభుత్వాలుగాని, ఆరోగ్య సంఘాలు గాని స్వచ్ఛంద అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేయాలి.  
రక్తదానంతో మరో ప్రాణి జీవితాన్ని కాపాడవచ్చన్న సత్యం ఆరోగ్యశాస్త్రం పసిగట్టినప్పటి నుంచి రక్తదానానికి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. రక్తంలోని కణాల నిర్మాణం గ్రూపుల ద్వారా నిర్దారించబడుతుంది. ఓ పాజిటివ్ గ్రూప్ గల మనుషులు సాధారణంగా ఎక్కువ సంఖ్యలో లభ్యమవుతుంటారు. రక్తానికి సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య శాస్త్రం 'హెమటాలజీ' రక్తానికి ఉన్న భిన్నమైన గ్రూపులు, ఆర్ హెచ్ లక్షణం గుర్తించి, వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోనికి రక్తాన్ని ఎక్కించే సాంకేతిక ప్ర్రరిజ్ఞానాన్ని మరింత  అభివృధ్ధి పరిచింది, అప్పటి నుంచే 'రక్తదానం' ఆలోచన ఒక ముఖ్యమైన ఆదర్శ సామాజిక అంశంగా రూపుదిద్దుకొన్నది. దానిని మరింత ప్రచారంలో పెట్టడం అంటే పరోక్షంగా అయినా మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా సాయం అందిస్తున్నట్లే లెక్క. మన శరీరంలో పారే ఒక్కక్క రక్తపు చుక్క మన ఒక్కళ్లకే కాదు.. అవసరమైనప్పుడు లక్షలాది మంది ఇతరుల ప్రాణాలను రక్షించే క్రతువులో సమిధ కింద కూడా సమర్పించవచ్చు. ఈ దిశగా ఒక సదాలోచన ప్రతీ వ్యక్తిలో కలిగించడం, స్వయంగా స్వచ్ఛందంగా ఆ తరహా రక్త దానం చెయ్యడం= రెండూ మనిషిగా పుట్టినందుకు మానవజాతికి ఇతోధికంగా మనం చేసుకునే ఉత్తమ సేవాకార్యక్రమాలే!
-కర్లపాలెం హనుమంతరావు
(జూన్. 14 వ తేదీ రక్తదాన దినోత్సవం)
***

Saturday, August 29, 2020

బాపూజీ పట్ల ఇంత అపచారమా? -కర్లపాలెం హనుమంతరావు-సూర్య దినపత్రిక ఆదివారం ప్రచురణ




'అసంఖ్యాకమైన భారతీయులకు నేనివాళ ప్రతినిధిగా నిలిచానంటే .. అదిఆయాచితంగా నాకు దక్కిన స్థానం కాదు. కష్టించి నేను సాధించుకున్న గౌరవం'అన్నాడు గాంధీజీ. వినేందుకు డంబంగా అనిపించినా తనను గురించి  తానా హాఫ్నేకెడ్ ఫకీర్ బాహాటంగా చెప్పుకున్న మాటల్లో వీసమెత్తైనా అసత్యం లేదు.

బాపూజీ తనకు తానుగా సంకల్పించుకుని ఉత్తమ మానవుడుగా ఎదిగేందుకు సర్వశక్తులూ ఒడ్డి చిత్తశుద్ధితో కృషిచేసిన రుషితుల్యుడు! ఆయన సత్యంతో చేసిన ప్రయోగాలు పుస్తకం నిజానికి ఒక విశిష్టమైన వ్యక్తిత్వ వికాస పాఠ్యగ్రంథం. జీవితంలో మనిషి మనీషిగా ఉన్నత దశ వైపుకు ఎదగాలంటే, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో ఆయన ఎక్కడా పాఠంలాగా చెప్పకపోయివుండవచ్చు. కానీ ఆ మహాత్ముడు తనలో తానుగా ఎచెప్పుకున్న నా జీవితమే నా సందేశం అన్న ఆ



ఒక్క ముక్కలోనే అన్ని అర్థాలు దాగి ఉన్నాయి.   ఎవరికి కావాల్సిన అర్థాలు వాళ్లు సులభంగా వెదుక్కోనేందుకు వీలైన నిండు ప్రయోగశాల  బాపూజీ జీవితం.



గాంధీజీ ద్వారా సాధించబడిన స్వాత్రంత్ర్యం ఒక్కటే కాదు, కొల్లాయిగుడ్డ, మేకపాలు, బాదంపప్పు, ప్రకృతివైద్యం, అల్పాహారం, నిరాడంబరత, అహింసావాదం, పేదరికం ఇత్యాదులన్నింటికి భారతీయుల వరకు బాపూజీనే తిరుగులేని అంబాసిడర్.. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ. ఆయన జనంమనిషి అన్న మాట అసత్యం  కాదు.  కానీ, సాధారణ జనం అయన దాకా చేరుకునేందుకు ఎన్నో అసాధారణ

శక్తులు అడ్డుండేవి ఆ రోజుల్లో. బడా బడా వ్యాపారవేత్తలను, బడాయిలు పోయేరాజకీయనేతలను, అసంఖ్యామైన కుబేరులను దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి

మామూలు మనిషికి ఇబ్బందిగా ఉండేది. గాంధీజీ కోరుకుంటే తప్ప ఆయన దర్శనం సామాన్యులకు అంత సులభంగా సాధ్యమయ్యే వ్యవహారంగా ఉండేది కాదన్న మాట నిజం. అయినా  భరతజాతికి ఆయన మీద ఉన్న అభిమానం కాలం గడిచే కొద్దీ పెరిగిందే తప్పించి తగ్గుముఖం పట్టిన దశ ఎన్నడూ లేదు. గుళ్లో దేవుడి దర్శనం కాలేదని దేవుడి నెవరూ తప్పుపట్టరు కదా! గాంధీజీ విషయంలోనూ అదే ప్రభ సాగింది

చివరి రోజు వరకు.


గాంధీజీ సిద్ధాంతాలు గాజు అద్దాలు బిగించిన షో కేసుల్లో అందంగా అమర్చిన కళాఖండాల స్థాయికి ఎదిగి చాలా కాలమయింది. కేవలం వాటిని కళ్లతో చూసి ఆనందించడమే తప్పించి, చేతిలోకి పుచ్చుకుని వాడుకునే సౌకర్యం లేకుండా పోయిందన్న నిష్ఠురం ఉండనే ఉంది. నాడు గాంధీజీ చుట్టూ చేరినవారు గాని,

నేడు గాంధీజీ  జపం చేస్తున్నవారిలో గాని, ఆయన భావజాలం పట్ల ఏ మేరకు అవగాహన ఉందో .. అనుమానమే! బాపూజీ బతికున్న రోజుల్లోనే ఆయన ఆదర్శభావాల పట్ల అంతులేని అయోమయం ప్రదర్శించిన నేతాగణం, ఇన్ని తరాలు గడచిన తరువాతనా ఇహ ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకొనే ప్రయత్నం చేసేది? బాపూజీ చేసిన ఆఖరు పోరాటం ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యం  ఇన్ని తరాలుగా మనం అనుభవిస్తున్నాం.  అయినా ఇంకా 'గాంధీయిజం   రెలెవెన్స్' ను గురించి దేశం ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రాలేకపోవడం ప్రపంచంలో మరెక్కడా జరగని వింతగానే చెప్పుకోవాలి గదా!  బాపూజీ నిరాడంబరతను గురించి కథలు కథలుగా చెప్పుకునే మనమే, ఆయన  జీవన శైలి ఎందువల్ల ఎందుకంత ఖరీదైన సింప్లిసిటీ చట్రంలో బంధించివుంచామో చెప్పగలమా?  పుట్టపర్తి సాయిబాబా చుట్టూ చేరిన భక్తబృందానికి, బాపూజీ చుట్టూ ఆనాడు చేరిన భజనబృందానికి వేష భాషలలోనే తప్ప ఆచరణ వ్యవహారాలలో ఆట్టే తేడా లేదంటే నొచ్చుకునేవారే ఎక్కువగా ఉండవచ్చు. బాబా చెప్పిన ఆచరణీయ సాధ్యంకాని ఆధ్యాత్మిక సిద్ధాంతాల వల్లెవేతకు బాపూజీ నోట పలికిన అభ్యుదయ భావజాలానికి ట్యాగులోనే తప్ప

స్వభావంలో ఆట్టే తేడాలేదంటే కొట్టొస్తారేమో కూడా మూఢభక్తులు. నిజానికి ఖరీదైన జీవితం గడిపేవారూ, జనాలను రకరకాల మార్గాల ద్వారా          దోపిడీచేసేవారు,

అధికారదాహార్తులు బాపూజీ భజన బృందంలో ఆనాడు ఎక్కువగా కనిపించేవాళ్లు. అట్లాంటి వాళ్లని దూరంగా పెట్టాలని బాపూజీ అంతరంగం ఎంతలా కొట్టుమిట్టులాడినా అది బాపూజీకే స్వయంగా సాధ్యంకాని పరిస్థితి.

గాంధీజీలోని ప్రధాన లోపం.. ఆయన తన జీవించివుండగానే బహుశా మానవమాత్రుడెవరూ ఊహించనైనా లేనంత అపారమైన అద్భుత జనాకర్షణ  కూడగట్టుకోవడం. దేవుడిని నిందించినా ఏ కొద్ది మందో కొంతయిన సద్దుకుపోయేవారేమో గానీ, బాపూజీ మీద ఈగ

వాలినా సరే భరించలేనంత ఉద్వేగం  ప్రదర్శించిన  జనాభిమానం ఉన్న ఒకానొక కాలం కద్దు. అతనిపై ఉన్నతవర్గాల ఆకర్షణకు స్వార్థం కారణమైతే, కింది వర్గాల వారి ఆకర్షణకు కేవలం అమాకమైన అభిమానమే కారణం. వీధిలో నిప్పంటుకుంటే ఎంత అసూర్యంపశ్యజాతి వారైనా ఒకసారి అటుకేసి తొంగిచూడకుండా ఉండలేరు. నిప్పుకున్న ఆకర్షణ శక్తి బాపూజీ వ్యక్తిత్వానికి సమకూరడం కాకతాళీయమేమీ కాదు. అసలే మేలిమి బంగారం. ఆ పైన అద్భుత ప్రచారం. మహాత్ముడు సమకూర్చుకున్న అశేష అమితాకర్షణ శక్తికి జంకే తెల్లవాడు ఠారుకుని  భరతగడ్డ మీద నుంచి తారుకున్నది కూడా.



బాపూజీ పై 1948, జనవరి, ముఫ్ఫై నాడు జరిగిన అఘాయిత్యం కాకతాళీయమేమీ కాదు. అంత ఊహించకుండా వచ్చిపడిన ఉపద్రవమూ కాదు. చరిత్రలో ఆ తరహా పాఠాలు ఏ వైరుధ్య వర్గాల మధ్య సామరస్యం కోసం చేర్చడం తప్పించారో అప్పడున్న పరిస్థితుల్లో నిగ్గుతేల్చడం కష్టతరమయివుండవచ్చు గాని.. ఇప్పుడంతా నీళ్లకు నీళ్లు. పాలకు పాలుగా తేటతెల్లమవుతూనే ఉన్నమాట నిజం.  బాపూజీ

దరిద్రకోటి ఉద్ధరణకై తన జీవితాన్ని మీదు కట్టినమాట ఎంత వాస్తవమో, ఆయన ముద్ర చూపించి ధనవంతులు, బలవంతులు మరింత ధనం, బలం సాధించుకున్న మాటా అంతే వాస్తవం. ఇందులో బాపూజీ ప్రమేయం ఏమీ ఉండకపోవచ్చును గానీ, తన పరంగా జరుగుతున్న అవాంఛనీయ పరిణామాల పట్ల ఆయన కేవలం ప్రేక్షకపాత్ర వహించడం మాత్రం విమర్శనార్హమే అవుతుంది కదా సమానమానవత్వకాంక్షాపరుల దృష్టికి!గాంధీమతం అభివృధ్ధి చెందుతున్న దశకు ముందు నుంచే దేశంలో ఎక్కువ మంది విశ్వసించే మతం అంతకు మించిన స్థాయిలో   చెలరేగిపోతోంది. స్వాతంత్ర్యపోరాటంలోకి ఆ విశ్వాసులు కేవలం దినదినప్రవర్థమానమయే 'గాంధీ'తేజం నిలవరించే ముఖ్యోద్దేశంతోనే లాగబడ్డారనే వాదానికి ఆధారాలులేకపోలేదు. అప్పటికే గాంధీ ప్రవచిత హరిజనోద్ధరణ,  మతసామరస్యం  వంటి సగుణాత్మక భావజాలం ప్రజాకోటి గుండెలను పట్టేసున్న పరిణామం. సంకుచిత మతతత్వ శక్తులకు  మింగుడుపడని విపరిణామం. బాపూజీ సైతం హిందూ ధర్మోద్ధరణకై పంతగించినవాడే అయినప్పటికి, ఆయనది ఉదారవాదం, సంస్కరణకోణం. నేరుగా బాపూని ఎదుర్కొనే పరిస్థితులు రాను రాను మరింత దుర్భరమయ్యే పరిణామాలను ముందే ఊహించి, ఆ మతవాదులు సహజంగానే అందుకు అడ్డుకట్టవేసే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. బాపూజీకి దేశం మూలమూలలా పూజలు అందే కాలంలోనే, అదే దేశంలో ఆయనను అంతమొందించే పథకాలకు దేశమంతటా ఆలోచనలు చేయబడ్డాయి. 'ఒక మహాపురుషుడి కోసం దేశమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది' అన్న బాపూజీ హత్యనాటి నెహ్రూజీ విషాదప్రకటనలో ఉన్నదంతా 'శుద్ధసత్యం' అంటే ఒప్పుకోలేం. శాంతిదూత చావు ఆవశ్యకతపై ముందు నుంచే  రహస్య కరపత్రాలు పంచబడ్డాయని వినికిడి. ఆ 'శుభ' వార్త వినేందుకు కొంతమంది 'విశ్వాసులు' టెలిఫోన్ల వద్ద కాచుకుని కూర్చున్నట్లు రికార్డులు తరువాత బైటపడ్డాయి. బాపూజీ 'హే..రామ్' అంటూ  నేలకొరిగిన రోజున వేలాదిమంది సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారంటే.. 'బాపూజ్యోతి' మలిగిపోవడం భారతీయం వంకన జరిగే ఒక మతప్రాభవానికి ఎంత

అగత్యమయిందో అర్థంచేసుకోవచ్చు.



భజనల ద్వారా, కల్లిబొల్లి కన్నీళ్ల ద్వారా ఒక సత్యాన్ని మరుగుపరిచే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగడమే జుగుప్సాకరం. నీచశక్తుల పెత్తనానికి ఒక వైయక్తిక శక్తి  అడ్డంకి అయిన  ప్రతీ సందర్భంలోనూ చరిత్రలో ఏం జరిగిందో, మహాత్ముని జీవితంలోనూ అదే జరిగింది. మనిషిని మట్టిలో కలిపేసి, మట్టి విగ్రహాలను నెలకొల్పడం జాతి పట్ల చేసే ద్రోహానికి కొనసాగింపే తప్ప మరోటి కాదు. విశ్వాస పునరుద్ధరణ మిషన స్వార్థశక్తుల పెత్తనం అప్రతిహతంగా కొనసాగేందుకే బాపూజీ బలికావలసొచ్చిందన్న మాట పచ్చి నిజం.  బాపూజీని గొప్పచేసి ఇప్పటి వరకూ బతికేసిన వారి పాత్రా ఈ వంచనాత్మక రూపకంలో తక్కువేమీ లేదు.



ఏటేటా మహాత్ముడి జయంతులు, వర్థంతులు దశాబ్దాల తరబడి మహా ఆర్భాటంగా  జరుగుతున్నా .. ఆయన అహర్నిశలు కలవరించిన బడుగుజీవుల ఉద్ధరణల వంటి

సంస్కరణలు ఒక్కరడుగైనా ముందుకు పడ్డాయా? స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దరిద్రుల బతుకు మరీ దుర్భరమయిందని నిస్పృహచెందేవారు ఇన్ని దశాబ్దాలు

గడిచినా తగ్గుముఖం పట్టడంలేదంటే ఏమిటర్థం?



తుపాకీల నీడన పాలన ఇప్పుడు సర్వసామాన్యమైపోయింది. అహింసాసూత్రమయితే ఏనాడో చేవచచ్చిపోయింది. సత్యంతో సమాజం, రాజకీయం ఇప్పుడు చేసే తమాషా ప్రయోగాలు బహుశా బాపూజీ బతికున్నా ఊహించగలిగివుండునా? తెల్లవాళ్లను మించినన్ప్రన్జాకంటకులు ఇప్పుడు ఎన్నికల నెచ్చెనలేసి జాతి నెత్తినెక్కి మొత్తేస్తున్నారు. గ్రామస్వరాజ్యం గుత్తకు ఇచ్చే పెత్తందారీల వ్యవహారమయిపోయింది. వంటికి నిండుగా బట్ట, కడుపుకు నిండుగా తిండి కోరడమే ఇప్పుడే పెద్ద దేశద్రోహం. సాంఘిక దోపిడీ అనేది ఒకటి ధాటిగానడుస్తున్నదన్న స్పృహే సమాజానికి ఇవాళ బొత్తిగా లేకుండా పోయింది. హరిజనుడు, బడుగుజీవుడు, బలహీనుడు, గ్రామీణుడు, శీలవతి, పసిబాలుడు, వికలాంగుడు, ముసలిమనిషి, సాగు పనులు, చేతివృత్తులు, కుటీర పరిశ్రమ, స్వపరిపాలన, పారదర్శకత, నీతి మార్గం.. ఇలా బాపూజీ భారతీయుల అభ్యున్నతి కోసమై కలవరించని అంశం కనిపించనే కనిపించదు. ఏ ఒక్క రంగమైన బాపూజీ కలలు కన్న రామరాజ్యం తీరులోన సాకారమయే లక్షణాలు కనిపిస్తున్నాయా?

'నేను గాంధీజీ వారసుణ్ణి' అని ప్రకటించుకున్నా ఒక్క ఓటు అదనంగా సాధించే పరిస్థితులు లేనప్పుడు గాంధీగిరీ రెలెవెన్సు గురించి ఇహ చర్చలెందుకు? తాగడం మానెయ్యమని ఆయన నెత్తీ నోరు కొట్టుకుని బోధించినమద్యం మీది ఆదాయమేఇప్పుడు ప్రభుత్వాలు పేదల కోసమై నడిపించే  సంక్షేమ పథకాలకు    ప్రధాన వనరు. ఒక్క కరెన్సీ నోటు పైన మినహా  దశాబ్దాల కిందట జాతి మొత్తాన్నీ సమ్మోహపరచిన ఆ బోసినవ్వుల బాపూజీ మందహాసం మరెక్కడా కనిపించనప్పుడు .. ఇంకా 'రామ్.. రహీమ్ భాయీ.. భాయీ' అంటూ నాటకాలు ఆడడం  రాజకీయం కాక మరేమిటి?

అధర్మం ప్రబలి ధర్మచ్యుతి జరిగినప్పుడు అవతారపురుషుడు జన్మించి దుష్ట శిక్షణ, ధర్మరక్షణ కార్యాలు నిర్వహిస్తాడన్న విశ్వాసం వినడానికి చెవులకు కమ్మగానే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఏది దర్మమో, ఏది అధర్మమో రాజ్యాంగమే తేల్చలేని సందర్భాలు ఇప్పుడు తరచూ ఎదురవుతున్నాయి! పూటకో సరికొత్తనేత తానొక్కడే గాంధీ మహాత్ముణ్ణి మించి ప్రజాసేవకు అంకితమయేందుకే ముందుకు వచ్చినట్లు సరసాలాడుతుంటే జనం మరింత అయోమయంలో పడి ధర్మాధర్మ విచక్షణశక్తి సర్వం కోల్పోతున్నారు. ధర్మరక్షణకు తొమ్మిది అవతారలు వచ్చిపోయినట్లు  మనం గాఢంగా విశ్వస్తున్నామంటే, ఏ ఒక్క అవతారం సంపూర్ణంగా పాపప్రక్షాళన చేయనట్లే  కదా? రాముడంతవాడు ఏ ధర్మ రక్షణకని భూమ్మీదకుదిగివచ్చాడో.. పాపం,  ఆ ధర్మరక్షణ కడదాకా నిర్వహించలేకనే  సరయూనదిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది. అనుభవం మీద కృష్ణావతారంలో అందుకే భగవంతుడు  మరీ అంత ముక్కు సూటిమార్గం ఎంచుకోనిది. చక్రవ్యూహం దారిలో వెళ్లినప్పటికీ చివరికి స్వజాతిలో పుట్టిన  ముసలమే  ఆయనను ముప్పతిప్పలు పెట్టింది! కృష్ణనిర్యాణం చివరికి జరిగింది తన మానాన తాను వృత్తి చేసుకునే ఓ కిరాతకుడి ద్వారానే అయినా, కిరాతకుడు కిరాతకుడే! ధర్మావతారాలన్నీ ఇలాగే కిరాతకుల చేతనో, నీచుల చేతనో చివరికి అంతమయిపోవడం కాకతాళీయం అనుకోవడానికి లేదు, గాంధీజీని మోహన్ దాస్ గాందీలాగా  ఉండనిస్తే ఆయన కోరుకున్నట్లు నిండు నూరేళ్లు పండులాగా బతికి జాతి నుంచి అసలైన మానుషనీతిని రాబట్టి వుండేవాడేమో! భక్తి మూఢభక్తికి దిగి ఆయనను అవతారపురుషుడు స్థాయికి ఎత్తే సరికి, ఆ అవతార అంతానికి చరిత్రకు మరో కిరాతకుడి చర్య అవసరమయింది. జాగ్రత్తగా గమనించి చూడండి, అవతార పురుషులందరూ ధర్మోద్ధరణకు కాకుండా, మనుషుల్లో ఎంత నీచత్వం దాగుంటుందో చూపించడానికే అవతరించినట్లు అనిపిస్తుంది.  కొడవటిగంటి కుటుంబరావుగారు అన్నట్లు,  బాపూజీ తన మరణం ద్వారా మన మనుషుల మధ్యలోని నీచత్వాన్ని నగ్నంగా నిలబెట్టడానికే పుట్టినట్లు అనిపిస్తుంది నిజానికి.

ఆ నీచత్వం పోగొట్టుకోవడమే బాపూజీకి మనం ఇవాళ నిజంగా ఇచ్చే నివాళి.  ఆ పని మీద దృష్టి పెట్టకుండా పై పైన కొంగభక్తి నటిస్తూ, లోలోపల ఆ మొండి మనిషి ఇప్పుడు బతికిలేనందుకు సంబరపడ్డమే నీచాతినీచం. అట్లా ఆనందపడడం మన స్వార్థం కోసం ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ఆ అహింసామూర్తిని చంపుతున్నట్లే! ఆనాడు తెల్లపాలకుడు కూడా చేయడానికి  వణికిపోయిన కిరాతకం ఈనాడు మనం చల్లంగా చేయడానికైనా వెనుకాడడంలేదు. ఎంత సిగ్గుపడాల్సిన దుర్గుణం!
 -కర్లపాలెం హనుమంతరావు
 ***
(సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట ప్రచురితం)

Saturday, August 15, 2020

స్వామి వివేకానంద- రాజకీయాలు -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయపుట ప్రచురితం





స్వామి వివేకానంద డాంబిక ప్రదర్శన లేని విరాగి.  ప్రాపంచిక విషయాల తరహాలోనే రాజకీయ వ్యవహారాలనే తామరాకు పైన   తనను  తాను ఓ నీటి బిందువుగా భావించుకున్న ఆధునిక యోగి.  ఆ పరివ్రాజకుడికి ఆ అంటీ ముట్టనితనం   సాధ్యమయిందా?  పరిశీలిద్దాం.
తన జీవితకాలంలో ఎన్నడూ రాజకీయరంగం దిశగా స్వామి అడుగులు పడిన సూచనలు కనిపించవు.  ఏ రాజకీయ పక్షానికీ ఆయన మద్దతు లభించిన  దాఖలాలూ దొరకవు. తన స్వంత  పరివ్రాజక సంస్థలోనూ రాజకీయరంగ ప్రస్తక్తిని నిషేధించిన స్వామీజీ.. ఆ నిబంధనను అధిగమించినవాళ్లని సభ్యత్వం నుంచి తొలగించేందుకైనా సందేహించినట్లు కనిపించదు. రామకృష్ణ మిషన్ నుంచి నివేదిత రాజకీయ సంబంధిత  కారణాల  వల్ల వైదొలగినప్పటి బట్టి స్వామీజీలో ఈ రాజకీయ విముఖత మరింత కరుడుగట్టినట్లు  భావిస్తారు. వివేకానందుడు నివేదితకు పరివ్రాజక సంఘంలో సభ్యత్వం నిరాకరించడం  ఈ సందర్భంగా గమనించవలసిన ముఖ్యాంశం. 
మనిషి పట్ల స్వామికి ఉండే ప్రేమ, సానుభూతి అపారమైనవి. అయినా సందర్భం వచ్చిన ప్రతీసారీ  వివేకానందుడు రాజకీయాల పట్ల తనకున్న విముఖతను నిర్మొహమాటంగా బైటపెట్టేవారు. స్వామి దృష్టిలో రాజకీయాలు మనిషిని సంకుచిత మార్గంలోకి మళ్లించేవి. రాజకీయం మిషతో ఎదుటి మనిషిని పీడించడమే కాదు, తనను గూర్చి తాను  డాంబికంగా  ఊహించుకునే మానసిక రుగ్మత మొదలవుతుందన్నది  వివేకానందుడి నిరసన వెనక ఉన్న భావన. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ప్రహసనాలు చూస్తున్నప్పుడు వివేకానందుడి నాటి ఊహలో వీసమెత్తైనా అసత్యం లేదనే అనిపిస్తుంది. 
స్వామి దృష్టిలో ఈ దేశం పుణ్యభూమి. ఇక్కడి అణువణువు అత్యంత పవిత్రమైనది.  రుషులు,  జాతి వివక్షతకు తావీయని పద్ధతుల్లో  సర్వ మానవాళికి  ఉచితంగా  ఆధ్యాత్మిక జ్ఞానసంపదను పంచిపెట్టారు. వారి అనుయాయులదీ అదే సన్మార్గం. భారతీయుల  మానవతావాదం యావత్ ప్రపంచం దృష్టిలో గౌరవనీయమైన స్థానం సాధించుకునేందుకు ఇదే ముఖ్య కారణం. సర్వశ్రేష్టమైన మానవత్వం పట్ల   భారతీయుల ఆధ్యాత్మిక సంస్కృతి కనబరచిన శ్రద్ధాసక్తులు  ప్రపంచం దృష్టికి తేవడమే లక్ష్యంగా చికాగో సర్వమత మహాసభ తాలూకు   వివేకానందుడి తొలి  ప్రసంగం సాగింది కూడా.
 ప్రపంచం భారతీయ సంస్కృతి ఔన్నత్యం గూర్చి చర్చించడానికి భారతీయులు కేవలం భారతీయుల మాదిరిగానే ఉండి తీరాలని స్వామి ప్రగాఢంగా విశ్వసించారు. కేవలం ఆ కారణం చేతనే మరే ఇతర దేశమో, సంస్కృతో మన దేశం మీదనో,  సంస్కృతి మీదనో పెత్తనం చెలాయించే అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు, చెత్త రాజకీయాల ద్వారా  జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వివేకానందుడు తీవ్రంగా అసహం వ్యక్తపరిచింది. 
ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారతీయుల పుణ్యభూమి పై పరాయివారి పాలన కొనసాగకూడదన్నదే స్వామి ప్రగాఢ కాంక్ష. ఆ చింతనాపరుడి ఆలోచనల నుంచి రగిలిన దేశభక్తి భావనలే అప్పటి ఈ దేశపు యువతను తెల్లవారి పాలనకు ఎదురు నిలిచే దిశగా ప్రోత్సహించింది. స్వీయ వ్యక్తిత్వ వికాస నిర్మాణం దిశగా ధ్యాస పెట్టేందుకూ దోహదించిన భావజాలం వివేకానందునిది. ఆ పరివ్రాజకుడి ప్రబోధాల ప్రభావమే మరణానంతరమూ  బ్రిటిష్ దొరల దృష్టిలో స్వామిని  విప్లవకారుడి కింద ముద్ర వేయించింది.
నైతిక పతనం వల్ల నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం  సాధ్యం  కాదు. రాజకీయాలదే మనిషి పతనానికి చాలా వరకు ప్రధాన బాధ్యత- అన్నది రాజకీయాలపై వివేకానందుని తిరుగులేని సూత్రీకరణ. 'చట్టం, ప్రభుత్వం, రాజకీయాలు మాత్రమే సర్వస్వం కాదు. అవి కేవలం మనిషి జీవన పరిణామ క్రమంలో కొన్ని దశలు మాత్రమే. మానుషత్వ సాధన ఆయా రంగాల ఊహకైనా అందనంత ఎత్తులో ఉంటాయన్న'ది  వివేకానందుడి ఆలోచన. మనిషి అంతరంగ పరంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన నీతి నిజాయితీల  పట్ల రాజకీయాలకు ఎప్పుడూ బొత్తిగా ఆసక్తి ఉండదు’ అన్నది వివేకానందుడి ఫిర్యాదు. కులం, మతం, వర్గం -ఇత్యాదుల పరంగా ప్రజావళిని  విభజనకు గురి చేసే రాజకీయాలు ఈ దేశాన్ని పట్టి వదలకుండా పీడిస్తున్న ప్రధాన రుగ్మతలుగా స్వామి ఆనాడే గుర్తించి గర్హించారు. రెండో ప్రాధాన్యంగా ఉండవలసిన ‘గుడి- మసీదు- చర్చి’ రాజకీయాలు మొదటి స్థానం ఆక్రమించడం స్వామీజీకి బొత్తిగా  గిట్టేది కాదు. మానుషత్వం సంకుచితమయిపోతూ, దేవుళ్లూ దయ్యాలనే భావనల పట్ల వెర్రితనం ప్రబలిపోవడం మనిషికి, మనిషికి మధ్య పూడ్చలేని అగాథాలను సృష్టికేనన్నది ఆయన భావన. రాజకీయక్షేత్ర అనైతిక క్రీడల పట్ల స్వామీజీ క్రుద్ధుడు కాని క్షణం లేదు. 'ఉన్న పరిమిత అనుభవంతో నేను సేకరించిన జ్ఞానం నాకు బోధిస్తున్నది ఏమిటంటే.. మతం మీద మనం ప్రదర్శించే విముఖత్వానికి  మతం అసలు కారణమే కాదు. మనిషిలోని విద్వేషగుణానికి మతాన్ని తప్పు పట్టి ప్రయోజనంలేదు. ఏ మతమూ మనిషిని నిట్టనిలువుగా తగలవేయమని చెప్పదు; సాటి మనిషిని పీడించమనీ రెచ్చగొట్టదు. ఆ తరహా  దుష్కృత్యాలు చెయ్యమని మనిషి మీద వత్తిడి చేసేందుకుగాను మతం పుట్టలేదు. అంతులేని అమానుష కార్యాలన్నిటికి మనిషిని  ప్రేరేపిస్తున్నవి నిజానికి జుగుప్సాకరమైన రాజకీయాలే. కానీ,  ఆ తరహా  అవాంఛనీయ రాజకీయాలనే నిజమైన మతమని జనం నమ్ముతున్నారిప్పుడు! ఈ విషాదకర పరిణామాలకు బాధ్యులెవరో గ్రహించినప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించేది' అన్నారో సందర్భంలో స్వామి వివేకానంద మతానికి రాజకీయాలకు మధ్య గల అపవిత్ర సంబంధాలను ఎండగడుతూ. 
మతం అసలైన పరిమళం ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మిక విశ్వాసి దుష్కృత్యాల మీద ధ్యాస పెట్టడు. పరులకు దుఃఖం కలిగే చర్యలు చేపట్టడు.  స్వానుభవం నుంచి వెలికి తీసిన వెన్నముద్దల వంటి సూక్తులు పంచిపెట్టే ఒక సందర్భంలో స్వామి వివేకానందుడు 'మనిషి మేధస్సు చేయదగిన అత్యుత్తమైన ఆరోగ్యకరమైన దారుఢ్య సాధన.. స్వచ్ఛమైన అంతరంగంతో మతాన్ని అనుసరించడం మాత్రమే' అని హితవిచ్చారు.  
జంతువు, మనిషి, దేవుడు- ఈ ముగ్గురికి  ముఖ్య ప్రవృత్తుల సంగమమే మనిషి. అతనిలో అంతుబట్టకుండా దాగి  ఉండి అంతర్గతంగా చెలరేగే రాగద్వేషాల వంటి దుర్లక్షణాలను అణచివేయడం ద్వారా పశుప్రవృత్తిని సాధ్యమైన మేరకు కుదించి మనిషిలో నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని తట్టిలేపడమే 'మతం' అసలు లక్ష్యం. 'కాబట్టే  దేశానికి ఒక రాజ్యాంగం ఎంత అవసరమో, మనిషికి మతమూ అంతే అవసరం' అని వివేకానందుడు భావించింది. ఈర్ష్యాసూయలు, క్రోధావేశాలు వంటి విద్వేష భావనలకు మాత్రమే ఆలవాలమైన రాజకీయాలు సర్వమానవళి పట్ల సరిసమానమైన ప్రేమాభిమానాలను పంచవలసిన మనిషికి మేలు చేయవని స్వామి గట్టిగా నమ్మారు. ప్రతికూల దృక్పథ రాజకీయాలతో ప్రపంచమంతా పొంగి పొర్లిపోతున్న సన్నివేశాల మధ్య జీవిస్తున్న స్వామి పౌరుల మనసులు దుర్మార్గమైన ఆలోచనలతో కలుషితం కాక  ముందే, వారి మెదళ్లను అందుకే ఉదాత్తమైన ఆధ్యాత్మిక భావనలతో ముంచెత్తెయ్యాలని  అనుక్షణం ఆరాటపడిపోయింది. 
యూరోపియన్ మేధావుల సదస్సులో ఉటంకించిన భావాలను పునరాలోచిస్తే వివేకానందుడికి భారతీయ సోషలిజమ్ పట్ల ఎంత  చక్కని  అవగాహన ఉందో అర్థమవుతుంది. 'భారతదేశంలోనూ సోషలిజమ్ ఉంది. కానీ  అదీ యూరోపియన్ తరహా ద్వంద్వ విధానం కన్నా విభిన్నంగా ఉంటుంది. అద్వైతమనే అఖండ జ్యోతుల వెలుగుల్లో కళాకాంతులీనే సాంఘిక వ్యవస్థ మాది. యూరప్ లో ప్రాచుర్యంలో ఉన్న సోషలిజమ్ భావనలో మాత్రమే ఆర్థిక సోషలిజమ్. అర్థికపరమైన  కోణంలో చూడడమే అందులోని ప్రధాన  లోపం. బైటకు  వ్యక్తివాదానికి చోటిచ్చే వ్యవస్థగానే  కనిపించినప్పటికీ,  వాస్తవానికి అది వ్యక్తిలోనే నిత్యం సంఘర్షించే రెండు పరస్పర విరుద్ధమైన శక్తుల(మనసు, మెదడు)ను పరిగణలోకి తీసుకునేపాటి శ్రద్ధ చూపించలేదు’ అని స్వామి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మాట. మార్క్సిజమ్ ఒక  రాజకీయ భావజాలంగా యూరప్ నంతటా ముంచెత్తుతున్న దశలో, దాని తాకిడి హిందూదేశపు ఎల్లలలను కూడా తాకుతున్న నేపథ్యంలొ వివేకానందుడు నిర్భీతిగా వెల్లడించిన మనసులోని మాటలు ఇవి. ఆ నాటి రాజకీయ యుగసంధిలోని పరిణామాలన్నింటిని బాగా ఆకళింపు చేసుకున్న ఆధ్యాత్మిక చింతనాపరుడు కాబట్టే వివేకానందుడు సోషలిజమ్, మార్క్సిజమ్ వంటి సాంఘిక చైతన్య భావజాలాలలోని  'సామాన్యుణ్ణి ఉద్ధరించే లక్ష్యం'  వైపుకు ఆకర్షితుడై తనను తాను ఒక 'ఆధ్యాత్మిక సోషలిష్టు'గా ప్రకటించుకున్నాడు. ఒక పరివ్రాజకుడు సోషలిజమ్ పట్ల ఆకర్షితుడవడం వరకు నిజంగా ఒక అద్భుత సన్నివేశమే! కాని ఆ పోలిక అక్కడి వరకే సరి.
సోషలిజమ్ లోని శ్రామిక పక్షపాతం స్వామిని బాగా ఆకర్షించిన సద్గుణాలలో ఒకటే కానీ, అదే సమయంలో పీడితుని బాధా విముక్తికై సోషలిజమ్ సూచించిన మార్గమే సమగ్రమైనదిగా భావించడానికి ఆయన సమ్మతించలేదని కూడా గమనించడం ముఖ్యం. సోషలిజమ్ భావనను ఆయన 'సగం ఉడికిన ఆహారం'గా భావించారు. 
అంతర్గతంగా దాగిన లోపాల వల్ల ఉన్నవారికి, లేనివారికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే  శక్తి సోషలిజానికి చాలదన్న భావన వివేకానందుడిలో ఉంది.  సోషలిజమ్ ప్రవచించే మేధావుల మధ్య గల అభిప్రాయ భేదాలనూ ఆయన గుర్తించకపోలేదు.
 సోషలిజమ్ అన్న భావన ఆధునిక ప్రపంచానికి సైంట్ సైమన్ (1760 -1825), ఫ్యూరర్ (1772 -1832), రాబర్డ్ ఓవెన్ (1804 -1892) ద్వారా పరిచయం చేయబడింది.  త్రిమూర్తుల ద్వారా ప్రవచితమైన ఈ సామాజిక సూత్రాలు  ఎవరి వల్లా నమ్మదగిన స్థాయిలో సవ్యంగా నిర్వచించబడలేదన్నది ఒక ఫిర్యాదు. 'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం, ఎవరి అవసరాన్ని బట్టి వారికి దక్కవలసిన భాగం' అన్నది మార్క్స్ భావజాలమయితే,  విభేదించిన లెనిన్ మహాశయుడు దాని స్థానే  'ఎవరి శక్తిని బట్టి వారికి దక్కవలసిన భాగం.. ఎవరికి శ్రమను బట్టి వారికి దక్కవలసిన భాగం' అని కొత్త నిర్వచనం వెలువరించాడు. బెర్నార్డ్ షా ఆ ఇద్దరినీ ఖండిస్తూ ' సోషలిజమ్ మీద స్వామీజీ  చేసిన అధ్యయనమే సరళంగా, సవ్యంగా, సూటిగా సాగింద'ని  కితాబిచ్చాడు.  పారిశ్రామిక దేశాలు కాకపోయినప్పటికీ రష్యా, చైనాలలో కమ్యూనిస్టు విఫ్లవాలు చెలరేగడమే స్వామి పరిశీలనలోని సంబద్ధతకు నిదర్శనం' అని జి.బి.షా భాష్యం. 1897 సంవత్సరంలోనే  'మరో అర్థ శతాబ్దానికి భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సాధిస్తుంద'ని స్వామి చెప్పిన జోస్యం సత్యం కావడం బట్టి  ఆయన పరిశీలనలోని బుద్ధినైశిత్యం వెల్లడవుతుంది. ఆ రోజుల్లో అసంభవమనిపించిన భారతదేశ స్వాతంత్ర్య హోదా స్వామి చెప్పిన విధంగానే సరిగ్గా 1947లో సాకారం కావడం మిడతంభొట్టు జోస్యమైతే కాదు గదా! నిశిత పరిశీలనా ప్రజ్ఞ గల ఘటికులే ఈ విధమైన నిర్దుష్ట ప్రతిపాదనలు ధైర్యంగా ముందుకు తెచ్చి ‘ఔరా!’ అనిపించుకోగలిగేది.
స్వామి ప్రస్థానించిన 1902 కి అర్థ శతాబ్ది తరువాత భూగోళ   రాజకీయం పూర్తిగా గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. అధికారం కోసం, అర్హతలతో నిమిత్తంలేని పెత్తనాల కోసం ప్రపంచదేశాలు  ప్రదర్శించే అత్యంత హీనమైన దౌర్జన్య రాజకీయరంగాలు ప్రపంచాన్ని పేలబోయే అగ్నిగుండంగా  మార్చేసాయన్న మాట నిజం.
 సామ్రాజ్యవాదం, జాతీయవాదం, ఉగ్రవాదాలకు తోడు నియంతృత్వ పోకడలు ప్రబలి నేరాలకు, మూకుమ్మడి హత్యలకు అణచివేతలకు అంతమనేది లేకుండా కొనసాగుతున్నది ప్రపంచ రాజకీయమంతా.  రెండు సోషలిష్టు విప్లవాలు బలిగొన్న రక్తపాతం ఎంతో లెక్కలు అందనంత గాఢమైనది.  రెండు ప్రపంచయుద్ధాలు, అణుబాంబు విస్ఫోటాలు, ట్రేడ్ సెంటర్ దాడి వంటి దుర్ఘటనల వల్ల మానవత్వానికి జరిగిన చెరుపుకు  లెక్కలు కట్టడం ఎవరి తరమూ కాదు. అత్యంత సూక్ష్మ దార్శనిక దృష్టి గల స్వామి వివేకానందుడు అందుచేతనే ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోవడానికి చాలా ముందు నుంచే ' ప్రపంచం అగ్ని పర్వతం అంచున నిలబడి ఉంది. అది ఏ క్షణంలో అయినా భగ్గుమని పేలి సర్వమానవాళికి పూడ్చలేనంత నష్టం  కలిగించే అవకాశం ఉంది' అంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ తరహా కష్టనష్టాల భారం తగ్గించే దిశగా అందుకే స్వామి యూఎన్ఓ వంటి  అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఏర్పాటయి చురుకుగా పనిచేయాలని అభిలషించింది.
కొన్ని దశాబ్దాల కిందట వరకు జాతీయ స్థాయిలో ఏర్పడ్డ సమస్యలను  జాతీయ స్థాయి సంస్థలే సమన్వయించి  సర్దిచెప్పేవి. పరిస్థితి మారింది. రెండు దేశాల పిట్టగోడ సరిహద్దు వివాదాలు కూడా ఊహించడానికైనా  సాధ్యం కానంత ఉత్పాతాలకు దారితీసి ప్రపంచదేశాలన్నింటిని  రచ్చలోకి ఈడ్చుకొస్తున్నాయి. ఇదంతా గామనించిన స్వామి ఆ తరహా సమస్యల పరిష్కారం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ  సంస్థల ద్వారానే సుసాధ్యమౌతుందన్న మాట వాస్తవం. అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, అంతర్జాతీయ న్యాయచట్టాల ఆవశ్యకత నానాటికి పెరగక తప్పదు' అని ముందుగా గుర్తించి  ప్రకటింనిన వాస్తవిక రాజకీయ పరిశీలకుడు స్వామి వివేకానంద.  
నేటి మనిషి జీవితంలో రాజకీయాలు అంతర్గత విభాగాలవక తప్పడంలేదు.  రాజకీయాలతో నిమిత్తంలేని బతుకులు సాధ్యం కాదన్న పచ్చి వాస్తవం స్వామి అనుభావానికేమీ అందకుండా పోలేదు ఎప్పుడూ. అందు చేతనే సామాన్య గృహస్తును రాజకీయాల నుంచి దూరంగా ఉండమని ఆయన ఏనాడూ కోరలేకపోయివుండవచ్చు. కానీ రాజకీయాలతో అనుసంధానం ఏర్పరుచుకునే విధానంలోనే కొత్త పుంతలు తొక్కమని మాత్రం  ప్రబోధించేందుకు ప్రయత్నం చేసారాయాన. ‘భారతీయ వేదాంతం రాజకీయాలలో తెచ్చే సగుణాత్మకమైన మార్పులను  ఊతం చేసుకోకుండా ఇంగ్లాండ్ దేశానికి  నేను మతం  అగత్యాన్ని గురించి ప్రబోధించలేకపోయాను. ఇక్కడ ఇండియాలో కూడా సంఘసంస్కరణలు ప్రవేశపెట్టే ముందు  ఆధ్యాత్మిక రంగం  మానవాళికి చేకూర్చే మేళ్ళను గురించి ముందు  చర్చించవలసిన అగత్యం ఉందని మాత్రం హెచ్చరిస్తున్నాను. రాజకీయ భావజాలాన్ని ప్రబోధించే సమయంలోనూ అది భారతదేశానికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదలో ఏ మేరకు అభివృద్ధి  సాధించగలదో ముందు చెప్పాలి.'  అన్నది  రాజకీయాల  వరకు చివరకు స్వామి వివేకానందుడు తీసుకున్న వైఖరి.  
వివేకానందుడి స్వంత వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు రాజకీయ ప్రభావానికి అతీతమైన రాజకీయ పరిశీలకుడు ఆయన. ఏ జాత్తీయ, అంతర్జాతీయ రాజకీయాలకూ ఆయన మనస్తత్వాన్ని మార్చే శక్తి చాలదు. కానీ స్వామి రాజకీయ పరిశీలన అర్థవంతంగా ఉంటుంది.  నిర్దుష్టత శాతం ఎక్కువ. నైపుణ్యంతో కూడిన సునిశితత్వంతో, సూక్ష్మ పరిశీలనతో  నిరపాయకరంగా సాగే వివేకానందుని ప్రసంగాలంటే అందుకే మానవ జీవితంలోని అన్ని పార్శ్వాల మేధావులు అత్యంత శ్రద్ధగా ఆలకించడానికి ఇష్టపడేది. ఆఖరుకు అవి రాజకియ సంబధమైన  ప్రసంగాలైనా సరే.. మినహాయించడానికి వీలులేనివి! 
'స్వామి వివేకానందుని సంపూర్ణ మేదోశక్తిని ఒకే చోట పోగేసి పరిశీలించేవారికి నోటమాట  రాకపోవడం సాధారణంగా జరిగే అనుభవమే. జాతీయవాదానికి, అంతర్జాతీయవాదానికి  మధ్య మరేదో నూత్న భావజాలంతో నిండిన మానవతావాదంలా పరమ ఆకర్షణీయంగా ధ్వనింపచేయడమే వివేకానందుని ప్రసంగాలలోని ప్రధాన ఆకర్షణ' అంటారు  'గుడ్ బై టు బెర్లిన్' రచయిత క్రిస్టోఫర్ ఐషర్ వుడ్. భారతీయుల చరిత్ర, భాషా సాహిత్య సంస్కృతులలో లోతైన అధ్యయనం చేసిన ప్రముఖ ఇండాలజిస్ట్ ప్రొఫెసర్ ఎ.ఎల్. భాషమ్  'రాబోయే కొన్ని శతాబ్దాల వరకు స్వామి వివేకానంద  ఆధునికి ప్రపంచ నిర్మాతల వర్గంలోని చింతనాపరులలో ఒక ప్రముఖునిగా గుర్తుండిపోవడం ఖాయం' అని స్వామీజీ రచనలు అన్నీ సుదీర్ఘ కాలం అధ్యయనం చేసిన తరువాత వెలిబుచ్చిన ఆఖరు మాట. కాదని మనం మాత్రం ఎట్లా అనగలం!
***
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయపుట ప్రచురితం)
                                                

Friday, August 14, 2020

రష్యా ‘కరోనా-దాని టీకా- తాత్పర్యం’ -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక ప్రచురణ




కరోనావైరస్ వ్యాక్సిన్‌ రష్యా ఆమోదం పొందినట్లు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రకటించారు.
తొలిదశల్లో జరిగిన పరీక్షల సమాచారం ఏమీ లేకుండానే పెద్దెత్తున చివరిది, కీలకమయినది అయిన మూడో దశను రెండో దశతో కలిపి వేసి మెక్సికో, సౌదీ, అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల సహకారంతో సుమారు 2000 మంది ఆరోగ్య వాలంటీర్ల మీద బుధవారం నుంచి  పరీక్షలు ప్రారంభించబోతున్నట్లూ, సమాంతరంగా వాక్సిన్ ‘స్ఫుత్నిక్ -వి’ ని సామాన్య ప్రజల ప్రయోజనార్థం వ్యాపార ఫక్కీలో ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అదే సమావేశంలో ఆరోగ్యశాఖ అమాత్యులు అధికారిక ప్రకటన సైతం చేసేసారు! యావత్ ప్రపంచం  నివ్వెరపోయే ఈ హఠాత్పరిమాణాన్ని ఏ  కోణంలో మనం పరిశీలించాలన్నదే ప్రస్తుతం ప్రపంచమంతటా నడుస్తున్న పెద్ద చర్చ!
నమ్మదగ్గ ఆధారాలేవీ ప్రపంచం ముందు  ప్రదర్శనకు పెట్టకుండా రష్యన్లు తీసుకునే ఈ  దుందుడుకు చర్యను దుస్సాహంగా గర్హిస్తున్న మేధావుల శాతమే ఎక్కుగా ఉంది ప్రస్తుతానికైతే.  జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాలూకు ఇన్స్టిట్యూట్ ఫర్ వ్యాక్సిన్ సేఫ్టీ డైరెక్టర్ డేనియల్ సాల్మన్ ఆందోళనే ఇందుకు ఉదాహరణ,  ఆయన వాదన ప్రకారం 3వ దశ ప్రయోగాలలోనే  టీకా ప్రయోగాలలోని  పని తీరు తేటతెల్లమయ్యేది. టీకా తీసుకున్న సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తికి ఏ రకమైన  హానీ కలగదని నికరంగా తేలేదీ ఈ తుది అంచలోనే.  మొదటి ఒకటి, రెండు అంచల ప్రయోగాల కన్నా భిన్నమైన పద్ధతిలో సాగే ఈ దశ ప్రయోగాలలో లక్షలాది మంద ఆరోగ్యవంతులు భాగస్వాములు అవుతారు.  ఈ టీకా కారణంగా దుష్ప్రభావాలు సాధారణ స్థాయికి మించకుండా వెల్లడయినట్లు తేలితే చాలు.. వాక్సిన్ భ్రద్రతా ప్రమాణల విషయమై  భరోసా దక్కినట్లే!  ఆ తరహా పరీక్షలు ఏవీ జరిపే అవకాశం లేని రష్యా ఇంత హఠాత్తుగా కరోనా వైరస్ పని పట్టే టీకాను ఏ విధంగా ఉత్పత్తి చేయబోతున్నట్లన్నదే ప్రస్తుతం పెద్ద మిస్టరీ!
టీకాల పరీక్షలకు  సంబంధించి గత శతాబ్దం నుంచే  పరిశోధకులు చాలా శక్తివంతమైన  మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.  కొత్త టీకా ప్రయోగించిన సందర్భంలో ఎదురయ్యే క్లిష్టమైన  పరిస్థితులను అధిగమించేందుకు సంబంధించిన నైపుణ్యాలెన్నో శాస్త్రీయ విధానంలో ఆవిష్కరించబడిన నేపథ్యంలో రోగ నిదాన విధానం మీద కన్నా, రోగ నిరోధ విధానలకే ప్రాధాన్యత పెరుగుతున్నది. అయితే  పరిశోధన, ప్రయోగం, ప్రయోజనాల విషయంగా టీకాల పట్ల ఔషధాలకు మించి ఎక్కువ అప్రమత్తత అవసరమన్నది వైద్యరంగం హెచ్చరిక.
అసంఖ్యాకంగా ప్రయోగాలకు గురయ్యే జనసందోహం మీద ఆయా టీకాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో నికరంగా తేల్చేందుకు నిర్దిష్ట కాలపరిమితి కుదరదు. కనుక ఉత్పత్తి చేసి ప్రయోగించే దశల్లోనే టీకా సామర్థ్యం కచ్చితంగా నిగ్గు తేల్చుకోవాలి. రష్యా గత్తరగా తయారు చేస్తున్న’ప్రస్తుత ‘స్ఫుత్నిక్ -వి‘ వాక్సిన్ విషయమై ఈ అప్రమత్తత ఏ మేరకు పాటింపబడిందో సమాచారం లేదు! 

ఎలుకలు, కోతులు వంటి జంతువుల పై చేసే ప్రయోగాలు ఫలించాలి ముందు. ఆ  తరువాతే మొదటి దశ ప్రయోగంగా మనుషల మీద ఆయా టీకాల ప్రభావం పరిశీలించాలి. రోగి శరీరంలో వచ్చే క్రమాగతమైన మార్పుల సూక్ష్మాతి సూక్ష్మ పరిశీలనకు కొన్ని రోజులు, వారాలు, చాలా సందర్భాలలో నెలల వ్యవధానం కూడా అవసరమయే నేపథ్యంలో రష్యా వైద్యపరిశోధకులు ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు సత్ఫలితాలు రాబట్టినట్లో? ఆ సమాచారం పంపకాలలో అంత గుప్తత ఎందుకన్నదే మరో సందేహం! కాలక్రమేణా వాటంతటవే సర్దుకునే  మామూలు రుగ్మతలకు మించి మరే పెద్ద ఇబ్బందులు కలగలేదని నిగ్గుతేలేందుకైనా పరిశోధకుల దగ్గర తగిన సమయం ఉండాలి కదా! రెండు, మూడు దశల ప్రయోగాలు రష్యన్లు ఇప్పుడు జమిలిగా నిర్వహిస్తామంటున్నారు! ప్రయోగాల శాస్త్రబద్ధత ప్రశ్నార్థకం కాకుండా ఉంటుందా? 
కరోనా వైరస్ వాక్సినేషన్ వరకు రష్యన్ల ప్రయోగాల టైమ్ -లైన్ పసిపిల్లవాడి పరిశీలనకు ఇచ్చినా సందేహించక మానడు. ప్రపంచ వ్యాప్తంగా చూసినా కరోనా వైరస్ నిరోధం కోసంగానూ ప్రత్యేక ఔషధాల అగత్యం మార్చి నెలలో గాని ప్రపంచానికి తట్టింది కాదు.   ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ప్రయోగాలు సుమారు 29 వరకు అంటున్నా అందులో రష్యన్ల ఊసు ఎక్కడా కనిపించదు.  మరి కొన్ని తొందర్లో ప్రారంభించే అవకాశముందంటున్నారు. కానీ .. రష్యా వైద్య రంగం అప్పుడే అన్నీ ముగించుకుని ఉత్పత్తి రంగం  వైపూ దృష్టిసారించేసింది!   ఆస్ట్రాజెనెక్స్, మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన పరిశోధనా సంస్థలు ఆశాజనకమైన ఫలితాలను ప్రకటిస్తున్న రోజుల్లో  కూడా రష్యన్లు ప్రయోగాల విషయమై ఎక్కడా చర్చల్లో కనిపించనే లేదు! పెద్ద సంస్థల ప్రయోగాలలో పెద్దగా ఆందోళన  పడే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేకపోయినా, వాలంటీర్లలో కొందరు యాంటీ బాడీస్ ఉత్పత్తి చేయడం, మరి కొంత మంది రోగులు రుగ్మతల నుంచి పూర్తిగా బైటపడ్డం జరిగినా మూడో దశ తాలూకు విజయాన్ని గురించి  ఆ సంస్థలేవీ ఇంకా భరోసా ఇవ్వడం లేదు!  రష్యా ప్రభుత్వం మాత్రం
 వాక్సినేషన్  ప్రయోగానికి, ప్రజాబాహుళ్య ప్రయోజనానికి  తామన్నీ  సిద్ధం చేసేసినట్లు అధికారికంగా కూడా ప్రకటించేసింది!   అందుకే ఫ్లోరిడా విశ్వవిద్యాలయం బయోస్టాటిస్టిషియన్,  అంటువ్యాధి నిపుణులూ అయిన నటాలీ డీన్ ‘ రష్యన్ల టైమింగ్ పైన అనుమానం వ్వక్తంచేస్తున్నది. ఆ మేధావి దారిలోనే ప్రపంచంలోని మరెంతో మంది వైద్య నిపుణులూ ‘స్ఫుత్నిక్ -వి’ టీకా సామర్థ్యం గురించి సందేహాలు వెలిబుచ్చుతున్నదీ!
 'తొందరపడి జనం మీద నిర్దయగా ప్రయోగాలు చెయ్యొద్ద'ని రష్యాను హెచ్చరించే వైద్య రంగం పెద్దలు ఎందరో   నటాలీ డీన్ తరహాలో కనిపిస్తున్నారు. రెండు దశల ఫలితాలు అనుకూలంగా ఉన్నటికీ మూడో దశ ప్రయోగాలు ఘోరంగా విఫలమయిన  సందర్భాలు ఎన్నో కద్దు- అన్నది ఆ పరిశోధకుల ముందస్తు హెచ్చరిక.
ఇప్పటికే కరోనా వైరస్  నియంత్రణ విధానంలో భాగంగా భారీ ఎత్తున ప్లేసిబో  టీకా ప్రయోగాలు జరిగివున్నాయ్!   'ఉంటారో.. ఊడతారో! రోగం నుంచి బైట పడతారో.. మరంత రోగాల పాలవుతారో జనం? ఫలితాల కోసం వేచిచూడొచ్చు కదా! ‘ఒళ్లో పెట్టా.. దళ్లో పెట్టా’ అన్నట్లు ఇప్పుడెందుకు ఇంత గత్తర?' అనేదే సందేహం ప్రఖ్యాత టీకా నిపుణుడు  డాక్టర్ స్టీవెన్ బ్లాక్ తరహాలో.
.
‘జూన్ మాసం లో, రష్యన్ ఫెడరేషన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాలూకు  'గమలేయ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ'  'గామ్-కోవిడ్-వాక్ లియో' అనే టీకాపై ఒకటి, రెండు దశలు రెండింటిని కలిపి జమిలిగా పరిశోధనలు చేపట్టినట్లు  చెప్పుకొచ్చింది.  అదీ కేవలం 38 మంది వాలంటీర్ల మీద మాత్రమే  ఈ పరీక్షలు చెయ్యడానికి సిద్ధపడినట్లు అప్పట్లో బైటికొచ్చిన సమాచారం! అందుతున్న సమాచారాన్ని బట్టి రష్యా సక్రమమైన పద్ధతుల్లో క్లినికల్ ట్రయల్సుకు ఎంత వరకు వెళ్లిందో అనుమానమే!'  అని మూతి విరువిరుపులు మొదలయ్యాయి అప్పుడే ప్రపంచ ప్రముఖ వైద్య సంస్థలు చాలా వాటి నుంచి.
 టీకా అడెనోవైరస్ అనే   హానిచేయని ఒక రకమైన కోల్డ్ వైరస్ నుండి తయారయినదని రష్యా చెబుతున్న మాట.    ఈ కోల్డ్ వైరస్ కరోనా వైరస్ జన్యువునే కలిగి ఉంటుందని. ఆస్ట్రాజెనెకా.. జాన్సన్ & జాన్సన్ కంపెనీలూ తమ వ్యాక్సిన్లలో ఇవే ధాతువులను వాడుతున్నట్లు రష్యా వాదన. తాము చేపట్టింది ఓ కొత్త రకమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన టీకా అని, ఏ రకమైన వ్యాధికైనా వాడే అడెనోవైరస్  మొదటి సారి జూన్ లో ఎబోలాకు  వాడినట్లు  రష్యా చెప్పుకొచ్చే మాట.  ఆ ధాతువు ఊతంతోనే  ఇప్పుడు తాము  కరోనా వైరస్ కూ మందు కనుక్కునే పనిలో ఉన్నట్లు రష్యా  చెప్పుకొస్తోంది.
ఏదేమైనా పుతిన్ సమక్షంలో రష్యా ఆరోగ్య శాఖా మంత్రి మైఖేల్ మురాష్కో 'వాలంటీర్స్ అందరూ అత్యధిక స్థాయి యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేయడంతో పాటు, ఒక్క వ్యక్తిలో కూడా ఇమ్యునైజేషన్ కు సంబంధించిన పెద్ద ఆరోగ్య సమస్యలేవీ పొడసూపలేదని చెప్పడం ముఖ్యం.  ‘సాధారణంగా  మొదటి దశలో అందరూ ఆశించే ఫలితాలు ఇవే కదా! ఏ టీకా కూడా ఎప్పుడూ ఫలానా జబ్బు పూర్తిగా నయమయిపోయిందని ఘంటాఫథంగా అక్కడికక్కడే నిర్ధారణగా చెప్పదు.. చెప్పలేదు కూడా' అని ఆయన చురకలు అంటించడం గమనిస్తే ఏమనిపిస్తుంది?
ఎప్పటి నుంచో రష్యన్ వైద్య  పరిశోధకులు చేస్తూ వస్తున్న ఈ తరహా వాదనలు ఈ  మంగళవారం దేశాధ్యక్షుడు పుతిన్ సమక్షంలో మంత్రి స్థాయిలో మైఖేల్ మురాష్కో  కూడా చెయ్యడంతో రష్యా కరోనా వైరస్ కు టీకా తయారు చేయబోయే మొదటి దేశంగా ప్రపంచం ఇప్పుడు పరిగణించవలసిన పరిస్థితి  కచ్చితంగా వచ్చిపడింది. 
న్యూయార్క్ నగరం వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజీ వైరాలజిస్ట్ జాన్ మూర్ తరహాలో  ‘మూర్ఖత్వం.. మహా మూర్ఖత్వం’ అని మొత్తుకున్నా సరే.. 'పుతిన్ దగ్గర ఉన్నది టీకానో, కేవలం సామ్రాజ్యవాదుల మార్కెట్ పెత్తనాన్ని ధిక్కరించే రాజకీయ వ్యూహమో' తెలిసేందుకు  కొంత సమయం అవసరం.
కొత్త టీకా సత్తా కాలం గడిచిన మీదట గాని తేటతెల్లంకాదన్నది  అసలు తాత్పర్యం.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)
*** 






Sunday, August 9, 2020

వెళ్ళిరా నేస్తం! -మల్లాప్రగడ రామారావు


Image for post

వెళ్ళిరా నేస్తం
అసలే కాలం పరిమితం
వీడ్కోళ్లకీ, కన్నీళ్ళకీ
వ్యవధేదీ?
మనల్ని కలిపిన కాలం
మళ్లా విడదీస్తే
ఏముందీ ఫిర్యాదుకీ?
మనిషి, మనిషి ఒక ద్వీపం
ద్వీపాలను కలిపే తంత్రి ఈ  స్నేహం
కాలాన్ని అనుభవాల కత్తెరతో విభజిస్తే
ఏ ఏ వేళల
ఏ ఏ ద్వీపాల నడుమ
అనుసంధానాలు వెలుస్తాయో
ఎన్నాళ్లు నిలుస్తాయో
నికరంగా ఎవరం
ఎలా అంచనా వేయగలం?
కాలం పామై
మనిద్దరి మధ్యా ప్రవహిస్తే
నేను నిందించనూ లేను.
ఎందుకంటే
ఒక పడవై కొన్నాళ్లైనా
మనల్ని ఒకచోట చేర్చింది తానే.

చెప్పొచ్చేదేమంటే
నువ్వూ నేనూ కరగిపోతాం
పదిలంగా మిగిలేది
ఒకటో అరో అభుభూతులే.
కాలం మంచుపొరల వెనకాల
పొద్దు పొడవని ముందు ఎరుపు రంగులా
నిన్నలన్నీ కొద్దో గొప్పో
కనపడుతూనే ఉంటాయి.
అంత మాత్రానికే
నీ స్మృతి
శాశ్వతంగా నిలుస్తుందని
అనృతాలాడలేను
బహుశా ఒంటరి నక్షత్రం
ఆకాశపు కాసారాన్ని
కాపలా కాస్తున్నప్పుడు
గుర్తొస్తావు నువ్వూ.
వెళ్లిరా నేస్తం
అసలే సమయం
పరిమితం!
***
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
09= -08 -2020





                                                

Saturday, August 8, 2020

శిశయిష -శ్రీ మేడవరపు సంపత్ కుమార్ -కవిత

 

ప్రాచీన కాలపు ఫాసిల్స్ అడుగు పొరల

అంతః తమస్సుల్లో

గాథలు లేని అగాధాల్లో

మేధ చొరని మరుగుల్లో

శయనించాలని నా కోరిక

అపుడు

 నా దేహంలోని ధమనుల్లో ప్రశాంతతానందాలు

ఉద్భవిస్తాయి.

ఈ సిరులు, మరులు నా మజ్జ కోపరిచూర్ణితాలు

కళలు, కాంతులు నా అస్థిలో భూస్థాపితాలు

నీతులు, చేతలు నా రుధిరంలో ఆవిరవబోయే

అంభః గణాలు

 జగతి జంఝాటంలో

ఎందుకీ జాగారం

కాదు ఇది మృతావస్థ,

అందరికీ అందని

చ్యుతి లేని అమృతావస్థ!

***

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

08 -08 -2020

(శిశయిష= శాశ్వత నిద్రకు ఒరగాలనే కోరిక)

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...